ఈశాన్యం - పి.వి. సాయిసోమయాజులు

eeshaanyam

బైట ఓ పది కార్ల వరకూ ఉన్నాయి. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ జనం.. హడావిడీ. ఇంతకీ ఇవన్నీ ఎందుకని అనుకుంటున్నారా? హేమంత్ గారి కొత్త ఇంటి గృహప్రవేశం మరి.

అతను చాలా డబ్బు.. పలుకుబడి ఉన్న వ్యక్తి. ఇవన్నీ ఉన్న వారికి శత్రువులు లేకుండా ఎలా ఉంటారు? కరక్టే ! ‘ఆయన్ని ఎప్పుడు తొక్కి పైకి ఎదుగుదామా’ అని ఆఫీసులో అందరూ కాచుకుని ఉంటారు. అతని పీ.ఏ కూడాను ! ఆయన చాలా తెలివైన వాడు.. అందుకే ఆయన ఎవరికీ చిక్కడూ దొరకడూ.

అందరూ సంతోషంగా గృహప్రవేశంలో పాల్గొంటున్నారు. ఎప్పుడూ సీరియస్‍గా వుండే హేమంత్ మొట్టమొదటి సారిగా నవ్వుతూ ఉన్నాడు.

కార్యక్రమం అయిపోయాక అందరూ ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లో హేమంత్.. ఆయన కుటుంబ సభ్యులు.. అతని పీ.ఏ మరియు పంతులూ మాత్రమే ఉన్నారు.

"ఏమండీ.. సామానులన్నీ సద్దేసినట్టే.. కానీ మీ బుక్‍షెల్ఫ్ ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు." అంది హేమంత్ భార్య శ్రావ్య.

"నీకు తెలుసు కదా.. నాకు సంబంధించిన వస్తువులన్నీ నా గదిలోనే ఉండాలని!" అన్నాడు హేమంత్.

"తెలుసండీ..కానీ మీ గదిలో ఖాళీ స్థలం లేదు!" అంది శ్రావ్య.

వెంటనే హేమంత్ అతని గది తలుపు తెరిచాడు.

"స్థలం లేదన్నావ్.. ఆ మూల బుక్‍షెల్ఫ్ పడుతుందే..!" అన్నాడు హేమంత్.

"కానీ అది ఈశాన్యం మూల కదండీ..ఆ మూల మనం బరువు పెడితే ధననష్టం వస్తుందంటారుగా!" అంది శ్రావ్య.

"ఏంటీ...?? అక్కడ మనం బరువు పెడితే ఇక్కడ మనకి ధననష్టం వస్తుందా? ఇలాంటి మూఢనమ్మకాలన్నీ పట్టించుకుంటే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఇక సమయం వృధా చేయకుండా బుక్‍షెల్ఫ్ పెట్టేద్దాం!" అన్నాడు హేమంత్.

"నాయనా! వాస్తు ప్రకారం ఈశాన్యం మూలన బరువు పెట్టకూడదు. పెట్టినచో.. భారీ మూల్యం చెల్లించక తప్పదు!" అన్నాడు పంతులు హెచ్చరిస్తూ.

"సార్..వీళ్ళు చెప్పింది నిజమే.. మా మామగారు ఓ సారి.." అని పీ.ఏ చెబుతూండగానే.. హేమంత్‍గారి అబ్బాయి గోపాల్ మధ్యలో దూరి "సార్... ఏది ఏమైనా సరే.. నాన్నగారికి ఇష్టమున్నట్లు ఆయన్ని చేయనివ్వండి. ధననష్టం వచ్చినా అది మీ జేబులకేం చిల్లు పెట్టదే! ఇది ఆయన ఇల్లు. ఇది ఆయన గది!" అన్నాడు హేమంత్‍గారి అబ్బాయి గోపాల్.

"కరక్ట్ రా! వీళ్ళందరికీ అర్థం కాదులే! నేను ఇప్పుడు ఆ బుక్‍షెల్ఫ్ ని ఈశాన్యంలోనే పెడతాను. త్వరలో ప్రమోషన్ కూడా కొడతాను. ఈశాన్యంలో బరువు పెడితే ధననష్టం రాదని.. ధనలాభం వస్తుందని నిరూపిస్తాను!" అంటూ బుక్‍షెల్ఫ్ ని ఈశాన్యంలో పెట్టాడు హేమంత్.

"నాయనా.. గుర్రాన్ని చెరువు వరకూ తీసుకువెళ్ళగలములే కాని.. నీళ్ళు త్రాగించగలమా?! నీ ఇల్లు.. నీ ఇష్టం! నాకు ఇవ్వాల్సింది నాకు ఇస్తే నేను బయలుదేరుతాను..!" అని అన్నాడు పంతులు.

"సరే.. ఇదిగోండి.. మీకు ఇవ్వాల్సిన రెండు వేలు." అంటూ డబ్బుని పంతులు చేతిలో పెట్టాడు హేమంత్.

"రెండువేలా??? మీరు నాకు ఇవ్వాల్సింది మూడువేలు కదా!" అన్నాడు పంతులు ఆశ్చర్యంగా.

"మూడువేలా?! నిన్న రాత్రేగా.. రెండువేలు సరిపోతాయన్నారు!" అని అడిగాడు హేమంత్.

"నాయనా.. నువ్వు సరిగ్గా విన్నట్లులేవు.. నిన్నరాత్రి కార్యక్రమానికి రెండు వేలు.. ఇవాళ వ్రతానికి వెయ్యి.. మొత్తం మూడు వేలు అని చెప్పాను!" అని అన్నాడు పంతులు.

"ఏమండీ.. ఈశాన్యం ప్రభావం మొదలైనట్టుంది. బుక్‍షెల్ఫ్ ఈశాన్యం వైపు పెట్టి అరనిమిషం అయ్యిందో లేదో.. అప్పుడే ఇలా..!" అంది శ్రావ్య భయంతో.

"అమ్మా.. నేనేం సమయం అనుకూలించిందని మూడువేలు అడగట్లేదు.. నిన్న రాత్రే ఈయన్ని అడిగాను. గుర్తుతెచ్చుకోమనండి!" అన్నాడు పంతులు.

"శ్రావ్యా.. ఈశాన్యంలో బరువు పెట్టినందుకు ఆయన మూడువేలు అడుగుతున్నారంటే.. బరువు తీసివేస్తే రెండు వేలే అడుగుతారుగా?!" అని వెటకారంగా అడిగాడు హేమంత్.

"నాయనా..నువ్వు ఈశాన్యంలో పెట్టినా.. నైరుతిలో పెట్టినా.. నాకు ఇవ్వాల్సింది మూడువేలు. అవి ఇచ్చేస్తే నేను బయలుదేరుతాను!" అన్నాడు పంతులు.

"సరెలేండి...ఇదిగో..!" అంటూ ఆ డబ్బుకి మరో వెయ్యి రూపాయలు కలిపాడు హేమంత్.

సంతోషంగా ఇంటికి వెళ్ళాడు పంతులు.

"ఏమండి.. ఏమిటండీ ఇది?!" అంటూ ఆపేసింది శ్రావ్య.

"చూడు శ్రావ్య.. ఎవ్వరూ వెయ్యికి కక్కూర్తి పడరు.. అందులో ఆయన పంతులు.. ఈశాన్యంలో బరువు పెట్టినా పెట్టకపోయినా.. ఆయన మూడువేలే అడుగుతారు. ఇక దాని గురించి మాట్లాడకు!" అన్నాడు హేమంత్.

ఆ మర్నాడు.. హేమంత్ అతని పీ.ఏ. తో ఆఫీస్‍లో ఉండగా...

"సార్.. సెక్షన్ 4 లో నాలుగు కాంపొనెంట్స్ పోయాయి!" అన్నాడు పీ.ఏ.

"మన సెక్షన్‍లో కాంపొనెంట్స్ పోవడమా? అదీ నాలుగా? ఎలా?" అని ఆశ్చర్యంగా అడిగాడు హేమంత్.

"అవును సార్. ఎలా జరిగిందీ రిపోర్ట్స్ రావడానికి రెండు రోజులు పట్టవచ్చు. కాని రేపే మన ప్రాజెక్ట్ పంపించాలి." అన్నాడు పీ.ఏ.

"ఓ...అయితే ఇక ఆలస్యం చేయకుండా వెంటనే నాలుగు కాంపొనెంట్స్ తెప్పించు!" అని అయిదువేలు చేతిలో పెట్టాడు హేమంత్.

"సార్.. ఎప్పుడూ కాంపొనెంట్స్ పోని మన ఆఫీసులో ఇలా జరిగిందంటే.. ఈశాన్యంలో మీరు పెట్టిన...!" అంటూ ఆపేశాడు పీ.ఏ.

"మనవాళ్ళ అజాగ్రత్తకి అక్కడెక్కడో నా గదిలో ఉన్న బుక్‍షెల్ఫ్ ఎలా కారణమవుతుంది? ఇక దాని గురించి మాట్లాడకు!" అని విసుక్కుంటూ అన్నాడు హేమంత్.

అంతటితో ఆగకుండా అది ఇంకా అలాగే కొనసాగింది. మాటి మాటికీ చిన్న చిన్న తప్పుల వలన కాంపొనెంట్స్ పోవడం.. కార్ పాడవడం.. సిస్టం క్రాష్ అవ్వడం.. యాదృచ్ఛికమని అనలేము. కాని.. హేమంత్ ఓటమి అంగీకరించలేదు. వీళ్ళు చేసే పొరబాటులకి.. ఈశాన్యంలో పెట్టిన బరువుకి సంబంధం లేదని వాదించేవాడు.

ఆ రోజు రాత్రి... భోజనాలు చేస్తుండగా..

"నాన్నగారు..మా ట్యుటొరియల్ ఫీజ్.. ఇంకా ల్యాబ్ ఫీజ్ పెంచారు. అంతేకాదు.. వచ్చే పరీక్షలకి వెయ్యి రూపాయలు కట్టాలి!" అని అడిగాడు గోపాల్.

"హుఁ..మళ్ళీ ఫీజు పెంచారా?! సరే.. మొత్తం ఎంత కావాలో చెప్తే.. తినంగానే ఇస్తాను.. రేపు కట్టేసి రిసిప్ట్ తీసుకురా!" అని అన్నాడు హేమంత్.

"కానీ నాన్నగారు.. ఎప్పుడూ పీజ్ పెంచకుండా ఎప్పుడు ఇంతలా పెంచి.. దానితోపాటు పరీక్షలకి కూడా వెయ్యి రూపాయిలు అడిగారంటే దానికి కారణం మీరు ఈశాన్యంలో బరువు పెట్టడమేనా?!" అని ప్రశ్నించాడు గోపాల్.

"ఔనండీ.. నాకు కూడా అదే అనిపిస్తుంది!" అంది శ్రావ్య.

"చూడండి.. అక్కడ నేను బరువు పెట్టినా పెట్టకపోయినా ఇవన్నీ జరుగుతాయి. నేను పెట్టాను కాబట్టి ఇలా జరుగుతున్నాయంటే నేనొప్పుకోను!" అన్నాడు హేమంత్.

"ఒకటీ - రెండు ఐతే యాదృచికం అనుకోవచ్చు కాని మరీ వరసగా ఇన్ని అయితే ఎలా అనుకోగలుగుతామండీ? అన్నట్లు చెప్పడం మరిచిపోయాను.. మనకి కరెంట్ బిల్లు మూడువేలు వచ్చింది. దీనికేం చెబుతారు?!" అని అడిగింది శ్రావ్య.

"మూడు వేలా..??? అదా... అది... కొత్త ఇంట్లో అడుగుపెట్టి నెలే అయ్యిందికదా.. అందులోనూ బంధువులతో హడావిడిగా ఉంది.. ఆ మాత్రం వస్తుందిలే!" అని సమర్ధించుకున్నాడు హేమంత్.

మరుసటిరోజు హేమంత్ మరియు అతని పీ ఏ కారులో వెళుతూ ఉండగా..

"సార్..మీకింకో చెడు వార్త. డేటాబేస్ మళ్ళీ పాడైంది. అసలు ఏమవుతోందో అర్థం కావట్లేదు సార్!" అని దుఖంతో అన్నాడు పీ.ఏ.

"నాకు అర్థమైంది" అని ఓ నిముషం పాటు ఆలోచించిన తర్వాత "ఇక ఆలస్యం చెయ్యకుండా మా ఇంటికి వెళ్దాం పదా!" అన్నాడు హేమంత్.

వెళ్ళిన వెంటనే అందరిని పిలిచి...

"ఇన్నాళ్ళూ ఈ ధన నష్టానికి గల కారణం ఇప్పుడు నాకు అర్థమైపోయింది. త్వరగా నా గదిలో ఉన్న బుక్‍షెల్ఫ్ ని ఈశాన్యం నుండి తీసువేయండి!!!" అని హడావిడిగా అన్నాడు హేమంత్.

"హమ్మయ్యా!" అని అందరూ అనుకుని అతని గది తలుపు తెరిచి చూడంగానే ఆశ్చర్యపోయారు. అక్కడ బుక్‍షెల్ఫ్ ఈశాన్యంలో లేదు.

"ఏమైంది..ఈశాన్యంలో బరువు లేదుకదూ! మీకొక ఝలక్ ఇవ్వనా?! నేను ఏ రోజైతే బుక్‍షెల్ఫ్ ని అక్కడ పెట్టానో, అదేరోజు దానిని అక్కడ నుండి తీసివేశాను. ఎందుకోతెలుసా? మిమ్మల్ని పరీక్షించడానికి! శ్రావ్యా.. నువ్వు అన్నట్టు అన్నీ యాధృచ్ఛికం కావు.. కొన్ని మాత్రమే! నేను ఆ రోజు పంతులుతో కావాలనే అలా వ్యతిరేకంగా మాట్లాడాను... నేను మాట్లాడిన మాటలను చూసి మీరందరూ నా సహనానికి పరీక్ష పెట్టారు! ముందు పీ.ఏ. పర్సనల్ అస్సిస్టెంట్. పర్సనల్ అంటే నమ్మకం ఉండాలి. కానీ అతను నాకు నమ్మకద్రోహం చేశాడు. రెండు కాంపొనెంట్లకి నాలుగని చెప్పి.. రిపోర్ట్స్ రానీయకుండా అదిమిపెట్టి.. జేబులో డబ్బుని జమాచేసుకున్నాడు. కావాలని తప్పులు చేసి.. కమీషన్ కూడా కొట్టేసాడు. కార్ పాడైందని.. సిస్టమ్ క్రాష్ అయ్యిందని.. నాతో కో-ఆపరేట్ చేస్తున్నట్టు నటించి ఇంక్రిమెంట్‍పై కన్ను కూడా వేశాడు" అని పి ఏ వంక కోపంగా చూశాడు హేమంత్.

పీ.ఏ సిగ్గుతో తలవంచుకున్నాడు.

"నేను తలచుకుంటే ఇప్పటికిప్పుడు నిన్ను ఉద్యోగం నుంచి తీసివేయవచ్చు! కానీ నేను అలా చెయ్యను! ఎందుకంటే నీకు ఇప్పుడు నేనేంటో తెలిసింది కదా.. నాతో ఎలా వ్యవహరించుకోవాలో అర్ధమయ్యే వుంటుంది!" అన్నాడు హేమంత్.

"రెండోది గోపాల్..తండ్రి జేబుని కొట్టేయడానికి ఇంతకంటే మంచి అవకాశమేముంటుంది ? ఎప్పుడు ఫీజ్ కట్టినా రిసిప్ట్ తీసుకువచ్చి ఈ సారి మొహం చాటేస్తే కనిపెట్టలేననుకున్నావా ?!" అని నిలదీసాడు హేమంత్.

"పైగా.. అదేమిటని అడిగితే అదేదో నా తప్పు అయినట్టు మాట్లాడడం ఒకటి...! నా భార్య కూడా ఈ విషయంలో ఆలోచించాలి. మన బలహీనతకి కొన్ని సంఘటనలు బలం చేకూరిస్తే మనం మానసికంగా బలహీనపడకూడదు!" అని నిష్కపటంగా అన్నాడు హేమంత్.

సిగ్గుతో వాళ్ళు తల వంచుకుని, హేమంత్‍ని క్షమాపన వేడుకున్నారు.
ఈశాన్యంలో బరువుపెడితే ధనహాని జరుగుతుందో లేదో కాని... మంచి గుణపాఠాన్ని మాత్రం నేర్పింది.

***

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ