కామదహనం - చెన్నూరి సుదర్శన్

kamadahanam

తెల్లవారితే హోళీ పండుగ...

శశిధర్ గుండెల్లో రైళ్ళు పరుగెత్త సాగాయి...

రాత్రి భోజనం సరిగ్గా సహించడం లేదు...

గబ, గబా నాలుగు మెతుకులు బలవంతంగా నోట్లో కుక్కుకొని భోజనం పూర్తయిందనిపించుకున్నాడు.

వేగంగా తన బెడ్‍రూంలోనికి వెళ్ళి గడియ పెట్టుకున్నాడు.

కాళ్ళు చేతులు వణుక సాగాయి...

తప్పదు. ‘ఎలాగైనా తాను అనుకున్న పని నెరవేర్చి తీరాలి. తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కగూడదు. చివరికి నాప్రాణం పోయినా సరే. కాని హిమజను ప్రాణాలతో వదలను.. ఆమె బతుకు బండలు కావాల్సిందే... ’ అనే ఆలోచనలు శశిధర్ మదిలో చెలరేగిన కొద్దీ గుండెలో ధైర్యం గూడు కట్టుకుంటోంది. క్రమేణా నరనరాల్లో రక్తం ఉప్పొంగ సాగింది.

ధృఢ నిశ్చయముతో కార్యోన్ముఖుడయ్యాడు...

తాను కాలేజీ నుండి నేర్పుగా దొంగిలించి తెచ్చిన గాఢ సల్ఫ్యూరిక్ ఆసిడ్ బాటిల్ మూత తెరిచాడు. సన్నని తీగల్లా పొగలు...

హోళీ రంగుల మిశ్రమం కొద్ది, కొద్దిగా ఆసిడ్ బాటిల్‍లో కలుపసాగాడు... చిన్న, చిన్న బుడగలు... విచిత్రమైన శబ్దాలు... దట్టమైన పొగలు బాటిల్ నిండా క్రమంగా అలుముకోసాగాయి... అతని మనసులో ప్రతీకార వాంఛలు రగులుకుంటున్నట్లు. గుండెల్లో ఎగిసి పడే విషపు జ్వాలలు అతని కళ్లళ్లో క్రౌర్యం ప్రతీకగా అద్దం పడుతోంది.

‘మరి కొద్ది గంటల్లో నీకోరిక తీరబోతోంది కదా... ఎందుకా గాబరా’. అని ఎంత నిభాయించుకుందామనుకున్నా వయసు పొగరు ఆగడం లేదు.

పదే, పదే అదే సంఘటన జ్ఞప్తికి వస్తూ అతడిని రెచ్చగొడ్తోంది.

హిమజకు ఎంత పొగరు!...

ఎంతో సిన్సియర్‍గా ప్రేమించే నన్ను తిరస్కరిస్తుందా!.. తనకేం తక్కువని?.

మిస్టర్ కాలేజీ అవార్డు గ్రహీత... కాలేజీ విద్యార్థుల అగ్రనేత... ఆటల్లో అందె వేసిన దిట్ట... జన బలం కల్గిన పిత... మహిళా మండళి ప్రెసిడెంటు మాత... ఒక్కగానొక్క చెల్లెలు సుస్మిత... ’ ఇలా కవితా ధోరణిలో ఆలోచించడం శశిధర్ కవితలు వ్రాయడంలోనూ సమర్థుడు అని తెలుస్తోంది... చదువులోనూ డిస్టింక్షన్ కూడా.

‘ఇలాంటి కుటుంబంలోనికి కోడలుగా రావాలంటే ఎంతో పుణ్యం చేసుకొని పుట్టాలి. ఓ రకంగా మా కుటుంబ సభ్యురాలిగా మెదిలే హిమజ తిరస్కరిస్తుందా?’ శశిధర్ ఆలోచనలు ఆగిపోవడంలేదు... మనసులో అగ్ని పర్వతాలు బద్ధలౌతున్నాయి’. డిగ్రీ ప్రథమ సంవత్సరం నుండి తన మనసును అర్థం చేసుకోవాలని దురుసుగా కాకుండా దువ్వెనలా(తూనీగలా) సమీపించే నాపై దుముకులాడుతోంది... ఎంత అహంకారం!’. శశిధర్ బుర్రలో ప్రతీకార పురుగు తొలుస్తూనే ఉంది.

ఆవాళ్టి సంధ్యా సమయం ఎలా మర్చిపోగలడు?. తన పగ, ప్రతీకారానికి పునాది పడిన రోజు.

కాలేజీ పార్కులో ఇసుక తిన్నెపై తనొక్కతే శ్రద్ధగా చదువుకుంటోంది హిమజ. ఫైనలియర్ ఫైనల్ సెమిస్టర్‍కు తెరపడే రోజులవి. దరి దాపులో ఎవరూ లేరు.. ‘ధైర్యే సాహసే లక్ష్మి’ అని ధైర్యం తెచ్చుకున్నాడు శశిధర్.

తన ఇంటిప్రక్కనే ఉంటుంది కదా... పరీక్షలయ్యాక మరోమారు విషయం కదిలిద్దామనుకున్నాడు. మనసు కుదుట పడడం లేదు. ఇంటికన్నా పార్కే నయమనిపించింది. ఈరోజు అటో, ఇటో తేల్చేసుకోవాలకున్నాడు. హిమజను సమీపించాడు.

పుస్తకంలో లీనమైన హిమజ శశిధర్ రాకను గమనించ లేదు.

“హాయ్!..” అంటూ పలకరించాడు శశిధర్... ఆ పలకరింపులో ‘ఎంత హాయి, ఈరేయి ఎంత మధురమీహాయీ...! ’ అనే సప్త స్వరాల గానం వీనుల విందుగా హృదయాన్ని మీటుతూ ఉంది.

తృళ్లి పడి తల పైకెత్తింది హిమజ. తనకు తెలిసిన ఫ్రెండ్ అనుకొని మర్యాద పూర్వకంగా తనూ “హాయ్!...” అనబోయి, తనను తరుచూ వేధించే శశిధర్ అనుకోకుండా ప్రత్యక్షమయ్యే సరికి తడబడింది. ఆ తడబాటులో ‘ఏమిటి.. ?’ అనే ప్రశ్న ముడి పడి ఉంది..

అలాంటి ప్రశ్న కోసమే వచ్చిన శశిధర్ కాస్తా ధైర్యం పుంజుకొని తన మనసులోని విషయం మళ్ళీ ఏకరువు పెట్టాడు...

“హిమజా... నువంటే నాకు చాలా ఇష్టం... నిన్ను గత మూడు సంవత్సరాలుగా ఆరాధిస్తున్నాను. నామనసుకు నచ్చావ్!”

హిమజ ముఖం వివర్ణమైంది...

“పిచ్చి, పిచ్చి వేషాలు కట్టి పెట్టి ముందు చదువు సంగతి చూసుకో శశిధర్... ఆతర్వాత జీవితంలో స్థిరపడే ప్రణాళికల గూర్చి ఆలోచించుకో... కాని ఇలా ప్రేమ, గీమా అంటూ అంటువ్యాధిలో కూరుకు పోకు. ఎన్ని సార్లు చెప్పాలి?” అంటూ చిరు కోపం ప్రదర్శించింది. అందులో శశిధర్‍తో తనకున్న సాన్నిహిత్యం ప్రస్ఫుటమవుతోంది.

“శశిధర్!.. ప్రతి మనిషిలో మానవత్వం, రాక్షసత్వం రెండూ ఇమిడి ఉంటాయి. బాంబులు పెట్టి ప్రాణాలు హరించేది మనిషే... బాంబు దాడిలో గాయ పడిన వారికి రక్తం దానం చేసి మనుషులను రక్షించేదీ మనిషే... రాక్షసత్వాన్ని జయించిన మనిషి మహనీయుడు. మానవత్వాన్ని కోల్పోయిన మనిషి దానవుడు. నీలో అమోఘమైన శక్తి దాగి ఉంది. దాన్ని సద్వినియోగపర్చుకో శశిధర్. నీమంచికే చెబుతున్నాను..” అంటూ ఓ చిన్న పాటి ఉపన్యాసమే ఇచ్చింది హిమజ.

అయినా శశిధర్ మనో నేత్రం తెరుచుకోలేదు. ‘చెవిటి వాని ముందు శంఖమూదినట్లే’.

మనిషికి కామ పొరలు కమ్మినప్పుడు సుద్ధులేవీ తలకెక్కవు...

మన పవిత్ర రామాయణంలో రావణుణ్ణి రావణబ్రహ్మ అనే వారు... అతను మహా జ్ఞాని... శ్రీరాముడు కూడా అతని జ్ఞాన సంపదకు
ముగ్ధుడయ్యాడు. అయితేనేం... క్షణికావేశానికి లోనై విచక్షణాజ్ఞానాన్ని కోల్పోయి.. తన హితవరుల హితవులు చెవికెక్కక అదే శ్రీరాముడి చేతిలో అసువులు బాసాడు.

శశధర్ మదిలోనూ కాముడు చొరబడి సయ్యాటలాడిస్తున్నాడు...

కోపంలో ఉన్న హిమజ కళ్ళను చూస్తుంటే శశిధర్ పెదవులపై ధరహాసపు చిగురు తొడుగులు...

“కోపంలో గూడా చాలా అందంగా ఉన్నావు హిమజా... నువ్వు నాకు నచ్చావ్!... నచ్చావ్!... నచ్చావ్. నేను ఆషామాషీగా అనడంలేదు. మనమిద్దరం పెళ్ళి చేసుకొందాం” శశిధర్ మాటలు పూర్తి కాకుండానే...

“యూ... రాస్కెల్... గెటౌట్ ఫ్రం హియర్... ” అంటూ గుప్పెడు ఇసుక తీసి అపర కాళికా దేవిలా శశిధర్ ముఖాన చల్లి పారిపోయింది. అనుకోని పరిణామానికి తోక తొక్కిన త్రాచుపాములా ఎగిరి పడ్తూ... లేస్తూ... పార్కులోని కొళాయి దగ్గరికి పరుగులు తీశాడు శశిధర్

ఆసిడ్ బాటిల్ చూస్తే అందరికీ అనుమానమే... అందుకే శశిధర్ గాజు చిమ్మనగొట్టపు పరికరాన్ని ఆసాయంత్రమే కొని తెచ్చాడు. దాని నిండా ఆసిడ్ బాటిల్‍లో కలిపిన హోళీ రంగుల మిశ్రమాన్ని నింపాడు. ఏ ఆపరేషన్‍కైనా పరేషాన్ కాకుండా ఉండాలంటే ముందు పరీక్షించడం అవసరం. రిహాల్సల్ లేకుండా నాటకం రక్తి కట్టదన్నట్లు...

పాత డైలీ న్యూస్ పేపర్‍పై ఆసిడ్ మిశ్రమాన్ని చిమ్మనగొట్టంతో నాల్గు చుక్కలు పడేలా పిచికారి చేశాడు... సక్సెస్!.. సక్సెస్!.. పేపర్ లిప్త కాలంలో మాడి మసై పోయింది... శశిదధర్ మోము వెలిగి పోయింది.

‘చాలా భద్రంగా పదిలపర్చాలి ఎవరి కంటా పడకుంటా...’ అని మనసులో అనుకుంటూ రహస్య ప్రదేశంలో దాచిపెట్టి తృప్తిగా బెడ్‍పై నడుం వాల్చాడు. హృదయంలో ఉవ్వెత్తున అనిర్వచనీయమైన అలలు ఎగిసి పడ్తున్నాయి... మరునాడు జరుగబోయే కార్యక్రమన్నంతా మదిలొనే రెక్కి నిర్వహించుకోసాగాడు.

తెల్ల వారింది...

గబ, గబా కాలకృత్యాలు తీర్చుకొని బీరువాలో ఉన్న పాత డ్రెస్‍వెతికి వేసుకున్నాడు. బ్రేక్ ఫాస్ట్ చేస్తూ కూర్చుంటే ఆలస్యమై పోతుంది... తొందరగా చిమ్మన గొట్టం తీసుకొని బయట పడాలి... హిమజ అంతు చూడాలి. అనే గాబరాతో శశిధర్ కాళ్ళు గాలిలో తేలి ఆడ సాగాయి. జువ్వున గాలిలో తేలిపోతూ రాత్రి తాను రహస్యంగా పదిల పర్చిన ఆసిడ్ హోళి రంగుల మిశ్రమ చిమ్మన గాజు గొట్టం కోసం వెదికాడు... లేదు... నిశ్చేష్టుడయ్యాడు... రాత్రి తన గదిలోనికి ఎవరూ రావడానికి వీలు లేదే!... మరి ఏమైనట్లు?... ఎవరు తీశారు?...
ఎదురుగా సుస్మిత కిల, కిలా నవ్వుతూంది. చేతిలో తాను భద్ర పర్చిన చిమ్మనగొట్టం...

గుండె ఝల్లుమంది...

“సుస్మీ...నో... ప్లీజ్... చాలా డేంజరస్... నాకివ్వురా.. ” అంటూ బతిమాల సాగాడు శశిధర్. తన తర్వాత పదేండ్లకు పుట్టిన చెల్లాయి అంటే శశిధర్‍కు ప్రాణం.

సుస్మిత ససేమిరా అంది.

“నాకు తెలుసు... ఈరోజు హోళీ కదా... ఇది నాకు కావాలి. నాఫ్రెండ్స్ తో హోళీ ఆడుకోవాలి. ఈ గొట్టం బలేగా ఉంది. రంగు వేస్ట్ కాకుండా వాడుకోవచ్చు. నేనివ్వను” అంటూ వెను తిరుగ పోయిన సుస్మిత చేయి పట్టుకొని గొట్టాన్ని లాక్కో పోయాడు శశిధర్.

భళ్ళున పెద్ద శబ్దం చేస్తూ... చిమ్మనగొట్టం జారి క్రింద పడి బ్రద్దలైంది. శశిధర్, సుస్మిత ఒంటిపై మంటలు ఎగిసి పడే సరికి

“అమ్మా!..” అంటూ గావు కేక పెట్టాడు.

మెలకువ వచ్చింది...

‘కలా!’ ఒళ్లు గగుర్పాటుకు లోనైంది... పోయిన ప్రాణం లేచి వచ్చినట్లైంది. అయినా ఒంట్లో వణుకు తగ్గడంలేదు... కాళ్ళు చేతులు గజ, గజ వణక సాగాయి. ఎంత భయంకరమైన కల!... ‘ఈవిల్ డెడ్’ ఇంగ్లీష్ సినిమాలో చూపించినట్లు శరీరం కాలి ముద్దలు, ముద్దలుగా నేల రాలడం ఇంకా మస్తిష్కంలో మెదులుతునే ఉంది...

“ఏమైందిరా... శశిధర్.. తలుపు తీయి... ” అంటూ రేణుక బయటినుండి తలుపు బాదడం... శశిధర్ నింపాదిగా తేరుకో సాగాడు.

బెడ్‍పై నుండి లేవ రావడంలేదు... తన గుండె చప్పుడు తనకే వినరావడం... కంపించి పోయాడు. తదేకంగా తలుపు శబ్దంతో... శశిధర్ శక్తినంతా కూడ గట్టుకొని లేచి తలుపు తీశాడు.

“ఏమైంది బాబూ!..” అంటూ రేణుక శశిధర్‍ను కన్న ప్రేమ వాత్సల్యంతో నిలువెల్లా తడుమ సాగింది.

“ఏంకాలేదమ్మా... ఏదో పీడ కల” అంటూ నిస్సత్తువగా ప్రక్కనే ఉన్న కుర్చీలో వాలి పోయాడు శశిధర్.

“ఏం కలో ఏంపాడో!.. అటు చూడు నీ గావు కేకకు సుస్మిత భయపడి నీకోసం తెస్తున్న పొగలు గ్రక్కే కాఫీ ఒలుక పోసుకొని కాలు కాల్చుకున్నట్లుంది” అంటూ రేణుక గొణుక్కుంటూ విసురుగా ఏడుస్తున్న సుస్మిత దగ్గరికి పరుగెత్తింది.

శశిధర్ కంగారుగా లేచి తల్లిని అనుసరించాడు.

“ఏమైందిరా సుస్మీ...” అంటూ ఎంతో ఆప్యాయంగా అన్నాడు.

“అయాం.. వెరీ సారీరా...” అంటుంటే శశిధర్ కళ్లళ్లో నీళ్లు తిరిగాయి.

“ఎందుకన్నయ్యా... అంత గట్టిగా అరిచావ్... ఎంత భయమైందో తెలుసా!...” అంటుంటే సుస్మిత కళ్ళనుండి ఏకధాటిగా కన్నీళ్లు..రేణుక చల్లని నీళ్ళు సుస్మిత కాళ్ళపై ధారగా పోస్తూ ఏడ్వసాగింది.. కాఫీ ఒలికిన చోటకాలికి పెద్ద బొబ్బ వచ్చింది.

ఆదృశ్యం శశిధర్ గుండెను పిండి వేసింది. అతడి విషణ్ణ వదనంలో రంగులు మార సాగాయి. ‘ఇంత చిన్న ప్రమాదానికే నా చెల్లలు ఓర్చుకోలేక పోతోంది. అలాంటిది... ఆసిడ్!.. హిమజ ఏమయ్యేది!.. ఓమై గాడ్!. నేను నిజంగా హిమజ ప్రేమను పొందాలనుకుంటే నిస్వార్థంగా ఆమె మేలు కోరుకోవాలే గాని ఇలా ఆసిడ్‍తో కాల్చాలనుకోవడం మహా పాపం... హిమజ ఆరోజు నామేలు కోరి హితవు పలికింది... ఆనాటి పార్కులో జరిగిన సంఘటనపై ఎక్కడా ఫిర్యాదూ చేయలేదు. అలాంటి కరుణా మూర్తిని అపార్థం చేసుకొని అనవసరంగా కక్ష పెంచుకున్నాను. రాక్షసునిగా మారాను. నా వక్ర బుద్ధికి ప్రతిఫలంగా ఈరోజు నాచెల్లెలి కాలు కాలింది. కలలో నా ఒళ్ళు కాలి భవిష్యత్తును హెచ్చరించింది. తెల్లవారి వచ్చే కలలు నిజమవుతాయని అంటారు కూడా. నానేరానికి శిక్ష ఎప్పుడో ఏ లోకాన్నో కాదు... ఇక్కడే ఈలోకంలోనే అనుభవించాల్సి వచ్చేది... ’ అని మనసులో మదన పడసాగాడు.

సుస్మిత రెండు కళ్ల వెంబడి ధారాళంగా కన్నీళ్లు కురవడం చూసి చలించి పోయాడు.

డాక్టరుకు ఫోన్ చేశాడు.

“డాక్టర్ వస్తున్నాడు సుస్మీ.. ఏడ్వకు ప్లీజ్... కాస్తా ఓర్చుకో..” అంటూ వేడుకోసాగాడు శశిధర్.

“ఎంత బాధగా ఉందో నీకు ఏం తెలుసు అన్నయ్యా!... నీకు కాలితే తెలిసేది” అంటుంటే ఆమె కన్నీటి బిందువులు ముత్యాల్లా జలజలా రాలసాగాయి. మరింత ఏడ్పు రాగం పెంచింది.

‘నీకు కాలితే తెలిసేది... నీకు కాలితే తెలిసేది... నీకు కాలితే తెలిసేది!...’ అన్న సుస్మిత మాట పదే పదే తన హృదయాన్ని కాల్చి వేస్తోంది. మానసిక పరివర్తన తలుపులు తెరుచు కోసాగాయి.. ‘నాచెల్లెలు చిన్న పాటి గాయానికే నేను తట్టుకోలేక పోతున్నాను. హిమజకూడా నాస్నేహితుడైన హేమంత్‍కు చెల్లెలే కదా.. నా ఆసిడ్ దాడికి వాడు ఎలా తట్టుకునే వాడు?.. ఎన్నాళ్ళుగానో కలిసి మెలిసి అనురాగాలు, ఆప్యాయతలు పంచుకుంటున్న మా ఇరు కుటుంబాల మధ్య బుద్ధిగా మసలుకోక గుడ్డిగా ముసలకం సృష్టించడం ఎంత అవివేకం?.. అయినా వరాలు ప్రసాదించాలని దేవతలను అనుగ్రహించే వరకు ఆరాధిస్తామే తప్ప ఆసిడ్ దాడులు చేస్తామా?..’ అని మనసు అనే కవ్వం శశిధర్ జ్ఞానసంపదను చిలుక సాగింది.. పరివర్తనలో మానవత్వపు వెన్న పేరుకో సాగింది

మనసులో నిర్మలమైన నిర్ణయం స్థిర పడింది...

తన గదిలోనికి వెళ్ళాడు శశిధర్.

రాత్రి తాను రహస్యంగా భద్రపర్చిన ఆసిడ్ హోళీ రంగుల గాజు చిమ్మన గొట్టాన్ని ఏర్పడకుండా పాలితిన్ కనర్లో పెట్టుకొని ఇంటి వెనకాలకు వెళ్ళాడు. చిన్న గొయ్యి తీసి అందులో పాతి పెట్ట సాగాడు...

ఎదురుగా హిమజ. ఝళ్ళున వణికాడు శశిధర్.

“సుస్మితకు కాలు కాలిందని తెలిసి వచ్చాను” అంది హిమజ.

శశిధర్‍కు నోట మాట పెకలడం లేదు. మౌనంగా నేల చూపులు చూడసాగాడు.

“శశిధర్... ఏంచేస్తున్నావురా... డాక్టరు బయలు దేరాడా? లేదా? మరో సారి ఫోన్ చేసి కనుక్కో...” అంటున్న రేణుక మాటల తీవ్రతలో ‘ఓప్రక్క సుస్మిత కాలు కాలి ఏడుస్తుంటే... ఇంటి వెనకాల వీడేదో రాచ కార్యం వెలగ పెడ్తున్నాడు’ అనే విసుగు బాణాలు దూసుకొస్తున్నట్లుగా ఉన్నాయి.

“తామసం మొక్కను పాతిపెట్టి, సాత్విక విత్తనం నాటుతున్నాడు అత్తయ్యా...” అంటూ తాను తెచ్చిన హోళీ రంగు శశిధర్‍పై చల్లింది హిమజ.

ఎప్పుడూ ద్వందార్థ పదమయిన ‘ఆంటీ’ అని పిలిచే హిమజ నేడు ‘అత్తయ్యా... ’ అంది.

మరోప్రక్క హోళీ రంగుల కేళి...

శశిధర్ తబ్బిబ్బయ్యాడు. తన ఆరాధనకు హిమజ గ్రీన్ సిగ్నల్ వరం ప్రసాదించినట్లుగా శశిధర్ కళ్లు తేజోవంతమయ్యాయి. ఆ తేజస్సులో హిమజ ఆశయాలను ఆదరిస్తూ తామిద్దరు జీవితంలో స్థిరపడనిదే ఒక్కటి కాగూడదన్న నిర్ణయం కాంతిలీనుతోంది. ఆ కాంతిలో విలీనమైన హిమజ

“ఇది నిజమైన హోళీ రంగు... భయపడకు” అంటూ సిగ్గుతో కనులు దించుకుంది...

‘నిన్నటి రాత్రి కామదహనం జరిగితే శశిధర్‍ఎదలో ఈరోజు ఉదయం జరిగింది...

జీవితంలో నిజమైన హోళీ ఆరంభంమైంది’ అనే సంతృప్తితో శశిధర్ కాలేజీనుండి ఆసిడ్ తస్కరించినప్పటి నుండి ఓ కంట కని పెడ్తూ... తాను తీసుకున్న ముందు జాగ్రత్తల గూర్చి పెదవి విప్పలేదు హిమజ.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి