పారిజాతం - వి అశ్విని కుమార్

parijaatam telugu story

మీరు కూడా నాతో బాటు ఈ వంతెన దగ్గర బస్సు దిగండి! కింద నిండుగా కదిలే కాలవ చూడండి ఒక్క నిమిషం! నీటిపై నుండి విసురుగా వస్తున్న గాలి వినండి! నీటిలో మెరుస్తున్న బంగారం చూడండి! పడమటాకాశంలో దూరంగా పదకంటింటికెల్లిపోతున్న పొద్దు చూడండి!

కాలవ గట్లకు కాపలాకాస్తున్న మామిడి చెట్ల ధీమా చూడండి!

ఇప్పుడు - ఈ వాలు లోంచి క్రిందకి, గట్టు మీదకి జాగ్రత్తగా దిగుదాం. ఒక్కసారిగా ఊపు వస్తుంది. నడక పరుగులా మారిపోయింది - తూలకుండా దిగాలి మరి - ఆ ఇప్పుడు - కాలవ నీళ్ళు కలకల వనపడుతుంది. వళ్ళంతా బంగారం చేసుకొని పరుగులు పెట్టే నీళ్ళు - గుట్లకు తన్ని వరుసుకుంటున్న నీళ్ళు - ఎన్ని నీళ్ళు! ఎక్కడికీ పరుగులు? నురగలు!

చెట్లపై చేరుతున్న పక్షుల కలకలలు. ఈ కాలువ గట్టు దారీ మా వూరు చేరుస్తుంది! ఎక్కడా వంకరలేని కాలవ - అటు ఇటు చెట్ల తలలు కలిసిపోతున్నట్లు - నీటిపైకి కొమ్మలు -

ఆ మధ్యలో నుంచి - దూరంగా చూడండి -

తెరచాప నిండా గాలి నింపుకుని, వెనకనే పొద్దు వెలుగు దాచుకుని బద్దకంగా, వయ్యారంగా కదులుతుంది. దగ్గరయ్యే కొద్దీ పక్షుల కిలకిలతో పాటు ఏదో పాట కూడా వినపడుతుంది.

మెల్లగా - మెలమెల్లగా మనల్ని దాటి వెళ్ళిపోతుంది - పడవ కదలికతో - అలలు ఒడ్డుకు తగులుతాయి -

జవరాలి కాలి అందెలు మ్రోగినట్లు!

అంతలోనే ఊరు దగ్గరవుతుంది - సాయంత్రం పొగ కాలవ నీటి మీద వేలాడుతుంటుంది. ఊళ్ళో అన్ని పొయ్యిలు పిడకలతో అంటుకుని వుంటాయి! ఇక్కడే కాలవ గట్టు దిగి ఊరి దారి పట్టాలి. మెత్తటి ఇసుక, చవిటి ఇసక! ఇళ్లకెళ్ళుతున్న ఎడ్లబళ్ళు - చక్రాలు మెత్తగా ఇసకలో తిరుగుతూ - ఎప్పుడో తిన్న గడ్డి నెమరేస్తూ తెల్లని నురగలు కక్కుతూ - బలిసిన ఎద్దులు!

పగలంతా పనిచేసినా అలసిపోని ఆసాములు - పలకరింపులు, ఒలుకులు దాటి, హరిజన వాడ దాటి, గవల్ల ఇల్లు దాటి ఎండు చేపల ఘాటూ వాసనలో నుంచి కోమటి అరుగులు దాటి, మున్సబు దొడ్డి దాటి పెద్ద అరుగుల వెంకయ్య మామ ఇంటి తర్వాత - మా యింటికి సన్న సందులో తిరిగి...

దూరంగా రామాలయంలో నూనె దీపం కనపడుతోంది. అప్పటికే చెరువు, చీకటిని కప్పుకుంది!

ఇంటర్ పరీక్షలు రాసి ఈ రోజే బాబాయి ఇంటికి వచ్చాను. మా పిన్ని కూతురు తారక్క. "పరీక్షలు బాగా రాశావా" అని అడిగి 'కొత్త సినిమా' 'మాయాబజార్ చూశావా?' అంది. నేను "ఆ..." అంటుండగానే -

"నరసయ్య మామ రెండో పెళ్ళి చేసుకున్నాడు" అని చెప్పింది. రాత్రి బాబాయితో పొలం పనులు గురించి అడిగితే "ఆకుమళ్ళకు రేపట్నించి అరక కట్టాలి" అని పురమాయించాడు. మా ఉమ్మడి కుటుంబం వ్యవసాయం అంతా బాబాయే చూస్తుంటాడు. అన్ని శలవలకూ బాబాయి ఇంట్లోనే వుండి వ్యవసాయం పనుల్లో సాయం చేయటం అలవాటు.

*****

మర్నాడు నరసయ్య మామ ఇంటికెళ్ళా, తారక్కతో...
(ఆప్పుడ చూశా, నిన్నత్తను...)

ఆమె... ఎక్కడ నుండి దిగి వచ్చింది, ఇక్కడకు?

ఆ ముఖంలో ముందుగా ఆకట్టుకోనేవి. ఆ కనులు!

నీలపు కలువరేకుల పెద్ద పెద్ద రెప్పలు ఏదో బరువుతో వాలిపోతూ...

తెల్లని కనుగుడ్లు. నల్లని కనుపాములు - సగం రెప్పల చాటునే - ఈ ప్రపంచానికి తన రహస్యం తెలీనివ్వని చీకటి పాపల్లో రెండు వెలుగు చుక్కలు!

విలాసంగా వంగిన కనుబొమ్మలు...

మధ్యలో అస్తమించే పొద్దులా కుంకుమ బొట్టు!

ఎవరో చెక్కినట్లు చక్కని ముక్కు, చివరన ఓ చిన్న రతనాల నక్షత్రం... ఎవరికో దారి చూపుతూ... నిండైన పెదవులు... చిన్ని నోరు!

సన్నగా మారిన చుబుకం - మధ్యలో చిన్ని గుంట, ఎవరో చిలిపిగా నొక్కినట్లు - ఆ బుగ్గలు, కనీసం వెలుగు కూడా నిలవని నునుపు! నల్లని కురులు కప్పుకుంటూ పల్చని చెవులు - బుట్టలోలకులు ఊగుతూ - నిశ్శబ్ద శృంగార ఘంటికలు మ్రోగిస్తూ - ఎప్పుడైనా గోరింటాకు మెరిసే మునివేళ్ళు - కళ్యాణపుటుంగరం!

ఏవో స్వరాలు దాచినట్లు అరచేతులు -

అపుడపుడు కనపడే బంగారు పట్టాలు - సన్నని మువ్వల్తో మట్టెల మోతలు!
(ఎవరీమె?) ఏ లోకపు దేవత? ఏ శాపంతో ఇక్కడకు వచ్చింది?)

తారక్క నన్ను పరిచయం చేసింది.

అప్పుడే చిన్నత్త కనుల్లోకి చూశాను. ఏవో రహస్యపు లోకాలు, అనంత మర్మాలు దాస్తున్నట్లు అరమోడ్పు కనులు - ఎక్కడో నిద్రపోయి ఇక్కడ మేల్కొన్నట్లు, బరువుగా వాలుతున్న నీలపు రెప్పలు - తన లోకంలోకి రమ్మని చిరునవ్వు స్వాగతం!

*****

నరసయ్య మామది పెద్ద పెంకుటిల్లు -

ముందు, వెనక పెద్ద దొడ్డి -

ఎప్పుడూ సున్నాలతో కళకళలాడుతుంటుంది!

ముందు - మందార చెట్టు - మల్లె పందిరి

పెరట్లో పెద్ద రోలు - పొగడ చెట్టు కొబ్బరి చెట్లు. బయటే చిన్న వంటిల్లు - ముందు వరండా దాటగానే హాలు. ప్రక్కనే చిన్నగది.

వెనుకనే పడ్డ పడక గది!

ఆ గదికి బరువైన ఒంటరి తలుపు - ఇత్తడి గుబ్బలు - వాకిలికి - పూసల తెర - రంగురంగుల పూసలు ఊగుతూ - మ్రోగుతూ!

లోపల మందిరం మంచం - రోజ్ వుడ్ రంగుతో చుట్టు చిన్న చిన్న చిలకలు - పెద్ద అద్దం తిరుగుతూ... మాయలాంటి తెర!

బూరుగు దూది పరుపు - మెత్త మెత్తని మబ్బుల్లాంటి తలగడలు, శాటిన్ కవర్లు. పట్టు దుప్పట్లు... ఏదో మైకం లాంటి మత్తైన వాసనలు...

మంచం ఎక్కటానికి, చక్కగా చెక్కిన ఎత్తు పీట!

గుండ్రని నగిషి మంచపు కోళ్లు...

గోడకు చిన్న అలమరా - ప్రక్కనే దీపపు గూడు! అక్కడే కోడి గుడ్డు దీపం! అస్పష్టమైన బొమ్మలతో ఒక ఆయిల్ పెయింటింగ్ ప్రక్కనే వెంకట్రామా అండ్ కో కేలెండర్ కేలండరు మార్చి - పంతొమ్మిది వందల యాభై ఎనిమిది.

*****

కుక్కపిల్ల గ్రామఫోను రికార్డులు వినేవాళ్ళం, పిన్నులు పెట్టడం, కీ ఇవ్వటం రికార్డు తిరుగుతూంటే వెలుగు ఊగిసలాడుతుంటే పాటలు బైటకు వస్తుంటే అదొక వింత లోకంలో వున్నట్లు గడిచేది! ఆమెతో ఉన్నంత సేపు...

చిన్నత్త క్రొత్తగా కాపురానికి వచ్చిన స్నిగ్ధ! కదులుతున్న శృంగారం, ప్రమతో దగ్గరకు తీసుకొని, ఆకలి, దప్పిక తీర్చే ప్రేమ దేవత...

ఎప్పుడైనా మధ్యాహ్నం వెళ్ళినప్పుడు ఆ పందిరి మంచం మీద నిద్రపోతున్న రతీదేవిలా అన్పించేది...

"చిన్నత్తా... దేవతలుంటారా? కథల్లో మాదిరి ఎప్పుడైనా మన మధ్యకు, ఈ భూమ్మీదకు దిగి వస్తారా? నువ్వు అలాగే వచ్చావా...?"

అడిగేవాణ్ణి...

నువ్వు ఇక్కడకు ఎలా వచ్చావు?" అడిగా మళ్లీ

"అదిగో కాలవ! పడవ మీద, తెరచాప పడవ మీద, కాలవ ప్రవాహంలో ఒకరోజు -

ఒక పగలు, కాలువ గట్లు, ఎండలో వళ్ళు ఎండబెట్టుకుంటున్నాయి. గట్ల మీద గడ్డి మేస్తూ గేదెలు, పరుగులు పెడుతూ మేకలు,

తెరచాప నిండా గాలి -

సరంగు పాటలు - పగలంతా, మెల్లగా, బద్ధకంగా ప్రయాణం. రాత్రి, సగం చంద్రుడు, కోటి చుక్కలు... ఆగిపోయిన గాలి, దిగిపోయిన తెరచాప, పడవ లాగుతూ సరంగులు - పాటలు పాడుతూ సరంగులు,

రాత్రంతా...

తెల తెల వారుతుండగా ఈ ఊరి రేవులో ఆగింది పడవ... మెట్ల బల్ల పసుపు పూసి వేశారు. గట్టు మీదకు దిగుతుండగా ముత్తయిదువులు దిష్టి నీళ్ళు - ఆ రోజే ఈ ఇంట్లో అడుగుపెట్టా...!!"

స్వాగతంలా చెప్పింది...

"నువ్వు - ఎక్కడికి వెళ్ళాలి?" అడిగా...

"ఎన్నో పగళ్ళు, కలలు కన్నాను. ఏ రాకుమారుడో వస్తాడని"...

ఆపైన ఆమె చెప్పలేదు.

ఇప్పుడు నరసయ్య మామ బలమైన చేతుల్లో - లంక పొగాకు ఘాటైన వాసనల్లో ఏవో పీడ కలలు - కలల్లోంచి పీడ కలల్లోకి మేల్కొని - తెల్లవారగా వళ్ళంతా పచ్చి పుండు - వేడి నీళ్ళ స్నానం - సాంబ్రాణి ధూపం - తలార బెట్టుకుంటూ,

ఆ పొగల వెనుక నుంచి, ఆకురుల మధ్య నుంచి...

మబ్బుల్లో చందమామలా ఉండేది - అప్పుడే నే వెళ్ళేది!

పొగల తెరల్లోంచి - వత్తైన కురుల్లోంచి, మత్తు కనుల్తో వాలిపోతున్న రెప్పల రహస్యపు లోకాల లొంచి చూస్తూ పిలిచేది -

"రా..." అంటూ నాకేదో తెలియని ఆకర్షణ, చెప్పలేని ఆరాధన!

ఈ దేవతను ఎలా కొలవాలి?

ఎర్రమందారం పూలు కోసి ఇచ్చా!

వెడప్పాటి రేకుల మధ్యలో పుప్పొడి అలవోకగా బుగ్గలకు అలదుకుంటూ - "ఇవ్వాళ ఎక్కడకు వెళ్లావు..." అనేది!

"ప్రొద్దున వెంతెన దగ్గరకు వెళ్లా - సరుకుల కోసం. నాట్లు మొదలుపెడుతున్నారు... పదిహేను రోజుల పొలంపని.

నిలవ కూలీలు - వచ్చారు. చెరువు దగ్గర దొడ్లో పెట్టారు.

రేపే మా ఊడుపు! మీకు చాలా పొలం ఉందిగా...

"మామ చెప్పలేదా?"

"ఆ ఇప్పుడే తెలుస్తున్నాయి..."

తర్వాత వెళ్ళేటప్పుడు... "వెళ్ళొస్తానత్తా..."

అన్నప్పుడు సున్నుండలు పెట్టింది - మత్తైన నేతి వాసన!

తర్వాత చేను దుమ్ము చేయటం, నిండా నీరు పెట్టడం, గట్లు వేయటం, నారు మోయటం.

దున్నలతో బల్లలాగటం, చేను చదును చేయటం ఆడకూలీలు, తుమ్మెద పాటలు పాడుతూ నాట్లు వేస్తుంటే నారు అందీయటం -

ఊడుపులు అయ్యేవరకూ ఊపిరాడేది కాదు -

*****

ఎప్పుడైనా తీరిక ఉంటే, సాయంత్రం కాలవ గట్టుకు నేను, చిన్నత్త వెళ్లే వాళ్లం - తారక్క అప్పుడప్పుడు వచ్చేది...

దారిలో పెద్ద మర్రి చెట్టు, బలంగా ఊడలు దిగి కాళ్ళ కింద ఆకులు, ఒకోసారి మెత్తగా, ఒకోసారి గలగలలాడుతూ - గట్టు మీద కూర్చొని - వాలే పొద్దుని చూస్తూ ఉండిపోయేది.

అంతలో రాదారి పడవ చిరుగుల - తెరచాపనిండా గాలితో బరువుగా వయ్యారంగా వస్తుండేది -

మెల్లగా మమ్మల్ని దాటి, దిగువకు వెళ్లిపోయేది. "ఎక్కడికి పోతున్నాయి ఈ పడవలు...?" అనేది. దిగంతంలో పొద్దు దిగిపోతుంటూ ఎంత వింతగా ఉండేది! చిన్నత్త, ఆమెకిష్టమైన పనులు ఎంతో తేలిగ్గా చేసేది - ఎప్పుడూ అలసినట్లు కనపడేది కాదు.

ఊడుపులు అయిన తర్వాత యూరియా వేశాం - చేను ముదురు పచ్చగా మారి ఆరోగ్యంగా ఉంది!

నేను త్వరలోనే గుడివాడ వెళ్ళిపోయాను - డిగ్రీలో చేరేందుకు.

వినాయకచవితికి వచ్చినపుడు, చిన్నత్తను చూసేందుకు వెళ్లా. పెరట్లో ఒక రకమైన గ్రేస్ తో నడుస్తోంది.

అప్పటికి చూలాలు! ముఖం అంతా వింత మెరుపులో వెలిగిపోతోంది -

పొగడ పూల చెట్టు క్రింద, నవారు మంచం మీద కూర్చొని ఏదో దండ గుచ్చుతోంది... సన్నగా పాడుతూ...!

మంచం అంచున కూర్చున్నా...

నన్ను చూసి చిన్నగా నవ్వింది... 'ఎలా ఉన్నావు..."?

నా గుండెల్లో ఏదో బరువు - తెలియని దిగులు -

ఈ దేవత మనిషై పోతున్నట్లు - మనుషులో ఒక్కటైపోతున్నట్లు చెప్పలేని బాధ - నాకు.

ఆమె ఏదో బాధ్యత కోసం వచ్చినట్లు ఏ కంప్లెయింటు లేకుండా తన పని - తన శాపం అనుభవిస్తున్నట్లు నిర్లిప్తంగా... అనిపించేది నాకు!

వారం రోజులు అప్పుడు, చేలలో కలుపు తీసి, నీరు మార్చే వాళ్లం. చేను రెండడుగులు పెరిగి గాలికి తలలు అలలుగా మారుతుండేది.

అక్కడక్కడా తెల్లని పిట్టలు వాలి నీళ్లలో పురుగులు తింటుండేవి. పెద్ద గట్ల మీద దోసపాదులు పెట్టాం.

మళ్లీ నేను కొద్దిరోజులు శలవలకు వచ్చేసరికి -

ఆ ఇంట్లోనే ఒక మిడ్ వైఫ్ సాయంతో మగ పిల్లవాణ్ణి కన్నది.

ఆ తర్వాత బాలింతరాలిగా తలకు చెవులకు గుడ్డ కట్టుకుని తిరుగుతున్న చిన్నత్తను చూశాను.

కాని ఆమెలో తన్మయత్వం ఏది - ఇవన్ని తన బాధ్యతలేనా? శాపంలో భాగాలేనా? ఈమె తల్లి తరుపు వాళ్ళెవరూ రాలేదే? ఎవరూ లేరా?

ఎక్కువ సేపు నేనూ.. తారక్క, ఆమెతోనే ఉండేవాళ్ళం.

బాబుని ఎత్తుకుంటానికి ఇచ్చేది...

నాకేదో వింత ఆనందం - ఆ పసిగుడ్డును పొదవి పెట్టుకుంటూ, ఆ లేత స్పర్శకు - ఆ మెత్తని పొత్తిళ్ళ - జాన్సన్ బేబి పౌడరు పసివాసన నాకెంతో హాయిగా ఉండేది - బాబు అరచేతులు అరికాళ్ళు - నా ముఖానికి అద్దుకుని ఆనందిస్తుంటే - చూస్తూ ఉండిపోయేది... వాడి నవ్వు నాకెంతో అబ్బురంగా ఉండేది!

నరసయ్య మామకు కలిగిన ఆనందానికి అంతులేదు! ఊరంతా పండగ చేశాడు - తర్వాత ఉయ్యాల పండక్కు ఊరు, పక్క ఊరు అందర్నీ పిలిచాడు.

ఊళ్లో ఆడంగులకు ఈమె మీద ఏదో అసూయ ఉండేది. గర్విష్ట అని గుసగుసలు పోయేవారు...

అయినా ఉయ్యాలకు అందరూ వచ్చారు...

నాకు ఈ ఉయ్యాల కూడా చిన్న పందిరి మంచం లాగానే అన్పించింది.

అంతా నగిషీలతో, చిన్న తెరతో బొమ్మలతో - కొత్త వార్నిష్ వాసనతో - గిలకలతో - మీగడలాంటి గుడ్డలతో - వాడి బుల్లి గుప్పిట్లతో - అపుడే వేసిన పులిగోరుతో - బంగారు మొలతాడుతో - అంతా సందడే - అంతా పండగే -

ఇంత సందడిలోనూ - మామూలుగా తనపని చేసుకుంటూ కన్పించింది చిన్నత్త. మరికొంత శాపం తీరినట్లు - అన్పించింది!

*****

వరిచేలు ఏపుగా పెరిగి గాలికి ఊగుతున్నాయి. ఇప్పుడిపుడే పొట్ట మీద కొస్తున్నాయి. పొలం చుట్టు తిరిగి, మావులు, బోదులు సరిచూసి, గొడ్లకి పచ్చి వరి కోసుకుని మోపు నెత్తిన పెట్టుకుని ఇంటికి వస్తుంటే చిన్నత్త చూసేది!

'అబ్బో! చాలా కష్టపడుతున్నావే!" అనేది!

"కాదులే అత్తా! కాలేజీలో చదవటం ఇంకా కష్టం!"

అంటూ నవ్వే వాణ్ణి!

తర్వాత వారంలో...

అప్పుడే నాకు ఆట్లమ్మ పోసింది - అరిటాకుల్లో చుట్టి, చాకలి పరగడపునే కల్లు త్రాగించాడు - తర్వాత వారం రోజులు జ్వరంతో మంచాన పడ్డాను. నన్ను చూడ్డానికి చిన్నత్త వచ్చింది - నా మంచం మీద కూర్చోబోతే "వద్దత్తా! నీకు అంటుకుంటుందేమో..." అంటున్నా - ప్రక్కనే కూర్చొంది.

నా గొంతులో వణుకు - కన్నుల్లో చీకటి చూసి కంట తడిపెట్టింది.

అయ్యో! దేవతలు ఏడుస్తారా?!

బాబాయి పోలేరమ్మకు పుంజును కోయించాడు! గణాచారి పూజ గడగడలాడించాడు. కాలేజీ పదిరోజులు పోయింది!

*****

ఈ సారి సంక్రాంతి సెలవులకు రాగానే ముందుగా చిన్నత్త దగ్గరకు పరిగెత్తాను. ఈ మధ్య నాకు రోజు కల్లోకి వచ్చి కల్లోల పెడుతుంది. కనపడదేమోనని కలవర పెడుతోంది. అందుకే రాగానే పరుగెత్తాను.

ఒక్కసారిగా చిన్నత్తను చూసి నిశ్చేష్టున్నయ్యాను. బరువుగా దిగులుగా నడుస్తోంది. మిసమిసలాడే మేను వెలవెల పోయింది.

కనుల కింద చీకటి చేరింది - ఒకప్పుడు వెలుగే నిలవని బుగ్గలు ఇప్పుడు చీకటి గూళ్లయినాయి.

అయ్యో! ఈ పారిజాతానికి బురద అంటుతుందా?

ఈ వెన్నెలకు బూజుపడుతుందా?

ఈ దేవత మనిషిగా. మట్టిగా మారిపోతుందా? ఎంత దిగులు నాకు... ఎంత బరువు ఈ గుండెకు....

"అత్తా - ఇలావున్నావేమిటి..." నాకు ఏడుపే తక్కువ...

గచ్చుమీద గవ్వలు రాలినట్లు - నవ్వింది...

"నాకేంరా, పిచ్చీ..." అని దగ్గరకు తీసుకుంది.

పెరడంతా బంతి పూల వాసనతో, గొబ్బిళ్ళతో వింతగా ఉంది.

నరసయ్యమామ, కొడుకుని పెద్ద పెళ్లానికి పెంపకానికి ఇచ్చాడు. ప్రక్క ఊళ్లోనే. అప్పుడు కూడా. ఏమీ నిరసన చెయ్యలేదు -

నిర్లిప్తంగానే ఉండిపోయింది...

మరికొంత విముక్తి జరిగినట్లుగానేమో...

*****

సంక్రాంతికి ముందు -

కుప్పలు తీశాం -

ఎడ్లు - దున్నలతో నూర్పిడిమొదలు పెట్టాం - పగలంతా - గడ్డిలో వడ్లు తూర్పార బట్టడంలో వళ్ళు పులిసిపోయేది!

పది మందితో పని - సరదాగా ఆటగా అయిపోతుండేది. పోద్దువాలే సమయానికి ఎడ్లు తోలుకుని ఇంటికి చేరేవాణ్ణి - వేన్నీళ్ళు పిన్ని సిద్దంగా ఉంచేది. ఉడికిన ఉలవలు కమ్మని వాసన!

స్నానం చేసి మీగడ పెరుగుతో అన్నం తిని -

తారక్కతో చిన్నత్త దగ్గరకు వెళ్ళే వాణ్ణి -

బయట చలిగా - చల్లగా - మంచు పడుతుండేది.

నా చేతిలో కర్ర - తలగుడ్డ - గొంగళి చూసి ఎక్కడికెళ్తున్నావు అడిగేది!

"కుప్ప దగ్గరకు కాపలా" అంటే

"ఏమిటి... నువ్వు కాపలానా?..." అంటూ నవ్వేది!

"భయం వెయ్యదా..."

"చిన్నత్తా... ఇప్పుడు మీసాలున్న మొగవాణ్ణి"

అని గర్వంగా చెప్పాలని అన్పించేది.

ఇలా అనుకుంటూ చిన్నత్తను చూస్తున్నప్పుడు. నా అంతరంగంలో చెప్పలేని అలజడి రేగేది - అంతుబట్టని దిగులు ఆవహించేది -

"అంతా బడాయి. మా పెద్ద పాలేరు కూడా వెళ్తాడు తోడు"...

అంటూ తారక్క - నవ్వేది!

తలగడ్డ సరిచేసుకుని - మెడలో మఫ్లరు వేసుకుని చేతికర్ర తిప్పుకుంటూ కుప్పలున్న చేలోకి గట్టు మీద మోళ్ళు మీద నడుచుకుంటూ చేరేవాణ్ణి.

అప్పటికే వెన్నెల వచ్చేది -

కాపలాకి ఇక్కడ మంచెలుండవు - బండి వాల్చి - చక్రాలకు గడ్డి గుచ్చి - పైన గడ్డి మోపులు వేసి - కింద కూర్చునేందుకు వెచ్చగా గడ్డి మీద ఈతాకు చాప - దుప్పటి వేసేవాళ్ళు - లాంతరు మసిబారుతూ - ఉండేది - పెద్దపాలేరు - కుప్పలో దూరి నిద్రపోయేవాడు. బండి క్రింద వెచ్చగా గొంగట్లో - కూర్చొని - చూస్తుంటే - వెన్నెల మంచులో తుడుస్తుండేది. కట్లూడ దీసుకున్న గొడ్లు మోళ్ళు మేస్తూ దెయ్యాల్లా కదుల్తుండేవి!

రాని దొంగల కోసం - వచ్చే నిద్ర ఆపుకుంటూ - భయం పోవటానికి గట్టిగా సినిమా పాటలు పాడుతూ - ప్రక్కచేలో కుప్ప దగ్గర కాపలా వాణ్ణి కేకలు వేస్తూ ఎప్పుడో నిద్రపోయేవాణ్ణి!

నిద్రలో చిన్నత్త నవ్వుతూ - కన్పించేది -

దగ్గరకు వచ్చి - వల్లో నా తల చేర్చి తోడుండేది!

నా కలల్లో తను వచ్చి - కలవర పెట్టేది!

తొలి కోడికే మెలకువ వచ్చేది -

తొలి వెలుగులో ఇంటికి చేరేవాణ్ణి!

పిన్ని - అప్పుడే పితికిన గుమ్మపాలు ఇచ్చేది!

*****

ధాన్యం కొనటానికి గుడివాడ వడ్ల బ్రోకరు వచ్చేవాడు. రోజుకో ధర చెప్పేవాడు - ఇవ్వక తప్పదు - వాడే సంచులు పంపేవాడు.

రామాలయం దగ్గర లారీ పెట్టేవాడు -

అక్కడ వరకూ - బండ్ల మీద బస్తాలు తోలాలి.

బస్తాల వాటా వేసేటప్పుడు - తడి వడ్లని ఎక్కువవేసేవాడు.

మాకు వాడు - వాడి లాంటి బ్రోకర్ తప్ప - అమ్మేదారి లేదు -

సగం డబ్బు చేతిలో పెట్టి -

"పదిహేను రోజుల్లో మిల్లు నుంచి డబ్బు తెచ్చియిస్తానన్నయ్యా" బాబాయితో చెప్పి వెళ్ళిపోయేవాడు - మళ్లీ ఆర్నెల్ల లోపు కనపడేవాడు కాదు బాబాయి ఆ డబ్బు జాగ్రత్తగా - పడక గదిపైన గూటిలో దాచేవాడు. దాయటానికి బీరువా ఉండదు. బ్యాంకులేదు!

సంవత్సరం అంతా ఆ డబ్బే వాడుకోవాలి - మళ్లీ వ్యవసాయపు పనులకు పెట్టుబడి పెట్టాలి. అయినా రోజులు ఒడిదుడుకులు, ఒత్తిడులు లేకుండా నడుస్తుండేవి!

భోగిమంటలు వేశాం -

పంచ బిగించి తడి మంచులో చెడిగుడూ ఆడాం!

నవంబరులోనే తారక్కకూ పెళ్లయింది.

సంక్రాంతి అవగానే అత్తారింటికి వెళ్లిపోయింది. నేను కాలేజీ తెరిచే సరికి పట్నం వెళ్లిపోవాలి.

ఒంటరిగా కాలవ గట్టు మీద నడిచి వంతెన దగ్గరకు చేరి - అక్కడ బస్సెక్కి వెళ్లాలి.

కాలవ నిండుగా ప్రవహిస్తోంది - ఈ సంవత్సర దళవా ఉంది - తెరచాప పడవలు మందంగా బరువుగా కదులుతున్నాయి.

కడుపులో కొబ్బరికాయలు - సరుకులు దాచుకుని.

ఇంకా మామిడి పూయలేదు -

కోయిల కూయనూ లేదు!

*****

వేసవి సెలవులకు వస్తున్నప్పుడు, గుడివాడలో - పిన్నికి మందులు కొన్నాను. ఆఖరి బస్సు చాలా ఆలస్యంగా నన్ను వంతెన దగ్గర దింపి కదిలిపోయింది. చూస్తుండగానే వెనక ఎర్రటి దీపాలు కనుమరుగైపోయాయి.

అంతా చీకటి - చిమ్మ చీకటి...

తడుముకుంటూ వాలు దిగాను గట్టు మీదకు కాలవల నీళ్ళు సగానికే నడుస్తున్నాయి. నీటి నడక వినపడుతోంది - చీకటి! అంతా చీకటి - దట్టంగా కమ్ముకున్న మామిడి చెట్లు, గట్టు ఎత్తు పల్లాలు - కీచురాళ్లు గోల పెడుతున్నాయి.

చుక్కల మినుకు చెట్లపైనే ఆగిపోతోంది. కటిక చీకటి, కన్ను తెరిచినా మూసినా ఒక్కలాగానే వుంది - తెలిసిన దారే - అయినా తడబాటు! గుండె దడ - అడుగులో అడుగు; గొంతులో వణుకు రాగం - భయాన్ని తోలటానికి ఈల పాట - ఇలా ఎంత దూరం - ఎంత సేపు గడిచింది? ఇంతలో వెనక నించి ఏదో శబ్దం - ఏమిటి? పాములు కదులుతున్నాయా? దెయ్యాలు చెట్లు దిగుతున్నాయా?

భయం గుప్పెట్లో - గుండె దడదడ.

వెనక నించి ఓ తెరచాప పడవ మెల్లగా వస్తోంది. వడ్డు అంచుకు దగ్గర చేరుతోంది - చూశాను.

గమ్మత్తుగా చుక్కాని దగ్గర లాంతరు వేలాడదీసి ఉంది - ఆ వెలుగులోనే చిన్నత్త నిలబడి ఉంది - కన్నులు నులుముకుని మళ్లీ చూశాను - "పిచ్చీ... రా..." అంటూ పిలిచింది ఇక్కడ రేవు లేదు - వడిగా నడిచి పడవలో దూకాలి. చేయందించింది - అప్పుడే దగ్గరగా చూశాను.

"ఎక్కడ నుంచీ..."

*****

వెన్నెల్లాంటి చీర - చీకటిలో కూడా కనపడుతోంది తల నిండా మల్లెపూలు - మత్తుగా వాసన....
చుక్కులు దాక్కున్న కనుపాపలు...
నా చేయి ఆమె అరచేతిలోనే వుంది.
గులాబీల మెత్తదనం - ఆమె నవ్వుతూనే ఉంది.

*****

ఊరు తగ్గరయింది - రేపు ప్రక్కనైంది.
ముందుగా నేను దూకాను, "జాగ్రత్త సుమా..."
వెనకనుంచి అంటోంది... "చిన్నత్తా..." అంటున్నా -
పడవ సాగిపోతోంది - "నువ్వు దిగవా?"
నవ్వుతోంది. వెళ్ళిపోతోంది. పడవ వెళ్ళిపోతోంది.

*****

ఇసక దారిలో ఊర కుక్కలు నిద్దరోతున్నాయి. గొడ్ల ఉచ్చలో తడిసి ఇసక ఏదో వాసన వేస్తోంది. నిద్రలో నడుస్తున్నట్లు ఊళ్లోకి - ఇంటికి చేరాను.

పిన్నికి - అమృతాంజనం - మందులు ఇచ్చాను.

"అన్నం తిందువురా..." అంటోంది పిన్ని...

ఎక్కడో ఓ నక్క ఊళ వేస్తోంది -

అంతా నిశ్శబ్దంగా - సద్దు మణిగి - నిద్దరోతోంది - వూరు.

దొడ్లో ఎద్దుల గంటలు మూగపోయాయి.

దూరంగా పెద్ద మర్రిచెట్టు దెయ్యంలా

నిలబడి వుంది - గుడ్ల గూబల్ని - గబ్బిలాల్ని

తల్లో దాచుకుని -

ఊరి చుట్టూ తాడిచెట్లు నిలబడి కునికి పాట్లు పడుతున్నాయి.

ఊళ్లో గాలంతా తెరచాప ఎక్కి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఉక్కగా - చెమటగా నిద్రపట్టలేదు...

*****

తెల తెలవారుతుండగా ఎద్దుల గంటలు వినపడుతున్నాయి -

నాగళ్లు తిరగగట్టి ఆకుమళ్ళు దున్నటానికి వెళ్తున్నారు -

కళ్లాపి పేడవాసన వస్తోంది - కాకులు అరవటం మొదలు పెట్టాయి - పిచ్చుకలు కంకుల కోసం వాలుతున్నాయి. చూస్తుండగానే భళ్ళున తెల్లారింది.

*****

ప్రొద్దెక్కిన తర్వాత నరసయ్య మామ ఇంటికి బయలుదేరాను. పిన్ని మామిడి ఊరగాయ పడుతోంది. నలుగురి సాయంతో కారం - ఆవపిండి - వెల్లుల్లి మామిడి ముక్కలు ఎంతటి కమ్మని వాసన... నోరూరే వాసన - ఊరగాయ అన్నంలో కలిపి ముద్దలు తిని ఎలా ఉందో చెప్పాలి ఉప్పు - సరిపోయిందా ఇంకో ముద్ధ - ఎర్రగా రుచిగా మంటగా, కమ్మగా... నేను రెండు ముద్దలు తిని - ఒక ముద్ద గుప్పిల్లో దాచుకుని - చిన్నత్త ఇంటికి వెళ్లాను.

నరసయ్య మామ వీధిలో అరుగు మీద కూర్చొని చుట్ట తాగుతున్నాడు - పాలేళ్ళ మీద మెత్తగా పెత్తనం చేస్తున్నాడు - ఏదో హడావుడి పడుతున్నారు...

నోట్లో చుట్టతో, చుట్టూ పాలేళ్ళతో - బలంగా ఊడలు దిగిన మర్రి చెట్టులా ఉన్నాడు!

నేను లోపలికి వెళ్లాను. అలికిడి లేదు -

నిద్రపోతోందేమో, పందిరి మంచం చూశాను - దుప్పటి కూడా నలగలేదు.

పెరట్లో పొగడపూల చెట్టు కింద కూడా లేదు -

చిన్నపాటు వణుకుతో 'చిన్నత్తా' అన్నాను - ఎవరూ పలకలేదు -

గుప్పిట్లో అన్నం ముద్ద - కొత్త పచ్చడి కలిపిన అన్నం ముద్ద, బరువుగా ఉంది. ఎక్కడని పిలవాలి? ఎవరని అడగాలి? మెల్లగా కాలవగట్టుకు వెళ్లాను. నీళ్ళు మెల్లగా తగ్గిపోతున్నాయి. రేపటి నుంచీ పడవలు రావు. కాలవకు రెండు ప్రక్కలా బారునే చూశాను - ఎండలో మామిడి చెట్లు కాయలతో బరువెక్కుతున్నాయి - కనపడే వరకు ఎక్కడ పడవ జాడలేదు - ఈ రోజు బల్లకట్టు కూడా వెళ్లిపోయింది - కాసేపు గట్టు మీద కూర్చున్నా... ఒక్కసారిగా ఒంటరినైపోయినట్లు నాలో దుఃఖం పొంగు కొస్తోంది - గుప్పెట్లో కొత్త పచ్చడి అన్నం ముద్ద... మెల్లగా నీళ్లలోకి వదిలేశా...

దేవత శాపం తీరిపోయిందేమో?

*****

ఆ రాత్రి బైట నులక మంచం మీద పడుకున్నా. చుక్కలాకాశం బిక్కు బిక్కు మంటోంది. ఎన్ని చుక్కలో - చిన్నత్త ఆలోచనలతో నిద్రపట్టలేదు.

*****

(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు