నిజం? - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

nijam?

ఆ కాలనీలోకి అడుగుపెడితే గోవిందమ్మ విజయమ్మ కనిపిస్తారు జంటగా.

వాళ్ళెవరు అనుకుంటున్నారా? చెబుతా!

వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితురాళ్ళు. వేరు వేరు శరీరాలయినా ప్రాణం ఒక్కటే! ఇరవైఏళ్ళ క్రితం అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటున్న ఆ కాలనీలో మొదటగా ఇల్లు కట్టుకున్నది వాళ్ళిద్దరేనంటారు. చిన్న పిల్లలతో వచ్చారు. ఇప్పుడు పెద్దవాళ్ళయి చదువులు పూర్తి చేసుకున్నారు.

నాలుగునెలల నుండీ గోవిందమ్మకి కొన్ని సమస్యలు వస్తున్నాయి. బొత్తిగా మనశ్శాంతి వుండడం లేదు.

తన భర్తకి ఒంట్లో బాగుండడం లేదు. ఎన్ని హాస్పిటల్లకి తీసుకెళ్ళినా రోగమేంటో తెలియడంలేదు. డాక్టర్లకి మందులకి బోలెడంత కర్చవుతోంది. ఇప్పుడు ఒక్కగానొక్క కొడుక్కి కూడా జ్వరం వచ్చి తగ్గడం లేదు.

విజయమ్మ దాదాపుగా గోవిందమ్మని అంటిపెట్టుకునే వుంటోంది. ఆమె మనసు కూడా కకా వికలంగా వుంటోంది.

ఒక రోజు పొద్దున్నే కసువూడ్వడానికి బయటకొచ్చింది గోవిందమ్మ. కొంత జుట్టు..కుంకం కనిపించింది. దాన్ని చీపురుతో తోసుకుంటూ దూరంగా తీసుకెళ్ళి చెత్త కుండీలో వేసింది. అవి చూశాక ఆమెకి మనసంతా వికలమైపోయింది.

ఇంట్లోకొచ్చింది.

వాళ్ళాయనకి పిల్లలకి కాఫీ కలిపిస్తున్నంతలో విజయమ్మ వచ్చింది..ఆమెకి ఒక కప్పు కాఫీ ఇచ్చి వాకిట్లో కనిపించిన వాటిగురించి చెప్పింది.
దానికి విజయమ్మ తేలిగ్గా నవ్వేస్తూ"అవేదో గాలికి కొట్టుకొచ్చి వుంటాయి..మనసులో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ముందు మీ ఆయనకి..పిల్లాడికి రోగం తగ్గడం మీద దృష్టిపెట్టు"అని"వంట చేసి మా ఆయనకి పిల్లలకి టిఫిన్లో సర్ది వాళ్లని పంపించి వస్తాను" అని వెళ్ళిపోయింది.

గోవిందమ్మకి ఏమీ పాలుపోవడం లేదు. ఆలోచనలు పరి పరి విధాల పోతున్నాయి. ’అసలు పేరు తెలియని రోగాలు భర్తని పిల్లాడిని పీడించడమేమిటి? నిజంగానే చేతబడి..బాణామతి లాంటివి వున్నాయా? సైన్స్ అవేమీ లేవని కొట్టిపడేస్తుందేమిటి? నిజానికి సైన్స్ కి అందనివి సృష్టిలో చాలా వున్నాయి. ఎన్నెన్నో జరుగుతున్నాయి. వింతలూ విడ్డూరాలు అని వదిలేయడం లేదూ. కొన్ని దేవుళ్ళగుడుల్లోని ప్రత్యేకతలు..బాబాలు, మాంత్రికుల చమత్కారాలు..సైన్స్ కి అందుతాయా?’ ఇలా ఆలోచనలు అనూహ్యమవుతున్నప్పుడు "అమ్మా! అంటగిన్నెలు..గుడ్డలు వేస్తే నా పని నేను చేసుకుని త్వరగా వెళ్ళిపోతాను"అన్న పనిమనిషి చంద్రి మాట గోవిందమ్మని ఈ లోకంలో పడేసింది.

"చంద్రీ నిన్నోటి అడుగుతాను చెబుతావా?" అంది.

"నాకు తెలిసిందైతే ఎందుకు చెప్పనమ్మగారూ"

"అసలు అతీంద్రియ శక్తులున్నాయంటావా?"

"అంటే ఏంటమ్మగారూ?"

"అదేలేవే..చేతబడి..బాణామతి లాంటివి.."

"ఎందుకుండవమ్మగారూ..దేవుడుంటే..దెయ్యముంటది..మంచివుంటే..చెడూ వుంటదీ..మా ఊర్లో ఎంతోమంది వాటి మూలంగానే సచ్చిపోయారు.. చిన్న చిన్న తగాదాలకి కూడా కుట్రలు..కుతంత్రాలేనమ్మగారూ..అందుకే ఊర్లనుండి ఇక్కడికొచ్చి సల్లగా పనిచేసుకుంటున్నాం"అంది.

"నీ ఎరికలో ఎవరికన్నా జరిగిందా?"

"ఎవరికో ఎందుకమ్మా..మా అమ్మకే! మా ఇంటికి నాలుగిల్లవతల వుండే రాజమ్మకి మా అమ్మకి ఒకసారి పెద్దగొడవొచ్చింది. వాళ్ళకీ మాకూ వైరం ఎంత పెరిగిపోయిందంటే..దారిన పోతున్నప్పుడు ఎదురైతే తిట్టుకుంటూ..శాపనార్దాలు పెట్టుకుంటూ..వుండేవాళ్ళం. మేము మా నోర్లకే పని చెప్పాం..కాని ఆళ్ళు కాస్త ముందుకెళ్ళి చేతలు మొదలెట్టారు. మా అమ్మకి పేరు తెలియని రోగమొచ్చి తెగ బాధ పడిపోయింది. గొంతు కోసిన కోడి గిల గిల్లాడి పోయినట్టు గొప్ప నరకం అనుబవించింది. అట్టా బాద పడతానే ఓ రోజు ప్రాణం ఇడిచింది. ఆ తర్వాత్తెలిసింది. అది ఆ రాజమ్మ పనే అని. ఊరు ఊరంతా ఏకమై దాన్ని ఊర్లోనుండి పంపించేశాం. కాని ఏం లాబమమ్మా..అమ్మ తిరిగి రాలేదు కదా" చెప్పింది కన్నీరుకారుస్తూ.

"మా ఆయనకి రోగమొచ్చి నాలుగు నెలలయింది నీకు తెలుసుగా చంద్రీ..ఇప్పుడేమో మా అబ్బాయికి..ఎన్ని హాస్పిటల్లు తిప్పామో నీకు తెలుసుగా..ఏ॑ వ్యాధో తెలియడం లేదు. నాకూ అదేనేమో అనిపిస్తోందే..వాళ్ళేమయిపోతారో అని బెంగగా వుందే!"అని పొద్దున్న తనకి వాకిట్లో కనిపించిన వాటి గురించి చెప్పింది.

"అవునా అమ్మగారూ..నాకూ అదే అనుమాన ముండేదండీ! కానీ చెబితే మీరేమనుకుంటారోనని..."

"నీ మొహం..నాకు చెప్పొద్దుటే..సమయం మించిపోతే ఏం ప్రయోజనం..అయినా నాకు శతృవులెవరున్నారే?"

"అయ్యో మీరు బొత్తిగా పిచ్చి మాలోకమండి. హాని చేయాలంటే శతృత్వమే వుండనక్కర్లేదు. మనకన్నా ఎదుటివాళ్ళు బాగుపడిపోతున్నారన్న అసూయ చాలదూ..!"

"సర్లే..సర్లే..నువ్వు పని మొదలెట్టు..నేను వీళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి" అంది.

మధ్యాహ్నం భోజనాలయాక కాస్త మాగన్నుగా కునుకు పట్టింది గోవిందమ్మకి. ఎవరో ఇంట్లో తిరుగుతున్నట్టుగా అనిపించి అధాటున నిద్రలేచి చుట్టూ చుసింది. కిటికీకేసిన కర్టెన్ ’రఫ..రఫ’ చప్పుడు చేసి ఆగిపోయింది. ఏదో గాలి కిటికీలోంచి వెళ్ళిపోయినట్టుగా...

గోవిందమ్మకి దాహంతో నాలుక పిడచకట్టుకపోయింది.

ఆ రాత్రి కూడా ఎవరో తన మంచం దగ్గరగా కూర్చున్నట్టు.. తన గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపించసాగింది.

మరుసటిరోజు ఉదయం.

కసువూడ్వడానికి చీపురుతో బయటకొచ్చిన గోవిందమ్మకి వాకిట్లో ఎముక కనిపించింది. అంతే గుండె చిక్కబట్టుకపోయింది.
దాన్ని చీపురుతో తోసుకుంటూ చెత్తకుండీలో వేసింది.

ఇంటి పనులు చేస్తొందన్న మాటేగాని చంద్రి మాటలు మెదడుపొరల్లో దొర్లుతున్నాయి. ‘హాని చేయాలంటే శతృత్వమే వుండనక్కర్లేదు. మనకన్నా ఎదుటివాళ్ళు బాగుపడిపోతున్నారన్న అసూయ చాలదూ..!’

తనని చూసి అసూయపడేవాళ్ళెవరున్నారు? చుట్టాలందర్నీ మనసుతో చుట్టి వచ్చింది.. ఊహూ!.. చుట్టు పక్కలున్నవాళ్ళు..కాదు..మరీ..? అప్పుడనిపించింది..ఒకవేళ విజయమ్మేమోనని..అవును విజయమ్మే!

‘నాకు ముగ్గురూ ఆడపిల్లలే..మా ఆయనదా ప్రైవేట్ ఉద్యోగం..దిన దిన గండం నూరేళ్ళాయుష్షు. వాళ్లకి పెళ్ళిల్లు..బాధ్యతలు..తల్చుకుంటుంటే..నిద్రపట్టదు..గోవిందమ్మా..నీ అదృష్టం చూడు మీ ఆయన గవర్నమెంట్ ఉద్యోగి..కడుపులో చల్ల కదలదు..పైగా ఒక్కగానొక్క కొడుకు..వచ్చేదే కానీ పోయేది వుండదు.. అయినా పెట్టిపుట్టాలిలే..నీలాగా!’ ఎన్నోసార్లు అంది. తనే పిచ్చిమొహంది నవ్వి వూర్కొనేది. ఇది దాని పనే అయివుంటుంది. పక్కనే శతృవునుంచుకుని ఇంతకాలం గడిపింది. నంగనాచి..ఎంతకు తెగించింది..పాపభీతి కూడా లేదు..

అప్పుడే వచ్చిన చంద్రితో వాకిట్లో ఎముక కనిపించిన విషయం చెప్పి.."నువ్వన్నది నిజమేనే! మామీద ఎవరో దుష్ట శక్తులు ప్రయోగిస్తున్నారు. మా ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయి. ఇహ మనం కాలం వృధా చేయరాదు..నీకెవరన్నా మంత్రగాళ్ళు తెలుసా?"అడిగింది ఆందోళనతో ఆపాదమస్తకం కంపించిపోతూ..

"తెలుసమ్మగారు..దర్గా పక్కనున్న సందులో వుంటాడు..సాయంత్రం తీసుకెళతాను.."అంది.

"చెప్పాకదటే ఇహ మనం ఉపేక్షించకూడదని..ఇప్పుడే వెళదాం"

"సరే..పదండి"

ఇద్దరూ వెళుతుంటే..అప్పుడే వచ్చిన విజయమ్మ "పొద్దు పొద్దున్నే ఎక్కడికి బయల్దేరావు గోవిందమ్మా?"అంది నవ్వుతూ.

ఆమెకి సమాధానం చెప్పలేదు.

ఇద్దరూ మంత్రగాడింటికి వెళ్ళారు.

అతడింటిలోని వాతావరణమే..పుర్రెలతో..ఎముకలతో..నిమ్మకాయలతో..ఎర్రని..నల్లని తాళ్ళతో..ముగ్గులతో భీతిగొలిపేలా వుంది.
గోవిందమ్మ చెప్పేది సావదానంగా విన్న ఆ మంత్రగాడు.."నీకు కీడు తలపెట్టినది నీకు చాలా దగ్గర్లోనే వుంది..నీ కళ్లకి పొరలుకమ్మి కనిపెట్టలేకపోతున్నావు..నీ ఉన్నతి..దానికి మా చెడ్డ యాతనగా వుంది..అందుకే అట్టా చేసింది..ఆస్పిటల్ల చుట్టు తిరిగి డబ్బు పోగొట్టుకుంటే..ఏంలాబం?..నీ టైం బాగుండబట్టి..నా దగ్గరకు వచ్చినావు..లేకుంటే..జీవితకాల నట్టం జరిగి కుమిలిపోయేదానివి..దీనికి ఇరుగుడుచేయాలంటే..డబ్బు కర్చవుతాది..నీకు ఓపికుండాలె! నువ్వు సరే నంటే ఈ సరకులు..పైకం తీసుకుని వచ్చే ఆదివారం ఈడకి రా.అంతా సక్కగా జరుగుతది" అన్నాడు.

గోవిందమ్మ "సరే"అని ఒప్పుకుని..ఇంటికొస్తూ దారిలో "చంద్రీ సమయానికి దేవుడు నిన్ను పంపించాడే..ఇతడి దయవల్ల మా ఆయనకి..పిల్లాడికి నయమై చక్కగా తిని తిరిగితే..నీకు పట్టుచీర పెడతాను..నిన్ను సొంత తల్లిలా చూసుకుంటానే.."అంది ఆనందంగా.
"సర్లెండమ్మగారు! మీరు సుకంగా సంతోసంగా వుంటే నాకదే పదివేలు"అంది.

"నాకు హానిచేస్తున్నది ఎవరనుకుంటున్నావు?..నేను ముందు కాస్త అనుమానించాను..మంత్రగాడి మాటలతో రూఢీ అయిపోయింది. ఇది కచ్చితంగా ఆ విజయమ్మ పనే! దానికి ఎన్నో సహాయాలు చేశాను.

అవసరానికి డబ్బు..వస్తువులు..పదార్ధాలు ఇచ్చాను. విశ్వాసం లేదు. నాకే ద్రోహం తలపెట్టింది."కోపంగా అంది.

"నాకూ చాలాసార్లు అనిపించిందమ్మా! కానీ చెబితే మీరేమనుకుంటారో అని భయపడేదాన్ని. మీరు ఎవరికీ అంత చొరవ ఇవ్వకూడదండీ. ఆనక బాదపడి ప్రయోజనమేమిటి? కొన్ని నష్టాలు మనకి జీవితాన్నే లేకుండా చేస్తాయి."

"నిజమేనే..నాలుగిల్లలో పనిచేసే నీకున్న పాటి ఇంగితజ్ఞానం..లోక జ్ఞానం నాకు లేకుండా పోయాయి"

ఇంటికొచ్చాక..తనింటి గుమ్మందగ్గర ఆందోళనతో కూర్చున్న విజయమ్మని చూడగానే గోవిందమ్మలోని నల్లత్రాచు సర్రున లేచి పడగ విప్పింది.

"ఏంటి గోవిందమ్మా! మాట మాత్రం చెప్పకుండా ఎక్కడికెళ్లావు? నాకెంత ఆందోళనగా అనిపించిందో తెలుసా?"అంది.

"అబ్బో..చెబితే ఏం చేసేదానివి..అవరోధాలు కల్పించేదానివి..అవునులే..రక్తసంబంధం కన్నా ఎక్కువగా చూసుకున్నందుకు బాగానే బుద్ధి చెప్పావు. కుక్కకున్న పాటి విశ్వాసం కూడా లేదు నీకు. కాని నా గొంతులో ప్రాణం వుండగా నీ ఎత్తులు పారనివ్వను. నీ అంతు తేలుస్తాను..ఆఁ..ఏంటనుకుంటున్నావో..నాలోని మరో గోవిందమ్మని చూస్తావు నువ్వు"అంది కోపంతో ముక్కుపుటాలెగరేస్తూ.
ఆవిడకి విషయం అర్ధంగాక.. విస్తుపోతూ.."అదికాదు..గోవిం.."అనబోతున్న విజయమ్మని మధ్యలోనే"ఇంకోసారి నా పేరు పిలిచినా..నా ఇంటి వైపు కన్నెత్తి చూసినా..మర్యాదుండదు" అని లోపలికెళ్ళి తలుపేసుకుంది.

ఆ హఠత్పరిణామానికి కళ్లనీళ్ళ పర్యంతమవుతూ..పరిగెత్తుకుని తనింటికెళ్ళిపోయింది విజయమ్మ.

ఆరోజు మొదలు విజయమ్మ కనిపిస్తే సాధించడం మొదలెట్టింది. పోట్లాటకి కాలుదువ్వుతూ..కనిపించిన వాళ్లకల్లా ఆవిడ గురించి లేనిపోనివి చెబుతూండేది గోవిందమ్మ.

ఇహ ఆ కాలనీలో వుండడం నరకప్రాయంగా తోచి ఒకరోజు ఇల్లు ఖాలీ చేసి ఎక్కడికోవెళ్ళిపోయింది విజయమ్మ.

పీడ విరగడైంది అనుకుంది గోవిందమ్మ.

గోవిందమ్మ భర్తకి, పిల్లాడికి ఆరోగ్యం కుదుటపడింది. దానికి కారణం ఆ మంత్రగాడేనని గోవిందమ్మ నమ్మకం.

కథలో కనిపించని మరో పార్శ్వం:

సంజెచీకట్లు ముసురుకుంటుండగా..గోవిందమ్మ ఇంటికి రెండిళ్ళవతల వుండే రుక్మిణమ్మ ఒకరోజు జుత్తు చిక్కుతీసుకుంటూ చేతిలోకొచ్చిన జుత్తుని చుట్టచుట్టి అప్పుడే ఆటాడటానికి బయటకెళుతున్న బాబిగాడికిచ్చింది. వాడు అది అందుకుని విసురుగా తిరిగేసరికే పక్కనున్న కుంకంభరిణ తగిలి కుంకం కింద ఒలికిపోయింది. వాడు వాళ్లమ్మతిట్టే లోపల కిందపడింది ఎత్తి ఆ జుత్తుతో పాటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి గోవిందమ్మ వాకిట్లో పారవేశాడు. అదే అనుమానానికి కారణభూతమయింది. అలాగే కుక్క తనకి దొరికిన ఎముకని యాధృచ్చికంగా గోవిందమ్మవాకిట్లోనే జారవిడిచింది. ఆవిడ భర్తకి, పిల్లాడికి వచ్చిన వ్యాధులు కూడా కాలానుగుణంగా తగ్గాయే కాని.. మంత్రగాడి మంత్రాలకి కాదు. ఇవెలా తెలుస్తాయి?

బహుశా ఈ విషయాలు తెలిస్తే..అకారణంగా విజయమ్మని ద్వేషించినందుకు తనని తను క్షమించుకోలేదేమో గోవిందమ్మ! విజయమ్మలాంటి మంచి స్నేహితురాల్ని కోల్పోయినందుకు జీవితాంతం బాధపడుతుందేమో కూడా!

మనిషి చాలా వరకు భ్రమలకి లోనై అనుమానాలతో కాలం గడుపుతూంటాడు. సరిగ్గా గోవిందమ్మలాంటి బలహీన మనస్కులే చంద్రి..మంత్రగాడిలాంటివాళ్ళకి బలం.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి