' ఎంత చిత్రమైన మనుషులు ? సానుభూతి కురిపించడానికి సిద్ధమంటారు. కానీ అభినందించాలంటే ఆమడ దూరం పరిగెడతారు.' అనుకోకుండా ఉండలేకపోయింది జాహ్నవి, మధ్యాన్నం సంఘటన స్ఫురణకి రాగానే!
జాహ్నవి పేరుమోసిన కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తోంది. మొదట్నుంచి ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్లు ఎదుర్కొంటూ కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంది. తెలివైన అమ్మాయి కావడంతో ఎటువంటి సిఫార్సులు లేకపోయినా, అంతమంచి కాలేజీలో స్థానం సంపాదించింది. చేరిన ఒకట్రెండు సంవత్సరాలపాటు జూనియర్ అయిన కారణంగా కొంత వివక్షతని ఎదుర్కొన్నా తన ప్రతిభ, మంచితనం కలివిడితనం వల్ల అందరి అభిమానానికి పాత్రురాలయింది. ఇంట్లో అత్తమామలకి, పిల్లలకి, భర్తకి, అడపాదడపా వచ్చే ఆడపడుచులకి, చుట్టాలకి సేవలు చేసుకొని కాలేజీకి రావడం, ఏదైనా మనసు కష్టం కలిగితే సీనియర్ లెక్చరర్స్ తో చెప్పుకోవడం, వారి ఓదార్పు మాటలతో సాంత్వన పొందడం ఇవన్నీ ఆమె దైనందిన జీవితంలో భాగమయ్యాయి.ఎప్పుడైనా ఆమె ఏదైనా చెప్పకపోయినా, మిగిలిన వాళ్ళు దగ్గరకొచ్చి మరీ కనుక్కొనేవారు.
" ఏం జాహ్నవీ ! అలా వున్నావు? ఏం జరిగిందీ? మీ ఆయన ఏమైనా అన్నారా? " అనో, మీ ఆడపడుచు కొత్త డిమాండ్ ఏమైనా పెట్టిందా ? అనో, పిల్లలు గానీ విసిగించారా ఏంటి ? ఇవన్నీ మామూలేనమ్మా ఇవన్నీ కొన్నాళ్ళకి అవే సర్దుకుంటాయిలే , బాధ పడకు " అంటూ అలా ఆమెని మామూలు మనుషుల్లో పడేసే ప్రయత్నం చేసేవారు. ఒకసారి ప్రిన్సిపాల్ జాహ్నవిని పిలిచి పరీక్షల నిర్వహణకి సంబంధించిన కీలకమైన బాధ్యతలు తీసుకోవాల్సిందిగా చెప్పారు.దీనికి జాహ్నవి ఇంట్లో బాధ్యతలు, కొన్ని ఆరోగ్యకరమైన ఇబ్బందులు వివరించేసరికి ప్రిన్సిపాల్ కి చాలా కోపం వచ్చింది. ఇంక ఆ తర్వాత నుంచి జాహ్నవి మీద గుర్రుగానే ఉండేదాయనకు. ఏరకమైన పర్మిషన్లు గానీ, సడలింపులు గానీ ఉండేవి కావు. ఆమె ఏ పని చేసినా తప్పు పట్టేవారు. దాంతో జాహ్నవి చాలా డిప్రెస్డ్ గా అయిపోయింది. మళ్ళీ సహోద్యోగినులే ధైర్యం చెప్తూ ఆమెని ఓదార్చేవారు. ఇలా కొంత కాలం గడిచింది.
జాహ్నవి అత్త మామలు ఏడాది తేడాతో కాలం చేయడం, పిల్లలు ఎదిగి ప్రొఫెషనల్ కోర్సుల్లో జాయినవడం తో ఆమెకి కాస్త తీరిక దొరికి పూర్తి స్థాయిలో ఉద్యోగానికి అంకితమయ్యింది. స్వతహాగా సృజనాత్మక ధోరణి ఉండడంతో అడపాదడపా పరిశోధనా వ్యాసాలు, కథలు, కవితలు వ్రాస్తూ ఉండేది. అవి చదివిన సహోద్యోగినులు " బాగుందోయ్, ఇంకా బాగా వ్రాయాలి " అని మెచ్చుకుంటూ ప్రోత్సహిస్తూ ఉండేవారు. రచనా వ్యాసంగంలోనూ, పాఠాలు చెప్పడంలోనూ, స్టూడెంట్స్ మంచి రిజల్ట్స్ సాధించడంలోనూ ఇలా ఒకటేమిటి, కాలేజీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనూ జాహ్నవే ముందుడేది. దాంతో ఆ సంవత్సరం ఉత్తమ అధ్యాపకురాలిగా రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు అవార్డు ప్రకటించింది. ఆరోజు ప్రిన్సిపాల్ స్వయంగా ఆమెని అభినందిస్తూ వచ్చిన ఆ టెలిగ్రాం ని జాహ్నవికి చూపించి, శుభాకాంక్షలు తెలియజేస్తూ నోటీస్ బోర్డులో ఉంచారు. జాహ్నవి ఆనందానికి అంతులేదు.
రాత్రంతా ఒకటే కలలు.! రేపు అంతా తనని ప్రశంసలతో, పొగడ్తలతో ముంచెత్తుతారని తెగ సంబరపడిపోయింది. మర్నాడు కొంచెం ముందుగా వెళ్ళింది కాలేజీకి. అందరూ ఏం జరగనట్టే ఉన్నారు. మామూలుగా ' హాయ్ ' అనేసి వెళ్ళిపోతున్నారే గానీ, ' కంగ్రాట్స్ ' కూడా చెప్పనే లేదెవరు. ఇద్దరు, ముగ్గురు కొలీగ్స్ మాత్రం " పార్టీ ఎప్పుడిస్తున్నావు " అన్నారు నవ్వుతూ.! కొత్తగా చేరిన లెక్చరర్స్ నలుగురు మనస్పూర్తిగా అభినందనలు చెప్పి, " మేడం ! మీరే మా రోల్ మోడల్ " అని అన్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది జాహ్నవికి. స్టూడెంట్స్ మాత్రం తెగ పొంగిపోయారు. ఆ అవార్డు వాళ్ళకే వచ్చినంత సంబరపడిపోయారు. బొకేలు, గ్రీటింగులతో హడావుడి చేసేసారు.
రెండు, మూడు రోజులు స్టాఫ్ రూం లో వాతావరణం స్తబ్దుగానే ఉంది. మామూలుగా మాట్లాడుతున్నరు తప్ప ఎవరూ ఈ ప్రసక్తి తేవడం లేదు. ఒకరోజు మధ్యాన్నం స్టాఫ్ రూంలోకి అడుగు పెడ్తూ తన పేరు వినిపించడంతో గుమ్మం దగ్గరే ఆగిపోయింది జాహ్నవి. సభ్యత కాకపోయినా నిలబడి వాళ్ళ మాటలు వినసాగింది. " అమ్మో! చూసారా ఆ జాహ్నవి ? మన కళ్ళ ముందు ఉద్యోగంలో చేరింది. మనకంటే పై మెట్టు మీదకెలా వెళ్ళిపోయిందో? " అని ఒకామె, ' మరే! అమ్మో జాహ్నవి నిన్న మొన్నటిదాకా అత్తింటి ఆరళ్ళు, పిల్లలతో సమస్యలు చెప్పుకుని వాపోతూ ఉండేది. అలాంటిది ఒక్కసారిగా ఎంత మార్పు? స్టూడెంట్స్ తో రేడియో ప్రోగ్రాంస్, సెమినార్లు ఇప్పించడం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ప్రిన్సిపాల్ దగ్గర మంచి మార్కులు కొట్టేసింది మొత్తానికి. దేవాంతకురాలు.' అని మరో ఆమె. ' ఏం తెలియని నంగనాచిలా ఉండేది. ఎంత కాలంగా ఈ పన్లన్నీ చేసుకుందో ' అని ఇంకో ఆమె. ఎంతయినా పెట్టి పుట్టిందండీ ఆవిడ. మొగుడు ఇంట్లో బాగా సాయం చేస్తాడు మరి రాయక ఏం చేస్తుంది? మా ఆయన ఉన్నారు , ఎందుకు, తిండి దండగ?" అంది ఇంకో ఆవిడ. " మరే, ఒక ప్రక్క వ్యాసాలూ, కథలు, కవితలు రాసేస్తూ మరో ప్రక్క తన సబ్జెక్ట్ లో సెంట్ పర్సెంట్ రిజల్ట్స్ సాధించేసింది. ఏమైతేనేం? ఇంతమంది సీనియర్స్ ఉండగా బెస్ట్ టీచర్ అవార్డు కొట్టేసింది. " అంటూ దీర్ఘాలు తీసింది పెద్దావిడ. వింటున్న జాహ్నవికి తల తిరిగినట్టనిపించింది. ' వీళ్ళేనా శ్రేయోభిలాషులు అనుకున్నాను? ప్రతి చిన్న విషయం వీళ్ళతో చెప్పి ఊరట పొందేదాన్ని. వీళ్ళ నిజ స్వరూపం ఇదా? గిర్రున వెనక్కి తిరిగి లీవు పడేసి ఇంటికి వెళ్ళిపోయింది. మధ్యాన్నం అంతా ఒకటే తలనొప్పి ఆలోచనలతో....! ఆప్త మిత్రురాలు ప్రకీర్తిని కలిస్తే కాస్త స్వాంతనగా ఉంటుందన్న ఆశతో తన ఇంటికి బయలుదేరింది.
' ఏంటే ఇలా ఊడిపడ్డావు? " ప్రేమగా జాహ్నవి చేతిని అందుకుంటూ అడిగింది ప్రకీర్తి. " ఏం లేదే చాలారోజులైందిగా నిన్ను చూసి "
అంటూండగానే కన్నీళ్ళు వచ్చేసాయి జాహ్నవికి కంగారు పడింది ప్రకీర్తి. ఇద్దరూ మంచి స్నేహితులు స్కూలు రోజుల్నుంచి. అరమరికలు లేకుండా అన్నీ చెప్పుకుంటారు.ప్రకీర్తి చాలా కష్టపడి పైకి వచ్చిన అమ్మాయి. భార్యాభర్తలిద్దరూ సెల్ఫ్ మేడ్ పర్సన్స్. వారిది ప్రేమ వివాహం. మొదట్లో చాలా ఇబ్బందులు పడినా ఇద్దరూ బ్యాంక్ ఆఫీసర్లుగా సెటిల్ అయ్యారు. " జాహ్నవీ ఏమిటే ? ఏమయిందో నాతో చెప్పు. మురళి ఏమైనా అన్నాడా? " ఆత్రుతగా ఆమె భుజం కుదుపుతూ ప్రశ్నించింది ప్రకీర్తి.
కళ్ళు తుడుచుకుంటూ జరిగిన విషయాలన్నీ చెప్పుకొచ్చింది జాహ్నవి. " ఓహ్ దీనికా నువ్వింత కుమిలిపోతున్నావు.? నీకో విషయం చెప్పనా? నేను చెప్పే విషయం వింటే నీ అనుభవాలు నథింగ్ అనిపిస్తాయి. మీ కొలీగ్స్ చాలా బెటర్ అనుకుంటావు " అంది ప్రకీర్తి నవ్వుతూ. " ఏంటే నువ్వనేది? " విస్మయంగా చూసింది జాహ్నవి. ' అవునే వాళ్ళు నీ కొలీగ్స్, ఏమాత్రం సంబంధం , చుట్టరికం లేనివాళ్ళు. ఉద్యోగమన్నాక పోటీలు, ఈర్ష్యలు సహజం. కానీ రక్త సంబంధీకులు, స్వంత వాళ్ళు అయికూడా మా తోబుట్టువులు, కజిన్స్ మా మీద ఎంత అసూయ పడతారో నీకేం తెల్సు? మాకు పెళ్ళయిన కొత్తలో సరైన ఉద్యోగాలు లేక ఎన్ని అవస్థలు పడ్డామో నీకు గుర్తుందిగా? అప్పుడు మా స్వంత వాళ్ళే ఎంతో జాలి పడుతూ, " ఏ సాయం కావాలన్నా మమ్మల్ని మరచిపోవద్దూ అంటూ సానుభూతి కురిపించేవాళ్ళు. అలాగే అనారోగ్యాలు, ఆర్ధిక ఇబ్బందులు ఆపరేషన్లు అంటే తెగ బాధ పడుతూ ఓదార్చడంలో ముందుండేవాళ్ళు. ఇవన్నీ చూసి అబ్బ, మా వాళ్ళకి నా మీద ఎంత ప్రేమ, ఎంత కన్సర్న్ అని మురిసిపోయేదాన్ని. కానీ అయిదేళ్ళుగా వాళ్ళ ధోరణిలో ఎంత మార్పొచ్చిందంటే...వింటే ఆశ్చర్యపోతావు. ఉద్యోగాలు వచ్చాయనగానే ఏమన్నారో తెల్సా? " ఆ..బాగానే సంపాదించుకున్నార్లే? పెద్దవాళ్ళెవరితోనో సిఫార్సులు చేయించుకొని ఉద్యోగాలు వేయించుకొని ఉంటారు. " కష్టపడి బ్యాంక్ టెస్టులకి చదివి, సెలక్టయితే , లేనిపోని తప్పుడు మాటలు మాట్లాడ్డం అంటే ఇదే! " మీకేం? హాయిగా కాలుమీద కాలేసుకుని దర్జాగా ఖర్చు పెట్టుకుంటారు " అంటూ ఎత్తిపొడుపు మాటలు అంటే మాకు జాబ్స్ రాకుండా బీదార్పులు అరుస్తూ, వాళ్ళ సాయం, దయాధర్మాల మీద బతుకుతూ ఉంటే బాగుంటుందన్న మాట.
అలాగే నీకు తెల్సు కదా నేను రేడియో టాక్స్ తో పాటు టీవీ న్యూస్ చదువుతూ ఉంటానని. దానిక్కూడా మా తమ్ముడు " నీకేంటి? రేడియో టీవీ అన్నీ నీవే! మా ఆవిడకి ఇంటి పనితోనే తెమలదు. అయినా నాకిలాంటివి ఇష్టం ఉండదు." ఈర్ష్య ధ్వనిస్తూంటే అన్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశం టాలెంట్స్ ఉండడం తప్పు. అలాగే మొన్నామధ్య నేను, రవి బెస్ట్ కపుల్ గా హోటల్ అప్సరాలో సెలక్టయ్యి పదివేలు ప్రైజు తెచ్చుకున్నప్పుడు మా వాళ్ళంతా మూతి విరుపులే. " మీ టైం బాగుందిలే! అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ప్రైజులే ప్రైజులు. మీ పనే హాయి. అయినా మాకంత తీరికా లేదు, ఇంట్రస్టూ లేదు....!"అంటూ కామెంట్లు, పుల్ల విరుపు మాటలు.
మా సాఫల్యాలకి మనస్ఫూర్తిగా ఆనందించిన వాళ్ళు నీలాంటి ఫ్రెండ్స్ తప్ప ఇంకెవరూ లేరు. కాబట్టి మైడియర్ జానూ! ఈ ప్రపంచంలో చాలామంది మనుషుల మనస్తత్వాలు ఇలాగే సంకుచితంగా ఉంటాయి. అవతలి వాళ్ళు కష్టాల్లో, బాధల్లో ఉంటే వీళ్ళకి చెప్పలేనంత సానుభూతి పొంగుకొస్తుంది.; వాళ్ళ మీద ఎంతయినా జాలి కురిపించడానికి సిద్ధంగా ఉంటారు. ఎదుటి వాళ్ళకి దయ, కరుణ చూపించడానికే తాము పుట్టినట్టు భావిస్తూ, ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నట్టు ఉంటారు. తద్వారా వాళ్ళ కంటే తాము చాలా బాగున్నామనే భావనతో సంతోషంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే అవతలి వాళ్ళ కష్టాలు, కడగళ్ళు తీరిపోయి వాళ్ళ ఊహలకి అతీతంగా మంచి స్థాయికి చేరుకుంటారో వీళ్ళ అంచనాలు తల క్రిందులవడంతో అభినందించడానికి మనసు రాక, వాళ్ళ మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు అవతలి వాళ్ళ ఎదుగుదల సహించలేరు. అభినందించడానికి, ప్రశంసించడానికి ఆమడ దూరంలో ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి జాలి పడాలేగానీ ఇలా డీలా పడిపోయి ఆత్మ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. నువ్వేమి తప్పు చేయలేదు కదా? ఎందుకు వర్రీ అవుతావు?? పట్టుదలతో, రెట్టించిన ఉత్సాహంతో ఇంకా నీ మేధస్సుకు పదును పెడుతూ బాగా పైకి ఎదగడానికి ప్రయత్నం చెయ్యి. ఉరకలెత్తే జలపాతాన్ని ఎవరు ఆపగలరు? తెలివితేటలతో నీ సృజనాత్మక శక్తిని మరింతగా పెంపొందిచుకుంటూ ఇంకా ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలి. నిన్ను విమర్శించేవాళ్ళకి , చాటుగా వెటకారాలు చేసేవాళ్ళకి నీ విజయ పపంపరలతోనే బుద్ధి చెప్పి కనువిప్పు కలిగించాలి. తెలిసిందా?" అంది ప్రకీర్తి తనలో ఆత్మ విశ్వాసాన్ని తిరిగి మేల్కొలిపి, కర్తవ్యాన్ని తెలియజెప్పిన ప్రకీర్తిలో జాహ్నవికి గీతోపదేశం చేస్తున్న శ్రీకృష్ణుడు కనిపించాడు.