అసూయ - పి.వి. సుబ్బారాయుడు

jelocy

రాత్రి ఏడున్నర. పున్నమి చంద్రుని వెన్నెలతో భూదేవి వెలిగిపోతోంది. పరిపూర్ణంగా విచ్చుకున్న సౌగంధిక పుష్పాలు కమ్మని సువాసనల్ని గాలితెరలపై పేర్చి వాతావరణాన్ని ఆహ్లాద భరితం చేస్తున్నాయి.

నా మనసంతా అదోలా వుంది. మా పెళ్ళై సంవత్సరం దాటుతోంది. సంవత్సరకాలం కాపురం కమ్మగానే చేశాము. జస్ట్ నెలక్రితం జరిగిన ఒక సంఘటన టీ కప్పులో తూఫానై మా ఇద్దరి మధ్యా అగాధాన్ని సృష్టించింది.

అప్పుడేం జరిగిందంటే..

అత్తయ్యకి ఒంట్లో బాగోలేదని నిమ్స్ లో చూపించడానికి హైద్రాబాదు కొచ్చి మా ఇంట్లో వున్నారు మామయ్యావాళ్ళు. వాళ్ళతో పాటు మరదలు కోతి గూడా వచ్చింది. అది చిన్నపట్నుండి హైపర్ యాక్టివ్. దాని అల్లరిని తట్టుకోవడం ఎవరివల్లా అయ్యేది కాదు. మా ఇద్దరి మధ్యా సంవత్సరమే తేడా అవడం వల్ల అందరూ మా ఇద్దరినీ మొగుడూ పెళ్ళాం కిందే చూసేవారు. దానికి పాపం నేనంటే చాలా ఇష్టం. నేనూ దాన్ని పెళ్ళి చేసుకోవాలనే అనుకున్నాను. అది రజస్వల అయి సంపూర్ణత్వాన్నందాక..నేను కోడెవయసు కుర్రాడిగా పరిణతి చెందాక మా బంధం తియ్యదనాన్ని సంతరించుకుంది. ఆమెలోని అణువణువూ కొత్తందాలతో నన్ను రెప్ప వెయ్యనిచ్చేది కాదు. తనని కూడా నా రూపం ఇంద్రజాలం చేస్తోందని నాకూ అర్ధమవుతోంది. అప్పుడప్పుడూ ఆమెని పట్టుకోవాలని..గట్టిగా ఆలింగనం చేసుకోవాలని..ఆ ఎఱ్ఱెర్రని చెర్రీ పెదాలపై నా పెదాలని చేర్చి మధువుని జుర్రుకోవాలని మహా కోరిగ్గా వుండేది. రాత్రుళ్ళు నిద్రపట్టేది కాదు..పైగా వయసుకొచ్చినది..వరసైనదీ ఎదురుగుండా బందరు లడ్డూలా తిరుగుతుంటే కాళ్ళు చేతులు కట్టుకోవడం..నిజంగా నరకమే.

సరిగ్గా అప్పుడే నన్ను పెద్ద చదువులకోసం పట్నం పంపించడానికి ప్రణాళికలు వేస్తున్నారు. మనసంతా ఏదో తెలియని బాధ..తనక్కూడా. అప్పుడు ఏం చేయాలో బాధని ఎలా వ్యక్తం చేయాలో తెలియక పెరట్లో దాన్ని చేతుల్లో దొరకబుచ్చుకుని గట్టిగా గుండెలకి అదుముకుంటూ..పెదాలపై గట్టిగా ముద్దు పెట్టేసుకున్నాను. ఆ అనుభూతి వర్ణనాతీతం. ముద్దు శృంగారానికి మొదటిమెట్టని ఎందుకంటారో అర్ధమైంది. ఒళ్ళంతా ప్రవహిస్తున్న మధురమైన తన్మయత్వం. సరిగ్గా అప్పుడే అమ్మతో ఏదో మాట్లాడుతూ..అత్తయ్య మల్లెపందిరి ఆవలగా వున్న బావిదగ్గరకి వచ్చి బొక్కెనేసింది . ఇద్దరం ఈ లోకంలోకొచ్చాం. కానీ తనే ముందుగా నిలువెల్లా కమ్ముకున్న సిగ్గుతో..నానుండి విడిపోయి పారిపోయింది. భౌతికంగా తనెళ్ళిపోయింది కాని మనసులో రతీదేవిలా స్థిరంగా నిలిచిపోయింది.

నేను హైద్రాబాదు వచ్చాక మా ఊరివాడితో కలిసి ఒకే రూమ్ లో వుంటూ చదువుకోసాగాను. మా ఇంటి ఓనర్ చాలా మంచివాడు. చదువుకునే వాళ్ళంటే చాలా ఇష్టంట. పైగా మేము అమ్మా నాన్నలకి దూరంగా వుంటున్నందున..బెంగ పెట్టుకుంటామని ఆ దంపతులు చాలా బాగా చూసుకునేవారు. మేము చాలామటుక్కి వాళ్ళింట్లోనే తినే వాళ్ళం. పాపం వాళ్ళ జీవితంలో ఒకే ఒక్కలోటు. వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు అదీ మతిస్థిమితం లేనివాడు. వాడితో పాపం వాళ్ళకి నిత్యనరకం. మాతో వాళ్ళు కలసి వున్నప్పుడు "ఇదిగో ఇది నా మరదలు. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ..దానితో దీన్ని వదులుకోలేక పెళ్ళి చేసుకున్నాను. అదిగో వాడు పుట్టాడు. మేము ఏనాడూ సుఖపడింది లేదు. మా జీవితమంతా ఆ పిచ్చిమొక్క సంరక్షణకి అంకితమయిపోయింది. మరొకరికి పుట్టినా వాడి జీవితం బాగుండేదేమో..మాకు పుట్టి అనుభవిస్తున్నాడు. దయచేసి మీరైనా మేనరికాలు చేసుకోవద్దు. మీ ప్రేమకి సంతానాన్ని బలి చేయవద్దు..మీరూ జీవితాన్ని కోల్పోవద్దు"అని కన్నీళ్ళు తుడుచుకునేవాడు.

మా మనసులు చేదుతో నిండినట్టనిపించేది.

నేను తర్వాత మా ప్రొఫెసర్లతో కూడా సందేహ నివృత్తి చేసుకున్నాను. రక్త సంబంధీకులని పెళ్ళి చేసుకుంటే అంగ..మనో వైకల్యాలతో పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువని చెప్పారు. నేను ఈ విషయాలన్నీ ఉత్తరం రాసి పోస్ట్ చేశాను. ఇంట్లో పెద్ద దుమారమే రేగింది. నేను పండగకెళ్ళినప్పుడు పట్టుకుని అందరూ దులిపేశారు. కాని నేను "అదంటే నాకుమాత్రం ఇష్టం లేదా? రేపు మాకు అవకరంతో పిల్లలు పుడితే మాతో పాటు మీరూ బాధపడాలి. అందుకే దాన్ని పెళ్ళి చేసుకోను"అని గట్టిగా అరిచి చెప్పేశాను.

అది ఆ అశనిపాతాన్ని తట్టుకోలేక కన్నీళ్లతో పరిగెత్తుకెళ్ళిపోయింది.

"బావా నీ పిల్లాడ్ని పెద్ద చదువులు చదివిద్దామనుకున్నావుగా..చూడు ఎంతగా ఎదిగిపోయాడో"వెటకారంగా అని వెళ్ళిపోయాడు మామయ్య.
నాతో ఎవరూ మాట్లాడడం లేదు. రెండురోజులుండి సిటీకొచ్చేశాను. జరిగింది మా ఓనర్తో చెప్పాను.

ఆయన "అయ్యో..ఎంతపనైందయ్యా..మా దౌర్భాగ్యం అందరికీ చుట్టుకోవాలని లేదు కదయ్యా..అనవసరంగా నీ మనసు పాడుచేశాను"అని నొచ్చుకున్నాడు.

"అదేంలేదండీ మీరు చెప్పింది నిజమే..మా ప్రొఫెసర్లతో కూడా మాట్లాడాక ఈ నిర్ణయం తీసుకున్నాను. పిచ్చి మొద్దు మా మరదలికేం తెలియదు. చిన్నప్పటి బంధం కదా..రెండు రోజులు బాధపడి మర్చిపోతుంది. రేపు మరొకరిని పెళ్ళి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా వుంటుంది."అన్నాను దిగులుగా.

ఆ తర్వాత చదువుపూర్తిచేసుకుని ఉద్యోగం సంపాదించుకున్నాక నా పెళ్ళయింది. పెళ్ళికి మామయ్యవాళ్ళు కూడా వచ్చారు. అదే పిచ్చి మొహంది.. శోకతప్త హృదయంతో తల్లడిల్లిపోతోంది. దాన్ని చూస్తూంటే గుండెని కత్తితో కోసినట్టనిపిస్తోంది. ఏ క్షణమన్నా నా మనసు మారి తనని పెళ్ళి చేసుకుంటానేమోనన్న ఆశ దానిది. అది స్పష్టంగా ద్యోతకమవుతోంది దాని ముఖంలో. దాన్ని చూస్తుంటే నన్ను నేను నిభాయించుకోవడం చాలా కష్టమవుతోంది. త్వరగా ముహూర్త సమయం దగ్గరపడితే బాగుణ్ణనుకున్నాను..అనుకున్న సమయం రానే వచ్చింది. నేను వైష్ణవి మెడలో మూడు ముళ్ళేసేశాను. పెళ్ళయిన పదినిముషాలకే మా మామయ్యా వాళ్ళు వెళ్ళిపోయారు.

ఇన్నాళ్ళూగా మామయ్యావాళ్ళకీ మాకు మాటలులేవు.అత్తయ్యని ఇక్కడ హాస్పిటల్లో చూపిద్దామని ఇప్పుడే వాళ్ళు మాదాపూర్లోని మా ఫ్లాటుకి రావడం రావడం.

మా మరదలు చిన్నప్పటిలా చలాకీగా..తూనీగలా వుండడం నన్ను ఊపిరితీసుకునేలా చేసింది.

మా ఆవిడ పట్నంలో పెరిగివుండడం వల్ల పనీ పాట అంతగా రావు. మరదలు పిల్ల ఇల్లంతా సందడిగా గిర గిర తిరుగుతూ పనులన్నీ చేసేస్తోంది. అటు నాకిష్టమైన వంటలు కూడా చేసి భోజనాల దగ్గర కొసరి కొసరి వడ్డిస్తోంది.

"ఏవయ్యా..నన్ను కాదని తనని పెళ్ళి చేసుకున్నావు. మరి ఏం చూసి చేసుకున్నావో..ఒక్క పనీ చేయదు..మొగుడ్ని ఎలా చూసుకోవాలో తెలియదు..తను పెట్టి పుట్టింది బావా" అంది ఒకనాడు.

మా ఆవిడలో కొత్తపెళ్ళికూతురి అందం పోయి భద్రకాళి రూపం కనిపించింది.

మరో రోజు "చూడమ్మోయ్..అసలు బావానేను మొగుడూపెళ్ళాలం కావలసినవాళ్ళం..మేనరికాలు చేసుకుంటే పిల్లలు చక్కగా పుట్టరని ఏ మహానుభావుడో ఈయనగారికి నూరిపోశాడట దాంతో చిన్నప్పట్నించి పెనవేసుకున్న బంధాన్ని పుటుక్కున తెంపి నిన్ను మనువాడాడు..నిజానికి మా మధ్య హద్దుల గీతలు ఎప్పుడో చెరిగిపోయాయి ఒక్క "ఆ" పని తప్ప అన్నీ జరిగిపోయాయి.ఆఁ"అంది.
బాంబు ఒత్తి వెగించింది. అది పడగ్గదిలో కస కస కాలుతూ ఢామ్మని పేలింది.

మామయ్యావాళ్ళు వెళ్ళేదాక ఓపికపట్టి..వాళ్ళటు వెళ్ళంగానే తనూ వాళ్ళ పుట్టింటికి సోమాజీగూడా వెళ్ళిపోయి విడాకులకోసం ఎదురుచూడమని ఫోన్ చేసి చెప్పి మరో మాటకి అవకాశమివ్వకుండా కట్ చేసేసింది.

నాకేం పాలుపోవడం లేదు. నాలోని మదనుడు శయనేషు రంభకోసం తల్లడిల్లిపోతున్నాడు. ఆమెలోని దేవశిల్పి చెక్కిన అంగాంగాలు గుర్తొస్తుంటే మనసుని ఊర్కోబెట్టడం వల్లకావడంలేదు. పైగా రుచి చూసిన పండాయె..నోట్లో లాలాజలం జీవనదవుతోంది.

నెమ్మదిగా తనకి ఫోన్ చేశాను. కట్ చేసింది.

మళ్ళీ చేశాను. మళ్ళీ కట్ చేసింది.

మళ్ళీ మళ్ళీ చేశాను. పదోసారి లిఫ్ట్ చేసి.."కరిగిపోయే మాటలు నాలుగు చెప్పి నన్ను పడేద్దామనుకుంటున్నారా? నెవ్వర్"అంది.
"నువ్వు లేకుండా నేనుండలేను. తనని నేను పెళ్ళి చేసుకోలేదన్న అక్కసుతో మా మరదలేదో లూజుగా మాట్లాడిందని నాకు దూరం అవడం ఏం న్యాయం చెప్పు?"అన్నాను.

"మీకూ దానికీ ఏ ’రిలేషనూ’ లేకపోతే..అది అలా ఎందుకు మాట్లాడుతుంది?" మా ఆవిడ్లోని సత్యభామ క్రోధం వ్యక్తం చేసింది.

"నువ్వు నాకో పది నిముషాలు కేటాయించు. ఇక్కడికొచ్చి నేను చెప్పేది విన్నాక ఇహ నీ ఇష్టం" అన్నాను సత్యభామ కాళ్ళు పట్టుకున్న కృష్ణుడిలా సౌమ్యంగా.

"సరే..రేపు చూద్దాం..కాని ఒక్క పది నిముషాలే గుర్తుంచుకోండి"

"నా మాట వినవే బాబు..నువ్వు ఇప్పుడే ఇక్కడికి మనింటికి రా..పదినిముషాలతర్వాత వెళ్ళి పోదువుగాని"

"సరే..ఓ అరగంటలో అక్కడుంటాను."

"అలాగే.."నాలోని మదనుడు సల్సా డ్యాన్స్ చేయసాగాడు.

వైష్ణవి వచ్చేసింది. చిలకాకుపచ్చరంగు చీరా జాకెట్టులో రంభని తలదన్నేంత అందంగా ఎదురుగా ప్రత్యక్షమైంది.

"ఎలా వున్నావు?"

"ఇదిగో ఇలా..చెప్పండి..ఏం సోది చెబుతారో..పది నిముషాల్లో వెళ్ళిపోతా"

"సరే..పద మన గదిలో కెళదాం..ఇక్కడ బావుండదు"

మా బెడ్రూమ్ లోకొచ్చాం. ఎన్నో సార్లు మేము ఏలిన మదన సామ్రాజ్యమది. ఏ సీ చల్లని గాలి నరాల్ని మెలిపెడుతోంది. అప్పటికే స్ప్రే చేసిన రూమ్ ఫ్రెషనర్ నాసికాపుటాల్లోంచి మనసుని స్పృశించి మధురమైన పులకింతలు రేపుతోంది. తెల్లటి దుప్పటితో మంచం..అప్పటికే నేను తెప్పించి పెట్టిన రక రకాల పూలు మనసుకి ఉత్ప్రేరకాన్ని అందిస్తూ మైమరపిస్తున్నాయి.

"చూడు వైష్ణవి..నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటే తననే చేసుకునేవాడినిగా..నిన్నెందుకు చేసుకుంటాను?. మేము ఒకరినొకరం ఇష్టపడిన మాట నిజమే..పెళ్ళి చేసుకోవలనుకున్నదీ నిజమే! కానీ అంగవైకల్యపు పిల్లలు పుడతారని నేను తనని కాదనుకున్నాను. నీ అందమైన రూపం నా మనసులోని మరదలి రూపుని ఏనాడో తుడిచేసింది. ఇప్పుడు నువ్వే నా ప్రపంచం. అనవసరమైన అపోహలతో నిండు యవ్వనాన్ని అడవి కాచిన వెన్నెల చేసుకోకు. ఈ వయసు మళ్ళీరాదు ఇప్పుడే అనుభవించాలి. రేపు మనం వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నా ఈ శరీరాలని ఎటువంటి సంకోచం లేకుండా మరొకరికి అప్పగించగలమా? మధురానుభూతులని పొందగలమా? చెప్పు. నువ్వు కాదంటే నేను ఇలాగే బ్రహ్మచారిగానే వుండిపోతాను."అన్నాను.

"నిజంగానా? నేనంటే మీకంత ఇష్టమయితే తనని ఇంకెప్పుడూ మనింటికి రానీయొద్దు."

"వైష్ణవీ..పాపం నా మరదలు నన్నెంతో ఇష్టపడి..నా మూలాన నాకు దూరమైంది. చిన్నపట్నించి నా మీద పెంచుకున్న ప్రేమ ఒక్కసారిగా వదులుకోవడం అంత సులువుకాదు. నేను తనకి దక్కలేదన్న అక్కసుతో పల్లెటూరిమొద్దు అలా ప్రవర్తిస్తోంది. ఆడదానివి తనని అర్ధం చేసుకో. తనకి మంచి సంబంధం చూసి మనమే పెళ్ళిచేయాలి. అది నా బాధ్యత కూడా"అన్నాను.

"అవునండీ..చదువుకున్న నేను కూడా తనలాగానే జెలసీ ఫీల్ అయి కౄరంగా ప్రవర్తించాను. ఏవనుకోవద్దు"అంది బాధతో కంఠం వణకుతుండగా.

"ఇప్పుడు..మనసులు బరువు చేసుకోవడం కాదు..శరీరాలని తేలిక చేసుకోవాలి ఇలా బట్టల్ని తొల.."అని పమిట తొలగిస్తూ ఆమెని గట్టిగా కౌగిలించుకున్నాను.

"మీరంటే నాకూ ప్రేమే..కాని మీరే ముందు కాళ్ళ బేరానికి రావాలన్న మూర్ఖత్వం నాది..ఇంకో రెండురోజులైతే ఉండలేక నేనే మీ దగ్గరకు వచ్చేసేదాన్ని"అంది గుస గుసగా.

అన్నాళ్ళ విరహం తూఫానై ఇద్దరిలో చెలియలికట్టదాటింది.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి