జగత్పతి-నాచురోపతి - ఆదూరి శ్రీనివాస్

jagatpati-naturopati

నా స్నేహితుడు జగత్పతిని చూడాలని వాళ్ళింటికి వెళ్ళాను. ఎన్నోరోజులబట్టీ ఒకటే పోను "రా రా రారా" అని. సరేలే కదా ఎటూ శని ఆదివారా వచ్చినాయికదాని వాళ్ళింటికి ఫోన్ చేశా. ఎంతో ఆనందంతో ఇన్నాళ్ళకు మామీద దయ కలిగిందా!, రేపు శనివారం వస్తున్నావుగా? అబ్బా ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి భలే సరదాగా చిన్ననాటి కబుర్లన్నీ తిరగేద్దాం రారా" అంటూ వచ్చేటప్పుడు మీ శ్రీమతిని కూడా తీసుకురారా " అని మరీ మరీ నొక్కి నొక్కి (టెలిఫోన్ ను కాదులెండి, మాటవరస... అంతే) చెప్పాడు మా జగత్పతి. ఎంతో సరదాగా "ప్రొద్దున్నే టిఫిన్ కూడా అక్కడేనోయ్" అంటూ శ్రీమతిని వెంటబెట్టుకుని వెళ్లాను. జగ్గు గాడికి షుమారు ముఫ్ఫై సంవత్సరాల వయస్సుంటుంది. నాకన్నా ఒక్క సంవత్సం చిన్న ఐనా ఇద్దరం ఎంతో కలిసి మెలసి ఉండేవాళ్ళం. చదువుకునే రోజుల్లో కలిసి చదువుకోవడంలోగాని, సరదాలలో కానీ ఒక్కటిగా ఉండేవాళ్ళం. ఒకే కంచం ఒకే మంచం లాగా." మరీ ఉదయం టిఫిన్ కూడా అక్కడే ఎందుకండీ వాళ్ళకు కూడా శ్రమ కదా! మీ మగవాళ్ళకేం అలాగే చెపుతారు, ఒక్క గెస్ట్ వస్తే ఎంతశ్రమో ఆడవాళ్ళకే తెలుస్తుంది." అనిమాఆవిడ అంటున్నా (రోజూ తినే ఇడ్లీలూ, దోసెలేగా, అక్కడైతే మావాడు స్పెషల్ గా మరేదైనా చేయించి ఉండకపోతాడా అనే ఆశ మనస్సులో లేకపోలేదు లెండి, బయటికి చెప్తే మా శ్రీమతి కోప్పడుతుందని) వినిపించుకోకుండా, కారులో బయల్దేరదీశాను.

వాడిచ్చిన అడ్రెస్ ప్రకారం ఇల్లు వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళగానే, ఎంతో ఆదరంగా, ఆప్యాయంగా జగ్గు నన్ను కౌగలించుకుని, మా శ్రీమతిని పరిచయం చేయగానే" కులాసానా చెల్లమ్మా?" అంటూ కుశల ప్రశ్నలు వేయడం, కులాసాగా జోక్సు వేయడం మొదలెట్టాడు. మా బాల్యం గురించిన కొన్ని కొంటె సంఘటనలూ వివరించాడు. అందరం ఆనందంగా మాట్లాడుకుంటున్నప్పుడు, ఆత్మారావుడు ఆకలి ఆకలి' అంటూ అరుస్తున్నాడు. పేగుల్లో నుండి శబ్దాలు రాసాగాయి, వాటి బాధ భరించలేక" అరే నేను టిఫిన్ కూడా చేయకుండావచ్చాన్రా! మీ ఆవిడ మీ ఆవిడ సేమ్యా ఉప్మా స్పెషలిష్టని చెప్పింది గుర్తుందిరా!" అంటూ వెంటనే "సేమ్యా ఉప్మా రెండూ" అని కాఫీ హొటల్ సర్వర్ లాగా పెద్దగా అరిచాను. అదిరిపడి ఆవిడ బయటికొచ్చింది.

"చెల్లెమ్మా! నాకు ఆకలి దంచేస్తున్నది. నీవు సేమ్యా ఉప్మా స్పెషలిస్టువని నాకు తెల్సులే! త్వరగా పట్రామ్మా, క్విక్ క్విక్" అంటున్నాను. జగ్గూ గాడు కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టినాడు. కొంచెం టైం పడుతుందనేమో అనుకుని, "ఫర్వాలేదులేరా! లెట్ హర్ టేక్ హర్ ఓన్ టైం" అన్నా. "చెల్లెమ్మ నా మాటలకు "అన్నయ్య గారూ! ఏమనుకోకండి! సేమ్యా ఉప్మా కన్నా, వేరుశెనగ విత్తనాలు, మొలకెత్తినవి తెస్తాను," అంటూ పరుగు పరుగున లోపలికి వెళ్ళి, ఒక ప్లేట్ లో (అది అరలు అరలుగా ఉందిలెండి) పెసర, వేరుశెనగ, బఠానీ, మొలకెత్తిన విత్తనాలు వేరువేరుగా ఉంచినవి తెచ్చి నాముందు పెట్టింది. "అన్నయ్యాగారూ! ఒక నెల నుండీ మాఇంట్లో వంటలు లేవు. ఉదయం మేము మొలకెత్తిన విత్తనాలు ఉపాహారంగా తింటున్నాము." అంటూ, ఇంకా "అసలు అన్నయ్యగారూ! ఈ మొలకెత్తిన విత్తనాలు మోక్ష మార్గానికి నేరుగా దారితీస్తున్నాయంటేనమ్మండీ! ఇందులో ఎన్ని విటమిన్సు ఉంటాయో కదా! దబ్బకాయ రసం తాగితే డాక్టరు తో పనే ఉండదుట! అర్ధగ్లాసు గోధుమ గడ్డిరసం త్రాగుతే ఆసుపత్రితో అవసరమే ఉండదుట! ఆరు అంగుళాల నాలిక కోసం ఆరడుగుల శరీరాన్ని పాడుచేసుకుంటామటండీ!? మొలకెత్తిన విత్తనాలు నోట్లో విసిరేసుకుంటూ ఉపన్యాసం మొదలెట్టింది.

"పూర్వం ఋషులు కేవలం కందమూలాలుతిని కాపురాలు చేయలే దేంటండీ? అసలు భగవంతుడు చేసిన సృష్టిలో ఏదీ వృధాకాదు. ఎండుగడ్డి ఎంతబలం కాకపోతే ఎద్దు అంత పని చేస్తుంది చెప్పండి అన్నయ్యగారూ! అసలు శాఖాహారాలన్నీ సత్వగుణాన్ని పెంచుతాయి కాదుటండీ! ముందు టిఫిన్ కానీండి! నా మాటలు తర్వాత విందురు గాని.." అని ఆమె అనడం గద మాయించినట్లే ఉంది సుమండీ! జగ్గు పాపం మింగలేక కక్కలేక మొహమాటపడుతున్నాడా అనిపించింది. ఇహ మా శ్రీమతి విషయం చెప్పక్కర్లేదనుకుంటా, ఆమె చూపులే నన్ను కాల్చేసేట్లున్నాయి. కమ్మగా ఇంట్లో టిఫిన్ తిననివ్వకుండా తెచ్చానాయె ఏదో గొప్పలన్నీ వదురుకుంటూనూ. ఇప్పుడర్ధమయ్యింది. టీవీలో నారాశివారికి, స్నేహితుల ఇంట్లో విందుభోజనం అని ప్రొద్దుట విన్న విషయం నాపట్ల నిజమయింది మరి! కాదనలేక ఆమొలకెత్తిన విత్తనాలు ఇష్టం లేని మందు ఇబ్బందిగా త్రాగుతున్నట్లు, నమలటం మొదలెట్టాం. అసలే మొలకెత్తిన విత్తనాలు! అందులో బఠానీలు కొన్ని బాగా నానినట్లు లేవు, పటపటాని పళ్లకు తగులుతున్నాయి. చడా మడా చివాట్లు పెట్టాలనిపించింది వాడిని. ఐనా సభ్యత సంస్కారం అడ్డువచ్చి, వాళ్ళావిడముందు వాడ్ని ఎంత ఫ్రెండైనా తిట్టడం బావోలేదని. కోపాన్ని ఆపుకొని, "ఎలా ఉన్నాయి అన్నయ్యగారూ మొలకెత్తిన విత్తనాలు" అని అడుగుత్త ఆమెతో "ఆహా! చాలా బావున్నాయమ్మా!" అంటూ అనలేక తినలేక అన్నాను. ఇంకే ముందీ ఉపన్యాసం తరువాయి భాగం అన్నట్లుగా ఊపందుకుంది.

"నిజానికి అన్నయ్యగారూ! మాఇంట్లో ఇప్పుడు గ్యాస్ పొయ్యి వెలిగించేది లేదు, ప్రెషర్ కుక్కర్ వాడకం లేదు, మిక్సీకి విశ్రాంతే! గ్రైండర్ గైర్ హాజరే! అసలు వంటే లేదు , వంటింటి వాడకమే లేదనుకోండి! ఎంత పొదుపు! ఎంత విశ్రాంతీ! ఎంత విరామం?" అన్నది విజయ వంతమైన ఫేస్ పెట్టి, విశాలమైన కళ్ళు మరికాస్త విశాలం చేసి త్రిప్పుతూనూ. నేను ఉండబట్టలేక "మరి కాఫీ టీ లాంటివిలేవా?" అన్నాను. (కనీసం ఆవేన్నీళ్ళైనా కాస్త కడుపులో పడతాయేమోననే ఆశతో) "ఆ అవసరమేంటి అన్నయ్యగారూ! పదకొండింటికి గోధుమగడ్డి రసం, గోంగూరాకులు కొన్నీ తీసుకుంటాం." అన్నది ఠకీమని. "ఐతే మధ్యాహ్న భోజనం?" అని పాత్రికేయుడిఫోజుపెట్టి అడిగాను." అసలు ఆకలైతేగా అన్నయ్యగారూ! రెండు గంటలకు పచ్చిదోస, కీరాదోసకాయముక్కలూ, రెండు నిమ్మకాయ చెక్కలూ, నారింజకాయ తొక్కలూ ముక్కలుగా కోసి మేము హాయిగా తింటాము. అంతే మా లంచ్! చూస్తారుగా ఈరోజు మ్మీరూనూ! ఎంత హాయిగా నిద్రపడుతుందోగా! ఆయన ఆఫీసులో కూడా యివే తింటారు. సాయంత్రం స్నాగ్గా కూడా ఇవే తీసుకుంటారు. రాత్రి తొమ్మిదిగంటలకి పడుకుంటే మళ్ళీ ఐదుగంటలకే లేవటం." అన్నది. మరి రాత్రి డిన్నర్!" అన్నా గాభరాగా.

"ఏక భ్క్తం సదారోగ్యం" కదా అన్నయ్యగారూ! మేం ఏక భుక్తమే నో డిన్నర్." అంది మహదానందంగా, ఒక పెద్ద యోగిని పోజ్ పెట్టి, హతవిధీ అనిలోపల అనుకుంటూ "మరి ఉదయాన్నే లేచి..." అని మధ్యలోనే ఆపేశా ఏంవినవలసి వస్తుందోని. "లేవగానే ఆసనాలు వేస్తాం. యోగా చేస్తాం, చలికాలమైనా చన్నీటి స్నానం చేస్తాం. ఇంక ఉదయం మీకు ఇందాక చెప్పానుగా!" అంటూ కొంత బ్రేకు తీసుకున్నది. ఇంతలో నేనూ మా శ్రీమతీ, విత్తనాల ఉపాహారాన్నీ(కడుపులోని అగ్నికి ఏదో ఒకటి వేయాలి గనుక) పూర్తిచేసి ఇలాగోలా కూర్చున్నాం. (దిగాలుగా) "రండి లోపలికి! మా కిచెన్ చూద్దురుగాని, అంతా మోడల్ హౌస్ అని మెచ్చుకుంటారులెండి" అంటూ కిచెన్ లోకి దారితీసింది. ఫ్రిజ్ తెరిచింది. ఏమైనా కూల్ డ్రింకైనా ఇస్తుందేమోనని ఆశగా ఎదురుచూశా." కూరగాయల రసం. ఇంధ తీసుకోండి" అంటూ ఇద్దరికీ చెరో అరకప్పూ ఇచ్చింది. కాకరకాయ రసం! అవిపాళ్ళు ఎక్కువైనాయేమో! ఓరినాయనా! గరళం త్రాగిన శివునిలాగా ఉన్న నా మొహం చూసింది మా శ్రీమతి! (లోలోపల నవ్వుకుంటున్నదేమోని నాఅనుమానం, నా పరిస్థితికి) కానీ ఆమె అవిత్రాగడానికి వేసిన బిక్కమొహం చూసి నాకు బాధేసింది. అత్తగారింటికి అప్పుడే వచ్చిన కొత్తకోడలిలాగా "ఏమనుకోకండి. నాకు మా ఫ్రెండ్స్ తో 'మోకాళ్ళ నెప్పులూ పోటానికి మొలకెత్తిన విత్తనాలు' అనే శీర్షిక మీద ఉపన్యాసం ఉంది. మళ్ళీ ఒక్క గంటలో వస్తాను. మధ్యాహ్నం కూడా మా ఇంట్లోనే ఆతిధ్యం స్వీకరించాలి తప్పదు. రాక రాక వచ్చారాయె!" అంటూ చకచకా వెళ్ళిపోయింది జోల్లేసుకుని.

"నా తల్లే! మధ్యాహ్నం కూడానా?" అంటూ మా ఆవిడ లోపల అనుకోడం నాకు వినిపించిందిలెండి.

ఇంతలో పాపం జగ్గూ 'గిల్టీ కన్షస్ తో "ఏరా! ఏమనుకోకురా! ఈమధ్యా మా ఆవిడతో చస్తున్నానురా! మాట్లాడితే మొలకెత్తిన విత్తనాలూ, గోధుమగడ్డి రసం అంటుంది రా! నాకు జిహ్వ చాపల్య కొంచెం ఎక్కువని నీకు తెల్సుకదా? ఇడ్లీ చేయమంటే ఇగురాకుల రసం తాగమంటుంది, పకోడీ తినాలని ఉందంటే పనసపొట్టురసం యిస్తుంది. దీని నేచురోపతి' కాదు కానీ నాకొంపతీస్తున్నదిరా శ్రీపతీ! జీవితం మీద కోరికపోతున్నది. నోరు చవిచెడిపోతున్నది. నేను ఇంకెవరితో చెప్పుకుంటానురా! భగవంతుడు నాలిక లేకుండా నన్నా నన్ను పుట్టించి ఉంటే బావుండేది రా! కమ్మని భోజనం చేసి ఎన్నాళ్ళయిందోరా! ముద్దపప్పు టేస్టులో, ములక్కాడ పులుసులో ఎనక ఉన్న వాసన ఎందరికీ తెలుసులే!" అని పాడాడు దిగులుగా ముఖం పెట్టి విషన్నవదనం తుడుచుకుంటూ. (ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులో మాదిరిగా) నాకు వాడిబాధ చూసి, కళ్ళనీళ్ళ పర్యంతమైంది. "ఒరే నాయనా! నీకెంత కష్టమొచ్చిందిరా! చిట్టి తండ్రీ జగ్గూ నాయనా!" అనుకున్నా. "ఒరేయ్! నీవేమీ అనుకోకురా! తల్లీ నా సోదరీ! సిగ్గువిడచి అడుగుతున్నాను. రెండ్రోజుల్లో నా భార్య పుట్టింటికెలుతున్నది. అక్కడా వాళ్ళ అమ్మ నాన్నలకు ఈ నాచురోపతి చెప్తుందిట, వారి ఖర్మ కాలుతున్నది! పాపం ఆముసలి దంపతులను తల్చుకుంటే దిగులేస్తున్నది. శని దేవుడైనా కొన్నాళ్ళుపట్టిపోతాడు, నాకు మా ఆవిడా, నా అత్తామామలకు వారి కూతురూ వదిలేది లేదుగా! అమ్మా! నన్ను మీ ఇంటికి భోజనానికి పిలవండి! మీకెంతో ఋణపడి ఉంటాను. కాస్త రుచులు చచ్చిపోకుండా నాలుకను తడుపుకుంటాను." అని మా జగ్గూ బ్రతిమలాడుతుంటే నాకు నవ్వాగిందికాదు.

***

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు