శ్రీనివాసరావు, పద్మావతి పక్కపక్క కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. ఇద్దరి వదనాలూ చాలా అప్రసన్నంగా ఉన్నాయి. ఆవిడ అటు తిరిగి, ఈయన ఇటు తిరిగి ఎడమొహం పెడమొహంగా కూర్చున్నారు. వారిద్దరికీ ఎదురుగా తన కుర్చీలో సుఖాసీనుడై ఉన్నాడు లాయరు వరాహమూర్తి. ఆయన వదనం మాత్రం పండు వెన్నెల్లా, వికసించి ఉంది. పరగడుపునే పార్టీ వచ్చింది. మరి ఆమాత్రం ఆనందం ఉండదూ!
నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో తుమ్మెద ఝంకారంలా నెమ్మదిగా వినిపిస్తోంది ఏ.సి శబ్దం. బాయ్ తలుపు తెరుచుకుని వచ్చి మూడు కూల్ డ్రింక్ సీసాలు పొందికగా టేబిల్ మీద పెట్టాడు.
"తీసుకోండి" అన్నాడు వరాహమూర్తి.
"ఎందుకండీ ఈ మర్యాదలన్నీ?" కించిత్తు విసుక్కున్నాడు శ్రీనివాసరావు.
"త్వరగా మా పని ముగించండి. అదే పదివేలు" అంది పద్మావతి విసుగ్గా.
చిన్నగా నవ్వాడు వరాహమూర్తి.
"ఫరవాలేదు. తీసుకోండి" అన్నాడు. వాళ్ళ హడావిడి, కంగారు చూస్తుంటే అతనికి చచ్చేంత నవ్వు వస్తోంది.
కూల్ డ్రింక్ లు అందుకున్నారు దంపతులు.
"మీ పేరు విని ఎంతో ఆశతో వచ్చాను. నాకసలే ఈ కోర్టులూ, లాయర్లూ అంటే చిరాకు. పోలీసులకీ, హాస్పిటళ్ళకీ, కోర్టులకీ దూరంగా ఉండాలనుకునే వాళ్ళలో నేనొకడిని. ఇప్పుడు కూడా నాకు ఇష్టం లేకపోయినా ఇతరుల తెలివితక్కువ వల్ల ఇక్కడికి రావలసి వచ్చింది. మీరు ఠకాబికీ వ్యవహారం తేల్చేస్తారని తెలిసి మీ దగ్గరికి పరిగెట్టుకు వచ్చాను. మీరు త్వరగా మా వ్యవహారం తేల్చేస్తే..." అన్నాడు శ్రీనివాసరావు.
ఈ సారి పెద్దగానే నవ్వేశాడు లాయరు.
"మీ వాలకం చూస్తుంటే విచిత్రంగా ఉంది సార్. ఏదో కొట్టుకు వచ్చి పావుకిలో బెండకాయలు, అరకిలో వంకాయలు ఇవ్వు అర్జెంటుగా వెళ్ళాలి అన్నంత తేలిగ్గా మీరు హడావిడి పడిపోయి, నన్ను హడావిడి పెట్టేస్తున్నారు. విడాకులంటే అంత తేలిగ్గా వస్తాయా?
ఇక పోతే నా గురించి మీరు విన్నది సగం మాత్రం నిజం పక్కా కేసులైతే ఠకాబికే తేల్చేస్తాను. కొన్ని కేసుల్లో మాత్రం జిడ్డులా పట్టుకుంటాను.
మీ కేసు ఈ రెండో కోవకి చెందుతుంది లక్షణంగా పెళ్లై, ఇన్నేళ్ళు కాపురం చేసి, పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారు. మీకెందుకండీ విడాకులు?" అడిగేశాడు.
గయ్ మంటూ లేచింది పద్మావతి.
"అదే... అదే నా బుద్ధి తక్కువ. అసలు ఈ మనిషితో ఇన్నాళ్ళు కాపురం చెయ్యడం నా తెలివితక్కువ. ఈ తెలివితేటలు ఆనాడే ఉంటే పెళ్ళయిన మర్నాడే విడాకులు పారేసి ఉండేదాన్ని".
"నేనైతే ఈ ఘటాన్ని పెళ్ళి చేసుకునే వాడినే కాదు, అయినా మా పెద్దవాళ్ళని అనాలి. సుఖంగా, ఒంటరిగా, సంపాదించుకున్నది నా ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టుకుంటూ, పైలా పచ్చీసుగా ఉన్నవాడిని పట్టుకుని, పెళ్ళాం వస్తే నీకు అండగా ఉంటుంది అని పీకి పాకాన పెట్టి పెళ్ళిచేశారు. పెళ్ళి చూపుల్లో గుమ్మటంలా కూర్చున్న ఈవిడని చూస్తే మరీ గుమ్మడికాయలా ఉంది నా కొద్దు అని గునిసినా మంచి వంశం, సంప్రదాయం, పనీపాటా వచ్చు అంటూ నా మెడకి కట్టారు" అన్నాడు శ్రీనివాసరావు.
"అవునవును. అక్కడికి నేనేదో ఈయన్ని వరించి పెళ్ళిచేసుకున్నట్లు, సన్నగా, నాజూగ్గా బూజుకర్రలా ఉన్నాడు నాకొద్దు అన్నాను. చేసుకోవే అమ్మడూ చక్కగా బూజు దులిపి పెడతాడు. కుర్చీపీటెక్కి బూజు దులిపే శ్రమైనా తప్పుతుంది. అని నచ్చచెప్పి పెళ్ళి చేయించింది మా నాయనమ్మ" ఉక్రోషంగా అంది పద్మావతి.
"అదే, అదే నేనూ చెప్పొచ్చేది. మొగుడు వెధవ అంటే బూజులు దులపడానికి, కావిడితో నీళ్ళు తేవడానికి పనికొస్తాడని పెళ్ళిళ్ళు చేసుకోవటం మీ ఇంట్లో ఆనవాయితీయే. మీకు తెలియదు గానీ లాయరుగారూ ఈవిడ పెత్తల్లి నాకు ఆ రోగం, ఈ జబ్బు అని మూలుగుతూ ఇంటి పనంతా మొగుడి చేత చేయించేది. చాకిరీ చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆవిడ మాత్రం ఈ నాటికి గుండ్రాయిలా ఉంది."
"లాయరుగారూ. వీళ్ళది ఎంత గొప్ప వంశం అనుకున్నారు! వీళ్ళ నాయనమ్మ మహా ఇల్లాలు. మొగుడు పెట్టే ఆరళ్ళు భరించలేక చెప్పాపట్టకుండా కాశీకి పారిపోయిందట. ఇల్లు నడవక వెతుక్కుంటూ వెళ్ళి కాళ్ళా వేళ్ళా పడి బతిమాలి తీసుకొచ్చారట. మళ్ళీ ఆరళ్ళు పెడుతుంటే విసిగిపోయి రామేశ్వరం పారిపోయింది. మళ్ళీ తిరిగి రాలేదు. ఈయనకి ఆ తాతగారి పోలికే. ఎంతసేపూ పడక్కుర్చీలో పడుకుని అజమాయిషీ చలాయించటం తప్ప ఏనాడూ పూచిక పుల్లంత సహాయం చేసిన పాపాన పోలేదు. ఒంటరి కాపురం, పసిపిల్లలు, నలుగురు వచ్చిపోయే ఇల్లు ఎలా నడుపుకొచ్చానో ఆ పరమాత్ముడికి ఎరుక" పద్మావతి కంఠం బరువెక్కింది.
"నిజమే మరి. ఇంటి పట్టున ఉండి ఈవిడకి పన్లు చేసి పెడుతూ ఉంటే ఇల్లు గడిచే మార్గం ఏది? అందులోనూ ఈవిడ చేతికి ఎంత తెచ్చి ఇచ్చినా ఆహుతి అయిపోవడం తప్ప నయాపైసా మిగిలిస్తే ఒట్టు. నేను వెర్రివెధవని కాబట్టి నా భార్యాబిడ్డలు దర్జాగా బతకాలని గాడిదలా కష్టపడి పరీక్షలు పాసై చిన్నతనంలోనే ఆఫీసరునై ఇంత వృద్ధిలోకి వచ్చాను. అందుకు సంతోషించక సణుగుడు ఒకటా! నా రెక్కల కష్టం అంతా కరిగించి నగలుగా ధరించి టింగురంగా అని తిరుగుతుంది. అప్పుడు ఏడవచ్చుకదా!" బదులు తీర్చుకున్నాడు శ్రీనివాసరావు.
"తిరిగానంటే తిరుగుతాను. నేనలా దర్జాగా తిరగబట్టే నలుగుర్లో మీ గౌరవం పెరిగింది. మన సంఘంలో భార్య హోదా చూస్తేనే మగవాడి ప్రయోజకత్వం తెలిసేది. ఇంకా అందరాడవాళ్ళలా, నా సౌభాగ్యం నా సంతోషం అనుకునేదాన్ని కాదు కాబట్టి జిడ్డోడుతూ ఉండే ఈయన్ని తోమి మంచి బట్టలు కొనిపించింది ఎవరో అడగండి. హోదాకి తగినట్లు ఉండాలని పోరుపెట్టి నవరత్నాల ఉంగరం, మెళ్ళో గొలుసు, ఖరీదైన వాచీ అమర్చింది, ఎవరో అడగండి, ఇవన్నీ చేసేసరికి నా తల ప్రాణం తోకకి వచ్చింది. ఏం చేద్దామన్నా డబ్బు ఖర్చు అయిపోతోందని సణుగుడు. పది రూపాయలు ఖర్చు చెయ్యాలంటే పాతిక సార్లు లెక్క చూసుకుంటారు" ఎత్తిపొడిచింది.
"చూసుకుంటే చూసుకుంటాను. నా కష్టార్జితం, నా ఇష్టం అలా లెక్కలు వేసుకుంటూ జాగ్రత్త పడ్డాను కాబట్టే ఎవర్నీ ఏనాడూ అయిదు రూపాయలు అప్పు అడక్కుండా సంసారం నడిపాను. పిల్లల్ని చదివించాను. అమ్మాయి పెళ్ళి చేశాను. ఇల్లు కట్టాను. నన్నూ, నా ప్లానింగునీ ఎంత మెచ్చుకుంటారు నా స్నేహితులందరూ?" గర్వంగా కాలర్ ఎగరేసుకున్నాడు శ్రీనివాసరావు.
"గొప్పేలెండి, బయటివాళ్ళు మెచ్చుకున్నారేమో గాని ఇంట్లో వాళ్ళం ఎన్నో బాధలు పడ్డాం. పిల్లలు ఏది అడిగినా పెద్ద లెక్చరు ఇచ్చేవారు. నా దగ్గరికి వచ్చి 'చూడమ్మా... నాన్నగారు పది రూపాయలిచ్చి పావుగంట పొదుపు గురించి పాఠం చెప్తారు' అని వాపోయే వాళ్లు వెర్రి సన్నాసులు. ఏదో అప్పుడు అవసరం ఉండబట్టి అడిగారు. ఇప్పుడు అడుగుతారా? ఈ కారణంగానే వాళ్ళకు తండ్రి దగ్గర చనువు లేదు. నా పిల్లలిద్దరూ నాకే చేరువ' మురిసిపోయింది పద్మావతి.
నవ్వేశాడు శ్రీనివాసరావు. "అదావిడ భ్రమ. మా అమ్మాయి ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకునేది. 'అమ్మ చాదస్తం భరించలేకపోతున్నాను నాన్నగారూ, స్నేహితులతో సినిమాకి వెళ్ళాలంటే సవాలక్ష ప్రశ్నలు వేస్తుంది' అనేది. ఇక మా అబ్బాయి అమెరికా వెళ్తూ నాన్నగారూ, ఇన్నాళ్ళూ ఇద్దరం ఒకరికొకరం తోడుగా ఉన్నాం. ఇక అమ్మ చాదస్తం మీరు ఒంటరిగా భరించాలి జాగ్రత్త అని కావలించుకుని చెప్పి వెళ్ళాడు."
ఎక్కడా ఆపూ స్టాపూ లేకుండా వీధి నాటకంలా సాగిపోతున్న వాళ్ళ గొడవ చూసి విసుగు వేసింది వరాహమూర్తికి.
వీళ్ళనిలా వదిలేస్తే ఏళ్ళ తరబడి నేరాలు చెప్పుకుంటూ పోతారేమో అని భయం వేసింది చెయ్యి చాచి వారించాడు.
"చూడండి. మీ వివాహం జరిగి ముఫ్ఫై ఏళ్ళు దాటిందని చెప్తున్నారు. మీ మాటలు బట్టి చూస్తే భార్యాభర్తలుగా, తల్లితండ్రులుగా మీమీ బాధ్యతలు చక్కగా నిర్వర్తించినట్లు తెలుస్తుంది. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. అన్ని బాధ్యతలూ తీరిపోయాయి. ఆర్ధికమైన ఇబ్బందులు లేవు. అన్ని బాదరబందీలు తీరిపోయి లక్షణంగా చిలకా గోరింకల్లా సెకండ్ హనీమూన్ లా జీవితం గడపవలసిన ఈ రోజుల్లో విడాకులంటారేమిటి? ఇదేం విచిత్రం!" నచ్చజెప్పచూశాడు.
"లేదులెండి, మా ఇద్దరికీ బొత్తిగా పడడం లేదు. తెల్లవారిన దగ్గర నుండి రాత్రి పడుకునేదాకా దెబ్బలాటలే!" అందావిడ.
"దెబ్బలాటలా! ఏ విషయంలో!" అడిగాడు లాయరు.
"ఒక విషయం అయితే చెప్పొచ్చు లాయరుగారూ. ప్రతీ దానికీ ఎడ్డెం అంటే తెడ్డెం అంటుంది" అన్నాడు శ్రీనివాసరావు.
"ఇలా చెప్తే లాభం లేదు సార్. వివరంగా చెప్పాలి. మీకు పోట్లాటలు ఎందుకు వస్తున్నాయి. ఎవరు ప్రారంభిస్తారు?" జిడ్డులా పట్టుకున్నాడు లాయరు.
ఇద్దరూ కాసేపు ఆలోచించారు.
"ఉదాహరణకి ఓ విషయం చెప్తాను వినండి. నన్ను టీవి చూడనివ్వరు. దినం అస్తమానం న్యూస్ పెట్టుకుని కూర్చుంటారు. ఒకసారి వింటే చాలదా ఆ న్యూస్, అలా కాదే! అన్ని చానల్స్ లోనూ అన్ని వార్తలూ చూడాల్సిందే. పోన్లే ఈ మధ్యనే రిటైరు అయ్యారు. ఏమైనా అంటే మనసు కష్టపెట్టుకుంటారు అని నేనే సర్దుకుపోవాలని చూస్తాను.
"హెడ్ లైన్స్ రాగానే వంటింట్లోకి వెళ్ళి నాపని చూసుకొని వెదర్ రిపోర్టు అవగానే వచ్చి కూర్చుంటాను. వార్తలయిపోయాయి ఇక నా కిష్టమైన ప్రోగ్రాం చూడొచ్చు అనుకునేలోగా మరో చానల్ మారుస్తారు. మళ్ళీ ముఖ్యమైన వార్తలు. మళ్లీ ప్రధాని విదేశీ పర్యటన. మళ్ళీ బీహారులో ఊచకోత. మళ్ళీ వాతావరణం ఎన్నిసార్లు చూడనూ. ఏమైనా అంటే నోరు పెట్టుకుని పడిపోతారు" చెప్పింది పద్మావతి.
"ఏంసార్ నిజమేనా" ఎదురు పార్టీని అడిగాడు లాయరు.
"గాడిదకేం తెలుసు గంధం వాసన అని ఈవిడకేం తెలుసండీ న్యూస్ విలువ? ఈవిడకి కాపురమే కైలాసం, ఇల్లే వైకుంఠం. మరి నాకలా కాదు కదా. నలుగుర్లో తిరిగేవాడిని నాలుగు విషయాలూ తెలుసుకోకపోతే ఎట్లా చెప్పండి. మొన్నామధ్య పిల్చి, పోఖ్రాన్ లో న్యూక్లియర్ టెస్ట్ చేశారే అంటే, పోపు వేశారా? ఎవరు? ఎందుకు అంటూ వంటింట్లోనుంచి ఆయుధసహితురాలై వచ్చింది. అంతదాకా ఎందుకు, పార్లమెంట్ ప్రొసీడింగ్స్ చూస్తుంటే వచ్చి కూర్చుని పిల్లి గడ్డం ప్రధానమంత్రిగారేరీ అని కళ్ళ జోడు పెట్టుకుని మరీ వెతికేస్తోంది. ఆయన ఏనాడో దిగిపోయాడు. కొత్తాయన వచ్చి కూడా చాలాకాలం అయింది. అదుగో ఆ అరచేతుల కోటేసుకుని కూర్చున్నాడు చూడు, అటల్ బిహారీ వాజ్ పేయ్ గారు ఆయన మన ప్రధాని అని పరిచయం చేశాను" అన్నాడు శ్రీనివాసరావు హేళనగా.
"చాల్లెండి సంబడం. పనికిరాని పరిజ్ఞానం అంటే ఇదే. ఇంగ్లీషు పేపర్లమ్మితే తెలుగు పేపర్లకంటే ఎక్కువ డబ్బులు వస్తాయని తెలీదుగాని, ప్రపంచ జ్ఞానం మాత్రం పుష్కలంగా ఉంది. సరే, వార్తలు చూసి తన ప్రతిభాపాటవాలు పెంచుకుంటారే అనుకుందాం. క్రికెట్టు మేచ్ వస్తే నా పాట్లు ఆ భగవంతుడికి ఎరుక, మరం వేసుకుని మంచంమీద కూర్చుంటారు. పచ్చి బాలింతరాలికి అందించినట్లు అన్నీ మంచం దగ్గరకే అందించాలి. వాళ్ళు గెలిస్తే ఎగిరి గంతులు. ఓడితే ఆ పూటల్లా కళ్ళు తుడుచుకోనూ, ముక్కు ఎగపీల్చుకోనూ, మధ్యలో ఒక్క అరగంట సీరియల్ చూస్తానంటే ససేమిరా ఒప్పుకోరు" తన గోడు వెళ్ళ బోసుకుంది పద్మావతి.
"పోనీ ఆవిడకి ఇష్టమైన ప్రోగ్రాములు ఆవిడని చూడనివ్వచ్చు కదండీ. ఆవిడ ఏ వంట చేసుకుంటున్న సమయంలోనో వార్తలు చూసేసి, ఆ తరువాత పేపరు చదువుకుంటూ కూర్చుంటే కావలసినంత ఇన్ఫర్మేషన్, క్రికెట్ మ్యాచ్ విషయంలో ఆవిడకి టి.వి అప్పగించితే వచ్చిన నష్టం ఏముంది? కాకపోతే ఆ అరగంటా రేడియోలో కామెంట్రి వినండి. ఆవిడ సీరియల్ చూస్తారు" సలహా చెప్పాడు లాయరు.
"ఏం సీరియల్స్ నా మొహం సీరియల్స్. చూసేవాళ్లకీ తలకాయ లేదు. తీసేవాళ్లకీ తలకాయ లేదు. సీరియల్లో సీరియల్లో అని గోతికాడ నక్కలా కూర్చుంటుంది. ఇరవై నిమిషాలు ప్రకటనలు. పది నిమిషాలు ఆ సీరియల్. దానికోసం ఆ చెత్త అంతా భరించేసరికి ప్రాణం పోతోంది. ఇకపోతే, ఆ వంటల ప్రోగ్రాము కాదుగానీ నా చావుకొచ్చింది. చెట్టుడిగే కాలానికి కుక్కమూతి పిందెలని ఈ వయసులో ఈవిడ టీవీ చూసి నేర్చుకోవడం ఏమిటి చెప్పండి? ఈవిడది స్వతహాగా అమృతహస్తం. కళ్ళు మూసుకుని వంట చేసినా అమృతంలా ఉంటుంది. ఈ మధ్య కొత్త వంటలు నేర్చుకుని వేపుకు తింటోంది. మొన్నటికి మొన్న వరహాల మూటలట, ఆ వంటకం చేసింది. అవి తిని నోరంతా కొట్టుకుపోయింది. కిందటి వారం ఆపిల్ ఫుడ్డింగ్ ట, పీకినా రాదమ్మ నా పిండివంట అన్నట్లు అది నాకు అలివి కాక మా వరండాలో పడుకొనే వీధి కుక్కకి వేశాను. నోట కరుచుకు పారిపోయింది. మళ్లీ తిరిగి రాలేదు" వాపోయాడు శ్రీనివాసరావు.
"ఇది మరీ బావుంది. మనిషన్నాక పొరపాట్లు రావడం సర్వసహజం. కమ్మగా వండితే వెనక్కి మిగలకుండా ఆరగించడం లేదూ! అప్పుడేమైనా మెచ్చి మేకతోలు కప్పుతున్నారా? పోనీ వంటలూ, సీరియల్స్ అలా ఉంచి, సినిమాలైనా చూస్తానంటే చూడనిస్తారేమో అడగండి. పాత సినిమాలు బాగుంటాయి. నేనూ ఒప్పుకుంటాను. కానీ, చూసి చూసి కంఠతా వచ్చేసిన సినిమాలు ఎంతకని చూస్తాం? కొత్త సినిమా చూస్తుంటే ఓ... సణిగి చంపేస్తారు..." మండిపడిందావిడ.
"కాలక్షేపం కోసం ఏ సినిమా అయినా చూడొచ్చు కానీ, ఆ పాటలన్నీ ఇంట్లో పాడుతుందే! అదే తలనొప్పి వ్యవహారం. ఆ మధ్య నా స్నేహితుడు కొడుకుని వెంటబెట్టుకుని మా ఇంటికి వచ్చాడు. ఈవిడ పక్క గదిలోనించి 'అబ్బ నీ తియ్యనీ దెబ్బ. మోత మోతగా వుందిరా అబ్బా!' అంటూ ఒకటే రోద. ఆ కుర్రాడేమో ఒంటెలా మెడ తిప్పి దొంగ చూపులు చూడ్డం ప్రారంభించాడు. నాకు జాలేసి పక్క గదిలో మీ అత్తయ్య ఉంది నాయనా, వెళ్ళి పలకరించిరా పో అని చెప్తే మొహం ఇంత చేసుకున్నాడు. కృష్ణా రామా అనుకోవలసిన రోజుల్లో ఈవిడకెందుకండీ ఈ కుర్రచేష్టలు?"
ఉసూరుమని తల పట్టుకున్నాడు వరాహమూర్తి. మళ్ళీ మొదలయింది సంవాదం.
ఇక లాభం లేదు. వీళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తానే మాట్లాడాలి.
"చూడండీ, మీ ఇద్దరి మాటలు విన్న తర్వాత నాకు అర్ధం అయింది ఏమిటీ అంటే, మీవన్నీ చిన్న సమస్యలు. ఇన్నాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఆవిడ మాత్రం ఉండే వారు. పగలంతా మీరు మీ వ్యాపకాలలో ఉండేవారు. రిటైర్ అవడంతో కాస్త చిరాగ్గా ఉంది. ఈ మార్పు సమయంలో ఈ కీచులాటలు సర్వసాధారణమే. ఈ మాత్రానికే విడాకులు అవసరం లేదు. గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకు?" నచ్చచెప్పజేశాడు.
"అ హ హ అదికాదండీ" అంటూ ముక్తకంఠంతో అరిచిన వారిద్దరినీ వారించాడు.
"నా దగ్గరికి వచ్చారు. కాబట్టి నా సలహా పాటించి చూడండి. ఈ పరిస్థితిలో నేనే కాదు, మరే లాయరైనా ఇదే సలహా చెప్తాడు".
"మీకు ఆర్ధికంగా ఇబ్బంది లేదు కాబట్టి ఇంకో టీవీ కొనుక్కోండి. దాంతో సగం సమస్య పరిష్కారం అవుతుంది. పరస్పరం మాట్లాడుకోవడం మానెయ్యండి. అవసరం అయితే నాలుగు మాటలు మాట్లాడుకోండి. రెండు గదులున్నాయి కదా మీ ఇంట్లో. ఎవరి సామాన్లు వారు సర్దుకుని చెరో గదిలో ఉండండి. మీరు మామూలుగా వంటచేసి టేబుల్ మీద పెట్టెయ్యండి. ఇద్దరూ విడివిడిగానే భోజనం చెయ్యండి. బజారు పన్లూ గట్రా ఆయన్ని చెయ్యనివ్వండి. మాట్లాడనూ వద్దు. పోట్లాడుకోనూ వద్దు. ఇలా ఒక ఆరు నెలలు గడిపి తర్వాత మళ్ళీ నా దగ్గరకు రండి. అప్పుడు సీరియస్ గా ఆలోచించి అవసరం అయితే తప్పకుండా విడాకులు ఇప్పిస్తాను" అన్నారు. కాస్త గంభీరంగా.
సణుక్కుంటూనే వెళ్ళిపోయారు దంపతులిద్దరూ.
వాళ్ళు వెళ్ళాక తనివితీరా నవ్వుకున్నాడు లాయరు. లోపలికి వెళ్లి భార్యకి చెప్పాడు.
అంతా విని, 'అయ్యో నన్నూ పిలిస్తే నేనూ ఆనందించి ఉండేదాన్ని" అంది ఆవిడ.
"ఈసారి వస్తారుగా. అప్పుడు పిలుస్తానులే" అని హామీ ఇచ్చాడు లాయరు.
ఆర్నెల్లు గడిచిపోయాయి.
ఆవేళ ఆదివారం, వరాహమూర్తి ఇంట్లోనే వున్నాడు.
'అక్కడెక్కడో బట్టల సెకండ్స్ సేల్ పెట్టారు. పదండి వెళ్దాం' అని భార్య పోరు పెట్టడంతో భార్యా సమేతంగా బయలుదేరి వెళ్ళాడు.
అక్కడిదాకా వెళ్ళాక, "చూడూ, లోపల రష్ గా ఉంది. నాకు చిరాగ్గా ఉంటుంది. నువ్వెళ్ళిరా నేనిక్కడ వెయిట్ చేస్తాను" అన్నాడు.
"అదేమిటి? ఇంతదాకా వచ్చి లోపలికి రారా? సెలక్షన్ లో సాయం చేద్దురుగాని రండి" అంది ఆవిడ.
సమాధానం చెప్పబోతూ పరిచితకంఠాలు వినిపించడంతో అటు చూశాడు. వాళ్ళే "ఇదుగో ఆ వేళ నేను చెప్పలేదూ, వీళ్ళే" అంటూ దగ్గరికి వెళ్లి పలకరించి నమస్కారం పెట్టాడు.
ఈయన్ని చూడగానే, "మీరా మహానుభావా! నూరేళ్ళు ఆయుష్షు, మీ గురించే అనుకుంటున్నాను. మీరు పెట్టిన ఆర్నెల్ల గడువు అయిపోయింది. ఇవ్వాళో, రేపో రావాలి మీ దగ్గరకు అనుకుంటున్నాం. మీరే కనిపించారు. ఎప్పుడు రమ్మంటారు విడాకుల కోసం" అన్నాడు శ్రీనివాసరావు.
ఉసూరుమన్నాడు వరాహమూర్తి. అయితే సమస్య పరిష్కారం అవలేదన్నమాట. "మిమ్మల్ని మాట్లాడుకోకుండా విడిగా ఉండమన్నాను కదా ఏమైంది?" అడిగాడు.
"ఏమవుతుంది ఎత్తుభారం. వెనకటికి ఎవడో, దొంగ కొబ్బరి చెట్టు ఎక్కితే దిగకుండా ఉండాలని చెట్టు మొదలుకి మడిబట్ట కట్టాడట. అలా వుంది. మాట్లాడకపోతే ఎలా జరుగుతుంది చెప్పండి. చీటికీ మాటికీ ఇదుగో ఎక్కడున్నావ్ అంటూ కేకలు పెట్టడం తప్పించి ఏనాడైనా తన పని తాను చేసుకుంటేగా! మాట్లాడ్డం మానేసేసరికి నానా కంగాళీ అయిపోయింది. ఒళ్ళు తుడుచుకునే తువ్వాలు కనిపించక లుంగీతోనే ఒళ్ళు తుడుచుకొని, మరో లుంగీ కనిపించక పేంటుతోనే తిరిగారు ఒకరోజంతా. కాఫీ తాగాలనిపించిందట. నన్నడగడానికి అహం అడ్డొచ్చి తానే కాఫీ కలుపుకోవాలనుకున్నారట. ఫ్రిజ్ తీసి పాలకి బదులు పెరుగ్గిన్నె తీసికెళ్ళి పొయ్యిమీద పెట్టి పాలు విరిగిపోయాయని బాధపడి, విరుగుడుతో కోవా చేద్దామని ఆ పెరుగు ఇరగపెట్టి, దాన్లో ఇంత పంచదార పోసి, దాన్ని మాడబెట్టి నానా ఆగం చేసిపెట్టారు. మరో రోజు టీ డికాషన్ మిగిలిపోతే గిన్నెను డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. అది చారనుకుని అన్నంలో పోసుకున్నారు. ఆయన్నలా వదిలేస్తే కొంప కొల్లేరు అయిపోతుందని విధిలేక మాట్లాడటం మొదలు పెట్టాను" పద్మావతి పరిస్థితి అంతా వివరించింది.
"అదేం కాదులెండి ఏదో అలవాటు లేని వ్యవహారం కాబట్టి కాస్త అటూ ఇటూ అయిన మాట వాస్తవమే. నాల్రోజులుంటే నేనే నేర్చుకునే వాడిని. అసలు రహస్యం ఏమిటంటే, ఈవిడ ఇంట్లో పులి. బయటకెళ్తే పిల్లి. ఈవిడ ప్రజ్ఞ వినండి మరి. ఆ మధ్య మా స్నేహితుడి ఇంటికి వెళ్ళాలని బయలుదేరాం. పళ్ళు కొందామని ఇంటికి దగ్గరలో ఉన్న జంక్షన్లో ఆటో ఆపించాను. మాట్లాడకూడదనుకున్నాం కదా! అయినా, అంతకు ముందు అరడజను సార్లు వెళ్ళిన ఇల్లేకదా, ఆ మాత్రం వెళ్ళ లేదా అనుకుని నా దోవన నేను వెళ్ళిపోయాను. పావుగంట తర్వాత తిరిగివస్తే ఇంకా కుక్క పిల్లలా జంక్షన్ లోనే తిరుగుతోంది. 'పీ. రంగారావు గారిల్లు ఎక్కడో తెలుసా? పీ. కామాక్షమ్మ గారిల్లు ఎక్కడో కాస్త చెప్తారా' అని అందర్నీ అడుగుతోంది. ఇంటి నెంబరు చెప్పమంటున్నారు వాళ్ళు. ఆ మాటకొస్తే మా ఇంటి నెంబరే తెలీదు, ఈవిడకీ. ఇక ఊళ్ళో వాళ్ళ ఇంటి నెంబరేం చెప్తుంది. బుర్ర గోక్కుంటూ నుంచుంటే పోనీకదా అని నియమోల్లంఘన చేసి, నాకు తెలుసు పదా వెళ్దాం అని తీసికెళ్ళాను" బదులు తీర్చుకున్నాడాయన.
"ఇది మరీ బాగుంది. ఎప్పుడో ఆర్నెళ్ళ కిందట వెళ్లాం కాబట్టి తడబడ్డాను. అందులోనూ ఈ ఊరు పాపం పెరిగినట్లు పెరిగిపోతోంది. ఈ పూట చూస్తే రేపటికి మారిపోతోంది" అందావిడ.
వాళ్లనలా వదిలేస్తే చెప్పుకుంటూ పోతారు. కాబట్టి అడ్డుకున్నాడు లాయరు "ఇప్పుడు ఇక్కడికి ఎందుకొచ్చారు?" అడిగాడు.
"ఏం చెప్పమంటారండీ ఈ మధ్య ఈవిడకి ఈ సేల్స్ చుట్టూ తిరిగే పిచ్చి పట్టుకుంది. అందుకే వచ్చాం" చెప్పాడాయన.
"అంతేలెండి. పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అంటారే అట్లా ఉంది ఈయన ధోరణి. వేసవి కాలం వస్తోంది. కాటన్ షర్టులు చిరిగిపోయాయి అని ఇక్కడికి తీసుకొస్తే నన్ను ఉద్ధరించడానికి వచ్చినట్లు ఆ వాలకం చూడండి"?
"అయ్యా అదో వంక నాకు షర్టులు కొనాలంటే ఇక్కడికే రావాలా? మామూలు షాపుల్లో దొరకవా?" ఆయన సందేహం.
"ఎందుకు దొరకవు? కాకపోతే అక్కడ ధరలు ఎక్కువ. ఆ ధరలు వినగానే ఈయన 'ఓమ్మో ఓర్నాయనో ఇంత ధరే? నా చిన్నతనంలో మా తాతయ్య అయిదు రూపాయలిస్తే దాంతో ఒక సిల్కు చొక్కా రెండు మామూలు చొక్కాలూ కొనుక్కొని, మిగిలిన డబ్బుతో పప్పుండలు కొనుక్కుతిన్నాను' అంటూ గత వైభవం వర్ణిస్తూ సొదపెట్టడం, వాళ్ళు నవ్వుకొని, సరేలెండి అంకుల్ ఇక మీరు వెళ్తే మేము షాపు కట్టేసుకుంటాం అనడం. ఈ వినోదం అంతా ఎందుకు. ఇక్కడ చౌకగా దొరుకుతాయి అని ఇక్కడికి వచ్చాం" ఆవిడ సమాధానం.
"ఓలి తక్కువ అని గుడ్డిదాన్ని పెళ్ళిచేసుకుంటే కుండలన్నీ పగలగొట్టిందన్నట్లు ధర తక్కువ అని కొని ఆ మధ్య పండక్కి నాకో జత బట్టలు కుట్టించింది. నల్ల పేంటూ, గళ్ళ చొక్కా నీళ్ళలో పెట్టగానే గళ్ళు నీళ్లల్లో కరిగిపోయాయి. చొక్కామాత్రం బయటికి వచ్చింది. ప్యాంటు మాత్రం రంగు నిప్పులా ఉంది. కాకపోతే మూరెడు కుంగింది అంతే. ఈ సారి కొడుకూ, అల్లుడూ వస్తే, వాళ్ళకిస్తే బర్ముడాలాగా వాడుకుంటాడు. కుట్టు కూలీ గిట్టుబాటు అవుతుంది అనుకొంటున్నాను" అన్నాడాయన.
నవ్వాపుకున్నాడు లాయరు.
"పోనీ ఆయన బట్టలేవో ఆయన్నే కొనుక్కోనిస్తే పేచీ ఉండదు కదండీ" సలహా చెప్పారు.
"ఆ వైభోగమే అయింది నాయనా. ఆ మధ్య తానే వెళ్ళి రెడీమేడ్ షర్టు కొనుక్కొచ్చారు. బోలెడంత డబ్బు పోసి, దాన్నిండా బొమ్మలూ, పువ్వులూ, పైగా అది వేసుకుంటే చిరంజీవిలా ఉంటారు. అని సేల్స్ మెన్ చెప్పాడట. అతగాడు చెప్పేడే అనుకోండి ఈయన వివేకం ఏమైందిట? అది తొడుక్కుని బయటికి వెళ్తే ఇంకేమైనా ఉందా! ఆ బొమ్మల చొక్కా వేసుకున్నాయనే పద్మావతమ్మ గారి భర్త అని నలుగురూ నవ్వుకోరూ! ఆ చొక్కా చించి టీవీ కవరు కుట్టాను" అంది ఆవిడ వెంటనే.
"అందుకే అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అని ఈవిడని వెంటబెట్టుకొచ్చాను" అన్నాడాయన.
"మా ఆవిడా ఏదో బట్టలు కొనాలంటే ఇలా వచ్చాను. ఈమె మా ఆవిడ" అని పరిచయం చేశాడు లాయరు.
నమస్కారాలు అయ్యాక, "లాయరుగారూ ఇక్కడే కనిపించారు కాబట్టి మళ్ళీ ఫోన్ లో మాట్లాడ్డం ఎందుకూ? ఎప్పుడు రమ్మంటారు విడాకులకి?" అని అడిగాడు శ్రీనివాసరావు.
"బాబ్బాబు కాస్త త్వరగా వచ్చే ఏర్పాటు చెయ్యి నాయనా నీకు పుణ్యం ఉంటుంది. పడలేక పోతున్నాను ఈయనతో" అంది పద్మావతి.
"అవునండి. కాకపోతే కాస్త ఫీజు ఎక్కువ తీసుకోండి. కానీ, త్వరగా పని ముగిసేలా చూడండి" ఆ విషయంలో మాత్రం భార్యతో ఏకీభవించాడాయన.
"అలా ఎలా కుదురుతుంది సార్? విడాకులు కావాలంటే బోలెడన్ని రూల్సు ఉన్నాయి. భార్యాభర్తలు కొంతకాలం విడివిడిగా ఉండాలి. ఇంకా సవాలక్ష షరతులున్నాయి. చూద్దాంలెండి. మరో ఆర్నెల్లు ఆగి రండీ" అన్నాడు లాయరు.
"బాగుందయ్యా నీ వాయిదాలూ నువ్వూనూ, ఈ లెక్కన నాకు విడాకులు ఎప్పటికి వచ్చేను? ఏదో ఉపాయం ఆలోచించాలి మీరే. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వకపోవడం అంటే ఇదే. సర్లే. నేను లోపలికి వెళ్తున్నాను. జనం పెరుగుతున్నారు. ఇంకాసేపుంటే లోపల కాలు పెట్టలేం" అంటూ వెళ్ళిపోయింది ఆవిడ.
"ఈ మడత పేచీలన్నీ మనకేనండీ. అమెరికాలో అయితే సుఖం. ఇట్టే విడాకులు వచ్చేస్తాయట. మా అబ్బాయి చెప్పాడు. సరే కానీండి ఏం చేస్తాం. మీ ప్రయత్నం మాత్రం మానకండి. నేనూ వెళ్తా, మా ఆవిడ బొత్తిగా అయోమయం మేళం. ఆ మధ్య కూరల మార్కెట్లో నాలాగే నిండు నీలం పేంటూ, లేత నీలం షర్టు వేసుకున్నవాడెవడినో నేననుకుని, కాస్త పర్సు పట్టుకోండి అని పర్సు వాడి చేతికిచ్చింది. అది పుచ్చుకుని వాడదేపోత పోయాడు. అదృష్టవశాత్తూ పర్సులో డబ్బు ఎక్కువ లేదు. ఇప్పుడలాంటి పనే చేసిందంటే క్షవరం అవుతుంది" అనేసి వెళ్లిపోయాడు.
అంతవరకూ నవ్వాపుకుంటూ ఉన్న లాయరుగారి భార్య మనసారా నవ్వుకుంది. "కొంపతీసి వాళ్ళకు విడాకులు గానీ ఇప్పిస్తారా?" భర్తని అడిగింది.
"మన సంస్కృతికీ, మధురమైన వివాహ బంధానికి ప్రతీకలు ఈ దంపతులు, నేనేకాదు నిలువెత్తు ధనం పోసినా చూస్తూ చూస్తూ ఏ లాయరూ వీళ్ళకి విడాకులు ఇప్పించడు. ఈ దేశంలో ఇటువంటి వారికి విడాకులు ఇవ్వబడవు" నిర్ధారించి చెప్పాడు లాయరు వరాహమూర్తి.
*****
(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)