"మే... ! మే... !"
దిక్కులు పిక్కటిల్లాయి. భువనభోంతరాలు దద్దరిల్లిపోయాయి. ఆ అడవి అడవంతా అల్లల్లాడి పోయిందా అరుపులకు.
ప్రాణభీతితో అరచిన మేక అరుపులకు ఇహానికొచ్చాడు అప్పన్న.
చాకరేకు కొండమీదకు మేకల మందల్ని తోలుకువెళ్లి వాటిని అడవిలో మేతకు వదలి తను ఓ చిన్న బండమీద కాళ్లు ముడుచుకుని కూర్చున్నాడు.
రోజూ ఉదయం లేవగానే గేదెల దగ్గర పాలు పితికి కాఫీ దుకాణాలకు చిల్లర వాడకందార్లకు పంపిణీ చేసిన తరువాత, తమ పాల వాడకం ఆసామీల ఇళ్ల దగ్గర నుండి 'కుడితి ' తీసుకు రావడం, దానికి ప్రతిగా ఆ ఇళ్లవాళ్లకు 'కల్లాపు'కు కావలసిన 'పేడ' తీసుకు వెళ్లి అందించటం అయింతర్వాత -
ఉదయం ఎనిమిదయ్యేసరికి చద్దన్నం తినేసి - మధ్యాహ్నానికి 'సోడి ' అంబలి పట్టుకొని మేకల మందని అడవికి తోలుకు వెళ్లడం పరిపాటి.
సాయంత్రం ఆరయ్యేసరికి మందని మళ్లించి ఇంటికి చేరుకున్న తరువాత మళ్లా గేదెల దగ్గర పాలు పితికి సరఫరా చేసిన తరువాత - ఇంటి వాడకానికి కావలసిన మంచినీళ్లు బజారు నూతి దగ్గర నుండి కావడితో మోయడం కూడా అప్పన్న దినచర్యే!
ఇంట్లోని చిల్లర పనులు అప్పన్న సతీమణి సర్దుకుపోయేది.
ప్రతిరోజూ ఒకేవిధమైన పని కావడం మూలాన అప్పన్నకి విసుగూ - విరామం తెలియటం లేదు. తన పని నిర్విఘ్నంగా సాగిపోయిన తర్వాత ఏ రాత్రికో - అపరాత్రికో తన గుడిసెను చేరుకునేవాడు.
శ్మశాన నిశ్శబ్దం ఆవరించుకున్న ఆ అడవిలో భయంకరంగా మేక అరుపుల మోత.
ఆ మేక అరుపులకు బండమీద నుండి ఆత్రంగా లేచాడు అప్పన్న.
ఆదరాబాదరాగా మేకల మందనంతా చుట్టబెట్టి చూశాడు.
అక్కడక్కడా రెండేసి మేకలు కలసి మేస్తున్నాయి. ఆ అరుపు ఎక్కడినుండి వచ్చిందో అర్థం కాలేదు అప్పన్నకి. కొండరాళ్లల్లో 'పలుకురాయి 'లుండటం మూలాన మేక అరచిన అర నిముషం వరకూ ఆ అరుపులు ప్రతిధ్వనిస్తూనే వున్నాయి.
అడవంతా గాలించసాగాడు అప్పన్న.
ఆ అరుపు మేకపోతుది.
అది అసలే పిరిగొడ్డు. ఏమయిందో? ఏమిటో? అప్పన్న మనసులో భయం పీకుతోంది.
ఏ మేకైనా అలా ఎందుకు అరుస్తుందో అప్పన్నకు బాగా తెలుసు. ఏ మేకవో వాటి కళ్ల బడ్డప్పుడు బాధతో అరుస్తాయి. అలాగే ఇదీ అరచింది.
ప్రతీ తుప్పా విడవకుండా వెదుకుతున్నాడు అప్పన్న. మేకలన్నీ తమ మానాన అవి మేస్తున్నాయి. మేకలనన్నింటినీ ఒక దగ్గర గుంపుగా చేర్చాడు. గబగబా లెక్కపెట్టాడు. మొత్తం మందలో రెండు తక్కువ వున్నాయి. తన మేకల మందలో రెండు తక్కువ కనిపించేసరికి అప్పన్నకి ముచ్చెమటలు పోశాయి.
పేరుపేరునా ఒక్కోదాన్ని పరిశీలించి చూశాడు. 'బొకడపోతు ' ఎక్కడా కనిపించలేదు. దానితోపాటు 'పొడమేకా జాడ కూడా లేదు. ఆ రెండే తక్కువ .
'బొకడబొతు ' కనిపించకపోయేసరికి అప్పన్న కళ్లంబడి నీళ్ళు ఉబికాయి ,అదంటే అప్పన్నకి ప్రాణం .దాన్ని చిన్నప్పటి నుండీ తన చేతుల్తో పెంచాడు. దాని కన్న మూడోనాడే దాని తల్లిని ఈ మేకవే పొట్టన పెట్టుకుంది. చిన్నపిల్ల కావటంచేత వేరే మేకలు ఏవీ దాన్ని తమ దగ్గరకు రానిచ్చేవి కావు.
కొన్నాళ్లు బలవంతాన ఏదో తల్లి మేకని రాటకి కట్టేసి కదలకుండా కాళ్లు పట్టుకొని గోకడ మేకపిల్లని దాని దగ్గర వుంచేవాడు అప్పన్న.
బలవంతాన ఎవరూ ఎవరినైనా ఏంచేయగలరు? దేన్నైనా ఎలా సాధించగలరు?
ఆ తల్లి మేక కూడా తనని కట్టేసి బలవంతంగా వేరే మేకపిల్లకి తన పాలు త్రాగించేసరికి తన పిల్లకి కాకుండా వేరేదానికి ఇవ్వడం ఇష్టం లేక ఎగేసేపేది.
ఇలా కాదని అప్పన్న ఎలాగో తంటాలు పడి అన్ని తల్లి మేకల నుండి పాలు పితికి పెట్టేవాడు.
కొంచెం ఎదిగిన తరువాత తలపోటు నేర్పాడు. తనచేత్తో దాన్ని గుద్ది దానికి కోపం వచ్చేటట్టు చేసి పౌరుషం తెప్పించేవాడు అప్పన్న. నానా యాతన పడి చివరకు దానికి పోట్లు నేర్పాడు.
ఆ నోరు లేని జీవానికి కూడా అప్పన్న అంటే మాలమి అయింది. అప్పన్నని తప్ప వేరే ఎవ్వరినీ తన దగ్గరకు రానిచ్చేది కాదు. దాన్ని చూసి భయపడేవాళ్లు అందరూ...
ఒకరోజు...
ముద్దుగా ముద్దొస్తున్నదని దగ్గరకు వెళ్లి బోకడపోతుని ముట్టుకోబోయాడు అప్పన్న యజమాని అయిన నూకరాజు. ఏమనుకుందో - ఏమోగానీ, ఒక్కసారి నాలుగడుగులు వెనక్కి వేసి ముందుకు వచ్చి ఎగిరి పొడిచింది. ఆ పోటు వూపుకు వెల్లికిలా పడిపోయాడు నూకరాజు. అంతలో అప్పన్న అక్కడే వుండడంతో పరుగున వెళ్లి దాన్ని పట్టుకున్నాడు.
ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా అప్పన్నకి నవ్వు పుట్టుకొస్తూంటుంది. బొగడపోతు కనిపించక పోయేసరికి అంత బాధలోనూ ఆ విషయం గుర్తొచ్చి నవ్వాపులేకపోయాడు.
"దానికి తనంటే ఎంత మాలిమి! అది తనకి ఎలా మచ్చిజయిపోయింది?" మనిషిని మనిషే గౌరవించని ఈ రోజుల్లో ఓ మూగజీవి తనకి విలువ ఇచ్చేసరికి ఆనందంతోపాటు ఆశ్చర్యపోయేవాడు అప్పన్న.
అలాంటి బొకడపోతు కనిపించక పోయేసరికి నిజంగానే బాధపడ్డాడు అప్పన్న. పొడమేక కనిపించకపోతే యజమాని ఏవంటాడో? అని బాధపడ్డాడు. కానీ, బొకడపోతు - ఆంబోతులాంటి బొకడపోతు కనిపించలేదంటే ఊరుకుంటాడా తన యజమాని? అగ్గిమీద గుగ్గిలవై పోడూ?! అప్పనీ, అమ్మనీ తిట్టిపొయ్యడూ?!
తన యజమాని శివతాండవాన్ని గుర్తు చేసుకున్న అప్పన్నకి కంపరం పట్టుకుంది. ఒకవేళ దాన్ని ఏ మెఖవో పొట్టన భెట్టుకుంటేనో?! అమ్మో! ఇంకేవన్నా ఉందా? - దాని ఖరీదు ఏ అయిదొందలో అని తనమీద రుద్ది ముక్కుపై గుద్ది వసూలు చెయ్యడూ?!
ఆ మందని అలాగే అక్కడ వదలి ప్రతీతుప్పా వెతుకుతూ అడవంతా గాలించాడు అప్పన్న.
అప్పటికే చీకటి తెరలు అలముకుంటున్నాయి. అది కొండ ప్రాంతం కావడం వలన చీకటి చిక్కగా వుంది.
ఎక్కడో - ఏదో మూలన తనకి బాగా పరిచయమున్న వాసన ముక్కు పుటాలను అదరగొట్టేసరికి ఆ పరిసర ప్రాంతాల్లోని తుప్పల్ని మరింత పరిశీలించి చూశాడు అప్పన్న.
ఏ కీలుకాకీలు వేరు చేయబడి తోలు తప్ప ఏవీ మిగల్ని పొడమేక శరీరం కనిపించింది. అప్పన్నకి ముచ్చెమటలు పోశాయి.
ఇంతకు పూర్వం కూడా చాలా మేకల్ని కొట్టింది మెఖం. కానీ, ఏ మేకనీ ఆనవాలు కూడా మిగల్చకుండా తిన్నదే గానీ, ఇలా వదలి వెళ్లలేదు. తన పని పూర్తి కాకుండానే ఇలా ఎందుకు వదలి వెళ్లిపోయిందో అప్పన్నకి అర్థం కాలేదు. బొఘడపోతు కోసం వెదకాలనుకున్నా అప్పటికే చీకటి దట్టంగా ఆవరించుకుపోయింది. దారి కానరాక అడవిలో చిక్కుపడితే మిగతామందని కూడా కాయడం కష్టం.
ఆ ఆలోచన మదిలో మెదిలేసరికి చచ్చిన పొడమేక శరీరాన్ని భుజాన వేసుకొని మందని మళ్లించాడు అప్పన్న.
అప్పన్న
ఎక్కడ పుట్టాడో - ఎవరికి పుట్టాడో ఎవర్కీ తెలీదు. పదేళ్ల వయసులోనే పని వెదుక్కుంటూ వచ్చిపడ్డాడు. అప్పన్న యజమాని పేరు - నూకరాజు. పేరు చివర రాజన్నంత మాత్రాన అతను రాజవుతాడా? వృత్తిరీత్యా నూకరాజు రైతు అయినా రకరకాల వ్యపారాలు చేసి కాస్త పైకెదిగిన వ్యక్తి.
పదిహేనేళ్లప్పుడు అప్పన్న తన పంచన చేరినప్పుడే అన్ని పనులూ పురమాయించి ఇంకా నీకు ఖాళీగా తోస్తే ఈ మేకను మేపుతూ ఉండమని ఒక చిన్న మేకపిల్లని ఇచ్చాడు నూకరాజు. స్వతహాగా స్వామి భక్తుడయిన అప్పన్న కళ్లల్లో వత్తులు పెట్టుకొని ఆ మేకపిల్లని ఇవ్వాల్టికి మేకలమందని చేశాడు.
ఆనాడు - నూకరాజు అయిదు రూపాయలు పెట్టి మేకపిల్లని కొని ఇస్తే, ఈ కోజు అయిదు వేలకు పైచిలుకు ఖరీదు చేసే మేకలమందని చేశాడు అప్పన్న.
మేడిపట్టడం చేతగాని నూకరాజు తనకున్న పొలాన్ని కౌలుకు ఇచ్చేసి చిల్లరమల్లర వ్యాపారాలు సాగిస్తూ గడుపుతున్నాడు.
అప్పన్నకి ఊరికినే తిండీ - బట్టా కాక నెలకో వంద చేతిఖర్చు క్రింద చెల్లిస్తుండడం దండగనిపించి నాలుగయిదు గేదెల్ని కొని వాటిని కూడా అప్పన్నకి అప్పగించాడు. ఆ గేదెల పాలు 'టీ' దుకాణాల వర్తకులకు, ఇతర ఇళ్లకు నెలసరి వాడకం వేసి ఆ సొమ్ములి వసూలు చేసి అమ్మగారి చేతిలో పొయ్యాలి.
పొద్దస్తమానం ఎంత గొడ్డుచాకిరీ చేసినా అప్పన్నకు విసుగు అనిపించేది కాదు. చిన్నప్పట్నుండి పెరిగి - పెద్దయిన ఇంటి బాగుకోసం - కుటుంబం మేలుకోసం తనూ ఆ ఇంట్లో ఓ వ్యక్తినే అన్న భావనతో ప్రతీ పనినీ 'నాదంటూ' కష్టపడడం నేర్చుకున్నాడు అప్పన్న.
నా అన్నవాళ్లు ఎవరూ లేని అప్పన్నకు తల్లీ, తండ్రీ, దైవం సమస్తం నూకరాజే అయి పెంచడం - తన కన్న కొడుకులా చూశాడన్న నమ్మకం అప్పన్నలో నాటుకుపోయింది.
అప్పన్న వయసులో అడుగుపెట్టే సరికి ఇంటి పనిమీద కొంత శ్రద్ధ తగ్గినట్టు నూకరాజుకు అనుమానం వచ్చేసరికి వెంటనే వూర్లోనే ఉన్న మరో పాలేరు కూతుర్ని చూసి మూడుముళ్లూ వేయించేశాడు.
యజమాని తన మేలుకోరి - తనని ఇంట్లో ఒక వ్యక్తిగా తలచి కదా పెళ్లి చేశాడనుకున్నాడు అప్పన్న.
ఆ రోజునుండి ఆ దంపతులిద్దరూ నూకరాజు గార్ని దేవుడిగా భావించి సేవలు చేసుకోసాగారు.
పెళ్లయిన తర్వాత ఇంట్లో పని తన భార్యకు అప్పగించి, బైటపనంతా తను చక్కబెట్టుకొనేవాడు.
డబ్బుతో లావాదేవీలు తప్ప వేరే పనంతా అప్పగించాడు నూకరాజు. అప్పన్నకు పెళ్లయిన బరునాడే తన ఇంటి వెనుక గుడిసె చేయించి యిచ్చాడు.
పొద్దస్తమానం తమ పని తాము చేసుకొని రాత్రయ్యేసరికి తమ పూరిగుడిసెని చేరుకొని కష్టసుఖాలు చర్చించుకునేవారు భార్యాభర్తలిద్దరూ.
కౌలుకు ఇచ్చిన భూమిని కూడా తిరిగి తీసుకొని అప్పన్నకు అప్పగిస్తూ ఇలా అన్నాడు నూకరాజు.
"ఒరేయ్! నీకూ పెళ్లయింది. పెళ్లావూ ఉంది. ఎంతకాలం నా ఇంట్లో తిండితిని, నా కోసం బ్రతికి బట్టకడతావ్? నేనిచ్చే వందా నీకే చాలదు.
ఇకనుండి మన పొలం కూడా నీవే పండించుకో. సంవత్సరానికి సరిపడా ధాన్యం నువ్వు తీసుకొని మిగతా ధాన్యం అమ్మేసి డబ్బు అమ్మగార్కి ఇచ్చేయి. ఇకనుండీ నీకు చేతి పై ఖర్చుకి ఏభై ఇస్తూ మిగతాది నీ పెళ్లాం పేర బ్యాంకులో వేస్తాను. సరేనా?
ఆ వేళ... తన యజమాని... తనని ఆయన ఎదురుగా కూర్చోబెట్టుకొని బోధించిన బోధన సంతోషంలో ముంచెత్తింది అప్పన్నని.
అంతవరకూ అంతవరకూ తను దాచుకున్న డబ్బుల్లో ఇంట్లోకి కావలసిన వస్తువులు, పట్టిమంచం, స్టీలు సామానులు, వంట పాత్రలు ఇతరత్రా సామానులు కొని పడేశాడు అప్పన్న.
ఉదయాన్నే భార్య లేచి వంటచేసి తన యజమాని గారింటికి పోతుంది. తిరిగి సాయంత్రం వేగంగా వచ్చి వంట చేసేస్తుంది. మధ్యాహ్నం భోజనానికి వచ్చి క్షణం నడుంవాల్చి తిరిగి రెండు గంటలకల్లా అక్కడుండాలి.
'పాపం... తనపని తలు చేసుకుంటూ తనూ కష్టపడుతోంది!' అప్పుడప్పుడూ ఆ ఆలోచన వచ్చినప్పుడు బాధ కలిగేది అప్పన్నకి. ఎక్కడో పుట్టి... ఇక్కడ పెరిగి... పెళ్లి చేసుకొని తనూ... భార్య... తన ఇల్లూ... వాకిలీ... భావిజీవితం గురించి కలలు కంటూ జీవించసాగాడు అప్పన్న.
"నువ్వు మందని ఎందుకు తోలుకెళ్లావ్?!" కుర్చీలో నుండి లేవకుండానే ఘీంకరించాడు నూకరాజు. అతని ప్రక్కనే అతని సతీమణి పార్వతమ్మ నిలబడి ఉంది. నూకరాజు కుదురుగా తలపాగా చుట్టి ఉన్న తలని దించుకు నిలబడ్డాడు అప్పన్న.'
"........................................." యజమాని అన్న ప్రతీమాటా చెవులు రిక్కించుకుని విన్నా నోరు మెదపలేదు అప్పన్న.
"మందని అడవికి తోలుకెళ్లి కలలు కంటూ కూర్చుంటే ఎలా అవుతుంది? అలాంటప్పుడు చాతకాదని కాళ్లు ముడుచుకొని ఇంట్లో కూర్చోవాలి..." క్షణం ఆగి... "మెఖం దీన్ని తింటూంటే చూస్తూ కూర్చున్నావా?... ఏవిట్రా? ఉలకాపలకవ్! బంకిబుక్కడంలాగా... బట్టి కొట్టుకుపోయిందా నోట్లో. నేను అడుగుతున్నది నిన్నే. అర్థమవుతోందా?! కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ లేచాడు కుర్చీలోంచి నూకరాజు.
జరుగుతున్న తతంగమంతా వంటగది ద్వారం దగ్గర నిలబడి గమనిస్తోంది అప్పన్న భార్య సూరమ్మ. భర్త దెనావస్థని చూసేసరికి సూరమ్మ కళ్లనీళ్లు కుక్కుకుంది. మనిషంత మనిషిని పట్టుకొని నానా దుర్భాషలు ఆడుతుంటే సూరమ్మ మనసు సహించటం లేదు.
ఏదో...! జరిగిపోయిన చిన్న తప్పుకు ఎంత పెద్ద రాద్దాంతం? మనసులోనే గుణుక్కుంటోంది సూరమ్మ.
నోట్లో చీరచెంగు కుక్కుకుని నిలబడి చూస్తోంది. భర్త దీన పరిస్థితిని చూస్తోంటే సూరమ్మకి కళ్లనీళ్లు ఆతటం లేదు. కట్టలు త్రెంచుకోబోతున్న దుఖాన్ని చీరచెంగుతో నొక్కిపట్టి శిలలా నిలబడి పోయింది.
"అడివంతా గాలించానయ్యా! చీకటి పడ్డ తర్వాత పొడమేక కనిపించింది. ఇంకా చీకటి పడిన దాకా ఉంటే అడవిలో చిక్కుకుపోతామని మందని మళ్లించేశాను" ఎట్టకేలకు చిన్నగా చెప్పాడు అప్పన్న.
"ఏడిశావ్! ఆంబోతులాంటి బొకడపోతు ఏవైందో? ఏవిటో! చూడకుండా ఈ చచ్చినదాన్ని తీసుకువచ్చావ్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? పోన్లే, దీన్లో మాంసం ఉందా? అంటే అదీ లేదు. అసలు ఇంతకీ... బొగడ సంగతేంటట?"
"ఇప్పుడు తిండి తిని లాంతరట్టుకెళ్తానయ్యా!"
"ఎలాగో తగలడు. నాకు మాత్రం ఉదయానికల్లా ఆ బొజడతో కనిపించాల నువ్వు. అరేయ్ అప్పన్నా! ముందు నువ్వు తిండి తినేసి చుక్కలోడి ఇంటికెళ్లి మన దగ్గర మేక ఉందని, కావలిస్తే తెల్లవారు జామునే వమ్మెయ్యమను. ఆలస్యమయితే ఇది పాడయిపోతుంది."
"అలాతే!" తలవూపుతూ అనుకున్నాడు. "చచ్చిన మేక"ని కూడా సొమ్ము చేసుకుందామని గావాల?! అసలు వచ్చినా వందో... ఏభయ్యో వస్తుంది. ఆ చుక్కలోడు ఇచ్చేది తక్కువ. ఆడు అమ్ముకొనేది చిల్లర వంతులు కదా! ఎక్కువే వస్తుంది. అసలు చచ్చిన మేక మాంసం అని తెలిస్తే ఎవరు కొంటారు?
భోజనం చేసినప్పుడు తన బాధనంతా ఏకరవు పెట్టింది సూరమ్మ. అంతవరకు దిగమ్రింగుకున్న దుఖాన్ని వెళ్లగక్కేసింది. భార్య ఆవేదన అర్థం చేసుకున్న అప్పన్న అన్నాడు. "మన తల అమ్ముకున్నోళ్లవే! తలదించుకు నిలబడ్డంత మాత్రాన మనకేవీ చిన్నతనం కాదు. నేను కొండకాసి ఎళ్లాల, నువ్వు తలుపులు వేసి పడుకో"
తన యజమాని చెప్పిన కబురు చెప్పేసి చాకిరేవు కొండవైపు బయలు దేరాడు.
చుట్టూ కటిక చీకటి. ఉండుండి గుడ్లగూబల అరుపులు. చాలా భయంకరంగా వుంది వాతావరణం. కానీ, అప్పన్న దేన్నీ పట్టించుకోవడంలేదు. అప్పన్న ఆలొచన్లన్నీ సాయంత్రం జరిగిన సంఘటన మీదే కేంద్రీకృతమై ఉన్నాయి.
"పొడమేకని మెఖం పొట్టన బెట్టుకుంది. దాన్లోన తన తప్పేవుంది? ప్రతీ మేకనీ కాపు కాయలేలు కదా? మందనయితే అడవికి తోలుకెళ్తాను. తిరిగి మళ్లిస్తాను గానీ ఏ మేక మేస్తొందో... ఏది మెయ్యలేదో గమనించలేను కదా?!
మధ్యన ఈ ఎదవ బొకడ ఒకటీ! ఏవైందో... ఎక్కడ చచ్చిందో, కొంపదీసి దీన్ని కూడా మెఖం మేసేసిందా? ఇంకేవన్నా వుందా? నాలుగైదొందలు ఖరీదు చేసే బొకడగానీ చచ్చిపోతే తనని ఉంచుతాడా తన యజమాని?
ఆ ఆలోచన మెదిలేసరికి గబగబా అడుగులు వేయసాగాడు అప్పన్న.
కొంతదూరం నుండి ఒక ఆకారం మెల్లిమెల్లిగా కుంటుతూ తనవైపే రావడం గమనించాడు అప్పన్న. మరింత పరిశీలనగా చూశాడు.
కుంటుకుంటూ వస్తోంది బొకడ!' మనసులోనే అనుకున్నాడు. అప్పన్నకి పట్టలేని ఆనందం ఆవరించుకుంది.
సంతోషం ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంటే పరుగు పరుగున వెళ్లి దాన్ని కలుసుకున్నాడు. ఆనందంగా దాని పీకని వాటేసుకున్నాడు అప్పన్న.
ఎదురుగా వస్తున్న వెలుతురు రవ్వ పరుగు పెట్టేసరికి చెవులు రిక్కించుకు నిలబడిపోయింది బొకడపోతు. ఆ వెలుతురులో తన యజమాని కనిపించేసరికి పరుగు పరుగున ఎదురు వెళ్లింది. దానికి ఆ సమయంలో కాలు బాధ తెలీలేదు.
అప్పుడు... ఆ తర్వాత చూశాడప్పన్న. బొకడ ఎందుకు మెక్కుతున్నదీ కనుక్కుందామని వొంగొని కాళ్లవైపు చూశాడు. ముందర రెండు కాళ్లల్లో ఒకదానికి గాయమై ఉంది. రక్తం ధారలా కారుతోంది. గభాలున తలపాగా విప్పేసి రక్తం కారకుండా దాని కాలికి గట్టిగా కట్టాడు.
ఆ మూగజీవి తన బాధని... తను పడ్డ శ్రమని చెప్పుకోలేకపోయినా అప్పన్నకి అర్థమయిపోయింది.
'పొడమేకని మెఖం చంపుకు తింటున్నప్పుడు చూసిన బొకడపోతు ఆ మెఖంతో పోరాడి దాన్ని తరుముకుంటూ వెళ్లుంటుందని గ్రహించగలిగాడు. అలాంటప్పుడే మెఖం దీనిపైబడి కరిచినట్టుంది ' అనుకున్నాడు అప్పన్న.
అది నిజవన్న విషయం ఆ బొకడపోతుకే తెలుసు.
ఆ రోజు...
తన పనంతా పూర్తి చేసుకొని ఎనిముదయ్యేసరికి మందని అడవికి తోలుకువెళ్లడానికి బయలుదేరాడు అప్పన్న. అంతలోనే తన పెళ్లాం ద్వారా యజమాని కబురు పెట్టేసరికి వెళ్లి కలుసుకున్నాడు.
"ఇకనుండీ రోజూ రాత్రుళ్లు మన అనాసతోటలో పడుకోవాల్రా! ఇది అనాసకాయల సీజను కదా! దొంగలంజాకొళ్లు... దొంగవెధవలు కోసుకుపోతారు. ఇవాళ నువ్వు మందనుండి వచ్చిన వెంటనే తిండి తిని తోటలోకి వెళ్లిపో!"
యజమాని చెప్పింది విని తలవూపుకొని యాంత్రికంగానే మందతో బయలు దేరాడు అప్పన్న.
గుడిసెలో ఇవాళ నుండీ సూరమ్మ ఒక్కర్తీ పడుకోవాల? పాపం! అదొక్కర్తీ ఎలా పడుకుంటుందో ఏమో?
ఆ రోజంతా అన్యమనస్కంగానే సాయంత్రం వరకూ అడవిలో గడిపాడు. మందని మళ్లించి ఇల్లు చేరుకున్నాడు.
మేకలమందని శాల్లోకి తోలి తడికేసి గుడిసెలోకి పోయి, విచారంగా కూర్చున్నాడు అప్పన్న.
'దేవుడి కొండకి ఇప్పుడు తిండి తిని ఎలా వెళ్లడం? ఇప్పటికి ఉదయం నుండీ ఆయిసుపు లేకుండా పోయింది. ఎదవ ఒక దగ్గర ఉండి ఛస్తేనా? అడ్వంతా త్రిప్పించాయి. ఈరోజు మందని మళ్లించే సరికి తలప్రాణం తోక్కొచ్చింది. మందని మళ్లించేసరికి ఎంత కష్టమనిపించింది?
ఇటు తోలితే అటూ, అటు తోలితే ఇటూ... ఈ మేకలకంటే గొర్రెలు నయం. ఉంటే అన్నీ ఒక్కదగ్గరే ఉంటాయి. మేస్తే ఒక్కదగ్గరే మేస్తాయి' ఆలోచిస్తూ అలాగే నడుం వాల్చాడు అప్పన్న
.
నులకమంచం నుసికి... నొప్పికి ఎవరో మర్దనా చేస్తున్నట్టనిపించింది అప్పన్నకి.
అసలు సూరమ్మని వొదిలి వెళ్లడానికి మనసొప్పలేదు అప్పన్నకి.
అవును ఎలా వెళ్తాడు? అప్పన్న ఏవైనా ముసలోడా? పాతికేళ్ల వయసుగల పడుచుజంట. పెళ్లయి మూన్నాళ్లు కాకుండానే విడిగా ఉండమంటే ఉండగల్రా?
అదే కుర్రవయసు అప్పన్ననీ చిత్రవధ చేస్తోంది.
ఇటు యజమాని ఆదేశం - అటు మనసు ఆరాటం.
వెట్టిచాకిరీ బ్రతుక్కి అతుక్కుపోయిన అప్పన్నేం చేయగలడు? మనసు చంపుకొని మనడం తప్ప వేరే మరేం చేయగలడు?
ఆ రాత్రంతా అనాసతోటలో సూరమ్మ ధ్యాసలోనే గడిపాడు అప్పన్న. అతనితోపాటు ఆ చుత్తుప్రక్కల తోటలను కాపు కాయడానికి వచ్చిన అప్పన్నలాంటి వాళ్లంతా ఒక్కదగ్గర చేరి కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు.
తెల్లవారు ఝామున వస్తూనే గుడిసెలోకి పోయి ముసుగుతన్ని పడుకుండిపోయాడు అప్పన్న. భర్త వచ్చిన అరగంట పోయింతర్వాత లేచి ఇంటిపనీ, వంటపనీ పూర్తయిందనిపించి యజమానిగారింటికి పనికి వెళ్లిపోయింది సూరమ్మ. రాత్రంతా నిద్ర ఉండి ఉండదన్న ఉద్దేశంతొ అప్పన్నను లేపటం మానేసింది.
ఎండ నడినెత్తికెక్కేసరికి మెలకువ వచ్చింది అప్పన్నకి. అప్పటికి పది దాటిపోయింది. బద్దకంగా లేచి పందుంపుల్ల తీసుకొని గడ్డిమేటు దగ్గరకు వెళ్లాడు అప్పన్న.
అప్పుడే నిద్రలేచి బైటకు తోటలోకి వెళ్లివస్తున్న నూకరాజు, అప్పన్నని చూస్తూనే చిర్రుబుర్రులాడాడు.
"ఏరా ఇవాళ మేకలకి పస్తేనా?! ఎన్నడూ లేనిది దొరగారు ఇవాళ ఇంత ఆలస్యంగా లేచారేవిటీ? పెళ్లాం మోజులో ముసుగుతన్ని పడుకున్నావేమిటి? మనం గిన్నెడు మెక్కగానే సరికాదు. ఆ నోరులేనివి ఏవి తింటాయని అడవికి తోలుకెళ్లడం మానేశావ్?! అప్పుడే నీక్కూడా జిడ్డు బలిసిపోయిందన్నమాట. నిన్ననేపని లేదురా! నాది... నాదిరా బుద్ధి తక్కువ. దిక్కుమాలిన లంజాకొళ్లని నెత్తికుక్కించుకొంటే ఇలాగే ఉంటాది " అని తిట్టుకుంటూ వెళ్లిపోయాడు నూకరాజు.
తన యజమాని ఎన్ని మాటలు అన్నా వినీవిననట్టు తలవంచుకొని పందుంపుల్ల కుంచలా నములుతూనే నిలబడిపోయాడు అప్పన్న.
నూకరాజు తిట్టిన తిట్లకి పూర్వం అయితే పట్టించుకొనేవాడు కాదు. కానీ... ఇప్పుడు ఓ ఇంటివాడే. ఓ ఇంటికి, ఇల్లాలికి యజమానే. అతనిలోనూ చీమూ, నెత్తురూ ఉంది.
నూకరాజు అన్న ప్రతీమాటా అప్పన్న గుండెల్లో సూటిగా నాటుకు పోయింది. కానీ, ఏంచేస్తాడు? ఏంచేయగలడు?
అప్పుడే చూశాడు తలెత్తి... ఎదురుగా చేటతో చెత్తపట్టుకొని నిలబడ్డ భార్యని చూశాడు.
'ఇప్పుడు జరిగిన సన్నివేశం అంతా నేనూ చూశాను ' అనడానికి సాక్ష్యంగా ఆమె కళ్లల్లో నీళ్లు గిర్రున సుళ్లు తిరిగాయి. అప్పన్న మనసు కలుక్కుమంది.
మొహం కడుక్కోవడం పూర్తయిన వెంటనే 'దోని ' (చెట్టుపైగల ఆకుల్ని క్రింద నుండే కోసేందుకు ఉపయోగపడే సాధనం) పట్టుకొని వెళ్లి రెండుమోపుల రావి ఆకులు తీసుకువచ్చాడు అప్పన్న. మేకల మందని ఉంచిన శాల్లో ఆ రెండు మోపుల ఆకులూ పడేసి... గోళాంలో నీళ్లు కూడా పెట్టి బైటకొచ్చాడు.
అంతలోనే అప్పన్నని కేకేస్తూ పోస్ట్ మేన్ అప్పలస్వామి వచ్చాడు. వస్తూనే నూకరాజు దగ్గరకు వెళ్లాడు పోస్ట్ మేన్. ఏవిటో, ఏందుకో అర్థంకాని అప్పన్న ఆత్రుతగా అక్కడకు వెళ్లాడు. అప్పటికే తన పేరున వచ్చిన రిజిస్ష్టరు పోస్టు కవరు సంతకం పెట్టి తీసుకున్నాడు నూకరాజు.
"ఇదిగో! నువ్వు ఇక్కడ నిశీని వెయ్యి " అప్పన్న చేతికి ఇంకో కవరిచ్చి స్టేంప్ పాడ్ అందించాడు పోస్ట్ మేన్ అప్పలస్వామి.
"ఎందుకూ? ఎందుకు సావిగారూ!"
"మన అనాసతోటల గురించిరా! వెయ్యి" నూకరాజే కల్పించుకొని అన్నాడు. యజమాని సమాధానం విని మరి మారు మాట్టాడలేదు అప్పన్న. ఆ కవరు ఏవిటో, ఎందుకో అర్థమయిపోయింది. కానీ, దేనికో అర్థం కాలేదు అప్పన్నకి.
పోస్ట్ మేన్ వెళ్లిపోయిన తర్వాత నెమ్మదిగా అడిగాడు అప్పన్న.
"దేనికయ్యా ఈ కవిరిప్పుడొచ్చింది?" తల గోక్కుంటూ అన్నాడు.
"రేపు అనాసతోటల అధికార్లు వస్తారట! మనల్నందర్నీ పంచాయతీ ఆఫీసుదగ్గర పదికల్లా ఉండమన్నారు. నువ్వు రేపుకూడా అడవికెళ్లకు "
'ఎందుకూ, ఏవిటీ?' అని మరడగలేదు అప్పన్న.
అప్పన్న చేతిలో ఉన్న కవరు తీసుకొని బీరువా దగ్గరకు వెళ్లాడు నూకరాజు.
"నేను గుడిసెకు పోతానయ్యా!" నెమ్మదిగా అన్నాడు అప్పన్న.
"ఊ! సాయంత్రం వేగంగా లేచి మేకలకి ఆకులూ గట్రా సంపాదించి ఉంచు " వెనుతిరక్కుండానే అన్నాడు నూకరాజు.
గుడిసెలో...!
నులకమంచం మీద వెల్లికిలా పడుకొని గుడిసె పైకప్పుకేసి చూస్తూ ఆలోచిస్తున్నాడు అప్పన్న. అతని ఆలోచన్లు మూడేళ్ల క్రిందకు మళ్లాయి.
ఆ ఆలోచనలన్నీ అనాసతోటలు, కవర్లు... ఇలాంటి సంతకాల కవర్ల గురించే.... ఆలోచిస్తున్నాడు అప్పన్న.
మూడేళ్లనాటి మాట -
అడవినుండి మందని మళ్లించి ఇల్లు చేరుకున్నాడు అప్పన్న. అప్పటికింకా అప్పన్నకి పెళ్లి కాలేదు. ఆసరికే అప్పన్న కోసం ఎదురు చూస్తున్న నూకరాజు అప్పన్నని కేకేసి పిల్చాడు.
బల్లమీద కాగితాలు ముందరేసుకొని కూర్చొని ఉన్నాడు నూకరాజు. ద్వారం దాటి లోపలకు వస్తూ అన్నాడు అప్పన్న.
"ఏవయ్యా! పిల్చావు?" తలపాగా చుట్టుకుంటూ అన్నాడు అప్పన్న.
"ఏవీ లేదురా! ఇక్కడ నీ సంతకం వేయించుకుందామని"
"ఎందుకయ్యా!... ఏమిటీ?" ఆత్రంగా నవ్వుమొహంతో అన్నాడప్పన్న. 'ఇన్నాళ్లకి, ఇన్నేళ్లకి తన సంతకం... తన అవసరం కావలసి వచ్చింది. ఎవరికో కాదు తన యజమానికి ' ఆ ఆనందం తట్టుకోలేకపోతున్నాడు అప్పన్న.
"గవర్నమెంటోళ్లు ఒకో మనిషి పేరునా ఒకో ఎకరం భూమి దేవుడికొండ మీద ఇస్తున్నారు. నీ పేరున కూడా ఒక ఎకరానికి పెడదామనీ..."
"అదెందుకయ్యా?!"
"ఎందుకేవిట్రా? అనాసతోట వెయ్యాలి. అనాసతోటలు పండేది కూడా ఎక్కడనుకున్నావు? కొండప్రాంతంలోనే కదా! అందుకని ఒకో రైతుకూ ఒకో ఎకరం ఇస్తూ మూడువేల రూపాయలు అప్పుక్రింద గవర్నమెంటే ఇస్తుంది. పంట చేతికందిన తర్వాత ఆ అప్పును సక్రమంగా జమచేస్తే ఆ భూమి కూడా మనకే దక్కుతుంది. పట్టా కూడా రాసిస్తారు"
"................................." నవ్వుతూ అంతా విని నిశాని వెయ్యమన్నచోట వేసేశాడు అప్పన్న.
"రేపు బ్యాంకు ఆఫీసర్లు వస్తారు. సాయంత్రం వేగంగా మందనుంచి వచ్చెయ్!"
"అలాగే!" అంటూ వచ్చేశాడు అప్పన్న.
ఆ తర్వాత మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మొదటి పంట చేతికందినప్పుడు అప్పన్న పేరున ఓ రిజిష్టరు కవరు వచ్చింది. ఆ తర్వాత మరో మూడు కవర్లు వచ్చినప్పుడు భయంతో అప్పన్న గాబరా పడిపోయాడు. తన యజమాని మాటపై విశ్వాసం పోయి పోస్ట్ మేన్ అప్పలస్వామిని అడిగాడు అప్పన్న.
గవర్నమెంటు వాళ్ళు ఇచ్చిన భూమి, అప్పు నీ పేరనే ఉందని...ఆ బాకీ చెల్లించే బాధ్యతయినా, హక్కు అయినా అప్పన్నకే ఉందని పోస్ట్ మెన్ అప్పలస్వామి చెప్పిన తర్వాత చాలాసార్లు ఆ అనాస తోట అప్పు గురించి తన యజమానితో ప్రస్తావించించాడు అప్పన్న. అలా ప్రస్తావించమని సలహా ఇచ్చింది కూడా పోస్ట్మెన్ అప్పలస్వామే. !
"నీపేర భూమి ఉన్నప్పుడు నిన్ను పట్టుకుంటారు తప్ప అతన్ని ఎందుకు అడుగుతారు? ఎప్పుడైనా ఆ అప్పుకు బాధ్యుడవు నువ్వే.! ఇవాళ కాకపోయినా రేపైనా గవర్నమెంటు తన అప్పు వసూలు చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఆఖరికి నీ ఇల్లు , ఆస్తి జప్తు చేసైనా అప్పు వసూలుకు ప్రయత్నం సాగిస్తుంది.
ఎందుకైనా మంచిది ఒకసారి ఈ విషయం మీ అయ్యని అడిగి చూడు. "
ఆ రోజు పోస్ట్ మెన్ అప్పలస్వామి గీతోపదేశానికి అర్జునుడిలా చేతులు జోడించి నమస్కారం చేస్తూ కూర్చుండిపోయాడు అప్పన్న.
సూరమ్మ కుదుపులకు కళ్ళు తెరిచాడు అప్పన్న. ఆలోచిస్తూ ..ఆలోచిస్తూ ఎప్పటికి నిద్రపోయాడో తెలీదు. కళ్ళు తెరిచి చూసేసరికి ప్రక్కన భార్య సూరమ్మ నిలబడిఉంది. ఎందుకో కడుపులో మంటగా అనిపించింది అప్పన్నకి. తను మధ్యాన్నం తిండి తినలేదన్న విషయం గుర్తొచ్చి చిర్రెత్తుకొచ్చింది ఎదురుగా సూరమ్మని చూసేసరికి ఒళ్ళు మండుకొచ్చింది అప్పన్నకి.
" తిండికి లేపడానికి ఏవొచ్చింది నీకు!"
" బాది..బాది విసిగిపోయి ఆకలైతే నువ్వే లేస్తావని ఊరుకొన్నాను..."అంటూనే " లేవయ్యా!ఏవిటా మొద్దు నిద్ర అవతల ఆ ఏటగాళ్ళు (పోతుల్ని కొని తామే నరికి మాంసం అమ్ముకునేవాళ్ళు) కూర్చున్నారు"
" ఎందుకూ!? అక్సురుకున్నాడు అప్పన్న.
" ఎందుకేటి? మేకపోతుని కొనుక్కున్నారు. దాన్ని తీసుకు వెళ్ళడానికి....!"
" ఏపోతూ...?"
"బొకడ-బొకడపోతు తెలీదా? ఇంకేపోతుందని పోతానంటున్నావ్?"
" అమ్మేశారా?!"
" ఆ...! కొనుక్కున్నారు కాబట్టే దాన్ని తీసుకెళ్దామని దగ్గరకు వెళ్ళారు. ఒక్కోడికీ నాలు పోట్లు పొడిచింది. పాపం.. ఎవరూ దాని జోలికి పోలేక పోయారు. " నవ్వాపుకుంటూ అంది సూరమ్మ.
"......." మౌనంగా లేచాడు అప్పన్న.
" ఏగంగా ఎల్లి దాన్ని ఆల్లకు అప్పగించేసి రా...అయ్యగారు కూడా కసురుకుంటున్నారు ఎల్లు " గుడెసెలో నుండి బైటకు తోస్తూ అంది సూరమ్మ.
బొకడపోతును తీసుకుని ఆ ఏటగాళ్ళతోబాటు ఇంటివరకూ తోలుకెళ్ళాడు అప్పన్న. అప్పటికే అక్కడ బాన, కత్తీ గట్రా సిద్ధం చేసి ఉంచారు. వీళ్ళు వెళ్ళిన వెంటనే ఒకడు బొకడపోతు వెనక రెండు కాళ్ళూ ఒడిసి పట్టుకున్నాడు. రెండో వాడు అప్పన్న చేతిలో ఉన్న మెడకన్ని( మెడకు కట్టే త్రాడు) పట్టుకొని ముందుకు బలంగా లాగుతూ నిలబడ్డాడు.
వెనక వ్యక్తి కాళ్ళూ ...ముందు వ్యక్తి మెడకు కట్టిన కన్నీ బలంగా లాగుతూ నిలబడే సరికి ఎటూ కదలలేకుండా ..కదల్లేకుండా శిలలా నిలబడిపోయింది బొకడపోతు అనబడే మేకపోతు.
మూడో వ్యక్తి ఏటకత్తి ఎత్తి మూడుసార్లు క్రిందకూ మీదకూ ఎత్తి ఒకే ఒక్క బలమైనా దెబ్బ మెడమీద వేశాడు.
ఆ కత్తిదెబ్బకు మొండెం నుండి తల వేరయ్యింది. ఓ రెండు నిముషాల పాటు కాళ్ళు కొట్టుకొని ప్రాణం వదిలింది బొకడపోతు.
దాని తలమీద కత్తివేటు పడ్డప్పుడు..అప్పటికే తన చావు దానికి అర్థమయ్యేసరికి ఒకసారి బేలగా అప్పన్న కళ్ళల్లోకి చూసింది..దాని కళ్ళల్లో నీళ్ళు సుల్లు తిరిగాయి
.
ఆదృశ్యం చూసిన అప్పన్నకి మనసు ముక్కలైపోయింది.
దాని స్థానంలో తనే ఉంటే ఎలా ఉండేదో ఊహించుకొనేసరికి శరీరం గగుర్పొడిచింది అప్పన్నకి.
తనమీద విశ్వాసంతో ..భక్తితో దాని ప్రాణం తన చేతుల్లో పెట్టి కళ్ళు మూసుకుందా మూగజీవి.
అదే దుస్థితి మనిషికీ సంభవిస్తే...?
ఆ మరునాడు-
పంచాయితీ అఫీసులోని మీటింగ్ కు సమితి అఫీసర్లు, ఆర్ధిక సహాయం చేసిన బ్యాంక్ ఆఫీసర్లు, ఇతర ప్రముఖులూ అందరూ హాజరయ్యారు.
రైతులందరూ కూడా హజరై మీటింగ్ హాల్లో ఆశీనులై ఉన్నారు.
ఆ మహాసభ రైతులంద్ర్నీ ఉద్దేశించి పెట్టిన సభ కావటం చేత అంతా వాళ్ళ కష్టసుఖాలు గురించి మాట్లాడుతూ ముగించారు. ఆ సభ ముగిసే ముందు బ్యాంకు ఆఫీసర్లు చేసిన హెచ్చరిక మాత్రం అప్పన్న మనసులో నాటుకుపోయింది.
" మీకు భూమినిస్తూ..అప్పులిచ్చింది ఎందుకు? ,ఈరు బాగుపడి..దేశాన్ని బాగు చేస్తారని. మీరు బాగుపడితే దేశం ఆర్థికంగా మెరుగు పడ్డట్టే కదా.!
"ఆ దగ్గర ఏదో సొమ్ము మూల మూలుగుతుందని కానీ, మీరిచ్చే వడ్డీల మీదే బ్యాంకు ఆధారపడి ఇచ్చిందని గానీ అపోహ పడకండి. మీకు అప్పులిచ్చి అన్ని సౌకర్యాలూ సమకూర్చింది ..కేవలం దేశానికి వెన్నముకలైన మీరు బాగుపడాలని.
మీరు కూడా మీ మీ బాధ్యతలు నెరిగి పంట చేతికందిన వెంటనే పంటనమ్మిన మొత్తం లో సగం మాత్రం అప్పుక్రింద జమ చేయండి. మిగిలినది మీ ఇంటి ఖర్చుల క్రింద వాడుకోండి. కనీ, అసలు పైసా కట్టకుండా ఎగ వెయ్యడానికి, గవనమెంటు సొమ్మే కదా అడిగే నాధుడు లేడని భ్రమపడి జమ చేయడం మానకండి. ఆ అప్పుల విషయాలలో మీ ఇల్లు..ఆస్థులు సమస్తం జప్తు చేసే వరకూ వస్తుంది. దయచేసి మమ్మల్ని మీ ఇంటి వరకూ రానివ్వకండి. !"
ఆ వారం తర్వాత...
అనాస తోటలో మొదటి పంట దిగినపుడు ఇంటికి ఆరుకాయలు తెస్తూ సూరమ్మకి ఒకటి ఇచ్చి మిగిలిన అయిదు పళ్ళూ యజమానురాలికి అందించాడు అప్పన్న.
బజార్లో మొదటిపంటలో దిగిన అనాస పళ్ళు అన్నీ వందల ప్రకారం తట్టలకెక్కించి అమ్మేసి ఇంటికి చేరుకున్నాడు నూకరాజు.
"ఏమేవ్?? ఇప్పుడు అప్పన్నగాడు తెచ్చిన అనాస పళ్ళు ఆరూ మనకనుకొని కోసెయ్యకు. పంచాయితీ ప్రెసిడెంటు గారింటికి పంపాల!" ఆయాసంతో కూర్చుంటూ అన్నాడు నూకరాజు.
" ఆరేటి?..? అయిదు. అదిగో అక్కడ పెట్టాను తీసుకుపోండి?" మూతి మూడు వంకర్లు త్రిప్పుతూ అంది
అతని భార్య.
"అయిదా? ఆరు కదా పంపించాను" గొణుక్కున్నాడు నూకరజు.
" ఆ ఒకటీ తన ముద్దుల పెళ్ళానికి ఇచ్చాడు.. వెళ్ళి అడగండి"
" అమ్మడియమ్మా! ఎంతకైనా తెగిస్తాడే!" కోపం పట్టలేకపోయాడు నూకరాజు.
అప్పుడే అక్కడకు వస్తున్న సూరమ్మ భార్యాభర్తలిద్దరూ అనుకున్న మాటలన్నీ వింది. తిన్నగా వెళ్ళి గుడిసెలో ఉన్న అనాస పండు తీసుకువచ్చి అయిదు పళ్ళున్న దగ్గరపెట్టి వెళ్ళ్బోయింది. అదంతా బల్లమీద కూర్చుని చూస్తున్న నూకరాజు కళ్ళు ఎర్రబడ్డాయి. కానీ ఏవీ అన్లేదు.
ఆ సాయంత్రం మంద నుండి వస్తూనే యజమాన్ని కలిసాడు అప్పన్న.
" ఎందుకైనా మంచిది! ఆ గవర్నమెంటోళ్ళ బాకీకి కొంత సొమ్ము కట్టెయ్యండయ్యా!" అన్నాడు.
" నీకెందుకురా వెధవ బోడి సలహాలూ నువ్వూనూ" అని కొట్టిపారేసి బజార్లోకి వెళ్ళిపోయాడు నూకరాజు.
ఆ అనాసతోట పంట సీజను అయిన మరుసటి వారమే జప్తుకు వచ్చారు బ్యాంకు వాళ్ళు. ముందుగా నూకరాజును కలిసి అప్పన్న గుడెసె దగ్గరకు వచ్చారు.
" ఈ జాగా నాదండీ. గుడెసె ఏసుకుంటానంటే దయతలిచి ఇచ్చాను.ఇంక ఈ ఇంట్లో ఏ వస్తువుతోటీ నాకు సంబంధం లేదు"అంటూ తన ఆస్థి వివరాలు చెప్తున్నాడు నూకరాజు.
ఈ హడావుడికి సూరమ్మ పని చేసుకుంటున్నదల్లా గుడెసె దగ్గరకు వచ్చింది. అప్పుడే మందతో బయలుదేరడానికి సిద్ధమౌతున్న అప్పన్నకి నోట మాట రాలేదు. శిలా ప్రతిమలా నిలబడిపోయాడు.
గుడెసెలో ఉన్న సమస్త వస్తువులు జాబితా వ్రాసుకొని తీసుకువెళ్ళి పోయారు బ్యాంకు వాళ్ళు. పూచికపుల్ల కూడా విడవకుండా తీసుకుపోతూ అప్పన్న చేతిలో ఒక నోటీసు కాగితం పెట్టి మరీ వెళ్ళిపోయారు.
ఆ నోటీసులో బ్యాంకు చట్టం ప్రకారం చేస్తామనీ ....వాటి తాలూకా నియమ నిబంధనలకు మీరు బద్ధులు కావాలని హెచ్చరిస్తూ తెలియజేయబడింది.
గుడెసె నూకరాజు ఆస్థి కావడం మూలాన దాన్ని వాళ్ళు సీజ్ చేయలేదు.
ఆ రాత్రంతా భార్యా భర్తలిద్దరూ నిద్ర లేకుండా గడిపారు.
'ఎంతో ముద్దుగా ...ముచ్చట తీరా తమ సంసారం కోసం సరంజామా అంతా సర్దుకుంది ఇన్నాళ్ళూ. దాన్ని ఈ రోజు వీళ్ళు గద్దలా తన్నుకు పోయారు. అది వాళ్ళ తప్పు కాదు. మరెవరిది? ఆ తప్పెవరిదో వాళ్ళకు తెలుసు. కానీ, సంఘం దృష్టిలో ...చట్టం దృష్టిలో తామే దోషులు.గవర్నమెంటు వారు ఇచ్చిన ౠణాన్ని జల్సా చేసి జబర్దస్తీగా తిరగేస్తున్న కుండాకోర్లు.
అందుకే అప్పన్న శిలా ప్రతిమలా నిలబడిపోయాడా క్షణం.
ఆ రాత్రంతా అప్పన్నని నానా దుర్భాషలాడింది సూరమ్మ అతని చేతకానితనాన్ని, అమాయకత్వాన్ని పొడిచి..పొడిచి చంపేసింది.
ఆ మరునాడు తూర్పు నెమ్మదిగా ఎర్రబారుతోంది.
అప్పన్న లేస్తూనే భార్యతో చెప్పల్సిందంతా చెప్పి మందతో బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే నూకరాజు నుండి కబురు వచ్చేసరికి వెళ్ళ్క తప్పదని వెళ్ళాడు అప్పన్న.
" ఒరేయ్ అప్పన్నా! అయిందేదో అయిపోయింది. వెధవ సామాన్లు పోతేపోనీ..మళ్ళా సంపాదించుకోవచ్చు."
అన్నాడు నూకరాజు.
అతనిముందు అప్పన్న చేతులు కట్టుకుని నిలబడలేదు. చేతులు నులుముకుని నిలబడలేదు. నిర్వికారంగా ఏదో ఆలోచిస్తూ నిటారుగా నిలబడ్డాడు. అప్పన్న కళ్ళల్లోకి తేరిపార చూసాడు నూకరాజు.
ఎర్రగా మండుతున్నాయి. కానీ బాధ గుండెని పిండుతుందేమో ఆ ఎర్రబడ్డ కళ్ళెంబడి నీళ్ళు ధారాపాతంగా జాలువారుతున్నాయి.
" నా పెళ్ళాం వస్తుంది దానికో పదిసేర్లు బియ్యం ఇప్పించండి అని వేడుకో లేదు. మామూలుగానే అన్నాడు అప్పన్న.
" అమ్మగార్ని అడిగి తీసుకుపొమ్మను. నువ్వు మందతో పో!"
నూకరాజు మాటవిని వెనుదిరగలేదు అప్పన్న. తన మానాన తను వెనక్కి తిరిగి వచ్చేసి మందని తోలుకుని బయలుదేరాడు.
భర్త చెప్పిన ప్రకారం తొమ్మిదయ్యేసరికి చాకిరేవు కొపండదగ్గరకు చేరుకుంది సూరమ్మ. ఆమె చేతిలో పదిసేర్ల బియ్యం....ఒక తపేలా.. చిన్న మూట ఉన్నాయి.
భార్య భర్తలిద్దరూ మందని తోలుకుంటూ చాకిరేవు కొండని దాటిపోయారు. అలా కొండల్ని దాటుకుంటూ అడవి మార్గాన్నే ప్రయాణం సాగిస్తున్నారు.
" ఆ నూకరాజు గాడికి .. ఆడి మనుషులకి అందనంత దూరంగా పారిపోవాలి" అదే భార్యా భర్తలిద్దరి ఆలోచన.
ఆలోచిస్తూ నడుస్తున్న అప్పన్నకు ఒకానొకప్పుడు బొకడపోతు తన యజమాన్ని పొడిచిన సంఘటన గుర్తుకొచ్చేసరికి నవ్వు పుట్టుకొచ్చింది.
ఆరోజు దాన్ని కసాయి వాళ్ళకు అప్పగిస్తున్నప్పుడు అది తనని కూడా పొడిచుంటే...?! కాళ్ళతో కుమ్మేసి ఉంటే...?? అప్పన్న శరీరంలోని రక్తం గడ్డకట్టుకు పోయింది....