ది ఎండ్ - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

the end

భాస్కర్ కాలనీలో వడి వడిగా నడచుకుంటూ తను అనుకున్న ఇంటి ముందుకి రాగానే మిస్టర్ ధన్ కళ్ళు మెరిశాయి. గేటు తీసుకుని లోపలికెళ్ళి నెమ్మదిగా మెట్లమీదుగా నడుచుకుంటూ పైనున్న ఒక వాటా ముందాగి గట్టిగా ఊపిరి పీల్చుకుని ద్వారానికున్న కర్టెన్ తొలగించాడు. తాళం కనిపించింది వెక్కిరిస్తూ..

‘షిట్..మళ్ళీ తప్పించుకున్నారు" మనసులో అనుకుని ‘లాభంలేదు ఈసారి పకడ్బందీగా స్కెచ్ వేసి పట్టుకుంటాను. అప్పుడు..నా సామిరంగా..’ కోపంగా అనుకుని వేగంగా అడుగులేస్తూ వెళ్ళిపోయాడు.

***

"ఇందులో ఎవరు?" అడిగాడు శివ. ఏదో ఫంక్షన్‍లో తీసిన ఫోటో అది. కొద్దిగా పాతబడింది.

"నువ్వు గుర్తు పట్టడానికి అనువుగా పెన్‍తో గుండ్రంగా ఫేస్ చుట్టూ మార్క్ చేశాను కదా" విసుగు ధ్వనించింది మిస్టర్ ధన్ గొంతులో.

"నేనేం చేయాలి?"

"వాళ్ళ ప్రతి కదలికనీ జాగ్రత్తగా గమనించి నాకు తెలియజేయాలి.. మరీ ముఖ్యంగా వాళ్ళెక్కడ ఒంటరిగా దొరుకుతారో.." అన్నాడు కర్కశంగా.

"వారంరోజులు కావాలి నాకు.. ఒకేనా?"

"ఓకే!"

"మరి.." చెయ్యిజాపి నర్మగర్భంగా డబ్బు అడిగాడు.

"నాకు ఎంతొచ్చినా..నీకు మాత్రం ఫిఫ్టీ"

"తక్కువవుతుంది"

"అసలు ఈపనికి మా వాళ్ళు చాలు. కాని దీని వెనుక నేనున్నానని వాళ్ళకి తెలియకూడదు. మావాళ్ళైతే గుర్తుపట్టే చాన్సుంది"

"సరే డీల్ నాకోకే" సంతోషంగా అని ఈలేసుకుంటూ బయటకెళ్ళిపోయాడు శివ.

***

"ఇదిగో వాళ్ళ ప్రతి కదలికా వివరంగా రాసి ఈ నోట్ బుక్‍లో ఎంటర్ చేశాను. ఎక్కడా ఏదీ మిస్ చేయలేదు. పని పూర్తయింది. మరి.." చెయ్యి చాపుతూ అడిగాడు.

"ముందు నాకు రానీ ఆ వెంటనే నీకిస్తా. నా మాట అంటే నీకు తెలుసుగా"

తెలుసన్నట్టుగా అక్కడినుండి నిష్క్రమించాడు.

***

ఆ బుక్‍లో వున్నట్టుగా వాళ్ళిద్దరూ ఇప్పుడు ఈ నిర్మానుష్య ప్రదేశంనుండే వెళ్ళాలి. అందుకే మిస్టర్ ధన్ పెద్ద మర్రిమాను చాటుగా నిలబడ్డాడు. ’ఈ రోజు వాళ్ళు దొరికిపోవడం ఖాయం..’ మనసులో అనుకున్నాక అప్రయత్నంగా వంకర నవ్వు మిస్టర్ ధన్ పెదాలపై నిలిచింది.

దూరంనుండి వాళ్ళు వస్తున్నారు. వ..స్తు..న్నా..రు.

'తనని హఠాత్తుగా చూస్తే వాళ్ళెలా ఫీలవుతారో.. దెబ్బకి గుండాగిపోతుందేమో.. అలా మాత్రం జరగకూడదు.. తనకి లాస్’ వాళ్ళు కాస్త దగ్గరగా రాగానే ఒక్కసారిగా వాళ్ళముందు దూకాడు మిస్టర్ ధన్.

భయంతో వాళ్ళ గుండెలు గుబ గుబ లాడాయి. కళ్ళు తేలేశారు.

"నేను మిమ్మల్ని పట్టుకోలేననుకున్నారు..అందుకే ఇలాంటి నిర్మానుష్య దారినెంచుకున్నారు కదూ.. అదే నాకు ప్లస్సయింది." అన్నాడు వాళ్ళిద్దరి వంకా సూటిగా చూస్తూ.

వాళ్ళనోటినుండి ఒక్క మాటా లేదు. హై వోల్టేజీ షాక్ గొట్టినట్టుగా వున్నారు.

ఇహ లాభంలేదని నోరు విప్పాడు మిస్టర్ ధన్ "ఒరే నాయనలారా! మీ మాటలు విని మీరేదో మంచి వారని నమ్మి బ్యాచిలర్సయినా.. నిరుద్యోగులైనా.. మీకు నా ఇల్లు అద్దెకిచ్చాను.. నేనా పటన్ చెరువులో వుంటాను.. ఇల్లా దిల్‍షుక్‍నగర్లో వుంది. దూరా భారాలకి జడిసి రాలేకపోతుంటే.. రెంట్ ఇవ్వకుండా నన్నేడిపిస్తార్రా? ఆర్నెళ్ళయింది.. ఒక్క పైసా కూడా అద్దెకట్టలేదు. తాతలనుండీ సంక్రమించిన ఇల్లురా అది.. ఏదో నా జీతానికి తోడు..ఇంటి అద్దెతో ఈ కరువురోజుల్లో గుంభనంగా సంసారాన్నీడుద్దామంటే.. మీరెక్కడ దాపురించార్రా నా ప్రాణానికి?" ఘొల్లుమన్నాడు.

"ఒరే! మూర్తీ మనకి ఉద్యోగం ఎందుకు రావడంలేదో ఇప్పుడు అర్థమయిందిరా.. ఈయన ఏడ్పు గొట్టి.. అందుచేత నిన్న నీకు ఇంటి దగ్గరనుండి ఎం ఓ వచ్చిందిగా ఓ రెండు నెలల అద్దె ఆయనకివ్వు..నా కెందుకో మనకి మంచి జరుగుతుందనిపిస్తోంది"

"నిజమేరా రాఘవా.. ఇదిగోండి.. సారీ మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాము. మీరు మంచి మనసుతో ఆశీర్వదిస్తే.. మాకు ఉద్యోగమొస్తే అద్దెడబ్బు పెంచి మరీ ఇస్తాం"

"మీరు నిజంగా మంచివాళ్ళే.. శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తిరస్తూ" అని దీవించి ఇంటిదారి పట్టాడు మిస్టర్ ధన్ అదే మిస్టర్ విశ్వనాధన్.

"మరి.." ఎదురుగా వచ్చి చేతులు చాచాడు శివ.

"ఓరి..నేను వాళ్ళని ఫాలో అవుతుంటే నువ్వు డబ్బుకోసం నన్ను ఫాలో అవుతున్నావా? ఇదిగో" అని ఓ యాభై రూపాయలు చేతిలో పెట్టాడు.

అది తీసుకుని ఈలేసుకుంటూ వెళ్ళిపోయాడు శివ.

***

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ