సంక్రాంతి కానుక - కొనకళ్ళ వెంకటరత్నం

sankranti kanuka

ల్లంత దూరంలో కందిచేల గుబుర్లలోనుంచి హరిదాసు చిరతలు మోగినయ్యో లేదో, వీడి వీడని పొగమంచులోని వాకిట్లో గర్రబ్బండి ఘల్లుమని ఆగింది. బండి చక్రం అప్పుడే అమర్చిన తల్లి గొబ్బెమ్మమీద నించి పోనిచ్చినందుకు జట్కావాలా మీద చెల్లాయి కళ్ళెరజేసేలోగా అక్కాయి బండిలోనించి దిగింది. చెల్లాయి ముఖం వికసించింది. కళ్ళల్లో నుంచి మంకెనలు దిగజారి మల్లెపువ్వులు మాలలు గట్టాయి, "అమ్మా, అమ్మా అక్కాయోచ్చిందేవ్!" అంటూ ఇంట్లోకి పరుగెట్టింది.

ఇంట్లో చల్ల గిలగొడుతున్న రామాయమ్మ బైటకొచ్చింది. ముందు పెద్దమ్మాయీ, వెనకాల సూట్ కేసూ రావడం గమనించింది. కాని ఆమె చూపు వెనకాతల బండిలో నుంచీ ఎవరైనా దిగబోతున్నారా అన్న దిలాసాలోనే నిలిచి పోయింది. మరెవ్వరూ దిగలేదు. ఉదయించీ ఉదయించగానే మబ్బుల్లో చిక్కుకున్న చంద్రబింబ మయింది రామాయమ్మ మొహం.

"ఆయన రాలేదా అమ్మా!" అని తల నిమిరింది తల్లి.

"లే" దని తలూపింది సుశీల.

"మామూలేగా!" అని చప్పరించింది తల్లి.

"ఆయన కదో సరదా" వంటింట్లోకి దారితీస్తూ వ్యాఖ్యానిస్తోంది రామాయమ్మ.

"అందరి అల్లుళ్ళతో పాటు వస్తే ఆయన గొప్పేమున్నదిహ" అని కిలకిల నవ్వింది సుశీల.

"మరీ రేపు పండగనగా నిక్కచ్చిగా బయలుదేరి రావాలటే సుశీ! నేను చూస్తే ఒంటరిదానినాయెను..."

"అది కాదమ్మా! ఆయన బొంబాయి నుంచి వస్తారేమో, ఇద్దరమూ కలిసి వద్దామని యిన్నాళ్ళూ రేపూ, మాపూ అని ఎదురు చూచి చూచి ఇలా లాభంలేదని బయలుదేరాను చెప్పొద్దూ."

"ప్రతియేటా ఆయన కున్నదేగా అలవాటు - ఇక వస్తాయిగా ఉత్తరాలు. "నేను వస్తే చిన్న రవ్వల ఉంగరం, లేకపోతే, నన్నూ భాయ్ జ్యూయలరీ నించీ కొత్తరకం నెక్లెస్" అని ఊరిస్తో.

చెల్లాయి కలకండ అక్కాయి నింకా పలకరించనే లేదు. చాలా అర్జంటు పనిలో మునిగిపోయింది. అప్పుడే యిరుగు పొరుగిళ్ళలో జోరబడి "మా అక్కాయొచ్చంది. మా అక్కాయి!" అని దండోరావేసి అలిసిపోయి పులుసుకూరై పలకరించే దమ్మయినా లేక అక్కాయి చెయ్యి పట్టుకుని చక్కా ఊరుకుంది. ఆ పిల్లకు యింట్లోకి వచ్చిపడిన ఆనందాన్ని గబగబా నలుగురికీ పంచేస్తేనేగాని తీరదు.

పుట్టింటి కొచ్చిన సువర్ణా, చంద్రకళా చదువుతున్న పత్రికలూ, అల్లుతున్న లేసులూ వదిలేసి ఒక్కబిగిన వచ్చిపడ్డారు.

రామాయమ్మ ఇంకా కుశల ప్రశ్నలే ముగించలేదు. ఆడబిడ్డ ధిమాకీలూ, అత్తగారి ఆరళ్ళూ ఇంకా ప్రసంగంలోకి రానేలేదు. గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేసి తేల్చుకోవాల్సిన ఘటా లింకా మిగిలే వున్నాయి. అప్పుడే తుపాను వచ్చిపడింది. ఇంట్లోకి.

మోహ మెట్లా వెలవెల బోతోం దేమిటేవ్? నీళ్లోసుకుని ఎన్నాళ్ళయిందీ? అని ఉపక్రమించింది చంద్రకళ.

"నీళ్ళు రోజూ పోసుకుంటూనే వున్నాగా 'వేడి' వేడివీ!" అని పక్కున నవ్వింది సుశీల.

"ఆ నీళ్ళు కాదో!" అని బుగ్గమీద పొడిచింది సువర్ణ.

ఇక లాభం లేదని పొయ్యి దగ్గర సతమతమవుతోంది రామాయమ్మ.

సుశీల పోపుల పెట్టె దగ్గరకు వెళ్ళుతుంటే సువర్ణ దిగింది. ఆపైన యింకా కొన్ని సీతాకోక చిలుకలు వాలినై. ఆ పూల రధమంతా కదిలింది ఈ వీధి నుంచి - ఈ వీధికీ. ఈ ఇంటినుంచి ఆ యింటికీ. పెరళ్ళలో నుంచీ "ఎప్పుడేవ్" "మీ ఆయ్య నొచ్చాడా?" "మళ్లీ చంకన బరువు లేకుండానే వచ్చావూ?" అని పలకరింపులూ, ప్రశ్నల పరంపరలూ దొర్లి పోతున్నాయి.

సువర్ణ యింటి దగ్గర ఆగింది రధం. ఆవిడ పెనిమిటి వచ్చి పది రోజులయింది. ఈ గలభా చూసి ఆయన పుస్తకం మూసి ఇంట్లోనుంచీ బయటపడ్డాడు. "మీ వారా?" అంది సుశీల ఆగి.

"గుర్తు లేదా యేమే?" అన్నది సువర్ణ; అని వూరుకోక -

"చంద్రకళ మొగుడొచ్చి 15 రోజులయింది. అని కంగించింది. అందులో "రానిది నీ మొగుడే!" అని ధ్వనించింది సుశీలకు.

"ఇదుగో! ఈ గాజుల జత తీసుకొచ్చారు మా వారు" అని చూపింది సువర్ణ. అంతా పరిశీలన చేశారు. రాళ్ళ తూకమూ. పనివాడి తనమూ ఏదో సంసారపక్షంగా వున్నాయి. సువర్ణ మొగుడు స్కూలు మేష్టారు.

"ధర ఎంతో?" అని ప్రశ్నించింది సుశీల తల వోరగా వంచి.

"అదిగో - దానికి ధర మీదనే దృష్టి!" అని అంటించింది చంద్రకళ. "ఏమో నాకు తెలియదు" అని తుంచేసింది సువర్ణ.

"అంటే ధర స్వల్పమన్నమాట ఎక్కువలో దయితే ఫెడీమని చెప్పవూ?" అంది చంద్రకళ. "చవకబారుదే అనుకో పోనీ." ఇక్కడి వాతావరణం తన కెదురెత్తుగా నడుస్తోందని స్ఫూరించింది సుశీలకు. "నే నేమన్నానే చందూ! వూరికే అడిగితేనూ." అని గద్దించింది.

"అవును వూరికేనే అడిగావులే పాపం - నంగనాచి తుంగబుర్ర. దాని మొగుడింకా నయం ఏదో చిన్న ప్రెజెంటు తీసుకొచ్చాడు. మా ఆయన తెచ్చేవి బంగారం. కాదు. బండెడు పుస్తకాలూ, వంద చామంతి పువ్వులూ. నీ సాటి ఎట్లా వస్తుందే మాకూ?" అని సుశీలవేపు హేళనగా తడుతూ, "మొగుడు రాకపోయినా మోజైన రాజా ప్రెజెంట్ కొడతావు నువ్వు!" అని కుండ బద్దలు కొట్టింది చంద్రకళ. చురుక్కుమన్నది సుశీలకు.

ఎండెక్కింది. ఈ పటాలమంతా ఎక్కడి మార్చింగ్ లో వున్నదో అంతు దొరకలేదు రామాయమ్మకు. దొడ్లూ దోవలూ అన్నీ గాలించింది కలకండ. కొసకు ఆంజనేయస్వామి కోవెలలో కోనేటి గట్టుమీద వూక బంతిపువ్వులు వూరికే దూసేస్తూ దొరికారు ముగ్గురూ మూడు చురకత్తులల్లే. చెల్లాయి అక్కాయిని పట్టుకుని "అమ్మ రమ్మనమంది" అని లాక్కెళ్ళింది.

రామాయమ్మ మినప్పప్పు నానబోసింది. రుబ్బురోలు కడుగుతూ చిన్న నవ్వు నవ్వి "నీ పుణ్యం పుచ్చిందే సుశీ!" అన్నది సాభిప్రాయంగా. "అప్పుడే చెప్ప నన్నావు గదుటే అమ్మా!" అని గునిసింది కలకండ. "క్యాబేజీ నేను తరుగుతూ యిటు తేవే" అని చెల్లాయి చేతిలోనించీ లాక్కుని కత్తిపీట ముందువేసుకుంది సుశీల. అపురూపమైన వార్త ఏదో తనకు చెప్పకుండా కవ్విస్తున్నారని గ్రహించింది సుశీల. దానికల్లా ఒకటే మందు, ఆమెకు తెలీదాయేం. "తనకేమీ తెలుసుకోవాలనే ఆత్రమేలేనట్టు నటించాలంతే" సరే - అదేమిటో ఇద్దరూ ఉమ్మడిగా దాచుకోండి" నిర్లక్ష్యంగా జీడిపప్పు ఒలుస్తోంది క్షీరాన్నంలోకి. తల్లీ, చెల్లాయి ఢిల్లీ భోగాలలో మట్టిబెడ్డ లేరుతూ ముసిముసిగా నవ్వుకొంటున్నారు. సుశీల "ఏమిటేమిట"ని అడావుడి చెయ్యలేదు సరికదా, అసలు ఆమెలో చలనమే లేకపోయే.

ఇక లాభం లేదనుకుని "మీ ఆయన రే పొస్తున్నారేవ్" అని బైట పెట్టింది రామాయమ్మ.

"అదిగో చెప్పేసింది" అని కలకండ తల్లిని గుంజి గుంజి వదిలి పెట్టింది.

సుశీల పొంగిపోయింది లోలోపల. కాని అంతలో అణుచుకొని ఏమీ పట్టించుకోనట్టు, "కిస్ మిస్ పళ్ళెక్కడున్నాయే అమ్మా!" అని అలమార దగ్గరకు వెళ్ళింది చూపించేందుకు కలకండ కూడా వచ్చింది. ఎదురుగా ఆగుపిస్తున్న సీసాకోసం తెగవెతుకుతూ "వుత్తరమేదే?" అని చల్లగా అడిగింది సుశీల. "నే నివ్వను ఫో" అని విదిలంచింది కలకండ. ఉత్తరాల వూచదగ్గరకు దారితీసింది సుశీల. "అందులో యేముందీ - రేపు మెయిలు లో వస్తున్నారని వ్రాశారు ముక్తసరిగా - అంతే" అని సరిపెట్టింది కలకండ.

"అదికాదే - నీ తలకాయ - ఏమి ప్రెజెంటు తీస్తున్నారూ అని".

ఉత్తరం చదువుకున్నది సుశీల. చెల్లాయి మాట నిజమే ప్రెజెంటు సంగతి అసలు లేదు. "అంటే ఏ చిన్న రింగులోలకులో వస్తాయన్న మాట" అనుకున్నది స్వగతంగా. ఒక్క క్షణం చిన్నబుచ్చుకున్నది కానీ అంతలో ఉత్తేజం పొందింది. "పోనీలే - అమ్మ వుబలాటం తీరింది ఇన్నాళ్ళకు - ఏనాడు సంక్రాంతికి వచ్చారుగనకా!" అని నిట్టూర్చింది సుశీల - ఆయన వస్తున్నాడన్న వుబలాటంతో తనకు భాగం లేనట్టు.

"అమ్మా! విన్నావుటే, నాకటా మొగుడు రాకపోయినా పెద్ద ప్రెజెంటు మాత్రం వస్తుందిటేవ్!"

"ఎవరంటా?"

"గడుగ్గాయి చంద్రకళ - పైగానటా, ఇందాక సువర్ణ మొగుడు తెచ్చిన గాజుల జత చూపించిందిలే ఖరీదెంతే... అని యథాలాపంగా అడిగితేనూ... చవకబారువని కించపరచడానికి ఆరాతీశానని దులిపింది స్మీ నన్ను."

"దాని కెవరు మాట్లాడినా తన పేదరికాన్ని వేలుతో చూపిస్తున్నారనుకుంటుంది. అదో జబ్బు వీళ్ళకు. అయినా నువ్వు ఆ ప్రశ్న వెయ్యకూడదమ్మా!"

"అది తక్కువ ప్రెజెంటన్న స్ఫురణే లేదమ్మా నాకు ఊరికినే చటుక్కున వచ్చేసింది ఆ మాట."

"అంతే అనుకో 'సింపుల్ గా బావుంది' అనెయ్యాల్సింది, కాని పేదరికమన్నది చూశావూ... అది మహా చెడ్డది. పైవాళ్ళ కేదో వున్నదన్న ఏడుపు అట్టడుగున వుండి పనిచేస్తో వుంటుంది. మాటలలో మన మేమాత్రం సందిచ్చినా... 'వున్నదని మిడిసిపోతున్నారు మహా' అని విరుచుకుని మీద పడతారు. సరేకాని మాటలసందున క్ష్రీరాన్నంలోకి ఏలకుల పొడి మరిచి పోయానమ్మాయి చూడుచూడు" అని ఇంత చీకటిగా వున్నదేమో అని చావిడిలోకి వెళ్ళింది. బైట మబ్బులేస్తున్నాయ్. "చెల్లాయి, లైటు వెలిగించమ్మా! అని కేకేసి సుశీల కూడా బైటకు వెళ్ళి చూసింది. నల్లకారు మబ్బులు దొంతర దొంతరలుగా పిటపిటలాడుతున్నాయి. ఆకాశంమీద, పట్టపగలు లైటు వెలిగించాల్సి వచ్చింది. వర్షం జల్లుగా మొదలై జడివానగా మారింది. ధనుర్మాసంలో యీ అకాల వర్షా లేమిటా అని పెరట్లో తులసికోటలో నీళ్లుపోస్తూ రామాయమ్మ పరధ్యాన్నంగా వుంది.

"ఒసేవ్ జడ వేస్తా రావే" అని కలకండను దగ్గరకు తీసుకుంది సుశీల. "రెండు జడల వెయ్యవుటే నాకూ" అని గోముగా అంది చెల్లాయి. పాయలు తీస్తూ రహస్యంగా "ఈ సంగతి ఎవరితోనూ చెప్పకు స్మీ... అందరూనే, బావ రారని అనుకుంటున్నారు." అని నొక్కి చెప్పింది సుశీల. కలకండ కిక్కురుమనలేదు. "చెబితివా గిద్దెడు చమురొచ్చేలా మొడతా తెలిసిందా?" అని జుట్టు ఒడిసిపట్టుకుని దాని తల తన వేపుకు తిప్పుకుని కళ్ళల్లోకి చూసింది. ఆమెకు తెలుసు - అదప్పుడే టపాభుజాన వేసుకుని బట్వాడాకు సిద్ధమవుతోంది. కలకండ బుంగమూతి పెట్టి "ఓ పిసరు చెప్పేశానేవ్ అక్కా!" అన్నది వోరగా చూస్తూ. "ఓసి నీ దుంప దెగ, అప్పుడే ఎవరి చెవి కొరికావే?" అని గద్దించింది సుశీల. "మరే - మరే ఆదెమ్మ పిన్నిగారింటిదగ్గర్నుంచి 'సినీ బకెట్' పువ్వులు కోస్తుంటేనూ "మీ యింటికి పోస్టు జవానొచ్చాడు... ఎక్కణ్ణించి వచ్చిందే వుత్తరమూ?" అని అడిగింది చంద్రకళ. 'మా బావ దగ్గర్నుంచీ' అనేసి, ఉన్న పళంగా పరుగెత్తుకుని వచ్చేశా" అన్నది కలకండ. సుశీల ఆలోచించింది. రెండు జడలలోనూ రెండు పూలచెండ్లూ గుచ్చి "చంప పిన్ను లెందుకూ - డబ్బీలో పడెయ్యమ్మా!" అని కంఠస్వరం తగ్గించి. "చెల్లాయ్ ఇటు చూడమ్మా - ఈసా రడిగితేనే - ఏదో పెద్ద పేకటు! వచ్చిందని చెప్పే సెయ్ - తెలిసిందా?" అని పాఠం చెప్పింది సుశీల. "ఓ" అని తల ఊపింది కలకండ; ఊపి, "అమ్మయ్యో! ఇంకానయం బావ దగ్గర్నుంచి ఏమొచ్చిందో చెప్పలేదింకా" అని ఓ ఆపత్తు తప్పించినట్టు సీరియస్ గా మొహం పెట్టింది. జడలు "పో... పోయి స్నో పట్టుకురా" అని పంపింది.

స్నోబాటిలందిస్తూ "అక్కాయ్! నిన్ననే - రేడియోలో - చెప్పారుటేవ్. ఇవాళా - మనవేపుటా, పెద్ద గాలివాన కురుస్తుందిటేవ్" అన్నది కలకండ. సుశీల ముఖబింబంమీద చిన్న మబ్బొకటి మురిసింది. పెరట్లోకి వెళ్లి పైకి చూచింది మళ్లీ. వానజోరు తగ్గుతోందా, హెచ్చుతోందా అని అంచనాలు కడుతూ.

"మీ ఆయన వస్తూ తడవడు లేవే!" అని రామాయమ్మ కూతుర్ని లోపలికి పిలిచింది.

కాని వాన తగ్గలేదు. రాత్రంతా ధారాపాతంగా వర్షం కురిసింది. తెల్లవారింది. కాని వాన తగ్గలేదు. మధ్యాహ్నానికి చిలికి చిలికి గాలివానయింది. ఊరి చివర చెరువు గండిపడింది, పేర్చిన పనలు దెబ్బతిన్నాయ్యేమోనని ఆలస్యంగా కోసినందుకు నొచ్చుకుంటూ పాలేళ్ళు తొందరపడుతున్నారు. వాననీళ్ళు కాలువలు గట్టినై. పిల్లకాయలు కాయితం పడవలతో వాన దేవునికి వీడ్కోలిస్తున్నారు. అందరి మొహాలు వికసించినై. పండగ సరదా చెడేలా వుందని ఊహించారు అంతా. వంటకాలవ డాము దగ్గర బురదపాములమీద రాళ్ళు రువ్వుతున్నారు. ఆకతాయిలు.

పంచాయతీ బోర్డు ఆఫీసునుంచి రేడియో అరుస్తోంది. తెల్లారగట్ట ఏదో స్టేషను కవతల ఓ వంతెన కూలి మెయిలు ప్రమాదం జరిగిందనీ, అందులో సెకండ్ క్లాస్ పెట్టె ఒకటి జామ్మయిపోయిందనీ అందరికీ స్పష్టంగా వినిపించింది. వీధులలో వంగి పెద్ద పెద్ద ముగ్గులు పెడుతున్న ముత్తైదులంతా లేచి అటు తేరి చూచారు. పాచి మనిషికి ఉలవపిండి రాతిగాబులో కలపమని పురమాయిస్తూ రామాయమ్మ గతుక్కుమని ఆదరాబాదరా లోపలికి పరిగెత్తింది. సుశీల దోమతెరలో ఇటాలియన్ రగ్గు మడతలకింద చదువుకొంటోంది.

"చూడమ్మాయి! అల్లుడుగారు మెయిల్లోకదూ వస్తానని రాసాడు." అని గాబరాగా అడిగింది తల్లి. ఆవునని తేలింది. రామాయమ్మ గుండెల్లో రాయి పడింది.

"ఏమిటమ్మా ఖంగారు?" అని మంచం దిగింది సుశీల. "కొంపమునిగిందే తల్లీ! అని రేడియో వార్త వినిపించింది. సుశీల దిగాలుపడి పోయింది.

నలుగురూ చేరారు. ఊరంతా గుప్పుమంది. మెయిల్లో రావలసిన సుశీల పెనిమిటి ఇంకా రాలేదు. ఆయన సెకండుక్లాసులోనేగాని ప్రయాణం చెయ్యడు. అది లోపల పనిచేస్తూంది సుశీలకు. ఆమె మొహాన్నకత్తి వాటుకైనా నెత్తురుచుక్కలేదు. మనస్సు పరిపరివిధాల పోయింది. తలా ఒక మాటా అంటున్నారు. "కంగారు పడకమ్మా!" అని కొందరూ, "ఏమో!" అని చప్పరిస్తూ కొందరూ... కళవరపాటు తప్ప కర్తవ్యమెవ్వరికీ తోచలేదు.

"భగవంతుడు దేనికి ఏ శిక్ష వెయ్యబోతున్నాడో" అని రామాయమ్మ కుములుతోంది. సుశీల ఒంటరిగా గదిలో కూర్చొని పైటకొంగు నోట్లో కక్కుకొని కన్నీరు మున్నీరయి వాపోతోంది.

"అఘాయిత్యం కాకపోతే. ఈ అకాల వర్షా లేమిటమ్మా! అని విస్తుపోయిందొక పడుచు. "ఈ కాలం పిల్లలు మరీ విడ్డూరం లెస్తూ - ఓ తిథి చూడరు - వారం చూడరు - శకునం చూడరు; పండగనాడే దిగాలీ?" అని మూతివిరిచింది నంబినాంచారమ్మ. "ఇవేమి రైల్లోనమ్మా! ఇంత భోరున వాన కురుస్తుంటే, కాస్సేపు ఆగితే ఏమి పుట్టి మునిగిందో!" అన్నదొక శతవృద్ధు. కలకండ కంతా అయోమయంగా వుంది.

జోగన్నపంతులు వూళ్ళో మోతుబరి. సంగతి వివరంగా తెలుసు కున్నాడు. ఎవ్వరినీ గోల చెయ్యొద్దన్నాడు. "స్టేషను వూరికి నాలుగు మైళ్లే గదా ఆరాలు తీద్దాం ముందు" అనేసి, నలుగుర్నీ పురమాయించి బళ్ళు కట్టించి బయల్దేర దీశాడు. "ఇల్లు జాగ్రత్త" అని గోవిందు కప్పగించి సుశీలా, రామాయమ్మా, కలకండా బండి ఎక్కారు. ఇంకా వూళ్ళో పిన్నా పెద్దా అంతా పయనమయ్యారు.

సువర్ణా, చంద్రకళా క్రితం రోజు మధ్యాహ్నమే దగ్గర్లో వాళ్ల పినతల్లిగారింటికి వెళ్లారు. పండుగనాడు వచ్చేద్దామని.

బళ్లు వూరుదాటినై. స్టేషన్లో వాకబుచేశారు. ఏమీ తేలలేదు. సెకండు క్లాసు పెట్టె ఒకటి జామ్మయి పోయిందని తప్ప మరి తబిశీల్లు లేవు. "ఆ రైలుకు సెకండుక్లాసు పెట్టెలెన్ని వున్నాయీ" అనడిగింది రామాయమ్మ. ఒక్కటే నన్నారు. సుశీల నోట మాట లేదు. ఆయన సెకండు క్లాసులోనేగాని ప్రయాణం చెయ్యడు.

బళ్ళు తిరుగుమొహం పట్టినై. టెలిగ్రాములు వెళ్ళవు. ప్రమాదం జరిగిన చోటుకి రైళ్ళు నడవడం లేదు. వీధులలో ముగ్గులన్నీ చెరిగిపోయినై.

దగ్గర వూళ్ళో నాగన్న పంతులు తోబుట్టువుగా రింట చిన్న కారుంది. మనిషిని పంపించాడు తీసుకు రమ్మనమని. 'ఇంకో కారుకూడా దొరికితే బావుణ్ణు అనుకుని ఆ సన్నాహంలో ఉన్నాడు. "ప్రమాదం జరిగిన చోటు మహావుంటే యిరవై మైళ్లుంటేను. రెండు గంటలలో చేరుకోవచ్చును. మీరేం కంగారు పడకండి" అని ధైర్యం చెప్పాడు.

బళ్ళు దిగారు సుశీల భారంగా యింట్లోకి వెళ్ళింది. లోపల అగ్నిపర్వతం పేలడానికి సిద్ధంగా ఉంది. "మొగుడు రాకపోయినా రాజాలాంటి ప్రెజెంటు కొడతావు" అని చంద్రకళ విసిరిన మాటలు గింగురుమని మోగుతున్నాయి చెవిలో, అవమానభారంతో క్రుంగిపోయి నడుస్తోంది. రామాయమ్మ పెరట్లో గోవిందుని చివాట్లు వేస్తోంది. "తలుపులన్నీ తెరచి ఎక్కడికి పోయావురా?" అని.

సుశీల గదిలో అడుగుపెట్టింది. గప్పున ఆగిపోయింది. ఊళ్లో భోగిమంటల శోభంతా ఆమె మొహంమ్మీదనే జిగ్గుమని వెలిగిందొక్కసారి. పట్టెమంచం మీద ఠీవిగా పడుకుని ఇంగ్లీషు నవల చదువుకుంటూ నిల్చుని వింటోంది రామాయమ్మ. ఇద్దరూ నవ్వుకున్నారు. సుశీల మొగుడొచ్చాడని ఈ వీధినుంచి ఆ వీధికీ, ఈ ఇంటినించి ఆ ఇంటికీ ఆనోటా ఈనోటా సరఫరా అవుతోంది సువార్త.

పీటల కింద అమర్చాల్సిన ఆముదాల గింజలూ, తాంబూలంలోకి ఇమడ్చవలసిన పెండల పాకులూ పోగుచేస్తున్న కలకండకు వాకిట్లో బండి ఆగిన చప్పుడయింది. "అక్కాయ్, సువర్ణాక్కాయ్ వస్తోందేవ్" అని కేక వేసింది.

సువర్ణా, చంద్రకళా బండి దిగారు. పినతల్లిగారింటి దగ్గర్నించి తిరిగి వస్తున్నారు గావును అనుకుంది సుశీల. రామాయమ్మగారి ఇల్లు వూరి చివర ఉంది. బండి ఇంకా వూరి నడిబొడ్డు తొక్కలేదు. అంచేత వాళ్ళ కింకా ఊరంతా పడిన గగ్గోలు తెలియదు. బిలబిలా వచ్చారిద్దరూనూ. బండి తిరగగానే ఇద్దరూ ఇంట్లో జొరబడి "నీ ప్రెజెంటు చూపించు పోతాం" అని సుశీల మీద దండయాత్ర సాగించారు. వరండాలో సిరిచాప వేసింది సుశీల.

"ప్రెజెంటేమిటీ మీ తలకాయ"

"ఓసి నీ రహస్యం దొంగలు దోలా, చూపుతావా చూపవా?" అని దిమాకీ చేసింది సువర్ణ.

"పెద్ద పేకట్టు వచ్చిందని చెప్పిందిలే కలకండ - అట్టే తెగనీలగకు" అని చెవిలో వూదింది చంద్రకళ.

"నేను చూపను - ఈయేడు నాకు వచ్చిన ప్రెజెంటు అపురూపమయింది - తెలుసా?" అని ఊరించింది సుశీల.

"ఓసి నీ సిగ్గు చిమడా ప్రతి యేటా 'ఇదిగో' 'యిదిగో' అని చొంగలు కారుస్తూ చూసేదానవు ఇవాళ యే మొచ్చింది?" అని ఆరా కోసం సువర్ణవంక చూసింది చంద్రకళ.

"చూస్తే మీ కళ్ళు జిగ్గుమంటాయి."

"కళ్ళు మూసుకుని చూస్తాలే అయితే" పకపక నవ్వుకున్నాడు.

కలకండకు వుండబట్టడం లేదు. సుశీల కళ్ళతో గదమాయించింది.

చూశావుటే సువర్ణా - మనమంటే దద్దమ్మలం! - అడక్కుండానే 'ఇదిగో' నని తెల్ల మొహాలల్లే వూరుతో తీసుకొచ్చి చూపుతాం. అది చూడు ఎంత దాచుకుంటోందో."

"అబ్బబ్బ... అస్తారు పదంగా దాచుకుందామంటే సాగనీరుకదా" అని సుశీల గదిలోకి వెళ్ళింది. పేపర్లో మునిగిపోయి వున్నాడాయన. "ఏమండి" అని పలకరించింది సుశీల. "ఒక్కసారి ఇట్లా రారూ" - పసిగట్టాడాయన - "అవ్వ" అని నోరునొక్కుకున్నాడు. "ఏమిటే హాస్యం - నన్ను అల్లరి చెయ్యదలచుకున్నావా?" "అబ్బ రండీ" అని రెండు చేతులా గుంజి గుమ్మంలోకి తీసుకొచ్చి నిలబెట్టి 'ఇదిగో, ఈ యేడు నా సంక్రాంతి కాన్క" అని గర్వంగా చూపింది సుశీల. అంత మనిషీ సిగ్గున విడిపించుకుని గదిలోకి పరిగెత్తాడు రాజారాం. వాళ్ళిద్దరికీ సిగ్గేసి గబగబా లేచి వంటింట్లోకి నడిచారు.

***

(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ