పూర్వం ఒక పెద్ద చీమల కుటుంబం వుండేది.ఒక రోజు సాయంత్రం ఉరుములు మెరుపులతో కురిసిన కుండపోత వర్షానికి అవి నివసించే పుట్ట కాస్తా కొట్టుకు పోయింది. దాంతో కుటుంబమంతా చెల్లాచెదురైంది. వర్షం వెలిసిన తరువాత చీమలన్నీ ఒక చోటికి చేరుకున్నాయి. పుట్ట కొట్టుకుపోయినందుకు చీమలు చింతించలేదు. అనువైన ప్రదేశాన్ని వెదుక్కుంటూ బయలుదేరాయి.
ఒక ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని గుర్తించి, ఒక్కోచీమ కొంత కొంత మట్టిని తీసుకురాగ అన్నీ కలిసి తమకు కావలిసిన రీతిలొ పుట్టను నిర్మించుకున్నాయి.
ఆ తరువాత ఆ పరిసరాల్లో నివసుస్తున్న చీమలను, ఇతర జీవులను ఆహ్వానించి ఘనంగా గృహప్రవేశం జరుపుకున్నాయి. చీమలు, జంతువులు విందు భోజనం ఆరగించి, చీమలు కొత్త పుట్టలో కలకాలం కలిసి మెలిసి సంతోషంగా జీవించాలని కోరుకుంటూ వెల్లిపోయాయి.
బుసలు కొడుతున్న శబ్ధం వినిపించడంతో చీమలన్నీ పుట్ట వెలుపలికి వచ్చాయి. వాటికి పడగ ఎత్తి వున్న పాము కనిపించింది.
"నాగరాజు మావ ! సరైన సమయానికి వచ్చావు. ఇవాళ మా గృహప్రవేశం. మా ఆతిద్యాన్ని స్వీకరించి వెళుదువుగాని .... రా! " అందో చీమ.
దానికి పాము వికటాట్టహాసం చేసి, "నేను విందు ఆరగించేందుకు రాలేదు. మీ పుట్టను ఆక్రమించుకోవడానికి వచ్చాను.". అంది.
అందుకు ప్రశాంతమైన వదనంతో చీమ "మరేమి పర్లేదు మిత్రమా! దేవుడు ఒక్కో జీవికి ఒక్కొక్కటీ ప్రసాదిస్తాడు. మాకు పుట్టను కట్టగలిగే సామర్ధ్యాన్ని ప్రసాదిస్తే, నీకు దాన్ని ఆక్రమించుకునే గుణాన్ని ప్రసాదిస్తాడు." అంది.
మరో పుట్టను కట్టుకునేందుకు చీమల కుటుంబం తరళి వెళ్లిపోయింది.