దొంగ గారి పెళ్ళి - సి. చంద్రయ్య

donga gari pelli

కూతురు కోరినదానికి నవ్వాలో, ఏడవాలో, నవ్వి ఏడవాలో, ఏడ్చి నవ్వాలో అర్థం కాలేదు భీముడికి. పన్నేండేళ్ల వయసున్నప్పుడు కూతురు 'అలీబాబా అరడజను దొంగలు ' కావాలంది. తీసుకొచ్చి సంతోషపెట్టాడు. తరువాత 'మంచిదొంగ ' కావాలంది. తీసుకొచ్చి తనూ సంతోషపడ్డాడు. ఆ తరువాత భలేదొంగ, గజదొంగ... ఇలా దొంగలకు సంబంధించిన సినిమాలను కూతురు అడగడం, భీముడు తెచ్చివ్వడం జరిగింది. ఇప్పుడు 'దొంగ మొగుడు ' కావాలంది. "సరేలే తల్లీ... రాత్రి డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తెస్తాలే" అన్నాడు భీముడు యధాలాపంగా. "తెచ్చేదేంటి డాడీ? తీసుకురావాలి. నేనడుగుతున్నది సినిమాలో దొంగమొగుడు కాదు డాడీ... నిజమైన దొంగమొగుడు"
ఈ మాటకు భీముడు సెకనులో అరవయ్యో వంతు సమయం షాక్ కు గురై వెంటనే తేరుకున్నాడు. దొంగ అంత వేగంగా తేరుకోవాలి. లేకపోతే దొరికిపోతాడు. తేరుకున్న తరువాత ఆలోచనలో పడ్డాడు. కాకి కడుపున కాకే పుడుతుంది. పిల్లి కడుపున పిల్లే పుడుతుంది. దొంగ కడుపున దొంగే పుడుతుందా?! కాకపోతే, ఈ దొంగ బుద్దులు ఎలా ఒంటబట్టాయి?

భీముడు ఒప్పుకున్నాడు. ఒప్పుకోక ఏంచేస్తాడు? ఒక్కగానొక్క కూతురాయె... పైగా తల్లిలేని బిడ్డాయె. తన కూతురికి చిన్నప్పటినుండీ కోరితే కొండమీద కోతినైనా తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు దొంగమొగుడిని తీసుకురాలేడా?

భీముడు దొంగ సంబంధాల వేటలో పడ్డాడు. కానీ, అతడికి మొదటి అడుగే ఎలా వేయాలో అర్థం కాలేదు. తనకు తెలిసిన దొంగలంతా తన ఈడువారే! వాళ్లకు మగపిల్లలున్నారో, లేదో తెలీదు. ఒకవేళ వున్నా ఆ పిల్లలు దొంగ వృత్తిలో దిగి వున్నారో, దిగుతారో తెలియదు. పైగా, ఏ దొంగనైనా నీ కొడుకు దొంగతనం చేస్తాడా అంటే చెప్పుచ్చుకుని దరువేయడా? ఈ ఆలోచనా క్రమంలో భీముడి మెదడులో ఓ నక్షత్రం తళుక్కున మెరిసి దారి చూపింది.

రైల్వేస్టేషన్ కెళ్లి 'దొంగలున్నారు జాగ్రత్త ' అని రాసివున్న బోర్డులో తన కూతురికి మ్యాచ్ అయ్యే దొంగబ్బాయి కోసం చూశాడు. కానీ, అక్కడున్న మొహాలు అతడికి నచ్చలేదు. కూతురు ఎంత దొంగమొగుదు కావాలంటే మాత్రం కొండముచ్చుల్లా వున్న దొంగ ముచ్చుల్ని ఎలా కట్టబెట్టగలడు? ఎంత దొంగైనా కన్నతండ్రే కదా! చివరకు పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్లి ఎంక్వైరీ చేశాడు.

తనకు నచ్చిన యువదొంగ దొరకలేదు, అయినా అతడు ఆగిపోలేదు. ఇంకో ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా పెన్ను, కాగితం తీసుకున్నాడు. తల పైకెత్తి తిరుగుతున్న సీలింగ్ ఫ్యానుకేసి చూసి రాయడం మొదలుపెట్టాడు.

'దొంగ కావలెను ' అని రాసి దానికింద అండర్ లైన్ చేశాడు... దానికింద...

అమ్మాయి పేరు : మనోహరి
రంగు : పట్టపగలు
వయసు : రెండు అర్థరాత్రులకు మూడు తక్కువ.
ఎత్తు : కిటికీకి ఎక్కువ, ద్వారానికి తక్కువ.
ఆస్తి : తండ్రి వయసంత.

వరుడికి వుండవలసిన లక్షణాలు...
రంగు : చిమ్మచీకటి (రాత్రుల్లో కనిపించకుండా వుండడానికి.)
చూపు : కత్తిలా ( బ్యాగులో ఏముందో తెలుసుకోవడానికి.)
వేళ్లు : కత్తెర్లాంటి (కత్తెర చేతిలో పెట్టుకు తిరిగితే ప్రమాదకరం.)
పళ్లు : బ్లేడులాంటి (బ్లేడుకు పదును తగ్గినప్పుడు ఉపయోగం.)

పైన తెలిపిన అమ్మాయికి, కింద తెలిపిన అర్హతలున్న యువదొంగలు తమ బయోడేటాను కింది అడ్రసుకు పంపగలరు. అని తన అడ్రసును రాశాడు. ఒకసారి తను రాసింది తిరిగి చదువుకున్నాడు. సంతృప్తిగా నవ్వుకున్నాడు. పత్రికలో యాడ్ ఇవ్వడానికి బయలుదేరాడు.
భీముడిచ్చిన ప్రకటన బాగానే పనిచేసింది. ఎప్పుడూ ఆ వీధి మొహం కూడా చూడని పోస్టుమాన్, ఓ పేద్ద సంచిని మోయలేక మోయలేక మోసుకుంటూ భీముడింటి లోగిలిలో పడేసి "నిద్రపోతున్నవాడిని లేపావు కదయ్యా... ఇంతకీ ఇన్ని కవర్లు వచ్చాయేంటి?" అని అడిగి సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా వెళ్లిపోయాడు. బయోడేటాలను సార్టవుట్ చేయడానికి దాదాపుగా నెలరోజులు పట్టింది. వచ్చిన అప్లికేషన్లలోనుండి తనకు మంచిదనిపించిన ఒకదానిని సెలెక్ట్ చేసి కూతురికి చూపించాడు. ఆమెకూ నచ్చింది. ఆ యువదొంగ అప్లికేషనులోని సెల్ నంబరుకి ఫోన్ చేసి "మీ ఇంటికి రేపొస్తున్నాం... మీకేమీ అభ్యంతరం లేదుగా!" అన్నాడు. "లేదు" అంది అవతల యువదొంగ గొంతు.

భీముడు, మనోహరి యువదొంగ ఇంటికెళ్లారు. యువదొంగ తల్లిదండ్రులు "రండి... రండి... మీకోసమే ఎదురు చూస్తున్నాం. ప్రజలంతా క్షేమమేనా?" అని సాదరంగా ఆహ్వానిస్తూ అఓపలికి తీసుకెళ్లారు. ఈ పలకరింపు అర్థంగాక యువదొంగ సర్హ "అదేమిటి అలా అడుగుతున్నారు? ఎవరైనా అందరూ బావున్నారా? అని అడుగుతారు. కానీ, మీరు మాత్రం....." ఆర్థోక్తిలో ఆగిపోయింది. "ఒసే పిచ్చిమొహమా! దొంగలు ఎప్పుదు క్షేమంగా వుంటారు/ అహ... ఎప్పుడుంటారని? ప్రజలు క్షేమంగా వున్నప్పుడే కదా!" అని గీతోపదేశం చేసి "సరే, నువ్వెళ్లి కాఫీలు పట్టుకురా!" అన్నాడు.

"చిటికెలో తేనూ" అంటూ అఓపలికెళ్లి వెంటనే తిరిగి వచ్చింది కాఫీ ట్రేతో...

మనోహరి కాఫీ చప్పరిస్తూ "పాలు చాలా చిక్కగా వున్నాయి. ఇంత చిక్కని పాలంటే... రేటు చాలా ఎక్కువనుకుంటా..."

"నేనూ అదే అనుకుంటున్నా... ఏ కేటగిరీ పాలు కావాలి? పల పాలా? నీళ్ల పాలా? అని చెప్పి మరీ పోస్తున్న ఈరోజుల్లో... ఇంత చిక్కని పాలంటే..." భీముడికి కూడా అదే అనుమానం. ఈ తండ్రీ కూతుళ్ల అనుమానాలు చూసి యువదొంగ తల్లిదండ్రులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని కిసుక్కున నవ్వుకున్నారు.

"అడిగితే ఎవడు పోస్తాడు ఇంత చిక్కని పాలు? నేనే తెల్లవారు జామున వెళ్లి ఒక్కోరోజు ఒక్కో ఇంట్లో పాలు పితుక్కొచ్చుకుంటాను" మీసం మెలేశాడు యువదొంగ తండ్రి.

"మంచిపని చేశారు. నాకూ ఇలా చేయాలని వుంది. కానీ, పాలు పితకడం చేతగాక వెళ్లడం లేదు. ఇంతకీ అబ్బాయి....?" ప్రశ్నార్థకంగా యువదొంగ తండ్రివైపు చూశాడు భీముడు.

"కూల్ డ్రింక్స్ కొట్టుకొస్తానని వెళ్లాడు... వచ్చేస్తూ వుంటాడు" అన్నాడు యువదొంగ తండ్రి.సరిగ్గా అప్పుడే యువదొంగ ఖాళీ చేతులతో వచ్చాడు.

"కూల్ డ్రింక్స్ ఏవిరా?"

"వీలు పడలేదు డాడీ!"

"నా కడుపున చెడబుట్టావు కదురా... నా పరువును పుల్కాట్లో కలిపేశావు కదురా..." అంటూ మీటరెత్తు ఎగిరాడు. దొంగమొగుఛు కావాలనుకుంటే ఉత్త మొగుడు దొరికేలా వున్నాడనుకుని మనోహరి తండ్రి చెవిలో "కూల్ డ్రింక్ కూడా కొట్టుకురాలేని మొగుడు నాకొద్దు డాడీ" అని అనేసరికి ఆయన కూడా మనోహరి చెవిలో "నే మాట్లాడతాలే! నువ్వుండమ్మా" అన్నాడు.

ఈ గుసగుసలు గమనించిన యువదొంగ తండ్రి "మీరేమీ కంగారు పడకండి... ఈకాలంలో దొంగతనం చేయడం ఎంత కష్టమో దొంగలు... మీకు తెలియంది కాదు. కాలు బయట పెట్టిన ప్రతిసారీ కాసులతో రాలేం కదా!" అని సర్ది చెప్పబోతూంటే భీముడు "మీరు చెప్పిందీ నిజమే... కానీ, మా మనోహరి కోరికే... దొంగమొగుడు కావాలని... దాని కోసమేమా ప్రయత్నం." కూతురివైపు ప్రేమగా చూశాడు. మనోహరి తన తండ్రికి తనపైగల ప్రేమకు మురిసిపోతూ "సరేనండీ... మీరింతగా చెబుతున్నారు కాబట్టి... నాదో కండిషన్. ఇప్పుడు జరుగుతున్నది పరిచయ చూపులనుకుందాం. నేను మళ్లీ ఒకరోజు పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తాను. అందులో నెగ్గితే ఓకే" అని గంట కొట్టింది. "పెళ్లిచూపుల్లో నెగ్గడమేంటి?" యువదొంగ, అతడి తల్లిదండ్రులు మూకుమ్మడిగా నోళ్లు తెరిచారు. "ముందు మీరు నోళ్లు మూసుకోండి. తరువాత ఏంచేయాలో చెబుతాను." అంది మనోహరి. భీముడు కూడా తన కూతురి మనసులో ఏముందో పసిగట్టలేకపోయాడు. అందరూ మనోహరి వైపు కళ్లార్పకుండా చూస్తున్నారు. ఆమె నోట్లో నుండి ఏం మాటలు ఊడిపడతాయా... అని ఎదురు చూస్తున్నారు.
"నేను ఏదైనా ఒక ఇంటిని చూపిస్తాను. ఆ ఇంట్లో దొంగతనం... నా కళ్లముందే చేయాలి. పైగా, మనుషులున్న ఇంట్లో... అలా చేయగలిగితేనే పెళ్లిచూపులు విజయవంతం అయినట్టు" అని మనోహరి తేల్చేసరికి యువదొంగ రెండు కేజీల ఖంగు తిన్నాడు.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు