మానవతావాదం మరీ ఇంత ప్రమాదమా... - మీనాక్షి చెరుకువాడ

manavatavadam maree inta pramadama

"మిస్టర్ పార్వతీశం..." అంటూ బిల బిలా ఇంట్లోకి గబ గబా వచ్చేసిన ఆ పదిమందినీ కాశ్మీర్ సరిహద్దుల్లోకి చొరబడిన పాకిస్తానీ మిలిటెంట్ లని చూసినట్లు గాభరాగా చూసాడు పార్వతీశం. అందులో ఒకటో, రెండో ముఖాలు కాస్త పరిచయం వున్నట్లు తోచినా మిగతా అన్ని ముఖాలు... ప్చ్... ఎబ్బే... ఎంత ఆ... లో... చించినా, పరిచయం మాట దేముడెరుగు కనీసం ఎప్పుడూ చూసిన పాపాన కూడా పోలేదు... పాపం...

"రండి రండి... ఏమిటీ గణేష్ చందాలా... వాణీ... ఆ పర్స్ ఇలా పట్రా..." ఇటు వచ్చిన వాళ్ళని ఆహ్వానిస్తూ అటు భార్య వాణిని కేకేసాడు....

"ఏమిటీ, మేం మీ కళ్ళకి చందాల వాళ్ళలా కనిపిస్తున్నామా, ఎంత మీరు బేంక్ మేనేజర్ అయినా మరీ అంత ఎడిసిపాటు పనికిరాదు..." వురిమాడో పెద్దమనిషి.

"అయ్యయ్యో... నా వుద్దేశ్యం..." కంగారుపడ్డాడు... పార్వతీశం.

"ఏమిటి మరి మీ వుద్దేశ్యం, చేసేదంతా చేసేసి ఎలా మాటాడుతున్నాడో చూడు, నంగనాచిలా..." గుడ్లురిమేడో పెద్దాయన.

"అయ్యా... అసలు మీరెవరో... ఎందుకిలా వురమని పిడుగులా నా మీద విరుచుకు పడుతున్నారో... నాకేం అర్ధం కావటంలా... దయచేసి మీరు కాస్త శాంతించి... నా మీద ఎందుకిలా విరుచుకు పడుతున్నారో... నే చేసిన తప్పేంటో... కాస్త వివరంగా చెబుతారా..." అయోమయంగా అడిగాడు.

"ఇంకా ఈ పెద్దమనిషితో మాట్లేమిటండీ... ఇదిగో చూడండీ... మీకు ఒక వారం టైం ఇస్తున్నాం... మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేసెయ్యాలి... లేకపోతే... మీ మీద లీగల్ గా ఏక్షన్ తీసుకోవాల్సి వుంటుంది..." వచ్చిన వాళ్ళలో ఒకాయన లాయర్ కాబోలు... చుర చుర చూస్తూ చెప్పాడు....

"ఏమిటీ ఇల్లు ఖాళీ చెయ్యాలా... ఎందుకు?" అదిరిపడి అడిగాడు.

"ఎందుకంటే మీ వలన మా అందరికీ ప్రశాంతత లోపించింది కనక, మా ఆడాళ్ళూ అష్ట కష్టాలు పడుతున్నారు కనుక..." ఆవేశంగా ఆరోపించాడు పక్కింటి పట్టాభి.

"అదేమిటండి... అసలు మీరంతా ఎవరో కూడా... నాకు తెలియదు... నా మానాన్న నేను పొద్దున్న పోతే రాత్రి ఎప్పుడో వస్తాను... నా వలన మీ ప్రశాంతత లోపించడం ఏమిటీ?... ఇంకా ఏమన్నారూ... నా వలన మీ ఆడాళ్ళు... అష్ట... కష్టాలు... రామ... రామ... ఎంతెంత అభాండాలు..."

వింటున్న వాణికి వళ్ళు మండి పోయింది..."

"ఏమిటండీ... వాళ్ళతో మాటలూ... ఇంటిమీద కొచ్చి గొడవచేస్తున్న వాళ్ళతో..." విసురుగా అంది.

"నువ్వుండు... వాణీ... అసలు వాళ్ళ సమస్య ఏమిటో... తెలిస్తే కదా... సార్... చూస్తే మీరంతా పెద్దమనుషుల్లా వున్నారు... అసలు సమస్య ఏమిటో చెబితే గదా విషయం తెలిసేది... మా తప్పేమిటో తెలిసి... సరిదిద్దుకో గలిగేదీ... దయచేసి ఎవరో ఒకరు విషయం కాస్త అర్ధం అయ్యేలా చెప్పండి..." మృదువుగా అడిగాడు.

"హూ... విషయం ఏమీ చిన్నా చితకదీ కాదు... పోనీ... అని సరిపెట్టుకోడానికి... మీ వలన... మా ఇళ్ళల్లో... పనిమనుషులెవ్వరూ పనిసరిగా... చెయ్యడం లేదు... అన్నింటికీ రూల్స్... మాట్లాడుతున్నారు..., ఈ నెలలో మా పనిమనిషి పది నాగాలు పెట్టింది అదేమిటీ... అంటే..., "నాకు వంట్లో బాగానేక సెలవెడితే... ఏటంటారు... ఏం... మేం మాత్రం మనుషులు కామా... మాకు రోగాలు రావా...." అంది... వుడికిపోతూ అన్నాడు ఓ వెంకట్రావు.

"అదేనండీ... ఈ పనిమనుషుల్లందరికీ... ఒక్కసారే... రోగాలెందుకొచ్చాయో... తెలుసా... ఇదిగో... వీళ్ళింట్లో పనిచేసే రాములమ్మకి మొన్న నీమధ్య కొంచెం జ్వరం వస్తే... అయ్యో జ్వరంలో కూడా వచ్చి పనేం చేస్తావ్... ఇంద... ఈ ఐదు వందలూ తీసుకో... డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకు మందులు వాడు... మా అవస్థ ఏదో మేం పడతాం.

నాలుగు రోజులు విశ్రాంతి తీసుకో... జ్వరం తగ్గేకా రా... అని... ఈయన గారు... వుదారంగా డబ్బిచ్చి మరీ పంపేడట.... అక్కడకీ.... వాళ్ళావిడ అలా వాళ్ళని నెత్తికెక్కించుకోకండీ... అని మొత్తుకుంటే... పాపం... మరీ అంత దారుణంగా వుండకు... ఏం... వాళ్ళు మాత్రం మనుషులు కాదా... మనం చేసేది పెద్ద కూలీ... వాళ్ళూ చేసేది... చిన్న కూలీ... అంటూ... దాని ఎదుటే...

"అదీ... సంగతి... అందుకే ఆ రాములమ్మ... ఈ పనిమనుషుల్లందరినీ పోగేసి... మనకీ నెలలో కనీసం నాలుగు రోజుల సెలవు కావాలి... ఏం వాళ్ళకేనా ఆదారాలు... పండగ సెలవలూ, అలాగే మా అమ్మగోరూ, అయ్యగోరూ ఏడాది కోపాలి... ఒక నెల జీతం బోనస్ ఇత్తారు... అట్టానే... ఆరు ఏ వూరైనా ఎడితే... నన్నూ తీసికెల్తారు... అందుకే... ఆరు ఎన్ని ఇళ్ళు మారినా... నాను ఆరింట్లో పని మానేను... కాస్త దూరం ఐనా, మళ్ళీ ఈ పని సులువు కోసం... బట్టలుతికే మిషనూ... బూజులు దులిపే మిషస్నూ... అన్నీ ఇచ్చి... ఆటితో ఎట్టా సెయ్యాలో... ఆ యమ్మ నాకు నేర్పింది... మీరు వూరికే కట్టపడిపోక... మీ ఇల్లలో ఆయన్ని ఇస్తేనేపని సేత్తాం... నేకుంటే నేదు అని సెప్పండెహే..." అని వీళ్ళకి... బాగా ఎక్కించడం... అది తలకెక్కి... వీళ్ళు... మా ఇళ్ళలో... అవన్నీ డిమేండ్ చెయ్యడం... ఏమిటిదంతా... అని కారణం వెదికితే... ఇదుగో... ఇదీ విషయం... వీళ్ళేమో... దయా జాలి కలవాళ్ళు... మనమేమో... వాళ్ళ రక్తమాంసాలు పిండేసి... రాక్షసులం..." కోపంగా హుంకరించాడో... పరమేశం...

"అయ్యయ్యో... మేం అలా ఎందుకు చేస్తామండీ... పాపం... మా రాములమ్మకేదో... వంట్లో బాగాలేదంటే..."

"అదే... మీరేమో... అయ్యో... పాపం... అనుకుని... మీ రాములమ్మని అపురూపంగా చూసుకుంటున్నారు... అదేమో విషయం బాగా అర్ధం చేసుకునీ... వీళ్ళందరికీ బాగా నేరిపి పెడుతోంది... ఇంకో విషయం తెలుసా... మీరంటే రెండు చేతులా సంపాదిస్తున్నారు కనుక పని మనిషికి వేలల్లో జీతాలిస్తున్నారు... అది చూసి మిగతావాళ్ళంతా... అందరినీ అలాగే ఇవ్వాలని డిమేండు చేస్తున్నారు... ఇదంతా మీరు తెలిసే చేస్తున్నారో... తెలియకే చేస్తున్నారో కానీ... ఇక్కడ మధ్యలో మాకు... మాకండీ... దాని ఎఫ్ఫెక్ట్..." ఆవేశపడిపోయాడో... ఆనందరావ్.

"ఏదో... పాపం వాళ్ళ కష్టం... మనకెందుకనీ..." నీళ్ళు నమిలేడు పార్వతీశం.

అప్పటికి వాణికి విషయమంతా అర్ధమయ్యింది... "ఇదిగో చూడండి... మేం మా పనిమనిషి వరకే ఆలోచించాం కానీ... ఇది వెళ్ళి. మేం మంచి అనుకుని చేసిన పని ఇలా అందరికీ ఎక్కించి అది లీడర్ అయి..., ఇంత రాజకీయం చేస్తుందనుకోలేదు. సరే... మాకెటూ బదిలీ అయిపోయింది... మేం వేరే ఊరెళ్ళిపోతున్నాం... ఒక రకంగా మీరు ఇలా వచ్చి మాకు ఓ విషయం తెలిసేలా చేసారు., మనం మంచి అనుకునీ పాపం, అనుకునీ... చేసే కొన్ని పనులు... వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతాయనీ... అలాగే... ఎవరిని ఎక్కడ వుంచాలో అక్కడే ఉంచాలి కానీ... నెత్తికెక్కించుకుంటే... మొదటికే మోసం అనీ, మేం... ఈ నెలాఖరిలోగా వెళ్ళిపోతున్నాం... తెలియక చేసినా... మీకు ఇబ్బంది కలిగించి నందుకు మమ్మల్ని క్షమించండి... వెళ్ళి రండి..." అంటూ చేతులు జోడించింది.

"సర్లేండి... మేం కూడా వాళ్ళమీద కోపం మీ మీద చూపడం తప్పే... వాళ్ళని ఏం చెయ్యలేక... ఇలా మీ ఇంటిమీదకి వచ్చేం, మమ్మల్ని క్షమించండి... పదండర్రా." అంటూ వాళ్ళు వెళ్ళాకా.

"ఏం సారూ.. ఇప్పటికయినా అర్ధం అయ్యిందా... మనం మంచి అనుకున్నది... వాళ్ళకి ఆయుధం అయ్యిందని..."

"ఏమిటో... మానవతావాదం... మరీ ఇంత ప్రమాదమా..." తల పట్టుకున్నాడు పూర్ పార్వతీశం.

***

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ