కోరిక తీరినట్టా..లేనట్టా.. - జి.ఎస్. లక్ష్మి

korika teerinattaa...lenattaa

రాంబాబుకి నాలుగురోజుల్లో పెళ్ళి. కాని రాంబాబుకి ఒక కోరిక మనసులో తొలిచేస్తోంది. అది పెళ్ళిలోనే తీర్చుకోవాలి. అదే యెలా తీర్చుకోవాలా అనే అతని బాధంతానూ. అది కూడా అంత కోరరానిదేవీ కానేకాదు.. చిన్నప్పట్నుంచీ అతనిలో యేమూలో దాగిన ఆ కోరిక పెళ్ళి దగ్గరపడుతున్నకొద్దీ మహావృక్షమైపోయింది.

అసలుసంగతేంటంటే.. రాంబాబుకి పదేళ్ళున్నప్పుడు అంటే ఇరవై సంవత్సరాలక్రితం అతని ఆఖరిపిన్ని సరస్వతి పెళ్ళైంది. ఆ పెళ్ళిలో మొట్టమొదటిసారి చూసేడు రాంబాబు పెళ్ళికొడుకు అలకపాన్పు యెక్కడం. యెక్కడం అంటే.. అక్కడో మంచం వేసి, దాని మీద దుప్పటి పరిచి సరస్వతి పిన్నిని పెళ్ళిచేసుకునే బాబాయ్ ని కూర్చోబెట్టేరు. అదికాదు రాంబాబు గమనించింది. ఆ తర్వాత జరిగిందే అతన్ని అబ్బురపర్చింది.

ముందు తాతగారు వచ్చి పెళ్ళికొడుకుని మిగిలిన పెళ్ళితంతు జరిపించడానికి రమ్మన్నారు. బాబాయ్ మాట్లాడలేదు.. ఊహు.. కాదు.. బాబాయ్ మాట్లాడబోతుంటే ఆయన అక్కగారు.. "మా తమ్ముడు అలిగాడండీ.." అంది. రాంబాబు తాతగారు "యేం కావాలయ్యా.."అంటే ఆ అక్కగారే "మీకు తెలీందేవుంది మావయ్యగారూ, మా తమ్ముడు ఆఫీసు కెళ్లడానికి ఓ స్కూటరుంటే బాగుంటుందనుకుంటున్నాడు.." అంటూ చల్లగా అనేసరికి, అప్పటికే అప్పు తెచ్చి కట్నమిచ్చిన తాతగారు యేం మాట్లాడకుండా అక్కణ్ణించి వచ్చేసేరు.

తర్వాత అమ్మమ్మ తమ్ముడొకాయన, పిల్లమేనమావనంటూ వెళ్ళి బేరాలు మొదలెట్టేడు. అన్నింటికీ ఆ అప్పగారు యేదో చెప్పడం, వెళ్ళినవాళ్ళు పెళ్ళికొడుకైన బాబాయ్ వైపు చూడడం, ఆయన మొహంలో యేభావాలూ కనిపించకుండా ముభావంగా వుండడం, పెళ్ళిలో ప్రతివాళ్ళూ "పెళ్ళికొడుకు అలకపాన్పు దిగేడా.." అనడుగుతుంటే "అబ్బే.. ఇంకా యేదీ.." అని జవాబులు చెప్పుకుంటుండడం చూసి పదేళ్ళ రాంబాబు పెళ్ళిలో అలకపాన్పు కున్న ప్రాముఖ్యతని చూసి ఆశ్చర్యపడిపోయేడు.

అలాగ పెళ్ళిలో పెద్దమనుషులందరూ ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి, పెళ్ళికొడుకుని ఒప్పించడానికి ప్రయత్నించడం, ఆఖరికి బాబాయ్ కి "ట్రాన్సిస్టర్ కొనిస్తా"నని తాతగారు చెప్పేక బాబాయ్ ఆ మంచం దిగి మిగిలిన పెళ్ళితంతు జరిపించడం చూసేడు.

అంతకన్నా యెక్కువగా యే యే పెళ్ళిళ్లలో యెవరెవరు అలకపాన్పుల మీద యేమేమి కావాలన్నారో అన్నీ కథలు కథలుగా విన్నాడు. అన్నింటికన్న యెక్కువగా పెళ్ళిలో పెళ్ళికొడుకు ప్రాముఖ్యం అంతా ఆ అలకపాన్పు యెక్కడం దగ్గరే వుందన్న నిశ్చితాభిప్రాయాని కొచ్చేసేడు రాంబాబు. యెందుకంటే ఒక్కొక్కరూ వచ్చి పెళ్ళికొడుకుని బ్రతిమాలడం, అతను బిగుసుకుపోయి కూర్చోడం, అతను కూర్చున్న తీరు, పలికించిన భావాలు, అన్న మాటలు రామకథలాగా ఒకరికొకరు చెప్పుకోడం ఇవన్నీ చూస్తుంటే పెళ్ళి చేసుకోవడమంటే అలకపాన్పు యెక్కి, అందరి దృష్టిలోనూ పడడమే అనేసుకున్నాడతను.

తర్వాత రాంబాబుకి పదిహేనేళ్ళున్నప్పుడు పెద్దమావయ్య పెద్దకొడుకు పెళ్ళైంది. అప్పుడతను కూడా అలకపాన్పు యెక్కుతాడు, చక్కగా చూడొచ్చు అనుకున్న రాంబాబు ఆశ నిరాశే అయ్యింది. యెందుకంటే అప్పటికే పెళ్ళిళ్ళలో పధ్ధతులు మారిపోయేయి. పాతకాలంలోలాగా, ఆ టైమ్ లో సీన్ చెయ్యకుండా అలకపాన్పు మీద యేమివ్వాలో అల్లుళ్ళు ముందే మావగారికి చెప్పి, ఆ సమయానికి యెటువంటి ఆర్భాటవూ లేకుండా కావల్సినవి పుచ్చేసుకుంటున్నారు. కాని యిదేవీ నచ్చలేదు రాంబాబుకి. అసలు పెళ్ళికొడుకనే గుర్తింపేదీ.. ఆ హడావిడేదీ.. అదే అడిగేడు పెద్దమావయ్యని. దానికి పెద్దమావయ్య గట్టిగా నవ్వేసి, "ఒరే.. నీ పెళ్ళి టైమ్ కి మళ్ళీ పధ్ధతులు మారిపోతాయి లేరా.. అప్పుడు నేనే నీ పెళ్ళికి అలకపాన్పు వేయించి, నీ పక్కనుంటా.." అని మాట కూడా ఇచ్చేసేడు.

కాని అదేంటో..అప్పట్నించీ రాంబాబు గమనిస్తూనే వున్నాడు.. పెళ్ళిలో పధ్ధతులు మారేయి.. నిజవే కానీ.. యెవరూ మళ్ళీ పాత పధ్ధతులవైపు వెళ్లలేదు. అంతా కొత్త కొత్తవే కలుపుకుంటూ పోతున్నారు తప్పితే పాతవాటి ఊసే యెత్తటంలేదు. ఆడపెళ్ళివారూ, మగపెళ్ళివారూ అందరూ కలిసిపోయి సరదాగా పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు తప్పితే అసలు పెళ్ళికొడుకంటే ఒక ప్రత్యేకత, ఆ సమయంలో అతని కివ్వవలసిన ప్రాముఖ్యత యేమీ పట్టించుకోవటంలేదు. తన పెళ్ళిలో కూడా తనకి ప్రాముఖ్యం లేనప్పుడు యింక ఆ పెళ్ళిలో విశేషమేవుంటుందీ.. ఇదీ ప్రస్తుతం రాంబాబు సమస్య. యే విధంగా చేసి పెళ్ళిలో తన ప్రత్యేకతని చూపెట్టుకోవాలో అతనికి అర్ధం కావటంలేదు.

రాంబాబు బుధ్ధిగా చదువుకున్నాడు, చక్కటి ఉద్యోగం చేస్తున్నాడు. యెంచక్కా అమ్మా, నాన్నా ఎన్నిక చేసిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నాడు. అమ్మాయి కుందనం బొమ్మలాగా వుంటుంది. సరిసమానమైన ఉద్యోగం కూడా చేస్తోంది. తల్లితండ్రులకి ఒక్కతే పిల్ల. యేం కావాలంటే అది అంతకు రెండింతలు చేస్తామంటున్నారు.

వీళ్ళు మూడు పూటలు పెళ్ళి చెయ్యమంటే వాళ్ళు మూడురోజులు చేస్తున్నారు. వీళ్ళు పూటకి మూడురకాల స్వీట్స్ చెయ్యమంటే వాళ్ళు ఆరు రకాలు చేస్తున్నారు. వీళ్ళు బంధువులందరికీ బట్టలు పెట్టాలంటే వాళ్ళు యేకంగా పట్టుబట్టలే పెడుతున్నారు. అలాకాకుండా తనని గుర్తించేలా వాళ్ళు టెన్షన్ పడేలా యేదైనా చెయ్యాలని రాంబాబు ఆలోచన. అలా టెన్షన్ పడితే తప్ప పెళ్ళికొడుకుకున్న విలువ తెలీదని రాంబాబుకి చిన్నప్పటి సంఘటనలు చెప్పినవాటి సారాంశం. కాని ఇప్పుడలా చెయ్యలేడే.. యెందుకంటే ఇప్పుడందరూ చదువుకున్నవాళ్ళూ, సంస్కారవంతులూనూ. అలాగ ఇంకొకర్ని ఇబ్బంది పెట్టడం సంస్కారం కాదని వారందరి అభిప్రాయం. రాంబాబు కూడా దాన్ని కాదనడు. కాని చిన్ని కోరిక. ఆ పెళ్ళి టైమ్ లో తన గురించి అందరూ టెన్షన్ పడాలి. పెళ్ళికొడుకుగా తన విలువని గుర్తించాలి.. ఇదీ అతని ఆశ.

అందుకే పెళ్ళి బొత్తిగా నాలుగురోజుల్లో కొచ్చేసరికి పెళ్ళివారి సంగతలావుంచి ముందు రాంబాబుకి టెన్షన్ పెరిగిపోయింది. తిండి తినడం తగ్గిపోయింది. పరాకు పెరిగిపోయింది. రాంబాబు వాళ్లమ్మ అనసూయ ఇది కనిపెట్టేసింది. "యేమైందిరా?" అనడిగింది. చెప్పడే.. "అబ్బే..ఆఫీస్ లో పనెక్కువగా వుందమ్మా.." అనేసేడు. "యేపనైనా యింక రెండ్రోజులే. తర్వాత యింక నువ్వు ఆఫీసుకి వెళ్లడానికి వీల్లేదు. గుర్తు పెట్టుకో.." అని హెచ్చరించి మామూలుగా షాపింగ్ పనిలో పడిపోయిందావిడ. అంతే.. ఫ్లేష్ లా వెలిగింది రాంబాబు బుర్రలో బ్రహ్మాండమైన ఆలోచన. వెంటనే పకడ్బందీగా ప్లాన్ వేసేసేడు. అన్నివైపుల్నించీ ఆలోచించి యెక్కడా లొసుగులు లేకుండా చేసుకున్నాడు. మూడో చెవికి వినిపిస్తే మూడోప్రపంచయుధ్ధం తధ్యమని తెలుసుకుని, పెదవి దాటకుండానే కాదు, చేతితో యెక్కడా రాయకుండా కూడా జాగ్రత్తపడి, మొత్తం ప్లానంతా బుర్రలోనే భద్రపరిచేసేడు.

ఆరాత్రి మగపెళ్ళివారు పెళ్ళికి తరలి వెళ్ళాలి. పెళ్ళివారిద్దరూ హైద్రాబాదులోనే వుండడంవల్ల, రాత్రికే ఫంక్షన్ హాల్ కి చేరుకుని, తెల్లారుతూనే పెళ్ళికొడుకుని చెయ్యడం, కాసేపటికి స్నాతకం, ఆవెంటనే పెళ్ళీ చేసుకుంటే బాగుంటుందనుకున్నారు. తీరా అందరూ కార్లెక్కే సమయానికి రాంబాబు ఫోన్ లో మాట్లాడుతూ అనసూయ దగ్గరికొచ్చి, "అమ్మా, నేనిప్పుడు అర్జంట్ గా ఆఫీస్ కి వెళ్ళాలి. నేను చెసిన దాంట్లో యేదో డౌట్ వచ్చిందిట .అది క్లియర్ చెయ్యకపోతే కంపెనీకి బోల్డు నష్టం. అందుకని మీరు వెళ్ళండి. నేను అఫీస్ కెళ్ళి అక్కణ్ణించి డైరెక్ట్ గా హాల్ కి వచ్చేస్తాను.." అన్నాడు. అనసూయ యేదో చెప్పబోయింది. ఈలోగా తండ్రి రంగనాథం వచ్చేడు. సంగతి విన్నాడు. "అలాగైతే యెలాగరా" అన్నాడు.

"యేం ఫరవాలేదు నాన్నా. యెంతా ఓ గంట పని అంతే. అదవగానే అక్కడే వుంటాడు కదా.. రవన్నయ్య. వాడూ, నేనూ కలిసి వచ్చేస్తాం." అన్నాడు. రవి రాంబాబుకి పెదనాన్న కొడుకు. హైటెక్ సిటీలో రాంబాబు పని చేసే ఆఫీస్ దగ్గరే వాళ్ళిల్లు. రవి భార్య స్వప్న బెంగుళూర్ లో పనిచేస్తోంది. రవి ఒక్కడే వుంటున్నాడు. అందుకని మర్నాడు పెళ్ళిటైమ్ కి వస్తానన్న రవిని కూడా రంగనాథం బలవంతపెట్టి రాత్రికే వచ్చేలా ఒప్పించేడు. తలమ్ముకున్నాక ఇలాంటివి తప్పవుకదా అనుకుంటూ, "సరే..వాడికి ఫోన్ చెయ్యి. తొందరగా వచ్చెయ్యండి.." అంటూ పెళ్ళివారందరూ ఫంక్షన్ హాలు చేరుకున్నారు.

"అబ్బాయి యేడండీ.." అని ఆడపెళ్ళివారు అడిగినదానికి, "వెనకాల వస్తున్నాడు" అని చెప్పేరు.

టేక్సీ పిలిపించుకుని ఊరి చివరి రిసార్ట్ వైపు వెడుతున్న రాంబాబు "హుర్రే" అనుకున్నాడు సంతోషం పట్టలేక. పెళ్ళికొడుకు అలకపాన్పు యెక్కకపోతేనేం కాసేపు ఆడపెళ్ళివారికి టెన్షన్ పెట్టి తన ప్రత్యేకతను చూపించుకుంటాడు అనుకున్నాడు. ఆడపెళ్ళివారితో పాటు అమ్మా, నాన్నా కూడా టెన్షన్ పడతారని గుర్తు రాగానే ఒక్క క్షణం రాంబాబు గుండె కలుక్కుమంది. మళ్ళి అంతలోనే ఆ యెంతసేపు? మహా అయితే ఓ గంట.. అంతే.. అనుకున్నాడు. అందరూ "రాంబాబు యేడీ.. వచ్చేడా.." అనుకుంటూ ఆతృతగా ఒకళ్లనొకళ్ళు అడుగుతుండడం గురించి ఆలోచిస్తుంటేనే అతనికి పరవశం వచ్చేస్తోంది. చిన్నప్పట్నుంచీ లోపల దాగున్న కోరిక తీరబోతున్నందుకు ఊహించుకుంటున్నకొద్దీ రాంబాబుకి వద్దనుకున్నా లోపలి సంతోషం పైకి తన్నుకొచ్చేస్తోంది.

ఆరాత్రికి రిసార్ట్ లో ఒక రూమ్ మొన్ననే బుక్ చేసుకున్నాడు. చేతిలో మొబైల్ లేకుండా, క్రెడిట్, డెబిట్ కార్డులు లేకుండా, కొన్నివేలు మటుకు జేబులో పెట్టుకుని రిసార్ట్ లో బుక్ చేసుకున్న రూమ్ లో దిగిపోయేడతను.

టైమ్ అవగానే డిన్నర్ తెచ్చేడు రూమ్ బాయ్. సయించీ సయించకుండానే యేదో తిన్నాననిపించేడు. అతని ఆలోచనంతా ఫంక్షన్ హాల్ లో వున్న మనుషుల మీదే వుంది. ఓ గంటలో రవన్నయ్య హాల్ కి వెడతాడు. పక్కనే తను కనపడకపోతే.. అప్పుడు మొదలౌతుంది చూడూ తమాషా..

కళ్ళు మూసుకుని యేం జరగబోతుందో ఊహించుకుంటున్నరాంబాబు కళ్ళముందు ఆ దృశ్యం అతి మనోహరంగా కనపడసాగింది.

బహుశా ఈపాటికే రవన్నయ్య హాల్ కి చేరుకునుంటాడు. పక్కన తను లేకపోయేసరికి నాన్న "వీడేడిరా?" అంటారు. రవన్నయ్యకి తెలీదుగా తను వాడి దగ్గరికొస్తున్నట్టు నాన్నకి చెప్పినట్టు. అందుకని "యెవరూ?" అంటాడు రవన్నయ్య. అంతా తెల్లబోతారు. యింకా తను వస్తానని, పన్నీరు, గంధం, పూలూ వున్న పళ్ళెం పట్టుకుని నిలబడ్డ కాబోయే అత్తగారి చెయ్యి పన్నీటిబుడ్డి తొణికిసలాడేలా వణుకుతుంది. జారిపోతున్న పై కండువాని సర్దుకుంటూ మావగారు "బావగారూ.." అంటూ నాన్న వైపు చూస్తారు. ఆఫీస్ నుంచి నీదగ్గరకే వస్తానన్నాడని నాన్నా, నాకసలు ఫోనూ లేదు, మనిషీ లేడని రవన్నయ్యా చెప్పుకుంటూ తన మొబైల్ కి చేస్తారు. అదెక్కడుందీ.. తనింట్లో తన రూమ్ లో మంచం మీద వుంది. ఇంట్లో యెవ్వరూ లేరు. మోగి మోగి ఆగిపోతుంది. యింక మొదలౌతుంది చూడూ అందరిలో ఖంగారూ.. "పెళ్ళికొడుకు యేడండే యేడంటూ.." ఒకరి కొకరు అర్ధం కాకుండా మాట్లాడేసుకుంటూ, అరిచేసుకుంటూ, యెవరిని అడగాలో, యేంచెయ్యాలో తోచక, తెగ హడావిడి పడిపోతూవుంటారు. మొబైల్ ఇంట్లో తన రూమ్ లో మంచం మీదే వదిలేసి వచ్చేడు. మొబైల్ లో కూడా పలకకపోతే వాళ్ళు యేం చేస్తారు? యెవరిని అడుగుతారు? యెంత ఖంగారు పడతారు? ఆడపెళ్ళివారి మొహాలెలా మార్తాయి? ముఖ్యంగా తనని పెళ్ళిచేసుకోబోయే లత యెంత ఖంగారుపడిపోతుంది. తను యే ఆపదలో చిక్కుకున్నాడో అనుకుని, తనని రక్షించమంటూ యెందరు దేవతలకు మొక్కుకుంటుంది..

ఆ దృశ్యాలు ఊహించుకుంటున్నకొద్దీ రాంబాబుకి టన్నులకొద్దీ సంతోషం వచ్చేస్తోంది. అనుకుంటున్నకొద్దీ కడుపులోంచి తెరలు తెరలుగా నవ్వు వచ్చేస్తోంది. ఇదేవిటీ.. నవ్వుతోపాటు యింకేదో వచ్చేస్తోందీ.. రాంబాబు ఖంగారుపడ్డాడు.. కడుపులో అంతా యేమిటో తిప్పేస్తున్నట్టుగా వుంది. అనుకుంటుండగానే కడుపులో తిప్పడం యెక్కువయ్యింది. కాసేపయ్యేటప్పటికి రెండుమూడు వాంతులయిపోయేయి. రూమ్ సర్వీస్ బాయ్ కోసం బెల్ కొట్టి, వాడు వచ్చేలోపలే స్పృహ తప్పి పడిపోయేడు. మేనేజ్ మెంట్ వాళ్లందరూ పరుగు పరుగున వచ్చేరు. డాక్టర్ ని పిలిపించేరు. డాక్టర్ వచ్చి తిన్న ఆహారం పడలేదనీ, వాంతులవడం మంచిదేననీ, కాసేపు విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుందనీ రాంబాబు మగతగా వుండగానే నిద్రకి ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళిపోయేడు.ఎవరికీ తన అసలు పేరు తెలీకూడదని అతని పేరు రిజిస్టర్ లో ఆనంద్ అని రాసాడు రాంబాబు. అడ్రస్, ఫోన్ నంబర్ కూడా తప్పుదే ఇచ్చేడు. అందులో వున్న నంబర్ కి ఫోన్ చేస్తే అసలా నంబరే పలకటం లేదు. ఇంక అక్కడివాళ్లకేం చెయ్యాలో తెలీక, ప్రమాదం లేదుకదా.. లేచేక ఆయనే చెపుతాడు అనుకున్నారు.

అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గరున్న రాంబాబు తండ్రి ఓ గంటాగి రాంబాబుకి ఫోన్ చేసేడు. కానీ అది ఇంట్లో మంచం మీదే వదిలెయ్యడంతో యెవరూ యెత్తటంలేదు. యింక యిలా లాభంలేదని ఆయన రవికి ఫోన్ చేసేడు. రవి మొబైల్ లో బాబాయ్ పేరు చూడగానే, వెంటనే యెత్తి, "ఇదిగో బాబాయ్ వచ్చేస్తున్నాం.." అన్నాడు. సరేననుకున్నారాయన. ఓ గంట చూసి మళ్ళీ చేసేరు. "ఇదిగో బయల్దేరుతున్నాం బాబాయ్.." అన్నాడు రవి. ఆయనకి ఆరాత్రివేళ ఆరోడ్ల మీద పిల్లలు రావడం మంచిది కాదనిపించి, "ఒరేయ్, ఇంకిప్పుడొద్దు కానీ తెల్లారగట్ల నాలుగ్గంటలకల్లా బయల్దేరండి. రాగానే వరసగా పెళ్ళికొడుకుని చెయ్యడం, స్నాతకం అయిపోతాయి." అన్నారు. "అలాగే బాబాయ్"అన్నాడు అట్నించి రవి. "ఒరేయ్.. మర్చిపోకుండా అలారం పెట్టుకుని పడుకోండి.." హెచ్చరించేరాయన పిల్లల్ని. తెల్లారగానే రవీ, రాంబాబూ వచ్చేస్తారనీ, ఈ లోపల ఓ కునుకు తియ్యమనీ పెళ్ళికొచ్చిన బంధువులందరికీ చెప్పేరాయన. అందరూ హాయిగా నిద్రకు పడ్డారు.

రిసార్ట్ లొ అలా మత్తుగా పడుకున్న రాంబాబుకి తెల్లవారకట్ల హఠాత్తుగా యెవరో కొట్టినట్టు మెలకువొచ్చింది. కాసేపు యెక్కడున్నాడో, యేంటో అర్ధంకాలేదు. నెమ్మదిగా ఒక్కొక్కటీ గుర్తు చేసుకుని ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు. టైమ్ చూస్తే నాలుగౌతోంది. బాయ్ ని పిలిస్తే రాత్రి జరిగిందంతా చెప్పేడు. హడావిడి పడిపోతూ టేక్సీ పిలవమని చెప్పి, యెక్కి కూర్చున్నాడు. ఆ టేక్సీ సిటీ లిమిట్స్ లో కొచ్చేక మఠం వేసి యింక కదలనని కూర్చుంది. జంక్షన్ దాకా నడిచి ఆటో యెక్కేడు. దానికేవయిందో టర్న్ తిరుగుతూ పక్కకి ఒరిగిపోయింది. పాపం రాంబాబుకి, కాబోయే పెళ్ళికొడుక్కి రోడ్డు పక్క రాళ్ళు కొట్టుకుని మోచేతులు, మోకాళ్ళూ చెక్కుకుపోయేయి. తెలుగు సినిమాలో క్లిమాక్స్ లో హీరో లాగ కాళ్ళు, చేతులూ కూడదీసుకుంటూ, పడుతూ, అటుగా వస్తున్న ప్రతి వాహనాన్నీ ఆపడానికి చేతులు అడ్డంగా ఊపేస్తూ తెగ హైరాణా పడిపోయేడు రాంబాబు. అలాంటి అవస్థలోవున్న రాంబాబు పక్కన ఒక కారు ఆగింది. యెవరా అని చూస్తే రవన్నయ్య, స్వప్నవదిన వున్నారందులో.

"ఒరే రాంబాబూ.. నువ్వేవిట్రా యిక్కడా.. యేవయ్యిందీ..?" ఆతృతగా అడిగేడు రవి. ప్రాణం లేచొచ్చింది రాంబాబుకి. "అవన్నీ తర్వాత చెప్తాను. ముందు నడు" అంటూ కారు యెక్కి కూర్చుని, "అవునూ.. నువ్వు నిన్న రాత్రికే రావాలికదా.. ఇప్పుడు వస్తున్నావేం?" అని అడిగేడు. "అదికాదురా.. అనుకోకుండా మీ వదిన బెంగుళూరు నుంచి వస్తున్నానని ఫోన్ చేసింది. ఇప్పుడే బస్ దిగింది. బస్ స్టేండ్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నాం. బాబాయ్ ఫోన్ చేస్తే కూడా అదే వచ్చేస్తున్నావనే చెప్పేను. బాబాయ్ కూడా అదే అన్నాడు. చీకట్లో రావద్దూ, తెల్లారేక రమ్మన్నాడు. ఒక్కసారే పెళ్ళికొడుకుని చెయ్యడం అన్నీ అయిపోతాయన్నాడు. మరి యిదేవిట్రా.. నువ్విక్కడ రోడ్డు మీద యిలా వున్నావేంటీ..? " అన్నాడు రవి. రాంబాబుకి అర్ధమైంది. రాత్రి రవి ఫంక్షన్ హాల్ కి వెళ్ళలేదు. తను రవి దగ్గర వున్నాడనే పెళ్ళింట్లో అందరూ అనుకుంటున్నారు. వదినతో కలిసి వస్తాం అని రవన్నయ్య చెప్పడం వల్ల వాళ్ళందరూ తనతో కలిసి రవన్నయ్య వస్తున్నట్టు అనుకున్నారు. అంటే పెళ్ళింట్లో యెవరూ రాత్రి తన గురించి టెన్షన్ పడలేదు. యెక్కడలేని నిస్త్రాణ వచ్చేసింది రాంబాబుకి. అయిపోయింది. అంతా అయిపోయింది. తన కోరిక.. చిన్న కోరిక. చిన్ననాటినుంచీ పెంచుకొస్తున్న కోరిక.. ఆఖరికిలా నీరుగారిపోయింది...అనుకుంటూ దగ్గరౌతున్న ఫంక్షన్ హాల్ ని చూస్తూ నీరసంతో తల వాల్చేసేడు..

ఖంగారుపడిపోయేడు రవి. కారాపగానే యెదురుగా నిలబడ్దవారందరితోనూ "తప్పుకోండి.. తప్పుకోం"డంటూ రాంబాబుని చేతుల మీద తీసుకొచ్చి అక్కడి సోఫాలో పడుకోబెట్టేడు. అందరూ "యేమైందేమైం"దంటూ ఖంగారుపడిపోయేరు. డాక్టర్లైన బంధువులు గబగబా ముందుకొచ్చి పల్సూ గట్రా చూసేరు. రంగనాథంగారు నిశ్చేష్టులై నిలబడిపోయేరు. అనసూయ హడావిడిపడిపోయింది. కాబోయే అత్తగారూ, మావగారూ కాళ్ళుచేతులూ ఆడక శిలాప్రతిమలైపోయేరు. పెళ్ళికూతురు రూమ్ లోంచి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. కొందరు చల్లటి మంచినీళ్ళు అందిస్తే, ఇంకొందరు వేడి వేడి హార్లిక్స్ తెచ్చేరు. మరికొందరు తాజాగా పళ్లరసం తీయించుకొచ్చేరు. కాస్త తెప్పరిల్లిన రాంబాబు నెమ్మదిగా కళ్ళు తెరిచేటప్పటికి అందరూ తనవైపే యెంతో ఆతృతగా చూస్తుండడం కనిపించింది. అంతే.. అతను ఒక్కసారిగా "హుర్రే.." అని అరిచేసేడు.

***

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ