పరమానందం జీవితం పరమాన్నంలా సాగిపోయింది ఇన్నాళ్ళూ..కాదు కాదు... ఇన్నేళ్ళూ. వేసిన జీడి పప్పులన్నీ తన విస్తట్లోనే పడితే! ఇహనేం!! పరమానందం పరిస్థితీ అదే!!
ఉన్నట్టుండి నీకు షుగర్ వచ్చిందోయ్..రేపట్నుంచి స్వీట్లు తినకూడదని డాక్టర్లు అంటే జీవితంలో సడెన్ బ్రేక్ పడ్డట్టు.. పరమానందం పరిస్థితి తారుమారైంది, పెళ్ళాం తాయారు డిక్లరేషన్ తో.
అమ్మో ! అమ్మో! నా పరువేం కావాలి విని గుండెలు కొట్టుకున్నాడు. తాయారు తాను పెళ్ళి చేసుకుంటానంటొది. సమస్య చిన్నది కాదు. ముసిరిన క్యుములొనింబస్ మేఘాలతో కారు చీకట్లు కమ్ముకొన్నట్లుంది అతడి భవిష్యత్తు. నిజంగా తాయారు మళ్ళీ పెళ్ళాడితే, తను "పెను చీకటాయె లోకం..చెలరేగే నాలో శోకం ..విషమాయే మా ప్రేమా..విధియే పగాయె "పాత గోల్డెన్ హిట్ పాడుకోవాల్సిందే.!!
పక్కింటి జగన్నాధం చెవిలో చెప్పుకున్నాడు మెల్లిగా." నా పెళ్ళాం పెళ్ళాడుతానంటోందిరా!"అని. అదిరిపడి 'అదేంటి?' అన్నాడే కానీ, మారు మాట ఏం మాట్లాడాలో తోచలేదు. ఎంచేతంటే,, పరమానందం భార్య తాయారమ్మ ఏం చేసినా జగన్నాధం భార్య అలివేలు ఖచ్చితంగా అదే చేస్తుంది. వాళ్ళింట్లో కాఫీపొడి, పాల ప్యాకెట్ బ్రాండ్ మారాయంటే, వీళ్ళ ఇంట్లోనూ మారాల్సిందే.
తాయారు రాత్రుళ్ళు చీర కట్టడం మానేసి నైటీలు వేస్తోందంటే, అంతే! అలివేలూ అలాగే దర్శనమిస్తుంది.
కనుక ఈవాళ పక్కింటి తాయారు పెళ్ళాడతా అంటే, రేపు తన భార్య అలివేలు నోటి వెంటా అదే మాట వినవలసి వస్తే!.. వామ్మో. కొంప కొల్లేరే.. భయం చుట్టుకొంది జగన్నాధానికి. ధైర్యం తెచ్చుకొని, ఏదో చిన్న విషయాల్లో అంటే పోనీలే, అని ఉదాసీనంగా ఉన్నాడు గానీ.. ఈ సీరియస్ సమస్యని పెద్దది కానీయకూడదు, పరమానందం ఇంట్లోనే సమసిపోవాలి అని నిర్ణయించి ఆ దిశగా ఆలోచించాడు జగన్నాధం.
"పిల్లలలక్కూడా పెళ్ళిళ్ళు అయి రిటైరైన ఈ మలి వయసులో మళ్ళీ పెళ్ళా? ఇంతకీ మీకు ఏ విషయంలో బెడిసిందోయ్? ఏంటట? విడాకులిస్తుందా? పిల్లలు ఏమనుకొంటారూ!! ఇన్నేళ్ళూ సంసారం చేసిన ఆవిడకు పతియే ప్రత్యక్ష దైవం అని ఆ మాత్రం తెలీదా?" ఊదరగొట్టసాగాడు...
నువ్వొకడివి..అర్భకపు ముఖం వేసుకొని నోరు వెళ్ళబెట్టుకొని చూస్తూ నుంచుంటావు. నాలుగు ప్రశ్నలు తగిలించావా? పుట్టింటికి పోతానని బెదిరిస్తోందా?" జగన్నాధం ప్రశ్నల పరంపరకి పరమానందం దగార సమాధానం లేదు. " ఈవాళ రాత్రికి తిరగబడు. ప్రశ్నించు...విడాకులిస్తానని బెదిరించు.. ఎవరిని పెళ్ళాడతానని అంటోందో అడుగు.." యింకా ఏమేమి ప్రశ్నలు సంధించాలో బాగా నూరి పోసాడు జగన్నాధం. చివరగా "రేపు వచ్చి ఏమైందో చెప్పు" ముక్తాయించాడు కూడా.
ఇలాంటి మొగుడూ పెళ్ళాల విషయాల్లో తనే ఏదో తోచిన నిర్ణయం తీసుకోవాలి గానీ, పక్కింటి వాడి సలహాలతో కాపురం నిలుస్తుందా..జగన్నాధం దగ్గరకు మేటర్ తీసుకొని పోయి తప్పు చేసానేమోననే అపరాధ భావన వెంటాడింది కాసేపు.
పక్క మీద పడుకొని తాయారు తాపీగా పుస్తకాలు తిరగేస్తోంది." ఏవిటోయ్ తాయారూ ఎదురింటి లావణ్యతో నువ్వు పెళ్ళి చేసుకోబోతున్నావని చెప్పావట?" పరమానందం గొంతు వణికింది. "అవును చెప్పాను, తప్పా? చేసుకోబోతున్నానని మీతో కూడా చెప్పాకే చెప్పాను" అంది నవ్వుతూ. మళ్ళీ నవ్వుతూ, మీరు మాత్రం పక్కింటి జగన్నాధం గారికి చెప్పలేదూ? అనడిగింది తాయారు. పరమానందం పెళ్ళాం కొంగు చాటు మనిషి. ఎవరితోనైనా గొడవ పడితే పెళ్ళాం డాలు లాగుండేది. ఇపుడు ఆ డాలుతోనే యుద్ధమాయె! జగన్నాధం గాడు అలివేలమ్మకి మేం మాట్లాడుకొన్నదంతా చెప్పేసి ఉంటాడు... జగన్నాధం అడగమన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం రాబడదాం అనుకొంటే, వేయబోయే ప్రశ్నలన్నీ ఒకటొకటీ వరసగా తనే చెప్పేస్తుందేమో.... గొణుక్కోసాగాడు.. అలాగని ఊర్కోలేదు.
ధైర్యం తెచ్చుకుని, "మనవళ్ళని ఎత్తుకునే వయసులో పెళ్ళాడతావ? విడాకులిస్తావా?" అడిగాడు. స్వరం పెరిగింది. " ఏం కారణం చూపెడతావ్..దేనికైనా ఒక హద్దూ పద్దూ ఉండాలి. సిగ్గుగా లేదూ!" ఏం చేయలేక ఆమె ఆత్మస్థైర్యం దెబ్బతీసి లొంగదీసుకోవాలనుకొని కోపాన్ని కక్కాడు పరమానందం. తాయారు అను నిత్యం నడి నెత్తికి నవరత్న తైలం పూస్తుంది. ఆ ప్రభావంతో " చల్ల చల్లని కూల్ కూల్ "గా వుంది "నేను పెళ్ళి చేసుకొనేదేనబ్బా..రెండో ఆలోచనే లేదు. డిసైడ్ అయిపోయా."నంది. " ఒసేవ్! నీకూ నాకూ కొన్ని విషయాల్లో బేధాభిప్రాయాలుండొచ్చు... అంత మాత్రం చేత నన్నొదిలేస్తావా..." బేరానికొచ్చాడు వేరే దారి లేక.
"మిమ్మల్నొదిలి ఎక్కడికి పోతానండీ..అయ్యో అవేం మాటలూ" తాయారు జాకెట్లోంచి మగళసూత్రాలు తీసి కళ్ళకు అద్దుకొంది. నిన్నొదలనంటుంది - పెళ్ళాడతానంటుంది ! పరమానందానికి లాజిక్ అంతు చిక్కలేదు. కంఫ్యూజన్ ఇంకా ఎక్కువైంది.
***
పక్కరోజు జగన్నాధం ముఖం చూడడానికి పరమానందం ఇష్టపడలేదు. నిన్న తొందరపడి వీడితో వాగకుండా ఉండాల్సింది. ఇంటి వ్యవహారం నడి రోడ్డుకి ఎక్కేలాగుంది. వాడిపుడు " రాత్రి ఏమైంది? నీ పెళ్ళాం పెళ్ళెప్పుడు ? డేట్ ఫిక్స్ అయ్యిందా? అని జోక్ చేయగలడు. అందుకే మొహం చాటేసాడు.
***
ఇప్పుడిక్కడ టైం ఎంతా తాయారు అడిగింది కొడుకు శ్రీరాంని. రాత్రి పది అయ్యిందమ్మా..మీకు ఉదయం ఎనిమిది కదా!
శ్రీరాం కి న్యూజెర్సీలో ఉద్యోగం."అమ్మా" ఆప్యాయంగా పిలిచాడు తల్లిని 'ఏరా' అంది ఇంకా ఆప్యాయంగా. 'నాన్నగారు దేనికో
కంగారు పడిపోతున్నారు.. దేనికి? తండ్రితో మాట్లాడినప్పుడు ఏదో విషయంలో తల్లిదండ్రులు గొడవ పడ్డట్టు గమనిమంచాడు శ్రీరాం. ' ఓ అదా, చిన్న విషయమేలేరా, రేపటికి సాల్వ్ అయిపోతుంది. అంది.
ఓకే అమ్మ, టేక్ కేర్.. బై! చెప్పాడు కొడుకు. చాటుగా విన్న పరమానందానికి 'చిన్న విషయం'అనేసరికి చిర్రెత్తింది. యిప్పటికే చిందులు తొక్కుతున్న పరమానందం, తాయారు కొత్తగా "ఏవండోయ్ శ్రీవారూ పేపర్లో యాడ్ ఇచ్చాను. రేపు వస్తుంది.. ప్రకటన చూడండి" అనేసరికి ఇక తట్టుకోలేక హైదరబాద్ లో ఉన్న లక్ష్మి ప్రసన్నకు ఫోన్ చేసి విషయం అంతా చెప్పేసాడు. అంతే, సాయంత్రానికల్లా లక్ష్మి ప్రసన్న తన కూతురుతో పాటూ ఇంట్లోకి దిగింది. కాసేపయ్యాక మెల్లగా అమ్మను మాటల్లోకి దించింది. తండ్రిని పక్క గదిలో పెట్టి తలుపు లాక్ చేసింది.
"ఏవిటే అమ్మా...నాన్నతో హాస్యాలాడుతున్నావా? నువ్విప్పుడు పెళ్ళి చేసుకోవడం ఏవిటే?
"అవును, అన్నాను, చేసుకొంటాను"
"అవ్వవ్వ! నవ్విపోతారే"
'పోనీ' అంది నవ్వుతూ...
అమ్మ మాట్లాడిన తీరు చూస్తే యిట్టే తెలిసిపోతోంది. అమ్మలో ఏ దోషమూ లేదని అర్థమయింది.
తాడుని చూసి పాము అనుకొని భ్రమసినట్లు - భోళామనిషి నాన్నగారి భయమేకానీ, విషయం లేదని గ్రహించి, నాన గది తలుపు తీసి రమ్మంది.
నాన్నోవైపూ-అమ్మోవైపూ!! నడీ మధ్య ప్రసన్న - తీర్పు చెప్పే న్యాయ మూర్తిలా. సీరియస్ గా ముఖం పెట్టి అమ్మ వైపు చూస్తూ అడిగింది. "ఏమే అమ్మా..నాన్నతో నువ్వు పెళ్ళడతా అన్నావట..నిజమేనా?!
"ఎన్నిసార్లు చెప్పిస్తారే. అన్నాను..అడ్వర్టైజ్ మెంట్ కూడ ఇచ్చాననీ చెప్పానుగా!"
విసిగిపోయి ఉన్నా పరమానందం విషాదవదనం చూసి కూతురికి జాలేసింది. నాన్నకు దగ్గరగా వచ్చి బుగ్గ గిల్లింది"ఓ పిచ్చి నా నాన్నా అమ్మ నేనుపెళ్ళి చేసుకొంటాను అని ఇంతలా తెగేసి చెబుతోంది. యాడ్ కూడా యిచ్చానంది. మీరు అడిగితే మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తానని కూడా అంది కదా! అమ్మ పెళ్ళి చేసుకొంటానంటే బాధ పడ్డారు, భయపడ్డారు. ఆందోళన పడ్డారే కానీ ఆమె పదేపదే ఆ మాట ఎందుకు అంటోందో ఆమె మనసుకు దగ్గరై కనుక్కొన్నారా? ఆ ప్రయత్నం మీరు చేయలేదు. అందుకే ఈ అపోహ." కళ్ళలో నీళు సుళ్ళు తిరుగుతున్న తండ్రిని అమ్మకు చేరువగా చేర్చి ప్రశ్నల పరంపర మళ్ళీ సంధించింది.
"నువ్వు యింతకీ అంత రెవల్యుషనరీ డెసిషన్ కి ఎందుకు వచ్చినట్లో వివరంగా చెప్పు!" ప్రేమ, అధికారమ్ మేళవించి ప్రశ్నించింది ప్రసన్న.
"ఆ! ఏవుందీ...ఒకరు ఆర్చేదా...తీర్చేదా...ఈ ప్రాబ్లెం ఇంటింట ప్రతి ఇంటా వుండేదే. కాకపోతే మనింటో కాస్త ఎక్కువ!"
ఏమిటేమిటీ...చెప్పు చెప్పు.. ఇంట్రెస్టింగ వుంది!" ప్రసన్న ఆసక్తిగా ఆమెకేసి చూసింది.
!మీ నాన్న రిటైరై నాలుగేళ్ళు అయ్యిందా..ఏం లాభం! ఎన్నిసార్లు చెప్పి చూసాను.. ఏమన్నా విన్నారా...మారారా?"
నాన్నతో నీకు ఇబ్బంది ఎక్కడే?" అంది ఆయన ఒట్టి సాదాసీద మనిషి అని సర్టిఫై చేస్తూ.
" మీనాన్న యింట్లో ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టమంటే పెట్టనే పెట్టరు.. అన్నీ అస్తవ్యస్త చేస్తారు.పోణేఏ సాయంత్రమో, ఉదయాన్నో ఇల్లు సర్దుతారా అంటే - లేదే, వాకింగ్ అనో మీటింగ్ అనో తప్పించుకుపోతారు. ఆయన రిటైర్ అయ్యీ నాకేం ప్రయోజనం! పైగా స్నేహితులకు ఫోన్ చేసి మరీ పిలుస్తారు. వాళ్ళు రాగానే, ' ఏమేవ్,టిఫిన్లు చెయ్," అని ఆర్డర్లు. ఖర్చు పెరిగిపోతోంది మగడా అంటే పట్టించుకోరు. బజారుకెళ్ళి యింటి సామాన్లు నేనే తెచ్చుకోవాలి. బట్టలు ఉతకాలి. అంట్లు తోమాలి. వంటలు వండాలి. వేడి వేడిగా వండి పెట్టాలి. టీలు, కాఫీలు వేళకు ఇవ్వాలి. వచ్చిన ఫ్రెండ్సుకూ యివ్వాలి! అబ్బబ్బో...నేను చేయలేనమ్మా....నా వల్ల కాదు. మన ఏరియలో పని మనుషులూ దొరకరు. దొరికినా నాలుగు రోజులు పట్టుమని రారు." ష్!!" అంటూ కంటిన్యూ చేసింది తాయారు.
మీ నాన్నతో పాటూ నేనూ ఉద్యోగం చేసి రెండేళ్ళ క్రితం రిటైర్ అయ్యానా..నేనేం గానుగ ఎద్దును కాను. నేనూ మనిషినే! రిటైర్ అయిన మాగాడూ తీరి కూర్చుని యిది తే, అది తే, అంటాడు. చచ్చేదాకా చాకిరీ చేసే కాంట్రాక్ట్ అంటేనే పెళ్ళి ఆడదానికి. నాకీ పన్లోంచి రిటైర్మెంట్ అక్కర్లేదా చెప్పు లక్ష్మీ!!"
అమ్మ ఆవేశంలో అర్థం వుంది. తాయారు చెప్పుకుపోతొంది... " అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. నేను ఈ బంధం నుండి రిటైర్ అవుదామనుకొంటున్నాను. పెళ్ళి చేసుకొందామనుకొంటున్నాను. యాడ్ ఇచ్చిందీ అందుకే.!"ధీమాగా సూటిగా చెప్పేసింది తాయారమ్మ.ఇంకా..మగాడు పెళ్ళి చేసుకొనేది పెళ్ళాం చేత పన్లు చేయించుకోడనికేగా..యిక ఏ పనులూ చేసే పరిస్థితిలో నేను లేను. నాలోనూ ఓపిక సన్నగిల్లింది.. ఏం! మగాడికేనా పెళ్ళాం? ఈ వయసులో నాకూ పెళ్ళాం కావాలి. నన్ను చూసుకొంటూ యింటి పన్లు - వంట పన్లలో సహాయపడే అమ్మాయి కావాలి. నెలకు పదివేలు ఇస్తానని యాడ్ ఇచ్చా!!" అంది. విస్తుపోయి వింటోంది అమ్మ తెగువకి.
" అన్ని పనుల్లో నాకు చేదోడు వాదోడుగా వుండబోయే అమ్మయినే నా అర్థాంగి గా తలచుకొని 'నేను పెళ్ళాడుతున్నానని హాస్యమడానంతే!! అనేసరికి ఢాం అని పడిపోయిన పరమానందం- ప్రసన్న నీళ్ళు చల్లగా చల్లగా కాసేపటికి గానీ తేరుకోలేదు!!!