అప్పుడే మాగన్నుగా నిద్ర రెప్పల మీదికి కమ్ముకొస్తోంది. దబ్బున పైనుంచి ఏదో బరువుగా పడిన చప్పుడు. ఇల్లంతా యదేచ్చగా తిరుగుతున్న జీవరాసులన్నీ కకావికలై పరుగులెత్తుతున్న సందడి, ఎన్నో ఏళ్ల అనుభవాన్ని బట్టి ఏం జరిగుంటుందో అర్ధమైంది. వెదురుగడల మంచం మీద చప్పుడు కాకుండా పక్కకి వొత్తిగిల్లి చూపుల్ని కూడదీసుకుని చూసాను. నూనె దీపం మసక వెలుతురులో నేలపైన చుట్టచుట్టుకొని పడగ పైకెత్తి నిలిచిన మిన్నాగు ఎలుకల్ని వేటాడుతోంది. రాత్రైతే చాలు లోపలికొచ్చి సేదతీరే కప్పలన్నీ గోడలమీద గెంతుతూ పైపైకి పోతున్నాయి. నా మంచానికి ఎదురుగా ఉన్న వంట గట్టుమీద ఎలుకలకోసం నేను చేసి పెట్టిన రొట్టెల్ని దౌర్జన్యంగా తింటున్న పందికొక్కు ఒకటి నిర్ఘాంతపోయి కదలిక మరిచి కొయ్యబారిపోయింది. ఆ పక్క పుస్తకాల రేక్ లో ఉడుత పిల్లలకి అడ్డంగా తోకను మూసి శిలాప్రతిమలా అయిపోయింది. పాము బుస గదినిండా ప్రతిధ్వనిస్తోంది.
కాస్సేపటికి దేన్నో నోట చిక్కించుకున్నట్టుంది. బుస ఆగింది. దానికి ఆహారంగా చిక్కిన ప్రాణి హృదయ విదారకంగా విలవిల లాడింది. ఇంకాస్సేపట్లో గది మొత్తం శబ్ద రహితమైపోయింది.
ముఫ్ఫై ఏళ్లుగా ఇదంతా అలవాటైన తతంగమే. ఇప్పుడంటే పాపికొండల సందర్శనకోసం వచ్చే టూరిస్టులాంచీల రోదకు భయపడి రావడం మానేసాయి కాని, పగటి పూట కూడా కుందేళ్ళు, లేళ్లు ఇంట్లోకొచ్చి విశ్రాంతి తీసుకునేవి. అడవి పందులు, చిరుత పులులు వాకిట్లో పచార్లు చేసేవి. గది, ఇల్లు, నివాసం, హోమ్ అంటూ నేను ఎన్ని రకాల పిల్చుకున్నా ఇది పూర్తిగా వెదురు గడలతో నిర్మించిన ఆవాసం, ముఖర్జీ దీన్ని కుటీరం అనేవాడు.
దీనికానుకుని నదివైపు దిగువకు ఉన్న పది పన్నెండు గుడిసెల గిరిజన గూడెం గాఢ నిద్రలో ఉన్నట్టుంది. నాలుగైదు రోజులుగా వరద నదిలో కొట్టుకొచ్చిన చెట్లనూ, దుంగల్నీ వొడ్డుకు చేరుస్తూ పగలూ రాత్రీ గూడెం మొత్తం అలసిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నా ఏమాత్రం మారని గిరిజన జీవితాలు -
ఉధృతి తగ్గిన గోదావరి ప్రశాంతంగా ప్రవాహిస్తూన్న సవ్వడి, మోచేతిని నుదుటికి ఆనించుకుని కళ్ళు మూసుకున్నాను, నిద్రకు దూరమైన రెప్పలు మూతపడలేదు. లేచి తలుపు తీసుకుని వాకిట్లోకొచ్చాను. చల్లని గాలి హోరుమని ముసురుకుంది. కొంగును తలమీదుగా కప్పుకొని రాతి చప్టామీద కూర్చున్నాను. వెన్నెల రోజులు కాని, ఆకాశం మేఘామృతమై ఉండడం వలన చందమామ జాడ కానరావడంలేదు. దట్టమైన వృక్షాల ఆకుల సందుల్లోంచి మసక వెన్నెల ఉండీలేనట్టు కమ్ముకుని ఉంది. దూరంగా కొండరాళ్ళ సందుల్లో పుట్టిన సన్నని జలధార గలగలమని కిందికి ప్రవహించి గోదావరి వైపుగా సాగిపోతోంది. చప్టా మీంచి లేచి నాలుగువారలు ముందుకు నడిచి ధారలో పాదాలు పెట్టి వొడ్డున కూర్చున్నాను. కొండ వృక్షాల మీది తేనె పట్టుల నుంచి ఆగి ఆగి తేనె చుక్కలు చుక్కలుగా నీటి ప్రవాహంలో రాలిపడుతున్న చప్పుడు.
ఏడాది క్రితం ముఖర్జీ ఈ లోకాన్ని విడిచి వెళ్లేవరకూ కాలమే తెలీని నాకు ఇప్పుడు జీవితం ఎంత సుదీర్ఘంగా, మందకోడిగా సాగుతోంది!... అన్పిస్తోంది. ఎప్పటెప్పటి జ్ఞాపకాలో వెల్లువెత్తివస్తున్నాయి.
స్వతంత్రం రావడానికి. ముందు సంస్థానాలు, జమీందారీలు దేదీప్యమానంగా వెలుగుతున్న రోజులు. గోదావరి జిల్లాలోని ఓ ప్రఖ్యాత సంస్థానాధీశుడి కూతురుగా పుట్టిన నేను ప్లస్ టూ వరకు మద్రాసులో ఇంగ్లీష్ లో చదివేను. అప్పటికే రవీంద్రుడి రచనల ప్రభావం ఆసాంతం సన్నలముకున్న రోజులు, శాంతి నికేతన్ లో చదువు కుంటానన్న నా మాటను నాన్నగారు కాదనలేదు. తన కూతురు అక్కడ చదవడం గొప్ప స్టేటస్ సింబల్ గా భావించారాయన. ఫైనార్ట్స్ స్టూడెంటు ముఖర్జీ అక్కడే పరిచయమయ్యాడు. అప్పటి అతని రూపం ఇప్పుడే చూస్తున్నంత ప్రస్ఫుటంగా కళ్ళముందుకొచ్చింది. అతను లేండ్ స్కేప్స్ బాగా గీస్తున్నాడని విని లేడీస్ హాస్టల్ నుంచి ఆర్ట్ లవర్స్ కొందరం అతని రూంకెళ్ళాం.
గది నిండా అస్తవ్యస్తంగా పరచి ఉన్న చిత్రాలు గది మధ్యలో బాసింపట్టు వేసుకుని ధ్యానముద్రలో బుద్ధభగవానుడిలాగా అర్ధనిమిలిత నేత్రుడై కూర్చుని ఉన్నాడు ముఖర్జీ. ఒక్కసారిగా అయిదారుగురు అమ్మాయిల్ని చూసి కంగారుపడ్డాడు. అప్పటికే మా మహల్ లో చాలా చిత్రాల్ని మనసుపెట్టి చూసి ఉండడం వలన అతని చిత్రాల్ని బేరీజు వెయ్యడం కొంత సాధ్యమైంది నాకు. మా కన్నా సీనియర్ ఆయన అతనికి సలహాలివ్వచ్చో లేదో ఆలోచించకుండా పెద్ద ఆరిందాలాగా కలర్ మిక్సింగ్ గురించీ, రూప లావణ్యం గురించీ ఏదేదో మాట్లాడేశాను, తర్వాత స్ఫురించి అతనేమనుకుంటున్నాడో అని చూస్తే దట్టమైన కనుబొమ్మల కింద, విశాలమైన నేత్రాల లోతుల్లోంచి ఆసక్తిగా నన్నే చూస్తున్నాడన్పించింది.
ఆ పరిచయం స్నేహంగా మారి గాఢమైన మైత్రి కావడానికి ఎన్నాళ్లో పట్టలేదు. శాంతినికేతన్ పక్కనే ప్రవహించే కొఫ్ఫోయ్ నది వొడ్డున కూర్చుని ఎన్నెన్నో కబుర్లు కలవోసుకునేవాళ్లం. దేశ విదేశాలల్లోని ప్రముఖ ఆర్టిస్టుల గురించీ, వాళ్ళ కళానైపుణ్యం గురించీ అనర్ఘలంగా మాట్లాడేవాడు ముఖర్జీ. అచ్చమైన బెంగాలీ బాబులాగే ఉండేవాడు. అప్పుడప్పుడు నేనతన్ని 'నువ్వంతా కాదు కానీ నీ ముక్కు మాత్రం అచ్చమైన బెంగాలీ చప్పిడి ముక్కు' అని ఆటపట్టించేదాన్ని, అతను విశాలమైన నవ్వొకటి నవ్వి మౌనంగా ఉండిపోయేవాడు.
క్రమంగా ముఖర్జీ ఆర్టు, లోకానికి పరిచయం కావడం మొదలైంది. సెకండియర్ సెలవుల్లో నేనతన్ని మా వూరికి అహ్వానించేను. మా మహల్ సౌందర్యం, ప్రాచీన కాలంనాటి కళాకండాలు, విదేశాల నుంచి తెప్పించిన విలువైన వస్తువులు అతన్నెంతో ఆకట్టుకున్నాయి. ఇంటికి వస్తూనే నేను నా నగలన్నీ అలంకరించుకుని సంప్రదాయ అలంకరణలోకి మారిపోయాను. అది చూసి ముసిముసిగా నవ్వుతూండేవాడు. ఆ అలంకరణలోని నా రూపాన్ని అద్భుతంగా చిత్రించి నాకు ప్రెజెంట్ చేసాడు.
చిన్నప్పుడొకసారి గోదావరి నదిమీద పడవలో భద్రాచలం వెళ్లిన ప్రయాణం గుర్తుకొచ్చింది. ఆ అందమంతా ముఖర్జీలాంటి ఆర్టిస్టు చూసి తీరాలన్పించింది. నాన్నగారి నడిగి ఏర్పాటుచేయించి తెరచాప పడవలో వెళ్లాం. దారి పొడవునా, ముఖ్యంగా పాపికొండల దగ్గర ముఖర్జీ అవుట్ లైన్స్ తిరిగి వచ్చేటప్పుడు అనుకోకుండా ఈ గిరిజన గూడెం లో దిగి, ఈ పరిసరాలన్నీ చూస్తూ పరవశంలో మునిగిపోయినప్పుడు తెలీలేదు కొన్నేళ్ళ తర్వాత మేమిక్కడ స్థిరపడబోతున్నామని.
ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే దేశ విభజన గొడవలు ఉధృతమయ్యాయి. ఇక చదువు చాలించి వెనక్కి రమ్మని నాన్నగారు కబురుచేసారు. అప్పటికే రెండు సార్లు గాంధీజీ కలకత్తా వచ్చినప్పుడు ముఖర్జీతో పాటు నేను కూడా వెళ్లాను. ఆ ప్రభావంతో ఖద్దరు కట్టడం ప్రారంభించాం ఇద్దరం. ఒకసారి కలకత్తాలో ముఖర్జీ చిత్రాల ప్రదర్శన ఏర్పాటుచేస్తాం. అతని గురించి పత్రికలు విపులంగా రాసాయి. ఆ వార్త ఖండాంతరాల్లోకి వెళ్ళింది. చాలా కళాఖండాలు అమ్ముడుపోయాయి. వచ్చిన డబ్బును స్వాతంత్ర్య పోరాట నిధికి ఇచ్చేసాడు ముఖర్జీ అప్పుడే నాకతని మీద ప్రేమలాంటిదేదో జనిస్తోందని అర్ధమైంది. నాన్న ఈ సారి మనిషిని పంపించారు. ఇంటికెళ్ళగానే నాకు తెలిసిందేంటంటే భార్య పోయిన మరో జాగీరుతో నా పెళ్లి నిశ్చయించేశారని. పుస్తకాలూ, సర్టిఫికెట్లు తెచ్చుకుంటానంటే కూడా ఇల్లు కదలనీయలేదు. నేను కలవరపడి ముఖర్జీకి ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు లేదు. రేపు నా వివాహం జరగాల్సి ఉండగా ఈ అర్ధరాత్రి హఠాత్తుగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ప్రకటన వెలువడింది. అంతా ఆ ఉత్సవాల సంరంభంలో ఉండగా నన్ను చిన్నప్పుడు పెంచిన ఆయా సాయంతో ఇంట్లోంచి బైటికి వచ్చి కలకత్తా వెళ్ళిపోయాను. ముఖర్జీ శాంతినికేతన్ లో లేడు, అతని స్నేహితుల్ని అడిగితే తెలిసింది. శాంతినికేతన్ వదిలి పల్లెకు వెళ్లిపోయాడని.
నేనతన్ని వెతుక్కుంటూ ఆ చిన్న పల్లెకు వెళ్ళేను. బెంగాల్ విభజింపబడింది. కొట్లాటలు, చంపుకోవడాలు కొనసాగుతున్నాయి. దేశం అల్లకల్లోలంగా ఉంది.
ముఖర్జీ తల్లినీ, తండ్రినీ దౌర్జన్యకారులు చంపేసారు. పోతపోసిన దుఃఖమూర్తిలా చీకటి నిండిన ఇంట్లో ఒక్కడే ఉన్నాడు ముఖర్జీ, నేను వెళ్లి అతని ముందు మోకాళ్ల మీద కూర్చున్నాను. ఎవరో వచ్చి దీపం వెలిగించి వెళ్లేరు. ఒక్క నిముషం నమ్మలేనట్టు చూసాడు. నా భుజంమీద తలవాల్చేసి వెక్కివెక్కి ఏడ్చాడు. అతని దుఃఖం తీరేవరకూ ఏడ్వనిచ్చాను. అతని బంధువులెవరో తెచ్చిపెట్టిన రొట్టె, పళ్ళు తిని కడుపు నింపుకొన్నాం.
ఒక నిర్లప్త మానసిక స్థితిలో దేశం వదిలి వెళ్లాలని ఒక నిర్ణయానికి వచ్చాం. రాత్రికి రాత్రే కలకత్తా చేరుకున్నాం. చాలామంది విదేశీయులు దేశాన్ని వదిలివెళ్తున్న రష్, ఎలాగో టిక్కెట్టు సంపాదించుకుని ఓడ ఎక్కి దేశాన్ని వదిలేసాం.
ఆ రోజుల్లో చిత్రకారులందరిలాగే ముఖర్జీ కూడా పేరిస్ నే ఇష్టపడ్డారు. నా వెంట తెచ్చిన డబ్బు మా ప్రయాణానికి, పేరిస్ లో మేం సెటిలవ్వడానికి ఉపయోగపడింది. మా వాళ్లు మమ్మల్ని వెంటాడి వేదిస్తారేమోనని మేం భయపడినంతగా ఏమీ జరగలేదు. భారతదేశంలో జాగీర్లన్నిటికీ ప్రభుత్వం రద్దుచేసిందని తెలిసింది. పేరిస్ లో గొప్ప ఆర్టిస్ట్ గా పేరుతెచ్చుకోడానికి ముఖర్జీ కి ఎక్కువకాలం పట్టలేదు. పల్లెలోనే మేమిద్దరం ఒకరికొకరం అని ప్రామిస్ చేసుకున్నాం. పేరిస్ లో ముఖర్జీ ఎక్కడో రెండు పూలమాలలు సంపాదించుకొచ్చాడు. పది మంది మిత్రుల ఎదుట దండలు మార్చుకొని ఇద్దరం ఒక్కటయ్యాం, మాది గొప్ప ఆత్మీయబంధం అని నా భావన.
ఆర్ట్ తర్వాతి స్థానం ముఖర్జీ పేరిస్ లోని కింగ్స్ లైబ్రరీకిచ్చేవాడు. ఆ లైబ్రరీ మా మనసులు వికసించడానికీ, జ్ఞాన సముపార్జనకీ ఎంతగానో తోడ్పడింది. 1730 లో ఫాదర్ లీగేక్ అనంతపురం నుంచి కింగ్స్ లైబ్రరీ కి పంపించిన వేమన పద్యాల ప్రతిమీద నా చేత ఇంగ్లీష్ లో వర్క్ చేయించాడు. యూరప్ మొత్తం తిరుగుతూ ఆర్ట్ గురించి ఉపన్యాసాలిచ్చాడు. ఎన్నో సెమినార్స్ లో పాల్గొన్నాడు. ఎక్కడికెళ్ళినా తన బెటర్ హాఫ్ గా నన్ను పరిచయం చేసి ఉన్నతి వెనక నేనున్నానని చెప్పేవాడు.
ముఫ్ఫయేళ్ళ తర్వాత ఉన్నట్టుండి విదేశీ జీవితం మొహం మొత్తిపోయిందన్నాడు. 'దేవికారాణి - రోరిచ్ లాగా మనం కూడా ఇండియాలో ఎక్కడైనా సెటిలవుదాం' అన్నాడు.
అప్పటికి ఇద్దరం యాభయ్యవ పడిలో ఉన్నాం.
"నీకు గుర్తుందా, గోదావరి మీద మన పడవ ప్రయాణం? దారిలో మనం ఆగిన గిరిజన గూడెం, అక్కడికెళ్ళిపోదామా? రోరిచ్ హిమాలయాల్ని ఎంచుకున్నట్టు నేను తూర్పుకనుమల్ని ఎంచుకుంటున్నాను. ఒక్క పాపి కొండల అందాల్ని చిత్రించడానికే సగం జీవితకాలం పడుతుంది" అన్నాడు.
అతను మాట్లాడిన పదాలేవైనా అర్ధం మాత్రం 'నీ వూరికి, నీ గోదావరికి దగ్గర్లో నన్ను చేరుస్తాను' అనే స్ఫురించింది నాకు. ఇండియాకి వచ్చాక తెల్సింది - దూరంలో ఉండి మేం విన్నదానికన్నా ఇక్కడి జాగీర్లు ఎంతగా చితికి పోయామో! గొప్ప భేషజంతో జీవించడం తమ జన్మహక్కుగా భావించిన జాగీర్దార్ల కుటుంబాలు క్రమక్రమంగా ఆర్ధిక ఇబ్బందులో చిక్కుకుపోయాయి.
రాజాకోట అన్పించుకున్న మా హవేలీ మూడొంతులు కూలిపోయింది. చాలావరకూ ఆక్రమణలకు గురైపోయింది. కూలకుండా మిగిలిన ఒక గది, హాలులో సగభాగంలో దాసీ పుత్రుడొకాయన వండుకుతింటూ బతుకు వెళ్లమారుస్తున్నాడు. ఎవరూ తీసుకెళ్ళకుండా వదిలేసిన అంచులు పగిలిపోయిన పింగాణీ సామాను, నేలలో స్థాపితం చేసేసిన పాదాల్తో ఒక పాత సైనికుడి ఇనుప విగ్రహం, చెదలు సగం తినేసిన పుస్తకాలు మధ్య జీవచ్చవంలా కన్పించాడతను. ఎప్పటిదో మాసిపోయిన ఫోటో ఆల్బమ్ ఒకటి పదిలంగా దాచుకున్నాడు. నన్ను అతను గుర్తుపట్టలేదు. మా నాన్నగారు, అన్నయ్యలు అంటూ నాన్నగారివి, అన్నయ్యలవి ఫోటోలు చూపించాడు.
నాన్నగారు, అమ్మ నా తోడబుట్టినవాళ్లు ఎవరూ మిగిలిలేరు. నా అన్నదమ్ముల పిల్లలు మద్రాసులో కొందరు, హైదరాబాదులో కొందరు ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారని తెల్సింది.
రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ప్రాంతానికొచ్చినప్పుడు ఆయన బసచేయడానికి మేడపైన నాన్నగారు ప్రత్యేకంగా నిలిచి ఉంది. వెనకవైపు బూజుల్తో నిండిపోయిన మ్యూజిక్ హాల్లో రెండు వీణపెట్టెలు చూసి వాటిని తెరిపించాను. నేను చిన్నప్పుడు గురుముఖంగా సంగీత సాధన చేసిన చిన్నవీణ మరో పెట్టెలో అమ్మ వాయించిన తంజావూరు వీణ - నేను ఆప్యాయంగా వాటిని నిమరడం చూసి "అమ్మగారూ! వీటిని మీరు కొంటారా" అన్నాడతను ఆశగా.
అతను చెప్పిన ధరకన్నా కొంత ఎక్కువే ఇచ్చి ముఖీ ఆ వీణల్ని నా కోసం కొన్నాడు.
ఆ వ్యక్తి కర్రల పొయ్యి పెట్టి వంట చేసుకుంటున్న ఆ విశాలమైన వరండాలో సింహాసం మీద కూర్చుని ఉదయాన్నే అమ్మ అందరికీ పాలు, పెరుగు పంచిన రోజులు; రోజంతా వండించి వార్పించి ఆకలని వచ్చినవారికి లేదనకుండా కడుపునింపి; ఆర్ధించిన వాళ్లకి ఆర్ధికసాయం చేసి పంపించిన ఆ రోజుల వైభవం గుర్తొచ్చి నా కళ్ళలో ఒక సన్నని నీటి పొర నిండింది. ఓడలు బళ్లుకావడం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూసినట్లైంది.
కాలం ఎంత బలీయమైంది!
మేం అనుకున్న గిరిజన గూడెం చేరడానికి ముందుగా రాజమండ్రి వెళ్ళాం. అక్కడ గోదావరిలో ఇదివరకటిలా గూటి పడవలు లేవు. ఆయిల్ తో నడిచే మోటార్ లాంచీలున్నాయి. గోదావరి మధ్యలో ఉండగా ముఖర్జీ తను టాప్ పైకెక్కి నాకు చెయ్యందిచేడు. ఆ అద్భుతమైన ప్రకృతి సౌందర్యం మధ్య ముఖర్జీమీద ప్రేమ పొంగి పొరలింది నాలో.
"ముఖీ! నువ్వు ముఫ్ఫై ఏళ్ల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడూ అలాగే ఉన్నావు తెలుసా" అన్నాను అతని దగ్గరకు జరిగి. "నువ్వూ అంతేలే, మనమిద్దరం ఒకరినొకరం పాపాయిలం కదా!" అన్నాడు నవ్వుతూ.
మాకు సంతానం కలగలేదు, ఎవరిలో లోపమో తెలుసుకోదల్చుకోక టెస్టులు చేయించుకోలేదు.
గూడెంలో ఉండడానికి గిరిజనుల అనుమతి కోరినప్పుడు మేం మత మార్పిడి కోసం వచ్చామనుకుని రెండు రోజులు వాళ్ళు మాతో మాట్లాడలేదు. గిరిజనులు వాళ్ళ మూల సంస్కృతిని కోల్పోడానికి ఇష్టపడరు. నేను వాళ్లకి అర్ధమయ్యేలా వివరించి చెప్పేసరికి వాళ్లే గూడేనికి ఎగువన కొండవాలు శుభ్రం చేసి ఇంత పెద్ద బేంబూహట్ నిర్మించి ఇచ్చారు. అప్పట్నుంచీ మేమూ వాళ్లలో ఒక కుటుంబం అయిపోయాం. నెలకొకసారి ముఖర్జీ అటు భద్రాచలానికో, ఇటు రాజమండ్రికో వెళ్లి అందరికీ కావాల్సిన సరుకులు కొనుక్కొచ్చేవాడు. అడవి దిగుబడులు కొనే దళారులొచ్చినప్పుడు దగ్గరుండి తూకాలు, లెక్కలు సరిచూసి గిరిజనులు మోసపోకుండా చూసేవాడు.
నేను పేరిస్ లో తోచక నేర్చుకున్న వైద్యం కొన్నిసార్లు గిరిజనుల ప్రాణాల్ని కాపాడింది. నేనూ వాళ్లనుంచి అమూల్యమైన మూలికా వైద్యం తెలుసుకున్నాను. చుట్టుపక్కల గూడేల ప్రజలకి వైద్యం చెయ్యడం, చదువు నేర్పించడం నేను చేసేదాన్ని. వెదురును పల్చని రేకులుగా చీల్చి, అడవి కలపను చెక్కీ అందమైన కళాకృతుల్ని తయారుచెయ్యడం బెనర్జీ నేర్పించేవాడు. పని నేర్చుకోవడంలో షార్ప్ గా ఉండే గిరిజనులకది కొంత ఆర్ధిక వనరు కల్పించడానికి తోడ్పడింది. గిరిజనులు నమ్మితే ప్రాణం పెడతారు. అందుకే ఎన్ని రోజులు దేశంలో ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా ఇదే మా స్థిర నివాసమైపోయింది.
మేం బైట నగరాలకు వెళ్ళినప్పుడల్లా తెలిసేది దేశంలో ఎన్నెన్ని మార్పులు సంభవిస్తున్నాయో! సౌకర్యాలతోబాటు అసౌకర్యాలెన్నో! నాగరికత పేరుతో వస్త్రధారణలోనూ, జీవన విధానాల్లోనూ వచ్చిన మార్పుల్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందరెందరు కొత్త దేవుళ్ళ సృజన జరుగుతోంది! నేనలా అంటే 'మనం ఆగిపోయాం. వాళ్ళు ప్రవాహంలో ఉన్నారు, అదే సహజం" అనేవాడు ముఖర్జీ.
నీళ్ల చల్లదనం క్రమంగా శరీరంలోకి పాకి గజగజ వణుకుపుట్టింది. గత స్మృతుల్లో పడి వయసు మరచిపోయి చటుక్కున లేవబోయాను. సహకరించని కాళ్లు నా ఎనభై ఏళ్ల వయస్సును గుర్తుకుతెచ్చాయి. సూర్యోదయం కాబోతున్న గుర్తుగా పాపికొండలకవతల సన్నని వెలుగు రేఖలు.
నిన్న సాయంకాలం సొరబ వాకిట్లో చేర్చిపెట్టిన ఎండుటాకులు, చితుకులు అగ్గిపుల్లతో ముట్టించాను. చిటపటలాడుతూ మంట ప్రారంభమైంది. ఆ మంట వెలుగులో పాతికేళ్ల క్రితం ముఖర్జీ అస్సాం నుంచి తెచ్చినాటిన టేకు వృక్షం, దాన్ని పెనవేసుకుని నేను నాటిన అడవి శంఖు పూలతీగ ఆకశాన్నంటుతున్నట్టు కన్పించాయి. ఆ తీగ ఎంత నమ్మకంగా అల్లుకుపోయింది!
ముఖర్జీ గీసిన ఎన్నో చిత్రాల ద్వారా ఈ అడవి, కొండలు, గోదావరి, గిరిజనులు దేశ విదేశాలకు పరిచయమయ్యారు.
కాలం గతించిపోయింది. వార్ధక్యం నన్నెప్పుడు ఈ లోకంనుంచి నిష్క్రమింపచేస్తుందో తెలీదు. మనిషి ఎలా మరణించాడనేదానికంటే ఎలా జీవించాడన్నదే ముఖ్య విషయం కదా!
బైట నాగరిక ప్రపంచంలో ఉన్న సదుపాయాలేవీ ఎరుగని ఈ అటవీ పుత్రుల్లో క్రమంగా మార్పురావచ్చు. నూనె దీపాల స్థానంలో కరెంటు దీపాలుండే చోటికి వీళ్లే తరలిపోవచ్చు. శాశ్వతమనుకున్న ఈ కొండలు, అడవులు మాయంకావచ్చు. ఒక నష్టం జరిగిన చోట ఒక లాభం కూడా సాధ్యంకావచ్చు. ఏ సంఘటనకైనా కార్యాకారణ సంబంధాలు తప్పవు -
నిన్న సాయంకాలం నేను తెలుసుకున్న సంఘటన అలాంటిదే - చివరి రోజుల్లో ముఖర్జీ గీసిన చిత్రాలు మళ్లీ ఒకసారి చూడాలన్పించి ఆ పెట్టె తెరిచాను. ఒక్కొక్క చిత్రాన్నీ చూసి పక్కన పెడుతున్నాను. పెట్టె అడుగున ఒక కవరు నన్నాకర్షించింది. ముఖర్జీ ఇంత పదిలంగా దాచిన ఆ కవరు ఏమై ఉంటుందా అని తెరచి చూసాను. ముఖర్జీ పోలికల్తో ఉన్న పదేళ్ల బాలుడి కార్డు సైజ్ ఫోటోతో బాటు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన లెటరది. ముఖర్జీ కలకత్తా స్నేహితుడి కేరాఫ్ ఎడ్రస్ కి వచ్చింది.
నా దగ్గర ముఖర్జీకి దాపరికమా? పట్టలేని క్యూరియాసిటీతో ఉత్తరం కింది సంతకం చూసాను. ,ముఖర్జీ దగ్గర చిత్రకళ నేర్చుకున్న శిష్యురాలు మరియాలిండా వ్రాసిందది.
ముఖర్జీ!
ఈ ఫోటోలోని వీడు నీ కొడుకు. నీ జ్ఞాపకం కోసం వీడికి నీ పేరే పెట్టుకున్నాను. పెరిగి పెద్దవాడై నీ అంతటి చిత్రకారుడు కావాలని కోరుకుంటున్నాను. తండ్రివి కాబోతున్నావనే మాట విని ఎంతగానో మురిసిపోయిన నువ్వు వీడి పుట్టుకకు ముందే ఈ దేశాన్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయావో నాకెప్పటికీ అర్ధంకాని మిస్టరీ. మన బంధాన్ని స్కిప్ ఫర్ వైల్ , నాట్ ఫర్ పెర్మనెంట్ అనుకున్నావనుకుంటాను. అవునా?
- ప్రేమతో
నీ
మరియా
నా చెయ్యి కంపించి ఉత్తరాన్ని వదిలేసింది. గుండె లోపల ఒక ముల్లు గుచ్చుకుంది. సుదీర్ఘకాలపు కల చెదిరిపోయింది. నమ్మకం సడలిపోయింది. అనుభూతులకు వయసుతో ప్రమేయంలేదని అర్ధమైంది. మనిషికి మనసుకావాలి, మనసుకు శాంతి కావాలి. అనుభూతులకు వయసుతో ప్రమేయంలేదని అర్ధమైంది. మనిషికి మనసుకావాలి, మనసుకు శాంతి కావాలి. కొడుకు పుట్టడంతో ముఖర్జీకి ఆ శాంతి లభించి ఉంటుందా? మరి నాకు?
ఆరిన మంట సెగకు కుందేలు పిల్ల ఒకటి వచ్చి నా వొడిలో చేరింది. మాటలు రాని సొరబు చిన్న బిందెతో నీళ్ళు పట్టుకొని వస్తోంది నాకోసం.
ఈ గోదావరి, గిరిజనులు, అడవిలోని ప్రాణులు, పచ్చని ఈ ప్రకృతి అంతా నాదే, ఇంకేం కావాలి! ఇంకెంతకాలం కావాలి?
***
(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)