పువ్వుల దొంగ - నాగేశ్వరరావు

puvvula donga

ది సాయినగర్ కాలనీ. అందరూ కలసి మెలసి వుంటారు. కాలనీకి ఒకటే అసోషియేషన్ వుండటంతో త్వరగా డవలప్ అయ్యింది. విశాలమైన సిమెంట్ రోడ్డులు. రోడ్డు అందమైన ఇల్లు. ప్రతీ ఇంటిలో చక్కని పూల చెట్లు. రోజు చాలామంది ఆ రోడ్డు మీద వాకింగు చేస్తూ వుంటారు.

ఆ పక్కనే కృష్ణా నగర కాలనీ. కాలనీ లో పట్టుమని వంద ఇళ్ళు లేవు. నాలుగు అసోషియేషన్లు. నలుగురూ నాలుగు పక్కల లాగుతూ వుంటారు. కాలనీ సాయినగర్ కాలనీ కంటే ముందు పుట్టినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది. ఇంకా మట్టి రోడ్లు. సరిగ్గా డ్రైనేజి వసతి రాలేదు.

కృష్ణా నగర్ కాలనీ లో వుంటున్నారు డెబ్భై ఏళ్ళ రామనాధం. రామనాధం, అతని భార్య జానకి. ఇద్దరికీ దైవ భక్తి ఎక్కువ. రోజూ పూజా పునస్కారాలు చేస్తూ వుంటారు. మూడువందల గజాల స్థలం లో చిన్న ఇల్లు . ఇంటి చుట్టూ దేవుడి పూజ కోసం కోసం పూలమొక్కలు వేసాడు. కానీ అదేమిటో గాని ఒక్క చెట్టు సరిగ్గా బతకదు. ఏ చెట్టు పూలు పూయదు.

స్వామినాధం సాయి నగర్ కాలనీ లో మెయిన్ రోడ్డు లో ఒ చిన్న ఇంట్లో వుంటున్నాడు స్వామి నాధానికి అరవయ్ ఏళ్ళు వుంటాయి. మహా నాస్తికుడు. దేవుడికి దండంకూడా పెట్టడు. ఇంటి చుట్టూ మొక్కలు పెంచాడు. విపరీతంగా పూలు పూస్తాయి. ఆ కాలనీ లో చాలామంది పూలు కోసేవారు కాదు. మర్నాడు వుదయానికి రాలిపడిపోయేవి.

రోజూ వుదయాన్నేరామనాధం, జానకి ఇద్దరూ చేతిలో చిన్న క్యారీ బాగ్ తో వాకింగ్ కి సాయినగర్ కాలనీ వెళుతూ వుంటారు. వాకింగ్ కి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు రోడ్డు బయట వున్న పూల చెట్లు చూసి ‘ఇదేంటో రోజూ పూజ చేసేవాడి కొంపలో ఎన్ని చెట్లు వేసినా పూలు పూసి చావవు. ఇక్కడ వీళ్ళు దేవుడికి పెట్టడం కాదు కదా చెట్టు నుంచి కూడా కొయ్యరు. అలాంటి వాళ్ళింట్లో కుప్పలు కుప్పలు పూస్తాయి’ అనుకుంటూ ఫీలయి పోయి ఆ చెట్ల నుంచి పూలు తెంపుకుని తీసుకువెళ్లి దేవుడికి పెట్టి పూజ చేస్తూ వుండేవారు.

రోజూ పూలు మాయం అవ్వడం తో స్వామి నాధం ఎవరు కోస్తున్నారా అని ఉదయాన్నే లేచి కాపు కాసాడు.

ఆ రోజు వుదయం పూలు తెంపుతున్న రామనాధం ని చూసి ‘ఎవరండి అది..’ అంటూ బయటికి వచ్చాడు.

పూలు కోస్తున్న రామనాధం స్వామినాధాన్ని చూసి ఆగిపోయాడు.

‘ఏంటి మీరు చేస్తున్న పని’ అడిగాడు స్వామి నాధం.

‘దేవుడికోసం ...పూలు...’ అన్నాడు రామనాధం .

‘అడక్కుండా కోసేయ్యడమేనా’

‘అంటే ఎవరూ కొయ్యడం లేదని, రోజు రాలి పడిపోతున్నాయని.’

‘పోతే మీ కేంటి. మేం చెట్లు వేసుకున్నది మీ కోసం కాదు..’

‘నా కోసం కాదండి.. దేవుడి పూజ కోసం.. కోస్తున్నా..’ అన్నాడు రామనాధం.

‘చెట్టుకు అందం కోసం మేం వదిలేస్తున్నాం ... సరే లెండి . కొంచెం కోసుకుని కొన్ని చెట్టుకు వదిలెయ్యండి.’ అంటూ లోపలి వెళ్లాడు.

రామనాధం ఫీలయ్యాడు.

‘అసలు వీళ్ళని కాదు.. ఆ దేవుడిని అనాలి. పూజలు చెయ్యని వాళ్ళింట్లో పూలు విరగబూస్తాయి. రోజూ పూజ చేసే వాళ్ళింట్లో ఒక్క పువ్వు కూడా పూసి చావదు... ఛీ.. రేపటి నుంచి దేవుడికి పూలు లేకుండా పూజ చేస్తా. అప్పుడు గాని దేవుడికి తెలిసి రాదు’ అనుకుంటూ ఆ రోజంతా అదే ఫీలింగులో వున్నాడు. రాత్రి కూడా అదే ఆలోచనలతో పడుకున్నాడు.

***

కాలచక్రం స్పీడుగా తిరిగింది. దానికింద పడి రామనాధం, స్వామినాధం ఇద్దరూ మరణించారు.

***

అది యమ లోకం .

యమధర్మ రాజు సింహాసనం మీద కూర్చుని వున్నాడు.

పక్కన చిత్రగుప్తుడు పాపుల చిట్టా చూస్తున్నాడు.

‘పాపులను ప్రవేశ పెట్టండి’ అన్నాడు యమధర్మ రాజు.

చిత్రగుప్తుడు ధర్మ ఘంట కొట్టాడు.

యమ భటులు స్వామి నాధాన్ని, రామనాధాన్ని తీసుకు వచ్చారు.

స్వామినాధం, రామనాధం ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుని ఆశ్చర్యపోయారు.

చిత్రగుప్తుడు ఇద్దర్నీ చూసి ‘ప్రభూ ఇతని పేరు స్వామినాధం. మహా పిసినారి. దేవుడికి ఏనాడు దండం పెట్టలేదు. పరమ నాస్తికుడు’ అంటూ స్వామినాధం గురించి చెప్పాడు.

తర్వాత రామనాధాన్ని చూసి ‘ప్రభు ఇతని పేరు రామనాధం. మహా భక్తుడు. రోజూ దేవుడికి నైవేద్యం పెట్టి గాని పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునే వాడు కాదు.’ అంటూ చిత్రగుప్తుడు యమధర్మ రాజుకి వివరించాడు.

యమధర్మ రాజు ఇద్దరినీ చూసాడు.

‘చిత్ర గుప్తా వీళ్ళు చేసిన పాప పుణ్యాలు లెక్క కట్టి పుణ్యం తక్కువయితే ముందుగా స్వర్గానికి పంపించండి. పాపం తక్కువైతే ముందుగా నరకం లో శిక్ష అమలు చేయండి. అన్నాడు యమధర్మ రాజు.

‘అక్కడే ఒక చిన్న సందేహం ప్రభు’

‘ఏమిటది’ అడిగాడు యమ ధర్మరాజు

‘ఈ స్వామి నాధం ఏనాడు పూజా, పునస్కారాలు చేయలేదు. అందుకే అతని ఖాతా లో పుణ్యం లేదు ప్రభు. రామనాధం నిత్య పూజలు చేసేవాడు.అతని ఖాతాలో పుణ్యం వుంది. రామనాధం ఒక్కడే స్వర్గానికి వెళ్ళటానికి అర్హుడు ప్రభూ’ అంటూ విన్నవించాడు చిత్రగుప్తుడు.

అదివిన్న స్వామి నాధం ‘యమధర్మ రాజా దేవుడికి దండం పెట్టక పోవడం. పూజలు చెయ్యకపోవటం కూడా పాపమేనా. అలా అని ఏనాడు దేవుడిని నేను దూషించలేదు. అసలు నేను ఏ పుణ్యమూ చెయ్యలేదా?’ అంటూ అడిగాడు.

యమధర్మ రాజు తన దివ్య దృష్టి తో చూసి ‘చిత్ర గుప్తా... రామనాధం ఖాతాలో వున్న పుణ్యం లో సగం స్వామి నాధం ఖాతాలో వేసి ఇద్దర్నీ ముందుగా స్వర్గానికి పంపించండి.

అది విని రామనాధం ‘ఇది అన్యాయం యమ ధర్మరాజా. నా పుణ్యం లో అతనికి వాటా ఇవ్వడానికి నేను ఒప్పుకోను. నా పుణ్యం అతనికి ఇవ్వడానికి ఆతనేమన్నా నాకు బంధువా, చుట్టమా. అయినా నేను ఎంతో కష్టపడి భక్తి తో ఉపవాసాలు చేసి, పూలతో పూజలు చేసి సంపాదించుకున్న పుణ్యం.’ అన్నాడు.

‘ఎలా సంపాదించావు పుణ్యం మళ్ళీ చెప్పు' అన్నాడు యమధర్మ రాజు.

‘నేను ఎంతో కష్టపడి భక్తి తో ఉపవాసాలు చేసి, పూలతో పూజలు చేసి సంపాదించుకున్న పుణ్యం. ప్రభూ’ అన్నాడు రామనాధం .

‘భక్తితో ఉపవాసాలు సరే, పూలతో పూజలు చేసానన్నావు, ఆ పూలు ఎక్కడివి.’ అడిగాడు యమధర్మ రాజు.

రామనాధం ఆలోచనలో పడ్డాడు.

‘‘చెప్పు... నువ్వు పూజ చేసిన పూలు ఎక్కడివి.... అవి.. స్వామి నాధానివి కదా.’

రామనాధం మాట్లాడలేదు.

‘అంటే నువ్వు పూల దొంగగా స్వామి నాధం ఇంట్లో పూలు దొంగిలించి దేవుడికి పూజ చేసావు. మరి ఆ పూజలో పూలు అతనివైనపుడు నీ పుణ్యం లో కూడా అతనికి వాటా వుంటుంది..' అన్నాడు యమధర్మ రాజు.

రామనాధం ఆశ్చర్యపోయాడు.

‘ప్రభు అవి నా కోసం కాదు ఆ దేవుడికోసం చేసాను.’ అన్నాడు రామనాధం.

‘ఎవరికోసం చేసినా దొంగతనం నేరం. మరి ఆదొంగతనం చేసిన పాపం పోవాలి అంటే నువ్వు స్వామి నాధానికి పుణ్యం పంచాల్సిందే.’ అన్నాడు యమధర్మ రాజు.

‘ప్రభు ఈ పని ఈ రామనాధమే కాదు. భూ లోకంలో చాలామంది చేస్తున్నారు. వారికి వచ్చేది పాపమా పుణ్యమా తెలియక సతమత మవుతున్నా. అన్నాడు చిత్ర గుప్తుడు.

‘చిత్రగుప్తా ఇకమీదట మానవుల పాప పుణ్యాలు లెక్క కట్టునప్పుడు ఇలాంటి పూల దొంగల పుణ్యం లో సగం పుణ్యం పువ్వుల యజమానులకు బదలీ చెయ్యండి.’ అన్నాడు యమధర్మ రాజు.

‘అటులనే ప్రభు. మీ ఈ తీర్పుతో నా పని సులభ మయింది’ అన్నాడు.

రామనాధం ‘ప్రభూ... నేను పూవులని కోసే సమయంలో ఈ స్వామినాధం నన్ను అడ్డుకున్నాడు.’ అన్నాడు .

‘అందుకే నీ పుణ్యం లో సగమే అతనికి దక్కింది. అతను ఏమీ అనకుండా వుంటే నీ పుణ్యం పూర్తిగా అతనికే చెందేది.’ అన్నాడు యమధర్మ రాజు.

రామనాధం నోట మాట రాలేదు.

‘రామనాధం ఏ దేవుడూ పూలని దొంగిలించి పూజలు చెయ్యమని అడగ లేదు. నీకున్న దానితో ఆ దేవుడిని ఆరాధించు. పూజించు. అప్పుడే నీకు నీ పుణ్యం నీకు పూర్తిగా దక్కుతుంది.’ అన్నాడు యమధర్మ రాజు.

రామనాధం ‘క్షమించండి యమధర్మ రాజా. ఇంకెప్పుడు పూలు దొంగతనం చెయ్యను. కావాలంటే అడిగి కోసుకుంటాను.. నన్ను క్షమించండి...క్షమించండి.’
అంటూ నిద్రలో అరుస్తున్నాడు.

జానకి ‘ఏవండి... ఏవండి... ఏంటి ఏం జరిగింది.’ అంటూ తట్టి లేపింది.

ఉలిక్కి పడి లేచాడు రామనాధం.

‘ఏంటి ఏమన్నా కల వచ్చిందా.. అలా అరుస్తున్నారు.’ అంటూ అడిగింది. జానకి.

‘కలా ..అంటే ఇదంతా.. కలా ..' అనుకుంటూ టైం చూసుకున్నాడు.

ఉదయం ఐదున్నర అయ్యింది.

‘అమ్మో తెల్లారగట్ల వచ్చిన కలలు నిజమవుతాయి అంటారు. ఇది నిజమే నేమో.’ అనుకున్నాడు.

జానకి చేతిలో ఒ కవరు తీసుకుని ‘పదండి... వాకింగు కి వెళ్లి పూలు తెచ్చుకుందాం. పూర్తిగా తెల్లవారితే అందరూ లేస్తారు.’ అంటూ తొందర పెట్టింది జానకి.

రామనాధం జానకి చేతిలో కవరు లాక్కుని పారేసి ‘ఈ రోజు నుంచి... వాకింగు... ఓన్లీ వాకింగు. నో పూలు. పద’ అంటూ లేచాడు.

అర్ధం కాక రామనాధాన్ని చూస్తూ నిలబడి పోయింది.

***

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ