అసలు రహస్యం - మోపూరు రాంశేషు

asalu rahasyam

తా తలనాటి ఆస్తి, దాయాదుల మధ్య, కోర్టులలో నలిగి నలిగి దివాకరానికి పదిలక్షలు వచ్చాయి. ఆ పది లక్షలతో దివాకరం తన తల్లి పేరు మీద ఫిక్స్ డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ లు చేయించాడు. "నాకెందుకురా రేపో మాపో పోయ్యేదాన్ని ఇన్ని లక్షలు నా మీద పెట్టావు" అడిగింది దివాకరం అమ్మ మహాలక్ష్మమ్మ.

"అదేమిటమ్మా! అలా అంటావు. ఇది నాన్న గారి డబ్బు. నీ పేరు మీద ఉండడమే ధర్మం." చెప్పాడు ధర్మరాజులా దివాకరం. కొడుకు తనమీద చూపించిన ప్రేమకు మహాలక్క్ష్మమ్మకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కొడుకు తనమీద చూపించిన ప్రేమను నలుగురితో చెప్పుకోడానికి ఎదురింటికి వెళ్ళింది.

తల్లికొడుకుల సంభాషణను ప్రక్క గదిలోంచి వింటున్న దివాకరం భార్య రాణి చండీరాణియే అయ్యింది. ఉక్రోషంతో దివాకరం దగ్గరకెళ్ళి "ఎప్పుడైనా పట్టు చీరో, నగలో కొనమని నేను అడిగితే డబ్బులు, దాని విలువ అంటూ గంటలు గంటలు క్లాసు పీకే నువ్వు రేపో మాపో గుంటలోకి వెళ్ళే మీ అమ్మ పేరు మీద లక్షలు లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్లు చేస్తావా? నన్ను నా బిడ్డని అనాధలని చెయ్యాలనికున్నావా" అంటూ పదర మనం ఏ నుయ్యో, గొయ్యో చూసుకొందాం" అంటూ ముక్కు చీదేసింది. అమ్మ చేసే ఓవరాక్షన్ తెలీక నాని గాడు బిక్కమొహం వేస్కుని నిలబడ్డాడు.

"అయిపోయిందా..ఇంకా ఏమన్నా మిగిలుందా" విసుక్కున్నాడు దివాకరం. "లేదు..ఇంకా ఏమీ మిగల్లేదు. ఆ కోర్టులో వచ్చిన డబ్బులన్నీ మీ అమ్మ పేరుమీదేగా వేసావు. ఒక్క రూపాయి కూడా మిగల్లేదు. మాకు ఏడుపే మిగిలింది." పెద్ద పెట్టున ఏడుపు లంకించుకుంది రాణి. రాణి ఏడవడం చూసి నాని గాడు కూడా ఏడవడం మొదలుపెట్టాడు.

"ఆపుతావా.... ఎవరన్నా వింటే నేను పొయ్యాననుకుంటారు. అవును మా అమ్మంటే నాకు ఇష్టం. చిన్నప్పుడు మా నాన్న చనిపోతే నాకు ఏ లోటూ తెలీకుండా నన్ను చదివించి, ప్రయోజకుడ్ని చేసింది. అలాంటి మా అమ్మకు నేను ఎంత చేసినా తక్కువే." ఉద్వేగంతో చెప్పాడు దివాకరం.

ఇంట్లో ఏడుపులు విని కంగారుగా లోపలికి వచ్చిన మహాలక్ష్మమ్మకు లోపలి దృశ్యం చూసి కొడుకుకి తన మీద ఉన్న ప్రేమకు తల్లి హృదయం ఆనందంతో ఉక్కిరిబిక్కిరై ఊపిరాడక క్రింద పడింది.

పెద్ద కార్పోరేట్ హాస్పిటల్లో మహాలక్ష్మమ్మ చుట్టూరా బంధువులు. " నీకేం వదినా! నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే కొడుకు ఉండడం నీ అదృష్టం రెండు లక్షలు పెట్టి నీ గుండె ఆపరేషన్ చేయించాడు. ఈ రోజుల్లో తల్లికి అన్నం పెట్టడడమే దండగ అనుకుంటున్నారు. మావాడు వున్నాడు, ఎందుకు పనికి రాని చవట, పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతాడు." ఎదురింటి వెంకట లక్స్మి చెబుతూంటే మహాలక్ష్మమ్మ గుండె ఆనందంతో నిండిపోయింది. దివాకరం లాంటి కొడుకు ఉన్నందుకు. అదీ తను కన్నందుకు.

దివాకరం తల్లి ఆపరేషన్ కి రెండు లక్షలు ఖర్చు పెట్టాడని తెలియగానే రాణి ఒంటికాలిపై భర్త పైకి వెళ్ళింది.

"ఉన్న డబ్బంతా మీ అమ్మకే ఖర్చు చేసేస్తే నేను, నా కొడుకు అడుక్కు తింటాం. అప్పుడు హాయిగా నువ్వొక్కడివే వుందువుగాని" మళ్ళీ ముక్కు చీదేసింది.

"ష్..గట్టిగా అరవకు ప్రక్క గదిలో అమ్మ నిద్ర పోతుంది." అన్నాడు దివాకరం.

చూసావా..ఇప్పుడు నేను ఏడిస్తే మీ అమ్మ నిద్ర పాడవుతుందని బాధ పడ్తున్నావుగానీ నా ఏడుపు మీకు అక్కర్లేదు." మళ్ళీ ముక్కు చీదేసింది.

" పిచ్చి మొహమా దగ్గరికి రా నీకొక దేవ రహస్యం చెబుతాను. సీనియర్ సిటిజన్స్ కి బ్యాంక్ వాళ్ళు ఎక్కువ శాతం వడ్డీ రేటు ఇస్తారు. అందుకే అమ్మ పేరుమీద ఫిక్స్ డ్ డిపాజిట్ చేసాను. నామినీగా నీపేరే పెట్టాను. ఇన్సూరెన్స్ లంటావా, ఎక్కువ కాలం మా అమ్మ బతకదు కాబట్టి ప్రీమియంలు అన్ని చెల్లించకుండానే ఇన్సూరెన్స్ మొత్తం మిగులుతుంది. చనిపోయిన తర్వాత భారీ మొత్తంలో డబ్బు మన చేతికి వస్తుంది. ఇక గుండె ఆపరేషన్ డబ్బులు హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చారు. ఒక్క ప్రీమియం అమౌంటే ..." దివాకరం చెప్పుకుంటూ పోతున్నాడు.

భర్త చెబుతున్న మాటలకు రాణి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. "మరి ఈ విషయం ఆ రోజే ఎందుకు చెప్పలేదు" అనడిగింది.

"చెబుదామనే అనుకున్నా...ఇంతలో మా అమ్మ రావడం గమనించా, అందుకే మా అమ్మ మీద ప్రేమ ఉన్నట్టు నటించా" అసలు విషయం చెప్పాడు దివాకరం.

"అయ్యో అనవసరంగ మిమ్మల్ని నానా మాటలు అన్నాను నన్ను క్షమించండి." గారాలు పోతూ చెప్పింది రాణి.

నీళ్ళు తాగుదామని లేచిన మహాలక్ష్మమ్మ కొడుకు దివాకరం మాటలు విని, కొడుకు తనపై చూపించిన ప్రేమ వెనక అసలు రహస్యం తెలుసుకుని బాధతో విలవిలలాడింది.

మరిన్ని కథలు

Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు