ఇచ్చట సమస్యలు అమ్మబడును... తీర్చబడును!
బోర్డును గేటుకు తగిలించి తృప్తిగా దానివంక ఒకసారి చూసి లోపలికి వెళ్లిపోయాడు పరమానందం. అప్పుడే పక్క మార్వాడీ షాపులోకెళ్లి పాల ప్యాకెట్ కొనుక్కొని తీసుకొస్తున్న ఆయన భార్య సోమిదేవి గేటుకి వేళ్లాడుతున్న బోర్డు చూసి గబగబా అడుగులేస్తూ లోపలికి వచ్చి
"రిటైరయ్యాక మీకేమైనా పిచ్చి పట్టిందా? మనిషంటేనే రకరకాల సమస్యలు. అలాంటిది సమస్యలు కొనుక్కొవడమేంటండీ? హవ్వ... ఎవరైనా వింటే నవ్విపోతారు" అంది కోపం, ఆశ్చర్యం, వెటకారాలను మాటల్లో మిళితం చేసి.
"ఓసి నీ పిచ్చి మొహమా! మనిషికి సమస్యలుండేది నిజమే! అయితే కొన్ని సహజంగా వచ్చేవి, మరికొన్ని కోరి తెచ్చుకునేవి. అంటే, నిజానికి సమస్య వుండదు. కానీ, ఉందనుకొని భ్రమపడి దాని గురించి ఆలోచిస్తూ కృంగి కృశించి పోతూంటాడు. దీన్నిబట్టి నాకేమర్థమైందంటే సమస్య లేకుండా మనిషుండలేదు. ఇంకో విషయం... ఆలోచన లేని మెదడు దెయ్యాల కార్ఖానా! అందుకని, అర్థం పర్థం లేని సమస్యలను సృష్టించుకుని దాని గురించి ఆలోచిస్తూ బాధపడిపోయేకన్నా, వాళ్ల జీవితాలు వికసించేలా ఒక ముఖ్య సమస్యనిచ్చి వాళ్ల మెదడుని ఎంగేజ్ చేస్తే... హాయిగా దాని గురించి ఆలోచిస్తూ పరిష్కరాన్వేషణలో తలమునకలై వుంటారు. నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ ప్రగతి పథంలో ముందుకు సాగుతారు. అలా కాకుండా వాళ్లే సమస్యతో మన ముంగిట్లోకొస్తే, ఆ సమస్యను మనం మన అనుభవం, వేదాలు, పురాణేతిహాసాల సహకారంతో సాల్వ్ చేయవచ్చు. సమస్యలో చిక్కుకున్నవాడికన్నా ఒడ్డునున్నవాడి మనసు ప్రశాంతంగా వుంటుంది, త్వరగా పరిష్కారమూ చిక్కుతుంది. అచ్చు పజిల్స్, గేంస్ లా అన్నమాట! నాకెందుకో ఇది క్లిక్ అవుతుందనిపిస్తోంది... నాకూ కాలక్షేపం... ఆర్థికంగా మనకు కాస్త బలాన్నీ చేకూరుస్తుంది. అర్థమైందా?" అన్నాడు.
సోమిదేవి భర్త తెలివికి పొంగిపోయింది... కాకపోతే, 'ఇది అయ్యేపనేనా?' అనుకుంది. చిన్నప్పట్నుంచీ తన మనసులోనూ ఎన్నని అర్థంలేని అనుమానాలు, భయాలు చోటు చేసుకున్నాయో... తర్వాత దూదిపింజెలా ఎలా మాయమయ్యాయో... సినిమా రీలులా తిరగసాగాయి. భర్త చెప్పింది నిజమే! మనిషికి తన మనిషిలా అనుమానాలు, భయాలు తీర్చే వ్యక్తి కావాలి. అదీ సైక్రియాటిస్ట్... కౌన్సెలింగ్ లాంటి ప్రొఫెషనల్ వేలో కాకుండా మన తాతయ్యో, బామ్మో చనువుగా దగ్గరితనంతో చెప్పే రీతిలో వుండాలి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుండి దూరమై తన చుట్టూ గిరిగీసుకుని బ్రతుకుతున్న ఇప్పటి బిజీ జీవనయాన మనిషి మనసుకి అది సాంత్వన చేకూర్చాలి! తనక్కూడా అది క్లిక్ అవుతుందనిపిస్తోంది. రెక్కలొచ్చిన పిల్లలు దూరమై బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్న తమకి వచ్చేపోయే నలుగురితో కాలక్షేపమవుతుంది.
"మీరన్నది నిజమేనండీ" అంది ఆనందంగా.
మరుసటి రోజు నుండీ మనిషి సమస్యల లావాదేవీలు మొదలయ్యాయి.
తీరుబడి చిక్కని ఆ వ్యాపకంతో... ఆ దంపతుల మనసులో పిల్లలు ఎక్కడో దూరతీరాల్లో వుంటూ తమని పట్టించుకోవట్లేదనే 'సమస్య ' దూరమైంది.