వలలో తిమింగలం - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

valalo thimingalam

కా లింగ్ బెల్ అదే పనిగా మ్రోగటంతో వైభవలక్ష్మి వెళ్లి తలుపు తీసింది.

బిల బిలమని ఏడెనిమిది మంది లోపలికి చోచ్చుకొచ్చేసి 'మేము ఎ సి బి నుంచి వచ్చాము. మీరు మీ హస్బెండ్ పూర్ణచంద్రరావు ని ఇతర కుటుంబ సభ్యులెవరన్నా ఉంటే వాళ్ళనీ దయచేసి హాల్లోకి పిలవండి. ' అన్నాడొకాయన మర్యాద పూర్వకంగా. వైభవలక్ష్మికి అదంతా అయోమయంగా ఉంది. ఆమెకు ప్రపంచం తెలియదు. ఆమెకి వాళ్ళాయనే ప్రపంచం. వచ్చింది ఎవరో పెద్దవాళ్ళని మాత్రం అర్ధం అయ్యింది. భర్తని, నాలుగు రోజులక్రితం పండక్కి వచ్చిన కొడుకు, కోడలు ... కూతురు, అల్లుడ్ని గాభరాగా పిలిచింది. ఆవిడకేమన్నా జరిగిందేమో అని అందరూ హడావుడి గా పరిగెత్తికోచ్చారు.

పూర్ణచంద్రరావు కి అక్కడున్న వాళ్ళని చూడగానే విషయం అర్ధమై మొహాన చెమటలు పట్టాయి. అందరూ వచ్చేశారని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆ ఆఫీసర్ 'వుయార్ ఫ్రం ఎ సి బి .... మీ ఇల్లు మేము సోదా చెయ్యటానికి మీరందరూ సహకరించండి. ఎవరికీ ఫోన్లు చెయ్యటం కానీ ఇతరత్రా విధానాల ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చెయ్యటానికి గానీ ట్రై చెయ్యద్దు. మా పని మమ్మల్ని ప్రశాంతంగా చేసుకోనిస్తారని ఆశిస్తున్నాము'. అన్నాడు.

పూర్ణచంద్రరావు నిస్సత్తువతో పక్కనే వున్న కుర్చీలో కూలబడిపోయాడు. గుండె కొట్టుకునే వేగం రెట్టింపయింది. తన ఇంటి మీద ఎవరి కన్ను అయితే పడకూడదని అనుకున్నాడో వాళ్ళ డేగ కన్నే పడింది. దాపున కాచుకుని కూర్చున్న పులి పంజా విసిరినట్టు తనింటి మీద పడ్డారు. అయిపొయింది .... అంతా అయిపొయింది. తను పైసా పైసా కూడబెట్టినదంతా గ్రద్దల్లా తన్నుకుపోతారు. బీరువా తాళంచెవులు తీసుకుని బీరువాలోని రహస్య అరల్లో, ఇంకా ఎక్కడెక్కడో దాచిన బంగారం, వెండి, నగరంలో వివిధ చోట్ల వున్నా భవంతులు, స్థలాల పట్టాలు, ఫిక్స్ డ్ డిపాసిట్ సర్టిఫికెట్లు అన్నీ టీపాయ్ మీద కుప్పగా పోస్తున్నారు.

ఇహ చూడలేక పోయాడు పూర్ణచంద్రరావు. కళ్ళు మూసుకున్నాడు. అడ్డమైన గడ్డీ తిని అడ్డదిడ్డంగా సంపాదించిన సొమ్ము అది. ఏవేవో అస్పష్ట రూపాలు.... పైశాచిక నవ్వుతో తనకి భలే శాస్తి జరిగిందని మనో యవనికపై తిరుగాడసాగాయి. సంపాదన రంది లో పడి ఇన్నాళ్ళూ క్షణం తీరిక లేకుండా గడిపిన పూర్ణచంద్రరావు మనసు గుర్రం గతాన్ని స్పృశించడానికి వెనుకకు పరిగెడుతోంది.

***** ***** *****

పూర్ణచంద్రరావు తండ్రి ఒక ప్రైవేటు కంపెనీ లో సాధారణ ఉద్యోగి. గంపెడు పిల్లలతో సంసార భారాన్ని అతి కష్టంగా మోసేవాడు. పూర్ణచంద్రరావుకి చిన్నప్పటినుంచి చదువంటే ఆసక్తి. చదువే తమ జీవితాలకి చుక్కాని అని అతి చిన్న వయసులోనే అవగాహన చేసుకున్నాడు. తండ్రి కూడా అది గమనించి పూర్ణచంద్రరావు ని అప్పో సొప్పో చేసి బాగా చదివించాడు. తమ భవిష్యత్తుకి అతడే అండా దండా అని ఆ ముసలివాళ్ళు అతన్ని శ్రద్దగా చూసుకునేవాళ్ళు. పూర్ణచంద్రరావుకి ఇద్దరు అన్నలు , ఒక చెల్లి. అత్తెసరి మార్కులతో అర్ధాంతరంగా చదువులు ఆపేసి తమకు చేతనైన పనులు చేస్తూ ఇంటిని ఆదుకోసాగారు. పూర్ణచంద్రరావు క్షణం కూడా వృధా చెయ్యకుండా గవర్నమెంట్ ఉద్యోగాలకి అప్లై చేసి కాంపెటీటివ్ ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవుతుండేవాడు. ఎన్నో ప్రయత్నాలు చేసిన మీదట అన్ని స్థాయిల్ని విజయవంతంగా దాటి ఇంటర్వ్యూ దాకా వచ్చాడు. అది పూర్తయితే ప్రభుత్వ ఉద్యోగే కానీ చాలా పెద్ద మొత్తం లంచం ఇవ్వాలి. ఇంటికెళ్ళి తండ్రికి విషయం చెప్పి అలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదనీ అది సద్వినియోగ పడేట్టు చూడాలని తండ్రిని ప్రాధేయ పడ్డాడు. ఆయన ఎంత ప్రయత్నించినా అంత డబ్బు అప్పు పుట్టలేదు. ఇహ చేసేదేమీ లేక తాతల నాటి స్థలాన్ని .. రేకుల ఇంటిని అమ్మేశాడు. ఆ వచ్చిన మొత్తం కొడుకుల చేత్తో పోస్తూ 'ఒరేయ్ పూర్ణా! నువ్వు గోప్పోడువయ్యి మాకింత నీడనిస్తావన్న నమ్మకంతో వున్న గూడు అమ్మేసాను. నీ తోడబుట్టిన వాళ్లకి... మాకు ఏ ఆధారం లేకుండా చేసుకున్నాను. ఆళ్ళేప్పుడూ నీకు అడ్డు రాలేదు. ఆల్లని కూడా నీవే సూడాల. రేపు నువ్వు మంచి కొలువులో కలకల్లాడత మమ్మల్ని మర్చిపోతే మాకు సావే గతి. అది గుర్తుంచుకోరా !' అన్నాడు కన్నీళ్ళతో. అప్పుడు అనిపించింది పూర్ణచంద్రరావు కి డబ్బు సంపాదించి తన వాళ్ళని సుఖపెట్టి తానూ సుఖపడాలని. డబ్బు సంపాదనే ధ్యేయంగా బ్రతకాలని. పైసా పైసాకి చూసుకోకుండా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే స్థాయికి ఎదగాలని. చిన్నపట్నుంచి డబ్బు లేక ఎన్నో వదులుకున్నాడు. రాజీ పడి జీవించాడు. ఇన్నాళ్ళకి అవకాశం వచ్చింది. ఇహ వుపేక్షించకూడదు. అనుకుని తండ్రి చేతిని ఆప్యాయంగా నొక్కి ఉద్యోగాన్ని లంచంతో కొనటానికి బయలుదేరాడు.

***** ***** *****

పూర్ణచంద్రరావు ప్రభుత్వోద్యోగి అయ్యాడు.

ఎన్నో ఏళ్ల తపస్సుకి భగవంతుడు ప్రత్యక్షమయ్యి వర మిచ్చినట్టుగా అహర్నిశలు కాసుల గల గలలు వినిపించే సీటు తనదయ్యింది. పనికో రేటు ... పని పూర్తి చేసే వ్యవధికి ఒక రేటు. బిల్స్ శాంక్షన్ అయితే అందులో వాటా. అందిన దాంట్లో పై వాళ్ళకి .. ఆ పై వాళ్ళకి పంచటం వల్ల ఎవరూ అతని మీద ఈగ వాలనిచ్చేవారు కాదు. ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే అది కాగితాన్ని ఖరాబు చెయ్యటం తప్ప మరెందుకూ పనికి వచ్చేది కాదు. ఆ సీట్లో కూర్చుంటే కరడుకట్టిన ఆక్టోపస్. దయ దాక్షిణ్యాలు, మానవత్వం లాంటివి మచ్చుకైన కనిపించేవి కావు. సంపాదన ... సంపాదన. తల్లి తండ్రులకి అతి తక్కువ కాలంలో వూళ్ళో అన్ని వసతులతో ఇల్లు ఏర్పాటు చేసాడు. పొలాలు కొనిచ్చి అన్నయ్యలని బినామీలు గా చేసాడు. చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసాడు. ఊళ్ళో వాళ్ళంతా 'ఏం కొడుకుని కన్నావయ్యా! మాణిక్యం లాంటి కొడుకు. తల్లి తండ్రుల్ని .. తోడ పుట్టినవాళ్లని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. నీ శ్రమ ఊరికే పోలేదు. నీకు సొరగం చూపిస్తున్నాడయ్య...సొరగం' అని తండ్రితో అంటుంటే విన్నట్టుగా విని గర్వ పడిపోయేవాడు. సీనియర్లు 'ఏం స్పీడయ్యా నీది పూర్ణచంద్రరావు ఇన్నాళ్ళుగా సీట్లని పట్టుకుని గబ్బిలాలుగా వెళ్ళాడుతున్నా ఓ స్థలం కొన్నదీ లేదు ... ఇంట్లో ఓ ఖరీదైన వస్తువూ అమర్చుకున్నదీ లేదు. నీ ధైర్యం మాకు రమ్మన్నా రాదు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవటమెలాగో నిన్ను చూసే నేర్చుకోవాలి' అనేవాళ్ళు. తన వాళ్లకి అన్నీ సమకూర్చాక ఇహ తనకోసం ఆలోచించటం మొదలుపెట్టాడు.

దాదాపు ఎనభై శాతం మంది వ్యాపార ప్రయోజనాల కోసం వచ్చేవాళ్ళు కాబట్టి అడిగినంత ఇచ్చేవాళ్ళు... కాని కొంత మంది దరిద్రులు దేబరిస్తూ ఫైలు మీద తన సంతకం కోసం పరితపిస్తూ వెంటాడుతుంటే చిరాగ్గా వుండి చీదరించుకోనేవాడు. అయినా వదిలితేగా! డబ్బు చేతిలో పడితే గాని పని జరగదని నిక్కచ్చిగా.. సూటిగా చెప్పినా జిడ్డులా వదిలేవాళ్ళు కారు. వచ్చిన వాళ్ళలో తన తల్లి తండ్రి వయస్కులున్నప్పటికినీ అతని మనసు కరిగేది కాదు. ఓ ముసలాయన కాళ్ళరిగేలా తన చుట్టూ తిరిగి ఆఖరికి తన సీటు దగ్గరే ప్రాణాలొదిలాడు. అయినా అతనిలో ఇసుమంత మార్పు కూడా లేదు. ఎంత మంది శాపనార్థాలు పెట్టినా లక్ష్యపెట్టేవాడు కాదు. డబ్బు అతనికి ప్రియమైన భాష. మాంచి పోష్ ఏరియాలో విలాసవంతమైన ఇల్లు కట్టుకున్నాడు. ఇంట్లోకి కావలసిన హంగులన్నీ సమకూర్చుకున్నాక బోలెడంత కట్నకానుకలతో కాంట్రాక్టరు కూతురు వైభవలక్ష్మిని భార్యని చేసుకున్నాడు. జీవితం సునాయాసంగా నల్లేరుమీద బండి నడకలా సాగిపోనున్నంతలో ఈ ఉపద్రవం .. ఆశనిపాతం

***** ***** *****

"పూర్ణచంద్రరావుగారూ" ఆఫీసర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి కళ్ళు తెరిచాడు.

ఎదురుగా టీపాయి మీద తను కూడబెట్టిన సొమ్ము గుట్టలా వుంది. ఎన్నాళ్ళ నుండి ఎంత మందిని పీడిస్తే అది సాధ్యమవుతుంది? ఏమీ చేయలేని పరిస్థితి. గుండెకు చిల్లులు పడి కన్నీరు కాల్వలు కట్టడానికి సిద్ధంగా వుంది. అవసరార్థం వచ్చిన ఏ తల్లో డబ్బు చేతిలో పడితే తప్ప పని చేయనని తెలిసి కంట తడితో... కడుపు మండి శపించి వుంటుంది. అందుకే... అందుకే ఇలా బ్రతుకు వీధిలో పడబోతుంది. తండ్రి తన ఉద్యోగానికి లంచమివ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో చూసి కూడా తను తప్పు దోవ పట్టాడు. డబ్బే పరమావధి అని తప్పుగా అర్థం తీసుకున్నాడు. సరిదిద్దుకోలేని తప్పు చేశాడు. ఇన్నేళ్ళ సర్వీసులో తన మూలంగా ఎంత మంది జీవితాలు నాశనమయ్యాయో! దేశానికి ఎంత నష్టం జరిగిందో! తను చేసింది ఘోర పాతకం. నిష్కృతి లేని పాపం. నిజానికి తనకింత డబ్బు అవసరమా? ఏం చేసుకుంటాడు? తరతరాలకి సంపాదించి పెట్టాలన్న తపన ఎందుకు? ఇప్పుడు వీళ్ళు తన ఆస్తులన్నీ జప్తు చేసినా తను పాడు చేసిన జీవితాలు బాగు పడతాయా? ప్రజలకి సేవ చేయడానికి ప్రభుత్వ శాఖలు.. అందులోని ఉద్యోగులు. కాని జరుగుతున్న దేమిటి? మొదటి నుండి అవినీతికి ఆస్కారముండే సీట్ల మీద ప్రభుత్వ అజమాయిషీ వుంటే ఇలాంటివి జరగవు కదా.. అంటే ప్రభుత్వం కూడా చూసి చూడనట్లు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుంది అన్నమాట. ఎప్పుడో ఒక సారి తూ తూ మంత్రంగా దాడులు జరపండి. మొక్కుబడి జప్తులు, సస్పెన్షన్లు. ఇదో చర్వితచరణం. ఈ ఆలోచనలేవి ఇంతకు ముందు కలగలేదేమిటి? అసలు ఆలోచించే సమయముంటే కదా! తనలాంటి వాళ్ళు ఎంతో మంది? ఈ దేవుడన్నా తనకి అవకాశం కల్పిస్తే తను అన్యాయం చేసిన వాళ్ళ కాళ్ళు కన్నీటితో కడిగి పునీతుడవ్వాలని వుంది. పశ్చాతాపం అతడిని దహించి వేస్తుంది.

"ఈ డబ్బంతా మీ సమక్షంలో మీ ఇంట్లో మేము సోదాలు చేసి రాబట్టినదని.. సొమ్ము మీదేనని సంతకం చేయండి." అని ఫైల్ ముందు పెట్టాడు ఆఫీసర్. సంతకం చేయడానికి చేయిలేపలేకపోయాడు. సన్నగా మొదలైన గుండెనొప్పి క్షణాల్లో పూర్ణచంద్రరావుని అచేతనున్ని చేసింది. తన సంపాదన గుట్ట మీద వాలిపోయాడు.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు