సీతాలు మర్రిచెట్టు దాటింది. మినుకు మినుకుమంటూ ఎర్రగా అగుపిస్తున్న దీపాన్ని చూసింది. రైలు గేటు ప్రక్కకు వెళ్ళింది. రైలు పట్టాలకి దగ్గరగా నిలబడింది - ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది.
సీతాలు గుండెలో దడ.
తడి ఆరిపోతున్న పెదవులు.
రైలు చక్రాల ధ్వని.
దూరం నుంచి దగ్గరగా.
ఇంకా యింకా దగ్గరగా.
భయం భయంగా.
సీతాలు కళ్ళల్లో నీళ్ళు.
కాళ్ళల్లో చేతుల్లో వణుకు.
ఛీఛీ నడు. ముందుకు నడు అదిగో వచ్చేసింది. పడు రైలు పట్టాల మీద. గిరగిర తిరుగుతున్న చక్రాల కింద, పడుపడు - ఈ పాడుబతుకు మాసిపోతుంది.
ధైర్యం తెచ్చుకుని, కళ్ళు మూసుకొని సీతాలు రైలు కింద పడబోయింది.
కాని స్టేబుల్ చేతిలోని టార్చ్ లైట్ సీతాలు మీద, సీతాలు దగ్గరికి కానిస్టేబుల్ పరుగు. కానిస్టేబుల్ చేయి సీతాల్ని వెనక్కు లాగేసింది బలంగా.
"వదులు, నన్నొదులు. నీకు పున్నెం వుంటాదొదులు. నిన్నే. వదులొదులు."
"చాల్చాల్లే. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నడు పోలీస్ స్టేషన్ కి. ఆత్మహత్య చేసుకోవడం నేరం అని తెలీదూ?"
"బాబోయ్. నేన్రాను. నీకు దణ్ణం పెడతాను. వొదిలేసెయ్".
"నీ ఏడ్పుకేంలే స్టేషన్ కి పద. అక్కడ ఏడవ్వొచ్చు."
పోలీస్ స్టేషన్. తలమీద సుత్తితో కొట్టినట్టు పదకొండు గంటలు కొట్టి గడియారం. మౌనంగా వూరుకొంది.
హెడ్ కానిస్టేబుల్ చిరాగ్గాలేచి, సీతాల్నీ కుర్ర కానిస్టేబుల్నీ చూసి "ఏం కేసూ, బ్రోతల్లా అగుపడ్డంలేదే" అన్నాడు.
కానిస్టేబుల్ విషయం చెప్పి, కలమూ పుస్తకమూ తీసుకున్నాడు.
"బుల్లీ, నీ పేరు చెప్పు?"
"సీతాలు"
"రైలు కింద ఎందుకు పడబోయావూ?"
"సచ్చిపోవడానికి?"
"నీ మొగుడు తాగొచ్చి కొట్టేడా?"
"నాకింకా మనువు కాలేదయ్యా?"
"మరెందుకు చావబోయావూ?"
"సుకంనేక".
"అమ్మబాబోయ్. సుఖమే!".
***
ఆ పట్నంలో పెద్దపెద్ద మేడలున్నాయి. రకరకాల కార్లున్నాయి. ఎన్నెన్నో షాపులున్నాయి. మరెన్నో కార్ఖానాలున్నాయి. ఇంకెన్నో సినిమా హాల్లున్నాయి. సుఖాల్లో తేలిపోయే మనుషులున్నారు. క్లబ్బుల్లో మందువుంది. కామం వుంది. లక్షాధికార్లున్నారు.
అదేపట్నంలో కుళ్ళిన శరీరంలా ఒక పేట వుంది. కేన్సర్ తినేసిన ఊపిరి తిత్తుల్లా కొన్ని గుడిసెలున్నాయి. చుడుం పొక్కుల్లా ఖాళీ లేకుండా దగ్గరదగ్గరగా.
సింహాద్రి కార్ఖానాలో కాలు పోగొట్టుకుని వచ్చిన రాత్రి వీరమ్మకి సీతాలు పుట్టింది. ఆ రోజున వీరమ్మ గుండె తరుక్కుపోయేలా ఏడ్చింది. ఆడపిల్ల పుట్టినందుక్కాదు, మొగుడి కాలు పోయినందుకు.
తర్వాత సింహాద్రినీ, సీతాల్నీ పోషించవలసిన భారం అంతా వీరమ్మ మీద పడింది. ఇంతకు ముందు నాలుగిళ్ళలో పన్చేసేదల్లా మరో రెండిళ్ళలో పనిచేయడానికి వొప్పుకుంది.
పస్తులతో రోజులు పదేళ్ళు గడిచాయి. సీతాలు ఒక తమ్ముడ్ని సంపాదించింది. వీరమ్మ పని చెయ్యడానికి ఊళ్ళోకి పోయేది. సీతాలు వంట చేసేది. అప్పుడే సీతాలుకి బియ్యం తినడం అలవాటయ్యింది.
చిన్న వయస్సులో పిల్లలకి చిరుతిండి కావాలనిపిస్తుంది. ఉన్నవాళ్ళ యిళ్ళల్లో అయితే కాజాలో, పకోడీలో పెడతారు. కానీ గంజినీళ్ళకే గతిలేని వాళ్ళు చిరుతిండి ఎలా తినగలరు?
సంవత్సరాలు దొర్లుతున్నా సీతాలు అవయవాలు ఎదగవల్సిన రీతిలో ఎదగలేదు. సీతాలుకి పదహారు సంవత్సరాలొచ్చాయి. సీతాలు తమ్ముడు పదమూడు సంవత్సరాల వయసుని సొంతం చేసుకున్నాడు. బియ్యం తింటూండడంవల్ల సీతాలు ముఖమూ, పెదవులూ పాలిపోయాయి. మనిషి ఎదగలేదు. పొట్ట మాత్రం పెరిగింది. కొద్దిగా గూను వచ్చింది.
సీతాలు రెండిళ్ళల్లో పనిచెయ్యసాగింది. సత్యనారాయణ ఇంట్లో పొద్దుటా, సాయం కాలం పనిచేసేది. గదులు వూడ్చడం. సత్యనారాయణ మూడేళ్ళ పిల్లకి స్నానం చేయించడం వంటి పనులు చేసేది. నీళ్ళు తోడేది. గిన్నెలు తోమేది.
సత్యనారాయణకు బస్సులున్నాయి. చిన్నకార్లున్నాయి. బ్యాంకులో రెండు లక్షల వరకూ నిల్వ వుంది. అతని భార్య ఒంటినిండా బంగారపు నగలున్నాయి. ఒకే ఒక ఆడపిల్ల వుంది. ఆ ఆడపిల్లకి మెల్లకన్ను వుంది. మెల్లకన్ను ఆడపిల్లకి అదృష్టమని వాళ్ళ బంధువులంతా అంటూ వుంటారు.
సింహాద్రి తాళ్ళు నేసి అమ్ముతాడు. రెక్కలు ముక్కలు చేసుకున్నా రోజుకి యిరవై పైసలో ముఫ్ఫై ఫైసలో వచ్చేవి. సీతాలు తమ్ముడు సైకిలు షాపులో పని చేస్తాడు. వాడు తెచ్చుకునే డబ్బులు వాడి సినిమాలకే చాలవు. ఏ రోజూ రెండు పూటలా తిండి దొరకదు.
సీతాలు పెద్దమ్మకూతురు పెళ్ళి అయిపోయింది. ఆమె సీతాలుకన్నా నాలుగేళ్ళు చిన్నది. వీరమ్మ కూడా సీతాలుకి సంబంధాలు చూడసాగింది. ఎవరూ సీతాలుని పెళ్ళి చేసుకోవడానికి ముందుకు రాలేదు. వచ్చినవాళ్ళు వెనక్కు వెళ్ళిపోయారు.
కేలండర్లు మారుతున్నాయి. సీతాలుకి పెళ్లి చేసుకోవాలనే తహతహ పెరిగిపోతోంది. సీతాలు తమ్ముడు అక్క పెళ్ళి ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్సూసి "అక్క మనువయ్యే వరకూ నేను కూకుంటే ముసలోడ్నయిపోతాను" అని నిశ్చయించుకుని పెళ్ళి చేసుకున్నాడు.
సీతాలు ఏడ్చేది. చిన్నప్పుడు కాజాలు, జిలేబీలూ తినడానికి లేవని ఏడ్చేది. ఇప్పుడు పెళ్ళి అవటం లేదని ఏడుస్తోంది.
సీతాలుకి మనసుంది. మిసమిసలాడే శరీరం లేదు.
సీతాలుకు కోరికలున్నాయి. ఆశలున్నాయి. ఆమెలో అందం లేదు. ఆరోగ్యం లేదు.
సీతాలు నవ్వుకుంది. ఆమె నవ్వుల్లో మల్లెలు గుబాళించవు.
సీతాలు ఆశగా చూస్తుంది. ఆమె కనుల్లో మెరుపు కనిపించదు.
సీతాలు మాట్లాడుతుంది. ఆమె కంఠంలో కోకిల గానం వినిపించదు.
సత్యనారాయణ అమ్మాయికి పద్నాలుగేళ్ళు వచ్చే సరికే ఆమెకో సంబంధం కుదిరింది. ఆమెను పెళ్ళి చేసుకోవడానికి చాలామంది ముందుకు వచ్చారు. వాళ్ళని సత్యనారాయణ వెనక్కు పంపేశాడు. ఆఖరికి తమ హోదాకి తగ్గవాణ్ణి ఎన్నుకున్నాడు. సత్యనారాయణ కూతుర్ని చూసి - వరుడూ, అతని తల్లిదండ్రులూ చాలా సంతోషంగా పిల్లనచ్చిందన్నారు.లక్ష్మీ దేవిలా వుందన్నారు.
తన వయసులో సగం వయసు కూడా లేని సత్యనారాయణ అమ్మాయికి పెళ్ళి అవుతున్నప్పుడు సీతాలు సంతోషంగా చూసింది. ఇంటికి వచ్చింతర్వాత ఏడ్చింది. తను నీళ్ళుపోసి స్నానం చేయించిన అమ్మాయికి అప్పుడే పెళ్ళయిపోయిందనీ, తనకా అదృష్టం లేదనీ తెగ ఏడ్చింది.
వారం రోజుల తర్వాత సీతాలు కాఫీ గ్లాసులూ, టిఫిన్ ప్లేటూ ఖాళీవి పట్టుకురావడానికి సత్యనారాయణ అమ్మాయి గదిలోకి వెళ్ళింది. మెల్లకన్ను అమ్మాయి భర్త ఒడిలోంచి గబుక్కున లేచికూర్చుంది. సీతాలు తల వంచుకుని ఖాళీ ప్లేటూ, గ్లాసూ తీసుకుని వచ్చేసింది. "పానకంలో పుడకలా వచ్చింది. వెధవ పిల్ల" అని ఆ అమ్మాయి భర్తతో అనడం సీతాలు వింది. వేడెక్కిన సీతాలు ఒళ్ళు చల్లబడి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
ఎలాగైతేనేం వీరమ్మ సీతాలుకి ఒక సంబంధం చూసింది. ఆ పెళ్ళి కొడుక్కి పెద్ద జబ్బుంది. అయినా వాడికి చేసేద్దామనుకుంది. వాడు 'గుంటను సూడాల' అన్నాడట. వీరమ్మ వాళ్ళని పిల్లను చూసుకోవడానికి రమ్మంది. పెళ్ళి కొడుకూ, అతని తల్లి వచ్చారు. వీరమ్మ టీ కొట్టుకు వెళ్ళి పకోడీలూ, టీ పట్టుకువచ్చింది. వాళ్ళు పకోడీలు తిని, టీ తాగి పిల్లను చూపించమన్నారు. చిరిగిపోని చీర సీతాలుకి కట్టబెట్టి, సీతాలు సత్యనారాయణ ఇంట్లో అడిగి తెచ్చుకున్న పౌడరు ముఖానికి పులిమి తీసుకొచ్చింది వీరమ్మ.
సీతాలు సిగ్గుతో పెళ్ళి కొడుకుని చూసింది. వాడి జబ్బుని చూసింది. చూసిన వెంటనే తనని తప్పకుండా పెళ్ళి చేసుకుంటాడనుకుంది.
పెళ్ళి కొడుకు తల్లి సీతాలుని పరీక్షగా చూసి "ఏవే యీరమ్మ, బుల్లికి కడుపేంటే?" అని సాగదీస్తూ అంది.
"ఛఛ. కాదమ్మా, పొట్ట పెరిగిందంతే" వీరమ్మ వినయంగా చెప్పింది.
"అదో రోగం కామోసు. ఏరా పిల్ల నచ్చిందా" అని కొడుకుని అడిగింది.
"దీన్ని సచ్చినా సేసుకోనే. అన్నాడతను అసహ్యంగా ముఖంపెట్టి.
"యీరమ్మా యిన్నావుగా. ఆడికెట్టాగో నచ్చసెబుతాను. కట్నం రెండొందలయినా యివ్వాల మరి."
వీరమ్మ హడలిపోయింది.
"రెండొందలే? ఎక్కడ్నించి తెచ్చేది? ఈ జబ్బోడికి కట్నం కావాలా" అనుకుంది. ఆ మాటే వాళ్ళతో అంది. వాళ్ళు కోపంగా వెళ్ళిపోయారు.
సీతాలు తడికె అవతలికెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చింది. వీరమ్మ ఉసూరుమని కూర్చొండిపోయింది.
"దరిద్రగొట్టు మొగమా. నీ కింక మనువుకాదే, నీ బతుకింతే" విసిగిపోయిన వీరమ్మ తిట్టింది.
"సీసీ ఎదవబతుకంట యెదవ బతుకు" అని సీతాలు తనని తనే తిట్టుకుంది.
తనకిక మనువు కాదని నిశ్చయించుకుంది ఓపికున్నంత వరకూ ఏడ్చిఏడ్చి నిద్రపోయింది.
మొదటి ఆట సినిమా విడిచిపెట్టే వేళ, సర్కారువారి సారా యింకా అమ్ముడవుతున్న వేళ, కార్మికుల రక్తాన్ని కార్ఖానాలు పీల్చేస్తున్న వేళ, ఇచ్చిన డబ్బుకి రెట్టింపు ఆనందాన్ని అనుభవించాలని పురుషులు పడతుల శరీరాల్ని నలిపివేస్తున్న వేళ సీతాలు చీకటిగా, యిరుకుగా వున్న వీధి లోంచి నడుస్తూ మొలదగ్గర దురదగా వుందని గోక్కుంది. చేతి గాజులు గలగలమన్నాయి. పక్కగా పోతున్న ఓ మగాడు ఆమెకు దగ్గరగా వచ్చాడు.
"ఏయ్ పిల్లా వస్తావా" నెమ్మదిగా అడిగాడు. సీతాలు ఆనందంతో "ఊ" అంది. అతను ఆమె నడుం దగ్గర నుంచి భుజాల వరకూ చేతులు జరిపి, సీతాల్ని పక్కసందులోకి తీసుకుపోయాడు. ఆ సందు యింకా చీకటిగా వుంది. సీతాలు అతని సరసన నడుస్తోంది. మత్తు ఆవరించిన కళ్ళు మూసుకుపోతున్నాయి. నరనరాల్లో ఉద్రేకం పెల్లుబుకిపోతోంది.
శరీరంలో ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. అతనికి మరింత దగ్గరగా జరుగుతూ నడుస్తోంది.
సందు చివరకు వెళ్లారు. ఒక పాక దగ్గర ఆగి, తడికతీసి, సీతాల్ని లోపలికి రమ్మన్నాడు. నులకమంచం మీద కూర్చోబెట్టాడు. ఆమె వీపు నిమురుతూ పెదాలు గట్టిగా ముద్దుగా పళ్ళతో నొక్కేడు. సీతాలు ఒళ్ళు ఝల్లుమంది. అతని తలలోకి వేళ్ళుపోనిచ్చి అతని చేతుల్లో వాలిపోయింది.
అతనికి ఆమెని చూడాలనిపించింది. ఆమెకి దూరంగా జరిగి, గదికి మూలగావున్న కిరసనాయిలు దీపం వెలిగించాడు. సీతాలు వైపు తిరుగుతూ "నీ పేరేటి" అన్నాడు. ఆమె సమాధానం చెప్పేలోగానే "లెగూ" అని అరిచాడు. అతను పామును చూసినట్టు ఫీలయ్యాడు.
"ఫో, యిక్కడ్నుంచి బేగా పో. యిలాంటి గుంటనెక్కడా సూడ్నేదు. పోవే ముండా. రమ్మంటే మాత్రం యెట్టా వచ్చావూ. సిగ్గు నేదూ" అని సీతాలుని బయటికి గెంటేశాడు.
తడికేసుకుని నీళ్ళు పుక్కిలించాడు.
సీతాలు సిగ్గుతో తల వాల్చేసుకుంది. తనమీద తనకే అసహ్యం వేసింది. తన మీద తనకే జాలి కలిగింది. కనీళ్ళు గిర్రున తిరిగాయి. "ఛీఛీ... నాదీ ఓ బతుకేనా యెదవ బతుకంట యెదవ బతుకు" మనసు మెలితిరిగిపోయింది. ఆశలు ఆరిపోయాయి.
"నానెందుకు బతకాల. ఎవరికోసం బతకాల? సిన్నప్పట్నించీ తిండిసుకం నేదు. యీ సుకం అసల్నేదు. ఒక్క మొగయెదవా నన్ను ఆడదానిలా సూడడు. ఇంకెవరి కోసం బతకాల? మొగుడున్నాడని బతకాలా? బిడ్డున్నాడని బతకాలా?" సీతాలు విరక్తిగా అనుకుంది. చచ్చిపోవాలనుకుంది.
***
"నన్నొదిలీసెయ్ పోవాల" సీతాల.
"ఎక్కడికిపోతావ్" హెడ్ కానిస్టేబుల్.
"ఎక్కడికిపోతాను సావటాన్కి".
"సావటానికి నీ కధికారం లేదు".
"నీకు మనువయ్యిందా" సీతాలు.
"ఎప్పుడో అయ్యింది. ఇద్దరు పిల్లలు" హెడ్
"నీకో"
"నాకింకా కాలేదు" కుర్ర కానిస్టేబుల్.
"పోనీ సావను. నన్ను సేసుకుంటావా"?
పిరికివాడు నిశ్శబ్ధ నిశీధిలో రాబందుల రెక్కల చప్పుడు విన్నట్లు కుర్ర కానిస్టేబుల్ బెదిరిపోయాడు. గుండె దడదడలాడింది. ముఖం పాలిపోయింది. ఒంటినిండా చమట పట్టేసింది. నోరు పిడచగట్టుకు పోయింది.
ఎర్రపాగా సవరించుకుని "నీకు పిచ్చెక్కినట్టుంది నడునడు" అని కటకటాల గదిలోకి సీతాల్ని తోసి, తలుపేసి, వరండామీద కొచ్చి, బీడీ వెలిగించి గట్టిగా దమ్ములాగేడు కుర్ర కానిస్టేబుల్.
"సివరికి సుకంగా సద్దామన్నా కుదర్నేదు. ఎదవబతుకంట యెదవ బతుకు" అనుకుంది సీతాలు నిరాశగా, నిర్లిప్తంగా.
బతుకంటే ఆమెకింకా అర్ధం కాలేదు. బతకడం కంటే గొప్పదేదీ లేదని అర్ధమయ్యే రోజు ఆమెకు తప్పక ఎదురవుతుంది.
***
(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)