ప్రారంభమైన పదిరోజులకే కాలేజికి సెలవులు ఇచ్చారు. స్కూలులో ఉన్నప్పుడు సెలవుల కోసం ఎంత ఎదురుచూసినా, అవి త్వరగా వచ్చేవికావు. ఈ ట్రైన్ ఎంత నెమ్మదిగా పరిగెడుతోంది? ఎప్పుడు మా ఊరు చేరుకొంటుంది ఈ ట్రైను? అసలు మా ఊరులోనే, మంచి కాలేజ్ ఉంటే బాగుండేది. కలవరింతలు కరిగిపోయి కలలైన కాలంలో, బాల్యం మాత్రం, ఒక రంగులకాగితపు పువ్వు చుట్టూ భ్రమలో తిరిగే, భ్రమరం.
బాల్యం అంతా, ఇంకా నా కళ్ళముందే ఉంది. మా ఊరులో వేసవిలో కొనుక్కున్న ఐస్, శీతాకాలపు మొక్కజొన్న గింజల రుచులూ, చలి మంచు తెరలూ, కాలాలకు అనుగుణంగా ఊరు రంగులు మార్చుకొంటుందో, లేక కాలాలే ఊరి రంగులు మార్చేస్తాయో, ఏమో కానీ, నా చిన్నప్పటి జ్ఞాపకాల తెర, ఈ ప్రపంచాన్ని నాకళ్ళకు చూపిస్తుంది. చిన్నప్పుడు జరిగిన అన్ని విషయాలూ ఇప్పుడు నాకు గుర్తులేవు. కానీ గుర్తున్నవన్నీ, నా జీవితపు రహదారినుండి, నేను తిరుగు ప్రయాణం చేస్తున్నట్టు, చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి, వినపడుతున్నాయి. గుడిగంటలు వినపడగానే, నేను అల్లరిచేయటం మానేసి, శ్రద్దగా దేవుని ముందు నిలబడి, అమ్మ చెప్పినట్లు కోరుకొనేదాన్ని. "స్వామీ, నాకు చూపు నివ్వు. నేను నా కళ్ళతో ఈ లోకాన్ని చూడాలి." స్నేహితులు రేఖా, అంజలీ, ఎలా మాట్లాడతారో అనుకరించి చూపించటం, సోనూ పుస్తకాలలో పెన్నులతో గీతలు గీయడం, వంటరిగా ఉన్నప్పుడు టీవీతో మాట్లాడటం, అసలు నా చిన్నతనం ఎంత చక్కగా గడిచిపోయిందో చెప్పలేను.
"సర్వేంద్రియానాం, నయనం ప్రధానం" అంటారు కానీ, చిన్నప్పుడు, నాకు తెలియని ప్రపంచం ఇంకేదో ఉందని, దాన్ని నేనెప్పుడూ చూడలేదని, అనిపిస్తుందా? అప్పటివరకూ మండుతున్న ఎండకాస్తా, తగ్గుతుంటే అనిపించింది వర్షం రావచ్చని, స్కూలుకు సెలవు ఇస్తారని. కానీ, అవి మబ్బులు మాత్రమే. వర్షం కురిసింది. కానీ మేమంతా ఇంటికి వెళ్ళిపోయాక. నాకు అసలు పడవలు చేయటం వచ్చేది కాదు. కాగితాలన్నీ, చింపి, ముక్కలు చేస్తున్నానని శారదక్క కసురుకోనేది. నేను పడవలు చేయటం నేర్చుకొనేసరికి, ఇంత పెద్దదాన్ని ఐపోయాను. ఈ విద్య అప్పుడే వచ్చి ఉంటే, శారదక్కను కాగితంతో పడవలు చేయమని బ్రతిమాల్సిన అవసరం ఉండేది కాదుకదా. అమ్మ మాత్రం, ఎప్పుడూ చెప్తుంది, ఎవరినైనా ఏదైనా అడగాలంటే, బాధపడకూడదూ అని. కానీ, నేను చీకట్లో నీలిమా వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి కూడా, ఎవరినీ తోడుగా రమ్మని అడిగేదాన్ని కాదు. అసలు చీకటంటే, ఒక భావన మాత్రమే అని తరువాత తెలిసింది. గరుకు ఇసుకలో, మోగే గవ్వలు ఏరిన ఆ బాల్యపు ఆటపాటలే, లెక్కలపలకపై బలపాలతో అంకెలు నేర్పించాయి. ఎన్నో వాసనలున్న పూలకు, రంగులు కూడా ఎన్నో ఉంటాయని మల్లికార్జున్ మాస్టారు గారు ఎప్పుడూ చెప్పేవారు. అన్ని వేరువేరు గొంతులకూ, వేరువేరు రూపాలు ఉంటాయనీ, నేనే నెమ్మదిగా తెలుసుకున్నా. ముళ్ళగోరింటపూలంత తేలికగా, బ్రెయిలీ పాటాలు ఉండేవి. పరీక్షనాళికలను సారాదీపంతో వెలిగించకపోయినా, పరీక్షలు ఒక్కో తరగతినీ అలవోకగా దాటించాయి. ఇంధ్రధనుసూ, నక్షత్రాలూ, వెన్నెలా, ఇవేనా ప్రకృతంటే? రాత్రిని గెలిచేందుకు పోటీపడే సన్నజాజీ, విరజాజి పరిమళాలూ, సముద్రం చుట్టూ కాపు కాసే గాలితరంగాలూ, కొట్టి పారిపోతున్న చిన్నీని పట్టుకోమని చెప్పే పట్టీల సవ్వడులూ, ఎర్రగా పండినా పండకపోయినా, వేళ్ళను అరచేతులలో దాచిపెట్టే గోరింటాకు గుర్తులూ, ఇవేకదా సైసవం స్పృశించిన ప్రకృతి కాంతులూ?
బాల్యం దూరమవుతున్నకొద్దీ, నిజం దగ్గరవుతుంది. వయసు పెరిగేకొద్దీ, మనసు బరువవుతుంది. నాకు చిన్నప్పటి, ఆ కోరికలేదు చూపు వచ్చేయాలని. కోరికలకూ, కలలకూ కొత్తరూపం వచ్చింది. రూపాయి బిళ్ళల శబ్ధంలో తేడాలు గమనిస్తూ, కరిగిన బాల్యం, యవ్వనంలో కొత్త తివాచీ పరచింది. ఇన్ని సంవత్సరాల తరువాత, ఈ ప్రయాణం, ఇంకా ఏమి చూపిస్తుందో తెలియదు. కాటుకన్నా, అరిచే కుక్కన్నా, కూసే కుక్కర్ అన్నా, ఎక్స్లేటర్ అన్నా, ఇప్పటికీ భయం పోలేదు. అష్టా చెమ్మా ఆటల్లో చింతగింజలపై, చాక్ పీస్ పొడిపై, ఇప్పటికీ ఇష్టం పోలేదు. చాక్లేట్ తగరముతో పాపాయిబొమ్మలు చేసిన చేతులకు ఏదైనా వస్తువు పొరపాటున తగిలి పడిపోతే, మనసులో కలిగే కంగారు, ఇప్పుడు తన రూపం మార్చుకుంది అంతే. ఆడపిల్లల్లా పూలు మాలకట్టడం రాలేదనీ అమ్మ ఎంత తిట్టినా, పూలు వాటంతట అవి దారంలో చిక్కుకోలేవుకదా. అలసిన రెప్పల అలికిడికూడా, వినగలిగేంత తేలికేంకాదు.