తెలివైనవాడు - నారంశెట్టి ఉమామహేశ్వరరావు.

telivainavadu

పిలపురంలో ఉండే సుక్షేణుడు వ్యాపారి. అతడికి చాలా ఊళ్ళల్లో వ్యాపారాలు ఉన్నాయనీ, పలుకుబడి గల వ్యక్తి అనీ , అతడికి రాజుగారి కొలువులో మిత్రులున్నారనీ అనుకునేవారు. అతడిని కలిసి ప్రయత్నిస్తే ఎంత కష్టమైన పని అయినా తొందరగా పూర్తి చేయిస్తాడని అనుకునేవారు.

ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకి పావనపురంలో ఉండే దీర్ఘతముడు కి తెలిసింది. అతడు చదువుకుని రాజుగారి కొలువులో నౌకరీ చెయ్యాలని కోరిక ఉన్నవాడు. ఇది వినగానే సంబరపడిపోయాడు. ఎలాగైనా సుక్షేణుడుని కలుసుకుని తనకి సాయం చెయ్యమని అడగాలని బయల్దేరాడు.

మార్గమధ్యంలో దట్టమైన అడవిని దాటుకుని కపిలపురం వెళ్ళాడు. దీర్ఘతముడు వెళ్ళిన సమయానికి సుక్షేణుడు రాజధానికి వెళ్ళాడు. తిరిగి రావడానికి వారం రోజులు పడుతుందని చెప్పింది అతడి భార్య. తన భర్త తిరిగి వచ్చేవరకు ప్రక్కనే ఖాళీగా ఉన్న తమ ఇంట్లో ఉండమని చెప్పి వేళకి ఇంత తిండి పెడతామని చెప్పింది.

ఆమెతో దీర్ఘతముడు ‘అలాగే ఉంటాను. నేను చాల అవసరంలో ఉన్నాను. నాకు ఎలాగైనా రాజకొలువులో నౌకరీ దొరికేలా చెయ్యమని సుక్షేణుడు రాగానే చెప్పండి. అంతవరకూ తిని కూర్చోకుండా నాకు ఏదైనా పని చెబితే మీకు సాయపడతాను’ అన్నాడు.ఆమె అలాగే అని మాట ఇచ్చి కొడుకులకు పరిచయం చేసింది.

సుక్షేణుడి వ్యాపారాలని ప్రస్తుతం అతని కొడుకులు చూస్తున్నారు. వాళ్ళు దీర్ఘతముడిని చూసి తల్లి చెప్పినట్టే తమ వ్యాపారాల్లో అవసరానికి సాయం అందించమన్నారు.

దీర్ఘతముడు ఆ ఊరులో సుక్షేణుడి ఇంట్లో పని చేయడం కపిలపురంలోనే ఉంటున్న కుచేలుడు అనే పండితుడు చూశాడు. దీర్ఘతముడిని తన దగ్గరకు పిలిచి ‘నువ్వు కొత్త పనివాడివా’ అని అడిగాడు.

దానికి దీర్ఘతముడు ‘కాదు. నాకు రాజకొలువులో నౌకరీ కావాలి. సుక్షేణుడి సాయం కోరి వచ్చాను.’ అని చెప్పాడు.

దానికి కుచేలుడు ‘రాజకొలువులో నౌకరీ కావాలంటే మంత్రిగారినో, ఇంకెవరైనా ఉద్యోగులనో కలవాలి గానీ ఇతడేం సాయం చేయగలడు?’ అని అడిగాడు.

దానికి దీర్ఘతముడు “మీది ఈ ఊరు కాదా? ఎంతో దూరాన ఉన్న నాకు తెలిసిన సుక్షేణుడి గొప్పతనం మీకు తెలియదా?’ అని అడిగాడు.

‘అతడు గొప్పవాడైతే కదా తెలియడానికి? అదంతా ఎవరో సృష్టించిన పుకారు. రాజోద్యోగుల పెత్తనం తప్పించుకోడానికి అతడే పుకారు లేవదీసాడేమో. రాజుగారితో పరిచయాలున్నవాళ్ళంటే భటులు జంకుతారు కదా. సుక్షేణుడు కూడా నీలా నాలాగా ఒక సామాన్యుడు. అతడికి ఏ పలుకుబడీ లేదు. అసలు మన రాజ్యంలో ప్రతిభకు తప్ప సిఫార్సులకు నౌకరీ దొరకదని ఎరగవా?’ అని అడిగాడు కుచేలుడు కోపంగా.

‘నాకు పని కావాలన్న ఆశ నన్నిక్కడకి రప్పించింది. సుక్షేణుడిని కలిసి వచ్చిన పని పూర్తి చేసుకుని కానీ ఇక్కడి నుండి కదలను’ అన్నాడు దీర్ఘతముడు.

‘సరే నీ ఇష్టం. బాగుపడే యోగం లేనివాడిని ఎవరమూ కాపాడలేము’ అన్నాడు కుచేలుడు.

అక్కడ వారం రోజులున్నాడు దీర్ఘతముడు. అప్పటికీ రాలేదు సుక్షేణుడు. అతడికి మరొక పని పడి అటునుండటే వెళ్ళాడనీ రావడానికి మాసం పైగా పడుతుందని చెప్పారు సుక్షేణుడి భార్యాపిల్లలు. ఇక చేసేది లేక అక్కడే ఉండడానికి నిశ్చయించుకున్నాడు దీర్ఘతముడు. అక్కడ ఉన్నంత కాలం వ్యాపారంలో చిట్కాలు, మెలుకువలు వారి నడిగి తెలుసుకున్నాడు . మొత్తం మీద రెండు మాసాలు గడిస్తే గానీ తిరిగిరాలేదు సుక్షేణుడు.

అతడు రాగానే దీర్ఘతముడిని చూసి అతడు వచ్చిన పని తెలుసుకున్నాడు. “అయ్యో నీ కెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. నాకు అంత పలుకుబడి లేదు. నేను నీకే సాయమూ చెయ్యలేను” అన్నాడు సుక్షేణుడు.

దాంతో తరువాత రోజునే తన ఊరు బయల్దేరాడు దీర్ఘతముడు. అతడికి ఊరి బయట మర్రిచెట్టు నీడలో సేదతీరుతూ కనిపించాడు కుచేలుడు. దీర్ఘతముడిని పలకరించి “నీ నౌకరీ సంగతి ఏం చేసాడు సుక్షేణుడు” అని అడిగాడు.

తనతో సుక్షేణుడు చెప్పిన మాటలు చెప్పి ‘అతడికి అంత పలుకుబడి లేదని చెప్పడంతో మా ఊరు వెళ్ళిపోతున్నాను” అన్నాడు దీర్ఘతముడు.

దానికి కుచేలుడు ఫకాలున నవ్వి ‘నువ్వొక వెర్రి బాగులవాడివి. నేనప్పుడే చెప్పాను. నువ్వే వినకుండా వారి దుకాణంలో పని చేస్తూ ఉండిపోయావు” అన్నాడు ఎగతాళిగా.

దానికి దీర్ఘతముడు ‘అయ్యా మీరు చెప్పిన మాటకు విలువ ఇచ్చాను కాబట్టే ఈ రెండు నెలలూ వృధా చేయకుండా వారితో ఉండి వ్యాపారరహస్యాలు తెలుసుకున్నాను. ఇప్పుడు మా ఊరు వెళ్ళిన తర్వాత నేను నేర్చుకున్న వ్యాపారం చేసుకుని బ్రతుకుతాను. ఇక ముందు రాజకొలువులొ నౌకరీతో పనిలేదు నాకు” అన్నాడు.

ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు కుచేలుడు. ”నువ్వు వెర్రిబాగులవాడివి అన్న నేనే తెలివితక్కువ వాడిని. సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని వ్యాపార రహస్యాలు నేర్చుకుని వెళుతున్న నీవే నిజంగా తెలివైనవాడివి. నువ్వు వ్యాపారంలో చక్కగా రాణిస్తావు” అన్నాడు మనస్పూర్తిగా .

నీతి: తెలివైనవాడు సమయాన్ని ధనంలా భావించి సద్వినియోగం చేసుకుని బాగుపడితే తెలివితక్కువవాడు సమయాన్ని మంచి నీళ్ళలా ఖర్చుపెట్టి వృధా చేసుకుని చెడిపోతాడు..

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి