సారీ అమ్మా - భారతీ నటరాజన్

sorry... amma...

చేతిలో కాగితాన్ని కోపంగా నలుపుకుంటూ పళ్ళు పట పటా కొరుకుతూ మెట్లు దిగుతున్న శశిని చూసి నాకేమనాలో అర్ధం కాలేదు. కంగారు పడుతూ నేను శశాంక్ కేబిన్ లోకి వెళ్ళి ఏమయిందని అడిగాను.

"ఏం లేదు మధూ, నేనే కావాలనే పరీక్ష కాస్త కష్టంగా పెట్టాను. ఇప్పటి పిల్లలకు చదువు ఉంది. కానీ సంస్కారం లేదు. పెద్దలంటే గౌరవం లేదు, మనుష్యులంటే ఆదరాభిమానాలు లేవు. అలాంటి చదువులకు విలువ లేదని నా అభిప్రాయం. నువ్వు చెప్పినవన్నీ విన్న తరువాత నా అనుభవం చెప్తున్నదేమిటంటే ఆ అమ్మాయి మనస్సు చాలా మంచిది. కానీ ఆ మంచితనాన్ని మూసేస్తున్న అహం, స్వార్ధం అనే మబ్బులను మనం తొలగించగలిగితే సమాజానికి మనమొక ఆణిముత్యాన్ని ఇచ్చిన వాళ్ళమవుతాం. చూద్దాం. అయినా నువ్వేం కంగారు పడకు. మరల శశి ఇక్కడకు వస్తుంది' అంటూ ఆయన కారెక్కి వెళ్ళిపోయాడు.

శశి కోపానికి గల కారణం చెప్పాలంటే ముందు మీకు తన గురించి, తన కుటుంబం గురించి చెప్పాలి...

మా నాన్నగారి మొదటి భార్యకి పుట్టిన సంతానం మా అక్క పార్వతి. పార్వతి వాళ్ళ అమ్మ చనిపోతే మా నాన్న మా అమ్మని పెళ్ళి చేసుకున్నారు. అంతకు ముందు నాకు తెలియదు. కానీ నేను పుట్టినప్పటినుండీ నవ్వు అంటే ఎరుగని అమ్మాయి పార్వతి. నా కంటే పదేళ్ళు పెద్దది. మా అమ్మ అక్కని ఓ పనమ్మాయి కంటే హీనంగా చూస్తూ కనీసం కడుపు నిండా అన్నం కూడా పెట్టేది కాదు. ఇవన్నీ చూస్తున్నా ఏమయినా అంటే అమ్మ అక్కని ఇంట్లో నుండి తరిమేస్తుందన్న భయంతో నాన్న ఏమీ అనలేక తనలో తానే బాధపడుతూ ఉండేవాడు. నేను, మా అక్క మాత్రం చాలా ప్రేమగా ఉండేవాళ్ళం. ఎవడో తాగుబోతు ఎదురు కట్నం ఇస్తానన్నాడని మా అక్కని బలవంతంగా వాడికిచ్చి పెళ్ళి చేసింది మా అమ్మ. మా బావ పెళ్ళయిన తరువాత చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే మాకూ అక్కకి గొడవలు పెట్టి అక్కని మాకు కాకుండా చేయడం. ఈ గొడవలతో నాన్న ఏమీ అనలేక మనోవ్యధతో కాలం చేసారు. కొన్నాళ్ళకే అమ్మ కూడా పోయింది. నన్ను మా మావయ్య తీసుకుని వెళ్ళాడు. పెళ్లి తర్వాత అక్క పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టయింది. బావకి చీకటి పడితే తప్పితే ఇల్లు గుర్తుకు రాదు. ఈ లోగా ఇద్దరు కూతుళ్ళు పుట్టారు. ఇద్దరూ ఆడపిల్లలు పుట్టారని, మా బావ అక్కనీ, పిల్లల్నీ నడిరోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఎప్పటికప్పుడు అక్క పరిస్థితి తెలుస్తున్నా, అభిమానవంతురాలైన మా అక్కకి ఎటువంటి సహాయం చేయలేక చూస్తూ బాధపడడం నా వంతయింది.

అక్క పెద్దకూతురు రమ. పొందికైన పిల్ల. చిన్నది శశి. నాన్న బుద్ధులన్నీ పుణికిపుచ్చుకుంది. తాను చాలా అందగత్తెనని, తెలివైనదానినని అహంకారం. వాళ్ళమ్మకి ఒక కన్ను లేదని, అక్క అందంగా ఉండదని వీళ్ళంటే చాలా చిన్న చూపు శశికి. ఎంతో తప్పని పరిస్థితులయితే తప్పితే వాళ్ళిద్దరితో బయటకు కూడా వెళ్ళడానికి ఇష్టపడేది కాదు.

మా అక్క ఉదయాన్నే లేచి ఇళ్ళల్లో పాచీ పని చేసి, ఇంటి పని చూసుకుని, దగ్గర్లో కడుతున్న అపార్టుమెంటుల లోకి సిమెంట్ పనులకి వెళ్ళి, మరల సాయంత్రం మరో రెండు ఇళ్ళల్లో పనులు చేసి కుటుంబాన్ని పోషించేది. ఇంటి పరిస్థితిని అర్ధం చేసుకున్న రమ అమ్మకి చేదోడువాదోడుగా ఉండటానికి టైలరింగ్ నేర్చుకుని బట్టలు కుడుతుంది. చదువుకుంటానన్న శశిని వాళ్ళిద్దరూ కలిసి చదివిస్తున్నారు. శశి వాళ్ళ సంపాదనతో చదువుకుంటూ వాళ్ళనే కించపరుస్తూ మాట్లాడేది. ఇప్పుడు శశి ఉద్యోగాల వేటలో ఉంది. మా బాస్ తమ్ముడు గారైన శశాంక్ గారి ఆఫీస్ లోనే ఇప్పుడు శశికి ఇంటర్వ్యూ.

శశాంక్ గారు చాలా పెద్ద మానసిక శాస్త్రవేత్త. పెద్ద పెద్ద కంపెనీలకి మ్యాన్ పవర్ కన్సల్టెంట్. అంతర్జాతీయ స్థాయిలో సమాజ సేవకుడని మంచి పేరున్న వ్యక్తి. ఆయనతో నాకున్న చనువుతో శశి గురించి, మా అక్క గురించి జరిగినదంతా చెప్పాను. ఆయన ఎలా అయినా మా అక్క ముఖంలో ఆనందం నాకు చూపిస్తానని, శశిని మారుస్తానని మాట ఇచ్చారు.

ఆ ప్రహసనం లో భాగమే ఇదంతా...

'మే ఐ కమ్ ఇన్ సార్...' వినయంగా అడిగింది శశి.

'రామ్మా. కూర్చో.' అన్నారు శశాంక్.

'మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి కాస్తా చెప్పమ్మా, అంటే మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? మీరెంతమంది, నువ్వెక్కడ చదువుకున్నావు, నీ హాబీస్ ఏమిటి, వగైరా, వగైరా...'

'సార్. నా చిన్నప్పుడే నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. నేను అమ్మ, అక్క. నేను మునిసిపల్ స్కూల్ లో చదువుకున్నాను. మంచి మార్కులు రావడంతో ఇంటర్, ఇంజనీరింగ్ గవర్నమెంటు కాలేజీలలో సీటు వచ్చింది. నా చదువుకైన ఖర్చంతా మా అమ్మ, మా అక్క భరించారు' అని చెప్పింది.

'ఓ. గుడ్. మీ అమ్మ, అక్క ఏం చేస్తుంటారు?'

ఇక తప్పదన్నట్లు చెప్పింది. 'సార్. మా అమ్మ నాలుగయిదు ఇళ్ళల్లో పనిచేస్తుంది. అపార్టుమెంటుల కట్టడాల పనులకి వెళ్తుంది. మా అక్క బట్టలు కుడుతుంది'


'అమ్మా. నాకు మీ అమ్మగారిని చూడాలని ఉంది. తీసుకొస్తావా' అని అడిగారు.

'తను ఎక్కడికీ రాదు సార్. నా బయోడేటా మీకు నచ్చితే చెప్పండి. లేకుంటే లేదు' అని కొంచెం కర్కసంగానే ఉంది.

'ఓ. ఐ యామ్ సారీ. సరే కానీ నువ్వు ఎప్పుడైనా మీ అమ్మగారి అరచేతులని చూసావా' అని అడిగిన ప్రశ్నకు అయోమయంగా చూస్తూ లేదన్నట్లు అడ్డంగా తల ఊపింది.

'ఈ రోజు సాయంత్రం ఒకసారి చూడమ్మా. చూసి రేపు మరల నువ్వు రా. అప్పుడు చెప్తా నీ బయోడేటా నాకు నచ్చిందో లేదో' అని చెప్పారు.

ఏదయితేనేం తనకిప్పుడు జాబ్ ముఖ్యం. ఎలాగోలా ఈ జాబ్ సంపాదించుకుంటే ఇక లైఫ్ అంతా తిరిగి చూసుకోవలసిన పని ఉండదు. ఈ ఆలోచనలతో ఇల్లు చేరిన శశి కి ఆయాసపడుతూ తనతో పాటే వస్తున్న అమ్మ ఉనికి తెలియనేలేదు.

అమ్మ అరచేతుల్ని చూడాలని చాలా ప్రయత్నించింది కానీ కుదరలేదు. ఎలాగైనా చూడాలని నిర్ణయించుకుని రాత్రి భోజనాలయ్యాక తప్పదన్నట్లుగా అమ్మ పక్కన కూర్చుని 'అమ్మా... నీ చేతులు ఒకసారి ఇలా ఇయ్యి' అని అడిగింది.

ఏమీ అర్ధం కాని పార్వతి అరచేతులు ముందుకు చాచింది.

ముందెన్నడూ చూడని ఆ అరచేతులు చూసిన శశి ఒక్క క్షణం నివ్వెరపోయింది. అంట్ల తోమడం వలన గోళ్ళన్నీ మట్టి పట్టి నల్లగా ఉన్నాయి. సర్ఫ్, సబ్బు, నీలిమందు నీళ్ళల్లో నానిన ఆ చేతులు అక్కడక్కడా పొక్కిపోయి, చిన్న చిన్న కన్నాలు పడి గరుగ్గా ఉన్న ఆ చేతుల్ని చూసి మనస్సు కలచివేసినట్లయింది శశి కి.

'ఏమయిందే కొత్తగా అలా చేస్తున్నావు ఈవేళ?' అన్న అమ్మ పిలుపుతో ఈ లోకం లోకి వచ్చింది.

'ఏం లేదులే అమ్మా. నువ్వు పడుకో' అంది శశి.

కళ్ళు మూసినా ఆ చేతులే కళ్ళల్లో మెదుల్తూ ఉన్నాయి. నాన్నలానే అమ్మ కూడా వదిలేసి వెళ్ళిపోయి ఉంటే నా భవిష్యత్తు ఏమై ఉండేది? ఈ ఆలోచనలతో తల పగిలిపోతుంది. రేపు ఈ అరచేతుల గురించి ఏమని అడుగుతారో, నా సమాధానం లో ఆయన ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో, ఈ చేతి రాతల ఇంటర్వ్యూ ఏమిటో అంతా అయోమయంగా ఉంది. ఏదయితేనేం చూసిందే చెప్పదలచుకుంది.

మరుసటి రోజు శశాంక్ ఆఫీసు కి వెళ్ళి మౌనంగా కూర్చుంది శశి.

'ఏమ్మా అలా ఉన్నావు?

'సా...ర్... నిన్న... నేను మా అమ్మ చేతులు చూసాను, అక్కడక్కడా పొక్కిపోయి ఉన్నాయి. మా గురించే... తను అంతలా... కష్టపడుతుంది'. అంతకంటే ఏమీ చెప్పలేనట్లుగా నీళ్ళు నిండిన కళ్ళతో శశాంక్ వంక చూసింది.

"అరరె. సారీ అమ్మా. నిన్ను బాధపెట్టినట్లున్నాను. ఇదుగో ఈ మంచినీళ్ళు తాగు'.

'నాకు ఇంకొక్క చిన్నపని చేసిపెట్టు. రేపు వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ ఫోటో మర్చిపోకుండా తీసుకునిరా' అంటూ వేరే పనిలో నిమగ్నమయిపోయారు శశాంక్ గారు.

శశి వెళ్ళిపోయిన తర్వాత శశాంక్ ఆలోచనలో పడ్డారు. నేటి పిల్లలకి విశ్వాసం, ప్రేమ, అభిమానం లాంటి పదాలు, వాటి అర్ధాలు, జీవితం లో వాటి విలువ తెలియట్లేదు. ఇప్పుడిప్పుడే ఈ అమ్మాయి జీవితం లోకి అడుగు పెడుతోంది కాబట్టి వీటి పరమార్ధం తను గ్రహించేటట్లు చేస్తే ఇంత మంచి తెలివితేటలున్న అమ్మాయికి ఒక మంచి వ్యక్తిత్వం కూడా ఇచ్చిన వాళ్ళమవుతాం.

శశి ఫోటో అయిష్టంగానే శశాంక్ చేతిలో పెట్టింది. శశాంక్ ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు. అందులో ముగ్గురూ ఉన్నారు. శశి అమ్మకి ఒక కన్ను లేదు. అదే అడిగారు శశిని శశాంక్.

'అదేమిటీ మీ మదర్ కన్నేమయింది' అనుకున్నట్లుగానే ఆత్రంగా అడిగారు శశాంక్.

'ఏమో సార్. చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ముల్లు గుచ్చుకుని పోయిందట'. అను ముక్తసరిగా సమాధానం చెప్పింది.

'ఈ ఫోటో చూస్తుంటే ముల్లు గుచ్చుకుని కన్ను పోయినట్లు లేదే. అస్సలు కన్నే లేదు. ఖచ్చితంగా ఏదో జరిగింది. అది నీకు తెలియదు అంతే'. అన్నారు శశాంక్.

'అయి ఉండొచ్చు సార్. నేను పెద్దగా ఎప్పుడూ పట్టించుకోలేదు మరి' అని మొక్కుబడిగా సమాధానం చెప్పింది.

'చూడు శశీ. నీకు చదువు ముఖ్యమే. బట్ ఎట్ ద సేమ్ టైమ్ కుటుంబం విషయంలో నీకు కూడా ఒక బాధ్యత ఉంటుంది కదా. కుటుంబం అంటే నాలుగు గోడల మధ్య నలుగురు మనుష్యులు ఉండటం మాత్రమే కాదు కదా. నువ్వు ఇప్పుడు చేరబోయే జాబ్ లో నువ్వు నిరంతరం మనుష్యులతో, వారి మనస్తత్వాలతో డీల్ చేయాలని తెలుసు కదా. మీ ఇంట్లో వాళ్ళ గురించే నీకు పూర్తిగా తెలియకపోతే ఇక బయటవాళ్ళ గురించి ఎలా తెలుసుకుంటావు' అని ఇంకా ఏదో అనబోయేంతలో. ఇక ఓపిక నశించిన శశి 'సార్. నాకు నా చదువు, మార్కుల ఆధారంగా మీ ఉద్యోగానికి నేను తగినదానను అనుకుంటే చెప్పండి లేదా నేను వేరే జాబ్ ట్రై చేసుకుంటాను' అని లేవబోయింది.

'అది ఓ కే మేడమ్. కానీ మా ఆలోచన ఒకటే. మాతో కలిసి పనిచేసే వ్యక్తికి కంపెనీ పట్ల విశ్వాసం ఉండాలి. మనుష్యులని వస్తువులుగా కాక మనసున్న మనుష్యులుగా చూడాలి. మాకు లాభాల కంటే విలువలు ముఖ్యం. మానవతా విలువలు, వాటికనుగుణంగా ఉండగలిగిన వారు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు'. అంటూ కాస్త మందలిస్తున్నట్లుగా చెప్పారు శశాంక్.

చెప్పడం పూర్తయిందా అన్నట్లు విసుగ్గా లేచి వెళ్ళింది శశి.

ఉదయం 10 గంటలకి అమ్మ పనికి వెళ్ళింది. శశి నెమ్మదిగా అక్క వద్దకు వెళ్ళి, 'అక్కా నా మీద ఒట్టేసి నిజం చెప్పు. అమ్మ కన్ను ముల్లు గుచ్చుకుని పోయిందని నువ్వు నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? అని అడిగింది.

'మరి నాకు అంతే తెలుసు'

'అక్కా ప్లీజ్. నువ్వు నా వద్ద ఎందుకు దాస్తున్నావో తెలియదు. నాకు నిజం తెలియాలి. అదీ ఇప్పుడే. చెప్పకపోతే నా మీద ఒట్టే'.

'శశీ. నేను అమ్మకి మాటిచ్చాను. ఎప్పటికీ నీకు చెప్పననీ. అయినా నువ్వు ఇంతలా అడుగుతున్నావు కనుక విను'.

నీకు తెలిసీ తెలియని వయస్సులో ఒకరోజు రాత్రి అమ్మ పని నుండి బాగా జ్వరంతో వచ్చింది మంచం మీద స్పృహ లేకుండా వాలిపోయింది. నేను నీళ్ళు తోడడానికి వాకిట్లోకి వెళ్ళి వచ్చే లోపల నువ్వు పాకుకుంటూ పొయ్యి దగ్గరకు వెళ్ళావు. మండుతున్న కట్టె ఒకటి పేలి వాటి రవ్వలు నీ కంట్లో పడ్డాయి. నువ్వు విపరీతంగా ఏడుస్తూండేసరికి మేము నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళాము. పరీక్షలన్నీ చేసిన డాక్టర్లు తేల్చి చెప్పినదేమిటంటే కంట్లో రెటీనా బాగా దెబ్బ తినడం వలన నీ కంటికిక చూపురాదని. కానీ ఎవరైనా కన్ను ఇవ్వడానికి ముందుకొస్తే, మన కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆపరేషన్ ఉచితంగా చేస్తామని చెప్పారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అమ్మ వెంటనే తన కన్ను ఇస్తానని చెప్పింది. డాక్టర్లు ఎంత చెప్పినా వినకుండా తన కన్ను నీకు ఇచ్చింది'.

ఇదంతా విన్న శశి వెక్కి వెక్కి ఏడుస్తూ... 'ఎందుకక్కా నాకిన్నాళ్ళూ ఈ విషయం చెప్పలేదు. నిజం తెలియకుండా నేను ఊహ తెలిసిన దగ్గర్నుండీ అమ్మని చాలా కష్టపెట్టాను. అమ్మకి ఒక కన్ను లేదని, తనని అలా నా ఫ్రెండ్స్, టీచర్స్ చూస్తే నాకు చిన్నతనమని ఎపుడూ ఎవరికీ అమ్మని పరిచయం చేయలేదు. నా పక్కన తను నడిస్తేనే నేను అవమానంగా ఫీల్ అయ్యేదాన్ని. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అమ్మని నేను అవమాన పరిచాను. టీచర్స్ ఎవరైనా అమ్మ గురించి అడిగితే, మా అమ్మ లేదని, ఊరెళ్లిందని చెప్పేదాన్ని. తనని నా తల్లి అని చెప్పుకోవడానికి నామోషీ అనిపించే నేను తనకి దూరంగా హాస్టలు లో ఉంటానన్నది అని కూడా' అంది.

ఇంతలో పార్వతి ఇంట్లో అడుగుపెడుతూనే శశి ఏడుపు చూసి కంగారుపడుతూ ఏమయిందని అడిగింది.

'అమ్మా. ఎంతో త్యాగం చేసి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు. దానికి ఫ్రతిఫలంగా నేను నీకు దుఃఖాన్ని, క్షోభని ఇచ్చాను. నేను నీ పట్ల చేసింది మామూలు తప్పు కాదమ్మా...'

'అదేమిటే. నీ కళ్ళల్లో ఈ కన్నీళ్లు చూడకూడదనే కదా నేను ఇన్నేళ్ళు ఇంత కష్టపడ్డది. మీరిద్దరు బాగుంటే అంతకంటే నాక్కావలసినదేముందమ్మా'

రాత్రి అమ్మ పక్కనే పడుకుని అమ్మ రెండు చేతుల్నీ తన బుగ్గలకి ఆనించుకుని చంటి పిల్లలా ఏదో తెలియని కొత్త అనుభూతిని మనస్ఫూర్తిగా అనుభవిస్తూ తల్లిని ఆప్యాయంగా హత్తుకుని రేపు ఏ విధంగా శశాంక్ గారికి తన కృతజ్ఞతలు తెలుపుకోవాలా అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది శశి.

'అరే శశీ. నువ్వా... ప్లీజ్ కమ్ ఇన్. ఏమిటీ ఇంత ఉదయాన్నే. ఆల్ వెల్ కదా' అని అడిగారు శశాంక్.

'సార్. మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. నా సర్టిఫికెట్స్ కి నాకు ఎక్కడైనా జాబ్ వస్తుంది కానీ ఒక మానవత్వం ఉన్న మనిషిగా మీరు నాకు పునర్జన్మనిచ్చారు. దానికి మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను' అంటూ వినయంగా చేతులు జోడించింది.

'శశీ... కమ్ ఆన్. ఐ హేవ్ డిసైడెడ్. ఈ జాబ్ నీకే. మాకు నీలాంటి వాళ్ళే కావాలి. నీకు కష్టం విలువ తెలియడానికే ఇదంతా చేసానమ్మా. రేపే వచ్చి నువ్వు మాతో నీ కొత్త జీవితం ప్రారంభించవచ్చు'.

మరునాడు ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి వచ్చింది శశి. అమ్మతో, అక్కతో మొట్టమొదటిసారిగా గర్వంగా నడుస్తూ అమ్మ చేయి పట్టుకుని ఆఫీసు మెట్లు ఎక్కుతూ ఉన్న శశీని చూసి నా కళ్ళు ఆనందం తో చెమర్చాయి. నేనిన్నాళ్ళూ ఎదురుచూసింది దీనికోసమే. ముగ్గురూ కలిసి శశాంక్ కేబిన్ లోకి వెళ్ళారు.

'సార్ మా అమ్మ గారు. మా అక్క' అని ఎంతో ఆప్యాయంగా పరిచయం చేస్తూ నాదో చిన్న రిక్వెస్ట్ సార్... నా అపాయింట్ మెంట్ ఆర్డరు మీ చేతులతో మా అమ్మకి ఇవ్వండి' అని అడిగింది శశి.

శశాంక్ వెంటనే అపాయింట్ మెంట్ లెటరు పార్వతి చేతులలో పెడుతూ, 'అమ్మా. మీ కష్టం ఫలించిన రోజు. దీని ప్రతిఫలం ముందు మీకే దక్కాలి. మీరిన్నేళ్ళు నీరు పోసి పెంచిన మొక్క ఈ రోజు మధురమైన ఫలాలు మీకు ఇవ్వనుంది. మీ చేతులతో మీ అమ్మాయికి ఈ లెటర్ ఇచ్చి జీవితంలో తను ఎంతో ఎత్తుకి ఎదగాలని ఆశీర్వదించండమ్మా' అన్నారు శశాంక్. నీళ్ళు నిండిన కళ్ళతో పార్వతి ఆ లెటర్ తీసుకుని శశి చేతులలో పెట్టింది.

భగవంతుడా... ఈ వయస్సులోనైనా మా అక్కకి అండనిచ్చావు. దానినలాగే జీవితాంతం ఉండనీ. ఇక అక్క ముఖంలో బాధ అనేది రానీకు' అని మనసులోనే నమస్కరించాను.

***

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ