"కవితా... ఏమిటి నువ్వంటున్నది?" దాదాపు అరచినట్టుగా అంది కావేరి.
"అవును వదినా..." తలవంచుకుని నేలచూపులు చూసింది కవిత.
ఏడుపుని పెదవి అంచుల్లోనే ఆపేసేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది కవిత.
ముద్దు గులాబీలాంటి కవిత వదనం వాడిపోయింది.
ఆమె ఎంత అంతరంగ మధనాన్ని అనుభవించిందో... కళ్లకింద నల్లని చారికలు తెలియజేస్తున్నాయి.
"మిమ్మల్ని ఇంత షాక్ కి గురిచేసే ఈ విషయాన్ని వెల్లడించడానికి నేనెంత స్ట్రగుల్ అయ్యానో..." గద్గద స్వరంతో పలికింది కవిత.
"వాడిలా మాట్లాడాడంటే..." కావేరి స్వరంలో అపనమ్మకం ఇంకా వైదొలగలేదు.
"ఆయన నోటివెంట ఆ మాటలు విన్నప్పుడు... ఆ క్షణం... నాకు చచ్చిపోవాలనిపించింది..." కవిత భోరుమంది ఒక్కసారిగా...
"కవితా ప్లీజ్!" అనునయంగా ఆమెను హృదయానికి హత్తుకుంది కావేరి.
ఆవేదనంగా చెలియలికట్ట దాటిన సంద్రంలా హృదయపు పొరలని ఛేదించుకుని కన్నీటిరూపంలో బహిర్గతమవుతోంది.
"ఊరుకో కవితా... ధీరజ్ తో నేను మాట్లాడతాగా..." ఓదార్చింది కావేరి.
"సిఫార్సులతో కాపురాలు చక్కబడతాయా వదినా! ఆ వివేకమే వుంటే ఆయనింత నిర్దయగా మాట్లాడి వుండేవారే కాదు..." వెక్కసాగింది కవిత.
"మీరంటే ఆయనకు ఇష్టం, గౌరవం. మీ సాన్నిహిత్యం ఎరిగినదాన్ని కనుక ఎవరికీ చెప్పుకోలేని నా మనోవేదనను మీ ముందుంచాను. మీ వల్ల నా సంసారం చక్కబడితే అంతకన్నా నాకు కావలసిందేమీ లేదు" కన్నీళ్లు తుడుచుకుంది.
"పద భోంచేద్దాం. అసలే వట్టిమనిషివి కూడా కాదు" సోఫాలో నుంచి లేచి కవిత పట్టుకుని లాగింది కావేరి.
"వద్దొదినా... ఆకలిగా లేదు" కలత నిండిన కవిత స్వరం కావేరి మదిని కలచివేసింది.
"నీకు ఆకలిగా లేకపోవచ్చు. నువ్వలా అభోజనంగా వుంటే నాకు ముద్దెలా మింగుడుపడుతుంది చెప్పు. అందుకే నీకు ఆకలిగా లేకపోయినా నాకు కంపెనీ ఇవ్వడం కోసమైనా నాలుగు ముద్దలు తిను" టేబుల్ మీద కంచాలు పెట్టి వడ్డించింది కావేరి.
కవిత వెళ్లి చాలాసేపైనా ఆలోచనల నుంచి తేరుకోలేకపోయింది కావేరి.
ఆమెకు విస్మయం కలుగుతోంది. ధీరజ్ లో మూర్తీభవిందిన ఆశయాలు, ఆదర్శాలు కార్యరూపం ధరించాయని సంబరపడింది ఆనాడు. కానీ, ఈనాడు... అవే ఆదర్శాలు 'నేతి ' బీరకాయలో 'నెయ్యి ' చందాన వుంటే మాత్రం తట్టుకోలేకపోతోంది.
ధీరజ్, కావేరి అన్నదమ్ముల పిల్లలు. అతడికి అక్కాచెల్లెళ్లు లేకపోవడం, ఆమే ఏకైక సంతానంగా పెరగడంతో ఇద్దరి నడుమ సోదర సోదరీ సంబధాన్ని మించిన స్నేహబంధమేదో అల్లుకుని బలపడింది.
చదువు పూర్తయ్యాక ఓ పెద్ద కంపెనీలో పోస్టింగ్ వచ్చిన తరువాత కవిత ధీరజ్ కు తారసపడింది.
కుందనపు బొమ్మలాంటి అందాల సుందరి కవిత. అంతకు మించిన అమాయకత్వం, సున్నితత్వం కలగలసిన కవితను తొలిచూపులోనే వలచాడు ధీరజ్. ఆమెను తనదాన్ని చేసుకోవాలని తపించాడు.
ధీరజ్ తల్లిదండ్రులు ఈ పెళ్లికి అభ్యంతరం లేవనెత్తారు. కారణం... కులాల అంతరమో, అంతస్తుల తారతమ్యమో కాదు.
పెళ్లైన రెండేళ్లకే కవిత భర్త ఏదో మాయరోగంతో కన్ను మూశాడు.
అతడికి ముందునుంచీ వున్న రోగాన్ని దాచిపెట్టి, కవిత పుట్టింటివారిని మోసపుచ్చి ఈ పెళ్లి జరిపించారు కవిత అత్తామామలు. కానీ, వాల్ల తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకుగానూ, కవిత క్యారెక్టర్ మంచిది కాదని, ఆ వాస్తవాన్ని తట్టుకోలేకే తమ బిడ్డ మంచానపడి మరణించాడని ఆమెపైనే అభియోగం మోపారు.
నిజానికన్నా అబద్దానికి శక్తి ఎక్కువ.
గోరంత విషయం కొండంత రాద్ధాంతమై కవిత జీవితాన్ని కడగండ్లపాలు చేసింది. యవ్వనారంభంలో కవిత ఓ కుర్రాడిని ప్రేమించి (ప్రేమించానని భ్రమించి) ఆ వేడిలో అర్థం పర్థం లేని రాతలతో అతడికి నాలుగు ఉత్తరాలు రాయడం జరిగింది.
ఆ తరువాత అతడు అయోగ్యుడని తెలుసుకుని, అతడికి రాం రాం చెప్పేసి తల్లిదండ్రులు చూసిన ఈ సంబంధాన్ని చేసుకుంది.
ఈ సంగతి ఆ నోటా ఈ నోటా విన్న ఆమె అత్తగారు, దాన్నే హైలైట్ చేసి, పెళ్లైన తరువాత కూడా కవిత ఆ పాత ప్రియుడితో సంబధాన్ని కొనసాగించడంవల్లనే తమ బిడ్డ మనోవేదనకు గురై అకాలమరణం చెందాడని అసత్య ప్రచారాన్ని పారంభించారు.
తనమీద పడిన ఈ అపవాదును మోస్తూ ఎలా జీవించాలో, తన శీలానికి మచ్చలా దాపురించిన ఈ నిందని ఎలా తుడిచేసుకోవాలో తెలియని కవిత, తల్లడిల్లుతూ కాలం గడుపుతున్న సమయంలో ఆమేకు పరిచయమయ్యాడు ధీరజ్.
దిగజారిపోతున్న ఆమె ధైర్యాన్ని పైకిలాగి కొత్త ఉత్సాహాన్ని నింపాడు.
కానీ, విధవరాలు, పైగా కళంకం ఆపాదించబడిన యువతి అయిన కవితను చేపట్టేందుకు ధీరజ్ కన్నవారు అంగీకరించలేదు.
"మొగుడు చచ్చినదాన్ని పెళ్లిచేసుకుని ఉద్ధరించే ఖర్మ నీకేం పట్టిందిరా!" అంటూ నెత్తీనోరూ బాదుకున్నారు తల్లిదండ్రులు.
అయినా ధీరజ్ చలించలేదు. పటిన పట్టు నుంచి పక్కకు జరగలేదు. ఎన్ని అవాంతరాలెదురైనా కవితను చేపట్టే తీరుతానని ప్రతిన బూనాడు.
తను కవితను పెళ్లాడాలనుకుంటున్నది ఏ ఆదర్శాల కోసమో కాదని చెప్పాడు.
అపురూపమైన కవిత సౌందర్యం, నిష్కల్మషమైన ఆమె మనస్తత్వం తనకు నచ్చడం మూలానే ఆమెను వివాహమాడుతున్నానని స్పష్టం చేశాడు ధీరజ్.
అలాంటి సమయంలో కావేరి కలగజేసుకుని పెద్దవాళ్లకు నచ్చజెప్పింది.
"థాంక్స్ అక్కా... నీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను" కృతజ్ఞతా పూర్వకంగా అన్నాడు ధీరజ్.
కథ సుఖాంతమైందని సంతోషించినంతసేపు పట్టలేదు. అంత 'ఉడుంపట్టు ' పట్టి కవితను కట్టుకున్న ధీరజ్ ఇలా మారడమే కావేరి జీర్ణించుకోలేకపోతోంది.
"ఆయన నాకు విడాకులిస్తారట వదినా! నా క్యారెక్టర్ మంచిది కాదట... అసలు... అసలు నా కడుపులో వున్న బిడ్డకు ఆయన తండ్రి కానే కాదట!" పదే పదే కవిత దీనస్వరం మారుమోగుతోంది.
పెళ్లికి ముందో కవిత మీద అలాంటి ఆరోపణలు, అపవాదులు వున్నాయన్న సంగతి తెలిసినా, తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఆమెను తనదానిగా చేసుకున్న ధీరజ్ ఎంతో వివేకవంతుడని, ఆదర్శవంతుడని ఎంతగానొ మురిసిపోయింది తను.
ధీరజ్ లోని విచక్షణ ఏమైంది?! ఎన్నో అవాంతరాలని, అభ్యంతరాలని అధిగమించి కవిత బతుకులో వసంతాలు పూయించిన ధీరజ్ లో ఈ మార్పేమిటి!
ఈ ప్రశ్న ఒక ప్రహేళికై కావేరి కంటిమీద కునుకు లేకుండా చేసింది.
"నేను విన్నది నిజమేనా ధీరజ్?" డొంక తిరుగుడు లేకుండా సూటిగా విషయాన్ని ప్రస్తావించదలచింది కావేరి.
"ఏం విన్నావక్కా?" తాపీగా అడిగాడు ధీరజ్.
"అదే... నువ్వు కవితకు విడాకులిచ్చేస్తానన్నావుట!"
ఆమె స్వరంలో కాఠిన్యానికి కాస్త తగ్గాడు ధీరజ్.
"కవిత... నన్ను ఛీట్ చేసిందక్కా..."
"కవిత అలాంటి అమ్మాయి కాదు" అనునయంగా అంది కావేరి.
"నిజమేనక్కా... తను మంచి అమ్మాయి అనే నేను భ్రమించాను, ఆరాధించాను. కానీ, సనకా అర్హత లేదని ఆలస్యంగా తెలుసుకున్నాను." ధీరజ్ స్వరం కంపించింది.
"ఏ నిర్ణయం తీసుకోవడంలోనైనా తొందరపాటు పనికిరాదు" నెమ్మదిగా అంది కవిత.
"నాది తొందరపాటు కాదక్కా... కవిత పాత ప్రేమికుడే ఆ విషయాన్ని నిర్ధారించాడు" ఆవేదనగా అన్నాడు ధీరజ్.
"నీతో పెళ్లి కావడానికి ముందు నుండీ కవిత ఎన్నో అపవాదులను మోస్తోంది. అప్పుడు వాటిని కేర్ చేయని నువ్వు... ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం... ఆశ్చర్యంగా అనిపిస్తోంది" అంది కావేరి.
"నన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని మధ్యలోనే విడిచిపెట్టేంత మూర్ఖుడిని కాదక్కా...! కానీ, వాడు చూపించిన సాక్ష్యాధారాలను బట్టి తను అనుమానించక తప్పలేదు. వాడు కవితతో మాట్లాడుతూండగా నేను కళ్లారా చూశాను కూడా" కణతలు రుద్దుకున్నాడు ధీరజ్.
"కవిత మీద కక్షకొద్దీ అతడు నకిలీ సాక్ష్యాలను సృష్టించి విండొచ్చు కదా!" అంది కావేరి.
"నిజమే... ఫోటోలు, సి.డి.లు అంటే ఫేక్ అనుకుందాం. కానీ, బజార్లో వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం మాటేమిటి? పైగా, కవిత ఆ విషయం నాతో చెప్పకుండా ఎందుకు దాచాలి?" అసహనంగా అన్నాడు ధీరజ్.
"అయినా... కేవలం అతడితో మాట్లాడినంత మాత్రానే కవితను నువ్వెలా అనుమానించగలవు? పెళ్లికి ముందే కవిత తన గురించిన ఏ విషయమూ దాచకుండా నీతొ చెప్పింది కదా! అంత నిజాయితీగా వున్న కవిత నిన్ను మోసపుచ్చిందని నువ్వు బాధపడ్డం అవివేకం" నిలదీసింది కావేరి.
"ఈ సాక్ష్యాధారాలను చూపించి కవితను బ్లాక్ మెయిల్ చేస్తాడని నేననుకోను. అలా చేసేవాడే అయితే, పెళ్లికి ముందే చేసుండేవాడు కదా! వాళ్ల మధ్య సంబంధం కంటిన్యూ అవుతోందనే నాకనిపిస్తోంది"నమ్మకంగా పలికాడు ధీరజ్.
"నిజంగా అతడు కవితను ప్రేమించిన మాట నిజమే అయితే ఆమె ఎక్కడ వున్నా ఆమె జీవితం హాయిగా సాగిపోవాలని ఆశిస్తాడు. పాలకుండలా వున్న ఆమె సంసారంలో విష బిందువులు చిలకరించాలనీ, ఆమె దాంపత్యంలో నిప్పులు పోయాలనీ అనుకోడు."
"అతడే గనజ ఆమెను నిజంగా ప్రేమిస్తే, ఆమె భర్త మరణించిన వెంటనే ఆమెను చేపట్టి, తన ప్రేమ స్వచ్ఛమైనదని నిరూపించుకుని వుండేవాడు. కానీ, ఇలా నీతొ సంసారబంధం ముడిపడిన తరువాత ప్రయత్నపూర్వకంగా ఆమె జీవితంలోకి చొరబడి ఆమె బతుకులో అల్లకల్లోలం రేపడానికి చూస్తున్నాడంటే వాడెంత దుర్మార్గుడో నువ్వర్థం చేసుకోవచ్చు. ఆమెతో మాట్ల్లాడాడన్న ఒకేఒక్క కారణంతో కవితను అనుమానించి వేధిస్తున్నావంటే... నువ్వు నా తమ్ముడివి అనుకునేందుకే సిగ్గుగా వుంది" ఒక ప్రవాహ వేగంతొ సాతిపోతున్న కావేరి మాటలు ధీరజ్ మెదడులో మూసుకుపోతున్న ఆలోచనా ద్వారాలను తెరచాయి.
నిజమే... తనింత లోతుగా, తార్కికంగా ఆలోచించలేకపోయాడెందుకు? అనుమానపు పొరలు కమ్మిన తన మనసు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయిందా!
"ఆదర్శమో, ఆకర్షణో కారణంఎదైనా కానీ... అమ్మానాన్నలను ఒప్పించి, కవితను తన అర్థాంగిగా చేసుకున్నావు. ఇప్పుడు ఒక మోసగాడు, నయవంచకుడు అల్లిన మాయాజాలంలో చిక్కుకుపోయి, నిన్నే నమ్ముకున్న ఒక అమాయకురాలిని నడి సముద్రంలో నావలా విడిచిపెట్టాలనుకుంటున్నావు. దీన్నిబట్టి చూస్తే కవిత మీద నీకున్నది ప్రేమ కాదు... కోరికనిపిస్తోంది. ఆమె మీద వాంఛ తీరగానే... తొలినాటి మోజు తొలగిపోగానే... ఆమెలో లోపాలు వెదకి ఆమెను వదిలేయాలన్న దుర్మార్గపు ఆలోచన కలిగిందన్నమాట!"
"అక్కా ప్లీజ్... అలా అనకు. నేనిప్పటికీ కవితను ఆరాధిస్తూనే వున్నాను. కానీ..." ధీరజ్ మదిలోని ఘర్షణను ప్రతిబింబించిందతడి వదనం.
"అయితే, మరిలా ప్రవర్తిస్తున్నావేమిటి? తను నిర్దోషినని మొర పెట్టుకుంటున్నా వినిపించుకోనంత నిర్దయుడిగా ఎందుకు మారిపోయావు?" సూటిగా అడిగింది కావేరి.
ధీరజ్ మౌనంగా వుండిపోయాడు.
"పెళ్లికి ముందు ఏ కారణాలనైతే నువ్వు అల్పంగా భావించి, వాటిని పరిగణనలోకి తీసుకోక ఆమె మెడలో తాళి కట్టావో, అవే కారణాలను ఇప్పుడు మనసుకు పట్టించుకుని ఆమెకు విడాకులివ్వడానికి సైతం సిద్ధపడ్డావంటే... నీ నిబద్దత ఏపాటిదో నాకు బోధపడుతోంది. నా తమ్ముడు ఒక కుసంస్కారి అనుకోలేదు...." అతడి ముఖంలోకి చూడ్డం కూడా ఇష్టం లేనట్లుగా ముఖం తిప్పుకుంది కావేరి.
గుమ్మం దాకా వెళ్లిన ధీరజ్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి "నీ తమ్ముడు సంస్కారవంతుడో, కాదో నీకే తెలుస్తుంది" అనేసి గబగబా వీధిలోకి నడిచాడు.
అతడి మాటల్లోని భావం అర్థమైన కావేరి ముఖం ఆనందంతో వికసించింది, అతడి మదిలో మధనం మొదలైందని ఆమెకు అర్థమైంది.
మనసు తెరచి యోచిస్తే మంచి చెడుల లడుమగల అంతరం అతడికి అవగతమవుతుంది.
ఆ ఇంగితం అతడు తీసుకోబోతున్న అసంబద్ధమైన నిర్ణయాన్ని మారుస్తుంది. ఆ మార్పు కవిత జీవితాన్ని నిలబెడుతుంది. తృప్తిగా నిట్టూర్చింది కావేరి, ధీరజ్ వెళ్లినవైపే చూస్తూ...