తీరని ఋణం - చెన్నూరి సుదర్శన్

teerani runam

“అనూ...! రేపటి నుండి పూర్తిగా నీవాడినే. యిక అంతా నీ యిష్టం. ఎక్కడి కంటే అక్కడికి వెళ్దాం. మళ్ళీ హానీమూన్‍కైనా సరే...’’ అంటూ కొంటెగా కవ్విస్తూ... హుషారుగా తన అర్థాంగి అన్నపూర్ణను క్రీగంట చూస్తూ... అన్నాడు శ్రీనివాస్. ‘చలొ దిల్దార్ చలో... చాందికీ ఓర్ చలో... హమ్‍భి తయ్యార్ చలో... ’ అంటూ అలనాటి హిందీ సినిమా ‘పాకీజా’ లోని పాటను హమ్ చేయసాగాడు... చేతులు చాస్తూ...

“దొరగారీ వేళ చాలా హుషారుగా ఉన్నారే... మీమొదటి భార్య విడాకులిచ్చిందనా సంబరం?... ” అంటూ మూతి విరుచుకుంటూ మురిపెంగా అడిగింది అన్నపూర్ణ.

“మావిడాకుల మహోత్సవం కళ్ళారా చూశావుగా... యింకా అనుమానమా... ?” అంటూ రెండు చేతులూ అన్నపూర్ణ నడుము వెనకాలగా చొప్పించి లాక్కోబోయాడు శ్రీనివాస్ తన చేతిలోని న్యూస్ పేపర్‍ను ప్రక్కకు పడేస్తూ...

“చాల్లే...! సరసం... కాఫీ ఒలికి పోతుంది.” అంటూ చేతిలోని కాఫీ కప్పును జాగ్రత్తగా టీపాయ్ మీద పెడ్తూ....

“నాకవతల బోలెడు పనుంది. నీతో సరసాలాడ్తూ కూర్చుంటే వంట పని అయినట్లే. అయినా మనవడు, మనవరాళ్లతో ఆడుకునే వయసులో యింకా యీ సరసాలేంటండీ... ? ఎవరైనా చూస్తే నవ్వి పోతారు” అంటూ అన్నపూర్ణ శ్రీవాస్ చేతులను సుతారంగా విడిపించుకొంది.

“నవ్వితే నవ్వి పోదురు గాక. నేకేంటి భయం... నాపెళ్లాం.. నాయిష్టం. అయినా యిక ఆపనులన్నీ నాకు వదిలేయవోయ్... కిచెన్ ఇంచార్జ్ తీసుకోమన్నా ఫుల్ అడిషనల్ చార్జ్ తీసుకోగలను. యిన్నాళ్ళూ నీవు వంట చేసి పెట్టావ్... మిగిలిన రోజులన్నా నన్ను చేయనివ్వు. అలనాడు పాండవుల అజ్ఞాత వాసంలో భీముడు చేయలేదా... ? వంటల్లో మగవాళ్ళను మించిన వారు లేరని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నల భీమ పాకమని ఊరికే అన్నారా... ?” అంటూ శ్రీనివాస్ గోముగా అన్నపూర్ణ బుగ్గలు నిముర సాగాడు. అన్నపూర్ణ తన ఎడం చేత్తో శ్రీనివాస్ చేతి వాటాన్ని ఆస్వాదిస్తూ.. టీపాయ్ మీద పెట్టిన కాఫీ కప్పును చేతికందించింది.

“మీరింతగా సరదా పడ్తుంటే నేనెలా కాదనను... యిద్దరం కలిసి యీరోజు బయట భోంచేద్దాం... సాయంత్రం పబ్లిక్ గార్డెన్... ఆతర్వాత ‘అవతార్’ సినిమా చూద్దాం..” అంటూ ఎన్నాళ్ళుగానో ఐమాక్స్ థియేటర్లో త్రీడి సినిమా చూడాలన్న కోరికను బయట పెట్టింది అన్నపూర్ణ.

“హమ్మయ్య... దేవీ గారు ప్రసన్నులయ్యారన్నమాట... ఓ.కే... ఓకే... ” అనేశాడు శ్రీనివాస్.

శ్రీనివాస్, అన్నపూర్ణలది ఎంత అన్యోన్య దాంపత్యం. అయినా... సంసారమన్నాక కొన్ని సర్దుబాట్లు ఉండడం కద్దు.

శ్రీనివాస్ తన ప్రభుత్వ ఉద్యోగానికి బానిస. ఉద్యోగులంటే ప్రజల సేవకులు అనే అంకిత భావంతో పని చేసేవాడు. పైగా తనని తన వారిని పోషించేది ఉద్యోగమే కనుక అదే శ్రీరామ రక్ష. సాధ్యమైనంత వరకు సెలవులు పెట్టే వాడు కాదు. వివాహాది శుభ కార్యక్రమాలకు గూడా అన్నపూర్ణనొక్కదానినే పంపించే వాడు. ఆ దుగ్ధను మనసులో దాచుకున్న అన్నపూర్ణ నిన్నటి శ్రీనివాస్ పదవీ విరమణ రోజు బయట బెట్టింది ‘తాను శ్రీనివాస్‍కు రెండవ భార్యనని... మొదటి భార్య ఉద్యోగమేనని... ’ సభ కరతాళ ధ్వనుల మధ్య ప్రసంగించింది. తానెంతగా తన భార్య మనసుకు కష్టం కలిగించాడో శ్రీనివాస్‍‍కు తెలియంది కాదు. తమ పెళ్ళైన కొత్తలో ఏకొద్ది రోజులో... సరదాగా తిరిగారేమో...! గాని ఆతర్వాత వరుసగా ఇద్దరమ్మాయిల జననం... వారి పెంపకం... చదువులూ... పెళ్ళిళ్ళు... బాధ్యతలు... బంధాలు... తమని ఎటూ కదలకుండా... ఊపిరి సలుపకుండా చేశాయి.

రాత్రంతా తన కుటుంబంలో, ఆఫీసులో తన పాత్రను సింహావలోకనం చేసుకుంటూ మౌనంగా మదనపడ్డాడు. వాస్తవానికి అన్నపూర్ణ ఆకుటుంబంలో హీరో. అన్ని పనులు తనే చూసుకొనేది. చివరికి అమ్మాయిలనిద్దరినీ సవ్యంగా అత్తవారింటికి సాగనంపడం వరకూ... శ్రీనివాస్ కేవలం ఎ.టి.ఎం.(ఎనీ టైం మనీ)లా పని చేశాడు. అందులో పొదుపుగా డబ్బు నింపడంలో సహకరించిందీ అన్నపూర్ణే...

‘హాట్సప్ టు అన్నపూర్ణ... నిజంగా నాపాలిట దేవత. యిక ఈ విశ్రాంత జీవనం ఆమె ఒడిలో... ఆమె ఆశల పల్లకీలు నామదిలో...’ అని ఆలోచిస్తూ... ఆలోచిస్తూ... ఎప్పుడు నిద్రపోయాడో... ఏమో...!

సూర్యోదయంతో ప్రారంభమైన నూతన విశ్రాంత దైననందిన జీవనంలో ప్రథమంగా... సినిమా చూడాలనే ప్రతిపాదన యిద్దరి మనసులను కాసింత సాంత్వన చేకూర్చింది.

శ్రీనివాస్, అన్నపూర్ణలు టిఫిన్లు ముగించుకొని కార్లో బయలు దేరారు.

శ్రీనివాస్‍కు స్వయంగా కారు డ్రైవ్ చేయడమంటే సరదా... ‘కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడీ దాన... ’ అంటూ పాత తెలుగు సినిమా ‘తోడికోడళ్ళు’ లోని పాటను కూని రాగం తీస్తూ కారు నడుప సాగాడు.

అన్నపూర్ణ ముందు సీట్లో కూర్చుంది. మనసు దూది పింజంలా ఎగుర సాగింది....

‘ముఖ్యమైన బాధ్యతలన్నీ తీరాయి. యిక మనువలు, మనువరాండ్లను కనిపెట్టుకొని ఉండడమే. వాళ్ళ పెళ్ళిళ్ళు చూసే భాగ్యం కల్గితే అంతకంటే అదృష్టమింకేముంది... ? శ్రీనివాస్ గూడా తన ఆలోచనలను అర్థం చేసుకొని అడ్జస్టయ్యే ఉత్తముడు. తన భర్తగా లభించడం పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యఫలం...’ అని ఊహల్లో తేలిపోతున్న అన్నపూర్ణ ఠక్కున యీలోకానికొచ్చింది.. కారు సడన్ బ్రేకుతో ఆగిపోవడంతో.

“ఏమైందీ... !” అంటూ ఆశ్చ్రర్యంగా అడిగింది. కారుకు అడ్డుగా ఏమీ లేదు... రోడ్డుపై అంత రద్దీ గూడా లేదు. అది మియాపూర్, హైదర్ నగర్‍ల మధ్య ప్రాంతం. మెట్రో రైళ్ళ కాబోయే కూడలి...

కారు కొంచెం వెనక్కి పోనిచ్చాడు శ్రీనివాస్.

రోడ్డు ప్రక్క చెట్టు నీడన ఒక వృద్ధురాలు దీనంగా కూర్చొని ఉంది తలమాసిపోయి మూట గట్టిన మురికి బట్టల మూటలా...
కారు దిగి ఆమె దగ్గరికి వెళ్ళాడు శ్రీనివాస్.

తమ నూతన అధ్యాయానికి గుర్తుగా ఆవృద్ధురాలికి కొన్ని డబ్బులు చేతిలో పెట్టి వస్తాడనుకుంది అన్నపూర్ణ. కాని శ్రీనివాస్ ఆమెను ఏదో అడుగుతున్నాడనిపించి ఏమీ అర్థం గాక తనూ కారు దిగి చెట్టు చెంతకు వెళ్ళింది.

“నీపేరు శాంతమ్మ కదూ... !” అంటూ శ్రీనివాస్ అడుగడం అన్నపూర్ణను ఆశ్చర్యపర్చింది.

బూసులు తోడిన ఆమె కళ్ళ నుండి కన్నీటి ధారలు ముడతలు పడ్డ ముఖ వర్చస్సుపై నుండి ఎగుడు, దిగుడులుగా కార సాగాయి.
ఆమె కన్నీరు తనే శాంతమ్మనని... సమాధానం చెబుతోంది.

“నేను శాంతమ్మా... శ్రీనివాస్‍ని...’’ అంటూ శ్రీనివాస్ నెమ్మదిగా శాంతమ్మను లేవనెత్తి నడిపించుకుంటూ కారు వెనుక సీట్లో కూర్చో బెట్టాడు. శాతమ్మ తనను గుర్తించిందో... లేదో... ! అని సంశయించకుండా...

‘శాంతమ్మ చాలా నీరసంగా ఉంది. భోజనం చేసి ఎన్ని రోజులైందో... ఏమో... !’ అని మనసులో ఆవేదన పడ సాగాడు.

అన్నపూర్ణ నిశ్చేష్టురాలై నిల్చుంది.

అన్నపూర్ణను కారెక్కమని సంజ్ఞ చేసి వేగంగా కారు లింగంపల్లిలోని తమ యింటికి దారి మళ్ళించాడు.

అన్నపూర్ణ మనసు పొయ్యిమీద ఉడుకుతున్న అన్నంలా కుత, కుతలాడ సాగింది. కాని శాంతమ్మ ముందు కోపం ప్రదర్శించడం సమంజసం కాదని తన వయసుకు తగ్గ హుందా తనాన్ని ప్రదర్శిస్తోంది.

యిల్లు చేరగానే శ్రీనివాస్ దారిలో ఆర్డరిచ్చిన ‘ఫామిలీ ప్యాక్’ హోటల్ నుండి వచ్చి రడీగా ఉంది.

శాంతమ్మకు తనే స్వయంగా అన్నం కలిపి రెండు ముద్దలు తినిపించాడు. శాంతమ్మ కొన్ని మంచి నీళ్ళు త్రాగి ‘నేను తినగలను’ అన్నట్లుగా తల ఊపుతూ శ్రీనివాస్‍ను సమాధాన పర్చి తనే తిన సాగింది.

“మనం కూడా భోంచేద్దాం... ” అనే శ్రీనివాస్ మాటలను పట్టించు కోకుండా విసురుగా తన బెడ్ రూంలోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణ. ఒక అడుక్కుతినే ఆవిడకు డబ్బు సహాయం చేయవచ్చునేమో గాని యిలా యింటికి తీసుకొచ్చి సకల మర్యాదలు చేయడం అన్నపూర్ణ మనసు చివుక్కు మంది. ‘బహుశః శాంతమ్మ శ్రీనివాస్‍కు తెలిసిన మనిషి గావచ్చు. అంత మాత్రాన అలా తినిపించాలా... ? శాంతమ్మ తన పిల్లల నిరాదరణచేతనో లేక ఆమె వ్యవహార శైలి వాళ్ళకు నచ్చకనో బయటికి వచ్చి ఉంటుంది. అయినా బిడ్డలమీద కోపం నీళ్ళ మీద దెబ్బలాంటిది. ఎన్నాళ్ళుంటుందిలే... నాలుగు రోజులైతే వాళ్ళే కలిసిపోతారు... లేదంటే ఆనాథాశ్రమంలో చేర్పిస్తాడేమో...’ యిలా పలు, పలు రకాలుగా ఆలోచిస్తూ తమ ‘జాలిడే’ ట్రిప్ శాంతమ్మ మూలాన కేన్సిల్ కావడం... కన్నీళ్ళనాపుకోలేక పోతోంది.

శ్రీనివాస్ తన వెనకాలే వస్తున్నట్లు అలికిడి వినవచ్చినా వినరానట్లే దిండు ముఖానికి అదిమిపట్టి నిద్రపోతున్నట్లుగా నటించ సాగింది అన్నపూర్ణ.

‘సహజమే... ఎవరికైనా తన ప్రవర్తన కోపం తెప్పిస్తుంది... అయినా వాస్తవం తెలుసుకుంటే తనలో మార్పు వస్తుందేమో... ’ అని మనసులో అనుకుంటూ స్టూలు వేసుకొని బెడ్‍రూంపై ఉన్నఅటకలో పాత సామాను సర్దిన సూట్‍కేసు కోసం వెతకసాగాడు. శ్రీనివాస్ వచ్చి తనను బతిమాలుతాడేమోనని భ్రమిసిన అన్నపూర్ణకు పుండుమీద కారం చల్లినట్లైంది. కోపంగా అలనాటి సత్యభామను మించిన భంగిమలో శ్రీనివాస్ చర్యను ఓర కంటగా గమనించ సాగింది.

తాను అనుకున్న వస్తువు చేతికందగానే తృప్తిగా అటక తలుపులు మూసేసి స్టూలు దిగి అన్నపూర్ణ వద్దకు నడిచాడు శ్రీనివాస్. తను రావడం గమనించి ముఖం మరో వైపుకు త్రిప్పుకుంటుండగా శ్రీనివాస్ చేతిలో ఏదో ఫోటో లాంటిది కనబడే సరికి చటుక్కున లేచి కూర్చొని ఆశ్చర్యంగా చూడ సాగింది.

పాలితిన్ కవర్లో భద్రంగా చుట్టి పెట్టిన ఫోటోను తీసి అన్నపూర్ణకు చూపించాడు.

ఫోటోలో ఒక తల్లి బిడ్డకు చనుబాలిస్తున్న అపూర్వ దృశ్యమది. అన్నపూర్ణ తదేకంగా పరిశీలనగా చూస్తుంటే ఆతల్లిలో శాంతమ్మ రూపు రేఖలు... ఆశ్చర్య పోయింది.

అన్నపూర్ణ ముఖ కవళికలలో ‘యీవిడ శాంతమ్మనా’ అని అడుగుతున్నట్లు గోచరించింది.

“ఔను. నిజమే... యీవిడ శాంతమ్మనే... ఈచంటి బిడ్డ నాప్రాణం” అనేసరికి మ్రాన్పడి పోయింది అన్నపూర్ణ.

శ్రీనివాస్ గతాన్ని చెప్ప సాగాడు...

“స్త్రీకి పురుడు ఒక పునర్జన్మ అంటారు. కాని ఆ తల్లి తిర్గి జన్మించలేదు. ఈబాబు పుట్టగానే బాలింత రోగంతో పరలోకం పోయింది...” శ్రీనవాస్ గొంతు కూరుకు పోయింది. కాసేపు మౌనంగా ఉండి పోయాడు. కంటినిండా కన్నీళ్ళు... గొంతు సవరించుకున్నాడు.

“ఈబాబుకు పోత పాలు సరిపడలేదు. వాంతులు... విరేచనాలు... దినం, దినం కృశించి పోసాగాడు. గేదె పాలు, ఆవు పాలు పట్టినా ఫలితం శూన్యం. డాక్టర్లు తమ అసహాయతను వ్యక్తం చేస్తూ ఒక సలహా యిచ్చారు. ఎవరైనా మాతృమూర్తి దయ తలచి తన చనుబాలిస్తే, ఒక వేళ అవి సరిపడితే... కొడుకు తప్పకుండా బ్రతుకుతాడని ఎవరినైనా అడిగి చూడమన్నారు. అప్పుడు అదే హాస్పిటల్‍లో పురుడు పోసుకొన్న శాంతమ్మ విషయం తెలుసుకొని తాను పాలి ఇస్తానని బాబును పొత్తిళ్ళలోకి తీసుకొంది. ఆబాబు అదృష్టం బాగుంది... భూమ్మీద నూకలున్నాయి. ఆ మహాతల్లి పాలు సరిపోయాయి. దాదాపు మూడు సంవత్సరాలు తన కొడుకుతో బాటుగా ఈ బాబుకూ పాలిచ్చింది. బాబు బతికి బట్ట కట్టాడు. ఆ ఫోటోయే యిది... ”

“అయితే శాంతమ్మకీ దుస్తుతి ఏమిటి... ? మీరెలా గుర్తు పట్టారు... ఈ బిడ్డ ఎవరు... ?” అంటూ ఆతృతగా శ్రీనివాస్ మాటలకు అడ్డు తగిలి ప్రశ్నల వర్షం కురిపించింది అన్నపూర్ణ.

“శాంతమ్మకు అప్పుడది రెండవ కానుపు... తొలుసూరు కూడా అబ్బాయే. రెండవ అబ్బాయి అయిదేండ్ల ప్రాయంలో భర్తను కోల్పోయింది. ఈబిడ్డ తండ్రి శత విధాలుగా శాంతమ్మను ఆదుకోవాలని ప్రయత్నించాడు. కాని శాంతమ్మ అవకాశమివ్వలేదు. తన చనుబాలు అమ్ముకోలేదని సున్నితంగా తిరస్కరించేది. పైగా లోకం పలు గాకులు... నిందలు మోయవలసి వస్తుందనే భయంతోనో ఏమో...! యిల్లు ఖాళీ చేసి బిడ్డలను తీసుకొని తన పుట్టింటికి వెళ్ళి పోయింది. శాంతమ్మ పుట్టింటి వారిదీ అరా, కొరా సంసారమే... అయినా శాంతమ్మ ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధార పడలేదు... కూలీ నాలీ చేసి పిల్లలను చదివించింది... పెళ్ళిళ్ళు చేసింది. శాంతమ్మ అవసరమున్నంత కాలం పిల్లలు ఆమెను ఆదరించారు. తర్వాత భారమనుకొని వదిలించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసి ఈబిడ్డ తండ్రి సర్ది చెబుతామని ఆ ఊరు వెళ్ళాడు. శాంతమ్మ కొడుకులు అతన్ని అనుమానించి నానా మాటలు అన్నారు. ఆ అవమానం భరించలేక ఆ వృత్తాంతమంతా రాసి ఈఫోటోలో భద్రపర్చాడు... అదే రాత్రి హార్ట్ ఎటాక్... ఈలోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఆ ఉత్తరంలో అతను రాసిన చివరి మాట ‘శాంతమ్మ ఋణం తీరనిది’ అని’’.

శ్రీనివాస్ కళ్ళు కన్నీటి కడవలయ్యాయి. మాట్లాడలేక పోతున్నాడు... మౌనంగా రోదించసాగాడు...

“శాంతమ్మ దొరకనిదే యీ విషయం ఎవరికీ చెప్పొద్దను కొన్నాను. నాపెన్షన్‍కు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాక గత ఆదివారం శాంతమ్మ ఊరెళ్ళాను. శాంతమ్మ చనిపోయిందంటూ దండ వేసిన ఆమె ఫోటోను చూపించారు ఆమె కొడుకులు. నేను చాలా బాధ పడ్డాను. తిరిగి వస్తుంటే దారిలో ‘శాంతమ్మ చనిపోలేదని కొడుకులే ఆమెను ఎక్కడో వదిలేసి వచ్చి నాటకాలాడుతున్నారని’ నా స్నేహితుడు చెప్పాడు. నామనసు కాస్తా నెమ్మదించింది. శాంతమ్మను ఎలాగైనా వెదికి పట్టుకోవాలనే ఆరాటం మొదలైంది. అనుకోకుండా మనకు యీరోజు తారస పడింది. దండ వేసిన ఆమె ఫోటో చూసే గుర్తుబట్టాను. తన చనుబాలతో తనకేమీ కాని ఒక బిడ్డకు ప్రాణ దానం చేసిన శాంతమ్మ దేవతా మూర్తి బాగోగులు చూసుకునే బాధ్యత తీసుకుందామనుకుంటున్నాను అనూ... ” అంటూ వేడుకునే ధోరణిలో శ్రీనవాస్‍ను చూసి అన్నపూర్ణ అడ్డు పడింది.

“ఎవరి బిడ్డకో ఈవిడ పాలిస్తే మనమెందుకు ఆదరించాలి?’’ అంటూ కొంచెం పరుషం ప్రదర్శించింది. అందులో ‘ఎవరీ బిడ్డ’ అనే ప్రశ్న మిళితమై ఉంది.

అది అర్థం చేసుకున్న శ్రీనవాస్ “ఆబిడ్డ ఎవరో కాదు. అనూ...! నేనే...” అంటుండగా దుఃఖం పొంగుకొచ్చింది.. గొంతు కూరుకు పోయింది. అన్నపూర్ణ నిశ్చేష్టురాలైంది...

ఇద్దరిమధ్యా పది నిముషాలు మౌనం ఆవహించింది...

“శాంతమ్మకు మనమెవరమో తెలియకుండా ఉంటేనే మంచిదను కుంటాను... అసలే ఆత్మాభిమానం ఎక్కువ...’’ అంటున్న శ్రీనివాస్‍కు మద్దతు తెలిపింది.

“శాంతమ్మ మనకు తల్లి లేని లోటు తీర్చిందండీ... నిజమే మామ గారు అన్నట్లు శాంతమ్మ ఋణం తీరనిది...’’ అంటూ శ్రీనవాస్ గుండెపై తల ఆన్చింది అన్నపూర్ణ.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు