చలికాలంలో అరకువ్యాలీ మంచులోగిలిలా వుంది.
ఈ కొండలోయల్లో ఆమె ఒక సుడిగాలిలా వుంది.
- ఈ చెట్టు, పొడుగాటి నీడలు, చల్లని పువ్వులూ, వాటి పరిమళమూ - అన్నీ నాకోసమే అనిపించే రోజు ఇన్నాళ్ళ తర్వాత తారసపడినట్టుగా వుంది. ఇంతకాలం నెనెఉ కఠినమైన నిశ్శబ్దానికే అలవాటు పడ్డాను. కానీ ఇక్కడి ఆకాశం నన్ను నిశ్శబ్దంగా ఉండనివ్వడం లేదు. నీడలా, చల్లగా, లోతుగా నన్నెవరో తట్టిలేపుతున్నట్టే వుంది. ఈ పొగమంచు లోయలో ఎవరిననైనా కావలించుకుని గట్టిగా ఏడవాలనిపిస్తోంది. గట్టిగా నవ్వాలనిపిస్తోంది.
ఎంత ఒంటరితనం నాది? ఇన్నాళ్ళూ ఈ ఒంటరితనాన్ని ఎలా భరించాను?
నగరంలో, దయార్ద్రమైనదేదీ కానరాని కాంక్రీట్ కీకారణ్యంలో బతికాను. అక్కడ ఆజీవితంలో ఎలాంటి జీవనానందాలు లేవు. రోజు ఒకేరకపు దైనంది. వ్యాపకం - వార్తలు రాస్తూ, చదువుతూ, రాస్తూ, టీలు తాగుతూ, మళ్ళీ రాస్తూ - రోజూ ఒకేరకమైన వ్యవహారాల శైలి. ఎప్పుడో, ఏ అర్ధరాత్రో రూముకి చేరుకొని, ఆకలి కూడా చచ్చిపోయి - నిస్సత్తువుగా నిద్రలోకి జారిపోయే జీవితం నాది. నా నవనాడులనూ కుంగదీసిన బాధకీ, నరాలన్నీ పెకలించుకుపోయిన రోతకీ కారణాలు ఇవీ అని నేను ఏనాడూ నిర్దారించుకోలేదు. అంతా ఒకే సుదీర్ఘమైన నిస్త్రాణలోకి కూరుకుపోయాను.
నా బాష ఎవరికీ అర్ధం కాదు. యంత్రాల భాష నాకు రాదు. నేను కోరుకునే స్వస్థానపు ప్రశాంతి నగరంలో నాకు దొరకలేదు. అదొక తాత్కాలిక మజిలీగానే భావించాను.
నాది విప్పారే స్వభావం కాదు. నాలోకి నేను ముడుచుకుపోతాను. ఒకవేళ ఎవరైనా నన్ను కదిలించబోతే, తాకబోతే నాలోకి నేను పారిపోయి తలుపులు మూసుకుంటాను. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే - నా ఒంటరితనానికి మూలం నాలోనే ఉంది. ఎప్పుడూ బిడియపడే నా మనసులోనే ఉంది. అందుకే నా సహోద్యోగులైన అమ్మాయిలు నన్ను పలకరించబోయినప్పుడల్లా నేను ముఖం తిప్పుకునేవాణ్ణి. వాళ్ళ ముఖాలలోకి నేరుగా చూడాలంటే నాకు చేతనయ్యేది కాదు. చిన్నప్పటినుంచీ నేను అలాగే పెరిగాను. అలాగే మిగిలాను.
అలాంటి నన్ను, ఒంటరి తనపు నన్ను - జలపాతంలోకి తోసేసినట్టుగా వుందిప్పుడు. ఎంత సముదాయించుకున్నా ఊపిరి ఆడటం లేదు. నిరంతరం నా మనస్సు ఆమె స్మరణలోకి సంలీనమవుతోంది.
ఇంతకీ ఎవరామె? ఇలాంటి అనేకానేక ప్రశ్నలకి నేరుగా జవాబు చెప్పలేకనే కదా ఇంత ఆత్మగత ప్రసంగం!
నిజానికి ఆమె గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కూడా నాకు లేదు. ఆమె ఎదురుపడ్డాక నన్ను నేనే శోదించదలచుకున్నాను - అంతే!
ఆమెను సీతాకోకచిలుకతో పోల్చవచ్చునేమో. ఆ సీతాకోకచిలుక అలవోకగా ఎగురుతూ వచ్చి అనామక గడ్డిపువ్వులాంటి నా మీద వాలివుండవచ్చు. ఆనాటి నుంచి ఆ గడ్డిపువ్వు ఎంతగా మురిసిపోతోందో మీకు చెప్పలేను నేను.
ఈనాటికి సరిగ్గా పదిరోజుల క్రితం నేనీ కొండప్రాంతానికి వచ్చాను. ఒంటరిగా రాలేదు. నా ప్రాణమిత్రుడు శ్రీవాత్సవ వెంటవచ్చాను. శ్రీవాత్సవకి కొత్తగా పెళ్లయింది. ప్రేమ జంట. ఆ జంట విహారయాత్రకి బయలుదేరింది. చిరకాల మిత్రత్వపు చనువుతో నన్నూ. తోడురమ్మని బలవంతం చేస్తే వాళ్ళ వెంట వచ్చాను. వాళ్ళకది హనీమూన్. నాకు మాత్రం ఒక అన్వేషణ.
గడగడలాడించే చలికాలంలో అరకువ్యాలీకి రావడం ఒక అనుభవమే. ఇక్కడికి వచ్చాక, ముందే బుక్ చేసుకున్న కాటేజీలలోకి దిగాం. కొత్త దంపతుల వెంట నేను రానంటే శ్రీవాత్సవే కాదు, రేణుకా అంగీకరించలేదు.
"ముగ్గురం వెళ్ళాల్సిందే, లేదంటే, టూర్ ప్రోగ్రాం కాన్సిల్ చేసేద్దాం" అని మంకుపట్టు పట్టింది. నేనూ రాక తప్పలేదు.
'ఆమె' అని నేను ఇంతకు ముందు వరకూ సంభోదిస్తూ వచ్చిన వ్యక్తి - కరుణ.
ఆమెని కరుణ అని ఊరికే చెప్తే సరిపోదు. నిజంగా ఆమె కారుణ్యరేఖ. అరకువ్యాలీలో మేం దిగిన కాటేజీకి ఎదురుగా వున్న వూరిల్లే ఆమె నివాసం. ఆమె నివసించే ఇంటిని పూరిల్లని చెప్పడం కష్టంగానే వుంది నాకు. నేనైతే ఈ కొండప్రాంతమే ఆమె సొంతమని చెప్పగలను. ఈ కొండలోయలకి మల్లే నన్ను కూడా ఆమెకి సమర్పించుకోగలిగితే ఎంత ధన్యత!
కాటేజీలకి దగ్గరలోనే మంచి హొటళ్ళు నాలుగైదు ఉన్నాయి. భోజనానికి లోటులేదు. కూడా తీసుకెళ్ళిన ప్లాస్కు మమ్మల్ని ఎంతగానో ఆదుకుందని చెప్పాలి. వేడివేడి కాఫీ దానినిండా తీసుకొచ్చుకుని చలిగాలికి వొణికే మనసుని వెచ్చబరచుకునే వాళ్ళం. రెండు రోజులు సజావుగానే, ఆనందంగానే గడిచాయి. మూడోరోజు ఉదయం నుంచీ ముసురు ప్రారంభమయ్యింది. ఉధృతంగా మంచుగాలులు వీచనారంభించాయి. బయటికి కదిలే మార్గమే లేదు. కనీసం తలుపులు తెరవాలన్నా వీలుకాలేదు. అలాంటప్పుడు మాకు కరుణ ఆపద్బాంధవిలా కనిపించింది. మా ఇబ్బందిని ఆమె తనకు తానుగా గ్రహించి సేవలందించింది. తలకు మప్లర్ చుట్టుకుని, రెయిన్ కోటు వంటి వస్త్రాన్ని ఒంటినిండా కప్పుకుని ఆమె మాకు భోజనాలు తెచ్చిపెట్టేది. అలా తెచ్చిపెట్టినందుకు మా నుంచి ఎలాంటి ప్రతిఫలమూ ఆశించలేదామె. ఆమె నిజంగానే ఏమీ ఆశించడం లేదని నాకు మరీ మరీ అర్ధమయ్యింది. అదొక చిత్రమైన శైలి. డబ్బుకి విలువ ఇవ్వని, డబ్బుతో కొలవలేని జీవితం!
ముసురు వాతావరం మూడు రోజుల వరకూ వదలలేదు. పైగా మరింత పెరిగింది. ఆకాశం నుంచి వానచినుకులు కాదు. వడగళ్ళే కురిశాయి. అప్పుడు కరుణ సైతం హోటల్ కి వెళ్ళే సాహసం చేయలేదు. తన ఇంట్లోనే, తనకున్న దాంట్లోనే మాకింత వండి పెట్టింది. టీ, కాఫీలు చేసి ఫ్లాస్కుల్లో నింపి ఇచ్చింది.
నగరాలలో, ఇసకవేస్తే రాలనంత జనం మధ్య నాకు అరుదుగా కూడా ఎదురుపడని మనిషితనం ఇక్కడ ఈ మంచులోయలో కనిపించింది. ఆమె ఎవరో, ఎక్కడ నుండి వచ్చిందో నాకెందుకూ? కనీసం ఇక్కడయినా నేనూ ఒక మనిషిలా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఆమెను గురించిన ఆరాలు తీయకూడదని నన్ను నేను ఎంతగా కట్టుదిట్టం చేసుకున్నానో చెప్పలేను.
ముందే చెప్పాను కదా - నేను మహా బిడియస్తుడినని. ఆపైన కొత్తగా పెళ్ళయిన జంట మధ్య వుండటం - నాకు బలే ఇబ్బందిగా ఉండేది. శ్రీవాత్సవ, రేణుకల ఏకాంతానికి భంగం కలిగించకూడదని మొండిగా అనుకునేవాడిని. అందుకే నాకోసం వేరుగా తీసుకున్న కాటేజీలో నేనొక్కడినే వుండేవాడిని. శ్రీవాత్సవకి నా సంగతి బాగా తెలుసు. అందుకే నన్ను దేనికీ బలవంతం చేసేవాడు కాదు. నా మానాన నేను నా కాటేజీలో ఒంటరిగా కాలక్షేపం చేసేవాడిని. అప్పుడూ భోజనాల వేళ, ఉదయాన్న కాఫీ తాగేప్పుడు నేనూ వాళ్ళ మధ్యకు వెళ్ళి కూర్చొనేవాడిని. భోజనాలప్పుడు కూడా వాళ్ళిద్దరూ ఏకాంతంగా వుండాలని కోరుకుంటున్నారేమోనని నాకు అనిపించేది. అందుకే నేను త్వరగానే నా భోజనాన్ని ముగించి లేచివచ్చేసే వాడిని. నన్ను వుండమని రేణుక అడుగుతున్నా ఎందుకనో అంగీకరించలేక పోయేవాడిని. తొందరగా భోజనం ముగించిన సందర్భాలలో నాకు తర్వాత కాసింత ఆకలనిపించేది. ఆకలిని దాచుకోలేక సాయంత్రమప్పుడు కొండ దిగి టీ బంకుకి వెళ్లి టీయో, టిఫినో తీసుకొని వచ్చేవాణ్ణి.
ముసురు దినాలన్నిటా మమ్మల్ని కరుణ ఆదుకుంది. ఆ పరిచయం అంతటితో తెగిపోలేదు. చిరపరిచితమన్పించే ఆ ఆదరాభిమానాలు తొందరగా పోవేమో!
అక్కడున్నవాళ్ళూ ఆమె మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటూనే ఉంది. ఆహారాన్ని నోట కరిచిన తల్లిపక్షిలా ఆమె తరచూ మా కాటేజీలో వాలుతుండేది. వేడివేడి అన్నమో, ఆవిర్లు చిమ్మే తేనీరో మాకు అందించి త్వరత్వరగా వెళ్ళిపోయేది. మా మధ్య సంభాషణలు కూడా అరుదే. చిరునవ్వే కళ్ళు, చిరునవ్వే పెదవులు - ఇవే మా అందరికీ అనుసంధాన భాష, మనుషులు నిశ్శబ్దాన్ని అనుభవించడంలోనూ ఆనందం పొందవచ్చునని నాకు అప్పుడే అర్ధమయ్యింది.
ముసురు తగ్గింది. మళ్ళీ మేం హొటల్ భోజనాలకు అలవాటుపడ్డాం. అయినా ఏ చీకటివేళనో కరుణ ఇచ్చే తేనేటి విందు కోసం నేను తపించేవాడిని. ఎంత కాదనుకున్నా మా దైనందిక ఆలోచనలన్నీ కరుణ చుట్టూ అల్లుకుపోయేవి. మాకు తెలియకుండానే మా మాటల్లో ఆమె ప్రస్తావన దొర్లిపోయేది. ఇది స్వాభావికంగా మాలో వచ్చిన మార్పు కాదు. మా లోపలి లోకాలలోకి అల్లుకపోవడం ద్వారా కరుణ సాధించిన గెలుపు.
ఒకరోజు శ్రీవాత్సవ, రేణుక కొండల దిగువకు బయలుదేరారు. నాకు ఒంట్లో నలతగా ఉండడంతో 'రానని' చెప్పి కాటేజీలోనే ఉండిపోయాను. మధ్యాహ్నమయింది. బయట వరండాలో నీరెండలాంటి వెలుతురు పడుతోంది. కాటేజీ లోపల చలిగా ఉంది. నేను రగ్గుని ముసుగుకప్పి పడుకుని పుస్తకం చదువుతూ కనులు మూశాను. కవిత్వకన్యక సుకుమారంగా నా వేపు అడుగులు వేస్తూ వస్తున్నది. నాలో కలవరపాటు, కవిత్వపదధ్వనులు, కళ్ళు మూసుకుని ఆనందకరమైన వేదనానుభూతిని నాలోకి అనువదించుకుంటున్నాను.
దూరం నుంచి అడుగుల సవ్వడి దగ్గరకు చేరుతోంది. రాను రాను అది మరింత సామీప్యానికి చేరుకుంది. ఎవ్వరో నామీద చేయివేసి మెల్లమెల్లగా తట్టిలేపుతున్నారు. కళ్ళు తెరిచాను. ఎదురుగా కరుణ. నా వేపే స్థిరంగా చూస్తోంది. తలమీదికి కొంగుని కప్పుకుని మానవ సహజ సౌందర్యానికి ప్రతీకలా నిల్చొని నవ్వీ నవ్వకుండా నవ్వుతోంది. నేను ఆశ్చర్యచరితుడనయ్యాను. మంచం మీదే లేచి కూర్చున్నాను. రగ్గుని భుజాల మీదుగా కప్పుకుని పుస్తకాన్ని పక్కన పెట్టి ఆమె వైపు పలకరింపుగా చూశాను.
రండి... భోజనం చేద్దురుగాని, ఈవేళ మా ఇంట్లో వంటచేశాను, మీ కోసం"
నేను కాదనలేదు.
పర్ణశాల వంటి గృహావరణలోకి తొలిసారి అడుగుపెట్టాను. మట్టిగోడలు, నాపరాళ్ళు పరిచిన అరుగు, కొన్ని వంట పాత్రలు, ఒక మూలగా దండెం మీద వేలాడుతూ ఆమె దుస్తులు - జీవితంలోని వెలుగు చీకట్లన్నీ అక్కడే పరివేష్టించి ఉన్నాయి.
"కాళ్ళు కడుక్కోండి, అన్నం వడ్డిస్తాను"
ఆమె నాతోనూ, నేను ఆమెతోనూ నేరుగా మాట్లాడుకున్న మొదటి సందర్భం ఇదేనేమో! కాళ్ళు కడుక్కుని వచ్చాను. ఆమె అన్నం వడ్డించింది. చిన్నప్పుడు మా అమ్మ వడ్డించిన భోజనం గుర్తుకు వచ్చింది నాకు. అచ్చంగా అలాంటి భోజనమే ఇన్నాళ్ళకి దొరికింది. కమ్మని కూరల వాసన చుట్టూ వ్యాపించింది. ఎంత అదృష్టవంతుణ్ణి!
ఇష్టంతో అన్నం కలుపుతూ కరుణ వేపు చూశాను - ఆమె దూరంగా గడప మీద కూర్చుని బయటికి చూస్తోంది. నాకు కావలసినవన్నీ నా దగ్గరగా అమర్చే ఉన్నాయి. తను నా ఎదురుగా ఉంటే నేను బిడియపడతానని ఆమెకు ఎలా తెలుసూ? నాకు పరిచయమైన నాలుగు రోజుల్లోనే నా స్వభావం మొత్తాన్ని గ్రహించినట్టే ప్రవర్తిస్తోంది.
ఇదెలా సాధ్యం?
నే నెప్పుడో చదివిన ఒక నవలలోని పాత్రలా ఉంది నా జీవితం. వాస్తవానికీ... వూహల ప్రపంచానికీ మధ్య ఎక్కడో తప్పిపోయినట్టే ఉంది.
ఇష్టంగా భోజనం ముగించాను. కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు చాలవు. వచ్చేస్తూ మనస్ఫూర్తిగా అన్నాను: "మేం వెళ్ళిపోయేలోగా మళ్ళీ ఒకసారి నీ చేతి వంట తినిపించాలి సుమా!"
గిన్నెలు సర్దుతూ నవ్వుతూ చూసింది నా వొంక - అంగీకారంగా.
నేను నా కాటేజీకి వచ్చేశాను.
అరకువ్యాలీ వచ్చి అప్పటికి వారం రోజులు గడిచాయి. శ్రీవాత్సవ, రేణుక ఈ ప్రపంచాన్ని కొత్తకళ్ళతో చూస్తున్న చిన్న పిల్లల్లా మారిపోయారు - ఆనందంగా వున్నారు. వాళ్ళ ఆనందం నాలోకీ అప్పుడప్పుడూ ప్రవహిస్తోంది. నేను నా కిష్టమైన కవితా సంపుటాలన్నీ కూడా తెచ్చుకుని మళ్ళీ చదువుతున్నాను.
కరుణ మాత్రం మా అందరిలోకీ కురుస్తూనే వుంది.
మా అందరి ఇష్టాయిష్టాలు ఎరిగిన మనిషిలా సహకరిస్తూనే వుంది. మరీ ముఖ్యంగా రేణుకకి మంచి తోడు దొరికినట్టయింది. రోజూ సాయంత్రవేళ రేణూకి ఏకాంతాన్ని కానుకగా సమర్పించి తిరిగి వెళ్ళిపోయేది.
చలి వాతావరణం నా ఒంటికి పడలేదు. జ్వరం తగిలి బాగా నీరసించాను. అయినా ఒక రాత్రి బాగా చీకటి పడ్డాకా నేను కాటేజీలోంచి బయటకు వచ్చాను. మంచుతో నిండిన లోయల సౌందర్యాన్ని చూడాలని బయలుదేరాను. నాకు తోడుగా కరుణ వస్తే బావుంటుందనిపించింది.
కాటేజీ మెట్లు దిగి ఆమె ఇంటి తలుపు తట్టి విషయం చెప్పాను.
ఆమె అంగీకరించలేదు.
"మీకు జ్వరం తగ్గాకా ఈ లోయలన్నీ తిప్పుతాను. కొండలన్నీ చూపుతాను" అని వారించింది.
"ముసురు తగ్గి రెండు రోజులైనా కాలేదు. కాలిబాటలన్నీ బాగా తడితడిగా, బురదపట్టి వుంటాయి. చీకటిలో వెళ్ళటం అంత మంచిది కాదని" నచ్చచెప్పింది. నేను అంగీకారంగా కాటేజీకి తిరిగి వచ్చాను. బయలుదేరిన ఉద్దేశం నెరవేరకపోయినా, నాకు వెలితి అనిపించలేదు. మంచులోయని పలకరించడానికి బయలుదేరి, కరుణని పలకరించి వచ్చాను. రెంటికీ పెద్ద తేడాలేదు నా దృష్టిలో.
కరుణ మాటని నేను జవదాటలేదు.
కరుణ కూడా నాకిచ్చిన మాటని మర్చిపోలేదు.
ఒక రాత్రి - లోయ అంతటా మంచు వెన్నల కురుస్తున్న రాత్రి నా కాటేజీకి వచ్చింది. "రండి. లోయని చూపిస్తాను. కూడా రగ్గు తెచ్చుకోండి. చలిగాలి తగలకుండా వుంటుంది" అని నన్ను బయలుదేరతీసింది. నా నుదుటిని తాకి జ్వరం తగ్గిందో లేదో పరీక్షించి సంతృప్తిగా నిట్టూర్చింది. ముందు తన ఇంటికి తీసుకువెళ్ళి వేడివేడి తేనీరు ఇచ్చింది. తర్వాత తను చుట్టుకునే మఫ్లర్ ని నా చేతికిచ్చి తలకి చుట్టుకోమంది.
మా అమ్మ మాటల్లాగే ఆమె మాటలూ నాకు శిరోధార్యలు.
మేం నడుస్తున్నాం.
మహానిశ్శబ్దపు లోయ. మసకవెన్నెల. పొగలా రగులుతున్న వెన్నెల. ఆకాశంలో వెలిగించిన దీపంలాంటి వెన్నెల - ఎన్ని పోలికలు చెప్పినా ఆ సౌందర్యం పట్టుబడదు గాక పట్టుబడదు. మనసులో మెత్తని ఊసులు మొదలవుతున్నాయి. లోయలో కొద్దిగా అనువైన ప్రదేశాలలో మాత్రమే కాటేజీలు వున్నాయి. కొన్నిచోట్ల చిన్న చిన్న పూరిళ్ళు ఉన్నాయి. కాటేజీలలోనూ, పూరిళ్ళ లోనూ దీపాలు వెలుగుతున్నాయి. మిగతా ప్రదేశమంతా మసక చీకటి వ్యాపించి ఉంది. ఆ మంచు వెన్నెలలో అప్పుడప్పుడూ నా చేతిని పట్టుకుంటూ కరుణ కాలిబాట వెంట నడుస్తోంది. తనకి అలవాటైన మార్గం కావటంతో కాసింత చొరవగా అడుగులు వేస్తోంది. పరుగులాంటి నడకతో నన్ను జలపాతంలా లాక్కుని పోతోంది. అలా కొండల జారులోంచి, వాలులోంచి నడిపిస్తూ నడిపిస్తూ - ఒక పెద్ద వృక్షం ముందు నిలబడిపోయింది.
మా శరీరాలు చల్లనైనాయి. మా ఊపిరిలోకి పొగమంచు చొరబడి వణుకు పుడుతోంది. కొండవాలులో నిర్భయంగా పెరిగిన ఆ వృక్షం కింద కరుణ ఎందుకు నిలబడిపోయిందో నాకు అర్ధం కాలేదు. కొన్ని క్షణాల తర్వాత నాకు మాత్రమే వినిపించేంత మెల్లగా ఇలా చెప్పుకొచ్చింది.
"ఈ చెట్టుని చూస్తే నాకు గుండెలో బాధగానూ, భయంగానూ వుంటుంది. ఈ చెట్టు కిందనే నా చెల్లి శాంత చనిపోయింది. అయిదేళ్ళ క్రితం, కొందరు పిల్లలు విహారానికి వచ్చి ఆకాటేజీలలో దిగారు. డిసెంబర్ చివరి రోజులు. మంచు విపరీతంగా కురుస్తోంది. వచ్చిన పిల్లల్లో ఒకరికి జ్వరం వచ్చింది. ఎంతకీ జ్వరం తగ్గుముఖం పట్టలేదు. పైగా తిరగబెట్టింది. శాంతా, నేనూ కంగారుపడ్డాం. అర్ధరాత్రప్పుడు డాక్టర్ని తీసుకురావడానికి శాంత ఒక్కర్తే కొండదిగువకు బయలు దేరింది. అలా బయలుదేరిన మనిషి ఎంతకీ తిరిగిరాలేదు. ఆమెని వెతుకుతూ వెళ్ళిన మా నాన్న కూడా ఎంతసేపటికీ తిరిగిరాలేదు. చివరికి ఆ ఇద్దరి కోసం వెదుకుతూ నేను బయలుదేరాను. తీరా ఈ చెట్టు కిందకి వచ్చాకా శవంగా మారిన నా చెల్లి, అసహాయంగా ఏడుస్తూ మిగిలిన నాన్న కనిపించారు. డాక్టర్ కోసం బయలుదేరిన శాంత ఎలా చచ్చిపోయిందో ఈనాటికీ అంతుబట్టలేదు. దాని శరీరం నల్లగా కమిలిపోయి వుంది. పాముకాటు వల్లే చనిపోయిందని చాలామంది అన్నారు. ఏ కారణమయితేనేం, ఈ చెట్టు కిందే నా చెల్లి నాకు కాకుండా పోయింది."
ఆ చీకటిలో ఆ మాటలు చెబుతున్నప్పుడు కరుణ కళ్ళలో ఏ భావాలు సుడితిరుగుతున్నాయో నేను గుర్తించలేకపోయాను. నిజమే - ఈ కొండవాలులో ఈ చెట్టు అంతులేని రహస్యంలా, అంతుబట్టని దుఃఖంలా నిలబడి వుంది. చెట్టు కింద నుంచి కరుణ నా చేయి పట్టుకుని ముందుకి నడిచింది. కొండ కిందకి ఏటవాలుగా వుంది కాలిబాట. కాలు జారితే ప్రాణానికి హామీలేదు. నన్ను జాగ్రత్తగా నడిపిస్తూ కరుణ ముందుకు, మున్ముందుకు సాగుతోంది.
ఒకానొక అలౌకిక జగత్తు మంచు తెరల్లో తేలియాడుతున్నట్టే వుంది నాకు. నాకు తెలియని లోకాలకి కరుణ నడిపించుకపోతున్నట్టే వుంది. జీవితమూ, కవిత్వమూ కలగలిసిన గొప్ప సుఖదుఃఖాల సందర్భమిది. ఇలాంటి అనుభవాన్ని అందుకోవడం కోసమే కదా ఇన్నినాళ్ళ నా నిరంతరాన్వేషణ.
నా జీవితంలో కొత్తపుటలు తెరుచుకుంటున్నాయి. కరుణ నా చేతిని వదిలిపెట్టినా నేను కరుణ చేతిని వదిలిపెట్టినా - అ లోయలోకి, చీకటిలోకి జారిపోక తప్పదు. మా చేతులు విడిపోలేదు.
జీవితంలోని మలుపుల్లాగే కాలిబాట కూడా ఎన్నో మలుపులు తిరిగింది.
మలుపు మలుపునా కొన్ని ఆనందాలు, కొన్ని దుఃఖాలు...
కరుణ చిన్నతనాన్నే తల్లిని కోల్పోయింది. మృత్యువృక్షం కింద ఆమె చెల్లి చనిపోయింది. మొన్నటేడాది శీతాకాలంలో ముసలి తండ్రి కూడా ఊపిరి వదిలాడు. ఇప్పుడు ఒకే ఒక్క కరుణ మిగిలింది - అనామక గడ్డిపువ్వులకి మల్లే నిండు జీవితాన్ని దర్శించడానికి.
ఏటవాలు కాలిబాట వెంట బాగా ముందుకి నడిచాక దూరంగా కొండచరియలు కనిపించాయి. నిటారుగా ఆకాశంవేపు గురి చూస్తున్న ఆ కొండ పరిచయలని చూస్తూ కొద్దిసేపు కరుణ కొద్దిసేపు అనిర్వచనీయంగా వుండిపోయింది. నా చేతిని పట్టుకున్న ఆమె చేతివేళ్ళ వెచ్చదనంలోంచి ఆ అనుభూతి నాలోకి ప్రవహించింది.
ఓ క్షణం తర్వాత ఇలా చెప్పింది:
"ఆ కొండ చరియల్ని చూశారా, ఎంత పొగరుగా నిల్చున్నాయో! అవంటే నాకెంత ఇష్టమో చెప్పలేను. చిన్నప్పుడు ఆన్నింటికన్నా ఎత్తున్న కొండచరియని ఎక్కి ఎలుగెత్తిన గొంతుతో నా పేరుని నేనే పిలిచే దాన్ని. నా అరుపు ఈ కొండలోయలో ప్రతిధ్వనించి పోయేది. ఏ అర్ధరాత్రో ఈ కొండలనెక్కి నన్నెవరైనా అలా పెద్దగా పిలుస్తారని ఎదురు చూసేదాన్ని. అదంతా నా చిన్నతనపు ఆకతాయితనం"
ఆ మాట చివర మురిపెంగా నవ్వింది. కరుణ. నవ్వుతూ మురిసిపోయింది.
ఆమె చూపిన కొండశిల నాకు ఒట్టి కొండశిలలా కన్పించలేదు. అది ఈ లోయ అంతట్నీ వశం చేసుకోగల మహాశిఖరంలా కనిపించింది.
ఒక పక్క మృత్యువు నీడలాంటి పడగ, మరోపక్క మణిమయ కాంతులతో వెలిగే జీవనకాంక్ష.
కొండ చరియల్ని చూసిన కళ్ళతోనే కరుణ వైపు చూశాను. ఆమె ఓ అమాయికలా కనిపించిందా క్షణాన. నిండైన యవ్వనాన్ని పోగేసుకున్న అమాయిక. నిష్కపటంగా మనసు విప్పే అమాయిక.
ఆమె ఈ లోయ ఆత్మకథని చెప్పడం ఆపేసింది. సవిస్తారమైన లోయ కళ్ళముందు పరుచుకుని వుంది. మనసు వెచ్చగా వెలుగుతోంది. నులివెచ్చని అనుభూతుల మధ్య కళ్ళల్లోకి నీళ్ళు చిప్పిల్లుతున్నాయి.
కొద్దిసేపు ఇద్దరం ఆ కాలిబాట పక్కనే రాళ్ళమీద మౌనంగా కూర్చున్నాం. దట్టమైన మేఘాల్ని చీలుస్తూ చిమ్మ చీకటిని జయిస్తూ బంగారు కాంతుల వెన్నెల జారుతోంది. అంతటా!
నా చేతికి వాచీలేదు. కాలాతీతం.
గాలి తెరల్లోంచి సన్నసన్నగా సెలయేటి పాట తేలివస్తున్నది.
"చాలా పొద్దుపోయింది. రండి వెళ్దాం. మీ కోసం కొంచెం టీ ఉంచాను. తాగి వెళ్దురుగాని"
కరుణ లేచింది. ఆమె వెనుకనే నేనూ. వెనుదిరిగాం. తిరుగు ప్రయాణంలో మా చేతులు మళ్ళీ కలుసుకున్నాయి. నా భుజానికి తన భుజాన్ని దరచేర్చి మెల్లమెల్లగా నడిపించుకువచ్చింది.
ఇల్లు చేరుకున్నాకా కరుణ చిదుగుల మంటల్ని రాజేసింది. ఆవిర్లు చిమ్మే వేడి వేడి టీ అందించింది. టీ తాగి వీడ్కోలు తీసుకుని కాటేజీకి తిరిగి వచ్చాను - ఒక్కన్నీ. వస్తున్నప్పుడు ఆమె చేతిని అందుకుని మనసారా ముద్దు పెట్టుకోవాలన్పించింది. కానీ ఆ పని చేయలేదు. ఆమె చేయి అందుకోవాలంటే ఈ లోయకి నన్ను నేను సమర్పించుకునేంత ఎదగాలి. లోయ ప్రతిధ్వనించి పోయేలా కరుణని ఎలుగెత్తి పిల్చుకోవాలి.
మరుసటి రోజు ఉదయమే శ్రీవాత్సవ, రేణుక, నేను - తిరుపతికి బయలుదేరాల్సి వుంది. తెల్లారుజామున శ్రీవాత్సవ నిద్రలేపితే - నేను తిరుపతి రావడంలేదని చెప్పాను. ఆశ్చర్యపోయాడు.
నేను చేరుకోవాల్సిన చోటికే చేరుకున్నాను.
"ఈ చోటుని వదులుకునేది లేదని" చెప్పాను.
శ్రీవాత్సవ బెంగగా, బాధగా చాలా హితబోధలు చేశాడు. మా ఇద్దరి సంభాషణని ఇక్కడ ప్రస్తావించదల్చలేదు. నేను. నా నిర్ణయాన్ని మార్చుకోలేదు కనుక అదంతా అప్రస్తుతమే చివరికి:
"ఈ లోయలో పడి చావు" అని శపించాడు నన్ను. అతనిది ధర్మాగ్రహం. నేనర్ధం చేసుకోగలను.
"ఈ లోయలో బతకమని" కొండలూ, వాగులూ, మేఘాలూ దీవిస్తున్నాయి నన్ను. ఆ దీవెనలు అతనికి అర్ధం కాలేదు. గడిచిన పదిరోజుల్లోనూ నగరం వెంటాడలేదు నన్ను. ఆ బాధ, రోతా ఇప్పుడు లేవు. నేను ప్రేమించలేని యంత్రాల మోతా, యంత్రాలని పోలిన మనుషులు ఇక్కడ లేరు.
ఈ ప్రదేశం నా స్వస్థానంలా నన్ను లాలిస్తోంది.
నా భాష కరుణకి అర్ధమవుతోంది. లోయ అంతటా పరుచుకున్న జీవనమాధుర్యం నాకు అందుతోంది. అలవోకగా నాలోంచి పాటలేవో పుట్టుకొస్తున్నాయి. ఆకాశం నాకు మరీ దగ్గరయినట్టుగా ఉంది.
శ్రీవాత్సవ, రేణుకలను రైలెక్కించాను. కాటేజీకి తిరిగి వచ్చాను...
ఉదయం గడిచిపోతుంది. మధ్యాహ్నమూ గడిచిపోతుంది. పొద్దు తిరిగిపోతుంది. చీకటి విచ్చుకుంటుంది. రాత్రి చిక్కనయ్యాకా - ఈ లోయ సాక్షిగా, నక్షత్ర దీపాలా సాక్షిగా, మంచుకురిసే ఆకాశం సాక్షిగా నేనా కొండశిఖరాన్ని అధిరోహిస్తాను. నా జీవితేచ్ఛనంతా ఒకేవొక్క గొంతుగా మార్చుకుని 'కరుణా' అని ఎలుగెత్తి పిలుస్తాను.
అందుకోసమే నేను వుండిపోయాను.
అందుకోసమే నేను నిరీక్షిస్తాను.
***
(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)