భక్తుడే అలిగితే - జి. నాగేశ్వర రావు

bhaktude aligite

కంపార్ట్ మెంట్లో పాలు , ప్రసాదం ఫ్రీ గా ఇస్తారన్నారు.’ అనుకుంటూ ఆమాట పైకే అన్నాడు.

‘అవి ఇదివరకు. ఇప్పుడు కాదు. ఎప్పుడో ఒకసారి. దానికీ మనకీ ప్రాప్తం వుండాలి’ అన్నాడు ఒకాయన
ఇంతలో గార్డు వచ్చి తలుపు తీసాడు.


జనాలు అందరూ లైనులోకి వెళ్ళడానికి ఒకోర్నొకరు తోసుకుంటూన్నారు. కొంతమంది పిల్లలు నలిగి పోయి ఏడుస్తున్నారు. కుర్రాళ్ళు అదేమీ పట్టించు కోవడం లేదు. తోస్తూనే వున్నారు. ఆడపిల్లలు కూడా వాళ్ళ మధ్యలో పడి నెట్టలేక, బయటికి రాలేక నలిగి పోతున్నారు. బలవంతులు తోసుకుని లైనులోకి వెళుతున్నారు. బలం లేనివాళ్ళు బలం తెచ్చుకుని తోస్తున్నారు. నిజం చెప్పాలంటే పశువులు కూడా అలా తోసుకు వెళ్ళవు.


అది భక్తా...బలప్రదర్సనా అర్ధం కాలేదు. అలివేలుకి , వెంకట రమణకి
అలివేలుకి ఆ దృశ్యం చూసి భయం వేసింది. ‘అందరు వెళ్ళాక వెళదాం , అంటూ అలాగే కూర్చుంది. కాసేపటికి అందరూ వెళ్లి పోయారు. ఆఖర్న వెంకటరమణ దంపతులు మెల్లిగా వెళ్లారు.


వాళ్ళు లైను లోకి వెళ్ళిన వెంటనే యాభై రూపాయల సర్వ దర్సనం కంపార్టు మెంటు వాళ్ళని వదిలారు. వాళ్ళు గుంపుగా వచ్చి వీళ్ళ మీద పడ్డారు. దాంతో వెంకటరమణ దంపతులు మధ్యలో నలిగి పోయారు. వెంకటేశం ఏడుపు మొదలు పెట్టాడు. అందరూ తోస్తున్నారు. లైను మెల్లిగా కదులు తోంది. తోసుకోవడాలు ఎక్కువ అయ్యాయి.


అలివేలు ఇంక పిల్లాడితో నిలబడ లేక వెంకటేశాన్ని వెంకటరమణ కి ఇచ్చింది. వెంకట రమణ వెంకటేశాన్ని భుజాలమీదకి ఎక్కించు కున్నాడు. కాస్త గాలి తగలడం తో వెంకటేశం ఏడుపు ఆపాడు.


ఓ పది నిముషాలు లైను కదిలి ఆగిపోయింది.
గంట... అరగంట...గంట..రెండు.. గంటలు.. లైను ఆగి పోయింది.


అలివేలు ‘ఏవండి దర్సనం వద్దు,ఏమీ వద్దు.. బయటికి పోదాం’ అంది
వెంకట రమణకి బయటికి వెళ్ళే చాన్సే లేదు. వెనకా..ముందూ.. వేలమంది లైనులో నిలబడి వున్నారు. కాలు కదిపే చోటు లేదు. మధ్యలో తోసుకోవడాలు.


ఇంతలో ఓ లావుపాటి ఆయన అలివేలు కాలు తొక్కాడు.
అలివేలు ‘కెవ్వు’ మంటూ అరిచింది.


‘సారీ’ అన్నాడు.
అలివేలుకి కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి.


‘ఎం మొక్కో...జన్మలో తిరుపతి రా కూడదు.’ అనుకుంది.
వెంకట రమణ భుజాల మీదనుంచి వెంకటేశాన్ని దింపి అలివేలుకి ఇచ్చాడు.
అలివేలు కాలి నెప్పి తో అలాగే ఎత్తుకుంది.


ఇంతలో గోవిందా అంటూ ఒక్క సారి కదిలింది లైను.
అక్కడే ఓ మలుపు వచ్చింది.


సరిగ్గా అ మలుపు దగ్గరే శీఘ్ర దర్శనం, యాభై రూపాలయ దర్శనం, సర్వ దర్శనం, అన్నీ దర్శనాల వాళ్ళ౦దరినీ ఒకే లైనుగా కలుపుతారు. అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళాక మళ్ళీ అలైను రెండుగా విడి పోతుంది. అక్కడ పరిస్థితి మరీ భయంకరంగా వుంది. చంటి పిల్లల ఏడుపులతో, పెద్దవాళ్ళ చిరాకులతో, కుర్రకారు గోలలతో, భక్తుల గోవింద నామం తో ఆడవాళ్ళ చిరాకులతో, లైనుని కంట్రోల్ చేసే వాళ్ళు లేక నానా భీబత్సంగా వుంది. అలా తోసుకుంటూ అలివేలు, వెంకటరమణ అక్కడికి చేరు కున్నారు. ఇంతలో వెనక నుంచి జనం ఒక్కసారిగా గోవిందా అంటూ ముందుకి తోసారు. దాంతో అలివేలు, వెంకట రమణ, ఇద్దరూ చెరో లైనులోకి కొంత దూరం వెళ్లి పోయారు. అలా తోపులాటలో అలివేలు లైను ఆగిపోయింది. వెంకటరమణ లైను ముందుకి సాగి పోయింది. వాళ్ళ తో పాటే వెంకట రమణని కూడా వాళ్ళు తోసుకుంటూ పోయారు.


అలివేలు కి వెంకట రమణ కనిపించక పోవడం తో ఏడుపు వచ్చినంత పనయింది.


లైనులో వున్న వాళ్ళు‘భయ పడకమ్మా.. మేం వున్నాం ..నీ కేం భయం లేదు. మీ వారు నీ కోసం ముందు ఆగి వెయిట్ చేస్తూ వుంటారు లే.’ అంటూ ధైర్యం చెప్పారు.


‘మీరు మాత్రం ఏక్కడి వరకు ఉంటారో ఎవరికీ తెలుసు.’ అంది


‘చూడమ్మా దర్సనం అయ్యాక బయటికి వెళ్లి మీ వారికి ఫోన్ చెయ్యి.’ అన్నాడు ఒకాయన.
‘ఫోనా.. లోపలి తీసుకు రాకూడ దన్నారని రూమ్ లో పెట్టాం. ’ అంది అలివేలు
‘పోనీ ఎవరి దగ్గరయినా అడిగి చేసుకోవచ్చు లేమ్మా.’.అన్నాడు ఒకాయన.


‘ఎవరి దగ్గరయిననా ..నాకు నెంబరు కూడా గుర్తు లేదు.’ అంతో కంగారు పడింది అలివేలు.
‘మీ ఆయన సెల్ నెంబరు గుర్తు లేక పోతే ఎలాగమ్మా .’ అంది ఒకావిడ.
‘మీరు చెప్పండి మీ ఆయన సెల్ నెంబరు’ అంది అలివేలు.


ఆవిడ మా ఆయన సెల్ నంబరు.. నైన్..టు..ఫోర్.... నైన్..టు..ఫోర్. .’.అంటూ ఆగిపోయింది
‘అలాగే వుంటుంది.’ అంది అలివేలు.


‘అవునండి బాబు ఇదివరకు మాన్యుల్ ఫోనులున్నప్పుడయితే నలభై..యాభై నెంబర్లు గుర్తుకి ఉండేవి. వేలు ఆటోమేటిక్ గా డయల్ చేసేది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వచ్చాకా ఎవడి నెంబరయినా మేమోరీ చూసి కాల్ చెయ్యడమే గాని ఒక్క నెంబరు తెలీదు. గుర్తుకి కూడా రావడం లేదు . ’ అన్నాడు ఒకాయన.
‘ఎ కాటేజీ లో దిగారు’ అంటూ అడిగింది ఒకావిడ.


‘ఏమో .. తెలీదు.’ అంది అలివేలు.
‘తెలీక పోతే ఎలాగా. ఇక్కడ కలుసుకో లేక పోతే అక్కడయినా కలవచ్చు. ఇప్పుడేలాగా ‘ అంది ఒకావిడ
దాంతో భయపడ్డా అలివేలుకి ఏడుపు ఆగలేదు. వెంకటేశం తల్లి ని చూసి ఏడవడం మొదలు పెట్టాడు.
‘వూరుకోమ్మా.. మేం ఎదో ఒకటి చేసి మీ వారిని కలుపుతాం . సరేనా’ అంటూ ఊరుకో బెట్టారు.
ఇంతలో లైను కదిలింది.


అందరూ ముందుకి కదిలారు.
అక్కడ వెంకట రమణ ఆ లైనులో వెళ్లి వెళ్లి మలుపు లు తిరిగి ఓ చోట నిల బడి పోయాడు. చుట్టూ చూసాడు. లైను తప్ప ఏమీ కనపడలేదు. ఎక్కడున్నాడో తెలీదు.


బయట ఎం జరుగుతోందో తెలీదు. సాయంత్రం నాలుగుగంటలకి ట్రైను. అలివేలు పిల్లాడి తో ఎక్కడుందో తెలీదు. ఛీ అనవసరంగా మొక్కు కున్నాను. ఇప్పుడు తిరుపతి రావడం అవసరమా. దేవుడు అన్ని చోట్లా ఉంటాడు అంటాడు. హైదరాబాద్ లో చిక్కడపల్లి గుడి లోనో, బిర్లా టెంపుల్ లోనో, చిల్కూరు లోనో తీయిస్తే బాగుండేది. ఈ గుండు గొడవ లేక పోతే నిన్ననే దర్సనం జరిగేది. హాయిగా కిందకి వెళ్ళిపోయేవాళ్ళం. అలివేలు ఎక్కడున్నావే.. ఎం చేస్తున్నావే.. పిల్లాడితో ఎంత అవస్థలు పడుతున్నావో... అంటూ తనలో తానే తిట్టు కుంటూ పిచ్చాడిలా ప్రవర్తిస్తున్నాడు .


అది చూసిన ఓ పక్కాయిన ‘ ఏవయింది మాస్టారూ’ అంటూ అడిగాడు.
‘నా బొంద అయింది. నేను మా ఆవిడా విడి పోయాం.’ అన్నాడు
‘పిల్లలు న్నారా’ అడిగాడు ఆ వ్యక్తి
‘ఆ ఒక అబ్బాయి ’


‘ అబ్బాయి ఎక్కడున్నాడు’
‘తల్లి దగ్గరే’
‘పోనీ లెండి పిల్లలు తల్లి దగ్గర ఉండటమే ఉత్తమం. మగవాళ్ళం మనం పెంచ లేం.’ అంటూ ఆగాడు
అర్ధం కాక వెంకట రమణ అతన్ని చూసాడు.


‘అవునండి రేపు మీరో మరో పెళ్లి చేసుకుంటే పిల్లలు అడ్డేగా. మీ ఆవిడ మీ అబ్బాయిని తీసుకెళ్ళి మీకు రూటు క్లియర్ చేసింది. యు ఆర్ లక్కీ’ అన్నాడు నవ్వుతూ.


అసలు సంగతి అర్ధం ఆయిన వెంకట రమణ అసలే చిరగ్గా వున్నాడేమో కోపం ఎక్కువయి ఏమీ అనలేక ‘మీరు కాస్త నోరు మూస్తారా... మేం విడిపోయింది జీవితాల లోంచి కాదు. ఈ లైనులోంచి. మైను లైను దగ్గర తోసేసే సరికి ఇద్దరం చెరో లైనులోకి
పోయాం.’ అన్నాడు.


‘అలా జరిగిందా...సారీ..’ అన్నాడు నాలిక కరుచు కుంటూ ఆ వ్యక్తి .
‘అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నాం’ అడిగాడు పక్క వ్యక్తి.
‘లైనులో’ అన్నాడు మరో వ్యక్తి. అందరూ నవ్వారు.


వెంకటరమణ ఆ జోక్ కి నవ్వు రాలేదు కదా తిక్క నషాళానికి అంటింది.
అక్కడే నిలబడి పోయి గంట అయింది. ముందు కొంత మంది భక్తులు ‘ఓం..నమో..నారాయణా... ఓం..నమో..నారాయణా... ఓం..నమో..నారాయణా...’ అంటూ భజన చేస్తున్నారు.


అది వెంకట రమణ వున్నా పరిస్థితి కి భజన లా వినిపించడం లేదు. వాళ్ళ మీద తను తనకి తెలీకుండానే చిరాకు పడుతున్నాడు. ‘వీళ్ళు ఆ భజన ఆపితే బాగుండేది’ అనుకున్నాడు.
ఇంతలో లైను కదిలింది.


అలా కదులుతూ గాలి గోపురం వరకు వచ్చింది .
అక్కడ చెకింగు అయిపోయిన తర్వాత ఆలయ ద్వారం నుంచి లోపలి వెళ్ళాడు.


ఇదివరకు అక్కడ ద్వారం దగ్గర నీళ్ళు పారుతూ ఉండేవి. ఆటోమేటిక్ గా భక్తులు కాళ్ళు కడుగుకోటానికా అన్నట్టు. ఆరోజు నీళ్ళు లేవు.
‘అరె ఇక్కడ నీళ్ళు లేవే’ అన్నాడు ఓ వ్యక్తి.
‘ఇక్కడ స్వామి వారికి కూడా వాటర్ ప్రోబ్లం ఉందన్నమాట ‘ అంటూ ఒకవ్యక్తి కౌంటరు వేసాడు.
అందరూ తోసుకుంటూ వెళ్ళారు.లోపలి వెళ్ళ గానే అందర్నీ ఆపేసాడు.


వెండి వాకిలి ముందు మూడు లైనులున్నాయి.
రెండు లైనులు డైరెక్ట్ గా వాకిలి కి రెండు వైపులనుంచి వున్నాయి. ఇంకొక లైను గోడవార చుట్టూ తిరుగుతూ వెండి వాకిలి ద్వారం దగ్గర కలుస్తోంది.


అంత వరకు ఓర్పు గా లైనులో నిలబడ్డ భక్తులకి బల పరీక్ష అక్కడినుండే మొదలవుతుంది. ఎవరికీ బలం వుంటే వాళ్ళు తోసుకు ముందుకి వెళ్లి పోవడమే.


ఇదంతా అక్కడున్న సెక్యూరిటీ స్టాఫ్, గార్డులు చూసి సంతోషిస్తూ వుంటారు.
కొంత మంది అయితే వాళ్ళని బలవంతంగా లైనుల్లోకి తోసేస్తూ ఆనందిస్తూ వుంటారు.


అలా ఒక్కసారి వదిలే సరికి జనం తోసుకుంటూ ముందుకి వచ్చారు. మూడు లైనులలో ఎ లైనులోకి వెళ్ళాలో తెలీక తికమక పడి ఇక్కడ నిలబడితే అలివేలు కనిపించ వచ్చు అనుకుంటూ ఏ లైనులోకి వెళ్ళకుండా పక్కన నిలబడ్డాడు.


ఇంతలో సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఇక్కడ నిలబడ కూడదు వెళ్ళు అంటూ లైనులోకి తోసాడు. వెంకట రమణ గోడవార లైనులో పడ్డాడు. ఆ లైను గోడవార అలా మలుపులు తిరుగుతూ ఎప్పటికి వెండి వాకిలి చేరతామో ఆ వెంకటేశ్వర స్వామికి కూడా తెలీదు.


అలా ఆ మలుపులో నిలబడి పోయాడు.
ఇంతలో వి .ఐ.పి. బ్రేక్ దర్శనం టైం అయ్యింది. అంతే లైనులన్నీ మళ్ళీ ఆగిపోయాయి.
ఓ గంట తర్వాత మళ్ళీ కదిలాయి.


అలివేలు కూడాఅలా లైనులో వస్తూ వెంకటేశాన్ని ఎత్తుకుని వెండి వాకిలి ముందు ఆగింది. ఒక్కసారి అందరూ తొయ్యడం తో అలివేలు పిల్లాడితో సహా కింద పడి పోయింది. అందరికీ లోపలి వెళ్లాలనే తప్ప ఎవ్వరికీ పడిపోయిన అలివేలుని పైకి లేవ తియ్యాలని లేదు. అలాగే పక్కనుంచి తప్పించుకుంటూ వెళ్లి పోతున్నారు. వెంకటేశం ఏడుస్తున్నాడు.


ఇంతలో ఒక పెద్దయిన అలివేలుని లేపి ‘ జాగ్రత్తగా వెళ్ళమ్మా’ అంటూ వెళ్ళాడు.
అలివేలు కట్టుకున్న పట్టు చీర నలిగి పోయి . బొట్టు , జుట్టు చెదిరి పోయి, వెంకటేశం నలిగి పోయి తుఫానులో కొట్టుకు వచ్చిన దానిలా వుంది.


అలాగే ఎక్కడయినా వెంకటరమణ కనబడతాడేమోనని చూసింది. ఎక్కడా కనబడలేదు.
ఇంతలో ఇంకో ట్రూపు ముందుకి తొయ్యడం తో ఎదురుగా వున్న లైనులో వెళ్లి పడింది. చుట్టూ జనం వుండటం తో కింద పడకుండా తన ప్రమేయం లేకుండా వెండి వాకిలి దాటింది. అక్కడ స్వామి వారి ఆనంద నిలయం దగ్గిరికి చేరింది.


అక్కడ అసలు బల పరీక్ష. నిజాయితీ గా , మెల్లగా లైనులో వెళితే స్వామి దర్సనం జరగదు. కళ్ళు మూసుకుని ఆ జనం లో తోసుకుంటూ కింద పడకుండా రాకట్ లో దూసుకు పోవడమే. కింద పడ్డామా డైరెక్టు గా స్వామిలో ఐక్యం అవ్వడమే. అందుకే భక్తులందరూ మానసికంగా, శారీరకంగా తోసుకోడానికి రడీ గా వుంటారు.


పాపం పిల్లల మీద, పిల్లలని ఎత్తుకున్న తల్లుల మీద గాని, ముసలి వాళ్ళ మీద గాని ఎవరికీ ఆఖరికి ఆలయ అధికారుల కి కూడా దయ లేదు. అందుకే గుంపులో గోవింద అన్న నానుడి అక్కడే పుట్టింది.


పాపం అలివేలు అలాగే దేవుడిని చూసి, వెంకటేశాన్ని వెంకటేశ్వరస్వామి కి చూపించాలని, వెంకటేశ్వర స్వామిని వెంకటేశా నికి చూపించాలనే తాపత్రయం తో భర్త వెంకట రమణ ఎక్కడ ఉన్నాడో చూసుకుంటూ అలాగే వెళ్లి నిలబడింది.
అందరూ తోసుకుంటూ వెళుతున్నారు.


వెండి వాకిలి ఎదురుగా వున్న ద్వారం తీసి వుంటే తిన్నగావెళ్లి ఎక్కువ శ్రమ లేకుండా స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు.
కాని ఆనంద నిలయం ద్వారం పక్కగా ఉండటం వల్ల భక్తులు తోసుకుంటూ గోడవార వస్తున్న భక్తులను గోడకు నెట్టి వాళ్ళు మధ్యలో దూరి ఎవరు బలంగా వుంటే వాళ్ళు ముందుకు దూసుకు పోవడమే.
పాపం అలివేలు ఏడుస్తున్న వెంకటేశాన్ని ఎత్తుకుని మధ్యలో దూరి పోయింది.


జనాల తోపులాటలో మజ్జిగ కవ్వం లా ముందుకు వెనక్కి తిరుగుతూ మొత్తానికి ఆనంద నిలయం లోకి వెళ్ళింది. భక్తులు గోవిందా... గోవిందా అంటూ ముందుకి తోసుకుంటూ వెళ్తున్నారు. అలివేలు ముందు ఒకతను తన పిల్లాడిని భుజాల మీదకి ఎక్కించుకుని గోవిందా అంటూ వెళ్తున్నాడు. అలివేలు కి అతని వీపు, పిల్లాడి వీపు తప్ప ముందు ఏమీ కనిపించడం లేదు. అలాగే వెంకటేశాన్ని ఎత్తి పట్టుకుని
‘చూడు నాన్నా..జేజి..చూడు’ అంటూ ముందుకు కదిలింది. ఆవ్యక్తి వెనక వాళ్ళకి కనబడితే నాకే, కనబడక పోతే నాకే అంటూ అలాగే ముందుకి వెళ్తూ స్వామికి దండం పెట్టు కుని వెళ్తున్నాడు. మహా లఘు దర్సనం కావటం వాళ్ళ ముందు వాకిలి వద్దే లైను తిప్పెసారు. అలివేలు ముందు వున్నా వ్యక్తిని ‘జరగండి’ అంటూ లాగేశారు.


‘హమ్మయ్య స్వామీ కనబడతాడు. దర్సనం చేసుకుందా మని అనుకుని స్వామిని చూసే లోగా జరుగమ్మా.. జరుగు.. ఎంత సేపు చూస్తావు అంటూ బయటికి లాగేశారు.


అలివేలు ఆవాక్కయి పోయింది. ఈ మాత్రం దానికి అంత దూరం నుంచి ఇంతదూరం, ఇంతసేపు లైనులో నిలబడి ఇన్ని కష్టాల కి ఓర్చి చివరకి తను దర్శనం చేసుకున్నట్టా. లేనట్టా ? తెలీక ఒక్కసారి ఉడుకుమోత్తనం తో ఏడుపు వచ్చేసింది.
‘స్వామీ... నువ్వు సర్వాంతరయామివి. నన్ను క్షమించు. ఇంకా జన్మలో తిరుపతి రాను. ఇదే నా మొక్కు ’ అంటూ వెంకటేశాన్ని తీసుకుని బయటికి వెళ్లి పోయింది.

పాపం వెంకట రమణకి అనుభవం ఒకటే అయినా మగవాడు కనుక ఏడవలేక సతీ సమేతంగా దర్శనం చేసుకుందా మనుకుంటే ఇలా చేశా వెంటి స్వామీ అని .. నీ అలివేలు మంగమ్మ నీతోనే వుంది. నా అలివేలు ఎక్కడుందో అనుకుంటూ వెతుక్కుంటూ బయటికి వచ్చాడు.


అక్కడ ఉచిత ప్రసాదాలు పంచి పెట్టె లైనులు నాలుగు వున్నాయి. ఒక లైనులో ఖాళీ గా వుందని కొంత మంది ఆ లైనులో వెళ్ళారు. ఆ వెనకే వెంకట రమణ కూడా వెళ్ళాడు. అక్కడ ఇంకో లైనులో ఒక స్వామి లావుగా వొంటి నిండా జుట్టుతో వున్నాడు. అక్కడ ఆ లైనులో పులిహార ప్రసాద౦ పంచుతున్నాడు. వెనక నుంచి ఇంకో లైను రావడం చూసి ‘ ఎవడ్రా.. ఈ లైను వదిలింది. ఇలా అయితే ప్రసాదం పంచను అంటూ పంచు తున్న పులిహార ప్రసాదాన్ని ఒదిలి లేచి వెళ్లి పోయాడు.


ఇంతలో బక్క గా వున్న ఇంకో స్వామి వచ్చి రెండు లైను లో వాళ్లకి పులిహార ప్రసాదం పంచుతున్నాడు.


వెంకట రమణ కి ‘ఈ స్వామి ఎవడి కోసం ప్రసాదం పంచుతున్నాడు. దేవుడి కోసమా.. భక్తుల కోసమా.. తను చేస్తున్న ఉద్యోగం కోసమా...వీడి సొంత ఆస్తి పంచి ఇస్తున్నట్టు ఆ ఫీలింగు’ ఏంటో అర్ధం కాలేదు. ఆ స్వామి..సొమ్ము తింటూ .. ఆ స్వామీ మీద భక్తి లేక, ఆయన్నే నమ్ముకుని వచ్చిన భక్తులకు, సేవలు కాదు సదుపాయాలూ కూడా చూడ కుండ చీదరించుకుంటూ వున్న వాళ్ళని చూసి వెంకట రమణకి చిరాకు కలిగింది.

యుద్ధం లో పిల్లాడిని ఎత్తుకుని యుద్ధం చేసిన ఝాన్సీ లక్ష్మీ భాయి లా ఓటమో, గెలుపో తెలియని స్థితి లో వీరనారి గా గుడి బయటికి వచ్చింది.


ఎప్పుడో చిన్నపుడు వాళ్ళ అమ్మా, నాన్నలతో వచ్చింది. ఏమీ గుర్తు లేదు. ఎక్కడికి వెళ్ళాలో? ఎలా వెళ్ళాలో తెలీదు. ఫోన్ చేద్దామంటే ఫోన్ లేదు. ఎం చెయ్యాలో తెలియక

దిగాలుగా ఓ చోట కూర్చుని వుంది.
బయటికి వచ్చిన వెంకట రమణ బట్టలు నలిగి పోయి, జుట్టు చెదిరి పోయి పిచ్చి వాడిలా వున్నాడు. గడియారం చూసు కున్నాడు. మూడు నలభై అయింది. ఇప్పుడు కిందకి వెళ్ళినా రైలు వెళ్లి పోవటం ఖాయం. ఇంకా అలివేలు కనిపించలేదు. ఎక్కడుందో.. ఏమైందో . అలివేలు కోసం పిచ్చి పిచ్చి గా ఆ పరిసరాలు అన్నీ వెతికాడు. ఎక్కడా కనిపించ లేదు. ఆలోచించాడు. ఓ ఐడియా వచ్చింది. ఒకవేళ తను ఎక్కడుందో వాళ్ళ అమ్మ నాన్నలకి ఫోన్ చేసి చెప్పిందేమో నని ఇంటికి ఫోన్ చెయ్యాలను కుని అక్కడ వున్న ఒకాయన్ని ‘ సార్ మా మిసెస్ మిస్సయ్యింది. ఒక్క కాల్ చేసుకోవాలి. ప్లీజ్ ‘ అంటూ ఫోన్ అడిగాడు.


‘తీసుకోండి.’ అంటూ ఇచ్చాడు ఆయన.
వెంకట రమణ ఫోన్ తీసుకుని నెంబరు డయల్ చెయ్య బోయాడు. కాని నెంబరు గుర్తుకి రాలేదు. ఆ నెంబరు కాదు ఎ నంబరు గుర్తుకి రాలేదు. ‘తీసుకోండి’ అంటూ తిరిగి ఇచ్చేసాడు.


‘ఏమయింది’ అడిగాడు ఆ వ్యక్తి.
‘నెంబరు గుర్తుకి రావడం లేదు’ అన్నాడు.
‘అవునండి బాబు. ఈ సెల్ ఫోన్ వచ్చాకా మన మెమొరీ దొబ్బింది. దీని మెమొరీ మీదే బతుకుతున్నాం.’ అంటూ వెళ్లి పోయాడు.
‘ఛీ ఒక్క నెంబరు గుర్తుకి రావడం లేదు. మెమొరీ దొబ్బింది. ఛీ .. సెల్ ఫోన్ లోపలి ఎలో చేస్తే వీళ్ళ సొమ్మేం పోయింది. జరగాల్సింది ఎలాగూ జరుగుతుంది. సెల్ ఫోన్ ఆపేస్తే ఆగుతుందా...ఛీ వెధవ బ్రయిన్ ..నెంబరు గుర్తుకి రానందుకు తనని తానే తిట్టుకున్నాడు వెంకట రమణ.


అలివేలు కోసం వెతుకు తున్నాడు.
అలా వెళుతూ ఒక చోట చూసాడు. ఒక పిచ్చిది కూర్చుని వుంది. చేతిలో పిల్లాడు వున్నాడు. వెంకటేశం వయసే వుంటుంది.
ఏడుస్తున్నాడు. ఆ పిచ్చి దానికి కోపం వచ్చింది. ఏడవరా.... ఏడూ.. మనం ఏడుకొండలకి వచ్చింది ఏడవ డానికే. అసలు ఇదంతా నీ వల్లె వచ్చింది’. అంటూ వాడిని బాదుతోంది.


వెంకట రమణ కి జాలేసింది. ‘ఎందుకమ్మా వాడిని అలా కొడతావు. ఎం చేసాడు’ అంటూ అడిగాడు.
ఆ పిచ్చిది వెంకట రమణ వంక చూసి ఒక్కసారి బావురు మంది. వెంకట రమణ కూడా ఆ పిచ్చిదాన్ని చూసి అలివేలు...అంటూ బావురు మన్నాడు. అలా ముగ్గురూ ఒకళ్ళని పట్టుకుని ఒకళ్ళు ఏడ్చారు.


‘ఏవండీ ఇక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండద్దు. ఈయన ఆపద మొక్కులు వాడు అంటే ఆపదలు తొలగిస్తాడు అనుకున్నాను గాని వస్తే ఇంత ఏడిపిస్తా డనుకోలేదు పదండి పోదాం. ఇంకెప్పుడూ రావద్దు. అంటూ ఏడ్చింది.


‘. మనం రాకపోవడమే కాదు అలివేలు ఇంకెవర్నీ కూడా రాకుండా చెయ్యాలి.’ అన్నాడు వెంకట రమణ.
‘మనం అంటే మానేస్తాం. ఎవర్నీ రాకుండా ఎలా చేస్తాం.’ అంది అలివేలు.
‘ అలివేలు ఈ గార్డులు, పూజారులు, పంతుళ్ళు, చానల్ వాళ్ళు, పానల్ వాళ్ళు ఆ స్వామికి మనం ఇచ్చే మొక్కుల మీద ఆధార పడి బతుకుతున్నారు. అలాంటి భక్తులకి విలువియ్యని ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం మనం రావద్దు. ఎవర్నీ రానియ్యద్దు . మన మొక్కులు ఆగి పోతే గాని వీళ్ళకి తెలిసి రాదు పద’ అంటూ అలివేలుతో వెళ్ళాడు .

అలా వెళ్ళిన వెంకట రమణ కడుపు మండి తనకున్న పాండిత్యంతో తను అనుభావాన్ని కళ్ళకు కట్టి నట్టు ‘భక్తి – విరక్తి’ అని ఓ కధ రాసి పత్రికకి పంపాడు.
అది చదివిన ప్రతీ వాడు ఇది నిజంగా తిరుపతి వెళ్ళిన ప్రతీ వాడి అనుభవమే అంటూ తమ వ్యధ కధలో ప్రతి బింబి౦చినందుకు వెంకట రమణ ఎడ్రస్ తీసుకుని, ఫోన్ నంబరు తీసుకుని అభినందించారు. అంతే కాకుండా ఆ కధని తమిళ్, కన్నడ, మలయాళం , హిందీ, బెంగాలి , ఇంగ్లిష్ భాష లలోకి అనువదించి ప్రచురించారు. దాంతో వెంకట రమణ పేరు మారు మొగి పోయింది.

‘అదీ జరిగింది’ అన్నాడు శ్రీనివాసుడు
‘అంటే ఇదంతా ఆ వెంకట రమణ చేసిన పనా . అంది కోపంగా లక్ష్మీ దేవి.
‘నేనా’ అన్నాడు శ్రీనివాసుడు


‘మీరు కాదు భూ లోకం లో మీ పేరు పెట్టుకుని కధ రాసిన ఆ వెంకట రమణ. ఆ కధ వల్లే గా మన కధ ఇలా మారింది.’ అంది లక్ష్మీ దేవి.


‘నారాయణ...నారాయణ .. నిజం చెప్పావు తల్లీ, అంటూ నారదుడు వచ్చాడు.


‘ నారదా సమయానికి వచ్చావు .. భూ లోకంలో మా సంగతి తెలుసుగా , ఇలా జరగడానికి కారణమయిన ఆ వెంకట రమణకి తిరుగు లేని శాపం పెట్టాలి ’ అంది లక్ష్మీదేవి.
‘ఆఆ . తల్లీ నువ్విచ్చె శాపం కలికాల కాల మాన ప్రకారం వాడికి తగిలే సరికి వాడి ఆయువు తీరిపోతుంది. అయినా ఇందులో ఆ మానవుడి తప్పే ముంది. తమ దర్శనం చేసు కోవాలని ఎంతో భక్తిగా ఇంట్లో పూజ కూడా చేసుకుని బయలు దేరాడు. కాని మనకి మానవునికి మధ్యలో వున్న సంధాన కర్తలు చేసిన పనికి వాడికి కాలింది. మనమా వాళ్ళకి కనిపించం. వాడు మాత్రం ఎం చేస్తాడు’ . అన్నాడు నారదుడు వస్తూ.


‘అవును నారదా నిజం చెప్పావు ‘ అన్నాడు శ్రీనివాసుడు
‘మీరిలా భక్తుల్ని వెనకేసుకు రాబట్టే వాళ్ళు అలా తయారయ్యారు’ అంది లక్ష్మి
‘భూ లోకం లో నరులు నారాయణుని పేరు అడ్డు పెట్టుకుని నానా విధాలుగా భక్తులని ఏడిపిస్తూ, నానా విధాలుగా ప్రవర్తిస్తూ, నానా విధాలుగా నారాయణుని ఆస్తి ని అనుభవిస్తున్నారు. నారాయణ..నారాయణ..’ అన్నాడు నారదుడు.
‘అలా ఎందుకు జరుగు తోంది స్వామి’ అడుగింది లక్ష్మీదేవి


‘స్వామి వారి జాతకం . సరిగ్గా లేదు. ఓసారి చూపించు కుంటే బాగుంటుంది.’ అన్నాడు నారదుడు.
‘నా జాతకానికి ఏమయింది. బ్రహ్మాండంగా వుంది.’ అన్నాడు శ్రీనివాసుడు.
‘జాతకం బ్రహ్మాండంగానే వుంది. మీరే బాగోలేరు.’ అన్నాడు నారదుడు.


‘అవును. ఒక్కసారి మీ నాన్న గారికి చెప్పి అసలు లోపం ఎక్కడుందో కనుక్కో నారదా.’ అంది లక్ష్మి దేవి.
‘అమ్మా... ఈ మాత్రం దానికి నాన్న గారెందుకు. నేనే చెబుతాను. నరులైనా , నారాయణులయినా జాతకాలు గ్రహాల అనుగ్రహం మీద నడుస్తాయి. ఇది నా లెక్క ప్రకారం స్వామీ వారికి ఏలినాటి శని నడుస్తున్నట్టుంది. దాని ప్రభావమే ఇది..’ అన్నాడు నారదుడు.
‘నాకు శని ప్రభావమా ‘ అన్నాడు శ్రీనివాసుడు


‘కాదా మరి. సాక్షాత్ ఆ ఈశ్వరుడినే వదల లేదు శనీశ్వరుడు వేంకటేశ్వరుడు మీరొక లెక్కా..’అన్నాడు నారదుడు.
‘అంటే ఇప్పుడు నా స్వామిని శనీశ్వరుడు పట్టుకున్నాడా.’ అడిగింది లక్ష్మీ దేవి.


‘ కాదామరి ఇంత వరకు ప్రశాంతంగా దర్శనాలు ఇస్తూ ఆ భక్తుల కోర్కెలు తీర్చే స్వామికి మీడియా పిచ్చి పట్టించినది ఎవరు. శనేశ్వరుడు కాదు. చానల్, బోర్డు పానల్, ఆర్జిత సేవలు, వి.ఐ.పి. బ్రేక్ దర్శనాలు. చిన్న కల్యాణం, పెద్ద కల్యాణం, దళారులు . అసలు నాకు తెలీక అడుగుతాను. స్వామి వారికి చానల్ అవసరమా .. దానికి ఎంత ఖర్చో .. దానిమీద మనకి ఖర్చు ఎంత. ఆదాయం ఎంత. దాని పేరు చెప్పి మన మధ్యలో వున్న సంధాన కర్తలు తినేది ఎంత ఇవేమీ తెలుసుకోకుండా చానల్ పెట్టారు. ఆ దెబ్బకి హుండీ కి గండి పడి౦ది

.
చానల్ సంగతి అలా వుంటే బోర్డు పానల్ లో అధికారుల మధ్య కుమ్ములాట. వి.ఐ.పి. లు ఎవరికీ మానవులకా? స్వామికా ? దేవుడి దృష్టిలో భక్తులంతా సమానం అంటూ స్పెషల్ దర్శనం, శీఘ్ర దర్శనం, వి.ఐ.పి.బ్రేక్ దర్శనాలు పెట్టి డబ్బులు గుంజుతూ ఇష్టపడి, కష్టపడి కాలినడకన వచ్చే భక్తులకి, డబ్బులు లేక ఉచిత దర్సనం లైనులో నుంచునే వారిని గంటలు, రోజులు లైనులలో పెట్టి , వాళ్ళకి వెంటనే దర్శన భాగ్యం కలగ చేస్తున్నారు. దాంతో నిజంగా భక్తితో వచ్చే భక్తులకు దేవుడంటేనే విరక్తి కలిగింది. క్లాస్ వాళ్లకి ఓ దర్శనం, మాస్ వాళ్లకి ఓ దర్శనం. తమ మొక్కులు తీరితే నిలువు దోపిడీ ఇచ్చే వాళ్ళు మాస్ భక్తుల్లో వున్నారు. క్లాస్ భక్తుల్లో ఎ ఒక్కడయినా ఎప్పుడయినా నిలువు దోపిడీ ఇచ్చాడా.



ఇలా ప్రతీ చోట ఏవో లోపాలు ఇవన్నీ శని ప్రభావం కాదా.
‘అవును నారదా.. ఆలోచిస్తూంటే .. ఇదంతా నిజమేమో అనిపిస్తూంది.’ అన్నాడు శ్రీనివాసుడు.


‘నిజమేమో కాదు స్వామి.. పచ్చి నిజం. గడిచిని యుగాల్లో అవతారాలు ఎత్తడం కాదు, ఈ కలి యుగం లో మనిషి అవతారం ఎత్తి మీ దర్సనం మీరే చేసుకోండి. మీ మీద మీకే విరక్తి కలుగుతుంది. ’ అన్నాడు నారదుడు.
శ్రినివాసుడు కళ్ళు మూసుకుని ఆలోచనలో పడ్డాడు.


‘ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధ మాకు స్వామి ‘ అని అడిగింది లక్ష్మి.
‘స్వామి కళ్ళు తెరిచే వరకు’ అన్నాడు నారదుడు.


‘అంటే’ అంది లక్ష్మీదేవి
‘అమ్మా.. స్వామి వారు వారానికోసారి నేత్ర దర్శనం అంటూ కళ్ళు తెరిచి లోకాన్ని చూస్తున్నారు. మిగిలిన రోజులు స్వామి వారి నేత్రాలని నామం కప్పెస్తోంది. స్వామి చూడటం లేదని ఆ నామం పేరుతో స్వామి వారికి పంగ నామం పెడుతున్నారు. స్వామి వారు కళ్ళు పూర్తిగా తెరిచి అలాంటి వాళ్ళ పని పడితే గాని స్వామి వారికి పూర్వ వైభవం రాదు. ఇప్పటికే పోవాల్సినదంతా పోయింది.మిగిలినది దక్కించు కుంటే బాగుంటుంది ’ అంటూ చెప్పాడు నారదుడు.


కళ్ళు మూసుకుని వింటున్న శ్రీనివాసుడు కళ్ళు తెరిచాడు. కోపం గా కళ్ళు ఎర్రగా వున్నాయి. ఎదురుగా శనీశ్వరుడు వచ్చాడు.
‘ స్వామీ. నా పని అయిపొయింది. నేను మిమ్మల్ని వదులు తున్నాను. ఇక అసలు వాళ్ళ పని పడతాను.’ అంటూ వెళ్లి పోయాడు.
స్వామి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు.

తిరుపతి దేవస్థానానికి తిరుపతి రావని ఐ.ఎ.ఎస్. ఆఫీసరుని చైర్మన్ గా వచ్చాడు. ఫలితం. దేవుడి మాన్యాలు కాజేసిన వాళ్ళ ఇంటి మీద రైడింగులు, అవినీతి ఉద్యోగుల భాగోతం బట్ట బయలు, ఉద్యోగుల తొలిగింపు.


అప్పుడు గాని దేవస్థానం బోర్డు కి అర్ధం కాలేదు. తాము చేసిన తప్పు ఏమిటో. తాము ఎవరి మీద, ఎవరి దయా దాక్షిణ్యం మీద బతుకు తున్నామో. ఎవరి నయితే వాళ్ళు పశువులకన్నా హీనంగా చూసారో వాళ్ళు రావడం మానేస్తే ఏమవుతుందో. వాళ్ళల్లో భక్తి తగ్గితే తమకి భుక్తి గడవదన్న నిజం తెలుసుకుంది.

నీతి పరులయిన అధికారులతో కొత్త బోర్డు సమావేశమయింది.
బోర్డులో ముందుగా తీసుకున్న నిర్ణయం. అన్ని దర్శనాలు రద్దు. అందరికీ ఒకే ఒక దర్శనం అది సర్వదర్శనం. ఎవడు ఎంత గొప్ప వాడయినా దేవుడి ముందు సమానమే. దేవుడి ముందు పేద. గొప్ప బేధాలు లేవు. అందరూ ఒకే లైనులో రావాల్సిందే.
కంపార్టు మెంటులలో కూడా ముందు వచ్చిన వాడు ముందే వెళ్లేటట్టు తోపులాటలు లేకుండా ఏర్పాట్లు .
వెండి వాకిలి, బంగారు వాకిలి, ఆనంద నిలయాల వద్ద తోసుకునే మూడు లైనులు లేకుండా ఒకే ఒక లైను.
లైనులో నిలబడ్డ వారికి తాము టివి ల ద్వారా ఎక్కడ వున్నారో తెలిపే ఏర్పాట్లు చెయ్యడం.
పోటు వాళ్ళకి జీతాలు పెంచి వాటా రద్దు.


ప్రజలకి గాని దేవుడికి గాని ప్రయోజనం లేని చానల్ మూసివేత .

ఇలాంటి మంచి నిర్ణయాలతో కొత్త బోర్డు పుట్టింది.

ఇప్పుడు శ్రీనివాసుడు ప్రజలకి ప్రశాంతంగా దర్శనం ఇస్తూ, కుబేరుడికి వడ్డీ కడుతూ సుఖంగా వున్నాడు.
అలాగే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముడుపులు చెల్లించు కుంటూ
స్వామి వారిని దర్శించుని వెళుతున్నారు.

ఇంత కధ నడిపించిన వెంకట రమణ ఇప్పుడు బోర్డులో గౌరవ మెంబరు.

సర్వేజనా సుఖినో భవంతు.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు