నిజ లింగన్న - చెన్నూరి సుదర్శన్

పూర్వం ఎదులాపురం గ్రామంలో మల్లమ్మ మల్లయ్య దంపతులు నివసించే వారు. వారికి ఒక కుమారుడున్నాడు. పేరు లింగన్న.

మల్లమ్మ ధ్యాసంతా కొడుకు మీదనే. అతన్ని తన భర్త అబద్ధాలపుట్టలా గాక ఒక నిజాయితీ గల పౌరునిగా తీర్చి దిద్దాలని కలలు కనేది. ఎల్లప్పుడూ నిజమే చెప్పాలని, అబద్ధాలు అసలే ఆడకూడదని నూరి పోసేది. నిజం నిప్పులాంటిదని ఎప్పటికయినా ‘నిజం’ ముందు ‘అబద్ధం’ ఓడిపోక తప్పదని మరీ మరీ చెప్పేది. కొడుకును ఎప్పుడూ ‘నిజ లింగన్నా!’ అంటూ పిలిచేది. ‘నిజం’ లింగన్నకు ఇంటి పేరులా నిలిచింది.

ఆ ఊళ్లో అతడికి అది సార్థకనామధేయమైంది. మల్లయ్యకు ఇది నచ్చేది కాదు. అబద్ధాలాడుతూ సుఖంగా పొట్ట పోసుకోవచ్చు గాని నిజం మాట్లాడితే పిరికెడు నూకలు గూడా పుట్టవు అనేది మల్లయ్య సిద్ధాంతం. ఈ విషయంలో మల్లయ్య మల్లమ్మ తగువు లాడుకునే వారు.

నిజ లింగన్న పదహారేండ్ల ప్రాయంలో హఠాత్తుగా మల్లమ్మ కాలం చేసింది.

మల్లయ్య మాయ మాటలు చెప్పి ఎల్లమ్మను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. కాపురానికి వచ్చిన ఎల్లమ్మ నిజ లింగన్న చూసి “ఎవరు నువ్వు?” అని అడిగింది. “నేను మల్లయ్య కొడుకును” అని నిజం చెప్పాడు నిజలింగన్న.

ఇక ఎల్లమ్మ వీరావేశంతో మల్లయ్య పైకి ఎగిరింది. పిల్లలు లేరని చెప్పి తనను పెళ్లి చేసుకున్నందుకు నానా మాటలు అంది. మల్లయ్య కాళ్లా వేళ్లా పడి ఎల్లమ్మను దారికి తెచ్చుకున్నాడు.

నిజలింగన్నను ఇంట్లోకి రానిచ్చేది కాదు ఎల్లమ్మ. మల్లయ్య పట్టించుకునే వాడూ కాదు. పాపం నిజలింగన్న వీధి అరుగు మీద మట్టి చిప్పలో తినడం.. చింకి చాపలో పడుకోవటం..

ఒక రోజు రాత్రి ఎల్లమ్మ మల్లయ్యతో “ఏమయ్యా! నాచేతి వంటలు రుచిగా ఉంటున్నాయా? లేక నీ మొదటి భార్య చేతి వంట రుచిగా వుండేదా?” అని అడిగింది.

“నీ చెయ్యి తగిలితే చాలు పచ్చి కూరలయినా అమృతంగా వుంటున్నాయి.. నువ్వసలు పొయ్యి వెలిగించకున్నా ఫరవాలేదు” అంటూ ప్రశంసించాడు మల్లయ్య. ఆమాటలు నిజలింగన్న చెవిలో పడ్డాయి. తెల్లవారి ఎదురింటి ముసలమ్మ చుట్ట చేతిలో పట్టుకొని నిప్పు కావాలంటూ వచ్చింది. “మా ఇంట్లో పొయ్యి వెలిగించటం లేదు అవ్వా!. మా నాయన పచ్చి కూరలే తింటున్నాడు. మహా రుచిగా వుంటున్నాయి అంటున్నాడు” అన్నాడు నిజ లింగన్న.

అది విన్న ఎల్లమ్మ మూలకు మంచం వాల్చి పడుకుంది. మల్లయ్యతో గొడవ పడింది. నిజలింగన్నను దూరంగా ఎక్కడికయనా పంపించకపోతే తనే ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోతానని బెదిరించింది. చేసేది లేక మల్లన్న “చూశావా కొడుకా! నిజం చెబితే కష్టాలు తప్పవురా.. లౌక్యంగా అబద్ధాలు ఆడాలి. నువ్వు వినవు కాని నీమేనత్త రాజమ్మ దగ్గరికి వెళ్లు” అంటూ ఒక పాత గొంగళి ఒకటి ఇచ్చి ఇంటి నుండి తరిమేశాడు.

పొరుగూరు మాణిక్యాపురంలో ఉన్న తన మేనత్త రాజమ్మ ఇంటికి బయలు దేరాడు నిజ లింగన్న. ఇంట్లోకి అడుగు పెట్టిన నిజ లింగన్న అక్కడి దృశ్యం చూసి నివ్వెరపోయాడు. రాజమ్మ పక్కింట్లో నుండి కిటికీ గుండా కోడిని దొంగిలించి గంప కింద కమ్ముతోంది.

ఇంతలో నిజలింగన్న రాకను గమనించి “రా.. అల్లుడూ రా.. ” అంటూ ఆహ్వానించింది. కాళ్లు కడుక్కోడానికి నీళ్ళు ఇచ్చింది. భోజనం వడ్డించింది. లింగన్న కాళ్లు చేతులు కడుక్కొని భోజనం చేయసాగాడు. ఇంతలో పక్కింటామె విసురుగా రాజమ్మ ఇంట్లోకి వచ్చి “మా కోడి కనబడటం లేదు వదినా.. మీ ఇంట్లోకి ఏమైనా వచ్చిందా?” అంటూ అడిగింది.

వెంటనే నిజ లింగన్న “ మా అత్త మీ కోడిని గంప కింద దాచి పెట్టింది” అంటూ మూలకు వున్న గంపను చూపించాడు.

దాంతో రాజమ్మ‘కయ్యి’న నిజ లింగన్న మీదికి లేచి వడ్డించిన విస్తరిని లాక్కొని ఉన్న ఫళంగా ఇంట్లో నుండి బయటికి వెళ్ల గొట్టింది. ‘ఉసూరో’ మంటూ గొంగలి నెత్తి మీద వేసుకొని సగం ఖాళీ కడుపుతో నిజ లింగన్న ఎండలో బయలు దేరాడు.

‘నిజం చెపితే ఈ మనుషులు ఏంటి ఇలా తరుముతున్నారు.. ‘పట్టణంలో అయినా నిజానికి విలువ ఉంటుందేమో! కళింగ పట్టణం వెళ్లి కీర్తికేయ మహారాజు గారి కొలువులో ఏదైనా పని చూసుకొని తన తల్లి ఆశయం మేరకు నిజాయితీగా జీవనం సాగించాలి’ అని మనసులో అనుకుంటూ పట్టణం తోవ పట్టాడు. పట్టణ పొలిమేరలో ఒక గ్రద్ధ నిజ లింగన్న తలమీది గొంగళిని తన్నుకుని వెళ్లింది. అది ఎక్కడయినా జారవిడుస్తుందేమోనని ఆశతో కొంత దూరం పరుగెత్తాడు.. పరుగెత్తాడు. కాని అది కనుచూపుకు అందకుండా ఎగిరి పోయింది. అలిసి పోయిన నిజ లింగన్న దూరంగా కనిపించే గుర్రపుశాలకు వెళ్లి ఒక మూల తలదాచుకున్నాడు.

రాత్రి అయ్యింది. కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి. నిద్ర రావటం లేదు. ఇంతలో ఎవరో ఇద్దరు గుర్రపు శాలలో అడుగు పెడ్తున్నట్లు అలికిడి అయ్యింది. వారిరువురి వేష ధారణతో వారు రాజుగారి ఆస్థానంలో పని చేసే వారని ఆ గుడ్డి వెలుగులో గుర్తుపట్టాడు. ఆనిశ్శబ్ద నిషీధిలో వారి మాటలు స్పష్టంగా విన పడ్తున్నాయి.

“భూపతి గారూ యిక మీరు సేనాధిపతి పదవిని విడిచి పెట్టి కళింగ పట్టణ మహారాజుగా ప్రమాణం చేసే సమయం ఆస్నన్నమైంది. నేను ఒక అమాయకపు సాధువు వద్ద యీ ‘ముల్లోక దృశ్య దర్శిని’ అనే అద్భుతమైన దర్పణాన్ని తస్కరించి తెచ్చాను. దీనిలో వున్న మీటలను సరి చేసుకుంటూ మూడులోకాలలో ఏమారుమూల ప్రాంతమయినా చూడవచ్చు” అన్నాడు.

“దుర్మతీ! అప్పుడు నిన్ను యీ అశ్వదళపతి పదవి నుండి తొలగించి మహామంత్రిగా నియమిస్తాను. మనం కార్య సాధనలో నిమగ్నమవుదాం. యీ అద్భుత దర్పణ సహాయంతో రహస్య స్థావరాలలో మనం దాచి పెట్టిన ఆయుధాలను చూద్దాం” అంటూ ఒక్కొక్క ప్రాంతం దుర్మతి చెబుతుంటే భూపతి దర్పణం లోని మీటల్ను సరి చేసుకుంటూ చూడసాగాడు.

నిజలింగన్నకు తన గొంగళి జ్ఞప్తికి వచ్చింది.

“అయ్యలారా.. నా గొంగళిని ఒక గద్ద ఎత్తుకెళ్లింది. ఆ అద్దంలో చూసి నా గొంగళి ఎక్కడ వుందో కాస్తా చెబుతారా.. వెళ్లి తెచ్చుకుంటాను” అన్నాడు అమాయకంగా.

వెంటనే కత్తులు దూసి నిజలింగన్న పైకి దూకారు భూపతి దుర్మతి. గజ గజ లాడి పోయాడు నిజలింగన్న. చల్ల చెమటలు పోసాయి. అతడి వాలకం చూసి ‘ఎవరో పల్లెటూరి అమాయకపు పక్షి. వీడికి రాచకార్యాలేం ఎరుక?’ అని కత్తులు తిరిగి తమ ఒరలో పెట్టుకున్నారు. కాని దుర్మతి అంతటితో ఊర్కోలేదు. అశ్వాలను అదిలించే హంటరుతో నిజలింగన్న వీపులో నాలుగు తగిలించి తరిమేశాడు.

అర్థరాత్రి కళింగ పట్టణ వీధిలో నడుచుకుంటూ వెళ్తూ..

“ఈ రాజుకు రాజ్యాన్ని సుస్థిరంగా పరిపాలించే తెలివి తేటలు లేవు. ఈ పట్టణంలో కూడా నిజానికి నీతికి స్థానం లేదు. అద్దంలో ముల్లోకాలు చూసే వీలున్నప్పుడు నా గొంగళి విషయం అడిగితే తప్పా?.. భూపతి దుర్మతి కలిసి మహారాజును చంపటం ఖాయం..” అని తనకు తెలియకుండానే బయటికి వినవచ్చేలా మాటలు వదల సాగాడు.

గూఢాచారులు నిజలింగన్న మాటలు విని బంధించారు. నిజలింగన్న ఈ హఠాత్పరిణామానికి విస్తు పోయాడు. తాను ఏమీ తప్పు చేయలేదని మొరపెట్టుకున్నాడు. “నిజం మాట్లాడితే నిష్ఠూరమన్నట్లు.. నన్నెందుకు బంధిస్తున్నారు?” అని అడిగాడు.

“ఏమిటా నిజం” అని రెట్టించారు గూఢాచారులు.

నిజ లింగన్న అశ్వశాలలో మహారాజుపై ముల్లోక దృశ్య దర్శిని సహాయంతో జరుగబోయే దాడిపై తాను విన్న విషయాన్ని పూసగృచ్చినట్లు చెప్పాడు.

వెంటనే గూఢాచారులలో ఒకడు సంకేతకంగా ఈల వేయగానే బిల బిలమంటూ మహారాజు అంగ రక్షకులు వచ్చారు. మరో గూఢాచారి సూచనల మేరకు ఆలమేఘాలలో పరుగులు తీస్తూ అశ్వశాలపై దాడి జరిపి భూపతిని, దుర్మతిని బంధించారు. ముల్లోక దృశ్య దర్శినిని స్వాధీన పర్చుకున్నారు.

మొదటి గూఢాచారి లింగన్నను తన గృహానికి తీసుకు వెళ్ళాడు.

ఆ మరునాడు రాజ సభలో భూపతిని, దుర్మతిని ప్రవేశ పెట్టారు.

గూఢాచారులు ఎవరో కాదు ఒకరు కీర్తికేయ మహారాజు మరొకరు మహామంత్రి అని గుర్తించాడు నిజ లింగన్న.

తన అసలు పేరు లింగన్న అని.. తాను ఎల్లప్పుడు నిజమే చెబుతాడు కాబట్టి ఊళ్లో వాళ్లంతా తనని ‘నిజ లింగన్న’ అంటారని చెప్పాడు. అయితే తాను నిజం చెపితే ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నాడో సభలో ఏకరువు పెట్టాడు. అయినా తన తల్లి ఆశయం మేరకు తాను ఎప్పుడూ నిజమే చెప్తున్నానని ప్రమాణం చేశాడు. ఆరాత్రి జరిగిన సంఘటనలోని నిజాన్ని వివరించాడు. లింగన్న చెప్పిన ప్రాంతాలన్నీ సోదా జరిపి ఆయుధాలు స్వాధీన పర్చుకున్నారు రాజభటులు.

కీర్తికేయ మహారాజు భూపతి దుర్మతిలకు ఉరి శిక్ష విధించాడు.

నిజలింగన్నకు తన ఆంతరంగిక గూఢా చారిగా నియమించుకున్నాడు.

అంతిమ విజయం నిజానిదే అని తన తల్లి మల్లమ్మ చల్లని మాట మననం చేసుకోసాగాడు నిజ లింగన్న.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు