నడుస్తున్న చరిత్ర - ఆదెళ్ళ శివకుమార్

nadustunna charitra

మయం... మధ్యాహ్నం పదకొండున్నర గంటలు

ప్రదేశం... స్మశానం.

సంఘటన... శవం కాలుతుంది.

కాటికాపరి నిర్లిప్తంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. చితి చుట్టూ దాదాపుగా ఇరవైమంది దాకా జనం వున్నారు. అందరి ముఖాలు గంభీరంగా, విషాదంగా వున్నాయి. విషాదం అంటే పూర్తి విషాదం కూడా కాదు. కొందరం కొంచెం ఇవతలికి వచ్చి అరచేయి అడ్డు పెట్టుకుని, లో గొంతుకలలో సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఇంకొందరు బ్లాంక్ ఫేస్ లతో చితి వంకే చూస్తున్నారు. మళ్ళీ అది దుఃఖం కూడా కాదు 'ఎంత త్వరగా తతంగం పూర్తవుతుందా?' అనే ఇరిటేషన్ క్షమించాలి అసహనం కావచ్చు వాళ్ళ బుర్రలో ఏ ఆలోచనలు తిరుగుతున్నాయో సరిగ్గా వాళ్ళకే తెలీదు ఇంక మనకేం తెలుస్తుంది?

కఫాలం 'ఫట్' మంటూ పగిలింది.

గుంపులోని జనం కొందరు 'గోవిందా' అనుకున్నారు. 'ఇక ఎళ్ళండి... ఇక్కడుండి మీరు చేసేదేమీ లేదు..." కాటికాపరి కొంచెం అసహనంగా చెప్పాడు. అతని కోపం అతనిది. అడిగిన మొత్తంలో సగం బేరం ఆడి డబ్బులు చేతిలో పెట్టారు పైగా కట్టెలు, కిరోసిన్ అన్నీ వాళ్ళే తెచ్చుకున్నారు. "ధూ... కక్కుర్తి నాయాళ్ళు... ఎప్పటికైనా ఈడకి రాకపోరు... అప్పుడు చెబుతా మీ పని..." కసిగా తనలో తనే గొణుకుతున్నాడు. వాళ్లొచ్చేసరికి ఈయనే అప్పుడూ కాటికాపరిలాగా వుంటాడా అన్నది వేరే ప్రశ్న.

"వాడెంత ఫోజ్ కొడుతున్నాడో చూశారా? ఎంత డబ్బిచ్చినా చాలదు వెధవకు... శవాల మీద వ్యాపారం అంటే ఇదే కాబోలు..." ఓ పెద్ద మనిషి తన ప్రక్కనున్న ఇంకో పెద్దమనిషితో అంటున్నాడు.

"అందుకే హాయిగా ఎలక్ట్రిక్ క్రిమిటోరియమ్ లో చేయిస్తే పోయేది..."

"గంధపు చెక్కలతో తగలబెట్టాలని ఆయన కోర్కె... బాగానే సంపాదించాడు కదా ఏదైనా కోరుకుంటాడు..." అని గొంతు తగ్గించి "అన్నట్లు మీరు ముఫ్ఫైనో, అరవై లక్షలో ఇవ్వాలంటగా బైట జనం టాక్..." అన్నాడు.

ఆ పెద్ద మనిషి సీరియస్ గా చూశాడు "చచ్చినోడు వచ్చి నీతో చెప్పాడా? పోనీ నోటూ, పత్రం వుందా? ఎవడిష్టం వచ్చినట్టు వాడనుకుంటే దాంతో నాకేం సంబంధం?" గట్టిగానే అన్నాడు.

స్మశానం దగ్గర్లో గజం భూమి ధర ఎంత వుంది? దినానికి మేకపోతులు ఎక్కడ నుండి తెప్పించాలి? ముగ్గురు కొడుకులు ఆస్తి పంచుకుంటే ఒక్కోడికి ఎంత వస్తుంది? ఏ కొడుకుతో మంచిగా వుంటే లాభం? కూతురు ఆస్తిలో నాకూ వాటా వుందని కోర్టులో కేసు పెడుతుందా? నిజంగానే ఆయుష్షు తీరి చచ్చిపోయాడా లేకపోతే ఆస్తికోసం ఇంట్లో వాళ్ళే మందు పెట్టి చంపేశారా? పిల్లికి బిచ్చం పెట్టకుండా అడ్డమైన పనులూ చేసి ఎన్నికోట్లు వెనకేసి ఉంటాడు?


ఈవిధంగా అత్యంత విలువైన, ప్రీతికరమైన, ఆనందదాయకమైన సంభాషణలు చేసుకుంటూ ఆ మరణించిన వ్యక్తి తాలూకు బంధువులు, స్నేహితులు స్మశానం నుండి తిరిగి 'జనారణ్యం' వైపుగా సాగిపోయారు.

***

"ఏంటిది?"

మంత్రిగారు సీరియస్ గా అడిగేసరికి పీఎ భయంగా నటించాడు. నిజంగా భయపడటం మానేసి చాలాకాలం అయ్యింది. ఎందుకంటే ఆయన తాలూకు బొక్కలు, స్కాములు, బినామీలు అన్నీ పీఎకి సృష్టంగా తెలుసు. పైపైన బెదిరించటమే కానీ పీఎని ఏమీ చేయలేనని మంత్రిగారికి కూడా తెలుసు. అందుకే గొంతును మరింత గంభీరంగా మార్చుకుని అడిగాడు.

"ముందు అనుకున్నట్లు వాళ్ళు ఇవ్వాల్సింది ఎనభైకోట్లు కదా ఇప్పుడేంటి అరవైతో సరిపెట్టేస్తున్నారు?"

పీఎ ఈసారి వినయంగా నటించాడు. "దానికే ఏడుస్తున్నారు సార్... కాంట్రాక్ట్ లో పెద్దగా మిగిలేదేం లేదంటున్నారు. అనుకున్నదానికంటే ఎక్కువే ఖర్చయిందంట... నాలుగొందల అడుగులు అనుకుంటే ఎనిమిది వందల అడుగులు దాకా డ్రిల్ చేయాల్సి వచ్చిందంట... ఇంజనీరింగ్, మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోయాయని ఒకటే గొడవ..."

"ఇదంతా చెప్పటానికి నువ్వెంత నొక్కావురా?" మంత్రిగారు పైకి అన్లేదు మనసులో అనుకున్నారు. ఆయనకీ తెలుసు తెగేదాకా లాగితే ఆ కాంట్రాక్టర్ తన మొగుడి దగ్గరకే పోతాడు అప్పుడు అసలైన లెక్కలన్నీ బైటకొస్తాయి.

నీటిలో వుండే ఫ్లోరోసిస్ తదితర విష పదార్ధాల కారణంగా మనుష్యులు, జంతువులు, ఇతర ప్రాణులు దారుణంగా బలైపోతున్నారన్న దయతో ఏదో విదేశీ ప్రభుత్వం మన స్వదేశీ ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయల గ్రాంట్ ఇచ్చింది. ఆ డబ్బుతో నీటిని శుద్ధి చేసి స్వచ్చమైన నీటిని జనానికి అందించాలి. వెయ్యి కోట్లు ఇంకా రాకముందే అంచనాలు, కమీషన్లు, లెక్కలు పూర్తయిపోయాయి. ఇప్పుడు వాటాలు తేల్చుకుంటున్నారన్నమాట.

"సరే ఫైనల్ గా ఇంకో ఐదు పంపమని వాడికి చెప్పు... త్వరలో ఎలక్షన్లు వస్తున్నాయి... ఈసారి ఎంత మేత పెట్టాలో మళ్ళీ రూలింగ్ లోకి రాకపోతే జీవితాంతం కోర్టులు, ఎంక్వయిరీ కమీషన్ల చుట్టూ తిరగాలి..."

"చేసుకున్నవాడికి చేసుకున్నంత..." పీఎ కూడా పైకి అన్లేదు మనస్సులో అనుకుంటూ వినయంగా తలాడించాడు.

***

"అన్నా... కొంచెం భయంగా వుందన్నా... పోలీసులు పట్టుకుంటారంటావా?"

లారీ నడుపుతున్న డ్రైవర్ నోరంతా తెరిచి పెద్దగా నవ్వాడు. ఆల్కహాల్ వాసన గుప్పుమంటూ కొట్టింది. "ఎందుకురా భయం నీకు? ఇప్పటికో వంద ట్రిప్పులేసుంటాను... ఏమౌతుంది? ఏమీకాదు కంగారుపడకు... పోలీసులు ఆపితే ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు... నువ్వు గమ్మున కూర్చో..." అంటూ టేప్ రికార్డర్ ఆన్ చేసాడు. టేప్ లోంచి "రింగా రింగా... నా బొంగులో నీ టింగురో..." లాంటి అచ్చమైన సంసారపక్షం పాట వింటూ ఆనందంగా లారీ నడపసాగాడు.

"కానీ పాపం కదన్నా..." అన్నాడు ఇంకా పద్దెనిమిదేళ్ళు దాటని క్లీనర్ కుర్రాడు.

"ఎహే... ఏంట్రా పాపం?" డ్రైవర్ విసుగ్గా అన్నాడు.

"పాపం ఆవుల్ని 'కబేళా' కు తోలేయటం పాపం కదా అన్నా...! పిండుకున్నంత కాలం పాలు పిండుకుని, అది పెట్టిన పిల్లల్ని అమ్ముకుని ఇప్పుడు ఇలాగ కబేళాకు తోలేయటం అంటే..." క్లీనర్ గొంతులో కొంచెం బాధ ధ్వనించింది. ఇంకా ఈ సమాజం తాలూకు విష ప్రభావం పూర్తిగా సోకలేదు కాబట్టి సహజంగా నిజమైన మనిషిలో వుండే మానవత్వంతో ఆలోచిస్తున్నాడు.

"నీకెందుకురా పెద్ద పెద్ద మాటలు... లోడు ఆడదింపి కిరాయి తీసుకుని పోవటమే... వాళ్ళు వాటిని చంపుకుంటారో, లేదా వండుకుని తింటారో నీకూ నాకెందుకురా... తింటానికి గడ్డి లేదు, త్రాగటానికి నీళ్ళూ లేవు... రోజూ చావటం కంటే ఒక్కసారే చావటం నయం కదా!" మనిషి తాను చేసే దుర్మార్గం, ఘోరం, హీనమైన చర్యలను సమర్ధించుకునే వాదనలు ఎప్పుడూ సిద్ధం చేసుకుంటాడు కాబట్టి ఆవులను 'కబేళా' కు తరలించే లారీ డ్రైవర్ తన లాజిక్ తాను ప్రదర్శించాడు.

నాలుగు రోజుల క్రితమే క్లీనర్ గా చేరి ఇంకా గుండెల్లో మానవత్వపు 'తడి' ఆరని పదహారేళ్ళ కుర్రాడు ఏమీ మాట్లాడలేదు.

'గోవధను నిషేధించాలి... ఆవు మన మాతృమూర్తి..." అని రోడ్డు పక్కన పెట్టిన ఫ్లెక్సీ మీదుగా ఆవులను 'కబేళా'కు తరలిస్తున్న ఆ లారీ దూసుకుపోయింది 'రింగా రింగా' పాటను వినిపిస్తూ...

***

"పోయినసారి ఆళ్ళు ఓటుకు ఐదొందలిచ్చారు... ఈసారి కనీసం వెయ్యిలేనిదే కుదర్దు..."

బడ్డీ కొట్టు దగ్గరకెళితే అర్ధ రూపాయి బీడీ కూడా అప్పు పుట్టని వాడు అంత ఖరాఖండీగా ముఖం మీద చెప్పేసరికి ఆ పెద్దాయనకు చప్పున కోపం ముంచుకొచ్చింది. కానీ 'రాజకీయం' కోపాన్ని ఆర్పింది. ఎలక్షన్ల టైం లో మానాభిమానాలకు స్థానం లేదు ఆ ఎలక్షన్లు కాస్తా గట్టెక్కితే మళ్ళీ ఐదేళ్ళదాకా వీళ్ళతో పనేముంది?

"సర్లే ఈసారి ఏడొందలు తీసుకోండి..."

"కుదర్దు... మా ఇంట్లో ఆరోట్లున్నాయి... మొత్తం ఆరేలు... వద్దంటే చెప్పండి... వేరేవాడు నాల్రోజుల్నుండీ ఇంటిచుట్టూ తిరుగుతున్నాడు... మళ్ళీ మందూ, బిర్యానీ కూడా ఫ్రీ అంట..."

వెంకటేశ్వరస్వామి పటం మీద ప్రమాణం చేయించుకున్నాక మూడువేలు అడ్వాన్స్ ముట్టిన దేశ సగటు ఓటరు ముఖం వికసించింది.

ఎన్నికలు జరిగే నాలుగురోజులూ పండగే ఆ తర్వాత రోజుల సంగతి ఇప్పుడెందుకు?

"కానీండ్రా... కానీయండి... బియ్యానికి ఇరవై, కందిపప్పు ముఫ్ఫై, వంటనూనె నలభై, పెట్రోలు యాభై పెంచితే అందరికీ దూల వదులుద్ది..." పైకి అనలేదు మనస్సులో అనుకుంటూ ముఖం మీద చిరునవ్వు అతికించుకుని 'ఓట్ల షాపింగ్' కు బయలుదేరాడా పెద్దాయన.

***

"పాతికవేలు ఖర్చవుతుంది..."

"పావుగంట పనికి పాతికవేలా?"

డాక్టరు గారు ఇరిటేటింగ్ గా చూసారు. "పని పావుగంటే... దొరికితే పదేళ్ళు జైల్లో వుండాలి... హాస్పిటల్ క్లోజ్ అవుతుంది..."

"పదిహేను వేలు తీసుకోండి సార్..."

"ఆడపిల్ల పెద్దయితే ఎంత ఖర్చో ఆలోచించు... పోనీ రెండేళ్ళు పెంచి అమ్మేయ్... పిల్లల్ని కొనుక్కునేవాళ్ళూ వున్నారు... డీల్ నేనే కుదురుస్తాను... ఇరవై పర్సంట్ కమీషన్ ఇవ్వాలి..."

అతను గబగబా లెక్కలేసుకున్నాడు. మొత్తానికి ఇరవై వేలకు డీల్ కుదిరింది... ఎల్లుండే ముహూర్తం. అమ్మ కడుపులో నిశ్చింతగా బజ్జున్న బుజ్జి తల్లికి తన ప్రాణానికి రేటు కట్టేసిన విషయం తెలీదు.

***

"ఐ లవ్యూ..."

"ఇప్పటికి ఎంతమందికి చెప్పావ్?"

"ప్రామిస్... ఇదే ఫస్ట్ టైం..."

ఆ అమ్మాయి తమాషాగా హీరోయిన్ ను అనుకరిస్తూ నవ్వింది... "నీలిమకి ఐ లవ్యూ చెప్పిన సంగతి నాకు తెలీదనుకున్నావా?"

కుర్రవాడి ముఖంలో రంగులు మారాయి కానీ వెంటనే కవర్ చేసుకున్నాడు... "లైట్ తీస్కో అదో టైంపాస్ లవ్ అంతే..."

"మరి నాది?"

"సిన్సియర్ లవ్ మై డార్లింగ్..." శరీరంలో వుండే టెస్టోష్టిరాన్ ప్రభావంతో చెప్పాడా కుర్రాడు. అది వాస్థవం కాదని, ఆ అమ్మాయికీ తెలుసు కానీ ఆ అమ్మాయి లెక్కలు, కొలతలు, కాలుక్యులేషన్స్ ఆ అమ్మాయికి వున్నాయి.

"రాత్రిళ్ళు నీ ఫోన్ ఎంగేజ్ వస్తే నేను ఊరుకోను..."

"రాదు... ప్రామిస్..."

"నా ఫోన్ ఎంగేజ్ వచ్చినప్పుడు నువ్వు అడ్డమైన ప్రశ్నలు అడక్కూడదు..."

"అస్సలు అడగను... నీమీద నాకు పూర్తి కాన్ఫిడెన్స్ వుంది..."

"మన లవ్ వర్కవుట్ అయ్యేదాకా ఫుల్ కాన్ఫిడెన్షియల్ గా వుంచాలి... మీ తొట్టి గ్యాంగ్ దగ్గర పబ్లిసిటీ చేయకూడదు..." తన కండిషన్ల లిస్ట్ చదవడం మొదలుపెట్టింది. ఆ అబ్బాయి అన్నింటికీ తలూపుతూనే వున్నాడు. అసలు వింటున్నాడా? అన్నది డౌటే కానీ ఇద్దరు మోడ్రన్ ప్రేమికుల ప్రేమకు సంబంధించి ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి.

"కాలేజీ బ్యూటీని పటాయించిన 'క్రెడిట్ కావాలంటే కాస్త ఖర్చవుతుంది. షాపింగులు, మొబైల్ రీ చార్జ్ లు, ఖరీదైన గిఫ్ట్ లు ఇవన్నీ ఆధునిక ప్రేమలో విడదీయలేని ముఖ్యాంశాలు.

కాలేజ్ బంక్ కొట్టి మార్నింగ్ షో కార్నర్ సీట్లో కూర్చున్న దేశ యువతరానికి సంబంధించిన ఆ అమ్మాయి, అబ్బాయిల మధ్య 'ప్రేమ ఎగ్రిమెంట్' సిన్మా థియేటర్ లో ప్రారంభం అవటంతో రొమాన్స్ లో పడిపోయారు.

హాండ్ బ్యాగ్ లో సైలెంట్ మోడ్ లో వున్న ఆ అమ్మాయి ఫోన్ వెలిగీ ఆరుతుంది. ఆ అమ్మాయి పధ్నాలుగో బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు.

***

ఆయన తలెత్తి ఆకాశం వంక చూస్తున్నాడు.

ఆయన తండ్రీ, తాత కూడా అలాగే చూసేవాళ్ళు. ఆ చూపు వెనుక వుండే దుఃఖం, ఆవేదన చాలామందికి తెలీదు. తెల్సుకునేంత ఓపిక, జ్ఞానం, కూడా లేదు.

ప్రాణాన్ని మొక్కగా నాటి, రక్తాన్ని నీరుగా పోసి పెంచుతున్న పొలం నీళ్ళు లేక ఎండిపోతుంది. ఆకాశంలో మబ్బుల్లేవు. భూమిలో వెయ్యి అడుగులు పోయినా నీరు లేదు. పోనీ నీటిని తోడటానికి మోటార్ కి కరెంట్ లేదు. ప్రపంచానికే అన్నం పెట్టే రైతు ప్రాణం అలా గాల్లో దీపంలా రెపరెపా కొట్టుకుంటుంది.

రైతు పండించిన దానికి గిట్టుబాటు ధర రాదు. బియ్యం, పప్పులూ కొనుక్కునే వాడికి ధరలు అందుబాటులో వుండవు. పండించిన వాడూ, వినియోగించే వాడి మధ్య వుండే 'పిశాచగణం' మాత్రం రక్తం త్రాగి నిరంతరం బలుస్తూనే వుంటాయి.

రెండు రోజుల తర్వాత...

జిల్లా ఎడిషన్ లో మారుమూల పేజీలో రెండులైన్ల వార్త పడింది.

"అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య..."

జనం, సమాజం పెద్దగా పట్టించుకోలేదు. అదేం పెద్ద విషయమేం కాదు కదా! రోజూ ఎక్కడో ఒకచోట రైతు చస్తూనే వుంటాడు? ఎందుకు చస్తున్నాడు? అని విశ్లేషించేంత తీరిక ప్రభుత్వాలకూ, జనాలకూ లేదు. ఎవరి బిజీ వాళ్ళది.

ఇరవై వేల కోట్లు దోచుకున్న రాజకీయ నాయకుడికి బెయిల్ దొరుకుతుందా? లేదా? అన్నది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. అది కాకపోతే రేపులు, మర్డర్లు, సిన్మా రంకు పురాణాలు వుండనే వున్నాయి...

"ధూ... దీనెమ్మ సమాజం చెడిపోతుంది..." అనుకునేవాడే ప్రతోడూ. సమాజం అంటే ఏమిటి? నేను తప్ప ఇతరులన్నమాట...

***

"అమ్మ, నాన్నల్ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పిస్తే మంచిది..."

"ఎందుకు?" అని అతను అడగలేదు. అడిగితే చాలా విషయాలు బైటకొస్తాయి. ఆరు నెలలు ఇక్కడా, ఆరు నెలలు అక్కడ... పల్లెటూళ్ళ ఖర్చు తక్కువ... సిటీల్లో ఖర్చు ఎక్కువ. ఆ లెక్కన తానే ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు. ఈ గొడవ అంతటి కంటే చెరో నాలుగువేలు వేసుకుంటే ఇద్దరూ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వుంటారు. ఈ లెక్కలు, బాధ్యతలు, ఏడుపులు, విసుక్కోవటాలు, ముఖ్యంగా కొంపలో 'ముసలివాసనా' లేకుండా వుంటుంది.

'మీకు ఇష్టమేనా?' అని ఆ తల్లితండ్రుల్ని ఎవ్వరూ అడగలేదు. సెకండ్ హాండ్ వస్తువులను అమ్మేయటానికి ఎంత తాపీగా నిర్ణయం తీసుకుంటారో అంత తేలిగ్గా ఆ వృద్ధ తల్లితండ్రుల జీవితం గురించి నిర్ణయం తీసుకోబడింది.

అమ్మనాన్నలు 'ఎదిగిపోయిన' తమ బిడ్డల 'మేధస్సు' కు ఆశ్చర్యపోయారు. బాల్యం నుంచీ నేర్పిన కెరీరిజం, లౌక్యం, కూసింత స్వార్ధం తాలూకు పరిణామక్రమం ఇది. వాళ్ళకు అమ్మ, నాన్నలు గుర్తొచ్చారు. బిడ్డల చదువుల కోసం తల్లితండ్రుల్ని పల్లెటూళ్ళో వదిలేసి సిటీ సుఖాలకు అలవాటుపడ్డ ప్రాణాలు కొంత కాలం గడిచేసరికి తమ 'కెరీరిజం' తాలూకు పెంపకం ఇప్పుడు తమ 'నిజ స్వరూపాలను' ప్రదర్శించటం మొదలుపెట్టాయి. జీవితం అంటే ఇదేనా?

కొడుకులు గొప్పవాళ్ళవ్వాలని మనస్సు చంపుకుని బిడ్డల్ని రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల్లో పెట్టి అప్పులు చేసి తినీ తినక ప్రాణం పెట్టి చదివించిన తల్లి తండ్రుల 'ఋణం' 'ఓల్డ్ ఏజ్ హోమ్' కు చేర్చటం ద్వారా పరిసమాప్తం... ఇదీ మోడ్రన్ 'ఋణ విముక్తి' ప్లానింగ్...

***

సాయంత్రం అవుతుంది.

డెబ్భై ఏళ్ళ వృద్ధుడు అత్యంత ఏకాగ్రతతో, మమకారంతో మొక్కలు నాటుతున్నాడు. రెండు, మూడుసార్లు చూపు ఆనక గునపం తగిలి వ్రేళ్ళు చిట్టి రక్తం వచ్చింది. దాన్ని పట్టించుకోని ఆ వృద్ధుడు నాటిన మొక్కలన్నింటినీ జాగ్రత్తగా నీళ్ళు పోసాడు.

ఇదంతా గమనిస్తున్న ఆయన మనవడు అడిగాడు "తాతా! ఆ మొక్కలు పెద్దయి కాయలు కాసేనాటికి నువ్వు చచ్చిపోతావు కదా ఎందుకీ శ్రమ?"

ఆయన మనవడి వంక చూసి నవ్వాడు. లాభనష్టాల కాలుక్యులేషన్స్ లేని తరం అది. అందుకే ఇలా అన్నాడాయన.

"నాయనా! నేను చచ్చిపోవచ్చు... నువ్వూ, నీ బిడ్డలూ ఈ చెట్ల కాయలు తింటారు... మా తాత నాటిన చెట్ల కాయలు నేను తిన్నాను. ఈ తల్లి పచ్చగా వుంటేనే కదా అందరం బ్రతికేది... నువ్వూ నాలుగు మొక్కలు నాటు నాయనా..."

మనవడు తలాడించాడు. తాత చెప్పిన 'జీవిత సత్యం' అతనికి అర్ధం అయ్యిందో లేదో మనకు తెలీదు.

***

(లోకమంతా కుళ్ళిపోయిందని కాదు కానీ ఒకప్పుడు మహనీయుల సంఖ్య తక్కువగా వుండేది ఇప్పుడు స్పందించే మనుష్యుల సంఖ్య తగ్గిపోతుంది. ఇది గ్లోబల్ వార్మింగ్ కంటే అత్యంత ప్రమాదకరం.)

***

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ