ముందు మాట :
ఈ కధ రాయడానికి కారణం నేను అనుభవించినది... పిల్లలతో వచ్చిన భక్తులు పడ్డ యాతన కళ్ళతో చూసినది. భక్తులతో ప్రవర్తించిన తీరు చూసి బాధపడుతూ ఇది ఇలాగే జరిగితే భవిష్యత్తు లో దేవుడి మీద భక్తి పోతుందేమోనని భాధతో రాసిన కధ. కుబేరుడు - శ్రీనివాసుల సంవాదం కధకి సపోర్టు గా తీసుకున్నది మాత్రమే. అంతే గాని దేవుడిని కించ పరచాలని గాని, ఎవరినీ ఉద్దేశించి గాని రాసినది కాదని దీనివల్ల ఎవరివైనా గాని, భక్తులకు మనోభావాలు దెబ్బతింటే మనస్పూర్తిగా మన్నించమని కోరుతూ..
వైకుంఠ౦ లో శ్రీనివాసుడు దిగాలుగా వున్నాడు.
లక్ష్మి దేవి అక్కౌంటు బాలన్స్ నిల్ అయ్యే పరిస్థితి వచ్చిందని చాలా చిరాగ్గా వుంది.
ఇంతలో కుబేరుడు ‘శ్రీనివాసా.. శ్రీనివాసా...’ అంటూ వచ్చాడు.
శ్రీనివాసుడు కుబేరుడుని చూసి ‘రండి..స్వామీ.. చాలా కాలానికి వచ్చారు. రండి‘ అన్నాడు.
‘నేను మీ మర్యాదల కోసం రాలేదు. ఇంత కాలం సమయానికి వడ్డీ కడుతున్నారని నేను వచ్చే అవసరం లేకపోయింది. ఈ మధ్య మీరు వడ్డీ కట్టడం మానేశారు. అందుకే నేను రావసలి వచ్చింది.
‘స్వామి భూలోకంలో పరిస్థితి మీకు తెలుసుగా. భక్తులు అందరు తిరుపతి రావడం మానేశారు. దాంతో హుండీ లో దమ్మిడీ పడటం లేదు. ఆదాయం తగ్గి మీకు వడ్డీ కట్టడం ఆలస్యం అయింది.’ అన్నాడు శ్రీనివాసుడు
‘అదంతా నాకనవసరం. ఇప్పుడు వడ్డీ కట్ట లేని వారు, రేపు అసలు ఏం కడతారు. మీకు వారం రోజులు టైం ఇస్తున్నా.. అసలు, వడ్డీ రెండు వెంటనే కట్టే ఏర్పాటు చెయ్యండి’ అన్నాడు కుబేరుడు.
‘ఇక్కడ వడ్డీ కట్టడానికే నడ్డి విరుగుతోంది. అసలు కూడానా.. అదీ వార౦ లోనా... కష్టం.’ అన్నాడు
‘సరే.. మీరు ఏడు కొండల వారు కనక ఏడు వారాలు టైం ఇస్తున్నా.. ఈ లోగా సగమయినా ఏర్పాటు చెయ్యండి’ అంటూ వెళ్లి పోయాడు. కుబేరుడు
‘స్వామీ అసలేం జరిగింది’ అంటూ అడిగింది లక్ష్మీ దేవి.
‘శ్రీనివాసుడు నేను చెప్పడం ఎందుకు నువ్వే చూడు’ అంటూ కిందకి చూపించాడు.
అది 2020.
తిరుపతి కొండ మీద ఒక్క భక్తుడు లేడు. ఖాళీ గా వుంది.
ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోడానికి ఒక్కడూ రావడం లేదు. కొండమీదకి కిందకి బస్సులు తిరగడం లేదు.
తిరుపతి దేవస్థానంలో కొంతమందిని ఉద్యోగాలనుంచి తీసేశారు. మిగిలిన ఉద్యోగులకు జీతాలు లేవు. పూజారులు పూజలు చేస్తున్నారు కాబట్టి ఏదో కొద్దో, గొప్పో ఇస్తున్నారు.
లడ్డూల తయారీ, ఇతర ప్రసాదాల తయారీ ఆగిపోయింది. పోటు గదిలో తయారు చేస్తున్న ప్రసాదంలో వాటాలు లేవు. పని లేని పూజారులకి, పంతుళ్ళకి జీతాలు లేవు.
టి.టి.డి. కాలేజీలు, కాటేజీలు, హాస్పటల్స్ , ఒకటేమిటి దేవస్థానం నిర్వహిస్తున్న అన్ని సంస్థలు మూతపడే పరిస్థితి వచ్చేసింది. టి.టి.డి వ్యవస్థ అతలా కుతలమై పోతూంది. ఆదాయం లేదు.
దీనికంతటికి కారణం ఒక కధ.
నిజానికి అది కధ కాదు. ఒక భక్తుని వ్యధ. కడుపు మండి కలానికి పదును పెట్టి తన అనుభవాన్ని కధగా రాసి అందరి కళ్ళు తెరిపించిన వెంకట రమణ కధ.
అసలేం జరిగిందంటే .... కధ లోకి వెళదాం.
వెంకట రమణ గవర్నమెంటు ఆఫీసులో సీనియర్ క్లర్క్. ఆరునెలల క్రితమే వెంకటేశానికి తండ్రి అయ్యాడు. పుట్టు వెంట్రుకలు తీయించడానికి తిరుపతి వెళ్లాలని ప్రోగ్రాం ఫిక్స్ చేసి రాను..పోనూ రిజర్వేషన్ కూడా చేసాడు.
తిరపతి బయలుదేరే రోజు వచ్చింది.
వెంకట రమణ గారు.. వెంకట రమణగారు.’ అంటూ కాశీపతి పంతులు వచ్చాడు.
‘రండి పంతులు గారు. మీ కోసమే చూస్తున్నాం.’ అన్నాడు రమణ.
‘ఏమిటి సంగతి అర్జెంటు గా రమ్మన్నారు’ అడిగాడు కాశీపతి
‘ఇవాళ సాయంత్రం మా అబ్బాయి వెంకటేశానికి పుట్టు వెంట్రుకలు తీయించడానికి మేం తిరుపతికి వెళ్తున్నాం. వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకుని బయలు దేరాలనుకుంటున్నాం. కాస్త దీపారాధన చేయిస్తారని కబురు పెట్టాను.’ అన్నాడు రమణ.
‘ఓ దానికేం భాగ్యం.. అలాగే కానివ్వండి. అంతా సిద్దం చేసుకున్నారా; అడిగాడు కాశీపతి’
‘ఆ. అన్నీ సిద్దంగానే వున్నాయి. మీదే ఆలస్యం.. అలివేలు.. పంతులు గారు వచ్చారు. అన్నీ సిద్దం చెయ్యి‘ అంటూ చెప్పాడు వెంకట రమణ.
కాశీపతి ఇద్దరితో దీపారాధన చేయించాడు. ఇద్దరూ నిష్టగా, భక్తిగా పూజ చేసుకున్నారు. చుట్టు పక్కల వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టాడు. అందరూ తృప్తిగా భోజనాలు చేసి వెళ్ళారు.
పంతులు కూడా భోజనం చేసి ‘ఎన్నింటికి రైలు’ అడిగాడు కాశీపతి.
‘ఆరు గంటలకి. తిరుపతి ఎక్స్ ప్రెస్’ అంటూ దక్షిణ ఇచ్చి పంపించాడు.
‘ఏవండీ ఓ పది లడ్డూలు ఎక్కువ తీసుకుని చుట్టు పక్కల వాళ్ళకి ప్రసాదం పంచి పెడదాం. అలా చేస్తే పుణ్యం కూడానట’ అంటూ ఆనందంగా చెప్పింది అలివేలు.
‘అలా అయితే పదేంటి పాతిక తీసుకుందాం’ అన్నాడు హుషారుగా వెంకటరమణ.
ఇద్దరూ ప్రయాణానికి కావలిసినవి సర్దుకోవడం మొదలు పెట్టారు.
సాయంత్రం అయిదు గంటలయింది.
‘ఇంకా ఎంత సేపు తెమలడం. నువ్వు తెమిలే సరికి రైలు కాస్తా వెళ్లి పోయేట్టు వుంది.
‘పిల్లల తో ప్రయాణం అంటే మాటలా.. ఎన్ని సర్దు కోవాలి.. అయిపొయింది. పదండి. అంది అలివేలు.
‘నేను ఆటో పిలుచుకువస్తాను. రడీ గా వుండు’ అంటూ వెళ్ళాడు రమణ
అలివేలు సామానులన్నీ బయట పెట్టి తలుపు తాళం పెట్టి పిల్లాడ్ని చంకన వేసుకుంది.
ఇంతలో రమణ ఆటో తో వచ్చాడు.
ముగ్గురూ ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్ కి చేరుకున్నారు. ఆటోదిగి సామానులన్నీ దింపి లెక్క పెట్టుకుని మీటరు చూసాడు నూట అరవై అయింది. జేబులోంచి పర్సు తీసి రెండు వందల నోట్లు తీసి ఇచ్చాడు.
ఆటో డ్రైవర్ తీసుకుని ‘చిల్లర లేదు’ అన్నాడు
‘చిల్లర లేదు అంటే ఎలా.. చూడు’ అన్నాడు.
‘లేదు సార్.. వుంటే ఇవ్వనా’ అన్నాడు
స్టేషన్ లోంచి ‘ సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళవలసిన తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ మరి కొద్ది నిముషములలో ఒకటవ నంబరు ఫ్లాట్ ఫాం మీద బయలుదేరుటకు సిద్దముగా వున్నది’. అంటూ అనౌన్స్ మెంటు వినిపించింది
‘ఏవండీ రైలు రడీగా ఉందిట’ అంది అలివేలు కంగారుగా
‘త్వరగా చిల్లర ఇవ్వవయ్యా. ఆవతల రైలు టయిమయింది.' అన్నాడు చిరాగ్గా రమణ
‘చిల్లర లేదు. ఏం చెయ్యమంటారు.’ అన్నాడు ఆటో డ్రైవర్.
‘నన్నేం చెయ్యమంటావు‘ అన్నాడు రమణ
‘చిల్లర తెచ్చుకోవాలి.’ అంటూ రెండు వందలు తీసుకొని ‘వుండండి ట్రై చేస్తాను’ అంటూ వెళ్ళాడు ఆటో డ్రైవర్.
మళ్ళీ అనౌన్స్ మెంటు వినిపించింది.
‘అటో డ్రైవర్ వచ్చేలా లేడు’ అంది అలివేలు
‘ఎక్కడికి వెళ్తాడు. ఆటో ఇక్కడే వుంది గా‘ అన్నాడు రమణ
‘అంత వరకు రైలు వుండదు. పదండి‘ అంది అలివేలు ఓ చేత్తో సంచీ తీసుకుంటూ
రమణ ఆటో డ్రైవర్ కోసం చూసాడు. ఎక్కడా వచ్చేట్టు కనిపించలేదు.
స్టేషన్ లోంచి ‘సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళవలసిన తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఒకటవ నంబరు ఫ్లాట్ ఫాం మీద బయలుదేరుటకు సిద్దముగా వున్నది’. అంటూ ఇంకోసారి అనౌన్సు మెంట్ వినిపించింది.
‘ఎక్కడికి పోయాడో..’ అంటూ సామానులు తీసుకుని రమణ వెళ్లి పోయాడు.
రమణ లోపలికి వెళ్ళగానే పక్కనే కారు వెనకాల నిలబడి వున్న ఆటో డ్రైవర్ వచ్చి ఆటో తీసుకుని వెళ్లి పోయాడు.
అది చూసి రమణ షాకయ్యాడు. ‘చిల్లర తెచ్చుకోని పాపానికి నలభై క్షవరం’ అనుకున్నాడు.
గబా గబా సామానులతో రైలు ఎక్కాడు. వెంటనే రైలు బయలు దేరింది.
తిరుపతి లో దిగి అక్కడి నుంచి బస్సు ఎక్కి తిరుమల చేరారు వెంకట రమణ. అలివేలు.
తిరుమలలో రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి అన్నీ సర్దుకుని దర్శనానికి బయలు దేరారు.
వెంకటేశానికి ఆరు నెలలు. తెల్లగా బొద్దుగా అందంగా ఉంటాడు. జుట్టు కూడా ఎక్కువేమో వంకీలు తిరిగి వుంది. టైం తొమ్మిదయింది.
వెంకటేశం పుట్టు వెంట్రుకలు తీయించడానికి కళ్యాణ కట్ట కి బయలు దేరారు.
‘ఎక్కడండీ కళ్యాణ కట్ట దూరమా’ అడిగింది అలివేలు.
‘ఇది వరకు ఇక్కడే వుండేది. ఇప్పుడు ఎక్కడికి మార్చారో’ అంటూ చుట్టూ చూసాడు. ఎదురుగా కళ్యాణ కట్టకి దారి అని బోర్డు కనిపించింది.
‘అదిగో బోర్డు.. అలా వెళ్ళాలి. రా’ అంటూ తీసుకు వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక ఇంకో బోర్డు కనిపించింది. అలా ఓ పది బోర్డులు దాటుకుంటూ వెళ్ళగా ఓ పెద్ద బిల్డింగు కనిపించింది.
‘హమ్మయ్య.. ఇదే కళ్యాణ కట్ట. పద.’ అంటూ లోపలికి వెళ్ళబోయారు.
అక్కడే వున్న గార్డు ‘ఎయి. ఇటెక్కడికి, ఇలా లోపలికి వెళ్ళకూడదు. బయట లైను వుంది దాంట్లో వెళ్ళండి.. ఫోండీ.’.. అంటూ ఎంతో అ..గౌరంగా, అ..మర్యాదగా చెప్పాడు. ఆ లైను ఎక్కడ వుందా అంటూ వెతుక్కుంటూ అలా తిరిగి తిరిగి మొత్తానికి లైనులో నిలబడ్డారు.
‘హమ్మయ్య లైనులోకి వచ్చేసాం’ అనుకుని టైం చూసుకున్నాడు రమణ, పదిన్నర అయింది.
ఒక నిముషం నిలబడి వెనక్కి చూసే సరిని వెంకట రమణ వెనకాల ఓ వంద మంది నిలబడ్డారు. ‘అమ్మో ఒక నిముషం లేటయి వుంటే అంతమంది వెనకాల ఉండేవాడిని’ అనుకుంటూ వెంకట రమణ ఆశ్చర్య పోయాడు.
ఇంతలో వెంకటేశంకి ఆకలి వేసినట్టుంది. ఏడవడం మొదలు పెట్టాడు.
‘ఏవండి వేడిని కాసేపు ఎత్తుకొండి. ఆకలి వేస్తున్నట్టుంది పాలు కలుపుతాను’ అంటూ వెంకటేశాన్ని రమణకి ఇచ్చింది. రమణ ఎత్తుకున్నాడు.
ఫ్లాస్కు లోంచి పాలు తీసి గ్లాసులో పోసి పంచదార కలిపి సీసాలో పోసింది. ఫ్లాస్క్ వెంకటరమణ కి ఇచ్చి పిల్లాడిని తీసుకుని పాలు పట్టించింది. వెంకటేశానికి కడుపు నిండటంతో ఏడుపు మాని ఆట మొదలు పెట్టాడు.
ఇంతలో “గోవిందా....గోవింద..’ కొంత మంది భక్తులు అరిచారు. లైను కొద్దిగా ముందుకు కదిలింది.
వెంకట రమణ ‘లైన్ బాగానే కదిలింది’ అనుకున్నాడు.
‘పుట్టు వెంట్రుకలా?ఎక్కడి నుంచి వస్తున్నారు’. అంటూ అలివేలుని అడిగింది ముందుగా వున్నావిడ.
‘అవునండి. హైదరాబాద్ నుంచి మీరెక్కడినుంచి’ అడిగింది అలివేలు.
‘మేం వైజాగ్ నుంచి’ అని చెప్పింది ఆవిడ. అలా కాసేపు కబుర్లతో గడిచింది.
లైను కదలడం లేదు.
‘ఏమయింది. లైను కదలడం లేదు.’ అడిగాడు పక్క వాడిని.
‘మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు’ అన్నాడు ఆ వ్యక్తి
వెంకట రమణ ఫీలయ్యాడు.
ఇంతలో ఓ గార్డు అటు వెళుతున్నాడు.
‘హలో’ అంటూ పిలిచాడు వెంకట రమణ
ఆ గార్డు వచ్చాడు
‘ఇంకా ఎంత సేపు పడుతుంది’ అడిగాడు.
‘ఎంత సేపయింది మీరు నిలబడి’ అడిగాడు గార్డు
‘ఓ అరగంట’ అయింది
‘లోపల ఆరు గంటల నుంచి నిలబడ్డ వాళ్ళు వున్నారు.’ అన్నాడు గార్డు
ఆశ్చర్య పోయాడు
‘ఆరు గంటల నుంచా’
‘అవును. లోపల పది కంపార్ట్మెంటులు వున్నాయి. అవి వదిలిన తర్వాత మిమ్మల్ని వదులు తారు.’ అన్నాడు గార్డు.
‘పదా..ఎంత సేపు పడుతుందో’ అడిగాడు రమణ
‘ఓ ఏడు ఎనిమిది తొమ్మిది పది గంటలు పడుతుంది.’ అంటూ వెళ్లి పోయాడు.
వెంకట రమణ షాక్ అయ్యాడు.
‘తొమ్మిది పది గంటలా.’. అంటూ టైం చూసు కుంటూ వున్నాడు. మూడు అరగంటలు గడిచాయి. లైను మూడు అంగుళాలు కూడా కదలలేదు.
‘బయటికి పోదామా’ అంటూ వెనక్కి చూసాడు.
ఎటూ దారి లేదు. ఏం చెయ్యాలో తెలీక అలాగే నిలబడ్డారు.
ఇంతలో మళ్ళీ కొంత మంది ‘ గోవిందా ... గోవింద’ అంటూ అరిచారు.
లైను ముందుకు కదిలింది.
అక్కడ ఎమర్జన్సీ గేటుని చూసాడు. అక్కడ వున్న గార్డుని పిలిచి ఇద్దరూ బయటికి వచ్చారు. అప్పటికే రెండయింది.
‘అమ్మో ... ఇదేమిటండీ ఇంతమంది వున్నారు. పది గంటలా.. ఇప్పుడు ఎలాగా’ అడిగింది అలివేలు.
‘నేను అదే ఆలోచిస్తున్నా’ అంటూ చుట్టూ చూసాడు.
అక్కడే వున్న వరాహ స్వామీ కాటేజ్ దగ్గర కూడా తల నీలాలు తీస్తారని బోర్డు కనిపించే సరికి ‘కొండ మీద ఎక్కడయితేనే అక్కడే తీయిద్దాం పద’ అంటూ
వెళ్ళారు. అప్పటికే రెండున్నర అయింది. అక్కడే వున్న కాంటీన్ లో కాస్త టిఫిన్ తిని వెంకటేశానికి సిరిలాక్ తినిపించి వరాహ స్వామీ కాటేజ్ కి వెళ్ళారు. అక్కడ కూడా చాంతాడు అంత లైను వుంది. మొత్తానికి వెంకటేశానికి తల నీలాలు తీయించి, వెంకట రమణ గుండు చేయించుకోడానికి, అలివేలు మూడు కత్తెరలు ఇవ్వడానికి ఓ మూడు గంటలు పట్టింది. నీలాల కార్యక్రమం పూర్తయ్యే సరికి నింగిలో సూర్యుడు కిందకి దిగిపోయాడు. ఇంక ఇప్పుడు పిల్లవాడితో రాత్రి దర్శనం కష్టమని కాటేజ్ కి బయలుదేరారు.
తెల్లవారు ఝామున నాలుగు గంటలకి సెల్ లో అల్లారం మోగుతోంది.
వెంకటరమణ లేచి అల్లారం ఆపి అలివేలుని లేపాడు.
రమణ ముఖం కడుక్కుని బకెట్ తీసుకుని వేడి నీళ్ళ కోసం బయటికి వెళ్ళాడు.
ఇంతలో అలివేలు ముఖం కడుక్కుని వేడినీళ్ళ కోసం చూస్తో౦ది.
రమణ వేడినీళ్ళ బకెట్ తీసుకొచ్చి లోపల బకెట్ లో పోసి మళ్ళీ ఇంకో బకెట్ కోసం వెళ్ళాడు. ఈ లోగా అలివేలు స్నానం చేసి తయారయింది. వెంకటేశాన్ని లేపింది.
రమణ ఇంకో బకెట్ తీసుకు వచ్చాడు. దాంతో వెంకటేశానికి స్నానం చేయించింది. రమణ ఇంకో బకెట్ తో నీళ్ళు తెచ్చుకుని స్నానం చేసి తయారయ్యాడు. టైం ఆరయ్యింది.
ఇద్దరూ కాఫీ తాగి, వెంకటేశానికి పాలు పట్టించారు. వెంకటేశానికి కావాల్సిన పాలు, సిరిలాక్ తీసుకున్నారు. ‘ఏవండీ సెల్ ఫోను తీసుకున్నారా’ అడిగింది అలివేలు.
‘లోపల సెల్ ఫోను తీసుకెళ్ల నివ్వరు. నీ ఫోను కూడా సైలెన్స్ లో పెట్టి పెట్టెలో పెట్టేయ్యి.
అంటూ ఇద్దరి ఫోనులు సైలెన్సు మోడ్ లో పెట్టి సూట్ కేసు లో పడేసాడు. పర్సు తీసి అందులోంచి డబ్బులు తీసుకుని జేబులో పెట్టున్నాడు.
‘అదేంటి పర్సు పెట్టు కోరా’ అడిగింది అలివేలు.
‘పర్సు వుండి ఎత్తుగా కనపడితే ఆ రష్ లో ఎవడయినా జేబు కొట్టేస్తాడు.’ అంటూ పర్సు కూడా సూట్ కేసులో పడేసాడు.
అలివేలు దర్శనానికి బయలు దేరారు.
అక్కడే వున్న సమాచార కేంద్రం లో ‘దర్శనానికి ఎంత సేపు పడుతుంది’ అడిగాడు.
‘ఫ్రీ దర్సనం అయితే ఆరేడు గంటలు పడుతుంది. మూడు వందలు టికట్ శీఘ్ర దర్శనం అయితే రెండు మూడు గంటలలో అయిపోతుంది.’ అంటూ చెప్పాడు.
‘మూడు వందలు టికెట్ తీసుకుని వెళ్దాం. మూడు గంటల్లో అయిపోతుందిగా’ అంది అలివేలు.
‘అవును. అసలే నిన్నంతా నీలాలతోతే సారిపోయింది. సాయంత్రం నాలుగు గంటలకి ట్రైను. ఇప్పుడు ఏడవుతోంది. పన్నెండు గంటల కల్లా బయటికీ వచ్చేయ్యచ్చు. మూడువందల టికెట్ కి వెళదాం.’ అన్నాడు రమణ .
‘టికెట్ ఎక్కడ ఇస్తారు’ అంటూ కేంద్రం లో అడిగాడు రమణ
‘వెళ్లి లైనులో నిలబడండి.. మధ్యలో టికట్ కౌంటర్ వుంది. అందులో ఇస్తారు.’ అన్నాడు.
‘దారి ఎటు..’ అడిగాడు రమణ
‘అదిగో బోర్డు’ అంటూ చూపించాడు.
రమణ చూసాడు.
‘శీఘ్ర దర్శనం.. మూడు వందలు టికట్ కి దారి’ అంటూ బాణం గుర్తు గల బోర్డు కనిపించింది.
ముగ్గురూ ఆ బోర్డు చూసుకుంటూ వెళ్ళారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మరో బోర్డు. అలా నాలుగయిదు మలుపులు, ఒక అర కిలోమీటరు వెళ్ళిన తర్వాత వైకుంఠ౦ కాంప్లెక్స్ వచ్చింది. అది దాటి వెళ్ళిన కొంత దూరం లో ఒక చోట ఒక గేటు కనిపించింది. దాని మీద ‘శీఘ్ర దర్శనానికి దారి’ అనిరాసి వుంది. వెంకట రమణ చూసాడు.
‘అదిగో అక్కడ గేటు వుంది పద’ అంటూ వెళ్ళాడు.
దగ్గిరకి వెళ్ళే సరికి దాని తలుపులు వేసి అడ్డంగా చెక్కలూ, ఏవో పెట్టారు.
‘ఇదేంటి.. తలుపులు వేసి ఏవో పెట్టారు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి’ అనుకున్నాడు.
ఇంతలో వెనకాల నుంచి ఓ నలుగురు వచ్చి
‘ఏమిటండి తలుపు వేసి వుంది. ఎలా వెళ్ళాలి’ అడిగారు
‘మీ కెంత తెలుసో నాకు అంతే తెలుసు’ అన్నాడు.
నలుగురు మాట్లాడకుండా వెళ్లి పోయారు.
‘అదేమిటండి అలా అన్నారు’ అంది అలివేలు
‘ఆ గుండు లైనులో వాడెవడో నన్ను ఆనలేదా’ అన్నాడు రమణ
‘మనం ఇప్పుడు ఎలా వెళ్ళాలి’ అడిగింది అలివేలు.
కొంచెం దూరం లో సమాచార కేంద్రం కనిపించింది.
వెళ్లి ‘ సార్ .. ఆ బోర్డుల ప్రకారం వస్తే గేటు మూసివుంది. మూడువందల శీఘ్ర దర్శనానికి ఎలా వెళ్ళాలి.’ అంటూ అడిగాడు.
‘అవన్నీ పాత బోర్డులు. శీఘ్ర దర్శనానికి ఇండియా కాఫీ హౌస్ పక్కన గేటు వుంది వెళ్ళండి.’ అన్నాడు.
‘ఇండియా కాఫీ హౌస్ ఎక్కడ’ అడిగాడు రమణ
‘అలా వెనక్కి వెళ్లి కుడిచేతి వైపుకి తిరిగితే ఇండియా కాఫీ హౌస్ వస్తుంది.’ అన్నాడు.
ఈసురో మంటూ ఓ కిలోమీటరు వెతుక్కుంటూ వెళ్ళాడు. కడుపులో కాస్త కరకరమనే సరికి అక్కడే పక్కనే ఇడ్లీలు అమ్ముతుంటే కాస్త టిఫిన్ తిని వెతకడం మొదలు పెట్టారు.
వెతగ్గా.. వెతగ్గా ఇండియా కాఫీ హౌస్ కనిపించింది. దాని పక్కనే గేటు కనిపించింది.
వెంకట రమణ ఆనందంతో ‘అదిగో గేటు దొరికింది. పద’ అంటూ వెళ్ళాడు.
ఇద్దరూ గేటులో కి వెళ్ళారు. ఖాళీ గా వుంది. అమ్మో ఎంత ఖాళీ గా వుందో. శీఘ్ర దర్శనం కదా డైరెక్టుగా వెళ్లి పోవటమే’ అంటూ వెళ్ళారు. కొంత దూరం వెళ్ళే సరికి లైనులో జనాలు కనిపించేరు. లైను ఆగి పోయింది. కొంతమంది తీరుబడిగా కూర్చుని వున్నారు.
‘ఇదేంటి ఆగి పోయింది. ఏంటి అలా కూర్చున్నారు.’ అడిగాడు వెంకట రమణ
‘దర్శనానికి తొమ్మిదిన్నరకి వదులుతారట.’ అన్నాడు ఓ వ్యక్తి
టైం చూసుకున్నాడు రమణ. ఎనిమిది అయింది. ‘ఇంకా గంటన్నర’ అనుకున్నాడు.
అలివేలు పిల్లాడిని ఎత్తుకోలేక లైనులో కూర్చుండి పోయింది. మెల్లిగా ఫ్లాస్క్, ఓ కప్పు తీసుకుని కొంచెం సిరిలాక్ కలిపి వెంకటేశానికి తినిపించింది.
కాసేపటికి వెనక వున్న ఖాళీ లైను మొత్తం భక్తులతో నిండిపోయింది.
కొందరు ఏవో కబుర్లు చెప్పు కుంటున్నారు.
కొందరు ఉండుండి ఒక్కసారి ‘ఏడుకొండల వాడా.. వెంకట రమణా ..గోవిందా..గోవింద..’ అంటూ అరుస్తున్నారు.
వెంకటరమణ గడియారం చూసుకున్నాడు. ‘ఎనిమిదిన్నర.. ఇంకా గంటా’ అనుకున్నాడు.
ఇంతలో బయట ఒకతను ‘న్యూస్ పేపర్.. తెలుగు, తమిల్, కన్నడ, హిందీ, ఇంగ్లిష్’ అంటూ అన్ని బాషల పేపర్లు అమ్ముతున్నాడు.
‘బాబూ .. ఈనాడు ఇయ్యి’ అంటూ పిలిచాడు.
ఆ కుర్రాడు పేపరు ఇచ్చాడు.
వెంకట రమణ ఐదు రూపాయలు ఇచ్చాడు.
‘ఐదు కాదు.. ఏడు రూపాయలు‘ అన్నాడు పేపరు కుర్రాడు.
‘పేపరు అయిదు రూపాయలే గా..’ అన్నాడు వెంకట రమణ
‘ఆ పేపరు ఇలా ఇచ్చి బయటికి వెళ్లి తెచ్చుకో’ అన్నాడు పేపరు కుర్రాడు.
పరిస్థితులని బట్టి రెట్లు మారుతూంటాయి.. అనుకుని రెండు రూపాయలు తీసి ఇచ్చి చదవడానికి పేపరు ఓపెన్ చేసాడు.
ఇంతలో పక్కతను ‘సార్ .చిన్న పేపర్ ఓసారి ఇస్తారా’ అంటూ అడిగాడు
వెంకట రమణ ఇచ్చాడు.
మెయిన్ పేపరు చదువు తున్నాడు.
అందరూ నిలబడలేక కూర్చుని వెంకటరమణ కొన్న పేపరు చదువుతున్నారు.
ముందున్న వ్యక్తి పేపర్ చూసి ‘సార్ లోపలి పేపరు ఇస్తారా’ అంటూ అడిగాడు
వెంకట రమణ కోపంగా చూసాడు.
‘ప్లీజ్’ అన్నాడు
ఏమీ అనలేక లోపలి పేజీలు ఇచ్చాడు. చేతిలో వున్న పేపరు చదివి తరువాతి పేపరు చదువుదామని చూసే సరికి తన పేపరు ని ముందు నలుగురు, వెనకాల పది మంది తలో పేపరు తీసుకుని చదువుతున్నారు. ముందు వ్యక్తి వెంకట రమణ ని చూసి ఓ నవ్వు నవ్వి తన చేతిలో పేపరు వెంకటరమణ కి ఇచ్చి వెంకటరమణ చేతిలో పేపరు తీసుకున్నాడు.
వెంకటరమణ ఏడవలేక నవ్వుతూ పేపరు తీసుకుని చదువుతున్నాడు.
ఇంతలో ఒక్కసారిగా ‘ఏడుకొండల వాడా.. వెంకట రమణా ..గోవిందా..గోవింద..’ అంటూ అరుపు వినిపించే సరికి ముందున్న అందరూ గబా గబా లేచి నిలబడ్డారు.
వెంకట రమణ టైం చూసుకున్నాడు. తొమ్మిదిన్నర అయ్యింది.
‘కరక్టు టైం’ అనుకున్నాడు.
అలివేలు కూడా వెంకటేశాన్ని ఎత్తుకుని నిలబడింది. వెంకట రమణ బాగ్ తీసుకుని నిలబడ్డాడు.
వెనకాల కూడా అందరూ లెంచి నిలబడ్డారు.
లైను కదలడం మొదలయింది.
ఆ తోపులాటకి కొందరు వెనకా ముందు అయ్యారు.
వెంకటరమణ అలివేలు వెనకాలే నడుచుకుంటూ కదిలాడు.
కాస్త దూరం వెళ్లి లైను మళ్ళీ ఆగింది.
వెంకట రమణ పేపరు కోసం చూసాడు.
ఆ పేపరు తీసుకున్న వాళ్ళు ఎక్కడున్నారో కనపడలేదు.
‘పేపరు నా కోసం కొన్నానా.. వాళ్ళ కోసం కోన్నానా.. ఖర్మ రా..’ అనుకున్నాడు.
మళ్ళీ లైను కదలటం మొదలయింది.
అందరూ గోవిందా అంటూ నడుస్తున్నారు.
'భక్తులు దయచేసి గమనించగలరు. సెల్ ఫోనులు, కెమెరాలు, ఆలయం లోకి తీసుకు వెళ్ళడానికి అనుమతి లేదు. భక్తులు వాటిని తమ లాకర్ల లో గాని, గదులలో గాని, బయట వున్న డిపాజిట్ కౌంటర్ లలో గాని పెట్టుకుని రాగలరు. ఒకవేళ తీసుకువచ్చిన యెడల స్కానింగులో దొరికిన వస్తువులను స్వామివారి హుండీలో వేయబడును’ అంటూ స్పీకర్ లో నుంచి ఎనౌన్స్ మెంటు అన్ని బాషలలో వస్తోంది.
‘మనం తీసుకురాకపోవడం మంచిదయ్యింది’ అంది అలివేలు.
‘అందుకే గా రూమ్ లో పెట్టింది’ అన్నాడు వెంకట రమణ
దాని పర్యవసానం ఏం జరుగుతుందో అప్పుడు అర్ధం కాలేదు వెంకట రమణకి.
లైను కొంచెం కొంచెం జరిగి మూడువందల టికట్ కౌంటర్ దగ్గర కి వచ్చాడు వెంకట రమణ.
కౌంటర్లో రెండు టికట్ లు తీసుకుని ముగ్గురూ ముందుకికదిలారు.ముందు లైను అంతా ఖాళీ గా వుంది.
‘అందరూ టికట్లు తీసుకోవాలిగా.. అందుకే అంత స్లో గా నడిచింది. పద..పద’ అంటూ గబా గబా వెళ్ళారు.
అలా వైకుంఠ౦ కాంప్లెక్స్ లోకి వెళ్ళారు. అక్కడ కొంచెం ముందుకి వెళ్ళే సరికి మళ్ళీ లైను ఆగిపోయింది.
అక్కడ కొంత మంది టికట్లు చెక్ చేస్తున్నారు. ఎవరి ముఖాల్లో శాంతం గాని, ప్రేమ గాని, దేవుడి యందు భక్తీ గాని, ఎంతో దూరం నుంచి ఎంతో సేపటినుంచి లైనులో నిలబడి అలసిపోయిన భక్తుల గురించి జాలి గాని, తాము చేస్తున్నా ఉద్యోగం అదేకదా.. అలా అని ఉద్యోగ ధర్మం గాని లేకుండా ‘ఎయి.. టికట్లు..తియ్యండి.. ఇవ్వండి.. ఎంత మంది.....ఆ.. వెళ్ళండి..’ అంటూ పశువులని అదిలించినట్టు అరుస్తూ అక్కడి ఉద్యోగులు టిక్కట్లు చెక్ చేసి లోపలికి పంపారు.
అలాగే వాళ్ళ ఈసడింపులతో టికట్లు చెక్ చేయించుకుని వెళ్ళారు వెంకటరమణ దంపతులు.
కాస్త ముందుకి వెళ్ళగానే కంపార్టుమెంటు లు కనిపించాయి. 18-25 అని బోర్డు రాసి ఉంది. అలా మూడు నాలుగు కంపార్ట్ మెంట్లు దాటుకుని ముందుకి వెళ్ళారు. వెంకట రమణ దంపతులు వెళ్ళే సరికి పంతొమ్మిది కంపార్ట్ మెంటు నిండిపోవడం తో దాని తలుపు వేసి ఇరవయ్ కంపార్ట్ మెంట్ తెలుపు తీసి ‘వెళ్ళండి లోపల కూర్చోండి’ అంటూ లోపలికి పంపించారు. ఇరవయ్ కంపార్ట్ మెంటు లోకి ముందుగా వెళ్ళింది వెంకట రమణ దంపతులు. వెళ్లి ముందు ఒక బెంచి వుంటే దాని మీద కూర్చున్నారు.
తర్వాత ఒక్కొకళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. అయిదు నిముషాల తరువాత బిల బిల మంటూ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళూ అందరూ ఒకర్నొకరు తోసుకుంటూ ఓ రెండు వందల మంది లోపలి గోల గోలగా వచ్చారు. ఆ గోలకి చిన్న పిల్లలు భయపడి బిక్కు బిక్కు మంటూ చూస్తున్నారు. ఇరవై కంపార్టు మెంట్ నిండిపోవడం తో తలుపు వేసి ఇరవయ్ ఒకటి ఓపెన్ చేసారు.
ఆ జనాన్ని చూసి అలివేలు భయపడింది. ‘ఇదేంటండి ఇంత మంది జనం’ అంది
‘అదే తిరపతి దేవుడి మహాత్యం’ అన్నాడు.
టైం చూసు కున్నాడు. పదకొండున్నర అయ్యింది. ‘లైనులో నిలబడి అప్పుడే మూడు గంటలు అయింది. అనుకున్నాడు.
అందరూ అలా కంపార్ట్ మెంట్ లో కూర్చుని కబుర్లు చెప్పు కుంటున్నారు. చిన్నపిల్లలు ఏడుస్తున్నారు.వాళ్ళ తల్లులు ఊరుకో బెడుతున్నారు.
గడియారం పన్నెండున్నర అయింది. ఎక్కడా తలుపు తీసే జాడ కనిపించ లేదు. వెంకటేశం ఏడుపు మొదలు పెట్టాడు. అలివేలు ఫ్లాస్క్ తీసి సిరిలాక్ కలుపుతోంది. ఇంతలో గార్డు తలుపు దగ్గరికివచ్చాడు. కొంత మంది ఒక్కసారిగా గోవిందా.. గోవిందా అంటూ ఒకరి నొకరు తోసుకుంటూ అలివేలు కలుపుతున్న సిరిలాక్ కప్పుని , ఫ్లాస్క్ ని తన్నుకుంటూ తలుపు దగ్గిరకి పరుగెత్తారు. మొత్తం సిరిలాక్, ఫ్లాస్క్ లో వున్న పాలు నేల పాలయ్యాయి. వెంకటేశం భయపడి ఇంకా ఏడుపు లంకించు కున్నాడు. అలివేలు కి ఏం చెయ్యాలో తోచలేదు.
తలుపు దగ్గిర తోపులాట మొదలయింది. తలుపు దగ్గిర గార్డు తలుపు తియ్యకుండా వెళ్లిపోయాడు. అందరూ అక్కడే నిలబడి వున్నారు.
పక్కనే వున్న ఒకావిడ తన దగ్గరున్న రెండు బిస్కట్లు అలివేలు కి ఇచ్చింది. వాటిని చిన్న ముక్కలు చేసి వెంకటేశానికి తినిపించింది.
కంపార్ట్ మెంట్ మూలలో వున్న కటకటాలలోకి ఒకతను సమూసాలు ఓ అట్టపెట్టిలో పెట్టి అమ్మడానికి తీసుకువచ్చాడు. వెంటనే జనాలు అందరూ గుంపుగా చేరి ఒకరి మీద ఒకరు తోసుకుంటూ కొనటానికి పోటీ పడ్డారు. అమ్మే అతను కనక ఆ కటకటాల లో లేకపోతే అతన్ని తొక్కి పచ్చడి చేసేవారు. అయిదు నిముషాల్లోపే ఆ పెట్టి ఖాళీ అయిపోయింది.
(ముగింపు వచ్చేసంచికలో...)