ఏంజెల్ - పి.కె. జయలక్ష్మి

Enjel

సాయంత్రం ఆరు గంటలకి ఆఫీస్ నించి వచ్చి హడావిడి గా బ్యాగ్ సర్దుకుంటున్న అద్విత్ ని ఆశ్చర్యం గా చూసాను. ఏంటో అంత బిజీ? అనుకుంటూ. నేనంత దగ్గరగా ఉన్నా పట్టించుకోకపోవడంతో నాక్కొంచెం అలకొచ్చింది. “హేయ్ డియర్! కోపమా? కామ్ గా ఉన్నావ్? ఏం లేదురా ముఖ్యమైన పని తగిలింది ఆఫీస్ లో. నేను అర్జెంట్ గా కాంప్ వెళ్ళాలి. ఎల్లుండి రాత్రికి వస్తాను.” అన్నాడు నన్ను దగ్గరకి తీస్కుంటూ. నాకు చాలా బెంగగా అన్పించింది ఒక్కసారిగా. అది గమనించినట్టు “డోంట్ వర్రీ స్వీటీ, నాకూ నిన్ను వదిలి వెళ్లాలంటే బాధగానే ఉంది. వచ్చేస్తాగా... రాత్రి తోడుగా పని పిల్ల ఉంటుంది. ఒక్కదానివే బైటకి వెళ్లకు. అసలే తెల్లగా అందంగా ఉంటావు. దిష్టి తగులుతుంది. జాగ్రత్త మరి... టైమ్ కి తిను. ఎంజాయ్ .” నవ్వుతూ ముద్దు పెట్టుకుని ఫోన్లో ఎవరికో ఏదో పురమాయిస్తూ వెళ్లిపోయాడు అద్విత్. నేను గేట్ దాకా సాగనంపి వచ్చా.

అద్విత్ జీవితం లోకి నేను ప్రవేశించి పది నెలలవుతుందేమో! నన్ను ఎంత అపురూపంగా చూసుకుంటాడో? నేనంటే వాళ్ళింట్లో ఎవరికీ అంతగా ఇష్టం లేదు. అదీ కాక నేను అడుగు పెట్టిన వారానికే అద్విత్ కి ట్రాన్స్ఫర్ అవడం వాళ్ళకి ఇంకొంచెం కోపం పెంచింది. తనింట్లో వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా నన్ను తన జీవితం లోకి ఆహ్వానించిన అద్విత్ అంటే నాకూ చాలా ప్రాణం... నన్ను తీస్కోని కాకినాడ వచ్చేశాడు. ఇద్దరమే ఇంట్లో!. పొద్దస్తమానం తనకి (ఆఫీస్ టైమ్ లో తప్ప) నా తోడిదే లోకం. నేనొచ్చిన వేళా విశేషం ప్రమోషన్ రావడంతో నన్ను “ఏంజెల్” అనే పిలుస్తాడు.

ఏదో తిన్నానన్పించి పడుకున్నా గాని చాలా సేపటిదాకా నిద్ర పట్టలేదు. మర్నాడు కూడా రోజంతా భారంగానే గడిచింది. రోజూ ఉదయాన్నే ఇద్దరం వాకింగ్ కి వెళ్ళేవాళ్లం. ఏం చేస్తున్నాడో ఏంటో ? చాలా వెలితిగా అన్పిస్తోంది. సాయంత్రం మరీ చిరాగ్గా అన్పిస్తే ఇంటి ముందు పార్క్ కి వెళ్ళాను. అప్పుడప్పుడు వస్తూ ఉంటాం ఇక్కడికి నేను, అద్విత్. అక్కడ పిల్లలతో కాసేపు ఆడాను. చీకటి పడ్డంతో వాళ్ళూ బాయ్ అంటూ ఇళ్ళకి పరిగెత్తారు. నాకయితే ఇంటికి వెళ్ళ బుద్ధి కాలేదు. కాసేపు దూరంగా నడవాలన్పించి అలా నడుస్తూ ఓపెన్ ఎయిర్ థియేటర్ దాకా వెళ్లిపోయాను. లోపల చిన్న పిల్లల ప్రోగ్రాం అవుతోంటే చూస్తూ నిద్ర లోకి జారాను. నిద్రలో అద్విత్. “నీ కళ్ళు ఎంత బాగుంటాయో తెల్సా!” అంటూ నన్ను ప్రేమగా దగ్గరకి తీసుకుంటున్నాడు. మళ్ళీ కాసేపటికి “చీకట్లో ఒక్కదానివే ఎందుకు బైటకి వచ్చావ్?” అని కోపంగా అడుగుతున్నాడు. ఉలిక్కిపడి చూసే సరికి చాలా టైమ్ అయినట్టుంది. పనిమనిషి కంగారు పడుతుందో ఏంటో? దానికి తెలియదు కదా తను బైటకి వచ్చినట్టు. అద్విత్ ఫోన్ చేస్తే? బాబోయ్ త్వరగా ఇల్లు చేరాలి. అనుకుంటూ పరుగు లాటి నడకతో ఇంటి ముఖం పట్టాను. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. చాలా టైమే అయ్యుంటుంది. అమావాశ్య రోజులేమో చాలా చీకటి గా కూడా ఉంది. ఎందుకో భయమన్పించింది. హఠాత్తుగా టీవి లో నిత్యం విన్పించే వార్తలు గుర్తొచ్చాయి…”ఆడవారిపై అత్యాచారాలు, అఘాయిత్యాలు” అంటూ! అద్విత్ పేపర్ చదువుతూ “సమాజం లో ఆడవాళ్ళకి రక్షణ లేదు. అర్ధరాత్రే కాదు పగటి పూట కూడా స్త్రీలు ఒంటరిగా బైటకి వెళ్లలేని దుస్థితి” అనే మాటలు జ్ఞాపకానికొచ్చాయి. “ఒక్కదానివే వెళ్లకు” అని మరీమరీ చెప్పినా నేను విన్పించుకోలేదు.. ఇప్పుడెలా ఇల్లు చేరేది? ఎంతకీ ఇల్లు రాదేంటి భగవంతుడా? అనుకుంటూ నడుస్తున్నా.

ఈలోపల వెనకేదో ఎండుటాకుల మీద అడుగులు పడుతున్న శబ్దం. ఎవరో ఫాలో అవుతున్నారు. గుండె చిక్కబట్టుకొని ఓరగా చూసా... నాలుగు నీడలు... అయిపోయింది ఇవాల్టితో నా పని. నిర్భయ గుర్తొచ్చింది. అద్విత్ నన్ను క్షమించు నీ మాట పెడ చెవిని పెట్టినందుకు. నన్ను ఎంతగా ప్రేమించావో? నువ్వొచ్చేసరికి నేనసలు ఈ లోకం లో ఉంటానో లేదో? నడక వేగం పెంచి పరుగుగా మార్చాను. వెనకాల ఆకారాలు దగ్గరకి వచ్చేశాయి... బాగా... బాగా దగ్గరికి... ఇంక శక్తి లేదు... నా పని అయిపోయింది. కళ్ళు తిరిగినట్టయ్యి నించున్న చోటే కూలబడిపోయాను.

కళ్ళు తెరిచే సరికి నా చుట్టూ రౌండప్ చేసిన ఆకారాల్లో ఒకటి దగ్గరకి వచ్చి మా భాషలో “డోంట్ వర్రీ నీకేం భయం లేదు. ఇంతకీ మీ ఇల్లెక్కడ? నిన్ను జాగ్రత్త గా ఇల్లు జేరుస్తాం.” అనేసరికి ఆశ్చర్యంతో బిత్తరచూపులు చూశాను. వాటికీ అర్ధమైనట్టుంది “చూడమ్మా... ఈ ప్రపంచాన్ని చూసి ఒక ఆడదానిగా నువ్వు భయపడ్డం సహజమే... కానీ మేం నీకు సాయం చేయడానికే వచ్చాం. నీ శీలానికి ఎటువంటి హాని తలపెట్టం. ఎందుకంటే మనం కుక్కలం... మనుషులం కాదు. మనకి విశ్వాసం తో పాటు నీతి కూడా ఒకటుంది.!” అంటూ ఇంటి వరకు వచ్చి దిగ బెట్టి వెళ్లిపోయాయి. నోరు లేకపోయినా ఈ మనుషుల కంటే మీరే ఎంతో నయం అని తరచుగా అనే అద్విత్ మాటలు గుర్తొచ్చాయి... మా జాతి సంస్కారం నన్ను ముగ్ధురాల్ని చేసింది. దేవుడా మా కుక్క జాతి ని ఎప్పుడూ ఇలాగే, ఇంత మంచిగానే ఉండనీ అనుకుంటూ లోపలికి అడుగు పెడుతున్న నన్ను పనిమనిషి దగ్గరికి తీస్కుని “ఏయ్ ఏంజెల్ ఎక్కడికి పోయావే చెప్పా పెట్టకుండా. వచ్చి అన్నం తిను” అంటూ ప్రేమగా కసురుకుంది. టేబిల్ మీద ఉన్న ఫోటోఫ్రేమ్ లో నన్నెత్తుకుని నవ్వుతున్న అద్విత్ ని చూసి గారాలు పోతూ తోకాడించాను.

***

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు