వ్యసనం - నారంశెట్టి ఉమామహేశ్వరరావు

vyasanam

దిత్యపురంలో శివయ్య అనే ధనికుడు ఉండేవాడు. అతడికి మంచిమనసుతో బాటు ఇతరులకు సాయపడేగుణం ఉంది.

ఒకసారి పొరుగూరు రామవరం వెళ్ళి పని చూసుకుని తిరిగి వస్తుండగా వెనుక నుండి తననెవరో పిలిచినట్లయితే ఆగాడు శివయ్య. ఒక యువకుడు తన వైపే వస్తూ కనిపించాడు. శివయ్య ఆగి నిలబడి “నన్నే పిలుస్తున్నారా? నాతో పనేమైనా ఉందా?” అని అడిగాడు.

దానికా ఆ యువకుడు శివయ్యని చూసి ‘పొరపాటు జరిగిందండీ. మిమ్మల్ని వెనుక నుండి చూసి మా మామయ్య మధుకరుడు అనుకున్నాను’ అన్నాడు నొచ్చుకుంటూ.

దానికి శివయ్య ‘ఫరవాలేదు బాబూ. మీ మామయ్యది ఏ ఊరు? నువ్వెక్కడ ఉంటావు?’ అని అడిగాడు.

దానికా యువకుడు’ నా పేరు సుధన్వుడు. నాది పదిమైళ్ళ దూరంలో ఉన్న విష్ణుపురం. ఇక్కడకి మా బంధువుల వివాహం ఉండి వచ్చాను. మిమ్మల్ని చూసి మామయ్య వచ్చాడని ఆశపడ్డాను’ అని బాధ పడుతూ చెప్పాడు.

శివయ్యకు ఆ యువకుడి మాటతీరు, ప్రవర్తన బాగా నచ్చింది. ‘అంత నిరాశ ఎందుకు బాబూ. నన్ను మీ మామయ్య అనుకో” అని నచ్చజెప్పాడు. అప్పుడు సుధన్వుడు ‘మిమ్మలను మామయ్య అని పిలిస్తే మీకు ఇబ్బంది లేదు కదా. ఎప్పుడైనా మామయ్యని చూడాలని కోరిక కలిగితే చాలా దూరంగా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళలేను. మీలో అతడిని చూసుకోడానికి మీ ఇంటికి వస్తే మీకు అభ్యంతరం లేదు కదా’ అని అడిగాడు.

సుధన్వుడి మాటలు విని ‘దానికేం భాగ్యం. నిరభ్యంతరంగా రావొచ్చు’ అని తన చిరునామా ఇచ్చాడు శివయ్య. అది మొదలు నెలకు రెండుమూడు సార్లు శివయ్య ఇంటికి వెళ్తుండేవాడు సుధన్వుడు.

తన మీద అభిమానంతోకష్టపడి వస్తున్నాడు అన్న తలంపుతో సుధన్వుడికి మంచి భొజనం ఏర్పాటు చేసేవాడు. దారి ఖర్చులకి కూడ ధనసహాయం చేసి పంపేవాడు శివయ్య. అలా చాలా రోజులు గడిచాయి.

కొన్నాళ్ళ తరువాత తన మిత్రుడి ఇంట్లో వివాహానికి చిలకపాలెం వెళ్ళాడు శివయ్య. పెళ్ళిమండపం అతిథులతో నిండి హడావుడిగా ఉంది. అలాంటప్పుడు సుధన్వుడుని అక్కడ చూశాడు శివయ్య. అతడిని పలకరించి వద్దామని అటువైపు నడిచిన శివయ్యకి సుధన్వుడు మరొక వ్యక్తిని మామయ్య గారూ అని పిలుస్తూ వెళ్ళడం కనిపించింది.

“అతడే సుధన్వుడి అసలు మామయ్యేమో. నేను కూడా పరిచయం చేసుకుని సుధన్వుడికి అతడంటే ఎంతిష్టమో చెబుతాను’’ అనుకున్నాడు మనసులో శివయ్య. నాలుగడుగులు ముందుకి వేసేసరికి అవతలి వ్యక్తిని సమీపించిన సుధన్వుడు ‘అయ్యయ్యో మిమ్మల్ని మా మామయ్య అనుకున్నాను’ అని నొచ్చుకున్నాడు. మిగతాదంతా అప్పుడు తనతో చెప్పినట్టే చెప్పాడు. చిరునామా అడిగి తీసుకున్నాడు.

అతడు కూడ సుధన్వుడి మామయ్య కాదని తేలడంతో నిట్టూర్చాడు శివయ్య. సుధన్వుడిని చూడనట్లే ఒక ప్రక్కన కూర్చొని ఇకముందు ఏం జరుగుతుందో చూడాలనుకున్నాడు శివయ్య. ఆ వ్యక్తి దూరం కాగానే “బాబాయి గారూ’ అని పిలుస్తూ మరొకరి వెనుక వెళ్ళాడు సుధన్వుడు. రహస్యంగా వెంబడించాడు శివయ్య. తనతో మొదటిసారి కలిసినప్పుడు చెప్పిన మాటలనే ఇప్పుడు చెప్పాడు సుధన్వుడు. శివయ్యకి సుధన్వుడి ప్రవర్తన అర్ధం కాలేదు.

శివయ్యని చూసిన శరవణుడు అనే అతిథి అతడి ప్రక్కనే కూర్చుంటూ ’సుధన్వుడు మీకు తెలుసా? అతడినే ఎందుకు చూస్తున్నారు’ అని అడిగాడు. తనకతడు తెలుసని చెబుతూ ఎలా పరిచయం కలిగిందో చెప్పాడు శివయ్య.

దానికి శరవణుడు నవ్వుతూ “మిమ్మల్ని కూడ మాటల్తో మభ్యపెట్టి బుట్టలో వేసుకున్నాడా? సుధన్వుడు నాకు దూరపుచుట్టం. ఏ పనీ చెయ్యకుండా తిరిగే సోమరిపొతు. పెళ్ళిల్లు, పండుగల సమయాల్లో వచ్చిన కొత్తవాళ్ళతో వరుసలు కలిపి వారింటికి రాకపోకలు సాగిస్తాడు. రూపాయి ఖర్చు లేకుండా నెలంతా గడిపేస్తాడు. వాడి చుట్టాలంతా మా వూరిలోనే ఉన్నారు. వాడికిదంతా ఒక వ్యసనం. ఎంత చెప్పినా మానడు’ అన్నాడు నవ్వుతూ. అది విన్న శివయ్య సుధన్వుడికి కనిపించకుండానే ఇంటికి వెళ్ళిపోయాడు.

వారం తర్వాత తన ఇంటికి వచ్చిన సుధన్వుడికి ఎప్పటిలాగే భోజనం పెట్టించాడు. పిచ్చాపాటీ మాట్లాడుతుండగా శివయ్య తమ్ముడి కొడుకు అక్కడకి వచ్చాడు. అతడిని చూడగానే శివయ్యకి విపరీతమైన కోపం వచ్చింది. ‘నీకు బుద్ధి లేదా సోమరిపోతు వెధవా. కొత్తవాళ్లతో పరిచయం చేసుకొని వరుసలు కలిపి వాళ్ళింటికి వెళ్ళి తేరగా తిని వస్తున్నావట. దేవుడు నీకు కాళ్ళూ చేతులు ఇచ్చింది కష్టపడి పని చేసి పొట్ట పోషించుకోడానికి. మాటలతో గడిపేసి తిరగడానికి సిగ్గుగా లేదా? ఈసారి నువ్వు ఇంకెవరి ఇంటికైనా వెళ్ళావని తెలిసిందో నిన్ను గొయ్యి తీసి కప్పేట్టేస్తాను. మోసం చెయ్యడమంటే నాకు నచ్చదని నీకు తెలుసు కదా!” అన్నాడు కళ్ళెర్రజేసి.

ఆ యువకుడు తల దించుకుని సిగ్గుపడుతూ వెళ్ళిపోయాడు. అయితే ఆ మాటలు సుధన్వుడికి ఎక్కడో సూటిగా తగిలాయి. తన విషయం తెలిస్తే తనకీ అదే గతి పడుతుందని భయపడి అప్పటి నుండి అక్కడకి రావడం మానేసాడు. అంతే కాకుండా చేతనయిన పని చేసుకుంటూ పొట్టపోషణ చేసుకోడానికి అలవాటుపడ్డాడు.

అయితే సుధన్వుడి ముందు ఎవరినైతే శివయ్య తిట్టాడో ఆ యువకుడు ఏ తప్పూ చెయ్యలేదు. అదంతా సుధన్వుడిలో మార్పు తీసుకురాడానికి శివయ్య ఆడిన నాటకమని సుధన్వుడికి తెలిసే అవకాశమే లేదు.

నీతి: దేవుడిచ్చిన ఆరోగ్యమైన శరీరాన్ని చక్కగా వినియోగించుకొని సంపాదించుకొని బ్రతకాలి కానీ ఇతరులను మోసం చేయకూడదు.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు