తెల్లవారింది. బద్దకంగా లేచాను.
రాత్రి చాలాసేపు నిద్రమేలుకుని వ్రాసిన విక్రమోర్వశీయ పద్యకావ్యపు దృశ్యాలు తియ్యని స్మృతుల్ని కదిలిస్తున్నాయి.
ఊర్వశీ దివ్య సౌందర్యం పద్యాల్లోకి కాంతిధారగా ప్రవహించి ఒచ్చినట్టనిపించింది.
పురూరవ చక్రవర్తి మధుర స్నేహసల్లాపాలతో నా కావ్యం పులకరిల్లినట్టు తోచింది.
సుధర్మలో, భరతముని ప్రయోగించే నూతన నాటికలోని నాయికాపాత్ర ధరించి, ఆ అప్సరః సుందరి, స్త్రీరమణీయతాసర్వస్వంగా రంగభూమికి అవతరించినప్పుడు వ్రాసిన ఈ పద్యం - రేషనుషాపు తీసే వేళయింది. చప్పున కాఫీ పుచ్చుకు వెడతారా? పాపం రాత్రి చాలాసేపు మేలుకున్నారు. ఏం చెయ్యను? తెచ్చుకునే రోజు తప్పదు"
ఇంద్రసభకు బదులుగా మా చాలీచాలని అద్దె వాటా, నాట్య ఉజ్జ్వలరూపిణీ ఊర్వశికి బదులుగా నిత్య సంసారయాత్రలో నలిగే పాతగళ్ళచీర బ్రాహ్మణీ కనబడేసరికి నా వురూరవ చక్రవర్తి హిందూ దేశంలో ఒక నాగరిక పట్టణంలోని ఆరోనెంబరు రేషను షాపు దగ్గరకు నడవలేక చట్టున తప్పుకున్నాడు.
ఎదురుగా కనబడే సిమెంటు కంపెనీ కాలెండరు మీద 45 సంవత్సరం 18 తారీఖు వాస్తవ జగత్తులో కనబడేసరికి నా ఒళ్ళు దహించుకుపోయింది.
బియ్యం లేవని తెలియగానే ఆకలి ఎక్కువగా ఉంది. అంత దివ్య సౌందర్యభూయిష్ట కళాసంపదను భావనాసంపత్తితో పుడమికి అవలీలగా అవతరింపచేయగల ఆంధ్ర కవీశ్వరునకు ఆకలి కలిగిందంటే ఎంత నీచం!
కాని వేస్తోంది! ఎవరితోనూ అనకండి, బాగుండదు.
మహేంద్రుడు గాని, అమరవేశ్యగాని ఈ కరువురోజుల్లో నా కెట్టి సహాయం చెయ్యలేరని రూఢిగా తెలిశాక మాసిపోయిన కేన్వాస్ సంచీ పుచ్చుకొని కళ్ళీడ్చుకుంటూ బజారుకు నడిచాను.
ఈనాటి కవి నిజస్వరూపం - ఎదుట నిలువుటద్దం లేకపోయినా - స్ఫుటంగా నా కళ్ళల్లో ఆనింది.
రోడ్డు ఎక్కేసరికి జమీందారుగారి కొత్త కారు రంయిమని నడిచేవారి కంట్లో దుమ్ము కొట్టి పరుగెత్తింది.
చట్టున టౌనుహాల్లో జరగబోయే గౌరవార్ధపు టీపార్టీలోని తేనేటి సువాసన నా మెదడుకు తగిలి వికారపెట్టింది.
పట్టణానికి ఒకవైపున చాలీచాలని కొలబత్తెపు బియ్యం కోసం తొక్కిడిపడే దౌర్భాగ్యుల కోలాహాలమైతే - ఇంకో వైపున బలిసిన లంచాలచేతులు కమ్మని వెచ్చని పదార్ధాలను సమృద్ధిగా సిల్కుసూట్ల బొజ్జల్లోకి నెమ్మదిగా జార్చడం గమ్మత్తుగా జ్ఞాపకం వచ్చి నవ్వాను.
రోడ్డుమీద జనప్రవాహం ఏవైపు నడుస్తున్నదో తెలియలేదు.
అప్పుడే రేషను షాపు తెరిచారు.
అధికారుల పిచ్చతవ్వలతో మట్టిరంగు బియ్యం రూపంలో న్యాయాన్ని పంచుతున్నారు.
పవిత్ర ఆర్యావర్తభూమిలో -
చప్పున షాపులోకి చొరబడడానికి వీలులేదు. నరశరీరాల గోడ అప్పటికే బలంగా ఏర్పడి ఉంది.
కొంతసేపు గడిచింది. ఉవ్వెత్తుగా మానవదేహభిత్తిక బీటవారి లోపల నుంచి ఒక కలకలం వినపడడం మొదలుపెట్టింది.
మేం ఆశ్చర్యపడి చూస్తున్నాం.
గుమస్తా కీచుగొంతుకతో అరుస్తున్నాడు. అయిదు నిమిషాల తర్వాత కీచుగొంతూ, ఇద్దరు నౌకర్లూ చేతుల్లో శక్తి అయిపోయేదాకా బాది ఒక పదార్ధాన్ని రోడ్డు మీదికి తెచ్చి విడిచిపెట్టారు.
అది నెమ్మదిగా కదలి అంటుకున్న రోడ్డు దుమ్ము దులుపుకుని, ఊడిపోయిన చిరుగుల తలగడ్డను సవరించుకొని వెనక వాలికలై ముందు మాసికలతో నిండిన చొక్కాతో పాలిపోయిన ముఖంమీద మొహమాటంగా పెరిగిన పేడిగెడ్డంతో మాటలు మోసే కూలీగాలేచి నించుంది .
వాడు ఏమీ జరగనట్టు, తగిలిన చోట చేతితోనైనా తడుముకోకుండా ముందుకు నడిచి పక్క తూముమీద కూచున్నాడు.
బియ్యం కొన్నాను. ఇటూ అటూ చూశాను. స్వయంగా పట్టుకుపోవచ్చు. కాని...
"బాబూ, కూలీ కావాలా?" - పరిగెత్తుకుంటూ వచ్చాడు.
"ఎంత?"
"... బేడ"
"పావలా ఇస్తాను. పట్టుకో"
చాలా సహజంగా అన్నాను. కాని - తిన్న దెబ్బల కన్న ఆ మాట నలిపింది గాబోలు. సిగ్గుపడి తల ఒంచుకొని మాట పుచ్చుకున్నాను.
వెనకనించి అందుకున్నారు - "మంచివాడు దొరికాడు"
"సగం బియ్యం తోవలో తినేస్తాడు" "పచ్చి దొంగ వెధవ"
"ఊరికే తన్నారా గుమస్తాగారు?" ఇంకా కూలి ఎందుకు?"
"ఏం? బేడ అడిగితే పావలా ఇచ్చే మహానుభావులు దొరికాక..."
"సామ్యవాదులండీ!"
దూరమై ఇక వినపడలేదు.
"నీ పేరెవరమ్మా"
నడుస్తూ తోచక వేసిన ప్రశ్న.
"సన్నాసండి"
"పద,"
చేతిలో పడ్డ పావలాకాసు చూసి సన్నాసి మొహం మరింత పాలిపోయింది. స్వార్దావరణం చీల్చి నిజమైన మనస్సు తెరచి చూపితే మనుషులు ఎంత దగ్గరకు వస్తారు! కాని నమ్మం అదే ఈనాటి నాగరికతలో ఉన్న విశేషం!
కొంతసేపటికి సన్నాసి ముఖం సంతోషంతో నల్లబడి - పురూరవ సార్వభౌముడు కాళీచేసిన చోట వెళ్ళి కూర్చుంది.
***
సోమవారం సంత.
ఫెళ్ళున సాగుతోంది.
ఇంద్రనీలమణి రాసులవంటి నీటివంకాయ గుట్టలూ, పచ్చలవంటి బచ్చలికూర స్తూపాలు, కెంపుల వంటి ఉల్లిగడ్డల పర్వతాలూ, సాయంకాలపు నీరెండ తగిలి మిలమిలా మెరుస్తున్నాయి. విజయనగర సామ్రాజ్యం ఉచ్చదశలో వెలిగేటప్పుడు వర్తకులు రాజవీధిలో రత్నాలు రాసులుపోసి పట్టు బాలీసుల కానుకుని అమ్మడం చూశానని అబ్దుల్ రజాక్ అన్న మాటలు నానాటికి ఆంధ్రదేశంలో సోమవారం సంతగా ప్రత్యక్షమైనందుకు సంతోషిస్తూ, మనకు ఏ రకం రత్నాలు ఎన్ని వీశలు కావాలో నిర్ణయించలేక ఆలోచిస్తున్నాను. నిండా అన్నం లేని ప్రజలకు ఇన్ని కూరలెందుకో?
అరటికాయల దుకాణం దగ్గిర చెళ్ళుమని చప్పుడయింది.
తిరిగి చూశాను.
చుట్టూ చేరిన నలుగురు 'పెద్ద మనుషుల' మధ్య మా కథానాయకుడు సన్నాసి కనపడ్డాడు. అధికార ముద్ర తగిలినట్టు దవడ ఎర్రగా కందింది.
ఒక కాపు పెద్ద చేత్తో కూరల బరువు మూట పట్టుకొని రెండో చేతిలో సన్నాసిని ఒడిసిపట్టుకుని అన్నాడు.
"యెదవలు... కూలిపని సేసుకోరాదూ, దొంగగడ్డి తినకపోతే... మూట లాగుతున్నాడు. సవట..."
కాలెత్తి, మళ్లా దయదలిచి ఊరుకున్నాడు, గాంధీగిరి అహింసా సిద్ధాంతం మీద చాలా గౌరవం ఉన్నవాడు!
"తప్పు కాదండీ! - లేకపోతే... అడుక్కోవాలి..."
మూకలో ముందున్న పంగనామాల తగుమనిషి పళ్ళులేని బోసినోటితో దేశంలోని నిరుద్యోగ నిర్మూలన రహస్యం నిమిషంలో పరిష్కరించి ఊరుకున్నాడు.
సన్నాసికి ఊపిరి తిరిగింది.
"మాట తెమ్మన్నారా బాబూ? అణాడబ్బులిప్పించండి. ఇంటి కాడికి, అందుకోసమే మూట ముట్టుకుంటే..."
"ఛప్! నోరుముయ్యి దొంగగాడ్దె! నాకు నీ కూలెందుకురా? ఇలాటివి పదిమూటలు పట్టికెళ్లగలను బుద్ధిగా బతుకు. తన్నులు తినేవు..." అని వెళ్ళిపోయాడు.
"మంచిపని చేశాడు. చూస్తే కూలి, చూడకపోతే నాలి. నాలి ముచ్చు వెధవలు" ఒక శోత్రియ బ్రాహ్మణోత్తముడు అరటాకుల కొట్టు దగ్గర్నుంచి తన అభిప్రాయం వెల్లడించాడు.
మళ్లా మామూలుగా జనప్రవాహం సంతలోకి ప్రవహిస్తోంది.
అలజడి క్రమంగా తగ్గింది.
సన్నాసి నెమ్మదిగా ఏదో కాలికింద గుచ్చుకున్నట్టుగా ఒంగి ఇందాకటి ఘర్షణలో పెద్దకాపు రొంటినుంచి జారగా ఇంతవరకూ ఎడంకాలి బొటనవేలితో తొక్కిపెట్టిన వస్తువును పదిలంగా తీసి బజార్లో నల్లమందుకొట్టవైపు చరచరా నడిచాడు.
***
సిరావర్షంలా చీకటి అలముకుంది.
రాత్రి పదిగంటలు దాటింది.
మబ్బుగా ఉంది.
చలిగాలి చెలరేగింది.
వెచ్చని అన్నం తిని ఇనప్పెట్టెలలాంటి గదుల్లో కాశ్మీర శాలువల్లోకి కమనీయ గాథల్లోకి వెళ్ళిపోయేవారికి ఆ రాత్రి ఎంత వరప్రసాదం! ఒక్క చలిరాత్రి చల్లారిపోయే ఎన్ని గుండెల్ని జ్వలింపజేస్తుంది!
సంతపాకలు తప్ప ఊరంతా, ఒత్తిగిలడానికి కూడా బద్ధకంగా నిద్రపోతోంది.
పగలంతా బైరాగివేషంతో తిరిగే ముసలి జంగం పాత పడవ ఒకరేవుకు చేరినట్టు సంతపాకల్లో ఒక మూల చేరి కొంత గడ్డి పోగుచేసి మంట వేసి గుడాకుపోగ తాగుతూ దగ్గుతున్నాడు.
చవకరకం కల్లుతాగి యెవరో పడమటి యాసతో కీచులాడి తిట్టుకుని నోరు నొప్పెట్టి సంతపాకల నాపరాళ్ళమీద ఒరిగారు.
అక్కడికి కొంతదూరంలో చింతచెట్టు కింద బసచేసిన ఎఱకల కుటుంబం లోంచి ఎఱకల పిల్ల నీలాలు చట్టున మెలకువ వచ్చి కూచుంది. అన్ని ముష్టి కుటుంబాలూ ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాయి. ఎటు చూసినా కారుచీకటి రాత్రి. పక్కని తల విరబోసుకున్న దెయ్యంలా పెద్ద చింతచెట్టు.
భయమేసింది.
తల్లిని లేపుదామని ఊరుకుంది.
"భయం మాటకేంగాని ఈ చీకటి రాత్రులు పడుచు మనస్సులకి ఎంత సరదాగా ఉంటాయి!" అనుకుంది నీలాలు. గొంతుగా కూచుని నిద్రలో చెదిరిన జుట్టు ఎగదోసుకుంటూ.
సందేళ తాగిన గంజి ఉడుకు చల్లారిపోయింది. ఆకలి మండిపోతున్నది.
పడుచుపిల్లకు చారెడు గంజినీళ్ళ బలం ఎంతసేపు?
చలిగాలి రివ్వున కొట్టింది.
లేతాకులా గజగజలాడి ఒళ్ళంతా కప్పని గడ్డతో వక్షాన్ని కప్పబోయింది.
రెండు చేతుల్నీ కలంగా 'ఇంటూ' గుర్తులా చేసి గుండెలకు అదుముకుంది.
మెరుపు మెరిసింది.
ఆకలి భగ్గుమంది.
లేచి నుంచుంది.
ఎదురుగా మంచం మిఠాయి పెట్టెకొట్లు కనబడుతున్నాయి.
మూసి ఉన్న కొట్టులోంచి మిఠాయి ఎలా వస్తుంది!
ఏమో?
ఆకలిగా ఉంది మరి -
నవ్వింది.
నున్నని నల్లశానపురాయిలా నిగనిగలాడే ముఖంలో పళ్ళు మెరిశాయి.
అడవిలో ముళ్ళపొదలమీద అడవిమల్లెపూలు జ్ఞాపకం వస్తాయి.
ఎవరు చూశారు?
చుక్కలు లేని ఆకాశం సిగ్గుపడింది.
పెట్టెకొట్టు అడుగున ఏ బల్ల ఐనా ఒదులుగా ఉండగూడదూ?
"దొరికితే చంపేస్తారు"
"ఈ ఆకలి బతకనిస్తోందా?"
"అది మొగోళ్ళపని."
మొగాడనగానే నవ్వొచ్చింది.
"ఆకలికి మొగా... ఆడా ఉందా?"
ఒక మొగాడు ఎట్లాగో తంటాలుపడి కొట్టుబద్దలు కొట్టి 'ఇదిగో మిఠాయి' అంటే ఎంత బాగుండును! అనుకుంది.
కొట్టుపక్క ఏదో నీడ కదిలింది. గుండెలు పట్టుజారినట్టనిపించింది. మనస్సు కూడదీసుకుని కొట్టుపక్క నక్కి కూచుంది.
రెండు నిమిషాలు నిశ్శబ్దం.
కొట్టు వెనక బల్ల ఊడలాగుతున్నట్టు వినబడి ప్రాణం కుదుటపడి మెల్లగా అక్కడికి మోకాళ్ళమీద పాకి తలయెత్తింది.
నీడ పారిపోయింది.
నీలాలు నాలుక కరుచుకుంది.
నోటి దగ్గర కూడు జారిపోయిందని విచారించింది.
నిటార్గా నించుని చూడగా వెనకతట్టు ఒక బల్ల సగం ఊడి ఉందిగాని ఒక మేకు పట్టుమాత్రం ఎక్కువగా ఉంది.
బలంకొద్దీ బల్లను గుంజి లాగింది. కదల్లేదు. ఒక కాలితో అడుగుభాగం తన్నిపెట్టి చెక్క పెకలించింది. బల్ల చప్పున ఊడి నీలాలు తూలి వెనక్కు పడిపోయింది. నీడ రెండు చేతులూ చాపి పట్టుకొని నించోబెట్టింది. చెమటపట్టిన చల్లని వెన్నుమీద వెచ్చని చేతులు బిగువుగా అనుకునేసరికి ఆ స్పర్శతో ఒక విశ్వ రహస్యం అర్ధమైపోయినట్టు తోచింది ఇద్దరికీ.
నీరసంతో అంతవరకూ చురుకుగా కదలలేని రెండుచేతులూ కొత్తగా చిగిర్చినట్టు పనిచేస్తున్నాయి.
నీడ నెమ్మదిగా లోపలికి దూరి చీకట్లో వెదకి ఒక వేరుశెనగ నూనె మిఠాయి జంగిడి పట్టుకుంది.
నీలాలు సాయంచేసి ఇవతలికి లాగింది.
కొన్ని లోపలికి జారిపోయిన జంగిడితో కొన్ని వచ్చాయి.
నీలాలు జంగిడితో కలిపి తినేసేటంత ఆకలితో ఉంది.
నీడకు ఇద్దర్నీ కలిపి తిందామని ఉంది.
"కూకో, తినేసేపోదం. మళ్ళా మోతెందుకు?"
"సాల్లే. ఎవరన్నా సూత్తే పక్కలిరుగుతాయి"
ఈ రోజు వొరసే ఇల్లా ఉంది"
"మొగసన్నాసికి ఇంత పిరికైతే... ఇక ఆడోళ్ళ కంతా కూడే..."
"ఆసి... నీవంటే... నీలి! కనిపెట్టేశావ్"
"ఓరి నీవంట్రా! పోల్చేశావు!"
"నడూ... నాన్నక..."
ఇటూ అటూ చూసి నీలాలు కర్ర పళ్ళెం చేతిలోపెట్టింది.
"తూరుపెంపుపాకకాడ ఎవరూ నేరు. అక్కడికి పోదాం" నడుస్తున్నాడు.
పక్క దుకాణం బడ్డీమీద మనిషి కదిలినట్టయింది కుక్క బొంయిమంది.
సన్నాసి చెంగున మురుక్కాలువ దాటి పరిగెత్తబోయాడు.
కాలుజారి మిఠాయి జంగిడి కాలువలో పడిపోయింది. ఇద్దరూ పరుగెత్తి తూరుపువైపు సంతపాకల దగ్గరికి రోజుకుంటూ చేరారు.
మెల్లగా మొగవాడు అరుగెక్కి నిరాశగా ఒకమూల ఇరికి కూచున్నాడు.
నీలాలు వెళ్ళి దగ్గరగా కూచుంది.
ఏమి మాటాడాలో ఇద్దరికీ తెలియలేదు.
సన్నాసి నీరసంగా తలగడ్డ నేలమీద పరిచి ఒరుగుతూ అన్నాడు. "ఒట్టి అలుపు మిగిలింది..."
నీ కర్మ"
అద్వైతసారం ఒంటిబట్టిన వేదాంతిలా నీలాలు వెటకారంగా నవ్వి వాడి భుజం మీద కొట్టింది. నీలాలు కళ్ళు ఆ కటికి చీకట్లో తెల్లనిప్పుల్లా మెరిశాయి.
"ఈ యేల కింతే పెట్టిపుట్టాం"
'ఉపనిషన్మధు' వొలికినచోట పుట్టినవాడు పలికాడు.
కాని వేదాంతికి కడుపు మండుతోంది. కన్నులు ఎంత నులిమినా మూతపడడంలేదు.
"మిఠాయిపోయి ఎర్రి యేదాంతం మిగిలిందిరా మనికి..." అని మరింత దగ్గిరగా జరిగి, దాచిన ఒక్క మిఠాయి ఉండ రెండుముక్కలు చేసి ఒకటి వాడిచేతిలో పెట్టి తనొకటి తిని కూచుంది.
చిటపట చినుకులు ప్రారంభించి టీన్ రేకు దారుణంగా ధ్వనిచేస్తోంది.
చలిగాలి రివ్వున కొట్టింది.
నీలాలు మాటాడకుండా ఒణికింది.
వర్షం ముదిరిపోతోంది.
సన్నాసి మూలిగి, జల్లుకొట్టని వెంపుకి పక్కమార్చి బద్ధకంగా కళ్ళు మూసుకున్నాడు. తగినంత గుడ్డలేని వెచ్చని వక్షస్థలం చుర్రున తన భుజానికి తగిలేసరికి మానవుడి తరతరాల నాటి ఉష్ణ వాంఛలతో ఒక్కసారిగా వాడి మనస్సు అంటుకుంది.
తన ఒంటిమీద గాయాలను ఒక్కటొక్కటిగా మృదువుగా తాకే మెత్తని రెండు చేతులనూ తీసి కళ్ళకద్దుకున్నాడు. బుద్ధి ఎరిగినప్పటిన నుంచీ ఈసడింపులూ, అవమానాలు మాత్రమే చూసినవాడి గాజుకళ్ళు తలవని తలంపుగా చెమ్మగిల్లాయి.
వాన కురుస్తూనే ఉంది.
మళ్లా తెల్లవారుతుందని, ఆ చల్లని చీకటి రాత్రి దయతో వాళ్ళకు జ్ఞాపకం చెయ్యడం మానేసింది.
***
(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)