‘‘ యూ ఆర్ అవుట్ డేటెడ్’’ పరుషంగా అన్నాడు ఆ పత్రికా సంపాదకుడు.
నేనేదో అల్లాటప్పా రచయితనయితే ఈ విషయానికి అంత బాధపడకపోదును. మూడు దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్నవాడిని. అందుకే విలవిలలాడిపోయాను.
‘‘ మీరు కొత్తగా ఆలోచించలేకపోతున్నారు. మారిన సమాజాన్ని అర్ధం చేసుకోలేకపోతున్నారు. పాఠకుల అభిరుచులను సరిగా అంచనా వేయలేకపోతున్నారు. ఈ లోపాలన్నీ మీ రచనల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి’’ అతను వయసులో చిన్నవాడయినా తన అభిప్రాయాన్ని సూటిగా చెబుతున్నాడు. నేనే వాటిని జీర్ణించుకోలేకపోతున్నాను.
నేను కథ అలవోకగా రాయగలనన్న పేరుంది. ఏ సమయంలో కలం పట్టుకున్నా చకచకమని పరుగులు తీస్తుంది. మూడు నాలుగు గంటల్లో ఓ రూపం సంతరించుకుంటుంది. కథల పోటీకి రాశానంటే... ఖచ్చితంగా మొదటి రెండు బహుమతుల్లో ఒకటి నాదే. కొన్ని సంవత్సరాలపాటు నా దూకుడు కొనసాగింది. ఈ మధ్యనే ... కారణం తెలియదు గానీ నేను రాసిన వన్నీ గోడకు కొట్టిన బంతుల్లా తిరిగి రావటం మొదలయ్యింది. నాలో అసహనం పేరుకుపోయింది.
కారణం అర్ధంకాక తలపగలగొట్టుకుంటున్నాను. కొందరు సంపాదకులను కలిసే ప్రయత్నం చేశాను గానీ...వాళ్లు మొహం చాటేశారు..
చివరికి ఇదిగో ఇతగాడి ముందు కూర్చోవలసిన పరిస్థితి దాపురించింది. నన్ను నేను తిట్టుకున్నాను.
‘‘ ఇలా మొహం మీద అంటున్నందుకు మరోలా భావించకండి’’ అన్నాడు తనే.
రంగులు మారిన నా మొహం చూసి నేను నొచ్చుకున్నానని గ్రహించినట్టున్నాడు. నన్ను మెత్తబరిచే ప్రయత్నం చేస్తున్నాడు.
‘‘ మీ కథల్లో నిజాయితీ ఉంటుంది. పాత్రల మానసిక స్వభావాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబుతారన్న పేరుంది. ఎత్తుగడలోనే మీదో ప్రత్యేక పంథా.. ఇవన్నీ ఇప్పటి రచనల్లో మచ్చుకయినా కనిపించటంలేదు... రచనల కంటే అవి తెచ్చే పేరు ప్రఖ్యాతుల గురించి ఆలోచించినప్పుడే వస్తుంది ఈ ఇబ్బందంతా... ’’
అరటిపండు ఒలిచినట్టు అతను మాట్లాడుతున్నాడు. నాలో లోపాలను తవ్వి పోస్తున్నాడు నా ముందే.
అప్పుడు గుర్తొచ్చింది. ‘‘ ఈ మధ్యనే నా స్నేహితులంతా కలసి నాకు బ్రహ్మాండమైన సన్మానం ఏర్పాటు చేశారు. ముఫై ఏళ్లు రచయితగా పూర్తి చేసుకున్నందుకు.
ఆ సభలోనే నన్ను ఆకాశానికి ఎత్తేశారు. వంద మందికిపైగా రచయితలు వచ్చినట్టు గుర్తు. ఇప్పుడు ఆలోచిస్తుంటే.. అప్పట్నుంచే నా పతనం ప్రారంభమైందనిపిస్తోంది.
ఏదో గొప్పగా రాయాలని అనుకునేవాడిని. చివరికి అది విఫల ప్రయత్నంగా మిగిలిపోయేది. సంపాదకుడు చెబుతుంటే అంతా అర్ధమవుతోంది.
‘‘గొప్పరచయితనన్నఅహం నన్ను దెబ్బతీసిందేమో...
ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను రాయటం మానేయటమే మంచిది..’’ అనుకున్నాను.
అదే మాట సంపాదకుడికి చెప్పి వెనుదిరిగాను.
ఏడాది తర్వాత...
ఆ పత్రిక నిర్వహించిన దీపావళి కథల పోటీలో ‘పునరుత్థానం’ కథకు ప్రధమ బహుమతి లభించింది. ఓ అగ్రరచయిత ప్రాభవం కోల్పోవటం ఇందులో కథాంశం. సాటి రచయితలకు ఇదెంతో ప్రయోజనకరమని.. సంపాదకుడు రచయితను ఆకాశానికెత్తేశాడు.
ఆ రచయిత మరెవరో కాదు.
అది నేనే.