"ఇక్కడ కూర్చోవచ్చమ్మా..." అన్న మాటలకు పుస్తకంలోనుండి తలెత్తి "భలేవారే ఇదొక్కటే నా సీటు మీరు నిరభ్యంతరంగా కూర్చోవచ్చు అహల్య అన్నది. ఆ పెద్దావిడ చాలా నిస్త్రాణంగా సీటుకు ఒరిగిపోయి కూర్చున్నది. అహల్య పుస్తకం చదువుకుందామనుకుంటూనే ఆమెను చూస్తూ తెలియని కలవరపాటుకు గురి అయ్యింది. మంచి పొడగరి, తెల్లని తెలుపు... కాని ఆమె కనీసం ముఖమైనా కడుక్కుని వచ్చిందా అన్నట్టుందామె వాలకం. చీర నలిగిపోయి ముఖం వడలిపోయి పెనుభారమేదో మోస్తున్నట్టు... సముద్రాన్నేదో దాస్తున్నట్టు... నిజమే ఆమె దుఃఖాన్ని కనురెప్పలకింద కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్న కొద్దీ నీవు కాక మాకెవరున్నారంటూ అవి చెంపలకు పాకుతున్నాయి. అది వేలమంది ప్రయాణం చేసే రైలని, ఎదురుగా వున్నవారు తనని గమనిస్తుంటారని తెలిసి ఆమె ముఖం కొంగు నాశ్రయించింది. నేను అశ్రువులను తుడవగలనే కాని కొనగోటితో నీ దుఃఖాన్ని తుడచిపారెయ్యలేను సుమా అన్నట్టు నిస్సహాయంగా ముఖాన్ని కప్పేసిందామె కొంగు. ఆ కొంగు చాటున దుఃఖపు స్వరమూ... నాగరీకపు నిశ్శబ్దాల పోరాటంలో ఆమె భుజాలు ఎగసిపడుతున్నాయి.
కొంతసేపు ఆమె అలా మౌనంగా రోదించాక... అహల్య ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నది. భారంగా తలెత్తి చూసిన ఆమె ముఖం మేఘాల నీడ సాగిపోయిన సముద్రంలా వుంది. అహల్య బాటిల్ తీసి మంచినీళ్ళందించింది. ఆమె మాటకుండా తీసుకుని తాగాక ఒకింత కుదుటపడిన్నట్టయ్యింది. "ఏమిటీ మీ బాధ..?" అని అడగలేదు అహల్య "కాస్త సేదతీరండి చాలాదూరం ప్రయాణం చెయ్యాలి..." అన్నది. తలపంకించిందామె. రైలెప్పుడు బయలుదేరిందో ఇద్దరికీ తెలియనేలేదు ఒకరిద్దరు తమవంక ఆసక్తిగా గమనిస్తున్న విషయం పట్టించుకోలేదు. అలా కళ్ళు మూసుకుని సీటుకు ఒరిగిందో లేదో ఆమె సెల్ మోగింది.
"నాన్నా రామం నీవు ఎలాగైనా ఈ రాత్రికి బయలుదేరి రావాలిరా... ఒక్కదాన్ని ఉయ్యాల కట్టడం అదీ నాకు రాదు రేపు ఎవరు అందుబాటులో వుంటారో నాకు తెలియదు. రేపు విజయవాడ నుండీ నీరజ కూడా వచ్చేస్తానన్నది. నీవు త్వరగా వచ్చి రాధత్తను సారధి మామయ్యను పలుకరించాలి... అసలు ఆ పిల్ల... ఆ పిల్ల... ఇలా చేస్తుందనుకోలేదురా..."
"అలాగే లేరా నేను ఏడవను లే పెద్దదాన్ని నేను ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళకెవరు ధైర్యం చెపుతారు..? చివరకు నా పెద్దరికం ఇలా ఓదార్పులకు పనికి వస్తున్నదిరా... నేను ఏడవను లేరా నువ్వు బయలు దేరి వచ్చేయ్యరా... మనం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేసరికి ధాత్రి వచ్చేస్తుందిరా. "అబ్బా అత్తయ్యా ఎంత బాగుందో..." అంటూ ఇంట్లోకి కూడా వెళ్ళకుండా ఉయ్యాల ఊగేస్తుంది... ఈ లోగానేను తనకిష్టమైన ఉల్లిపాయ పకోడి సేమియా పాయసం చేస్తానురా... అదే కాదు తనకేది కావాలన్నా చేస్తాను..." ఆమె కంఠం దుఃఖంతో వణుకుతుండగా ఫోన్ పెట్టేసింది. అహల్యకు ఏమి అర్ధం కాలేదు. ఆ దుఃఖ తీవ్రతలో ముందు ఈమెకు ఏమైనా ఆవుతుందేమో అని భయం వేసింది. లాభం లేదు ఆమెను మాటల్లో పెట్టాలి. బ్యాగ్ లో నుండి బిస్కెట్ ప్యాకెట్ తీసి ఆమెకు ఇవ్వబోయింది... "వద్దమ్మా నేను ఏమీ తినే స్థితిలో లేను అన్నది."
"లేదమ్మా ఏమి చెయ్యాలన్నా కాస్త ఓపిక కావాలి చూడబోతే మీరేదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నట్టున్నారు. ఓ రెండు బిస్కెట్లు తింటే కాస్త కాఫీ తాగుదాం. నాకు ఆకలిగావుంది..." అన్నది. ఆమె అహల్య వంక సూటిగా చూసి బిస్కెట్లు తీసుకుని అన్నది. అహల్య మరో రెండు ఇచ్చి తాను తిన్నది. ఇద్దరూ కాఫీ తాగారు... "నీవెవరో గాని తల్లి నిజంగానే కాస్త ఓపిక వచ్చింది. ఇవాలే కాదూ నిన్నా నేను ఏమి తినలేదు ఎలా తింటాను చెప్పుధాత్రిని అలా చూస్తుంటే..!" కాస్త ఆగింది.
"నాపేరు... అహల్యండీ నేను పనిమీద హైద్రాబాద్ వచ్చాను. ఇప్పుడు ఖమ్మం వెళ్తున్నాను. అక్కడ ఆంధ్రా బ్యాంక్ లో క్లర్క్ గా చేస్తున్నాను..." అహల్య మాటలను పెంచాలన్న ప్రయత్నిస్తున్నది.
"నా పేరు సావిత్రి... అత్తయ్యా నా పేరు ధాత్రి నీ పేరు సావిత్రి భలే కలిసాయి కదూ అంటుంది ధాత్రి... ఏదోలేమ్మా ఏదో పాత పేరు అంటాను నేను. పేరేదైతేనేం అత్తయ్యా నీ పక్కన మేమెవరం నిలబడ్డా వెల వెల బోతాం... ఇప్పుడే ఇలా ఉన్నావంటే మంచి వయసులో వున్నప్పుడు ఇంకెలా వుండేదానివో అత్తయ్యా..." అంటుంది "నీకేమే చక్కని చుక్కవి." అంటాను నేను "లేదత్తా నీ అంత రంగు లేను చూడు నీవెంత తెల్లగా ఉన్నావో మా అమ్మెందుకత్తా నన్నిలా పుట్టిచ్చింది. నీ అంత రంగుంటేనా..." అంటుంది. "రంగుంటే ఏం చేస్తావు ధాత్రి నీకు మంచి మనసుంది. నీ కలుపు గోరుతనం నీకు రక్ష. నీ చిరునవ్వుతో జనాన్ని గెలుచుకుంటావు. ఎవడొస్తాడోగాని చాలా అదృష్టవంతుడు అంటాను నేను... "అబ్బా వదినా మీరలా పొగిడితే అది భూమ్మీద ఆగుతుందా అంటూనే దిష్టి తీసేస్తుంటుంది రాధ. అంటే నా దిష్టి తగులుతుందనా చూడయ్యా సారధీ మీ ఆవిడ గడుసుదనం అంటాను నేను.. అత్తయ్యా చుక్క కూర చేసావా... అడుగుతుంది చేసాపమ్మా నాకు కాస్త వుంచుకుని మొత్తం నీకు పైకి పంపాను... అనగానే మా మంచి అత్తయ్యా అంటుంది..."
"కిందటి నెల ఓ అర్ధరాత్రి "అత్తయ్యా... అత్తయ్యా" అంటూనన్ను నిద్ర లేపింది అమ్మో రాధకో సారధికో ఏమైనా కాలేదు కదా అనుకుంటూ లేచాను "ఏంటమ్మా?" అంటూ ఉలిక్కి పడిలేచాను "ఇలా రా అత్తయ్యా అంటూ నన్ను పెరట్లోకి లాక్కెల్లింది. అప్పటికే అక్కడ రెండు కుర్చీలు వేసింది. "ఇక్కడ కూర్చో అత్తా నేను చూడాలి.." అన్నది.
'ఈ అర్ధరాత్రి ఏమి చూడాలి ధాత్రి.?" అయోమయంగా అన్నాను నేను.
"వెన్నెల అత్తయ్యా వెన్నెల... ఈ వెన్నెల్లో రాలుతున్న పారిజాతాలను చూడాలి అవి నేలన రాలకుండా నేను వాటిని నా వడిలోకి పట్టుకోవాలి... తెల్లారే వరకూ నా వడి నిండిపోవాలి..." అది ధాత్రేనా అని అనుమానం కలిగింది. దీనికి ఏ వనదేవతో పూనలేదుకదా అనిపించింది...
"అత్తయ్యా నేనొక్కదాన్నే వస్తే అమ్మా నాన్నా నన్ను చంపేస్తారు పాపం నీ నిద్ర చెడగొట్టాను కదూ... పొద్దున్నే పడుకుందువులే కావలిస్తే నీకు నేనే వంట చేసి పెడతా... చూడు ఆ నింగి కాసిన్ని నక్షత్రాలను పోన్నచెట్టుకూ... కాసిన్న నక్షత్రాలను పారిజాతాలకు పంచింది. గాలి వాటికి గంధం పూసింది. నేలతల్లికి చెట్టు పుష్పాభిషేకం చేస్తున్నది. నాకూ కొన్ని ఇవ్వూ అన్నాను చూడు ఎన్ని పూలనిచ్చిందో..." ఇలా మాట్లాడుతుందమ్మా ధాత్రి...
"మనిద్దరం కల్సి నర్సరీ పెట్టేద్దాం అత్తయ్యా అంటుంది... ఎక్కడ నుండో పొన్నపూలు ఏరుకొచ్చి అన్ని గదుల్లో అరమరల్లో వేస్తుంది ఏ పెర్ ఫ్యూమ్స్ పనికి వస్తాయి వీటి ముందు అంటుంది. ఏ పండగ వచ్చినా బుట్టెడు పూలు తెచ్చి నన్నూ రాధను కూర్చోబెట్టి దండలు గుచ్చి గుమ్మాలకు వేస్తుంది. చామంతుల కాలంలో నెలకు రెండు సార్లయినా పచ్చచామంతులు, తెల్లచామంతులు, చిట్టి చామంతులు కేజీల కొద్దీ తెచ్చి పోస్తుంది. నేనూ రాధ ధాత్రి కలిసి దండలు గుచ్చుతాము. బాబా గుడికెళ్ళి తన చేత్తో ఆ మాలలు వేస్తుంటుంది. నెలకోసారి రొట్టెలు చేసి గుడి మెట్ల దగ్గర బిచ్చగాళ్ళకు పంచుతుంది."
"నేనంటే వల్లమాలిన ప్రేమ. తను చేసే ప్రతి పనికీ సాగర్ రాధమ్మల నుండి తిట్లు పడకూడదంటే నన్ను అడ్డు పెట్టుకుంటుంది. అలాగని పిచ్చి పనులేమి చెయ్యదు. తన పుట్టినరోజుకి సేవాశ్రమంకి వెళ్ళి పండ్లు పంచింది. వారానికోసారి వెళ్ళి వాళ్ళకు వారపత్రికల్లో కధలో భారత భాగవతాలో చదివి వినిపిస్తుంటుంది. వాళ్ళ నాన్నకు దాన్ని బీటెక్ చేయించాలని... తనకేమో బీఏ చదివి ఐ ఏ ఎస్ చెయ్యాలని... అప్పుడు కూడా వాళ్ళమ్మా నాన్నతో నాతోనే చెప్పించింది. వారానికి రెండు మూడు రోజుల కింద పోర్షన్ లో నా దగ్గరే పడుకుంటుంది. ఎంత అర్ధరాత్రి వరకు చదువుకున్నా ఓపికవున్నా లేకున్నా అలారం పెట్టుకుని మరీ సూర్యోదయం చూస్తుంది. నన్నూ వాకిట్లోకి లాక్కొచ్చి చూపిస్తుంది. ఆ తరువాత పడుకుంటే పడుకుంటుంది. లేదా మళ్ళీ చదువు మొదలెడుతుంది. నీ బీఏ పూర్తయ్యాక కదా ఐఏఎస్ ఇప్పటినుండీ ఇంత శ్రమ ఎందుకమ్మా అంటాను. "లేదత్తా ఏం చదవాలో నిర్ణయమయ్యాక ఎలా చదవాలో కూడా తెలుస్తుంది... ఎన్నో నోట్స్ లు తయ్యారు చేసుకోవాలి" అంటుంది. ఇలాంటి పిల్లను మరి చూడం.
"దాని పుట్టిన రోజుకు వాళ్ళ అమ్మానాన్నా పట్టులంగా ఓణి కొన్నారు నేను గాగ్రా కుట్టించాను. అది వేసుకున్న ధాత్రి నిజంగా ఓ రాకుమారిలా వుంది. వాళ్ళ అన్నయ్య అమెరికాలో వున్నాడు ఈ వార్తను విని ఎలా తట్టుకుంటాడో... అసలు ఆ హాస్పట్లో అది అలా పడుకుని వుంటే నా ప్రాణం కొట్టుకుపోతున్నది. ఇక వాల్లమ్మా నాన్నలకు ఎలా వుంటుందో చెప్పమ్మా..?" ఆమె ఎదలోని మాటల వెల్లువ దుఃఖంతో మేళవించి బయటకు వస్తూంటే ఎక్కడా ఆపలేదు అహల్య.
"పుట్టిన రోజయ్యాక కూడా నెల రోజులు బాగానే ఉంది. కాస్త జ్వరం వస్తే మొదట్లో పట్టించుకోలేదు మొండిగా తిరుగుతుంటే నేనే కోప్పడి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాను. రెండు రోజుల్లో కాస్త తగ్గింది. ఇక ఆగదుగా ఏదో కోచింగంటూ, ఆశ్రమమంటూ, కోవెలంటూ, స్నేహితులంటూ ఎప్పటిలా తిరిగింది. మళ్ళీ జ్వరం ముదరబెట్టింది. సారధికి కాస్త భయమేసి ఖమ్మంలో చూపించాడు. ఈ సారి మందులకు పిల్ల భలే కోలుకుంది. ఎప్పటిలా చలాకీగా తయారయ్యింది. నేను మాత్రం ఇలా అర్ధరాత్రులవరకూ చదవద్దు పెందలకాడ పడుకో అని కోప్పడుతూనే వున్నానమ్మా... నాకు మాత్రం ఎవరున్నారు అబ్బాయికి నెల్లూరులో ఫుడ్ కార్పోరేషన్ లో వుద్యోగం. వాడికి ఇద్దరు పిల్లలు. అమ్మాయికీ పెళ్ళయి విజయవాడలో ఏదో కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నది. అల్లుడు కూడా పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్. ఎవరు వచ్చినా రెండు రోజులుండడం గగనం. నేను రిటైర్ అయ్యిన దగ్గరనుండీ మరీనూ... నా ప్రాణాలన్నీ ధాత్రి మీదే పెట్టుకుని బతుకుతున్నా అది కూడా అంతే ఈ ఐదారేళ్ళలో ఎంత చేరువయ్యిపోయిందంటే..." సావిత్రి కళ్ళు వర్షించసాగాయి. ఆమె మళ్ళీ కొంగుతో ముఖం తుడుచుకున్నది. అహల్య సావిత్రి వైపుకు వంగి చెవులు రిక్క బొడుచుకుని వింటున్నది...
"అక్కయ్యా నా చిట్టి తల్లికి ఏ అమెరికా సంబంధమో చేస్తాను అంటాడు వాళ్ళనాన్న... "నాన్నా... అన్నయ్యా దూరమై ఎంతో బాధపడుతున్నారు. ఇక నేను కూడా అమెరికా కెళ్ళి కూర్చుంటే మీరిద్దరూ ఏదైనా ఆశ్రమంలో చేరుతారా... సమస్యే లేదు. నాకు మిమ్ముల్ని చూడాలనిపించినా మీకు నన్ను చూడాలనిపించినా కనీసం మూడు, నాలుగంటల్లో రాగలగాలి... అలా అయితేనే చేసుకొంటాను" అనేది... అకస్మాత్తుగా మూడోసారి మంచాన పడ్డదమ్మా... అప్పుడు జరిగాయి పరీక్షలన్నీ... దాని రోగానికి లుకేమియా అని పేరు పెట్టారు డాక్టర్లు"
"ఇపుడు నా సమస్యంతా రాధా, సారధి ఎలా తట్టుకుంటారని కాదు... ఇది ఎవరూ ఊహించనిది... విధి లిఖితం మనచేతుల్లో ఏమీ లేదు మనకింతే ప్రాప్తం అనుకోవాలి... ధాత్రి అందరు అమ్మాయిలాంటిది కాదు... అది జీవితాన్ని ఎంతో ప్రేమిస్తున్నది. తన చదువు గురించి తన భవిష్యత్తు గురించీ తనకు కోటి కోర్కెలున్నాయి. అమ్మానాన్నల మీద మమకారం ప్రేమా వున్నాయి. తన ఆశయాలపట్ల బోలెడన్ని ప్రణాళికలున్నాయి. అలాంటిది తన బ్రతుకు అర్ధాంతరంగా ఆగిపోతున్నదని తెలిస్తే తట్టుకోగలుగుతుందా! అందుకే చెప్పాను తనకు కాస్త జ్వరమే తగ్గి పోతుందని చెప్పి కాస్త మత్తుగా ఉండగానే ముందా కాన్సర్ ఆసుపత్రి నుండి మంచి హొటల్ కి మార్చెయ్యండీ అని. అడ్వాన్స్ డ్ స్టేజీలో వున్న తనుకు కిమో థెరపీలు ఇచ్చి కడాయిలో వేపినట్టు వేపద్దని.".
"నేనూ సారధీ ఒకరిద్దరు డాక్టర్లను కనుక్కున్నాము. ఇంకా నెలలు అని కూడా చెప్పలేము... రోజుల్లో కూడా ముగిసిపోవచ్చు... మొదట్లో రెండుగా వున్న కాన్సర్ కణాలు నాలుగవుతాయి... చివర్లో రెండు లక్షల కణాలు నాలుగు లక్షలు, ఎనిమిది లక్షలు, పదహారు లక్షలు... ఇలా రెట్టింపవుతాయి. ఏ క్షణమయినా మరణం సంభవించవచ్చు. ఆ థెరపీలతో మరో రెండునెలలు జీవిత కాలాన్ని పెంచగలమేమోగాని... లేచి ఆరోగ్యంగా తిరిగే అద్భుతమేది జరగదు. థెరపీస్ ఇప్పించే సమయంలో వచ్చే ఎన్నో విషమ పరిణామాలను ఆ శరీరం తట్టుకోవాల్సివుంటుంది అన్నారు... అందుకే ఇక వైద్యం కోసం వెంపర్లాడక తనకు తనకిష్టమయిన ప్రశాంత వాతావరణంలో వుంచాలని తాపత్రయ పడుతున్నాం...
"ఈ రాత్రికే తనని హొటల్ గదిలోకి మార్చేస్తాము. రేపు సాయంకాలం వేళకు మధిర తీసుకొచ్చేస్తారు. తన కోసం నేను ముందే వెళ్ళి ఇల్లంతా సర్దాలి... సమయానికి పారిజాతాలు పూస్తున్నాయి. అవి చూసే తన కోసం రాత్రంతా జాగారం చేస్తాను. వీలైనన్ని పూలకుండీలు తెప్పించి పెడతాను. ఎప్పటినుండో ఇంటి ముందున్న మామిడి చెట్టుకు ఉయ్యాల కట్టమని గొడవ పెడుతుంది. ఇప్పుడది కట్టాలి. తెల్లారే మా అబ్బాయి వస్తాడు. చుట్టుపక్కల వారిని బతిమాలుకోవాలి. కాస్త సాయం చెయ్యమని... ధాత్రికి ఏమి చెప్పొద్దని... అది ఏ సూర్యోదయమో చూసి ప్రశాంతంగా నిదురించిన వేళో... పారిజాతాలు ఏరుకుని అలిసిపోయి పడుకున్నవేళో నిద్దట్లోనే పోవాలి. తను చచ్చిపోతున్నానని తనకు తెలియకుండానే పోవాలి... భగవంతుడా ఈ ఒక్క కోరికా తీర్చు..." గొల్లుమంది సావిత్రి.
ఎప్పటినుండి వింటున్నారో మిగతా ప్రయాణికులు కళ్ళు తుడుచుకుంటున్నారు. అహల్య ఆమెను అక్కున చేర్చుకున్నది. అలా ఎంతసేపు గడిచిందో ఖమ్మం స్టేషన్ రానే వచ్చింది. అహల్యకు సావిత్రిని వంటరిగా వదిలి దిగిపోబుద్ధి కాలేదు. ఇంతలో అహల్యకోసం వెతుక్కుంటున్న ఆమె శ్రీవారు కిటికీలోనుండి కనపడ్డారు...
"అమ్మా ఇక నేను దిగిపోవాలి మీరు ధైర్యంగా వుండాలి..." అన్నది.
"అయ్యో..! పిచ్చితల్లి నేను ధైర్యంగానే వుంటానమ్మా నేను చెయ్యాల్సిన పనులు చాలా వున్నాయి. ఎన్నాళ్ళనుండో ధాత్రి అడుగుతున్న వుయ్యాల కట్టాలి. ధాత్రిని సంతోష పెట్టాలి. చివరన ఆ దేవునికి మనసైన రోజున మరో ఊయల కట్టి తరలించాలి... ధాత్రి చూపులేమో ఆకాశం వంక... కాని ధాత్రిని తనలో కలుపుకునేందుకు ధరిత్రి వేచివున్నది కదా..." ఆ సాగరికను చూసి మరిక తట్టుకోలేక తప్పదు కనుక అహల్య దిగిపోయింది. విడువలేక విడువలేక వెళ్తూ కిటికీ దగ్గరకు చేరి మళ్ళీ ఆమె రెండు చేతులూ పట్టుకున్నది.
"అమ్మాయి నీవెవరో గాని నా బాధంతా నీకు చెప్పుకుంటే కాస్త మనసు తేలిక పడింది. అయినా ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరూ కనుక... ఎన్ని సార్లు అనుకున్నానో ఈ సారి నుండి అద్దెకున్న వారితో ఇంత అనుబంధం పెట్టుకోవద్దూ... తీరా ఏ ట్రాన్స్ ఫరో అయి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నప్పుడు ఎంతో బాధపడాల్సి వస్తున్నది అని... చూసావా అమ్మాయి ఇపుడా పిల్ల తన గూడే వదిలి వెళ్ళిపోతున్నది..!" సావిత్రి కళ్ళు వర్షిస్తూనే వున్నాయి. రైలు వేగం పుంజుకున్నది.
***