వరదొచ్చింది - ఆకెళ్ళ శివప్రసాద్

varadochindi

రదొచ్చింది - భయపెడ్తూ, వొణికిస్తూ, జ్ఞాపకాలని తుడిచేస్తూ, మనసుని మెలిపెడ్తూ, చిరునామాల ఆనవాళ్ళు లేకుండా చేస్తూ! కన్నీటి వరదకి కరకట్టలు కరువయ్యాయి!

మా వూరు - చూడముచ్చటైన మా 'లంక' - చుట్టూ కృష్ణమ్మ, మధ్యలో పచ్చదనం - కళ్ళముందే నీటిలో మునిగిపోయింది - సుడిలో చిక్కుకున్న ఈతరాని పసిపిల్లవాడిలా మునిగిపోయింది.

నేను 'నమశ్శివాయ' అంటూ అక్షరాలు దిద్దిన బడి - నేను 'శివశివమూర్తివి' అంటూ భజనలు చేసిన గుడి - తరాలని నిలబెట్టిన పచ్చటి పొలాలు - పరుగెత్తి ఆటలు ఆడిన గట్టులు - పక్షుల గూళ్ళతో కువకువలాడిన చెట్లు - అన్నీ జలార్పణం అయిపోయాయి!

'ప్రత్యక్షప్రసారం' సాక్షిగా నామరూపాలు లేకుండాపోయాయి'. 'జలసమాధి' అయిపోయాయి. చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయత! ఆ లంకలోనే నా జీవితం చిగురించింది.

ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం - ఆసుపత్రులు లేవు - వైద్యుల జాడలేదు - అమ్మ నొప్పులకి అమ్మమ్మ మంత్రసానిని పిలిస్తే - భూమ్మీద పడ్డాను - నాజన్మభూమి లంక - అక్కడే ఓ చిన్నబడి - రామారావు మేష్టారు ఒకే ఒక్కరు - గుణింతాలు, ఎక్కాలు - కూడికలు, తీసివేతలు, ఇంగ్లీషు మాటలు, చరిత్ర విశేషాలు - ఐదో తరగతి దాకా అక్కడే - ఆ తరువాత దగ్గరలోనే ఉన్న పెద్ద పల్లెలో చదువు - పడవ ప్రయాణం - పలకమీద పాఠాలు - దాటి - పుస్తకాలు వచ్చాయి - అలలని లెక్కపెడ్తూ ఎక్కాలు - సరంగు పాటలలో మాటలు - పుస్తకాల్లో చదువుకున్న దానికన్నా చుట్టూ ప్రకృతి నేర్పిందే ఎక్కువ

కళాశాలలో జేరేసరికి - 'లంకోడు' అని వెక్కిరింతలు. వాళ్ళ వేళాకోళంలో వెర్రి ఆనందం కలిగేది!

'కృష్ణమ్మ లో ఈదితే ప్రపంచాన్ని జయించే ధైర్యం వొస్తుంది -- మీకేంటి చీకటిలో అడుగు పెట్టాలంటే భయం మీకు' అనే వాడిని

పల్లె అతి చిన్నతనం నుండే అనుభవాలిస్తుంది - పట్నం పధ్ధతిపేరుతో మనసుని ఎదగనీయకుండా చేస్తుంది !

చదువయ్యాకా - ఉద్యోగం హైదరాబాద్ లో - వారంచివర 'లంక ప్రయాణం'

రెండు రోజుల కొత్తవూపిరిలో మళ్ళీ 'పట్నవాసం'

'నా లంక ... మా వూరు ...' అని చెప్పుకుంటుంటే గుండెలు ఆనందంతో వూగిపోయేవి.

పెళ్ళయ్యింది . పిల్లలు. 'నాన్నా ... సెలవులకి ఎక్కడికి ..' అని పిల్లలు అడగరు.

నా జవాబు వాళ్ళకి తెలుసు.

ఎక్కడికి వెళ్ళినా, వచ్చేటప్పుడు 'లంక' లో ఆగాల్సిందే !

పడవ మీద ఊళ్ళోకి వెళ్తూనే - పలకరింతల పర్వం - 'సిన్నొడొచ్చాడన్న' సంబరం - చంద్రమండలం వెళ్లి వచ్చిన వాళ్ళని కూడా అంత ప్రేమగా చూస్తారో లేదో తెలీదు!

లంకంత కళ్ళతో చేసుకుని చూస్తుంటే 'శబరి' వెలుగు చూపుల్లోని అమరత్వం కన్పించేది ఆ 'లంక' - అలాంటి అపురూపమైన లంక -
మొదట 'వాన' అన్నారు

వాన మాకు కొత్త కాదు. వానకి మేము కొత్త కాదు. అలాంటి వాన వరదైపోయింది.

అమ్మా నాన్న మా వాళ్ళు పడవల్లో దగ్గరలో ఉన్న ఊరుకి చేరారు - అక్కడనుంచి ఇక్కడికి - కష్టాలు పడి - వచ్చారు - అరవైఏళ్ల పైచిలుకు అనుబంధం లంకలో వాళ్ళది - వదిలిపెట్టలేక వదిలేరు - నాన్న జబ్బు పడ్డ మనిషైయ్యారు - అమ్మ సరేసరి

'మడుసులం తప్పించుకున్నాము ... నోరులేని జీవాలు వాటిసంగతేంటి ?' ఏడుస్తూనే ఉంది - మా ఆవు - గంగ - మా రెండు - ఎడ్లు - మా లేగదూడలు - అన్నీ కృష్ణార్పణం అయిపోయాయి!

వాటి అరుపులు యింకా విన్పిస్తున్నట్టుగా ఉంది - కళ్ళకి కునుకు లేదు - 'ఆ ప్రవాహంలో ఎక్కడో ..' మాటలే కరువయ్యాయి - అందరం మొక్కులు మొక్కుకున్నాము - కన్పించని దేవుళ్ళకి వేడుకున్నాము - కాని కృష్ణమ్మ అనుగ్రహించలేదు - అంతా అయిపోయింది -
మా లంక మునిగిపోయింది !


***** *****

"మీ వూరు .." ఆఫీసుకి వెళ్ళకపోతే ఇంటికి వచ్చిన సహోద్యోగి సారధి అడిగాడు. పేపర్ లో 'నీరైన వూరి' ని చూపెట్టాను!

అంతకుముందు చాలాసార్లు 'మా వూరు' ని చూపెట్టినప్పుడు 'ఆల్బమ్'లో ఉన్న అందమైన ఫోటోలు చూపేవాడిని - ఇప్పుడు ఆ 'ఆల్బమ్' గుర్తుగా ఉంది - వూరు ???

చెట్టు, పుట్ట, గట్టు, గుట్ట, బడి, దడి, గుడి, పాడి,... అన్నీ ఆ ఆల్బమ్ లో ఉన్నాయి - వానలు తగ్గాక మా వాళ్ళు వెళ్తామన్నారు - వెళ్ళే 'దారి' లేక దిక్కుతోచక ఉండిపోయారు!

***** *****

ఒకరోజు వరద ముంచేసింది. మార్పు ఒక్క రోజులో సాధ్యమా? యాంత్రిక జీవనంలో కలిస్తే విషాదం తగ్గుతుందనిపించి ఆఫీసుకి వచ్చాను.

సారధి అప్పటికే అందరికి చెప్పేశాడు. 'ఆత్మీయుడిని కోల్పోయిన వాడిని' పలకరించారు - నాకు ఏడుపు ఆగలేదు - అప్పుడే నా భుజమ్మీద ఓ చేయిపడింది.

'ఎందుకు సార్ ... మరీ యిదైపోతారు ... జబ్బుపడ్డ మనిషి కోలుకోలేదా? .. మీ 'లంక'కి నీటి జబ్బు పట్టింది ... మందు వేద్దాం ..." ధైర్యంగా అన్నాడు రవి. సంకల్పంతో సాధించలేనిది లేదన్నాడు.

"చరిత్రలో శిధిలమైన కట్టడాల అవశేషాలు బైటకి వస్తే .. రక్షించుకోవడం లేదా?"

"మీరు నిశ్చింతగా ఉండండి ... మీ వూరు అల్బమ్ ఉందిగా ... అది చాలు మళ్ళీ మీ వూరుని మీ వూరులా అందివ్వడానికి ..." ఉత్సాహంగా అన్నాడతను - అక్కడే పక్కగా ఉన్న మరో వ్యక్తి ఆల్బమ్ అందుకున్నాడు !!

***** *****

రెండు రోజుల తరువాత -

'వరద వొచ్చింది' ధైర్యం ఇవ్వడానికి, 'మానవుల' మీద నమ్మకాన్ని రెట్టింపు చేయడానికి - పెద్దవాళ్ళు, పిల్లలు,ఆడ,మగ - అంతా -
వరదకన్నా వేగంగా - నా చుట్టూ చేరారు.

బట్టల గుట్టలు - కేజీల్లో ఆహార ధాన్యాలు, పప్పులు - ఊహించనంత డబ్బులు.

ఆ 'వరద'లో కొట్టుకుపోయిన ధైర్యం - మానవీయమనే ఈ 'వరద' తో దగ్గర కొచ్చింది

కళ్ళముందే కనుమరుగై పోయిన మా 'లంక' మా అల్బమ్ లో కన్నా గొప్పగా రూపుదిద్దుకోవడం కనిపిస్తోంది !

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు