ఇహ నావల్ల కాదురా మల్లేశం! తిరిగివెళదాంపద." ముఖానికి పట్టిన చెమటని తుడుచుకుంటూ అన్నాడు నాగేశ్వర శాస్త్రి. "నీతో ఇదేరావచ్చిన చిక్కు.దేనికీ ఓపికుండదు, అసలు నిన్నెవరురమ్మన్నార్రా! నాతో, నాతిప్పలేవో నేనుపడేవాడ్నిగా?" కోపంగా అన్నాడు. మల్లేశ్వర శాస్త్రి ఇద్దరూ యఙ్ఞోపవీతాలతో అపర అగ్నిసంభవుల్లా ఉన్నారు. "ముందా చీటీతీసి సరిగా ఇంటినెంబర్ మరోమారు చూడు. 1-6-9 లేక 6-9-1 ఈరెండింటిలో అసలు నెంబరేదో తెలీకపోయె! ఇప్పటివరకూ 1-6-9 అని వెతికాం,అదికాదని తెల్సిందాయె!ఇహ 6-9-1 నెంబరు ఇంటికోసం వెతకాలా?.
నీవసలు వ్రాసుకోడం సరిగాఉండుంటే ఇంత గొడవ ఉండేదేకాదు. నీ ఆరూ,తొమ్మిదీ ఒకేలా ఉండేడుస్తాయాయె! ఈరెండింటిలో అసలు నెంబరేదో తెలీక రెండుగంటలనుంచీ ఈ ఎండలో వెతుక్కుంటున్నాం,కనీసం ఆ ఇంటి వాళ్ళ టెలిఫోన్ నెంబరైనా రాసుకున్నావుకాదు." అంటూ నాగేశ్వర శాస్త్రి వీధిమధ్యలో నిల్చుని ఇటూ అటూ చూడ సాగాడు.
ఇంతలో వచ్చేశారా? రండి రండి ! మీకోసమే గంటనుంచీ ఎదురుచూస్తున్నాం.పాపం ఇల్లుకనుక్కోడం ఇబ్బందైనట్లుంది కదా! రండి ఈవైపు మా ఇల్లు." అంటూ దారి చూపసాగాడో వ్యక్తి . వయస్సు యాభై ఉండవచ్చు.పంచ కట్టుకుని పైనఉత్తరోయంమాత్రమే వేసుకుని ఉన్నాడు. ఆయన వెనకాలే అయోమయంగా, ముఖ ముఖాలూ చూసుకుంటూ నడవసాగారు ఇద్దరూనూ. "రండి! మానాయన గారు ఆలస్యానికి తాళలేరు.స్నానాలు చేసే వచ్చారుగా? ఇలా వెళ్ళి ఈ బాత్ రూంలో కాళ్ళదీ కడుక్కు రండి. ఇవిగోండి తువ్వాలాలు." అంటూ హడావిడిచేయసాగారాయన . ఏదో చెప్పబోతున్న మల్లేశ్వర శాస్త్రి తో, " అన్నీ తర్వాతే ముందు కార్య క్రమం కానీండి" అంటూ తోసినట్లే బాత్ రూంవైపు నడిపించాడు . వారు కాళ్ళూ ముఖాలుకడుక్కుని వచ్చేవేళకు " ఇవోండి మడి ఉత్తరీయాలు ,పంచలూనూ. వెంటనే ధరించిరండి. " అంటూ హడావిడి చేశాడు.
అయ్యా! మీరసలు...మమ్మల్ని .." ఏదో చెప్పబోతున్న నాగేశ్వరశాస్త్రిని చేయెత్తి ఆపి., ." అయ్యలారా! మానాయనగారు 70ఏళ్ళ ముదుసలి. ఆయన ఆట్టే సేపుండలేరు. దయచేసి ముందు మడి బట్టలు ధరించి ,ఔపోసన వేయించుకోండి ,అప్పుడే మానాయన గారూ భోజనం చేస్తారు . ఆతర్వతే అన్నీ చెప్పండి . ఈపాటికే చాలా ఆలస్య మైంది." అంటూ తానూ మడిబట్టకట్టుకుని వారిద్దరికీ పంచలూ ఉత్తరీయాలూ అందించాడు.
నాగేశ్వరశాస్త్రి,మెల్లిగా " ఒరే !ఆకలిమీదున్నాం .ఏదైతే కానీ ముందు భోజనం చేసేద్దాం.మనమూ జంధ్యాలున్నబ్రాహ్నణులమేగా ?" అని మెల్లిగా మల్లేశ్వర శాస్త్రి చెవి లో అన్నాడు. సరే అనుకుని ఇద్దరూ , తమబట్టలు మార్చుకుని మడిబట్టలు ధరించి అరిటాకుల ముందు కూర్చుని జంధ్యాలు సవరించుకుని , ఔపోసన వేయించుకున్నారు . ఆపైన మూడుకూరలూ , నాల్గుపచ్చళ్ళూ , పప్పూ, రసం, గారెలూ, అరిసెలూ, కమ్మని నెయ్యి , గడ్డపెరుగుతో కొసరి కొసరీ భయభక్తులతో ఇంటివారు ,వడ్డిస్తుండగా భోజనం కాని చ్చారు. భోజనం పూర్తయ్యాక ,ఇద్దరికీ చెరో ఐదువందలూ, పంచలచాపూ తాంబూలం తో కపిలి ఇచ్చి నమస్కరించారు.
" చాలా సంతోషం బాబూ! సమయానికి వచ్చి ఆదుకున్నారు. ఈరోజునమా తాతగారి ఆభ్దీకం , చాలాఏళ్ళక్రితమే కాశీలో కర్మ క్రతు వులు నిర్వహించారు మా నాయనగారు! . ప్రతిఏడాదీ ఇలా ఇద్దరు బ్రాహ్మణులకు ఔపోసన వెసుకోడం ఆచారం." అంటూ మళ్ళీ నమస్కరించారు. నాగేశ్వరశాస్త్రి , మల్లేశ్వర శాస్త్రి ఇహఅక్కడుంటే పరువు నిలవదనిభావించి బదులునమస్కారంచేసి బయట పడ్డారు. వారు బయటికెళు తుండగా ఇద్దరు బ్రాహ్మణులు ఆదరాబాదరా లోపలికి వచ్చారు. విషయం తెల్సుకుందామన్న కుతూహలంతో నాగేశ్వరశాస్త్రి , మల్లేశ్వర శాస్త్రి గేటువద్ద లోపలి మాటలు వినేందుకై నక్కి నిలిచారు.
"అయ్యా! మన్నించాలి , భయంకరమైన ట్రాఫిక్ లో ఇరుక్కున్నాం ,ఇప్పటికి ఇల్లు కనుక్కుని వచ్చాం " అనిచెప్పగా ,ఆ ఇంటి యజమాని "అయ్యలారా! మీకు వారంక్రితమే చెప్పాం , మానాయనగారు ఆలస్యానికి తాళ లేరని. ఎవరో ఇద్దరు బ్రాహ్మణకుర్రాళ్ళు ఇల్లువెతుక్కుంటుండగా, వారే మీరుగా భావించి వారు చెప్పబోతున్న మాటలు కూడా వినే వ్యవధానం లేక ఔపోసన వేసి భోజనం పెట్టేశాం. ఐపోయింది. మీరూ కావలిస్తే మాతోపాటు భోంచేసి వెళ్ళండి .భ్రాహ్మణులు అభోజనంగా వెళ్ళ రాదు." అంటూ లోపలికి ఆహ్వానించాడు.
అసలు జరిగిందేమంటే నాగేశ్వరశాస్త్రి , మల్లేశ్వర శాస్త్రి తెల్సిన వారింట జరగబోయే ఒక కార్యక్రమానికై నగరాని కొచ్చారు, వారి గృహం వెతికే వేటలో అలసి సొలసి నీరిచ్చేవారు కూడా కనిపించక నడి మధ్యాహ్నం అంగలార్చుకుపోతుండగా జరిగిన కధ ఇది. ఏమైతేనేం వారి యఙ్ఞోప వీతమే వారిని ఆకలి, దాహ బాధల నుండీకాపాడింది.