నాలుగో తరగతి చదువుతున్న చందు, సరస్వతి కవలలు. తనను అతిగా గారాబం చేసే నాయనమ్మ రవణమ్మంటే చందుకి ప్రాణం. 'వాడు మారాజురా! ఆడపిల్లతో వాడికి పోలికేంటి?' అని రవణమ్మ అస్తమానూ అనడం చందు, సరస్వతిల తల్లిదండ్రులు నీరజ, మురళీకృష్ణలకు సుతరామూ నచ్చదు. 'అమ్మా! అమ్మాయిలను ఒకప్పుడు చిన్నచూపు చూసేవారు, అణగదొక్కేవారు. కానీ, ఇది పాతకాలం కాదు. అప్పుడైనా, ఇప్పుడైనా అమ్మాయిలు అబ్బాయిలకు దేంట్లోనూ తక్కువ కాదు.
కొన్ని సందర్భాల్లో పైచేయి కూడా కనబరుస్తూంటారు.' అని మురళీకృష్ణ ఎన్నోసార్లు కోప్పడ్డాడు కూడా! కానీ, నాయనమ్మ మాటంటే చందుకి వేదమంత్రం కాబట్టి అది వాడి తలకు బాగా ఎక్కింది. ప్రతిదాంట్లోనూ సరస్వతిని తక్కువచేసి చూడ్డం, నిర్లక్ష్యంగా మాట్టాడ్డానికి అలవాటు పడ్డాడు. ఈ విషయాన్ని ఓ కంట గమనిస్తూనే వున్నారు నీరజ, మురళీకృష్ణ. వాడికి బుద్ధి చెప్పేందుకు తగిన సమయం కోసం వేచి చూస్తున్నారు భార్యాభర్తలిద్దరూ! సంక్రాంతి సమీపిస్తూండగా ఇంట్లో అందరికీ కొత్తబట్టలు కొనేందుకు షాపింగ్ కి బయలుదేరారు. తల్లి నీరజ ముచ్చటపడి తీసుకున్న బట్టాలను సరస్వతి కూడా సంతోషం కనబరచిందే తప్ప ఎదురు చెప్పలేదు. కానీ, అదే రేటులో తీసుకున్న కారణంగా తన బట్టలను తిరస్కరిస్తూ 'నేను బగాణ్ణి. ఆడపిల్లకు తీసుకున్న రేటులోనే నాకూ తీసుకుంటారేంటి?' అన్నాడు చండు నిర్లక్ష్యంగా. కోప్పడబోయిన నీరజను వారించి చందు కోరిన ఎక్కువ రేటు బట్టలను కొన్నాడు మురళీకృష్ణ.
సంక్రాంతి గడచిపోయింది. తిరిగి స్కూళ్లు మొదలయ్యాయి. చందు, సరస్వతిలతో పాటు తను కూడా స్కూలుకి రెడీ అయ్యాడు మురళీకృష్ణ. 'స్కూలుకు నువ్వెందుకు వస్తున్నావు డాడీ?' అని అడిగాడు చందు. 'ఇన్నాళ్లూ నీకు అన్యాయం జరిగిపోయిందిరా! సరస్వతికన్నా నీకు ఎక్కువ సబ్జెక్టులు, ఎక్కువ పాఠాలు ఇవ్వాల్సింది కాస్తా సమానంగా ఇచ్చారు. ఎక్కువ ఇవ్వమని మీ ప్రిన్సిపల్ తో మాట్టాడతాను.' మాట్టాడతాను.' అన్నాడు మురళీకృష్ణ. చందు ఖంగు తిన్నాడు. 'అదేంటి డాడీ? ఇద్దరమూ ఒకే క్లాసు కదా! అలాంటప్పుడు నాకు ఎక్కువ సబ్జెక్టులు, ఎక్కువ పాఠాలు ఇవ్వడమేంటి?' అన్నాడు. 'కదా! ఈ సొసైటీ కూడా ఒక క్లాసులాంటిదే! ఈ క్లాసులో అమ్మాయైనా, అబ్బాయైనా సమానమే! అలాంటప్పుడు అన్నింట్లోనూ సరస్వతికన్నా నిన్ను ఎక్కువచేసి ఎందుకు చూడాలి?' అని చందుని సూటిగా ప్రశ్నించాడు మురళీకృష్ణ. చందుకి విషయం పూర్తిగా బోధపడక బుర్ర గోక్కున్నాడు. కొడుక్కి వివరంగా చెప్పదలచుకున్నాడు మురళీకృష్ణ.
'చూడు కన్నా! మదర్ థెరిసా, ఇందిరాగాంధీ, సరోజినీ నాయుడు... వీళ్లంతా లేడీసా, జెంట్సా?'
'లేడీసే డాడీ!'
'కానీ ప్రపంచం వాళ్లను ఆడవాళ్లా, మగవాళ్లా అని చూడదు. జీవితంలో ఉన్నత శిఖరాలకెదగాలనే బలమైన లక్ష్యంతొ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచినవారుగానే చూస్తుంది. అందుకే, వారు చరిత్రలో నిలిచిపోయారు. అలాంటప్పుడు మగవాళ్లకన్నా ఆడవాళ్లు తక్కువ అనేందుకు ఒక్క ఆధారమైనా చెప్పగలవా? నవమాసాలూ మోసి జన్మనిచ్చే అమ్మ ఎంత గొప్పది! సృష్టికి మూలం స్త్రీ. చదువుల తల్లి సరస్వతి. యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమం దేవతా! అన్నారు పెద్దలు. అంటే స్త్రీలు ఎక్కడ పూజింపబడుదురో అక్కడ దేవతలు సంచరిస్తారని అర్థం.' చందు తలమీద చెయ్యివేసి సౌమ్యంగా అన్నాడు మురళీకృష్ణ.
'సారీ డాడీ! సరస్వతినే కాదు, ఏ లేడీస్ గురించీ తక్కువ చేసి మాట్టాడను ఇంకోసారి...' పశ్చాత్తాపంతో తలవంచుకుని అన్నాడు చందు.
నీరజ, మురళీకృష్ణ ఆనందంగా చిరునవ్వు నవ్వుతూ మొహాలు చూసుకున్నారు.