వారసత్వం - చొప్పదండి సుధాకర్

vaarasatvam

నాంపల్లి ఆవులిస్తూ నిద్రలేచాడు!

అప్పటికి ఉదయం ఏడు గంటలయింది.

అసలు ఏడయినా నిద్ర లేచేవాడు కాదు గానీ, చింత చెట్టు నీడ జరిగి మొహమ్మీద చుర్రుమని ఎండ పడడంతో మెలుకువ వచ్చింది.

"చాయ్ పెట్ట మంటావుటయ్యా!" ఇల్లాలు రంగశాయి అడిగింది.

"ఆ పెట్టు మొఖం కడుక్కొచ్చుకుంట" బద్ధకంగా లేచి, చిరిగిపోయిన పంచెను లుంగీలా మలచి కట్టుకొని, నోట్లో వేప పుల్ల వేసుకుని ఫర్లాంగు దూరంలో ఉన్న వాగు కేసి నడిచాడు.

నాంపల్లికి సుమారు పాతికేళ్ళు ఉంటాయి. అందంగా కాకపోయినా సన్నగా ఓ మోస్తారుగానే ఉంటాడు. వాళ్లది గంగిరెద్దుల కులం. వాడి బతుకుతెరువు కూడా గంగిరెద్దలను ఆడించడమే. ఒక చోటంటూ లేదు. సంవత్సరం పొడవునా జిల్లా అంతటా తిరగడం, దొరికినదాంతో పొట్టపోసుకోవడం అంతే!

ఇల్లూ లేదు, వాకిలీ లేదూ! సంపాదన లేదూ, చుట్టుబండా లేదూ!!

ఇప్పుడు వాళ్లున్నది ఓ మూడు రోడ్ల కూడలి!

దానికి ఇరుపక్కలా చింత చెట్లూ! మామిడి చెట్లు! వాటి కిందే వాళ్ళ కాపురం!

ఆ చోటు పూర్తిగా అడవి కాదు! పూర్తిగా ఊరు కాదు! పొద్దున ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది దాకా వచ్చిపోయే జనంతో, బస్ ల కోసం వేచి ఉండే ప్రయాణికులతో నానా సందడిగా ఉంటుంది. రాత్రి ఎనిమిది దాటితే ఆ ప్రదేశంలో నాంపల్లి కుటుంబం తప్పితే ఎవరూ ఉండరు.

నాంపల్లి మొఖం కడుక్కొని వచ్చాడు. రంగశాయి చాయ్ పోసింది. "ఇయ్యాల ఎక్కడికి పోతవయ్యా బిచ్చానికి?" నాంపల్లి చాయ్ తాగుతుంటే పక్కన కూచుని అడిగింది.

అతడు ఏమీ బదులివ్వలేదు.

చాయ్ తాగడం ముగించి గ్లాసు పెల్లానికిచ్చాడు.

"ఎటు పోతావయ్యా బిచ్చానికి?" మళ్లీ అడిగింది.

నాంపల్లి నిట్టూర్చాడు.

"ఏమోనే! గట్ల ఊరు మీద పడిపోత. ఏ ధర్మరాజు కన్నా కనికరం కలగదా?"

"ఏమి కనికరమో ఏమో? ఎడ్లు మేతలేక, మనకి తిండి లేక సస్తున్నామ్!" కోపంగా అంది రంగశాయి.

"ఏం చేద్దామే! ఆ ఎములాడ రాజన్నకు మనమీద దయలేదు."

"ఏ ఎములాడ రాజన్న ఏం జేత్తడు! తప్పు మనది బెట్టుకొని" లేచి పొయ్యి దగ్గరకు పోతూ అంది.

నాంపల్లి ఏం మాట్లాడలేదు. గొంగళి భుజాన వేసుకొని కొదురుపాక ఊళ్ళోకి నడిచాడు. నిజానికి అతడికి ఆశలేదు ఎవరో ఏదో దానం చేస్తారని. అయినా వెళ్ళకతప్పదు. తనని నమ్ముకొని రంగశాయితో పాటు నాలుగు ఎడ్లు, ఓ ఆవు ఉన్నావాయె!

రోడ్డు మీద నడుస్తున్నాడన్న మాటేగాని అతడి మనసు మనసులో లేదు.

ఛ! తనది ఏం బతుకు అనిపించింది. ఎవరిని చూసినా ఎంతో ముద్దుగా ఇల్లు, వాకిలి, సంసారంలో రోజు రోజుకి ఎదిగిపోతున్నారు. తనే ఎంతకీ బాగుపడడం లేదు! తన చుట్టాలు, తెలిసిన వాళ్ళంతా ఈ గంగెద్దలాట వొదిలి పట్నాల్లో హొటళ్లలో జీతాలుండి, రిక్షాలు తొక్కుతూ దొరబాబుల్లా బతుకుతున్నారు.

"అంటే ఈ పని ఇడిశిపడితే తానూ బాగుపడిపోతాడా?"

ఆ అనుమానం నాంపల్లికి ఇప్పటికి వెయ్యిసార్లన్నా వచ్చి ఉంటుంది. అయితే అంతకన్నా ఎక్కువ ఆలోచించడు.

ఎందుకంటే అతడికి ఈ వృత్తి విడవాలన్న ఆలోచన కలలో కూడా రుచించదు!

అతడికి ఇప్పటికీ బాగా గుర్తు! గంగిరెద్దులను ఆడించడంలో వాళ్ల అన్నయ్య రాజన్న కున్న జిల్లా మొత్తం మీద పేరు ప్రఖ్యాతులు!

అల్లీపురము గడిల దొరల ముందు, వూడూరు జమీందారుల పెళ్లిళ్లలో ఒక చోటేమిటీ మానేరువాగు అటు పక్క పది ఊళ్లు, ఇటు పక్క పది ఊళ్లు రాజన్న గంగి రెద్దుల ఆటంటే పడి చచ్చేవారు. ఏ పెళ్లయినా, పేరంటమయినా రాజన్న గంగి రెద్దుల ఆట ఉండాల్సిందే! జాతర్లలో అయితే సరేసరి! కనీసం రొన్నూర్లయినా తగ్గేవాడు. ఆ కాలంలో రొన్నూరు రూపాయలంటే మాటలా! ఏడాది గాసం, చిన్నగా ఓ పెళ్లిచేసేంత పైకం. ఇప్పుడు తన ఆవుపాలకు హొటలు వోళ్ళు నెలకీ యాభై ఇచ్చినా వారం కూడా తిరగడం లేదు!

పైసలు, బంగారం, ధాన్యం, ఎద్దులు ఒకటేమిటి! అన్నీ పుష్కలంగా ఉండేవి, వాటికి తోడు రాజన్న రూపు రేఖలు కూడా ఓ మాదిరి రాజులాగే ఉండేవి. బుర్ర మీసాలు, చెవులకు తులమేసి బంగారు పోగులు, అయిదేళ్లకు అయిదు ఉంగరాలు. అందరికీ రాజయ్యంటే ప్రాణమే! రాజయ్య కూడా నూరూళ్ళ ప్రజలతో కుటుంబ సభ్యుడిలా మెలిగేవారు. రాజన్నకి పిల్ల నివ్వడానికి పోటీలు పడి ముందు కొచ్చిన వాళ్ళు వందల్లో ఉన్నారు.

రాజన్నకి గంగి రెద్దు లాట అంటే ప్రాణం కన్నా ఎక్కువే. గంగిరెద్దులనూ రాజన్ననీ విడదీసి చూడడం వీలయ్యేది కాదు.

"నా తాత తల్లితండ్రుల కాలం నుండి ఈ గంగిరెద్దులు ఆ ఎములాడ రాజన్న రూపాలే! మా పాలిట కుల దేవతలే! ప్రాణం ఉన్నా పోయినా వీటి నీడలోనే" అనేవాడు గర్వంగా మీసాలు దువ్వుకొంటూ.

ఆ మాటలు నాంపల్లికి ఎంతో కమ్మగా తోచేవి!

అయ్య పొందే మన్ననా, మర్యాద, ఆటలో నేర్పరితనం అన్నీ తనూ పొందాలని కలగనేవాడు. రాజయ్యకి కూడా నలుగురు కొడుకులున్నా నాంపల్లి అంటేనే ప్రాణం!

"నా తర్వాత నా ఆటా, పాటా కలకాలం నిలబెట్టేది నా నాంపల్లి గాడొక్కడే" అనేవాడు తోటి వారితో.

"ఓరే రాజన్నా! దీప మున్నప్పుడే ఇల్లు సక్కబెట్టుకోవాల్రా! ఓ లంకంత ఇల్లు గట్టి పదెకరాల పొలం గొని పారెయ్యరాదురా!

ముసలితనాన పనికొస్తది. ఏ కాలం ఎట్లుంటదో." తోటి వాళ్లు బుద్దులు చెప్పావారు.

"నా కెందుకే ఇల్లు శిన్నాయనా! ఈ గడ్డంతా నాదేనాయే! ఎవలింట్లో బిచ్చమెత్తుకున్నా రోజు గడిచిపాయే! అడిగినోళ్ల ఇంట్ల అడగకుండ తిరిగినా పదేళ్లు బతుకత గేరంటిగా" అనేవాడు విజయగర్వంతో.

నిజమే! ఆ రోజుల్లో బిచ్చమెత్తడం నామోషిగానూ, బిచ్చం వెయ్యడం గొప్పతనంగానూ ఎవరూ అనుకునేవారు కాదు!

ఎవరి కుల వృత్తి వారిది!

ఇప్పుడు కష్టం మీద పడుకున్నా ఎవరూ రూపాయి ఇవ్వడం లేదు.

"ఆ దినాలు యాడ బోయినయో!" నాంపల్లి ఆవేదనగా అనుకున్నాడు.

"ఎటుబోతున్నవురా నాంపల్లీ!" ఊరి సర్పంచ్ ఎదురయి అడిగాడు.

"అయ్యా బాంచను! మీ ఇంటికే బోతున్న" ఆలోచనల్లోంచి చప్పున తేరుకుని బదులిచ్చాడు నాంపల్లి.

"ఎందుకురా?" ఆప్యాయంగానే అడిగాడు.

నాంపల్లి కొద్దిసేపు తటపటాయించాడు.

"అయ్యా! ఎడ్లకు గడ్డిలేక సచ్చిపోతున్నాయ్! వాటి కింత గడ్డి, మా కింత గాసం ఇస్తారేమోనని అడుగుదామని వొత్తున్న" పొట్లం కట్టినట్లు ఒదిగిపోయి వినయంగా చెప్పాడు.

సర్పంచ్ నిట్టూర్చాడు.

"గడ్డేడ పాడయిందిరా ఈ కరువు కాలంల! పోయి అమ్మనైతే అడుగు. మల్లెసాలల బుడ్డెడన్ని ముక్కలుండె! నే బెట్టమన్ననని తెచ్చుకో."

"నీ దయ దొరా." గబగబా అడుగుల వేగం పెంచాడు.

బస్ కోసం కాబోలు సర్పంచ్ కూడా వేగంగా నడుస్తూ వెళ్లిపోయాడు.

***

"అమ్మా గింత గడ్డి ఇయ్యిండ్రి! గట్లే బుడ్డెడన్ని ముక్కలు పెట్టుమన్నాడు దొర." సర్పంచ్ భార్య విమలమ్మని ఉద్దేశించి అడిగాడు.

ఆమె ఒక్కసారిగా తిరస్కారంగా చూసింది!

"గడ్డి లేదు గిడ్డూలేదూ! ఆయన కోటి తెల్విలదు! ఆడ దొరోలే ఆర్డర్ చేత్తడు! ఇక్కడ ఇయ్యనోల్లని నిష్ఠూరం చేత్తడు." కోపంగా అంది. నాంపల్లి లో మొలకెత్తిన చిన్ని ఆశ మొదలంటా కత్తిరించబడింది!

"అట్లయితే పోయొస్తనమ్మా." కళ్లలో తిరిగేనీళ్లని అదిమిపట్టి అన్నాడు.

ఆమె నిర్ధాక్షిణ్యంగా తలూపింది!

"ఒరేయ్ నాంపల్లీ! ఆ దిక్కుమాలిన గంగిరెద్దులు వదిలి, నీవు, నీ భార్య మా ఇంట్లో కూలికి జేరిపొండ్రా! తిండీ, బట్టా పెట్టి యాడాదికి రెండు వేలిస్తాం" గేటు దాటుతున్న నాంపల్లితో అంది విమలమ్మ.

అతడు వెనుదిరిగాడు.

"మరి నా ఎడ్లగతి ఎందమ్మా?" అడగకూడదనుకుంటూనే అడిగాడు.

"వాటిని మా కమ్మెయ్! అన్నిటికి కలిపి అయిదే వేలిస్తమ్."

నాంపల్లి గుండె తరుక్కుపోయింది!

కన్నబిడ్డలా పెంచుకుంటున్న ఎద్దులను అమ్మేయడమా? అది పొలం పనికి.

అదిగాక వాటిల్లో ఓ దానికి అయ్య పేరే పెట్టుకున్నడాయె!

"తొందరేం లేదురా! బాగా ఆలోచించే చెప్పు." ఉపదేశం ఇస్తున్నట్టు తాపీగా అంది.

"మంచిదమ్మా!" తలొంచుకుని చెప్పాడు, కళ్లలోంచి దూకే నీళ్లు ఆమె చూడకూడదని.

తర్వాత మరో నాలుగిళ్లు తిరిగాడు. కొంచెం అటు ఇటూ అందరూ అదే బాపతు మాటలాడారు. నాంపల్లి మనసులాగే సూరీడు అస్తమిస్తుంటే తిరిగి తిరిగి ఇల్లు చేరుకున్నాడు. అదే చింత చెట్టు కిందకి.

***

"నీ సంసారంల మన్నువడ! రేపటికి ఇత్తులేదు! ఈ దిక్మెల్ల బతుకు బతికే కన్నా ఏడనయినా పడి సచ్చింది నయం థూ!" ధుమ ధుమ లాడుతూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ, ఆఖరుగా మిగిలిన జొన్న సంకటి పొయ్యి మీదేసింది. రంగశాయి.

నాంపల్లి నిర్వికారంగా వింటున్నాడు.

"ఆ దిక్మెల్ల ఎడ్లను పట్టుకొనే ఏడుస్తడు! ఆ దొరసాని చెప్పినట్టు వాటిని అమ్మి నాశనం జేసి, వాళ్ల దగ్గర జీతముంటే ఎంత సక్కగుంటది! పెయ్యినిండ బట్ట, కడుపునిండా తిండన్నా దొరుకుతది. లగ్గమయి నాలుగేండ్లయినా, ఒక్కనాడు బుద్ధి తీర తిన్నదిలేదు. సోకయిన బట్ట కట్టింది లేదు. ఎవలయ్యా గంగెద్దు లాడిచ్చి బిల్డింగులు కట్టింది? అయినా నీ అన్న జేత్తుండా, ఈ రీతిలేని కొలువు నీ తమ్ముడు జేత్తుండా? ఎవలికి లేని పీకులాట నీ కెందుకయ్యా రంగశాయి అలుపూ సొలుపూ లేకుండా అరుస్తూనే ఉంది.

నాంపల్లి నిశ్శబ్దంగా వాగు కేసి నడిచాడు. రాత్రి ఎనిమిదవుతుందేమో తెల్లని వెన్నల కనుచూపు మేర పరచుకొంది. అతడు ఇసుకలో వెల్లకిలా పడుకున్నాడు. చల్లని ఇసుక స్పర్శ అమ్మ ఒడిని గుర్తుకు తెచ్చింది. అనుకోకుండానే నాంపల్లికి కళ్లలో నీళ్లు జలజలా రాలాయి.

ఎవరికి నచ్చని ఈ గంగెద్దులాట పట్టుకొని తాను నాశనమయిపోతున్నాడా!

ఒకవేళ ఈ ఎడ్లన్నీ అమ్మి దొర దగ్గర జీతముంటే నిజంగా ఏ చీకూ చింత ఉండదా?

కాని వాటిని అమ్మే దెట్లా?

తన తండ్రి తాతల ద్వారా సంక్రమించిన ఈ అపురూపమైన విద్యని ఎలా నేలమట్టం చేయగలడు?

ఇప్పటికే ఈ ఆట చాలా మంది వదిలేసుకున్నారు. తనకి తెలిసినంతవరకు నాలుగు జిల్లాల్లో తానొక్కడే ఈ ఆట ఆడుతున్నాడు. అంటే తానూ వదిలేస్తే గంగిరెద్దు లాట మాయమయిపోతుందా?

కాక ఏం చేస్తుంది? చేజేతులా తద్దినం బెడితే!

అంటే తరతరాల నుండి ఉన్న ఓ కళని తన చేతులతోనే పూడ్చి పెట్టడమా!

"ఛీ! బతుకు పాడుగాను!" నాంపల్లి దుఃఖం మానేరు వాగులా పొంగింది. అలా ఎంత సేపు ఏడ్చేవాడో గానీ, భోజనానికి పెళ్లాం పిలవడంతో వాగులోంచి లేచి చెట్టు కిందకి నడిచాడు.

భోజనాలయ్యాక రంగశాయి నాంపల్లి పక్కలో చేరింది.

"నా మాటినయ్యా! నీ కాళ్లు మొక్కుత! ఈ కాలంలో ఈ దిక్మెల్ల విద్య పట్టుకొని ఎవడేడుస్తుండు? రేపు మనకు పోరగాండ్లు పుడుతరు. సంసారం బెరుగుతది. మనకే గతి లేదు ఇగ పొరగాండ్లను ఎట్ల పెంచుతం! మన చుట్టాలూ, పక్కాలూ తెలిసిన వాళ్ళందరూ వదిలేసిన ఈ ఆట మన కెందుకయ్యా! ఈ గొడ్లన్ని అమ్మగా వచ్చిన పైసలతో మంచిగా బట్టలు కొనుక్కొందాము. తిండికి సర్పంచి ఇంట్లో కొదువలేదు. ఏడాదికి ఇద్దరికి. ఇచ్చిన రెండు వేలు దాసుకుందాం. అలా బతికి నన్నాళ్ళు వాళ్ల దగ్గర చాకిరి చేసుకున్నా నయమే" శాంతంగా సర్ది చెప్పింది రంగశాయి.

"సరేలేవే నీ ఇష్టమే కానీ!" నాంపల్లి ఆమెని దగ్గరగా తీసుకొని అన్నాడు.

రంగశాయి ఒళ్లు పూల విమానంలా గాలిలోకి ఎగిరింది. కాసేపటికి రంగశాయి నిశ్చితంగా నిద్రపోయింది. అయితే నాంపల్లి మాత్రం నిర్మలంగా ఉన్న ఆకాశంలో వెలిగిపోతున్న చంద్రుణ్ణి చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయాడు.

"రంగశాయి చెప్పిందాంట్లో అబద్ద మేమీలేదు. ఈ కాలంలో తన ఆటని ఎవరు పట్టించుకుంటారు? ఎవరు ఇష్టపడుతున్నారు? ఎక్కడికి వెళ్లినా తనని, తన వేష భాషలను చూసి గేలి చేసేవారే! పైగా కష్టపడి పని చేసుకోక ఎందుకొచ్చిన సోమరి పని అంటూ చీత్కారాలు చేసేవారే! అంతేగానీ తనదీ ఓ విద్యేనని, దాంట్లో ఓ మెరుపు ఉందని తలాడించి మెచ్చుకున్నవారే లేరు. ఎవరూ పట్టింపుతో చూడకపోవడం వల్ల తనకూ చాలా వరకు ఆసక్తి తగ్గింది. ఈ ఆట మీద పదేళ్లుగా ఒక్కనాడైనా పది నోటు సంపాదించిన ఘడియ లేదాయే!

"మొన్న చబ్బీస్ జనవరి వేడుకల్లో ఆట ఆడటానికి నాలుగు జిల్లాలు వెదకగా తాను దొరికితే సర్పంచ్ ఎంతో బింకంగా కరీంనగర్ తీస్కపోతే, అక్కడ నిలబడి నిలబడి కాళ్లు పచ్చి పండ్లయిపోయె. ఎడ్లు తాగడానికి నీళ్ళు లేక నిలువు గుడ్లేసినయ్! మంత్రి వచ్చేసరికి పట్టపగలాయే! ఆఖరుకి అటో ఇటో ఆట అయిందనిపిస్తే గాడిదని తింపినట్టు తింపి తింపి నూట యాభయి రూపాయల చెక్కు చేతిల పెట్టిరి. అది బ్యాంకుల కెళ్లి విడిపించుకునే కంటే, దానికన్నా ఓ రోజు ఊరంత తిరిగి బిచ్చమెత్తుకున్నదే నయమనిపించింది.

ఇంకోసారి ఇల్లు జగాలు ఇప్పిస్తమని సర్పంచ్ తింపి తింపి ఆ కాగితాలు తెమ్మని ఈ కాగితాలు తెమ్మని ఒర్రిచ్చి ఒర్రిచ్చి ఆఖరుకి వచ్చే ఏడు సూద్దామనిరి. అట్ల ఏ ఏటికాయేడు అయిదేళ్లు గాలికి కొట్టుకపోయె. ఆఖరుకి ఆ సంగతే మర్చిపోవుడాయె. మల్లొకసారి జిల్లా పండుగలని వెళితే, అక్కడ ఉన్నోళ్ళు ఉన్నోళ్ళకే శాలువాలు కప్పుడు, ఒకల్ల నొకళ్ళు పొగుడుకొనుడు, ఆఖరుకి జనానికి విసుగొచ్చి వెళ్లిపోయే వారు వెళ్లిపోగా మిగిలిన పది మంది ముందు ఆటాడితే పది రూపాయలు కూడా ఇవ్వలేదు. గద్దెలెక్కి కుక్కరాగాలు తీసిన కవులకు మాత్రం వేలకు వేల చెక్కు లిచ్చిండ్రు.

"ఛీ! ఈ ఆట వదిలేయక తప్పదు!"

ఆ నిర్ణయం తీసుకొన్నాక అతడి మనసెంతో తేలిక పడాల్సిందిపోయి మరింత దిగులు ఆవహించింది.

ఇక గొడ్లన్నీ అమ్మెయ్యాల్సిందే!

వెన్నెల్లో దూరంగా నెమరేస్తోన్న ఎద్దులను చూశాడు! చిక్కిపోయి ఉన్నాయి! వర్షాకాలంలో ఎలా ఉండేవి నిగనిగలాడుతూ వేసవికాలం వచ్చింది. ఎక్కడా గడ్డి దొరకడం లేదు!

"రేపే అమ్మెయ్యాలి! కష్టపడ్డా వాటికి కడుపు నిండా తిండైనా దొరుకుతుంది!"

"ఒరేయ్ నాంపల్లీ!" రాజన్న గొంతుకి ఉలిక్కిపడ్డాడు నాంపల్లి.

"అయ్యా నువ్వా!" ఆశ్చర్యంగా అన్నాడు.

"నేనేరా! ఈ ఆట ఇడిసి ఏడ్డను అమ్మేద్దామనుకుంటున్నావట్రా." ఆపైన మాటరాక వెక్కి వెక్కి ఏడవసాగాడు రాజన్న.

"లేదు నాయినా లేదు! నా పాణ ముండగా అమ్మను."

చప్పున మెలుకువ వచ్చింది నాంపల్లికి!

"కలా! ఔను కలే. లేకపోతే ఎన్నడో చచ్చిపోయిన నాయిన అర్ధరాత్రి హఠాత్తుగా తిరిగిరావడ మేమిటి?"

ఆ రాత్రి ఎప్పుడు నిద్రపోయాడో అతడికే తెలీదు.

***

తెల్లవారుతూనే నాంపల్లి తమ్ముడు యాదగిరి వచ్చాడు.

నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా తమ్ముడిని చూసి పోల్చుకోలేకపోయాడు. ఇస్త్రీ పాంటు చొక్కాలో, చక్కగా కత్తిరించిన జుట్టుతో, వేష భాషలు, మాట పొందికా, ఒకటేమిటి - గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. హైదరాబాద్ లో ఏదో ప్రైవేట్ కంపెనీలో చప్రాసీగా ఉంటున్నాడట. ఉచిత భోజన వసతితో బాటు నెలకు వేయి రూపాయల జీతం. రంగశాయి అయితే మురిసిపోయింది మరిదిని చూసి.

వదినకి నాలుగొందల రూపాయలిచ్చి దావత్ చేయమన్నాడు.

నాలుగొందలు! పట్టి పట్టి మరీ చూసింది! జీవిత కాలంలో, నాంపల్లే చూడలేదు. అనుభవించడం ఇక కలలో మాటే! నాంపల్లి సైతం నమ్మలేకపోతున్నాడు తమ్ముడి ఎదుగుదలని!

"భలే బాగుందన్నయ్యా వన భోజనంలా!" భోజనాలయ్యాక తృప్తిగా త్రేనుస్తూ అన్నాడు యాదగిరి.

నాంపల్లి బాధగా నవ్వాడు.

"నాకు రోజూ వన భోజనమేరా! ఎంత మామూలుగా అన్నా, అన్నయ్య కంఠంలోని వణుకు గుర్తు పట్టేశాడు. యాదగిరి.

అన్నయ్యా! ఎందుకు ఈ దరిద్రాన్ని పట్టుకుని వేళ్ళాడుతావ్! చక్కగా నాతో పట్నంరా! నీకూ నాలాంటి ఉద్యోగం ఇప్పిస్తాను. దొరలా బతకొచ్చు. అక్కడ మనకులం, శాఖా ఎవరూ పట్టించుకోరు అన్నట్టు నా పేరు అక్కడ యాదగిరి కాదు. శ్రీనివాస్. అందరూ వాసూ అంటారు. కనీసం ఏరా అని కూడా పిలవరు." ధీమాగా అతిశయంగా అన్నాడు.

రంగశాయి మురిపెంగా, గర్వంగా మరిదికేసి చూసింది.

నాంపల్లి భూమి లోపలికి క్రమంగా కుంచించుకుపోతున్నాడు మానసికంగా.

"అన్నయ్యా! త్వరగా తయారవు. కరీంనగర్ వెళ్లి సినిమా చూసొద్దాం. వదినా నీవు కూడా!" హుకుం జారీ చేశాడు.

"ఎలారా మనకో ఇల్లా, పాడా! ఇంత సామానూ, గొడ్లూ గాలికి వదిలి ఎలా వెళ్లగలమూ?" నాంపల్లి మెల్లిగా అన్నాడు.

రంగశాయి గయ్ మని లేచింది.

"దిక్కుమాలిన ఎడ్లు, చిప్పలు, నులకమంచం కావలి కాస్తూ ఆ చింత చెట్టుకు ఉరేసుకోవయ్యా పీడా వదిలిపోతుంది" ముక్కు పుటాలు ఎగరేస్తూ అరుస్తోంది కోపంగా.

ఓ అరగంట కష్టపడి ఇరువురినీ శాంతింపజేశాడు యాదగిరి.

"ఓరే నీవూ, వదినా పోయిరాండ్రిరా నాకు సినిమా మీద పెద్ద ఇష్టం లేదు" నిరాసక్తంగా అన్నాడు.

కాసేపు బతిమాలాక, యాదగిరి వదినని తీసుకొని కరీంనగర్ వెళ్లిపోయాడు.

నాంపల్లి నులక మంచం మీద పడుకొని తీవ్ర ఆలోచనల్లో మునిగిపోయాడు.

రాత్రి అయ్యా ఆత్మ కలలోకి ఎంతగా ఏడ్చింది ఛీ! చచ్చినా ఈ విద్యను వదిలిపెట్టోద్దు అట్లా చేస్తే తండ్రి ఆత్మ ఎంత రంధి పడుతుందో? రంధి పడడమేమిటీ! జన్మజన్మల పాపమై తనని ఉసురుపెట్టదూ?

***

ఏ రాత్రో ఎవరో నిద్ర లేపుతుంటే మెలుకువ వచ్చింది నాంపల్లికి.

"ఓరేయ్ నాంపల్లీ! నేను సర్పంచ్ నిరా ఆఖరు బస్ కొస్తున్నాను. కరీంనగర్ లో నీ పెళ్లాం, తమ్ముడూ కలిశారు" "ఆ" నిద్ర మబ్బుతో ఆవులించి వింటున్నాడు నాంపల్లి.

"నిన్ను రేప్పొద్దున్నే ఆ పెంటంతా వొదిలించుకొని రమ్మన్నారు. అటు నుండి ఆటే హైదారాబాద్ వెళ్లిపోవచ్చునట! అలా రావడం నచ్చకపోతే ఇక్కడే చావమన్నారు. నీ భార్య నీ తమ్మున్నే ఉంచుకొని సంసారం చేస్తుందట తప్ప నీతో ఇక మీదట కాపురం చేయదట బాగా ఆలోచించుకొని పొద్దున్నే రమ్మని చెప్పింది. మధ్యాహ్నం "రెండు దాకా చూసి వెళ్ళిపోతారట హైదరాబాద్ కి." సర్పంచ్ బాధగా చెప్పాడు.

నాంపల్లి నిద్ర మత్తు తటాలున ఎగిరిపోయింది.

'అంటే రంగశాయి మరిదితో లేచిపోయిందా?

కొంచెం అటూ ఇటూగా అంతే!

సర్పంచ్ వెళ్లిపోయాడు. నాంపల్లి మాత్రం రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా గడిపాడు.

తెల్లవారి లేస్తూనే కాలకృత్యాలు తీర్చుకొని గంగిరెద్దుని అలంకరించుకొని ఊళ్లోకి బయలుదేరాడు.

ఇపుడు వాడి మనసు ఎంత స్వేచ్చగా ఉంది.

ఇన్నాళ్ళూ తన ఇష్టానికి అనవసరంగా భార్యను కూడా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఆమె ఇష్టానికి ఆమె వెళ్లిపోయింది.

ఇక ఎవరినీ ఏ విధంగానూ ఇబ్బంది పెట్టనవసరంలేదు.

తాను బతికి ఉన్నంతకాలం గంగిరెద్దులాడించుకునే బతుకుతాడు.

తండ్రి రక్తం, వారసత్వం తనలో ఎలా జీర్ణించుకుపోయాయో ఈ ఆట కూడా అంతే!

బతికి నన్నాళ్ళూ ఈ అరుదైన విద్యని రెండు చేతులూ అడ్డుపెట్టి ఆరిపోతున్న దీపాన్ని కాపాడినట్టు కాపాడుతాడు.

సర్కారు. పట్టించుకోవడానికి ఇదేమన్నా కూచిపూడి నాట్యమా? గురజాడ ఇల్లా? కోణార్క్ శిల్ప సంపదా?

ఆ క్షణాన అతడి గురించి అతడికి తెలియదుగానీ, అతడూ ఓ బాపతూ త్యాగమూర్తే! మహానుభావుడే!

***

(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ