నేను పనిచేసే బ్రాంచ్ కి గుంటూరు నించి బదిలీ మీద వచ్చిన స్టాలిన్ తనంతట తనే నా దగ్గరికి వచ్చి పరిచయం చేసుకున్నాడు.
"హలో సార్. నా పేరు స్టాలిన్. గుంటూరు పట్నం బజార్ బ్రాంచ్ నించి కొత్తగా నాకిక్కడికి బదిలీ అయింది."
కరచాలనం చేయడానికి అతనే తన చేతిని ముందుగా చాపితే కాని నేను అతనికి షేక్ హాండ్ ఇవ్వలేదు.
ఆ రోజు పదకొండున్నర టీ తాగాక టీ కుర్రాడికి డబ్బులివ్వపోతే వాడు చెప్పాడు.
"కొత్తగా వచ్చినాయన ఇవాళ అందరికీ టీ ఇప్పిస్తున్నానని అందరి టీ డబ్బులు ఆయనే ఇచ్చేసాడు సార్."
మా అందరికన్నా అతను ఎక్కువ సార్లునవ్వుతూండటం గమనించాను. ఎందుకు నవ్వావని అడిగితే, అతను వివరిస్తే కాని నాకు ఆ హాస్య కోణం స్పురించేది కాదు.
నాకు మొదటి చూపులోనే అతని మీద ఏర్పడ్డ అయిష్టం అతని ప్రవర్తన వల్ల క్రమేపి పెరగసాగింది.
రోజూ ఉదయం మొదటిసారిగా కనబడ్డ ప్రతీవారితో కరచాలనం చేయడం అతనికి అలవాటని త్వరలోనే గ్రహించాను. తన కన్నా హోదాలో చిన్నవాళ్ళయిన వారి భుజాల మీద అతను ఆప్యాయంగా చేతిని వేయడం కూడా నేను చాలా సార్లు గమనించాను. ఓ సారి అతన్ని నేను ఈ విషయంలో హెచ్చరించాను కూడా.
"సబ్ స్టాఫ్ తో మీరలా మరీ క్లోజ్ గా ఉండకూడదు. నెత్తికెక్కుతారు."
"వాళ్ళూ మనలా మనుషులేగా. పోనీండి సార్." నవ్వేసాడు స్టాలిన్.
ఆఫ్టరాల్ క్లర్క్ ఆఫీసర్ మాటని ఖాతరు చేయకుండా ఉంటాడా? నాకతనిమీద ఏర్పడ్డ ద్వేషం బలపడింది.
త్వరలోనే స్టాలిన్ కి 'త్యాగరాజు' అనే నిక్ నేమ్ ని మా స్టాఫ్ పెట్టారు. ఓసారి మా ఆవిడ ఊరెళ్ళిన రెండు రోజుల తర్వాత స్టాలిన్ నా దగ్గరకి వచ్చి నవ్వుతూ అడిగాడు.
"మీ ఆవిడ ఊళ్లో లేదనుకుంటాను సార్?"
"అవును. మీకెలా తెలుసు?"
"మీరు రెండు రోజులుగా బాక్స్ తెచ్చుకోవడం లేదుగా?"
తన లంచ్ బాక్స్ ని తెరచి నా ముందుంచి చెప్పాడు.
"ఇది మీకోసమే తెచ్చాను సార్. తినండి."
"మరి మీకు?" ప్రశ్నించాను.
"నాకు ఇంకో బాక్స్ తెచ్చుకున్నాను. మీరనుకున్నంత త్యాగరాజుని కాదు సార్ నేను." నవ్వుతూ చెప్పాడు.
కేంటీన్ కి వెళితే పద్దెనిమిది రూపాయలవుతాయి కాబట్టి నేను వద్దనలేదు. ఇంకో మాటెందుకు? నేనైతే అతని భార్య ఊరెళ్ళిందని తెలిసిన అతను చేసిన పని చేసి ఉండేవాడిని కాను.
తిన్నాక ఆ బాక్స్ ని నన్ను కడగనివ్వలేదు. అతనే కడగడం నాకు ఆశ్చర్యం వేసింది.
"చాలా బావుంది. ఏమిటా కూర?" అడిగాను.
"అవ్వల్ అంటారు. తెలుగావిడే అయినా మా ఆవిడ కాలేజ్ డేస్ దాకా క్విలన్ లో ఉంది. మలయాళం వంటకాలన్నీ బాగా చేస్తుంది." చెప్పాడతను ఆ తర్వాత ఏదో సందర్భంలో నేనా విషయం మా ఆవిడతో ప్రస్తావిస్తే నాతో చెప్పింది.
"అవ్వల్ వెజిటేరియన్ వంటకాల్లో బాగా ఖరీదైన వంటకం."
మా కేషియర్ కూతురికి తపాలా బిళ్ళల సేకరణ హాబీ. ఆ సంగతి తెలిసి స్టాలిన్ బేంక్ కి వచ్చే పోస్ట్ కవర్లని పరిశీలించి, కొత్త స్టాంపులని కవర్ల నించి పుట్టినరోజని తెలిసి తనతో తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ లోని చికెన్ కర్రీని అతనికి బహుమతిగా ఇచ్చి తను ఉట్టి చపాతీలనే తిన్నాడు. నేనైతే ఆ పని చేసేవాణ్ణి కాను. చేసినా ఏ అసిస్టెంట్ మేనేజర్ కో అయితేనే చేసేవాణ్ణి.
ఆఫీస్ కి వచ్చే దిన పత్రికలని స్టాఫ్ అంతా చదివాక స్టాలిన్ రోజూ వాటిని యధా ప్రకారం సర్ది న్యూస్ పేపర్ల దొంతరలో పెడుతూండటం గమనించి నేను ఓ రోజూ అతనితో చెప్పాను.
"ఎందుకీ దండగ పని?"
"మనం పని చేసే ఆఫీసు, మనం ఉండే ఇల్లు ఆర్డర్ లో ఉంటేనే మన జీవితాలు కూడా ఆర్డర్ లో ఉంటాయి సార్." నవ్వుతూ చెప్పాడు స్టాలిన్.
తరచు తన లేదా తన భార్య, పిల్లల పుట్టిన రోజనో, పెళ్ళి రోజనో మా అందరికీ లెవెన్ తర్టి టీ, త్రి తర్టి టీని తన డబ్బులతో ఇప్పించేవాడు. అలాంటి సందర్భాలు నా జీవితంలో కూడా వస్తూంటాయి కాని నేనలా ఎవరికి ఉచితంగా టీలు ఇప్పించను. పైగా అడిగితే ఎగ్గొట్టడానికే ప్రయత్నిస్తాను. మిగిలిన స్టాఫ్ కూడా నాలానే ఎగ్గొట్టడంలో మాస్టర్స్.
ఓ క్లర్క్ ఏన్యువల్ లీవ్ మీద ఎనిమిది రోజులు వెళ్తున్నాడు.
"హైదరాబాద్ లో ఇల్లు తాళం పెట్టి వెళ్ళడం ప్రమాదకరం. మా బావమరిదిని వచ్చి పడుకోమంటే సరేనన్నాడు. తీరా ఇందాక ఫోన్ చేసి చెప్పాడు, వాళ్లమ్మాయికి టాన్సిల్స్ ఆపరేషన్ చేయిస్తున్నానని, కుదరదని." మాతో చెప్పాడు.
అతను తిరిగి వచ్చే దాకా స్టాలిన్ ప్రతీరాత్రి అతనింటికి వెళ్ళి పడుకున్నాడు.
కస్టమర్స్ లో చాలామంది బేలన్స్ చెప్పమనో, కొత్త చెక్ బుక్ ని ఇవ్వమనో వస్తూంటారు. మేం కొద్దిసేపు వెయిట్ చేయించి కాని వాళ్ళ పని చేసి పంపం. ఒకోసారి మర్నాడు రమ్మని చెప్తాం. బేంక్ కి వచ్చే పబ్లిక్ ని విసుక్కోవడం మా స్టాఫ్ అందరికీ అలవాటైన పనే. కాని స్టాలిన్ ఈవిషయంలో మాకు భిన్నంగా ప్రవర్తించేవాడు. అతనే మాత్రం విసుక్కోకుండా తను చేసే పనిని ఆపి వాళ్ళ పని చేసిపెట్టేవాడు. ఆ తర్వాతే చేతి మీద ఉన్న పనిని కొనసాగించేవాడు.
ఓ రోజు కౌంటర్ క్లర్కుల్లో ఒకతను గట్టిగా స్టాలిన్ తో చెప్పాడు.
"చూడండి స్టాలిన్ గారు. కస్టమర్ల పన్లు మీరు వెంటనే చేసి పంపడం మాకు ఇబ్బంది అవుతోంది. 'స్టాలిన్ చేస్తాడు. మీరెందుకు చెయ్యరు?' అని కొందరు మమ్మల్ని గదమాయిస్తున్నారు. వాళ్ళని కాసేపు వెయిట్ చేయిస్తూండండి."
"జీవితంలో ఈ మూడింటిని ఎన్నడూ దెబ్బ తీయకూడదని మా నాన్నగారు ఎప్పుడూ చెప్తుండేవారు సార్. నమ్మకం, వాగ్దానం, హృదయం. వీటికి దెబ్బ తగిలితే శబ్దం రాదు, నొప్పి తీవ్రంగా ఉంటుంది."
స్టాలిన్ కి ఏం బదులు చెప్పాలో అర్ధం కాక తలవంచుకున్నాడు అతను.
తర్వాత కొందరు క్లర్క్స్ నన్ను కోరారు. ఆ విషయంలో అతని మీద వత్తిడి తీసుకురమ్మని. నేను అతన్ని మళ్ళీ ఆ విషయం పునరాలోచించమంటే ఇలా అన్నాడు.
"చిటికెలో అయిపోయే పనికి వాళ్ళని వెయిట్ చేయించడం ఎందుకు సార్? వాళ్ళకీ బోలెడు పనులుంటాయి."
భర్త మరణించిన ఓ తమిళ మామి, తన భర్త షేర్ సర్టిఫికేట్స్ తెచ్చి వాటిని ఎలా బదిలీ చేసుకోవాలని నన్నడిగింది.
"నాకు తెలీదు. అది మా పని కాదు." ఆవిడ మా స్టాఫ్ లో ఎవర్ని అడిగినా చెప్పే సమాధానమే చెప్పాను.
ఆ మాటలు విన్న స్టాలిన్ ఆవిడకి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. తన లంచ్ అవర్ లో ఆ కంపెనీలకి షేర్స్ బదిలీ మీద ఉత్తరాలు డ్రాఫ్ట్ రాసిచ్చి, వాటిని రిజిష్టర్డ్ పోస్ట్ లో డెత్ సర్టిఫికేట్ జిరాక్స్ లతో పంపమని చెప్పాడు.
ఆ రోజు మా అందరికి స్టాలిన్ తెల్ల గులాబా స్టెమ్ లని ఎక్కడివని అడిగాను.
"నిన్న ఓణం పండగని సికింద్రాబాద్ లోని మళయాళీ వెల్ ఫేర్ అసోసియేషన్ సెలబ్రేట్ చేసింది. వాళ్ళు డెకరేషన్ కి వాడినవివి." చెప్పాడు.
బయటికి నేను 'థాంక్స్' చెప్పినా మనసులో అనజీగా ఫీలయ్యాను. అతనలా నిస్వార్ధంగా నేను ప్రవర్తించనన్న నా తీరుని నేను గుర్తించడం వల్లనుకుంటాను ఆ భావన.
"ఆ రోజు వాళ్ళు ఏ దేవుడ్ని కొలుస్తారు?" ప్రశ్నించాను.
"ఓణం మళయాళీల సంవత్సరాది. దేవుడితో పని లేదు." నవ్వుతూ చెప్పాడు.
నా బావమరిది పెళ్ళికి నేను శెలవకి అప్లై చేసాను. అదే రోజుకి స్టాలిన్ కూడా శెలవుకి అప్లై చేసాడు. మా మేనేజర్ ఇద్దర్నీ పిలిచి మా ఇద్దరిలో ఎవరో ఒకరికే శెలవు మంజూరు చేస్తానని చెప్పాడు. తన పనిని స్టాలిన్ వాయిదా వేసుకుని వెనక్కి తగ్గాడు. నా బావమరిది పెళ్ళి సి.డి మా ఇంటికి వచ్చింది. నా దగ్గర సి.డి ప్లేయర్ లేదు. దాంతో ఆహం చంపుకుని ఎంతో అయిష్టంగా నేను స్టాలిన్ తో నా అవసరం గురించి చెప్పాను.
"దాందేముంది సార్. చీఫ్ కేషియర్ గారింట్లో ఉంది. అడిగి తీసుకుందాం."
"ఆయన్ని చస్తే అడగను." నిష్కర్షగా చెప్పాను.
"మీరెందుకు సార్? నేనడిగి తెస్తాగా."
నేనైతే 'ఎందుకడగరని' ప్రశ్నించేవాడ్ని, మాకు పడదన్న సంగతి తెలిసినా. అతను తన స్కూటర్ మీద సి.డి ప్లేయర్ ని తెచ్చి మా టి.వికి అతనే కనెక్ట్ చేసి, దాన్ని ఏకా ఆపరేట్ చేయాలో చెప్పి వెళ్ళాడు. పనయ్యాక దాన్ని తీసుకెళ్ళి చీఫ్ కేషియర్ ఇంట్లో తిరిగి ఇచ్చాడు.
"మీ పేరేమిటి తమాషాగా ఉంది?" మా ఆవిడ అతన్ని అడిగింది.
"అదా? మా నాన్నగారు కమ్యూనిస్ట్. అందుకని నాకు స్టాలిన్ అని, మా తమ్ముడికి లెనిన్ అని, మా చెల్లాయ్ కి ఓల్గా అని పేర్లు పెట్టారు."
"మీరు నాస్తికులా?" అడిగాను వెంటనే.
"నేను పక్కా నాస్తికుడ్ని సార్. నాకు బుద్ధి తెలిసాక ఇంతదాకా ఒక్కసారి కూడా గుడికి వెళ్ళలేదు. దేవుడ్ని నమ్మద్దని మా నాన్నగారు మాకు బాగా నూరి పోశారు లెండి." నవ్వుతూ చెప్పాడు స్టాలిన్.
'మా ఆయన రోజూ సహస్ర గాయత్రి జపం చేస్తారు." మా ఆవిడ గర్వంగా చెప్పింది.
ఓ రోజు పుల్లారెడ్డి స్వీట్స్ తెచ్చి నా సీట్ దగ్గరకి వచ్చి ఆనందంగా చెప్పాడు స్టాలిన్.
"క్విలన్ కి బదిలీకి పెట్టుకున్నాను సార్ బదిలీ వచ్చింది. మా ఆవిడ బంధువులంతా అక్కడే ఉన్నారు. నా కెక్కడైనా ఒక్కటే. మా ఆవిడ కోరిక మీద బదిలీ చేయించుకున్నాను."
రిలీవ్ అయిన రోజు నాకో టిఫిన్ బాక్స్ ని తెచ్చిచ్చాడు.
"ఏమిటది?" అడిగాను.
"అవ్వల్ సార్. మీకు మళ్లీ ఎప్పటికి వీటిని పెడతానో కదా? ఎల్ టిసి పెట్టుకుని మా ఊరు రండి సార్. మా ఇంట్లో ఉండచ్చు. నా బావమరిది ఒకడు ఖాళీగా ఉన్నాడు. కేరళని చూపిస్తాడు."
"టిఫిన్ బాక్స్ ని ఎలా తిరిగి ఇవ్వను?" అతను వెళ్ళబోతూంటే అడిగాను.
"ఊరుకోండి సార్. నా గుర్తుగా ఉంచుకోండది."
బ్రాంచి లోంచి బయటకి వెళ్తున్న స్టాలిన్ చూస్తే నాకు మనసులో ఏదో చెప్పలేని దిగులనిపించింది.
'ఓ భగవంతుడా! స్టాలిన్ లో ఉన్నది. నాలో లేనిది ఏదైతే ఉందో అది నాకు దయచేసి ఇవ్వు.' నేను దేవుడ్ని ఓ దాని కోసం బలంగా ప్రార్ధించడం నా జీవితంలో అదే మొదటిసారి.
***
ఓ రోజు నేను పని చేసుకుంటూంటే తమిళ మామి వచ్చి అడిగింది.
"స్టాలిన్ ఎక్కడా? కానమే?"
"అతనికి బదిలీ అయింది." చెప్పాను.
"అరెరె! ఎప్పుడు?"
వివరాలు చెప్తాను.
"టాటా షేర్ కన్ సల్టెన్సీ నించి ఉత్తరం వచ్చింది. దీనికేం జవాబు రాయాలో అడుగుదామని వచ్చాను. అతనికి తెలుసా విషయం."
"ఏదీ ఇవ్వండి. చూస్తాను."
దానికి సమాధానం రాసిచ్చాక అనిపించింది, స్టాలిన్ లో ఏం ఉందో అది నాలోనూ స్వల్పంగా చోటు చేసుకుందని.
ఒక్క నాలోనే కాదు. మా స్టాఫ్ అందరిలోనూ. చెక్ బుక్ లు లేదా బేంక్ ఎంట్రీ ల కోసం వచ్చే వాళ్ళతో మా స్టాఫ్ లో ఎవరూ 'ఫ్రింటర్ అవుటాఫ్ ఆర్డర్' అనో, 'సిస్టం డౌన్' అనో అబద్ధం ఆడకుండా వాళ్ళ పనిని వెంటనే చేసి పంపుతున్నారు.
స్టాలిన్ తనలోని మంచిని మా అందరికీ కొంత వదలి వెళ్ళాడు.
***
(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)