డి టెక్టివ్ అనుమాన్లు ఆవేశంతో కుతకుతా ఉడికిపోతున్నాడు. తన వృత్తికే అవమానం జరిగినట్టు కుప్పిగంతులేస్తున్నాడు. కారణం .....??? అతని ఆఫీసుకి కూతవేటు దూరంలో ప్రముఖ రాజకీయ నాయకుడు జంబులింగాన్ని చంపడానికి అతివాదులు పెట్టిన గంప బాంబు పేలడమే.
నాలుగు ఊరపందులు, అరడజను దాక మేకలు, ఓ పదికోళ్ళు అక్కడికక్కడే మటాష్ అయిపోయాయి. అయితే అవి కూర్మాగా వండుకు తినడానికి కూడా పనికి రాకుండా రోడ్డుమీద అంతకుముందే అక్కడినుంచి ఎర్రదుమ్ము రేపుకుంటూ వెళ్ళిన గేదెల మంద వేసిన పేడ కళ్లెలతో కలిసిపోయి ఆ ప్రాంతమంతా భీభత్సంగా మారిపోయింది. ఎప్పుడూ అదే ప్రాంతంలో ఆ మధ్యాన్నం సమయానికే శంభరాజు తోపుడు బండి మీద వేసే మిర్చి బజ్జీలు లొట్టలేసుకొని తినడానికి వెళ్తుంటాడు అనుమాన్లు.
అయితే ఆ రోజు పొద్దున్న...దమ్మిడీ సంపాదన లేకపోయినా ఆదివారాలూ కూడా అఫీసంటూ మొగుడు చేస్తున్న హడావుడికి చిరాకెత్తిన పెళ్ళాం విసుక్కుంటూ చేసిన పెసరట్టు ఉప్మా తినడంతో పట్టుకున్న కడుపుబ్బరం వల్ల ఆ పూట తన పొట్టకు కాస్తంత విశ్రాంతి ఇద్దామని ఆఫీసులోనే కునికిపాట్లు పడుతుండడంతో ప్రాణాలతో బ్రతికి బయటపడినందుకు మొదట్లో సంబరపడ్డాడు.
కాని తర్వాత నాయకుడు జంబులింగం పత్రికా సమావేశం పెట్టి మరీ పోలీసులు, ఇంకా నగర ప్రజల అవగాహనా రాహిత్యానికి కస్సుబుస్సులాడడంతో అంతా కంగుతిన్నారు. ఇంతలో అతని సెక్రటరీ కాబోలు జారిపోతున్న పొట్టమీది బెల్టు సర్దుకుంటూ ఉరుక్కుంటూ వచ్చి చెవి కొరికాడు.
'అయ్యా.. మీ సమావేశాన్ని పత్రికలే కాదు, టీవీ ఛానెళ్ళు కూడా కవర్ చేస్తున్నాయని మర్చిపోయారు కాబోలు. మీ ముఖ కవళికలు అందరికీ కనిపించేస్తున్నాయి. అసలే ఎలక్షన్లు దగ్గరకొస్తున్నాయి. ప్రజలకు కోపం వచ్చే రీతిలో మీరిలా మాట్లాడితే ఇంట్లోవాళ్ళు కూడా వోటేయ్యరు. ప్రజల ప్రాణాల గురించి మీరు బాధపడుతున్నట్టు బాగా నటించండి.'
చెవి మీద అంటిన సెక్రటరీ నోటి తుంపరల తాలూకు తడిని జంబులింగం సెక్రటరీ కర్చీఫ్ తోనే తుడుచుకొని తర్వాత టీవీ కెమెరాకందకుండ నాలిక్కరుచుకున్నాడు.
'ఈరోజు నామీద హత్యా ప్రయత్నమైనది. రేపు నా ప్రియమైన ప్రజలైన మీ అందరిమీద కూడా ఇలాగే విద్రోహులు బాంబులు ప్రయోగిస్తే ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో తలచుకుంటేనే నాకు వణుకు వస్తోంది' అంటూ సర్దుకున్నాడు.
ఆ వెంటనే పోలీసు కొత్వాల్ కూడా లేచి ఇంకా నగరంలో ఎక్కడయినా జనసమ్మర్ద ప్రదేశాల్లో విద్రోహులు బాంబులు పెట్టే ప్రమాదం లేకపోలేదని.. అలా వాళ్ళు ఎక్కడపడితే అక్కడ బాంబు పెట్టకుండా ప్రజల్లో ప్రతి ఒక్కరూ డిటెక్టివ్ అవతారం ఎత్తి ఎలాంటి మెళకువలు పాటించాలో అనుమానితులను ఎలా పట్టించాలో కొన్ని సూచనలిచ్చాడు. అంతేకాదు, ఈ బాంబు నిందుతులను పట్టిచ్చిన వాళ్ళకు రెండు లక్షల రివార్డ్ కూడా ప్రకటించాడు.
టీవీలు చూసిన ఆపోజిషన్ వాళ్ళు పెదవి చప్పరించేశారు .
"ఆ ఏముంది? ఏ దీపావళి బాంబునో తన వాళ్ళ చేతే పేల్పించి సానుభూతి ఓట్లతో రాబోయే ఎన్నికల్లో గెలిచేద్దామని ప్లాను వేసి ఉంటాడు. జంబుకం లాంటి జంబులింగం. కాకపోతే ఇతగాడి బదులు కోళ్ళు, మేకలు, పందులు చావడం ఏంటి?"
అందరినీ డిటెక్టివ్ అవతారాలెత్తమని తన పొట్ట కొట్టేందుకు ప్రయత్నిస్తున్న కొత్వాలు మీద పళ్ళు నూరుకున్నా, డిటెక్టివ్ అనుమాన్లు మాత్రం దాన్ని సవాలుగా తీసుకున్నాడు. అందుకు పెద్ద కారణం వుంది. అతగాడు ఆ పరిసరాల్లోనే డిటెక్టివ్ బోర్డ్ పెట్టి ఏడాదయ్యింది. మొదట్లో ఏవో చిన్నా చితకా కేసులు వచ్చాయి. అన్నీ దిక్కుమాలిన కేసులే... చేసుకున్న రెండో పెళ్ళాం మీద అనుమానంతో ముసలి మొగుడు నిఘా పెట్టమన్నవి....
పెద్ద ప్లేటులో నేతిలో ఎర్రగా వేయించిన అరకిలో జీడిపప్పులు బాదం పిస్తాలు, జంతికలు, పకోడీలు, నేతి లడ్డూలు, పిజ్జాలు లాగించేస్తూ ఏళ్ళతరబడి సాగుతున్న టీవీ సీరియళ్ళు చూడడం వల్ల నడుం చుట్టు కొలతలు అనూహ్యంగా పెరిగిపోయిన పెద్ద కుటుంబాల ఇల్లాళ్ళు తమ మొగుడుగారు బంగారు తీగల్లాంటి అమ్మాయిలతో సెకండ్ సెటప్పులు పెట్టారేమోనన్న అనుమానంతో పెట్టమన్న నిఘా కేసులు వచ్చాయి.
అయితే, అనుమాన్లు వాటిని ఛేదించడానికి వెళ్ళి తన్నులు తిని కన్ను లొట్టబోయి నెల్లాళ్ళపాటు గాయాలు మానేదాక మంచం మీదే గోళ్ళు కొరుక్కుంటూ కూర్చోవలసి వచ్చింది. కాస్త తేరుకుని మళ్ళీ అఫీసులో అడుగు పెట్టిన రెండు రోజులు గడవక మునుపే ఇదిగో, ఈ బాంబు పేలింది. పైగా రాజకీయ నాయకుడు, పోలీసులు కూడా ప్రజలనందరినీ డిటెక్టివ్ లయి పొమ్మంటుంటే కూడా వీరావేశమొచ్చింది అనుమాన్లుకు
అందరూ డిటెక్టివ్ ల అవతారాలెత్తేస్తే తన నోటి దగ్గర మట్టే. కాబట్టి తనే ఊరంతా గాలించి అయినా బాంబులను పెట్టేవాళ్ళను కనిపెట్టాడంటే ఒకే దెబ్బకి రెండు పిట్టలు. రెండు లక్షల రివార్డు దక్కుతుంది. తన పేరు మారుమ్రోగిపోయి జీవితాంతం తన వృత్తికి ఢోకా ఉండదు. అందుకే కాగితం మీద కొత్వాలు సూచనలన్నీ జాగ్రత్తగా రాసుకుని జేబులో పెట్టుకుని నిందితుల వేటకు బయల్దేరాడు అనుమాన్లు.
************************
పదే పదే ఎవరైన వ్యక్తులు ఒకే ప్రదేశంలో తచ్చాడుతూ తిరిగితే, అనుమానించాల్సిందేనని కొత్వాలు చేసిన మొదటి సూచనని మర్నాడే అమలులో పెట్టాల్సి వచ్చింది డిటెక్టివ్ అనుమాన్లుకి. ఎందుకంటే నలభైయేళ్ళ ఒకామె కుచ్చిళ్ళ మాటున ఏదో పెద్ద ఎర్ర ప్లాస్టిక్ సంచీని పెట్టుకుని పదేపదే వీధి చివరి వరకూ వచ్చి అటూ ఇటూ చూసి వెనక్కి వెళ్ళిపోతోంది.
ఆ ప్లాస్టిక్ సంచీలో ఏముందో.? ఆవిడ వాలకం చూసి అనుమానం వచ్చేసింది అనుమాన్లుకి. ఎందుకంటే ఆ వీధి చివరనే పెద్ద సినిమా హాలు ఉంది. ఆ రోజే కొత్త సినిమా రిలీజయింది కూడా. జనం బయటకి వచ్చే సమయానికి గనక బాంబు సెట్ చేస్తే అపార ప్రాణ నష్టం ఖాయం.. అనుమాన్లు ఆలస్యం చెయ్యదల్చుకోలేదు...
వెంటనే తన అఫీసులో దూరి ముష్టివాడి గెటప్ లో వెనక గుమ్మం గుండా బయటకి వచ్చాడు. అటూ ఇటూ జాగ్రత్తగా చూసుకుని వీధి చివర సిమెంటు గట్టు మీద మాటు వేసాడు. ఈసారి ఆవిడ గారు అనుమాన్లుని గమనించలేదు కాబోలు గబగబా ముందుకొచ్చేసింది.
'అమ్మా ధర్మం" అదాటున వినపడ్డ గొంతుకు ఉలిక్కి పడబోయింది.
"ముష్టి వెధవలకి వేళా పాళా లేకుండాపోయింది. ఛీ పో" అని గట్టిగా కసిరి చటుక్కున అనుమాన్లు పట్టుకుని వారించేలోగానే కుచ్చుళ్ళ మాటున దాచిన ఎర్ర ప్లాస్టిక్ సంచీని అక్కడే పారేసి దర్జాగా వీధి మొదట్లోని తన ఇంట్లోకి వెళ్ళిపోయింది.
డిటెక్టివ్ అనుమాన్లకి ముచ్చెమటలు పోసేస్తున్నాయి. తనని ముష్టి వాడనుకుని లెక్కలేకుండా ఎంత దర్జాగా బాంబుని అక్కడ పడేసి పోయింది. మరి ఆలస్యం చెయ్యకుండా పంచె రొంపికి చుట్టుకున్న సెల్ లోంచి పోలీసులకి సమాచారమందించేసాడు అనుమాన్లు...
రెండు లక్షల రివార్డు ఇంత ఈజీగా నడచి ఇవాళే వచ్చేస్తుందనుకోలేదు. పొద్దుటే లేచి అద్దంలో తన మొహమే చూసుకోవడం ఎంత మంచిదయింది?
అదృష్టవశాత్తూ రోడ్డుమీద జనం లేరు. ఉన్నవాళ్ళంత అమాయకంగా లోపల సినిమా చూస్తూ హీరో, హీరోయిన్ల స్టెప్పులకి, మెలికల డాన్సులకి ఈలలు వేస్తూ ఉండి ఉంటారు. పోలీసులు వచ్చి చకచకా చుట్టుపక్కల చూస్తుంటే తనే వాళ్ళ దగ్గరకెళ్ళి బాంబు పెట్టిన ఎర్ర సంచీని చూపించాడు. బాంబు పెట్టిన ఆమె అక్కడనుంచి ఈపాటికి పరారయి ఉంటుందని తెలిసినా అమె వెళ్ళిన ఇల్లు కూడా చూపించాడు.
వెంటనే బాంబు స్క్వాడ్ వచ్చేసింది. వాళ్ళతో వచ్చిన కుక్కలు ఎర్ర ప్లాస్టిక్ సంచీ దగ్గరకు వెళ్ళి చెంగున ఒక్క గెంతు గెంతి దూరంగా పారిపోయాయి. అంతా అలర్ట్ అయ్యారు. అనుమాన్లు ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు.
ఇద్దరు బాంబు స్క్వాడ్ వాళ్ళు ప్లాస్టిక్ సంచీ దగ్గరకెళ్ళి తలతిరిగి పడిపోబోతుంటే తటాలున వెనక్కి లాగేసారు తక్కిన వాళ్ళు. అనుమాన్ల గుండె వేగంగా కొట్టుకోవడం ఎక్కువైంది.
ఎంతకీ ఏ బాంబూ పేలింది కాదు. ఆ టెన్షన్ తట్టుకోలేని అతగాడు కళ్ళు తిరిగి పడిపోయాడు. మెలకువ వచ్చేసరికి పోలీసు స్టేషన్లో నలుగురు పోలీసులు బూటు కాలితో తంతున్నారు.
"నీయవ్వ.. వేళాకోళానికి పోలీసులే దొరికారా నీకు? అడుక్కునేవాడివి అడుక్కు తినక ఇంత హంగామా చేస్తావా? ఆ ఎర్ర సంచీలో ఏముందో తెలుసా నీకు?"
"బాంబు కాదా"
భోజనం లేకపోవడమే కాకుండా తన్నులూ తగిలేసరికి నీరసంగా గొణిగాడు అనుమాన్లు.
"బాంబా నీ తలకాయా? ఆవిడెవరో వారం క్రితం ఊరెళ్ళే హడావుడిలో మినప్పిండిని కిచెన్ లోనే ఉంచేసి వెళ్ళిపోయిందిట. ఇవాళ ఊరునుంచి వచ్చాక ముక్కులు పగిలిపోతున్న కంపు భరించలేక తన ఇంటి ముందు పారబోస్తే వీధిలో వాళ్ళంతా తిట్టిపోస్తారని ఎవరూ చూడకుండా వీధి చివర రహస్యంగా పారబోసే ప్రయత్నం చేస్తుంటే నీకు కనిపించింది. నువ్వేమో పెద్ద పోటుగాడిలా లక్షలు కొట్టేద్దామని బాంబు ఉందని మాకు ఫోన్ చేస్తావా?
"కుక్కలు కూడా ఆ కంపు భరించలేక పారిపోయినా గమనించుకోలేని పిచ్చి మొహాలం మేము ఆ సంచీ విప్పి ఆ దుర్వాసనకి వాంతులయి ఆసుపత్రిలో సెలైన్లు కూడా పెట్టించుకోవలసి వచ్చింది తెలుసా ?"
"పోరా పో.. నీమాట పట్టుకుని ఆవిడ ఇంటికి కూడా వెళ్ళి అరెస్టు అని ఉంటే మామీద పరువునష్టం దావా వేసేది ఆవిడగారు. ముష్టాడివని ఈసారికి క్షమించి వదిలేస్తున్నం పో..." మళ్ళీ తన్నారు వాళ్ళు. ఆ దెబ్బకి పెట్టుడు గడ్డం ఊడిపోయింది. డిటెక్టివ్ అనుమాన్లుకి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలిసింది కాదు.
'నిజం చెప్పు, నువ్వెవరు? ఇలా మారు వేషం వేసి పోలీసులను తప్పుదోవ పట్టిస్తావా?' కుళ్ళబొడిచేసారు పోలీసులు.
"చివరకు వాళ్ళకే జాలేసి ఎవడో పిచ్చివాడులే అని ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి వేషాలు వెయ్యకు. వెళ్ళు" అన్నారు.
తను డిటెక్టివ్ నని చెప్పుకుంటే మరింత అవమానం అని ఆలోచించి మౌన ముద్రతోనే ఆ ముష్టి వేషంతోనే ఆఫీస్ బయలుదేరాడు నీరసంగా.
******************************
డిటెక్టివ్ అనుమాన్లు 'ఆరంభింపరు నీచ మానవులు" పద్యాన్ని చిన్నప్పుడే ఔపోసన పట్టినవాడు కావడంతో ఒక్క ప్రయత్నం విఫలమయినంత మాత్రాన కార్యాన్ని వదిలిపెట్టే వాడు కాదు. అందుకే కొత్వాలుగారి రెండో సూచన గుర్తు చేసుకున్నాడు. మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టాడు.
సాధారణంగా బాంబులు పెట్టేవాళ్ళు సాయంత్రం వేళల్లో జనసమ్మర్ధమున్న ప్రాంతాలనే ఎంచుకుంటారు అనేది ఆ సూచన. కాబట్టి ఆ ఊళ్ళో అలాంటి ప్రాంతం నగరం నడిబొడ్డులో ఉన్న పార్కు అని తనలో తనే అంచనా వేసుకున్నాడు డిటెక్టివ్ అనుమాన్లు. ఆపరేషన్ బ్లాస్ట్ కంట్రోల్ లో భాగంగా తనని ఎవరూ గుర్తించకుండా నల్లని బురఖా వేసుకున్నాడు. రెండు ప్రయోజనాలు.. ఒకటి.. తనని అమ్మాయి అనుకుని విద్రోహులు పెద్దగా పట్టించుకోరు. రెండు.. బురఖాలోంచి తను ప్రతి ఒక్కరినీ పరిశీలించే అవకాశముంటుంది.
అప్పటికే యువ, వృద్ధ జంటలతో కిటకిటలాడుతున్న ఆ పార్కులో ప్రవేశించి అక్కడున్న వాళ్ళందరినీ అనుమానదృక్కులతో
పరిశీలించడం మొదలుపెట్టాడు అనుమాన్లు. అక్కడి గార్డులు కూడా అప్రమత్తంగానే ఉన్నారేమో పార్కుకున్న రెండు గేట్ల దగ్గరా నిలబడి పార్కులోకెళ్తున్న వాళ్ళదగ్గర మారణాయుధాలున్నాయేమో పరిశీలించే లోపలికి వదులుతున్నారు. అయితే విద్రోహులకు ఇదొక లెక్క కాదని, అనుమాన్లు మనసు అక్కడేదో ఘటన జరగబోతోందని అప్పుడే సూచనలిచ్చేయడం మొదలెట్టింది.
పార్కులో ఓ యువకుడు వాటర్ స్ప్రింగ్ దగ్గర కూర్చుని తన స్నేహితుల కోసం ఎదురుచూడడం అనుమాన్లు కంటబడింది. పార్కు అంతా వీరావేశంతో కాలుగాలిన పిల్లిలా తచ్చాడుతున్న అనుమాన్లు కంట దానితోబాటు మరో దృశ్యం కూడా పడింది. ముగ్గురు యువకులు ఓ బురఖా వేసుకున్న అమ్మాయితో జోకులు వేస్తూ గేటులోంచి లోపలికొచ్చి దూరంగా ఉన్న ఆ యువకుడిని చూపించారు. వాళ్ళు ఆ అమ్మాయి చేతికి ఒక గుడ్డ మూటనివ్వడం ఏవో సూచనలివ్వడం చూసిన అనుమాన్లుకు ఒక్కసారిగా గుండె దడదడలాడింది. అది తప్పకుండా బాంబే అయి ఉంటుంది.
అనుమాన్ల ఆలోచన పూర్తి కాకుండానే ఇంతలో ఆ బురఖాలోని అమ్మాయి పకాపకా నవ్వింది. 'అదంతా నేను చూసుకుంటాగా' అనడం....
ఆ యువకునివైపు వెళ్ళడం చూసేసాడు అనుమాన్లు. పార్కులో ఉన్న అన్ని వందల మందిని బాంబు బారి నుంచి కాపాడే బాధ్యత ఒక భారత పౌరునిగా తన భుజ స్కంధాల మీద ఉందని ఉప్పొంగిపోయాడు అనుమాన్లు. తనూ బురఖాలో ఉన్నాడు కనుక అనుమానించదులే అని ఆమెను దగ్గరగా అనుసరించాడు. అ యువకునికి దగ్గరగా చేరుకుంటూనే ఆ అమ్మాయి అ కను చీకటిలో మూటలోంచి ఏదో తీసి అతని మీదకు విసిరింది.
ఆ యువకుడు ఆమెవంక చూసి సిగ్గుపడుతూ నవ్వాడు. మళ్ళీ ఆమె కూడా పకాపకా నవ్వింది. 'ఐ లవ్ యూ' అంటూ మూటలోంచి మళ్ళీ ఏదో తీసి విసిరింది. దూరం నుంచి ఇదంతా చూస్తున్న ముగ్గురు యువకులు చప్పట్లు కొట్టారు.
అనుమాన్లకు ఈ చప్పట్లు..నవ్వులు..ఈ ఐ లవ్ యు పదాలూ ఇదంతా తప్పకుండా విద్రోహుల కోడ్ అయి ఉంటుంది అనిపించింది.
ఇంకోసారి ఆ యువతి మూటలోంచి విసిరేది తప్పకుండా బాంబే అయి ఉంటుందీ. అనుమానం గట్టిగా కుదిపేసింది అనుమాన్లని. పోలీసు కొత్వాలు అనుమానితులెదురైతే తమకు సమాచారమందించాల్సిందని టివిలో చెప్పిన నంబరును గుర్తు చేసుకుని సెల్ లోంచి త్వరగా మెసేజ్ ఇచ్చేసాడు.
ఈలోగా పార్కులోని అంతమంది జనం హతమారిపోకుండా తన ప్రయత్నం తాను చెయ్యాలని తటాలున ఆ యువతి మీదకురికి గట్టిగా పట్టుకున్నాడు. ఆమె అదిరిపోయింది. 'బచావ్ బచావ్' అంటూ కేకలు వెయ్యడంతో దూరంగా ఉన్న యువకులు ముందుకురికారు. అప్పటి దాకా ఆమెను కళ్ళతోనే తినేసేలా చూస్తున్న యువకుడు కూడా ముందుకొచ్చేసాడు. అతని మీదపడి అంతా కలసి అనుమాన్లుని కుమ్మేసారు.
పార్కులో జనం ఈ కేకలు కుమ్ములాటని చూసి అక్కడకు పరిగెత్తుకొచ్చారు. 'నన్ను వదలండి ఇక్కడకు పోలీసులొస్తే మీ కుట్ర బయటపడుతుందిలెండీ' అరిచాడు అనుమాన్లు వాళ్ళను వదిలించుకోడానికి గింజుకుంటూ. పోలీసుల పేరు వినేసరికి నలుగురు యువకులు ఉలిక్కిపడి అక్కడ్నుంచి జారిపోవాలని చూసారు. అయితే అక్కడున్న జనం ఆ నలుగురితో బాటు అనుమాన్లును కూడా పట్టుకున్నారు.
'నీ గొంతు మగాడిలా ఉందేమిటి? ముందు నువ్వెవరో చెప్పూ' అనుమాన్ల బురఖా లాగేసిన జనం తెల్లబోయారు.
'అమ్మో మగాడు..బురఖా వేసుకుని ఇక్కడ ఏం చేస్తున్నాడు..అనుమానించాల్సిం
'ప్రజలారా! ఆమె చేతిలో బాంబు ఉంది. జాగ్రత్తగా అంతా దూరంగా పారిపోండి..' అరుస్తూనే మళ్ళీ ఆ బురఖా యువతిని పట్టుకున్నాడు. తటాలున ఆమె చేతిలో మూటను లాక్కున్నాడే గానీ భయంతో వణికిపోసాగాడు. ఎందుకంటే ఎంత టైముకు సెట్ చేసారో తెలియదాయె.
ఆ బాంబు గాని తన చేతిలో పేలిందంటె తనతో బాటు అక్కడున్న వాళ్ళంతా ఖతం అయిపోతారు.
'ముందు ఆ బురఖా అమ్మాయి పారిపోకుండా పట్టుకోండి..ఈ బాంబుని కనిపెట్టింది నేను.. రెండు లక్షలు నాకే వస్తుంది.." అని ఒళ్ళు హూనమయిన నొప్పితో అనుమాన్లు కీచుగా అరుస్తూండగానే పోలీసులు నలువైపుల నుండీ చుట్టుముట్టారు. జనం బాంబు భయంతో కకావికలై పారిపోయారు.బాంబుస్క్వాడ్ వాళ్ళు గుడ్డ మూటను స్వాధీనం చేసుకున్నారు.ఆ మూట విసిరిన అమ్మాయి కూడా బురఖా తీసేసింది. అనుమాన్లతో సహా జనం కూడా తెల్లబోయారు. అందులో ఉన్నది కూడా అబ్బాయే. అందరినీ పిడిగుద్దులు గుద్దుతూ పోలీసులు లాక్కుపోయారు.
******************
ఆ అయిదుగురు యువకుల స్టేట్మెంట్లూ విన్న ఇన్స్పెక్టర్ తో సహా అక్కడున్న పోలీసులంతా కడుపు పట్టుకుని నవ్వారు. 'మా మాటలు నమ్మండి సార్. మేము అయిదుగురమూ స్నేహితులం. ఇదిగో వీడి పేరు శ్రీకాంత్... వీడికి పెళ్ళి కుదిరింది. వీడిని ఆట పట్టించాలని మిమిక్రీ చేసే ఇదిగో ఈ ప్రతీక్ అనే కుర్రాడికి బురఖా వేసాం. గులాబీలు విసిరి అమ్మాయిలాగా శ్రీకాంత్ ను ఆట పట్టించమని పంపి బుట్టలో పడతాడో లేదో చూద్దామని దూరం నుంచి గమనిస్తున్నాం'
'నిజమండీ..నేను నిజంగానే ఓ అందమైన అమ్మాయి ఎవరో ఆ కనుచీకట్లో నామీద గులాబీలు విసురుతూ ఐ లవ్ యూ చెప్తోందని మురిసిపోయి సిగ్గు పడుతున్నాను'
మేమంతా చప్పట్లు కొడుతూ దగ్గరకొచ్చేలోగా ఈయనెవరో మా ప్రతీక్ మీద పడి గులాబీల మూట లాక్కుని బాంబూ అంటూ హంగామా సృష్టించాడు.
నవ్వి నవ్వి అలసిపోయిన ఆ ఇన్స్పెక్టర్ అంతలోనే డిటెక్టివ్ అనుమాన్ల వైపు తిరిగి సీరియస్ గా మొహం పెట్టి అన్నాడు. 'మీలాంటి డిటెక్టివ్ లు కూడా ఇలా చేస్తే ఎలా చెప్పండి. నిజానికి మీరు ఫోన్ చేసిన వెంటనే కుక్కలతో వచ్చిన బాంబ్ స్క్వాడ్ కి ..ఆ కుక్కలు పార్కులోకి రాకపోవడం చూసి అక్కడ బాంబులేవీ లేవని అప్పుడే తెలిసిపోయింది. అయినా ఎందుకైనా మంచిదని పరిశీలించేందుకు మీరిచ్చిన మూట విప్పి దాని నిండా ఎర్ర గులాబీలు ఉండడం చూసి అంతా విస్తుపోయారు. మీరు చేసిన హంగామాకి కొంతమంది జనం భయంతో పరుగెత్తి దెబ్బలు తగిలించుకుని ఆసుపత్రి పాలయ్యారు. కొందరు కేసులు కూడా పెట్టారు. తెలుసా? నిజానికి ఇప్పుడు మేం మీమీద న్యూసెన్సు కేసు పెట్టొచ్చు..'
డిటెక్టివ్ అనుమాన్లు ఖంగుతిని అతగాడు ఏ కేసూ పెట్టకుండా గంటసేపు బతిమాలి, చివరికి తనే డబ్బులు సమర్పించుకున్నాడు. రెండు లక్షల రివార్డు కూడా తప్పిపోవడమేనా? అందరితోనూ మెత్తగా చివాట్లు కూడా తినవలసి వచ్చినందుకు డిటెక్టివ్ అనుమాన్ల ముఖం చింతాకులా చిన్నబోయింది.
పార్కులో పోలీసు ఇన్స్పెక్టర్ ఛీత్కారం చేసాడు. అతనివైపు చూసిన చూపు ఈ జన్మాంతం వరకు అతగాడిని వెంటాడేలా ఉంది. పదేపదే ఈ వృత్తిలో ఎదురవుతున్న వైఫల్యాలతో బాటు ఈ ఆపరేషన్ బ్లాస్ట్ కంట్రోల్ కూడా ఫెయిలవడంతో డిటెక్టివ్ ఆఫీసు ఎత్తేసి ఈ వృత్తి మానేసి తన వీధి చివరే ఓ కిళ్ళీకొట్టు పెట్టుకుని బ్రతుకుదామనుకొని నిర్ణయించుకొన్నాడు అనుమాన్లు....