అనగనగా ఒక అడవిలో అనేక పక్షులుండేవి. ఆ పక్షులకు ఒక రాబందు ఎంతో కాలం రాజుగా ఉండేది. అది మంచి రాజుగా, చక్కటి గుణవంతుడిగా పేరు తెచ్చుకుంది.
పక్షులరాజు రాబందు ముసలిదయింది. దాంతో అది తన వారాసుడిగా పక్షిజాతిలోంచి ఒక మంచి గుణం కల పక్షిని ఎన్నుకుని రాజపదవి కట్టబెట్టి, తను విశ్రాంతి తీసుకోవాలనుకుంది. అందుకోసం రాబందు, పక్షులన్నిటినీ సమావేశపరిచింది.
"మిత్రులారా నేను ముసలిదానినయ్యాను .శక్తి తగ్గిపోయింది. మీలోంచి ఒకరిని రాజుగా ప్రకటించాలనుకుంటున్నాను. మీలో ఎవరికి ఆసక్తి ఉందో తెలుపండి" అంది రాబందు.
పక్షులన్నీ పెద్దగా చర్చించుకున్నాయి. ఆగుంపులోంచి గద్ద, కొంగ, హంస ముందుకొచ్చాయి. మూడు పక్షులు ముందుకొచ్చాయి. మూడు పక్షులు ముందుకొచ్చేసరికి వాటిలో ఎవరిని ప్రకటించాలో రాబందుకు అర్థంకాలేదు. ఒక్క క్షణం ఆలోచించింది.
"మిత్రులారా ఒక్క పదవికి ముగ్గురు ముందుకు రావటం చాలా సంతోషం. కాని ఒక్కరినే రాజుగా ప్రకటించాల్సి ఉంది. అందుకోసం మీకోక పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో నెగ్గినవారినే రాజుగా ప్రకటిస్తాను" అంది రాబందు. అందుకు గద్ద, కొంగ, హంసలతోపాటు మిగతా పక్షులన్నీ సంతోషం వ్యక్తపరిచాయి.
"మిత్రులారా నా దగ్గర ఎంతో కాలంగా మూడు విలువైన బంగారు నాణాలున్నాయి. మన అడవి చుట్టుపక్కల గల గ్రామాల్లో సంచరించి సరైన వ్యక్తికి దానం చేసిరండి" అంటూ తలా ఒక్క బంగారునాణెం ఇచ్చింది రాబందు.
మూడు పక్షులూ తలో దిక్కు ఎగిరాయి.
మరుసటి రోజు ఉదయం పక్షులన్నీ తిరిగి సమావేశమయ్యాయి. రాబందు - గద్ద, కొంగ, హంసలను పిలిచి "మిత్రులారా నిన్న నేనిచ్చిన బంగారు నాణాలని ఎవరికి ఇచ్చారో చెప్పండి" అని అడిగింది.
రాబందు, గద్దవైపు చూసింది.
"రాజా నేను రామాపురంలో అందంగా, ఎంతో నైపుణ్యంగా చిత్రాలు గీసే ఓ చిత్రకారుడి ప్రతిభకు మెచ్చి బంగారు నాణెం కానుకగా ఇచ్చాను." అంది..
రాబందు, కొంగ వైపు చూసింది.
"రాజా నేను కృష్ణాపురంలో మన కోకిల కన్నా కమ్మగా పాటలు పాడే ఓ గాయకుడి నైపుణ్యానికి పొంగిపోయి బంగారు నాణెం దానం చేసాను." అంది.
రాబందు, హంస వైపు చూసింది.
"రాజా నేను వెంకటాపురంలో ఊరికి దూరంగా, ఒంటరిగా, అనాధగా జీవిస్తున్న ఓ పేద ముసలిదానికి దానం చేసాను. ఆమె కుష్టు వ్యాధితో బాధపడుతుంటూ జాలిపడి నాణెం చేతిలో పెట్టాను." అంది హంస.
రాబందు, మూడింటి సమాధానాలు వింది. దీర్ఘంగా ఆలోచించ సాగింది. అక్కడున్న పక్షుల సమూహం రాబందు, రాజుగా దేన్ని ప్రకటిస్తాడా అని గుస గుసలాడుకోసాగాయి.
రాబందు అన్నిటి వైపు చూసి, మిత్రులారా నా తర్వాత మన పక్షి జాతికి రాజుగా హంసను ఎన్నుకుంటున్నాను." అంది.
పక్షులన్నీ పెద్దగా అరుస్తూ హంసను అభినందించాయి. కానీ గద్ద, కొంగ బిక్కముఖం పెట్టి రాబందుని చూడసాగాయి.
"మిత్రులారా మనలో చాలామంది అందాన్ని, నైపుణ్యాన్ని ప్రశంసించి సహకరిస్తాము. కాని అనామకుల్ని, అనూహ్యమైన వాటిని ఆదుకోము. గద్ద, కొంగ ఆ కళాకారుల్లోని నైపుణ్యాన్ని ప్రశంసించారు. బంగారు నాణాన్ని బహుకరించాయి. కాని హంస మాత్రం ఓ పేద ముసలి అనాధను, పైగా కుష్టువ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి తన బంగారు నాణాన్ని ఇచ్చి సత్కరించింది. హంసది విశిష్ట గుణం. అందుకే నా తర్వాత రాజుగా హంసను ప్రకటిస్తున్నాను." అంది రాబందు.
గద్ద, కొంగలు తాము చూసిన పొరపాటును, హంసలోని విశిష్ట గుణాన్ని గుర్తించాయి. సంతోషంతో అవి రెండూ హంసను దగ్గరకు తీసుకుని అభినందించాయి.