గర్వభంగం - నారంశెట్టి ఉమామహేశ్వర రావు

garvabhangam

దండకారణ్యం లో ఉండే ఒక చిలుకకి మనుషుల మధ్య పెరిగే ఇతర పక్షుల జీవితం ఎలా వుంటుందో తెలుసుకోవాలన్న కోరిక పుట్టింది. అది వెంటనే అక్కడినుండి బయల్దేరింది. సుందరమైన ప్రకృతిని చూసి ఆస్వాదిస్తూ ఎగురుతూ మధ్య మధ్య అలసట తీర్చుకుంటూ మనుషులున్న ఒక ఊరు చేరింది. ఊరు ప్రక్కనే ఒక తోట కనిపిస్తే అక్కడికి వెళ్ళి ఒక జామ చెట్టు మీద వాలింది. చిలుకకి ముందుగా ఆకలి గుర్తొచ్చింది. వెంటనే దోరమగ్గిన జాంపండు ఒకటి ఎంచుకుని తినడం మొదలుపెట్టింది.

సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక కోడిపెట్ట వచ్చింది. కోడిపెట్ట చుట్టూ దాని పిల్లలు కూడా ఉన్నాయి. అవి చూడడానికి ముద్దుగా ఉన్నాయి. నేల మీద కనిపించిన పురుగులని, గింజలని కాళ్ళతో కెలుకుతూ తినసాగాయి. అనుకోకుండా చెట్టుమీదకు చూసిన కోడిపెట్టకు కొమ్మ మీద ఉన్న చిలుక కనిపించింది. ఆకుపచ్చ రంగులో శరీరం, ఎర్రని ముక్కు, ఉన్న చిలుక దాని కళ్ళకి అందంగా కనిపించింది. చిలుకను చూడగానే కోడిపెట్టకి అసూయ పుట్టింది. అయితే అది ఎలా తీర్చుకోవాలో తెలియలేదు కోడిపెట్టకి.

నెమ్మదిగా మాటలు కలిపి చిలుక ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకుంది కోడిపెట్ట. తమ మధ్యలో తిరిగేది కాదని తెలియడంతో చిలుకని అవమానించాలనుకుంది. చిలుక వైపు ఎగాదిగా చూసి "నువ్వు ఏదైనా ఆకుపచ్చ ద్రవంలో మునిగి ముక్కుని మాత్రం ఆకుపచ్చ రంగులో ముంచడం మరచిపోయావా? లేకపోతే అందరి చూపులని ఆకట్టుకోవడం కోసమని ముక్కుని ప్రత్యేకంగా ఎర్రని ద్రవం లో ముంచావా? నిన్ను చూస్తుంటే నాటకాల వాళ్ళు రంగులు వేసుకోవడం గుర్తొచ్చి భలే నవ్వు వస్తోంది. నువ్వుకూడ మా ఊళ్ళొ నాటకాలు ఆడటానికి వచ్చావా? " అని ఎగతాళిగా అడిగింది.

కోడిపెట్ట వైపు చూడకుండా జామకాయని తినసాగింది చిలుక. తన మాటలకు చిలిక తిరిగి జవాబు చెప్పకపోవడం కోడిపెట్టకి విపరీతమైన కోపం, అవమానం అనిపించింది.

అప్పుడు కోడిపెట్ట మరింత కటువుగా "నిన్నుచూడగానే మనుషులు పట్టుకొని బంధిస్తారు. అక్కడితో ఆగకుండా నిన్ను నానా హింసలు పెట్టి మాటలు నేర్పించి వినోదం పంచమని కష్టాలు పెడతారు. మరికొందరైతే నిన్ను పంజరంలో పెట్టి నీచేత బొమ్మలున్న అట్టముక్కలు తీయించి జోస్యం చెప్పమంటారు. ఇప్పుడు నిన్ను వేటగాడు చూసినా, మన్షులు చూసినా నీపని అంతే...! అబ్బో నీకు ఎన్ని కష్టాలో.. అలాంటి బ్రతుకు ఎవ్వరికీ వద్దు అంది .

అప్పటికీ చిలుక ఎటువంటి జవాబు చెప్పకపోవడంతో కోడిపెట్ట తన గొప్పదనం చెప్ప్డం మొదలుపెట్టింది. దేవుడి దయ వల్ల మాకు అలాంటి బాధల్లేవ్. మా యజమాని తిండిపెట్టి మమ్మల్ని బాగా చూసుకుంటాడు. రాత్రయితే చాలు గంపకింద దాస్తాడు. మేము స్వేచ్చగా ఊరంతా తిరగగలము. కల్లంలో వేసిన చేను కంకులు చెట్ల మీదనుండి పడిన గింజలు ఏరుకుని తింటాము. మేమంటే మనుషులకి ఎంతో ఇష్టం. వాళ్ళ ఇంట్లో కూడా స్వేచ్చగా తిరగమని వదిలేస్తారు. మాకు నచ్చిన ఆహారం తింటాము. నీకైతే అలాంటి అదృష్టం లేదు.. అంటూ గట్టిగా నవ్వింది.

చిలుకకి కోడిపెట్ట మాటలు వినీ వినీ బాధ కలిగింది. ఇప్పటికైనా జవాబు చెప్పకపోతే దాని మాటలను కోడిపెట్ట ఆపదని అర్థమైపోయింది. జాంపండు తినడం పూర్తయిన మూర్ఖులతో మాట్లాట, పోట్లాట మంచిది కాదని మా అమ్మ చెప్పింది. అందుకే ఇంతసేపు జవాబు చెప్పకుండా ఆగాను. కానీ నీతో మాట్లాడకపోతే నీగురించి నువ్వు గొప్పగా ఊహించికుంటున్నావు. అహంకారంతో నువ్వేంటొ మరిచిపోయి మాట్లాడుతున్నావు. ఇంతసేపూ నువ్వు అవివేకంతో మాట్లాడావు. మనుషులు నిన్ను ఎందుకు ప్రేమగా చూసుకుంటారో తెలుసుకోలెని మూర్ఖురాలవు నువ్వు. వాళ్ళకి నీ మాంసం కావాలి. వాళ్ళింట్లో పండగ వచ్చినా, బంధువులొచ్చినా నీ చావు దగ్గర పడినట్టే. నువ్వు బాగా బలిస్తే వాళ్ళకి ఎక్కువ మాంసం వస్తుందని నీకు బాగా తిండి పెడతారు తప్ప, నీమీద ప్రేమతో కాదు. నువ్వు ఎక్కువ పిల్లల్ని కని వాళ్ళకిస్తే వాటితో వ్యాపారం చేసుకుంటారు. లేదంటే కోసుకు తింటారు. అది గుర్తించలేదు నువ్వు. నీది దురదృష్టమైన పుట్టుక. నాది కాదు.
నా గురించి చెప్పేంత గొప్పతనం నీకు లేదు. నేను వినోదం పంచినా, జోస్యం చెప్పినా, నాకుండే గౌరవం ఎప్పటికీ ఉంటుంది. పురాణాల్లో కూడా హంస రాయబారం, చిలుక పలుకులు, కోకిల గానం అని రాసారు కానీ నీ కోడిపెట్టలకి ప్రాధాన్యత లేదు. కవుల కలాల్లో కూడా నా గురించి వర్ణించేంత గొప్పతనం నాది. మీ యజమాని ఇంటికి చుట్టాలు వచ్చినట్టుంది. అదిగో ఇటే వస్తున్నాడు. నిన్నుచంపడానికేమో జాగ్రత్త... పారిపోయి నీ ప్రాణం కాపాడుకో. " అని జవాబు చెప్పి మళ్ళీ ఎటో ఎగిరిపోయింది.

దాంతో కోడిపెట్టకి గర్వభంగమయింది.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ