సుబ్బారావూ బ్యాంక్ అకౌంటూ! - రాజేష్ యాళ్ళ

subbaravoo bank accountoo

దయం ఆరున్నరకే కాలింగ్ బెల్ మోగింది! "థూ... థూ..." అని ఛాతీ మీద ఊసుకున్నాడు సుబ్బారావ్! చలికి రగ్గు కప్పుకుని హాయిగా పడుకున్న అతనికి ఆదివారం పూట ఆ కాలింగ్ బెల్ ఉలికిపాటునే కాదు కోపాన్ని కూడా రప్పించింది.

'ఎవడ్రా పొద్దున్నే?' అని అడగాలనుకుని మంచం మీదనుండి గబగబా దిగే సరికి జారిపోయిన లుంగీని ఎగలాక్కుని కట్టుకుని తలుపు తెరిచాడు.

ఎదురుగా పళ్ళికిలిస్తూ పలకరించారు నలుగురు వ్యక్తులు "గుడ్ మాణింగ్ సార్!" అంటూ ముక్త కంఠంతో!

'గూండాల్లా వచ్చి గుడ్ మాణింగ్ ఏంటో' అనుకుంటూ తల ఊపుతూ ఏమిటన్నట్టుగా చూసాడు సుబ్బారావ్.

"మేం కాలనీలో ఉన్న బ్యాంక్ నుండి వచ్చామండీ!" అన్నాడు వాళ్ళలో కాస్త పెద్దగా ఉన్నాయన కళ్ళజోడును సవరించుకుంటూ.

"నాకు అప్పులేం లేవండి!" ముక్తసరిగా చెప్పి తలుపు వేసెయ్యబోయాడు సుబ్బారావ్.

"అబ్బే బాకీల వసూళ్ళ కోసం కాదు సార్, మేం బయల్దేరింది..."

అందుకున్నాడు అతని వెనకే ఉన్న ఓ నడివయసాయన.

"నాకు క్రెడిట్ కార్డు కూడా వద్దు!" అన్నాడు సుబ్బారావ్ అతన్ని పూర్తిగా చెప్పనివ్వకుండానే.

"అది కూడా కాదు సార్. మా బ్యాంక్ లో మీరొక్క ఎకౌంట్ ఓపెన్ చేస్తారని అడిగేందుకొచ్చాం." అన్నాడు మరో ఇరవయ్యేళ్ళ కుర్రాడు పక్క నుండి.

"ఎకౌంట్ ఓపెన్ చెయ్యమని అడిగే పద్ధతి ఇదా? ఆదివారం హాయిగా పడుకున్న వాళ్ళను ఎలా పడితే అలా లేపేసి అడుగుతారా?!" విసుక్కున్నాడు సుబ్బారావ్. అతని మనసులో ఇందాక జారిపోయిన పైజామా జ్ఞాపకం ఇంకా మెదులుతూనే ఉంది!

"సారీ సార్! మా బ్యాంక్ వాళ్ళు దేశమంతా ఒకేసారి ప్రారంభించిన మహాత్తర ప్రచార కార్యక్రమంలో భాగంగా మీ ఫ్లాట్స్ కి వచ్చాం. ఇవాళంతా మాకిదే పని." మొట్టమొదటిగా పలకరించినతను చెప్పాడు.

"గవర్నమెంట్ బ్యాంకే అంటున్నారు. మీకు జీతాల్లేవా? ఇలా రోడ్డు మీద పడి అడుగుతున్నారేంటి? కొంపదీసి మీ బ్యాంక్ నష్టాల్లో ఉందా?!" అనుమానంగా అడిగాడు సుబ్బారావ్.

వాళ్ళంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే సరికి సుబ్బారావ్ కి అనుమానం పెరిగిపోయింది. నలుగురూ తెల్లబోయి చూసినా అంతలోనే ఆ పెద్దాయనే తేరుకుని చెప్పాడు, "అదేం లేదండి, మా బ్యాంక్ చాలా పెద్ద బ్యాంక్. ఎకౌంట్స్ పెంచుకుందామని ఇలా వస్తున్నాం అంతే! నేను ఇక్కడి బ్రాంచ్ మేనేజర్ని."

"లేదండి నాకు మా శాలరీ ఎకౌంట్ వేరే ఉంది. ఎకౌంట్ అక్కర్లేదు." తలుపు వేసెయ్యబోయాడు.

"అలా అనకండి సార్. మా బ్యాంక్ లో సర్వీస్ చాలా బాగుంటుంది. ఒకసారి ఎకౌంట్ ఓపెన్ చేశాక మీకే తెలుస్తుంది. ఆ తర్వాత మీ శాలరీ అకౌంట్ కూడా మా దగ్గరికే మార్చేస్తారు. ఇంకా డిపాజిట్లు వేసుకోవచ్చు. లాకర్ తీసుకోవచ్చు... ఇంకా..." అంటూ పెద్ద చిట్టా విప్పాడు మరో కుర్రాడు.

వాళ్ళు అంత తేలిగ్గా వదిలేలా లేరని అర్ధమైంది సుబ్బారావ్ కి. సబ్బులు, ఫినాయిలు అమ్మే వాళ్ళు బ్రతిమాలినట్టుగా ఈ బ్యాంక్ వాళ్లకు ఈ గతి పట్టిందేమిటో అనుకుంటూ, "సరే ఎకౌంట్ ఓపెనింగ్ ఫార్మ్ ఇవ్వండి. నాకు వీలైన రోజు వచ్చి చేస్తాను." అని చెప్పాడు.

వాళ్ళందరి ముఖాలు విప్పారిపోయాయి. "థాంక్స్ సార్, ఇదిగోండి ఫార్మ్. మీరు ఇవ్వాళ చేస్తానన్నా చేసెయ్యొచ్చు. అవసరమైన పేపర్స్ రేపివ్వొచ్చు. మీ పేరు, వివరాలు చెప్పండి." తన దగ్గరున్న నోట్ బుక్ రెడీగా పెట్టుకుని అడిగాడు రెండో కుర్రాడు.

ముఖం చిట్లించి అడిగాడు సుబ్బారావ్, "ఎలానూ వస్తాను కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు?"

"ఎంత మందిని కలిసామో, ఎన్ని ఎకౌంట్స్ ఓపెన్ అవుతాయో సాయంత్రానికి మేం హెడ్డాఫీసుకు రిపోర్ట్ చెయ్యాలి సార్, చెప్పండి." బ్రతిమాలినట్టుగా అన్నాడు సుబ్బారావ్.

"చాలా థాంక్స్ సార్" అంటూ వెలిగిపోతున్న ముఖంతో షేక్ హ్యాండ్ ఇచ్చాడు మేనేజర్. అతని అనుచరులు అప్పటికే పక్క ఫ్లాట్ కాలింగ్ బెల్ నొక్కినట్టున్నారు, తలుపు మూయబోయిన సుబ్బారావ్ కి గయ్ మంటూ వినిపించింది పక్కింటావిడ పెద్ద నోరు, "బుద్దుందా... ఆదివారం పూట పనీపాటా లేని సన్నాసుల్లా బయల్దేరారు... వెళ్ళండి వెళ్ళండి... బ్యాంకట బ్యాంక్. సెలవు పూట అందరి పనులూ పాడు చేస్తూ!"

తర్వాతి రోజు తెల్లవారుతూనే సుబ్బారావ్ సెల్ మోగింది. "సార్ నేను ఫలానా బ్యాంక్ నుండి సతీష్ ని మాట్లాడుతున్నా. నిన్న ఆదివారం మీ బ్యాంక్ కి వచ్చాం. మా బ్యాంక్ లో ఎకౌంట్ తీసుకుంటానన్నారు కదా, ఎప్పుడొస్తున్నారు?"

'ఏమిటో వీళ్ళు అప్పుడే ఫోన్లో ఫాలో అప్ కూడా మొదలు పెట్టేసారు' అనుకుంటూ చెప్పాడు సుబ్బారావ్, "రేపో ఎల్లుండో వస్తాను. నాకూ కుదరాలి కదా?!"

ఆ ఫోన్ ముగించగానే మరో సారి మోగింది. ఎత్తగానే వినవచ్చిందిలా, "నమస్కారం సుబ్బారావ్ గారూ, నిన్న మీ ఇంటికొచ్చాం. మీరు ఎకౌంట్ ఒకటి ఇస్తానన్నారు కదా, అది గుర్తుచేద్దాం అని నేను మేనేజర్ని చేస్తున్నా."

"తప్పకుండా ఇస్తాను సార్, నాకు వీలు చూసుకుని వస్తాను." సుబ్బారావ్ చెప్పాడు.

ఆ కాల్ అయిన రెండు నిమిషాలకే మళ్ళీ మోగింది ఫోన్. "గుడ్ మాణింగ్ సర్, నేను ప్రదీప్ ను మాట్లాడుతున్నా. మీరు మా ఫలానా బ్యాంక్ కి ఎప్పుడొస్తున్నారు, ఎకౌంట్ తీసుకుంటానన్నారు కదా?!"

చిర్రెత్తుకొచ్చింది సుబ్బారావ్ కి. "ప్రదీప్ గారూ, ఎంతమంది చేస్తారు ఒకే మనిషికి మీ బ్యాంక్ వాళ్ళు?! ఇప్పటికి మూడో ఫోన్ మీ వాళ్ళనుండి!" విసురుగా చెప్పాడు సుబ్బారావ్.

"సారీ సార్! మీరు వచ్చినప్పుడు నా దగ్గరికే రండి ప్లీజ్" అంటూ ఫోన్ పెట్టేసాడు ప్రదీప్.

ఆ రోజు మధ్యాహ్నానికల్లా దాదాపు ముఫ్ఫై కాల్స్ ఆ బ్యాంక్ సిబ్బంది నుండే అందుకున్నాడు సుబ్బారావ్. చివరకు కోపంతో ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసేసాడు.

తర్వాతి రోజు ఉదయం నుండి మళ్ళీ మొదలైన ఫోన్ దాడికి తట్టుకోలేక ఆఫీస్ లో పర్మిషన్ అడిగి ఆ ఫలానా బ్యాంక్ కి వెళ్ళాడు. అతన్ని చూడగానే ఆదివారం వచ్చిన కుర్రాళ్ళు ఇద్దరూ పలకరించారు. పేపర్స్ అన్నీ అతని చేతిలోంచి లాక్కున్నట్టుగా తీసుకుని, అన్నీ చూసి తలాడించి, "మీరు సాయంత్రం రండి సార్! మీ పాస్ బుక్, ఏటీయం కార్డ్ అన్నీ రెడీ చేసి ఉంచుతాను." అని చెప్పాడు ప్రదీప్.

సాయంత్రం ఆఫీస్ నుండి వస్తూ బ్యాంక్ కి వెళ్ళాడు సుబ్బారావ్.
అతన్ని చూసిన ప్రదీప్, "పాస్ బుక్ ప్రింటర్ ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. రేపొస్తే ఏటియం కార్డ్ తో సహా కలిపి ఇచ్చేస్తాను సర్! ఏమీ అనుకోకండి" అన్నాడు ప్రదీప్.

రెండో రోజు వెళ్ళాడు సుబ్బారావ్. ఎకౌంట్ ఓపెన్ చేసినపుడు అతని దగ్గరికి వెళ్లలేదని కోపమో ఏమో, అతన్ని చూస్తూనే సతీష్ ముఖం తిప్పుకున్నాడు. 'అత్తాకోడళ్ళలా బ్యాంక్ లో ఈ గొడవలు, పోటీలు ఏంటో ' అనుకుంటూ సతీష్ దగ్గరగా వెళ్ళి అడిగాడు, "ప్రదీప్ లేడా?"

ముక్తసరిగా చెప్పాడు సతీష్, "లేడండీ, ఏదో పనుందని వెళ్ళిపోయాడు."

"పాస్ బుక్, ఏటీయం కార్డ్ సాయంత్రం ఇస్తానన్నాడు. తయారయ్యాయా?" సుబ్బారావ్ అడిగాడు.

"ఏమోనండి. అతనికే తెలుస్తుంది. రేపు ప్రదీప్ దగ్గరకు వచ్చి తీసుకోండి." అదే తీరుగా సమాధానం చెప్పాడు సతీష్.

మేనేజర్ ఏమైనా సాయం చేస్తాడేమో అన్నట్టుగా వెళ్తూ ఆయన క్యాబిన్లోకి చూసాడు సుబ్బారావ్. తెచ్చి పెట్టుకున్న నవ్వు ముఖంతో రుబ్బురోలు పొత్రం లా బుర్ర, పూనకంలో వేపమండల్లా చెయ్యి ఊపాడు తప్ప బైటకు మాత్రం రాలేదాయన.

చేసేదేం లేక ఆ తర్వాతి రోజు మళ్ళీ బ్యాంక్ కి వెళ్ళాడు సుబ్బారావ్. అతని అదృష్టం కొద్దీ ప్రదీప్ ఉన్నాడు. కార్డ్, పాస్ బుక్ అతనికిచ్చి చెప్పాడు ప్రదీప్, "కార్డ్ పక్కనే ఉన్న ఏటీయం లో మీరొక్కసారి పెట్టగానే మీకొచ్చిన కోడ్ మార్చుకోవచ్చు."

ఏటీయం లోకి వెళ్ళి రెండు నిమిషాల్లోనే తిరిగి వచ్చి చెప్పాడు సుబ్బారావ్, 'కార్డ్ ఇంకా ఆక్టివేట్ అవ్వలేదని వస్తోంది" ప్రదీప్ కి రసీదు చూపిస్తూ.

కంప్యూటర్లో ఏదో చూసి చెప్పాడు ప్రదీప్, "ఇంకా ప్రోసెస్ లో ఉన్నట్టుండి సార్, రేపు మళ్ళీ ఏటీయం లో పెట్టి చూడండి!"

ఆ తర్వాతి రెండు రోజులూ సుబ్బారావ్ ఏటీయం కి, అక్కణ్ణుంచి బ్యాంక్ లోపల ప్రదీప్ దగ్గరకు వెళ్ళడం, మొత్తానికి మూడో రోజునుండి కార్డ్ పని చెయ్యడం జరగడంతో చివరకు 'హమ్మయ్య' అని నిట్టూర్చాడు సుబ్బారావ్.

వారం తర్వాత సుబ్బారావ్ మళ్ళీ వచ్చాడు ప్రదీప్ దగ్గరకు, "కార్డ్ ఏటీయం మిషన్ లోపలకు వెళ్ళిపోయింది. వచ్చి తీసి ఇస్తారా?" అంటూ.

"కోడ్ అంటే పాస్ వర్డ్ టైప్ చేసేటప్పుడు మీరు తేడాగా చేసినా, ఆలస్యం చేసినా కార్డును మెషిన్ తీసేసుకుంటుంది." ప్రదీప్ చెప్పాడు.

"మిగతా బ్యాంకుల్లో అలా లేదు. అసలు కార్డ్ ఇలా పెట్టి అలా తీసేస్తే చాలు." సుబ్బారావ్ అన్నాడు.

"మా బ్యాంక్ లో ఇదే పద్ధతి" చాలా గొప్ప పద్ధతి అన్నట్టుగా సగర్వంగా అన్నాడు ప్రదీప్.

"సరే, కార్డ్ తీసి ఇస్తే వెళ్తాను." సుబ్బారావ్ విసుక్కున్నాడు.

"లేదు సర్. ఏటీయం వేరే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు వచ్చి డబ్బు పెట్టేటప్పుడు కార్డ్ తీసి ఇస్తారు. రేపు సాయంత్రం రండి." తాపీగా అన్నాడు ప్రదీప్.

"మీ బ్యాంక్ ఏటీయమ్మే కదా ఎవరో వచ్చి కార్డ్ తీసి ఇవ్వడం ఏంటి? మీకు తెరిచే వీలుండదా?!" సుబ్బారావ్ కోపంగా అడిగాడు.

"లేదండీ మా బ్యాంక్ వాళ్ళకు అవుట్ సోర్సింగ్ అంటే కాంట్రాక్ట్ కి ఇచ్చేసింది. మాకు సంబంధం ఏమీ ఉండదు." ఇంకా తాపీగా చెప్పాడు ప్రదీప్.

సుబ్బారావు కి ఒళ్ళు మండిపోయినా ఎలానో తమాయించుకుని వెళ్ళి తర్వాతి రోజు కార్డ్ తీసుకుని వెళ్ళాడు.

మరో పదిరోజులకల్లా పరుగులు పెడుతూ ప్రదీప్ దగ్గరకొచ్చాడు సుబ్బారావ్. "ప్రదీప్, ఎకౌంట్లో ఉన్న పదివేల రూపాయలూ ఏటీయం నుండి తీసుకుందామంటే ఎకౌంట్లో తగ్గిపోయాయి కానీ నాకు డబ్బు రాలేదు." కంగారుగా చెప్పాడు.

"ఫర్వాలేదు మళ్ళీ మీకొచ్చేస్తాయ్!" అభయమిచ్చాడు ప్రదీప్.

"వచ్చేస్తాయా... ఎప్పుడు ఎలా?" అయోమయంగా అడిగాడు సుబ్బారావ్.

"తిరిగి మీ ఎకౌంట్లోకి పడిపోతాయిలెండి." నమ్మకంగా చెప్పాడు ప్రదీప్.

"ఎప్పటికి?" ఆదుర్దాగా అన్నాడు సుబ్బారావ్.

"ఎప్పటికి అంటే ఏమీ చెప్పలేం. కాసేపాగి పడిపోవచ్చు. లేదా రేపో ఎల్లుండో." ప్రదీప్ జవాబుకి సుబ్బారావ్ మతి పోయింది.

"అన్ని రోజులు పడితే ఎలా? నాకిప్పుడు డబ్బులు కావాలి." సుబ్బారావ్ చెప్పాడు.

"మీ ఎకౌంట్లో డబ్బులు లేవుగా? ఎలా తీస్తారు?" తిరిగి ప్రశ్నించాడు ప్రదీప్.

"డబ్బులు నాకు ఏటీయం ఇవ్వలేదుగా?!" సుబ్బారావ్ ఎదురు ప్రశ్నించాడు.

"కానీ ఎకౌంట్లో తగ్గిపోయాయిగా?!"

"అది మీ తప్పేగా! ఎలానూ తర్వాత వచ్చేస్తాయి అంటున్నారు కదా. ఇక్కడ తీసుకునే ఏర్పాటు చెయ్యాలిగా?!" కోపంగా అడిగాడు సుబ్బారావ్.

"అలా వీలు కాదు సార్. ఎకౌంట్లో ఉంటేనే మీకు ఇక్కడ క్యాష్ ఇవ్వగలం" ప్రదీప్ తాపీగా చెప్తుంటే తారాస్థాయిని అందుకుంటుంది సుబ్బారావ్ కోపం. కానీ అవసరం తనది. దానికి తోడు పోయిన పదివేలు ఎలా వస్తాయో అని బెంగ కూడా పట్టుకుంది కొత్తగా. ఆ బెంగతోనే అడిగాడు నీరసంగా, "ఒకవేళ మూడు రోజుల తర్వాత కూడా రాకపోతే ఏం చెయ్యాలి?!"

"కంప్లయింట్ రాసివ్వాలి మీరు. అప్పుడు నేను మా హెడ్డాఫీస్ కి మెయిల్ పెడతాను." ప్రదీప్ జవాబిచ్చాడు.

"మరి ఆ మెయిలేదో ఇప్పుడు పెడితే నా డబ్బు నాకు వచ్చేస్తుంది కదా!" అర్ధింపుగా అడిగాడు సుబ్బారావ్.

"మూడు రోజులవకుండా మెయిల్ పెట్టడానికి మాకు పర్మిషన్ లేదు సార్!" నిర్మొహమాటంగా చెప్పాడు ప్రదీప్.

మేనేజర్ని కలిసాడు సుబ్బారావ్. ఆయన కూడా వీలుకాదని చెప్పడంతో నిరాశాగా వెళ్ళిపోయాడు. పైగా ఓ ఉచిత సలహా పారేశాడు, శాలరీ ఎకౌంట్ ఇక్కడకు మార్చేసుకుంటే అప్పుడు తన సహాయం చెయ్యగలిగే వాడినని.

ఆ తర్వాత పదిరోజులకు గానీ సుబ్బారావ్ డబ్బులు అతని ఎకౌంట్లోకి రాలేదు.

మరో నెల తర్వాత బ్యాంక్ కి వచ్చాడు సుబ్బారావ్. "ప్రదీప్, ఏటీయం లో జనరేటర్ లేదా? డబ్బు తీసుకుంటూ ఉండగా మధ్యలో ఏటీయం కరెంట్ పోయి ఆగిపోయింది." గాభరాగా అడిగాడు.

"లేదండీ, దానికి యూపీయస్ ప్రాబ్లం ఉంది. మేం కంప్లయింట్ ఇచ్చాం. త్వరలో పెడతామని చెప్తున్నారు."

'వీడి నిదానం తగలెట్టా' అనుకున్నాడు సుబ్బారావ్, ప్రదీప్ సమాధానం విని.

"మరి ఈలోగా కరెంట్ వస్తే?" సందేహంగా అడిగాడు సుబ్బారావ్.

"అందుకే మీరు ఏటీయం దగ్గరే ఉండండి. కరెంట్ వచ్చాక మీ డబ్బు వచ్చేస్తే వచ్చెయ్యొచ్చు. వేరే ఎవరైనా వస్తే మీకు ప్రాబ్లం కదా! అందుకని కరెంట్ వచ్చే వరకూ అక్కడే ఉండి ఇంకెవ్వరూ ఏటీయం ముట్టుకోకుండా చూసుకోండి!" సతీష్ హెచ్చరికకు ఏటీయం లోకి పరుగుపెట్టాడు సుబ్బారావ్.

ఆ రోజు ఆ ప్రాంతంలో నాలుగు గంటల పాటు కరెంట్ పోయింది. ఆఫీసుకు సెలవు పెట్టి కరెంట్ వచ్చే వరకూ ఏటీయంలో నిలబడి చెమటలు కార్చుకుంటూ కాపలా కాసాడు సుబ్బారావ్. కరెంట్ వచ్చింది కానీ ఏటీయం పని చెయ్యలేదు. మళ్ళీ ప్రదీప్ దగ్గరకు పరుగు పెట్టాడు.

"దానికి బ్యాక్ అప్ లేదు కదా. ఓ పావుగంట పడుతుంది స్టార్ట్ అవ్వడానికి. మిమల్ని అక్కడే ఉండమన్నా కదా!" ప్రదీప్ దబాయింపుకి నిర్ఘాంతపోయి మళ్ళీ ఏటీయంలోకి పరుగు తీసాడు సుబ్బారావ్.

మరో అరగంటకు చచ్చీ చెడీ ఏటీయం స్టార్ట్ అవ్వగానే సుబ్బారావ్ డబ్బులు సుబ్బారావ్ కి వచ్చేసాయి. 'బ్రతుకు జీవుడా' అనుకుంటూ ఏటీయం లోంచి బైటకు వచ్చి చెమటలు తుడుచుకున్నాడు సుబ్బారావ్.

తన స్కూటర్ దగ్గరకు వచ్చి కాసేపు దాని మీద కూర్చుని రిలాక్స్ అయ్యాడు సుబ్బారావ్. తళుక్కుమంటూ ఒక ఆలోచన రావడంతో బండిలో ఉన్న బ్యాంక్ పాస్ బుక్ బైటకు తీసాడు. లోపలకు వెళ్ళాడు. అక్కడ సీట్లలో ఎవ్వరూ లేరు.

"రెండు నుంచి లంచ్ అవర్ సార్! కాసేపు కూర్చోండి" లోపల నుండి వచ్చిన ఆఫీస్ బాయ్ చెప్పాడు. చాలాసేపు కూర్చున్నా ఎవరూ రాలేదు. అనుమానం వచ్చి బైటకు వెళ్లి బోర్డు చూసి వచ్చాడు. అరగంట సేపు లంచ్ అవర్. మూడు గంటలు కావొస్తుండగా తీరిగ్గా, విలాసంగా సీట్లలోకి వచ్చి కూర్చున్నారు సిబ్బంది. ప్రదీప్ దగ్గరకు వెళ్ళాడు. చెప్పమన్నట్టుగా చూసాడు ప్రదీప్.

"ఎకౌంట్ క్లోజ్ చేసేస్తాను." పాస్ బుక్ కూడా ఇస్తూ చెప్పాడు.

"మధాహ్నం ఎకౌంట్ క్లోజ్ అవ్వదు సార్, ఉదయాన్నే రావాలి." ప్రదీప్ చెప్పాడు.

"చూసావుగా ఉదయం నుండి ఎన్ని బాధలు పడుతున్నానో?!" సుబ్బారావు కోపంగా అన్నాడు.

"సరే, మేనేజర్ గారికి ఒక లెటర్ రాసి ఇచ్చి ఆయన సంతకం దాని మీద పెట్టించుకుని రండి." దయతలిచాదు ప్రదీప్.

రిక్వెస్ట్ లెటర్ రాసి మేనేజర్ని కలిసాడు. "ఇంత మంచి ఎకౌంట్ వదులుకోవడం మాకు బాధగానే ఉంది" అంటూ బోలెడు విచారాన్ని పులుముకుంటూ పాస్ బుక్ నీ, ఏటీయం కార్డునూ ప్రదీప్ దగ్గరకు పంపించాడు మేనేజర్.

మరో అయిదు నిమిషాల్లో ప్రదీప్ లోపలకు వచ్చాడు. మేనేజర్ వైపు చూస్తూ "సుబ్బారావ్ గారి ఎకౌంట్లో కనీస మొత్తం లేకపోవడం వల్ల రెండు నెలలకు రెండు వందలు కట్టయిపోయాయి సార్. ఎకౌంట్లో వందే మిగిలింది. ఎకౌంట్ క్లోజింగ్ చార్జెస్ నూట యాభై తీసుకోవాలి. ఆయన ఎకౌంట్లో ఒక యాభై కడితే ఎకౌంట్ క్లోజ్ అయిపోతుంది." తాపీగా చెప్పాడు.

ఆ మాటలు విన్న సుబ్బారావ్ కోపంతో పిచ్చెక్కి పోయాడు. "అసలు నాకు ఎకౌంట్ కావాలని మీ దగ్గరకు నేనొచ్చానా? మీరే వచ్చి ఓపెన్ చెయ్యమని బ్రతిమాలారు. వచ్చాక ఎన్నిసార్లు పాస్ బుక్ కోసం, ఏటీయం కార్డు కోసం ఎన్నిసార్లు తిరిగాను? అసలు మీ దరిద్రపుగొట్టు సర్వీసుకు విసిగిపోయే నేను ఎకౌంట్ క్లోజ్ చేద్దామని నిర్ణయించుకున్నా. పైసా కట్టను. ఏంచేసుకుంటారో చేసుకోండి. నీ..." తన్నుకొస్తున్న బూతులను ఆపుకుంటూ విసురుగా కుర్చీని వెనక్కి జరిపి బ్యాంక్ బైటకు నడిచాడు సుబ్బారావ్.

ఇప్పుడు అతని మనసెంతో ప్రశాంతంగా ఉంది, ఎకౌంట్ క్లోజ్ చేసినందుకు కాదు, శాలరీ ఎకౌంట్ ఆ బ్యాంక్ కి మార్చుకోనందుకు!

***

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు