జీవన మాధుర్యం - కల్పన

jeevana madhuryam

“ఏమండీ ఒక మాట అడగనా?” జాజి పూల మాల కడుతూ గోముగా ప్రశ్నిస్తున్న భార్యని చూస్తూ “ఏంటో ? చెప్పు” అన్నాడు చంద్ర శేఖర్.. “మన కోడలు మనల్ని తమ దగ్గరకి వచ్చేయమంటోందండి. అబ్బాయి కూడా సరదా పడతాడు మనం వాళ్ళతో ఉంటే”. అంది ఇంటి ముందు తోట లో ఈజీ చైర్ లో కూచుని ఆరెంజ్ జ్యూస్ సేవిస్తున్న భర్తని పరిశీలనగా చూస్తూ. “చూద్దాంలే.. ఈ మధ్యేగా నేను రిటైరయ్యాను. కొన్నాళ్లు ఎటయినా తిరిగి వద్దాం. ఏమంత తొందర? అయినా కిషోర్ ఏమంటాడో? మోనిక రమ్మందా? లేకపోతే నువ్వే ఊహించుకుంటున్నావా?”.

“అబ్బ మీరెప్పుడు రెంటమతం. మీకన్నీ చెత్త అనుమానాలే. కోడలుపిల్ల అడిగింది కాబట్టే మీకు చెప్పాను. లేకపోతే నాకేమైనా సరదానా? బొంబాయి లో ఉద్యోగాలు మానుకొని ఎప్పుడు పడితే అప్పుడు రావటం ఏమన్నా మాటలా? పిల్ల చూస్తే ఆస్ట్రేలియా లో సెటిల్ అయిందా? దాని కూతుర్ని మనదగ్గర నాలుగేళ్ళుంచినట్టే ఉంచి , ఆ మధ్య వచ్చి ఎంచక్కా తీసుకెళ్లిపోయింది దాన్ని వదిలి ఉండలేమంటూ. అయినా ఇక్కడ మనం పడే పాటేమిటంట?” విసుక్కుంది సరోజ.

“అబ్బ ఏదో మాటవరసకి అని ఉంటుంది లేవే? చూద్దాం లే! అయినా ఇక్కడ ఏం తక్కువ నీ పాటు కి? ఆధునిక వసతులతో అందమైన డ్యూప్లెక్స్ ఇల్లు, కారు, మంచి ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు ట్రిప్పులు, రాధాస్వామి భజనలు ..ఇంకా ఏం కావాలి డియర్ నీకు?” ప్రేమగా అడిగాడు శేఖర్ .

“అది కాదండీ. విజ్జీ చూస్తే దూర దేశం . ఇక వీడి చదువు,ఉద్యోగం, పెళ్లి అన్ని తంతులూ ముగిసేనాటికి మీరూ రిటైర్ అయ్యారు. ఇన్నాళ్లూ మీ ఉద్యోగరీత్యా విడివిడిగా ఉండాల్సి పడింది. అసలు మనం వాడితో కలిసి ఉన్న రోజులు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ఇప్పుడింక ఏం బాదరబందీలున్నాయి కనక? కవల పిల్లలతో చేసుకోలేక వాళ్ళూ అవస్థ పడుతున్నారు. అందుకే చెప్తున్నా కిషోర్ దగ్గరకి వెళ్లిపోదాం. అంతగా అయితే ఈ ఇల్లు, కారు అమ్మేసి అక్కడే కొనుక్కుందాం” అంది ఆర్తిగా సరోజ.

”లేడికి లేచిందే పరుగంటే ఇదే మరి!” నవ్వాడు శేఖర్ .

మర్నాడు అంతా కలిసి బీచ్ కి వెళ్ళి, కాలక్షేపం చేసి వస్తూ దార్లో ఫార్చ్యూన్ ఇన్ లో భోజనాల కి ఆగారు.

“ఏరా కిషోర్! ఇక్కడ పనులన్నీ సెటిల్ చేస్కోని నీదగ్గరకి వచ్చేద్దాం అనుకుంటున్నాం. మనవల ఆలనపాలన తో పాటు మాకూ కాలక్షేపం కూడా! ఏమంటావ్ ?”అంది సరోజ మనవరాలికి ఐస్ క్రీం తిన్పిస్తూ. కోడలు కుతూహలంగా చూస్తోంది. శేఖర్ ప్లేట్ వైపే దృష్టి కేంద్రీకరించి తింటున్నాడు. భోజనం పూర్తి కానిచ్చి వెయిటర్ ప్లేట్ లో పెట్టిన బిల్ పరిశీలిస్తూ చాలా మామూలుగా చెప్పేశాడు కిషోర్. “ఎందుకమ్మా బాబూ మా దగ్గరికి? నాకు తెలిసి ఇక్కడ మీకేం ప్రాబ్లెమ్ లేదు.. అంతగా అయితే సెలవలకి పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటాం, అలాగే మీకూ చూడాలనిపిస్తే అప్పుడప్పుడూ ఓ పది రోజులువచ్చి వెళ్ళండి. అంతేగాని పూర్తిగా వచ్చేయడం పెట్టుకోకండి. నాకు...”.

మాట పూర్తి కాకుండానే “ అప్పుడప్పుడూనా? అంటే మేము మీతో ఉండడం ఇష్టం లేదా కన్నా?”ఆశ్చర్యం గా అడిగింది సరోజ.

“ నువ్వలా అనుకుంటే నేనేం చెయ్యలేను.. నాన్నగారూ! నాకనిపించింది చెప్పాను. ఆ పైన మీ ఇష్టం.” అన్నాడు తండ్రి వైపు చూసి ప్లేట్ లో టిప్ ఉంచుతూ. శేఖర్ నవ్వి ఊర్కున్నాడు.

“ నువ్వేం మాట్లాడకింక. మోనిక, పిల్లలు ప్రేమగా రమ్మని పిలిస్తే నువ్వే చెప్పించా వనుకుని, అందరి కొడుకుల్లా కాదు మావాడు అని మురిసిపోయాను. కానీ నీకు మా మీద ఎంత మమకారం ఉందో ఇప్పుడర్ధమయింది. అడ్డాలనాడు బిడ్డలుగానీ గడ్డాలనాడు కాదుగా.” సరోజ చిన్నబుచ్చుకుంది

ఇంటికొచ్చేదాకా అంతా మౌనంగా ఉన్నారు.

రాత్రి పడుకోబోయే ముందు కాసేపు బాల్కనీ లో కూచుని చంద్రున్ని చూస్తూ, సన్నజాజుల పరిమళాన్ని ఆఘ్రాణిస్తూ రోజంతా జరిగిన విశేషాల్ని భర్త తో పంచుకోవడం సరోజ కి ఎప్పటినించో అలవాటు. కానీ ఇవాళ శేఖర్ తో మాట్లాడాలన్పించ లేదు. తను అందరి కోడళ్ళ లా కాకుండా అత్తమామల్ని బాగా చూస్కోవాలని ఎన్నో సార్లు అనుకుంది. అలాగే తను మంచి అత్తగారిలా కోడల్ని ప్రేమగా ఆదరించాలని, అవసరానికి నిలబడాలని కలలు కంది. మోనిక మంచిది, వినయం విధేయత పుష్కలంగా ఉన్న పిల్ల. ఆ అమ్మాయేమీ డ్రామాలాడ్డం లేదు. ముందొక మాట, మొగుడి దగ్గర ఇంకో మాట మాట్లాడే రకం కాదు. కానీ కొడుకెందుకు అలా మాట్లాడాడు? ఒంటరిగా కూచుని కొడుకు మాటల్ని తల్చుకుంటూ గతాన్ని నెమరు వేస్కుకోసాగింది సరోజ.

**** **** **** ****

“మామయ్యగారి రిటైర్ మెంట్ ఫంక్షన్ నెలాఖరున. పనిలోపని షష్టి పూర్తి కూడా! మనం దగ్గరుండి గ్రాండ్ గా జరిపించాలి.. అనుకున్నట్టుగా అత్తగారికి బనారస్ పట్టుచీర, రాళ్ళ గాజులు మామయ్యగారికి పట్టు పట్టు పంచే, లాల్చీ , ఉంగరం అన్నీ రెడీ చేశాను. పిల్లల పరీక్షలివాల్టితో అయిపోయాయి. ఎప్పుడు బైలుదే రేది మనం కాకినాడ? అక్కడికెళ్ళాక బోల్డు పన్లు..అందరినీ పిలవడాలు, ఫంక్షన్ ఏర్పాట్లు...?” భర్త ని అడిగింది సరోజ అన్నం వడ్డిస్తూ. శేఖర్ తలెత్తి ఆమె వైపొకసారి చూసి “ ఆల్రెడీ వారం రో జులు సెలవు పెట్టేసి వచ్చా. బట్టలు సర్దేయ్ రేపు సాయంత్రం బస్ కి వెళ్దాం” అన్నాడు పెరుగు కలుపుకుంటూ.

ఆటో దిగి లోపలికి వస్తున్న కొడుకు, కోడలు, మనవల్ని చూసి తెగ సంబర పడిపోయారు పరమేశం దంపతులు. “నాన్న గారూ ఎలా ఉన్నారు? అమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉందే ?” ప్రేమగా పలకరించాడు శేఖర్ .

“అత్తయ్యా కులాసానా? మామయ్యగారి ఫంక్షన్ దగ్గరకొచ్చేసింది , ఇంక రేపటినించీ పిలుపులు మొదలెట్టాలి. కార్డ్స్ తీసుకొచ్చాం చూపిస్తానుండండి !” అంటూ హడావిడి చేస్తున్న కోడలి చేతిని మెత్తగా సృశిస్తూ, ఆప్యాయంగా మనవల్ని దగ్గరకి తీస్కుని “ఏం కంగారు లేదు, అన్నీ అవే అవుతాయి . మీరొచ్చేశారు మాకెంతో సంతోషం. ఇంతకీ ప్రయాణం బాగా జరిగిందా? కాళ్ళు కడుక్కోండి. ఏ వేళ తిన్నారో ఏంటో? భోజనాలు కానిచ్చి తీరిగ్గా మాట్లాడుకుందాం.” అంటూ వంటింట్లోకి దారితీసింది తులసమ్మ గారు.

అనుకున్నదాని కంటే ఎంతో ఘనంగా పరమేశం గారి రిటైర్మెంట్ , షష్టి పూర్తి వేడుకలు శేఖర్, సరోజ చక్కగా జరిపించారు.కూతురు దూరదేశం లో ఉండడంతో రాలేకపోయింది., సరోజ చాలా చకచక్యంగా ఆ లోటు ఎక్కడా కనిపించనివ్వలేదు. తాము తెచ్చిన బట్టలు, వస్తువులు ప్రేమగా అత్తమామలకిచ్చి వాళ్ళ ఆశీస్సులు అందుకున్నారు శేఖర్ దంపతులు. అందరూ సరోజ కోడలు కాదు కూతురు అంటుంటే తులసమ్మ పొంగిపోయింది

“చెప్పండత్తయ్యా! ఇన్నాళ్లూ మామయ్యగారి ఉద్యోగం, సరళ పెళ్లి, కానుపు అంటూ ఏవేవో కారణాలు చెప్తూ పట్టుమని పది రోజులు కూడా ఎప్పుడూ మా దగ్గర ఉండలేదు. ఇప్పుడు అన్ని బాధ్యతలూ తీరాయి. సరళ కెనడా లో వాళ్ళాయనతో సుఖంగా ఉంది. ఇంక మీకు అభ్యంతరం ఏంటి మా దగ్గరకి వచ్చి ఉండడానికి?” ఆత్మీయంగా అడిగింది సరోజ చపాతీలు కాలుస్తూ. సలాడ్ చేస్తున్న తులసమ్మ నవ్వి ఊర్కుంది. జవాబు రాకపోవడంతో వెనక్కి తిరిగి అత్తగారి వైపు చూసింది సరోజ. “మాకేదో అవసరమై మిమ్మల్ని పిలుస్తున్నాం అనుకుంటున్నారా ఏంటి?” అంది అనుమానంగా.

“అయ్యో అలా ఏం కాదమ్మా.”

అత్తయ్యా దేవుడి దయ వల్ల , మీ ఆశీర్వాదం వల్ల మాకేమీ లోటులేదు. మీ అబ్బాయిది మంచి ఉద్యోగం కావడంతో అవసరం లేదన్పించి నాతో చేస్తున్న ఉద్యోగాన్ని మాన్పించారు. విజ్జీ ఏడో క్లాసుకి , కిషోర్ మూడో తరగతి కొచ్చారు. కావల్సిన సౌకర్యాలన్నీ అమర్చుకున్నాము. ఇల్లు, కారూ! మా అమ్మానాన్న అన్నయ్య దగ్గరున్నట్టే మీరూ మీ అబ్బాయి దగ్గరకొస్తే మాకు పెద్దదిక్కుగా ఉంటారని, అంతా కల్సిమెలిసి హాయిగా ఉండచ్చని అడుగుతున్నా.” అంది నమ్రతగా.

“ సరే చూద్దాం లే, ముందు పిల్లలకి కి ఫలహారం పెట్టు” అంది మాట మారుస్తూ.

“చూద్దాం అంటే కాదు. మీరు మామయ్యగారు ఇకపై మాతో ఉండాల్సిందే. మీకేమీ ఇబ్బంది కలగకుండా చూస్కుంటా.. నాదీ బాధ్యత” మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్న కోడలిని మురిపెంగా చూస్కుంది తులసమ్మ.

కానీ వాళ్ళని తమతో తీసుకురాలేకపోయింది సరోజ. తర్వాత కొన్నాళ్ళకి మామగారు కాలం చేసినప్పుడు కూడా కొడుకు ఎంత పట్టు బట్టినా ససేమిరా అంది అత్తగారు. తనేమైనా తప్పు చేసిందా అని పదే పదే ప్రశ్నించుకుంది, ప్రశ్నించింది అత్తగారిని. లెంపలేసుకుంది అత్తగారు. సరళ కంటే నువ్వే నాకు ఎక్కువ. అక్కడికొచ్చినా, ఇక్కడికొచ్చినా కూచోపెట్టి సేవలు చేస్తావు. తల్లి లా చూస్కుంటావు. కానీ నాకు ఇక్కడుంటేనే బాగుంటుంది. మరీ కాలు చేయి ఆడకపోతే ఎలాగూ మీ దగ్గరకేగా వచ్చేది.” నవ్వుతూ సాగనంపింది తమని. చేసేదేముంది? అప్పుడప్పుడూ వస్తూ పోతూ ఉండేవాళ్లు తాము. కానీ ఆమె మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే మామగారు పోయిన రెండేళ్లకే తీర్థయాత్రల కెళ్ళి కాశీ లో కన్ను మూసింది.

**** **** **** ****

కానీ శేఖర్ ఆనాడు, ఈనాడూ కూడా ఏమీ పట్టుబట్టకపోవడం ఆమెని విస్మయానికి గురిచేసింది. తేల్చుకుందామని భర్త వైపు తిరిగేసరికి చదువుతున్న సుందరకాండ పుస్తకం మూసి, కళ్ళజోడు పక్కనే ఉన్న డ్రెస్సింగ్ టేబిల్ పై పెడుతున్నాడు.

“ నాకు తెలియక అడుగుతున్నాను.. ఒక విషయం చెప్పండి!” అంది సూటిగా. “అప్పుడు మీ అమ్మగారిని,నాన్నగారిని ఎంత బతిమాలినా మన దగ్గరకి రావడానికి ఒప్పుకోలేదు, చివరికి మామగారు పోయాక మీరు ప్రాధేయపడినా ఆమె ఒంటరిగా ఉండడానికే సుముఖత చూపించారు గాని మనతో రాలేదు. నిజానికి మనం వాళ్ళ నించి ఏదో ఆశించి పిలవలేదు, ఇది వాళ్ళకీ తెల్సు.

ఇహ ఇప్పుడు కిషోర్ ...మనం వస్తామంటే వద్దంటున్నాడు. ఎందుకని? మనం ఆరోగ్యంగానే ఉన్నాం. డబ్బుకి ఏ లోటూ లేదు. వాళ్ళకి సాయం గా కూడా ఉంటాం దేనికయినా. అన్నిటికంటే ముఖ్యం కోడలికి మనమంటే చాలా అభిమానం, గౌరవం. తల్లిదండ్రులు నీకు సపోర్ట్ గా వస్తాం రా అంటే ఎగిరి గంతేసి ఆహ్వానించడంపోయి మీ బతుకు మీదీ మా దారి మాదీ అంటాడేంటండీ? అయినా మీరేందుకు కల్పించుకొని గట్టిగా అడగరు? అప్పుడు అమ్మ, ఇప్పుడు కొడుకు ..ఒకటే పాట. నా మాటకి విలువ లేదసలెవరికీ!” వాపోయింది సరోజ.

అంతా విని నవ్వేస్తూ “పిచ్చిదానా! పిల్లలు పెద్దయ్యి జీవితం లో స్థిరపడే వరకేనే తల్లిదండ్రుల బాధ్యత... అందుకే అప్పుడు మా అమ్మ రాలేదు. ఇప్పుడు వీడు రావద్దంటున్నాడు. మేం కనీ పెంచి పోషించి చదివించి ఆస్తులు పంచిచ్చి ప్రయోజకుల్ని చేశాం కాబట్టి పిల్లలెప్పుడూ మా మాట జవ దాటకూడదు అనుకుంటారు తల్లిదండ్రులు. అది మీ బాధ్యత. మాకిష్టమైనట్టు ఎంజాయ్ చేసే హక్కు మాకుంది. అంటున్నారు పిల్లలు. తరాల అంతరాలు అర్ధం చేస్కోలేక చాలామంది అభద్రత కి లోనవుతూ అనవసర మైన అనుమానాలతో, అసంతృప్తులతో జీవితాల్ని నరకం చేసుకుంటున్నారు. అందుకే వృద్ధాశ్రమాలూ పెరుగుతున్నాయి.

ఒకటిచెప్పనా? మిధునం సినిమా లో చెప్పినట్టు “డిటాచ్డ్ అటాచ్ మెంట్స్” ఉత్తమం.. అతిథుల్లా వెళ్లొస్తూ ఉంటేనే అనుబంధాలు అద్భుతః . అంతే గాని తగుదునమ్మా అని నెత్తినెక్కించుకున్నా, నెత్తినెక్కాలని చూసినా నెత్తి మీద మొట్టికాయలే మిగిలేది.. సో మై డియర్ సరూ! సెకెండ్ ఇన్నింగ్స్ హాయిగా అనుభవిద్దాం. మంచి ప్రదేశాలు తిరుగుతూ,, మనకి నచ్చినట్టు జీవిద్దాం.” నవ్వాడు శేఖర్. తేలిక పడ్డ మనసుతో శృతి కలుపుతున్న సరోజకి పాలు తోడుపెట్టలేదని గుర్తొచ్చి వంటింట్లోకి వెళ్తూ కోడలి మాటలు విన్పించి, వాళ్ళ గది పక్కన ఆగింది . కిషోర్ ని నిలదీస్తోంది మోనిక.

“ఏంటండీ ఇందాక అలా మాట్లాడారు? నాకేం నచ్చలేదు. పాపం అత్తయ్య ఎంత బాధ పడి ఉంటారో? మనతో ఉంటే తప్పేంటి? నేనే రమ్మనమన్నాను. మనకి పెద్దదిక్కుగా ఉంటారని.” అంది మోనిక

“అయ్యో మోనీ! నువ్వూ అర్ధం చేసుకోలేదా? నాకు అమ్మ నాన్నగారంటే చాలా ఇష్టం. ఇన్నాళ్ళూ కేంపుల ఉద్యోగం తో నాన్న, ఇంట్లో పనులతో అమ్మ ఎంతో అలిసిపోయారు. . విజ్జక్క ని నన్నే కాకుండా సరళత్త కొడుకు సందీప్ ని కూడా ఎంతో జాగ్రత్తగా పెంచి ప్రయోజకుల్ని చేశారు. . చేస్తున్న జాబ్ మానేసి మాకోసం అంకితం అయిపోయింది మా అమ్మా. తర్వాత విజ్జీ కూతురు వీణ పుట్టినప్పటి నించీ ఆరేళ్లొచ్చేదాకా అమ్మా వాళ్ళే చూస్కున్నారు.. ఎప్పుడూ చాకిరీలే! వాళ్ళ కెవరొచ్చి నిలబడ్డారు? మళ్ళీ ఇప్పుడు మనవల పెంపకం అంటూ ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి? అది మన బాధ్యత

అందుకే నాన్న రిటైర్మెంట్ తో వాళ్ళ లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అయ్యాయనుకుంటున్నా.. ఎవరి కయినా ప్రైవసీ అనేది చాలా అవసరం మోనీ . హేపీ గా ఇద్దరినీ పెర్శనల్ స్పేస్ ని ఎంజాయ్ చేయనీ . నాల్రోజులు కలుసుకుని హాయిగా గడిపి, రీఛార్జ్ అయ్యి మళ్ళా మన వాళ్ళని ఎప్పుడూ కలుస్తామా అన్న ఉత్సాహం తో వచ్చి వెళ్తూ ఉంటే ఉన్న సంతోషం ఎప్పుడూ కలిసే ఉంటే ఉండనే ఉండదు.

ఇంకో విషయం ..తరాల అంతరాల వల్ల ఎంత పెద్దవాళ్ళమైనా, పిల్లలు పుట్టినా వాళ్ళకి మనం చిన్నపిల్లల్లాగే కనిపిస్తాం, దాంతో ఏదో చెప్తూ ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళోక జీవన శైలికి అలవాటు పడినవాళ్లు. మన అలవాట్లు,నిద్రాహారాలు, డ్రెస్సింగ్ ,ఫ్రెండ్స్ అన్నీ వాళ్ళకి కొత్తగా, ఇబ్బందిగా కూడా అన్పించవచ్చు. కానీ అవి మనకు అత్యంత సహజమైన విషయాలు. వాళ్ళ కోసం మనం మార లేం.
అలాగే తమ ఊళ్ళో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళుంటారు. ఇక్కడకొచ్చాక మన మేమైనా కొంచెం మారమని చెప్తే వాళ్ళు నొచ్చుకోవచ్చు . ఎప్పుడైనా నేను గాని, నువ్వు గాని విసుక్కున్నా , లేక మనలో మనం గొడవ పడ్డా వాళ్ళకది బాధ అన్పించవచ్చు.. అందుకే అలా మాట్లాడాను. వాళ్ళు అర్ధం చేసుకుంటారని నా నమ్మకం.” ఆర్ధ్రమైంది కిషోర్ స్వరం.

ఎంత ఆశ్చర్యం? ఏ చదువులూ లేకపోయినా పిల్లలని చక్కగా ప్రయోజకుల్ని చేసి , వారి నించి ఏమీ ఆశించకుండా, భర్త కాలం చేశాక కూడా ఆత్మవిశ్వాసంతో చివరి వరకూ ఎవరి మీదా ఆధారపడకుండా మనుగడ సాగించి ఎంతో హుందాగా, నొప్పింపక, తానొవ్వక ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయిన అత్తగారు, “ఇన్నాళ్లూ మీ పిల్లలికి చేసిన సేవ చాలు, మళ్ళీ ఇప్పుడు మనవలకి సేవలు చెయ్యక్కర్లేదు మీరు హాయిగా రిలాక్సవ్వండి” అంటున్న కొడుకు..

“ బాధ్యతల లంపటాలు పూర్తయ్యాయి. ఇక శేష జీవన మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం..” అంటున్న భర్త . ఇంతకంటే ఏం కావాలి? తృప్తిగా నిట్టూర్చింది సరోజ.“

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు