నిచ్చెన - ప్రతాప వెంకటసుబ్బారాయుడు

nichhena

రాఘవ మామయ్య రేపే మా ఇంటికి వస్తున్నాడు.

ఊర్నుండి అమ్మ ఫోన్ చేసి చెప్పిన ఆ వార్త నిజంగా నాకెంతో సంతోషాన్నిచ్చింది.

మాది కొత్తగా పెళ్లయిన జంట. ఇప్పుడు ఎవరైనా పానకంలో పుడకలావస్తే చిరాకేస్తుంది. కాని రాఘవ మామయ్య రాకని నేను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాను. కారణం మామయ్య అఘటనా ఘటనసమర్ధుడు అందరికీ తల్లో నాలుకలా వుంటూ... తియ్యగా మాట్లాడుతూ... ఎవరికి ఏది కావలసి వచ్చినా చేసిపెడుతూ నిత్యం బిజీగా వుండే ఆయన మా ఇంటికొస్తున్నాడు. అన్నట్టు ఆయన మా అమ్మకి ఏమీ కాడు. మరే విధంగాను నాకు మామయ్య కాడు. కాని ఊళ్ళో అందరికీ ఆయన మామయ్యే! ఆయన ఉండేది తెనాలిలో. నేను పుట్టిందీ పెరిగిందీ హైద్రాబాదులో. ఆయన గురించి నిజానికి నాకు తెలియదు. బంధువర్గం ద్వారా ఆయన గొప్పతనం వినడం తప్ప ప్రత్యక్షంగా ఆయన్ని చూడలేదు. మా పెళ్ళికి కూడా బిజీగా వుండి ఆయన రాలేదు. ఆయన్ని ఫోటోల్లో మాత్రమే చూశాను.

మరుసటిరోజు పొద్దున్నే ఆయన్ని తీసుకురావడానికి నేను కారులో రైల్వే స్టేషనుకి వెళ్ళాను.

ట్రైను రావలసిన టైముకే వచ్చేసింది. ఆయన్ని ఫోటోల్లో చూసి వుండడం చేతను... అమ్మ ఆయన ఏ కూపేలోంచి దిగుతుందీ చెప్పడం చేతనూ ఆయన్ని వెంటనే పోల్చుకుని "మామయ్యా.."అన్నాను.

ఆయన నా వంక నవ్వుతూ చూశాడు. కానీ ఆయన నవ్వు నా ఒక్కడికీ సొంతం కాదని ఆయన్ని పలకరించడానికి.. తమతో తీసుకెళ్ళడానికీ చాలా మంది వచ్చారని ఒక గుంపు ఆయన వైపు వెళుతుంటే తెలిసింది. నేనుకూడా ఆయన దగ్గరకి వెళ్ళి నన్ను పరిచయం చేసుకుని మా ఇంటికి వెళ్దామన్నాను.

"చూశావుగా... వీళ్ళలో ఎవరినీ నిరుత్సాహ పరచలేను. నువ్వోపని చెయ్... ఇంటికెళ్ళిపో... నేను వీలుచూసుకుని నీకు ఫోన్ చేసి వస్తాను... నీ నంబరు ఇవ్వు" అని బాగా దర్పంగా... డాబుగా కనిపిస్తున్న ఆయనతో వెళ్ళిపోసాగాడు.

నేను గబ గబ జేబులోంచి కాగితమ్ముక్క ఒకటి తీసి నా పేరు మా అమ్మ పేరు నా ఫోన్ నెంబరు రాసి పరిగెత్తుకుంటూ ఆయన్ని పట్టుకుని అది అందించాను. అది ఆయన చూడనుకూడా చూడకుండా జేబులో కుక్కుకుని వెళ్ళిపోయాడు.

చెప్పొద్దూ నాక్కాస్త నిరాశ కలిగింది.

ఇంటికి వెళ్ళంగానే మా ఆవిడ "ఏరండీ..మీ మామయ్య?" అడిగింది.

నేను జరిగింది చెప్పి"ఆయన అంత బిజీ అనుకోలేదు. ఆయనకోసం ఎంతమంది వచ్చారో తెలుసా? అబ్బో ఈ లెక్కప్రకారం ఆయన గురించి నేను విన్నది చాలా తక్కువ. ఆయన ఏ పనైనా అవలీలగా చేయగలడు. ఆయనకున్న పరిచయాలు అలాంటివి మరి" అన్నాను.

"నిజమేనండోయ్! మనం ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న వాళ్ళం. అలాంటి నిచ్చెన వుంటే మనం తేలిగ్గా పైకి చేరొచ్చు. ఆయన్ని మాత్రం వదులుకోవద్దు"అంది.
"నిజమే కాని నేనిచ్చిన కాగితం ఆయన చూడను కూడా చూడలేదు. ఆయన మన ఇంటికి వస్తాడని నాకు నమ్మకం లేదు. అమ్మకి చెప్పాలి ఆయన పరిచయ భాగ్యం మనకి కలిగేలా చెయ్యమని" అన్నాను.

***

పొద్దుట పదకొండు గంటలకి ఆఫీసు పనితో చాలా బిజీగా వున్నప్పుడు నా సెల్ మ్రోగింది. కాల్ కట్ చేద్దామనుకున్నవాడిని ఎందుకైనా మంచిదని ఆన్సర్ చేశాను. అది మామయ్య నుండి. సారాంశమేమిటంటే ఈరోజు సాయంకాల బండీకే ఆయన తెనాలి వెళ్ళిపోతున్నాడట అందుచేత ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ దగ్గరకి రాగలిగితే ఒక అరగంట మా ఇంట్లో గడిపి వెళ్ళిపోతాడట.

‘ఆహా! ఏమి నా అదృష్టమూ... ఏమి నా భాగ్యమూ...’ అనుకుంటూ మా ఆవిడకి ఫోన్ చేసి ఇవాళ మామయ్యని ఒక గంటలో మనింటికి తీసుకొస్తున్నాను. ఇంటిని అందంగా సర్దు. బయట మంచి రెస్టారెంట్ నుండి చక్కటి రుచికరమైన పదార్ధాలు తెచ్చి తినడానికి సిద్ధం చేయి. ఆయన ఎంత ఇంప్రెస్ అవ్వాలంటే హైద్రాబాదు వస్తే మనమే గుర్తుకి రావాలి..ఆఁ." అన్నాను.

"అలాగేనండి... మీరు తొందరగా వెళ్ళండి లేకపోతే ఆయన్నెవరన్నా ఎగరేసుకు పోతారు. ఆయనకి మన మీద దయ కలిగింది చాలు." అంది.

నేను మా ఆఫీసరు కాళ్ళావేళ్ళాబడి బ్రతిమిలాడి పావుగంటలో ఖైరతాబాదు ఫ్లైఓవరు బ్రిడ్జి దగ్గరకి చేరుకున్నాను. ‘ఆయన వస్తాడా? అసలు నాకంత ప్రిఫరెన్స్ ఇస్తాడా? దేవుడా ఒక్కసారి ఆయన మాఇంటికి వచ్చేలా చెయ్’ మనసులో పరి పరి విధాల ఆలోచనలు.

"ఏవోయ్!" అని వినిపించిన వైపు చూస్తే... దూరంగా ఆడీ కారులోంచి మామయ్య విలాసంగా దిగుతూ ఆ కారులో ఆయనకి బై..బై చెప్పి నా వైపు వడి వడిగా వచ్చి "తొందరగా మన ఇంటికి పోదాం పదవోయ్! అమ్మాయిని చూసి ఆటో ఎక్కేస్తాను. చెప్పాగా సాయంకాలమే బండి... స్టేషనుకి పరంధామం అని నాస్నేహితుడొకడు వచ్చి కలుస్తాడు. వాడితో కూడా ఒక అరగంట గడిపి తెనాలి వెళ్ళిపోతాను. లేకపోతే వాడు చాలా ఫీలైపోతాడు" అన్నాడు.

దేవుడు కరుణించాడు. నేను ఆయన్ని కారులో కూర్చోపెట్టి భక్తిప్రపత్తులతో డోర్ వేసి కారుని వేగంగా ఇంటివైపు పోనిచ్చాను.

ఇంటి దగ్గర దిగంగానే మా ఆవిడ ఆనందంగా ఎదురొచ్చి సాదరంగా ఆహ్వానించింది.

లోపలికెళ్ళాక "మామయ్యగారూ, మీ గురించి ఈయన ఎంతగా చెప్పాడో. మొన్న మీరు మా ఇంటికి రానందుకు రెండు రోజులు చాలా బాధ పడ్డారు. అన్నట్టు మనం తింటూ మాట్లాడుకుందాం..మీరు కాళ్ళూ చేతులూ కడుక్కుని లుంగీ కట్టుకోండి" అంది.

"భోజనమా? చెప్పాను కదటోయ్! నేను ఆరగంటలో బయల్దేరాలని... సర్లే మళ్ళీ అమ్మాయి బాధ పడుతుంది... అమ్మాయీ నువ్వు అలస్యం చేయకుండా వడ్డించేయ్ మరి" అని లుంగీ కట్టుకుని భోజనానికి కూర్చున్నాడు.

మా ఆనందం అంతా ఇంతా కాదు.

"నువ్వెక్కడ పని చేస్తున్నావు?" అడిగాడు.

నేను చెప్పాను. "అబ్బే ..అక్కడుంటే ఎదుగు బొదుగూ ఎలా వుంటుంది చెప్పు? హైటెక్ సిటీలో మనవాడొకడు హెచ్ ఆర్ లో మంచి పొజిషన్లో వున్నాడు. రిక్రూట్ మెంట్స్ అన్నీ వాడి చేతిలోనే వుంటాయి. నీకు సంబంధించిన డిటైల్స్ ఇవ్వు వాడికి చెప్పి చేయించేస్తాను."అన్నాడు.

మా ఇద్దరి ప్రాణాలు పక్షుల్లా హైటెక్ సిటీ మీద వాలాయి.

"మాదాపూర్ లో నా స్నేహితుడొకడు బిల్డర్. నేనెంత చెబితే అంత వెధవకి. అన్ని ఫెసిలిటీస్ వున్న చక్కటి ఫ్లాట్ ఒకటి నీ పేరున బుక్ చేయమని చెబుతాను. లోన్లూ అవీ వాడే చూసుకుంటాడు. ఇల్లుంటే నీకూ ఐ టీ నుండీ రిలాక్సేషను లభిస్తుంది. కొంత కాలానికి సొంత గూడొకటి మీదవుతుంది.నెక్స్ టైం నేను వచ్చినప్పుడు మీరు మాదాపూర్ లో మాంచి పాష్ లొకాలిటిలో వుండాలి " అన్నాడు. ఇప్పుడు మా ప్రాణాలు ఈ ఇరుకు ఇంట్లోంచి ఎగిరెళ్ళి పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలమీద వాలాయి.

ఆ తర్వాత ఆయన ఊరినుండి పంపించిన ఇద్దరు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కి మా ఆపీసులో జాబులు వేయించాను. ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం పంపితే మా ఇంట్లో వుంచుకుని జాగ్రత్తగా చూసుకున్నాను. ఆయన ఇంప్రెస్ అయితే నా పని తొందరగా అవుతుందని.

ఊర్లోవుండి.. ఇక్కడ హైద్రాబాదులో నా చేత తనక్కావలసిన పనులు చేయించుకుంటున్నాడు. మా ఆవిడకూడా నిరాశ వ్యక్తం చేస్తోంది. నేను ఆయనతో మాట్లాడదామని రెండు మూడు సార్లు ఫోన్ చేశాను. లేపలేదు. మొదట్లో ‘పాపం బిజీ ఏమో’ అనుకున్నాను. తర్వాత అర్ధమైంది. కావాలనే నా ఫోన్ ఎత్తట్లేదు. నా ద్వారా పని పూర్తయిన వాళ్ళ దగ్గర ప్రతిఫలం కూడా భారీగానే అందుకున్నాడట.. తర్వాత తెలిసింది. నాకు మాత్రం ఏమీ చేయలేదు. ఒకవేల చేసినా నేను భారీగా ముట్టజెప్పాలి.. ముందు ముందు ఆయన ఏం చెబితే అది చెయ్యడానికి సిద్ధపడాలి.. బానిసవ్వాలి. ఇలాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళకి అరచేతిలో వైకుంఠం చూపించి తమ పనులు చేయించుకుంటారు. లాభ పడతారు. ఆశ మనల్ని వాళ్ళకి పూర్తిగా లొంగిపోయేలా చేస్తుంది. తమ మాటల చాతూర్యంతో మనుషుల్ని కట్టి పడేసి పబ్బం గడుపుకుంటారు. ఒకట్రెండు పనులు ఆయనవల్ల జరిగితే.. పెళ్ళిళ్లూ శుభకార్యాల్లో ఆయన గురించి గొప్పగా చెప్పేసరికి తన తల్లిలాంటి వాళ్ళు నిజమని భ్రమ పడతారు. మరీచికల వెంట పరుగులు తీస్తారు.

సెల్ మ్రోగింది. మా ఆవిడ "ఏవండీ మామయ్య గారు.." అంది.

నేను "తెలుసు. ఇంక ఆయన ఫోన్ ఎత్తను. మనం ఎత్తెక్కడానికి నిచ్చెన అవసరమే కాని అది స్వయం కృషి కావాలి.. ఇలాంటి వైకుంఠపాళీ నిచ్చెన కాదు. అది ఎప్పటికైనా ప్రమాదమే! జీవితాన్ని కోల్పోయేలా చేస్తుంది." అన్నాను స్థిర నిశ్చయంతో.

***

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు