విశాల్, వైభవ్ అన్నదమ్ములు. విశాల్ ఏడవతరగతి, వైభవ్ ఐదవతరగతి చదువుతున్నారు. వాళ్ల నాయనమ్మ అరవై సంవత్సరాల పుట్టినరోజును వైభవంగా చేయాలనుకున్నారు. అందుకని పిల్లలిద్దరినీ వాళ్ల అమ్మ పిలిచింది. వాళ్లతో “నాయనమ్మ పుట్టిన రోజువేడుకల ఏర్పాట్లకి మీరిద్దరు కూడా నాకు సాయం చేయాలని “చెప్పింది.
విశాల్, వైభవ్ లు ఉత్సాహంగా “ఏం పనులు చేయాలోచెప్పమని” అడిగారు. వాళ్ల అమ్మ విశాల్ తో నువ్వు ఇల్లు సర్ది, అలంకరించటంలో నాన్నకి సాయం చేయమని” చెప్పింది. వైభవ్ తో “నువ్వు కూరలు బాగా తరుగుతావు, కాబట్టి నాకు వంటింట్లో సాయంచేయాలి “అని చెప్పింది. వెంటనే వైభవ్” నేనేమో వంటింట్లో ఎవరికీ కనబడకుండా పని చేయాలి. అన్నయ్య ఇల్లంతా తిరుగుతూ,అలంకరిస్తాడు. ఇంటికి వచ్చిన వాళ్లు డెకరేషన్ బాగుంది. ఎవరు చేశారు అని అడుగుతూ అన్నయ్యని పొగుడుతారు. నన్ను ఎవరూ పట్టించుకోరు” అని బుంగమూతి పెట్టి కూర్చున్నాడు.
పిల్లల సంభాషణ వింటున్న విశాల్, వైభవ్ ల నాన్న వాళ్ల దగ్గరికి వచ్చాడు. ఆయన చేతిలో రెండు డబ్బాలు ఉన్నాయి. ఒక డబ్బాలో వేరుశెనగ గింజలు, మరొక డబ్బాలో బీన్స్ గింజలు ఉన్నాయి. ఆ రెండిటిని వారికి చూపిస్తు, “మీకు వీటిలో ఏవి ఇష్టమో చెప్పండి. వాటితో ఒక వంటకాన్ని తయారుచేద్దాము “అని చెప్పాడు.
చిన్నవాడైన వైభవ్” నాన్నా నాకు ఈ రెండు గింజలు ఇష్టమే. వేరుశెనగ గింజలు వేసి పులిహోర, బీన్స్ గింజలతో కూర చేసుకుందాము” అన్నాడు. వైభవ్ తో వాళ్ల నాన్న” ఈ గింజలు ఎక్కడినుండి వస్తాయో తెలుసా “అని అడిగారు. జవాబు చెప్పటానికి వైభవ్ ఆలోచిస్తుంటే , విశాల్ నాకు తెలుసు. మా సైన్స్ పాఠం లో చదివాను అన్నాడు.
వైభవ్ ”అయితే చెప్పు” అన్నాడు. విశాల్” వేరుశెనగ మొక్కవేర్ల దగ్గర నుండి వేరుశెనగకాయలు వస్తాయి. ఆ కాయల లోపల వేరుశనగ గింజలు ఉంటాయి. బీన్స్ మొక్క తీగలాగ ఉంటుంది. వాటికి బీన్స్ కాయలు వస్తాయి.ఆ కాయలలో బీన్స్ గింజలు ఉంటాయి” అని చెప్పాడు.
విశాల్ చెప్పినది విన్న వైభవ్ ఆశ్చర్యంతో “ భూమి లోపల గింజలు వేరుశెనగ, భూమి పైన గింజలు బీన్స్ గింజలు కదా” అన్నాడు. ఎక్కడి నుండి వచ్చినా రెండు రకాల గింజలు నాకు ఇష్టమే అని చెప్పాడు. వాళ్ల అమ్మ” ఈ రెండు రకాల గింజలు ఆరోగ్యానికి కూడా మంచివి “అంది.
వైభవ్ తో వాళ్ల నాన్న” చూడు భూమిలోపల పండే గింజలైనా, భూమి పైన పండే గింజలైనా మనకు మంచి పోషకాలను అందిస్తున్నాయి, కాబట్టి మనం తింటున్నాం. అలాగే వంటింట్లో సాయం చేసినా, వంట ఇంటి బయట పనిలో సాయం చేసినా అమ్మానాన్నలకు సాయపడ్డట్లే.
ఎక్కడ పని చేసినా బాగా చేస్తే మంచి పేరు దానంతట అదే వస్తుందని” చెప్పారు. ఆ మాటలను అర్థం చేసుకున్న వైభవ్ అమ్మా అన్నయ్య ఇల్లు సర్దటంలో నాన్నకి సాయం చేస్తాడు. ఎందుకంటే వాడు పెద్దవాడు కద వస్తువులని జాగ్రత్తగా తీసి తుడిచి పెట్టగలడు. నేను నీకు వంటపనిలో సాయం చేస్తానని ఆనందంగా ముందుకు వచ్చాడు.