బస్సులో పెళ్ళిచూపులు - లక్ష్మీసుజాత

pelli choopulu

క్రమశిక్షణ కలిగిన విద్యార్ధులు వరసగా నుంచున్నట్టు బస్టాండ్ లో బస్సులు నిల్చుని ఉన్నాయి.

నేనూ, నా భార్యా, మా అబ్బాయీ ఒక్కో బస్సూ ఎక్కడికి వెళుతుందో చూస్తూ మేము ఎక్కవలసిన బస్సు కనిపించగానే ’హమ్మయ్యా’ అని మనసులో అనుకుని నెమ్మదిగా బస్ ఎక్కాము. అది అప్పటికే జనం తో నిండివుంది. మేము రిజర్వేషన్ చేసుకుని వుండడంతో మా ఆవిడ్నీ అబ్బాయినీ మధ్యలో వున్న వాళ్ళ సీట్ లో కూర్చోబెట్టి ముందుసైడు వున్న నా సీట్ వైపు వచ్చాను. అక్కడ అప్పటికే విండో సైడు ఒకాయన కూర్చున్నాడు.

"ఏవండీ, మీరు కూర్చున్న సీటు నాది కాస్త జరుగుతారా?" అన్నాను.

"నాకు బస్సు ప్రయాణం పడదు. విండో సైడు అయితే కాస్త గాలి పీల్చుకోవచ్చని కూర్చున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే కూర్చుంటాను.. లేదంటే జరుగుతాను" ప్రాధేయ పూర్వకంగా ఆన్నాడు.

నాలాగానే వయసులో పెద్దవాడు. ఆయన్ని ఇబ్బంది పెట్టడమెందుకని నవ్వి "నాకేం ఫర్వాలేదండీ" అన్నాను ఆయన పక్కన కూర్చుంటూ.

ఆయన ముఖంలో గొప్ప రిలీఫ్ కనిపించింది.

మంచితనం.. మానవత్వం.. గురించి అందరం గొప్పగా మాట్లాడతాం కాని, ఇలాంటి చిన్న చిన్న సర్దుబాట్లు మనసుకి గొప్ప ప్రశాంతతనిస్తాయి.

"మీరెక్కడికి వెళ్తున్నారు?" నేను చేసిన చిన్నపాటి సహకారానికి నా మీద సదాభిప్రాయమేర్పడి మాటలు కలుపుదామని ఆయన చేస్తున్న ప్రయత్నమని నాకనిపించింది.

"గుంటూరండీ" బదులిచ్చాను.

"ఆహా! నేనూ గుంటూరే! పెళ్ళికెళుతున్నాము. పెళ్ళి ఇవాళ రాత్రికే.. అందుకే ఆదరబాదరగా బయల్దేరాం" అన్నాడు. మీరే పనిమీద వెళుతున్నారో చెప్పలేదన్నట్టు.

"మా తమ్ముడి కూతురు పెద్దమనిషయ్యింది..‘వచ్చి నాలుగక్షింతలెయ్యరా’ అంటే వెళుతున్నాను. ఇవాళ సాయంత్రమే ఫంక్షన్" అన్నాను.

"అలాగా.. రిటైరయ్యారా.. ఏం చేసేవారు?"

"నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. మాదాంట్లో రిటైర్మెంట్ పెద్ద కంపల్సరీ కాదు. అందుకే అరవై రెండేళ్ళొచ్చినా ఇంకా ఉద్యోగిగా కొనసాగుతున్నా"

"మీరు.."

"గవర్న్ మెంట్ స్కూల్లో ప్రిన్స్‌పల్‌గా పనిచేసి రెండేళ్ళక్రితం రిటైరయ్యాను."

"బావుందండీ.. అదృష్టవంతులు.. రిటైరయి హాయిగా పెన్షన్ తో కాలం గడిపేస్తున్నారు" అన్నాను.

"మీరన్నది నిజమే!.. కానీ ప్రతి మనిషికీ ఒక సమస్య వుంటుంది. ఒక విషయంలో కాకపోతే మరో విషయంలో.." అన్నాడు కాస్త నిరాశని మాటలకి పులిమి.

"అన్నట్టు నా పేరు రాజారావు.. మరి మీ పేరు" అన్నాను వాతావరణాన్ని తేలికచేయడానికి మాట మార్చుతూ.

"జనార్ధన్.."

అంతలో డ్రైవర్ బస్ ఎక్కి స్టార్ట్ చేశాడు. కండక్టర్ బస్సెక్కి లోపలికొచ్చి అందర్నీ ఒకసారి పరికించి బస్ నిండడంతో "రైట్" అన్నాడు.

బస్సు రొద చేస్తూ కదిలింది. బస్ స్టాండ్ నుండి బస్ ని కొద్ది దూరం తీసుకొచ్చి నిలిపాడు డ్రైవర్. కండక్టర్ టికెట్లు చెక్ చేస్తున్నాడు.

"మీకెంత మంది పిల్లలు?" మళ్ళీ జనార్ధన్ గారు మాటలు ప్రారంభించారు.

"ఒక్కడే కొడుకు హైటెక్ సిటీలో రెండేళ్ళ నుండి పనిచేస్తున్నాడు. మా ఆవిడా వాడూ మన వెనకాల రెండు సీట్ల అవతల కూర్చున్నారు.. మీకెంతమంది పిల్లలు?"

"నాకు ఒక కొడుకు కూతురు. మావాడు కూడా ఉద్యోగస్థుడై దూరతీరాల్లో సెటిలైపోయాడు. అప్పుడప్పుడు సెల్ లో వినిపిస్తాడు. కనిపించడు. నేను కన్నుమూసేలోగా అమ్మాయి పెళ్ళి చేయాలి అదే నాకున్న ఒకాగానొక్క కోరిక.. బెంగ. మా ఆవిడా అమ్మాయీ అదిగో ఆ పక్కగా కూర్చున్నారు" అన్నాడు.

అంతలో మా అబ్బాయి మా ఆవిడ ఫ్లాస్కులోంచి పోసిచ్చిన కాఫీ గ్లాసు పట్టుకునొచ్చి నాకిచ్చాడు. "వీడే మా అబ్బాయి" అని క్లుప్త పరిచయం చేసి "అంకుల్ కి కూడా మరో గ్లాసులో పోసిమ్మని అమ్మకి చెప్పు" అన్నాను బావుండదని.

"అబ్బెబ్బే వద్దండీ.. నేను కాఫీ తాగకూడదు. హోమియో మందు వేసుకుంటున్నాను." అన్నాడు కంగారుగా.

నేను నవ్వి "సరేలేండి. నాకు కాఫీ అంటే ప్రాణం. మా ఆవిడ ఎక్కడైనా దానికి లోటులేకుండా చేస్తుంది." అన్నాను.

"మళ్ళీ అనక తప్పడంలేదు.. మీరు అదృష్టవంతులు" అన్నాడు.

బస్సు బయల్దేరింది.

ఆయన భార్య మధ్యలో ఒకసారి వచ్చి ఆయనకేవో ట్యాబ్లెట్లు, మంచి నీళ్ళు ఇచ్చి వెళ్ళింది.

నా వంక చూసి "నాకు బీపి సుగరు.. మందులు తప్పవు" అన్నాడు విచార వదనంతో.

"కనిపెట్టుకుని వుండే భార్య వుంది మీరూ అదృష్టవంతులే!" అన్నాను చిలిపిగా.

***

బస్సు ఒక హోటల్ ముందు ఆగింది.

కండక్టర్ పెద్ద గొంతుతో "లంచ్ చెయ్యవలసిన వాళ్ళు చేసేయండి. ఒక అరగంట తర్వాత బస్సు బయల్దేరుతుంది." అన్నాడు.

మాకు బయట తినడం ఇష్టముండదు. ప్రయాణాల్లో మాఆవిడ భోజనానికి కావల్సినవి చక్కగా సిద్ధం చేస్తుంది. కాస్త ఏ చెట్టుక్రిందో నీడపట్టున తిందామని మేమూదిగాం.

మా విషయం తెలిసి జనార్ధన్ గారి ఫ్యామ్లీ హోటల్ కి వెళ్ళారు. మేము కొద్ది దూరంలో వున్న పెద్ద చెట్టు నీడలో కూర్చుని తినడం మొదలెట్టాము.

వాళ్ళు పదిహేను నిమిషాల్లో లంచ్ చేసి మా దగ్గరకొచ్చి కూర్చున్నారు. వాళ్ళ అమ్మయి అందగత్తె క్రిందే లెక్క. కలుపుగోలుతనమూ వుంది. మా ఆవిడ్ని కూడా భోజనానికి కూర్చోమని తను వడ్డించడం మొదలెట్టింది. మాటల మధ్యలో వాళ్ళమ్మాయి చక్కగా చదువుకుందనీ ఒక పైవేటు సంస్థలో ఉద్యోగంచేస్తోందని చెప్పాడాయన. మాటల్లో మేము మరి కాస్త దగ్గరయ్యాము.

బస్సెక్కి కూర్చున్నాము. కొంతమంది అప్పటికే వచ్చి కూర్చునివున్నారు.

"అన్నట్టు మీకు అమ్మాయి పెళ్ళి ఒక్కటే బెంగ అన్నారు కదా! మరి సంబంధాలు చూశారా?" అడిగాను ఏదో మాట్లాడాలని.

ఆయన ముఖంలో మళ్ళీ విచారం అలుముకుంది.

‘అయ్యో అనవసరంగా కదిపాను ఈయణ్ణి’ అనుకున్నాను.

"ఆఁ..చాలా..కానీ అదేం దురదృష్టమో ఒక్కటీ సెటిలవలేదు. నేను కట్నమెక్కువగా ఇచ్చుకోలేను కానీ అదేమీ అడ్దంకిగా అనిపించడంలేదు. అమ్మాయికి కుజ దోషాల్లాంటివి కూడా లేవు. మొన్నోసారి శ్రీ కాళహస్తి వెళ్ళి రాహుపూజ కూడా జరిపించాం. ఏ దేవుడన్నా కరుణించి నేను చనిపోయేలోపు దాని నెత్తిమీద ఇన్ని అక్షింతలు వేసేలా దీవిస్తాడని ఎదురుచూస్తున్నాను." అన్నాడాయన.

కొద్ది సేపు నిశ్శబ్దం మా మధ్య చోటుచేసుకుంది.

నేను మా అబ్బాయిని పిలిచి ఆయన పక్కన కూర్చోబెట్టి.. కొద్ది సేపు మా ఆవిడతో మాట్లడడానికి వెళ్ళాను.

అరగంట తర్వాత మళ్ళీ నా సీటు దగ్గరకి వచ్చాను. మా అబ్బాయీ ఆయనా చక్కగా మాట్లాడుకుంటున్నారు. నన్ను చూసి మావాడు లేచి సీటిచ్చాడు.

నేను కూర్చుని మా గురించి కొంత చెప్పి ఆయన కుటుంబం గురించి అన్నీ తెలుసుకుని ఆయన్ని అంచనా వేసే ప్రయత్నం చేశాను. నాకు మనస్థత్వ శాస్త్రం పట్ల వున్న అభిరుచితో కొంతకాలం నేర్చుకున్నాను. మనిషి పెద్దగా ఆశలు లేనివాడు. కొడుకు దూరంగా వుండి తమని పట్టించుకోక పోయినా అతనన్నా హాయిగా వుంటే చాలన్న మంచితనం వున్న బోళామనిషి. పెళ్ళామంటే గౌరవం.. అభిమానం.. ప్రేమ. వాళ్ళందరి మనస్థత్వాలు నచ్చాయి.

కొద్దిసేపటి తర్వాత నేను వెనక్కి చూశాను. మా ఆవిడ నవ్వుతూ తలూపింది. మా అబ్బాయివంక చూశాను. వాడి ముఖంలో కొత్త కాంతి.

బస్సు ఆగింది. కండక్టర్ "ఇక్కడ టీ బాగుంటుంది. తాగేవాళ్ళు తాగండి. పక్కనే టాయిలెట్లు వున్నాయి. ఫ్రెష్ అవ్వండి. మూడు గంటల్లో మనం గుంటూర్లో వుంటాం. ఇంకెక్కడా బస్సు ఆగదు" అన్నాడు.

మేము బస్ దిగాము.

"చూడండి జనార్ధన్ గారూ, నేనూ మధ్యతరగతి వాడినే! మా అబ్బాయికి సంబంధాలు చూద్దామనుకుంటున్నాము. కానీ అదృష్టవశాత్తు ఈ బస్ లోనే పెళ్ళి చూపుల్లాంటివి జరిగిపోయాయి. మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది. మమ్మల్ని మా పెద్దతనాన ఆప్యాయంగా చూసుకునే అమ్మాయి కోడలిగా మాకు కావాలి. మీరు కూడా మాట్లాడుకుని ‘ఊ’ అంటే తర్వాతి కార్యక్రమాలు చూసుకుందాం" అన్నాను.

ఆయన కళ్ళలో ఆనందబాష్పాలు. సంతోషంతో నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఉద్వేగంతో ఊపేశాడు.

వెళ్ళి వాళ్ళావిడకీ, పిల్లకి విషయం చెప్పాడు. ఆవిడ మా ఇద్దరి దగ్గరకీ వచ్చి "అన్నయ్య గారూ ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో.. మాకూ మా అమ్మాయికీ ఇంతటి అదృష్టం కలిగింది." అంది.

"అదిగో అక్కడ ఒక పక్కగా బండి మీదా పూలు పళ్ళూ వున్నాయి. పదండి కొనుక్కుని మార్చుకుందాం" అన్నాను నవ్వుతూ.

పూలు పళ్ళూ ఇచ్చి పుచ్చుకున్నాం.

"మళ్ళీ హైద్రాబాదు వెళ్ళాక దగ్గర్లో మంచి ముహూర్తం చూసి వీళ్ళిద్దరినీ ఒక్కటి చేద్దాం." అన్నాను.

నాకెందుకో చాలా సంతోషంగా వుంది. మొదట్నించి నావి అభ్యుదయభావాలే! ‘నేనూ.. నా..’ అంటూ సంకుచితత్వంగా గిరిగీసుకుని వుండడం నాకు ఇష్టముండదు. సమాజంలో మనం బ్రతకడానికి ఎంతోమంది ఎన్నోరకాలుగా సహాయం చేస్తారు (కాసేపు డబ్బు విషయాన్ని పక్కనబెడితే). మళ్ళీ ఎవరికి వారు తమదైన లోకంలోకి ముడుచుకుపోతారు. ఎందుకో అర్ధం కాదు. ఈ భూమ్మీదకి నాలుగురోజుల కోసం వచ్చాం.. ఆహ్లాదంగా గడిపి వెళ్ళిపోవాలి. అంతే! నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మా రెండు కుటుంబాల వాళ్ళం సంతోషించాం. అది చాలదా.. మానసిక తృప్తికి.

అందరి మనసులు తేలికయ్యాయి.

బస్ ఎక్కాము. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోబోతుంటే.. నేను "ఆగండి, నేనూ, బావగారూ ఇక్కడ, మా ఆవిడా, చెల్లెమ్మా అక్కడ, ఇహ మీ కుర్రజంట ఆ సీట్లో కూర్చుని గుంటూరు చేరేవరకూ హాయిగా ప్రేమ కబుర్లు చెప్పుకోండి.. ఒకరిగురించి ఒకరు పూర్తిగా తెలుసుకోండి." అన్నాను.

బస్సు బయల్దేరింది. ఇప్పుడు దాని రొద బాజాభజంత్రీల్లా అనిపించసాగింది.

***

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు